100 రోజుల ట్రంప్… ఇండియన్స్ కి కష్టం! అమెరికాకు నష్టం!

రానే రాడనుకున్న ట్రంప్ వచ్చేశాడు! అప్పుడే వైట్ హౌజ్ లో వంద రోజులు కూడా పూర్తి చేసుకున్నాడు! అయితే, అందరూ ముందూ నుంచీ భయపడ్డట్టుగానే ఈ వంద రోజుల్లో మంచి హాలీవుడ్ యాక్షన్ మూవీ లాంటి సినిమా చూపించాడు ప్రపంచానికి! మరీ ముఖ్యంగా, మన ఇండియన్స్ కి! అందుకు, తాజా ఉదాహరణ … భారతీ ఎయిర్ టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలే!   ట్రంప్ అమెరికాలోకి ఇండియన్స్ ఎడాపెడా వచ్చేయకుండా ఆంక్షలు విధించాడు. సాఫ్ట్ వేర్ నిపుణులకైతే అమెరికాలోకి ఎంటర్ అవ్వటమే అసాధ్యం చేసేశాడు. కొత్త వారి సంగతి సరే.. పాత వార్ని కూడా అమెరికా వదిలే వెళ్లేలా పొగబెడుతున్నాడు. ఇదంతా భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై దారుణమైన ప్రభావం చూపుతోంది. అందుకే, సునీల్ మిట్టల్ లాంటి టాప్ బిజినెస్ మ్యాన్ కూడా ట్రంప్ మీద మండిపడుతున్నాడు. ఇండియన్ ఎక్స్ పర్ట్స్ యూఎస్ వద్దదైతే… మనకు మాత్రం అమెరికన్ కంపెనీలైన ఫేస్బుక్, గూగుల్ లాంటివి ఎందుకన్నాడాయన! అమెరికన్ ఎఫ్బీ, గూగుల్ లాంటి వాటికి బదులు ఇండియన్ సైట్స్ ని డెవలప్ చేసుకుంటే అమెరికాకు ఎంత లాస్ వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పాడు. చైనా ఆల్రెడీ అదే పని చేస్తోంది  కూడా!   ఇండియాకి అమెరికాతో వున్న రాజకీయ సంబంధాల వల్ల ఇప్పటికిప్పుడు కఠినమైన నిర్ణయాలు ఏమీ తీసుకోలేకపోవచ్చు. సునీల్ మిట్టల్ చెప్పినట్టు ఫేస్బుక్, గూగుల్ లాంటివి నిషేధించి మన స్వంత సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, సర్చ్ ఇంజన్లు రెడీ చేసుకోకపోవచ్చు. పాకిస్తాన్, చైనా లాంటి శత్రువుల్ని ఎదుర్కోటానికి అమెరికా మనకు చాలా అవసరం. కాని, ఇక్కడే మరో కోణం కూడా వుంది. భారతీయ నిపుణుల్ని అమాంతం తిప్పి పంపే చర్యలకి ట్రంప్ పూనుకుంటున్నాడు. అలాగే కొత్త వార్ని రానీయకూడదని కూడా గట్టిగానే డిసైడ్ అయ్యాడు. దీని వల్ల కేవలం ఇండియన్స్ కే నష్టమా? అమెరికాకు ఎలాంటి ఢోకా లేదా? నిజంగా అదే పరిస్థితి అయ్యి వుంటే.. ఇంత కాలం మన వార్ని అగ్రరాజ్యం భరించేదే కాదు! ఇదే అతి పెద్ద సంకేతం భారతీయుల సత్తాకి!   అమెరికాకి వలసొచ్చే అనేక దేశాల వారు పొట్ట చేతపట్టుకుని వస్తారు. కాని, అందరూ టాలెంటెడ్ అనటానికి వీల్లేదు. కేవలం ఇండియా, సింగపూర్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చే వారే బాగా చదవుకుని, అమెరికన్ వ్యవస్థకు ఉపయోగపడే హైలీ స్కిల్డ్ పీపుల్. మిగతా వారు అమెరికాలో స్థిరపడి చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ వుంటారు. వారు అమెరికాలోకి రాకపోవటం వల్ల పెద్దగా నష్టం వుండదు. ఆ ఉద్యోగాలు అమెరికాలోని స్థానికులు భర్తీ చేయగలరు. కాని, చాలా వరకూ ఇండియన్స్ సేవలందించే సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగాలు ఎవరు చేయాలి? వాటికి తగిన వారు అమెరికాలో వున్నారా? లెక్కల ప్రకారం… ఇండియన్ ఇంజనీర్స్ స్థాయిలో పని చేసే టాలెంట్ పీపుల్ అమెరికాలో లేరు!   ఇండియాలో ఇంజనీరింగ్ చదవటం చీప్. అలాగే, మన వారు అమెరికాకి వెళ్లాలన్న కోరికతో, కసితో మరింత బాగా చదివేస్తుంటారు. కాబట్టి ఇండియన్స్ వల్ల ఇంత కాలం అమెరికన్ ఐటీ కంపెనీలు బోలెడు లాభపడ్డాయి. మన వారు చాలా తక్కువ జీతాలకే గంటల కొద్దీ కష్టపడ్డారు. కాని, ఇప్పుడు ఇండియన్స్ ని ట్రంప్ బ్యాన్ చేస్తే అమెరికన్స్ వాట్ని భర్తీ చేయాలి. ఇండియన్స్ అంత టాలెంట్ అమెరికన్స్ లో లేదనే విషయం పక్కన పెట్టినా… వారు డిమాండ్ చేసేటంత సాలరీ కంపెనీలు ఇచ్చుకోలేవు. దీర్ఘ కాలంలో ఇదే అమెరికా వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం వుంది!   ఖరీదైన ఉద్యోగుల్ని భరిస్తూ మల్టీ నేషనల్ కంపెనీలు అమెరికాలోనే ఎందుకుండాలి? ఇంతకాలం ఇండియన్స్ అమెరికాకు వలసొచ్చారు. ఇప్పుడు అమెరికన్ కంపెనీలే ఇండియా లాంటి దేశాలకు వచ్చేస్తే? తక్కువ జీతాలకు పని చేసే టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ వాటికి హాయిగా దొరుకుతుంది! ట్రంప్ ఆంక్షలు, బెదిరింపుల బాధ కూడా తప్పుతుంది! ఇలాంటి పరిణామం ఖచ్చితంగా జరుతుందని ఇప్పుడే చెప్పలేకున్నా… జరగదని మాత్రం అనుకోటానికి వీల్లేదు. అమెరికా నుంచి అమెరికన్ కంపెనీలు తరలిపోవటం మొదలైతే అది అగ్రరాజ్యం అసలుకే ఎసరు తెస్తుంది. ఇది ట్రంప్ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది! లేదంటే, ట్రంప్ ఏలుతోన్న ఈ నాలుగేళ్ల కాలం అమెరికన్ చరిత్రలో తిరిగి వెనక్కి వెళ్లలేని ప్రమాదకర మలుపుగా మిగిలిపోవచ్చు! అమెరికా ఆర్దిక ఆధిపత్యానికి ఇక నుంచీ జీజాలు పడి ముందు ముందు అవ్వి ఫలితాలు చూపవచ్చు! ఎందుకంటే, ప్రపంచంలో ప్రస్తుతం పైపైకి ఎదుగుతున్న ఆర్దిక వ్యవస్థలు కేవలం ఇండియా, చైనాలు మాత్రమే. యూరోపీయన్, అమెరికన్ ఆర్దిక వ్యవస్థలు ఎప్పుడో దూకుడు మానేశాయి! ట్రంప్ చేష్టలు అలాంటి డల్ అమెరికన్ ఎకానమీని మరింత ఢమాల్ గా మార్చే ప్రమాదం పొంచి వుంది!

జగన్ బెయిల్ పిటిషన్ రద్దు... అసంతృప్తిలో వైసీపీ

   వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుగుతుండగా... అటు వైసీపీ పార్టీ నేతలతో పాటు... ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యోంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలవ్వగా... దీంతో జగన్ కు బెయిలా? జైలా? అని.. ఏం తీర్పు వస్తుందా అని.. పార్టీ నేతలు అందరూ టెన్షన్ పడ్డారు. కానీ జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించి బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసింది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో జగన్ హస్తం ఉంటుందని భావించడం లేదని, ఎడిటోరియల్ బోర్డు నిర్ణయానికి, జగన్ కు సంబంధం ఉంటుందని భావించడం లేదని న్యాయస్థానం తెలిపింది.   ఇదిలా ఉంటే జగన్ బెయిల్ రద్దు కాకపోవడంపై వైసీపీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో బ్రహ్మానందం.. ముందుచూపు పేరుతో ముందే వీడియోలు చేసి పెట్టుకుంటాడు. ఇక్కడ వైసీపీ పార్టీ నేతలు కూడా అలాగే చేశారంట. జగన్ కు బెయిల్ రద్దవుతుందని పార్టీ నేతలే కాదు.. జగన్ కూడా అస్సలు ఊహించలేదట. ఒకవేళ జగన్ బెయిల్ రద్దయితే దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయనను బద్నాం చేయడానికి ముందస్తుగా కథనాలు రెడీ చేసుకున్నారట వైసీపీ పార్టీ నేతలు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న జగన్ ను ఎలాగైనా అణగద్రోక్కాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని, అందుకే ఉన్న పళంగా జగన్ బెయిల్ రద్దయ్యిందని ఆయనపై కథనాలు ప్రిపేర్ చేసుకున్నారట. కానీ వారు ఊహించని విధంగా పిటిషన్ కొట్టిపారేసింది కోర్టు. దీంతో సదరు కధనాలన్నీ వృధా అయిపోయాయని వైసీపీ వర్గాలు నిరాశ చెందాయట. అయితే భవిష్యత్ లో ఎప్పుడైనా అవి ఉపయోగపడొచ్చని వాటిని అలాగే ఉంచారట.

కేసీఆర్… బీజేపీని టార్గెట్ చేయలేదా? చేసే అవసరం లేదనుకున్నారా?

  వరంగల్ టీఆర్ఎస్ చేసిన జన సమీకరణ వరదలో మునిగి తేలింది. ఎప్పటిలాగే గులాబీ పార్టీ సత్తాకి ఓరుగల్లు హోరుగల్లుగా మారిపోయి సాక్ష్యంగా నిలిచింది. ఇక కేసీఆర్ మార్క్ ఉపన్యాసంతో ప్రగతి నివేదన సభ సంబురం చేసుకుంది. గులాబీ కార్యకర్తల చేతులు చప్పట్లు కొట్టీ కొట్టీ గులాబీ రంగులోకే మారాయి! కానీ… కానీ… మూడేళ్లు పూర్తి చేసుకున్న తొలి తెలంగాణ సర్కార్ … అసలింత పెద్ద సభకు ఎందుకు పూనుకుంది? ఈ ప్రశ్నలోనే ప్రగతి నివేదనకు బోలెడు కారణాలు కనిపిస్తాయి!   కేసీఆర్ వరంగల్ సభలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం మాత్రమే ఏకరువు పెట్టలేదు. ప్రతిపక్షాల దుమ్ము దులిపారు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ కు చెడామడా చీవాట్లు పెట్టారు. పూర్తి స్థాయిలో చవటలు,సన్నాసులు వంటి పదాలు వాడుతూ గులాబీ బాస్ తనదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చారు. దీనికంతటికి కారణం ఒక్కటే ఒక్కటి! అయిదేళ్ల కాలంలో ఇప్పుడు సగానికి సగం పూర్తైపోయింది. జనంలోనూ 2014లో వున్న మూడ్ ఇప్పుడు లేదు. అప్పుడున్న ఎమోషన్ కూడా క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు ఆంధ్రా అన్న అస్త్రం ముందులా కేసీఆర్ వాడలేకపోతున్నారు. ఆంద్రా పాలకులు, ఆంధ్రా దోపిడీ లాంటి ఆల్ టైం ఫేవరెట్ పదాలు గతంలో జనం పై పని చేసేవి. కాని, ఇప్పుడు అన్నిటికి, అంతటికీ తెలంగాణ సర్కార్ దే బాద్యత. వచ్చే ఎన్నికల్లో అదే ప్రధానం కానుంది. అందుకే, ప్రగతి నివేదన సభ అవసరమైంది!   ప్రగతి భవన్ భారీ ఖర్చుతో సిద్ధం చేయించిన కేసీఆర్ అదే దూకుడు ప్రగతి సాధించటం విషయంలో చూపలేకపోతున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్రెలు, చేపలు ఇస్తామంటున్నారని జనం పుర్రెల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తనకు వీలైనంత ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వ వ్యతిరేకత పెంచటానికి! అదే సమయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనేక విషయాల్లో వెనుకబడుతోంది. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం మొదలు దళితులకి మూడెకరాల భూమి వరకూ అన్ని హామీలు, ప్రకటనలు అర్ధాంతర స్థితిలో వుండిపోతున్నాయి. అమలు చేయగలిగేవి , చేయలేనివి అన్నీ త్రిశంకు స్వర్గంలో వుంటున్నాయి. మరో వైపు నుంచీ పదే పదే తెలంగాణ ప్రభుత్వానికి కోర్టుల నుంచీ కూడా రెడ్ సిగ్నల్స్ వస్తున్నాయి. జనంలో ఆ విషయంలో కూడా వ్యతిరేకత పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు!   మైనార్టీ రిజర్వేషన్లు, గవర్నమెంట్ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు… ఇలా ఎన్నికలకు ముందే చెప్పినవీ, గొర్రెల పంపిణీ, ఎరువుల పంపిణీ వంటి ముందుగా చెప్పనివీ… అన్నీ ప్రస్తుతానికైతే ఆదికి, అంతానికి మధ్యలో వున్నాయి. ఒకవేళ మోదీ చెబుతున్నట్టు వచ్చే సంవత్సరం చివర్లోనే ఎన్నికలు వచ్చేస్తే వీటిల్లో చాలా హామీలు జనానికి ప్రతిఫలాల రూపంలో అందకపోవచ్చు. అంతలోపే త్వరత్వరగా అమలు పూర్తి చేసి పబ్లిక్ రిజల్ట్ చూపాలి. లేదంటే వాళ్లకు మరో ఆలోచన వచ్చే ఛాన్స్ వుంది. అందుకే, కేసీఆర్ మరోసారి జనానికి భరోసా కల్పించేందుకు వరంగల్ సభ నిర్వహించారు. కాని, ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఒక్క విషయంలో ఆశ్చర్యపరిచింది!   కేసీఆర్ ఎప్పటిలాగే కాంగ్రెస్ ను బలంగా టార్గెట్ చేశారు. టీ టీడీపీని కూడా ఘాటుగానే విమర్శించారు. కాని, అంతా భావించినట్టుగా బీజేపిని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఢిల్లీ నుంచీ మోదీ, అమిత్ షా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నా కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు? ఒక కారణం, కమలదళం అమాంతం ఎదిగిపోవటం తెలంగాణలో సాధ్యం కాదు కాబట్టీ…. లైట్ తీసుకోవచ్చు. రెండోది, అనవసరంగా బీజేపిని టార్గెట్ చేస్తే అవసరం లేని ప్రాముఖ్యత ఏర్పడి కాషాయ నాయకులకి ఉపయోగపడవచ్చు! ఈ రెండు కోణాల్లో ఆలోచించి కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయకపోవచ్చు. ఇక మూడోది … కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో ఇప్పట్నుంచే పోరాటం మొదలు పెడితే నిధుల రాబట్టుకోవటం కూడా కష్టమని సీఎం భావించి వుండవచ్చు! ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రస్సే తప్ప బీజేపీ కాదని చెప్పకనే చెప్పారు కేసీఆర్!   ముందు ముందు అమిత్ షా వ్యూహాలు ఫలించి బీజేపీలోకి భారీగా వలసలు మొదలైతే టీఆర్ఎస్ మాట తీరు కూడా మారవచ్చు. అంతే తప్ప సాధారణ పరిస్థితుల్లో గులాబీకీ, కమలానికి పెద్దగా పోరాటం జరిగే సూచనలు ఇప్పుడైతే కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరి మధ్యా మైత్రీ మొలకెత్తి టీఆర్ఎస్ ఎన్డీఏలో భాగమైనా ఆశ్చర్యమూ లేదు! ఎందుకంటే, ఒకవైపు రాష్ట్ర బిజేపి నేతలు వ్యతిరేకించిన ఉచిత ఎరువు పథకాన్ని మోదీ మెచ్చుకున్నారట! ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారట! ఇలాంటి సంకేతాలు కొంత మేర భవిష్యత్ ను సూచిస్తన్నాయి….

వందేళ్ల ఉస్మానియా… అక్కడ చదువే ఉద్యమం! ఉద్యమే చదువు!

  విశ్వవిద్యాలయం… ఈ పేరులో విశ్వం ఎందుకు వుందో ఎప్పుడైనా ఆలోచించారా? విద్యార్థులు విద్యని అభ్యసిస్తారు కాబట్టి విద్యాలయం! కాని, విశ్వం ఎందుకొచ్చింది? ఇంగ్లీషులో యూనివర్సిటీ అంటారు కాబట్టి తెలుగులోనూ విశ్వం అన్నారు అనుకుందామా? అది నిజమే కావచ్చు! కాని, విశ్వం అనే పదంలో విశ్వవిద్యాలయానికి మరో కోణమూ వుంది!   ఇప్పుడొస్తున్న ఆధునిక విశ్వవిద్యాలయాల సంగతి వేరేమోగాని … ఒకప్పటి విశ్వవిద్యాలయాలు మాత్రం నిజంగానే విశ్వాలు! వాటిలో మరో వేరైన, మేలైన ప్రపంచమే అలరారుతుంటుంది! విశ్వవిద్యాలయం అంటే కేవలం కొన్ని గోడలు, మరి కొన్ని బెంచీలు, ఇంకొన్ని బ్లాక్ బోర్డులు కాదు. అదో లోకం. అక్కడ వేరు వేరు ఊళ్ల నుంచీ, రాష్ట్రాల నుంచీ, కొన్ని సార్లు దేశాల నుంచీ వచ్చిన వారు ఒకే చోట గుమిగూడతారు! తరగతుల్లో, మైదానాల్లో, చెట్ల కిందా, క్యాంటీన్లలో, లైబ్రెరీల్లో సరికొత్త బంధాలు, అనుబంధాలు, ఘర్షణలు,సంఘర్షణలు ఏర్పడతాయి! అదే వారందర్నీ నవ మానవులుగా తీర్చిదిద్దుతుంది! చివరకు, విశ్వవిద్యాలయంలో జరిగిన ఆ మానవ, మస్తిష్కాల సమ్మేళనమే కొత్త విశ్వానికి పునాదులు వేస్తుంది! అందుకే, యూనిర్సిటీల్ని విశ్వవిద్యాలయాలు అనేది…   ఒక విశ్వవిద్యాలయం యావత్ విశ్వంపై తనదైన, తనకు వీలైనంత ప్రభావం చూపుతుంది! ఈ సత్యం వేల సంవత్సరాల నాటి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ఎప్పుడో నిరూపించాయి. తక్షశిలలో పదునెక్కిన చాణక్యుడి రాజనీతి, ఆర్దిక నీతి భారతదేశాన్ని ఎంత ప్రభావితం చేశాయో మనకు తెలియదా? అలాగే, నలందలో జరిగిన వందల సంవత్సరాల జ్ఞాన సత్రయాగం మన దేశాన్ని, సంస్కృతిని ఎంత సుసంపన్నం చేసిందో మర్చిపోగలమా? అలాంటి మన కాలపు, మనదైన… తక్షశిల, నలంద స్థాయి విశ్వవిద్యాలయమే … ఉస్మానియా!   హైద్రాబాద్ అనగానే నిశ్శబ్ధంగా నిలబడే చార్మినార్ నే అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. లేదంటే ఆధునిక హైద్రాబాదీలు ఆదరా బాదరా ఉద్యోగాల సైబర్ టవర్స్ ని స్మరించుకుంటారు. కాని, 4వందలేళ్ల భాగ్యనగరి భాగ్యానికి… సదా సజీవ చైతన్యంతో అలరారే వందేళ్ల ఉస్మానియా అసలు సిసలు సాక్ష్యం! అక్కడ 1917 నుంచీ జ్ఞానం శంఖమై మోగుతోంది! ఉద్యమాలు వస్తే, చైతన్యం, నగారాలాగా మార్మోగుతోంది! నిజాం కాలంలో 25మంది ఆధ్యాపకులతో, 225మంది విద్యార్థులతో తన మహాప్రస్థానం ప్రారంభించి ఇంకా మహోధృతంగా ముందుకు సాగుతోంది. ఈ విజయానికి కారణం ఆనాటి నిజాం పాలకుల ముందు చూపే కాదు… తరువాతి కాలంలో స్వతంత్ర భారత ప్రభుత్వాల నిజాయితీ కూడా కాదు. ఉస్మానియా ఒక ఆరని జ్యోతిలా, దారి చూపే అద్బుత కాగడాలా వెలిగిపోవటానికి కారణం… ఇక్కడ తొణికిసలాడే జీవం కారణం! కేవలం మసక్తాల్లోకి పుస్తకాల్ని ఎక్కించే ల్యాబోరేటరీలా ఉస్మానియా పని చేసి వుంటే ఇంత ఘనత సంపాదించగలిగేది కాదు. నిజానికి ఇప్పటికీ హైద్రాబాద్ కు తలమానికమైన ఓయూ దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒక్కటేం కాదు. ప్రపంచంలో అయితే ఉస్మానియాకు అస్సలెంత మాత్రం ప్రాముఖ్యత లేదు. అయినా, తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా, తెలంగాణకు ఇది ఒకానొక ఆయువు పట్టు! ఒట్టి బట్టీ చదువులకే కాదు… ఉరిమే ఉద్యమాలకూ ఉస్మానియానే నెలవు! ఆ విధంగా ఉస్మానియా ఇప్పటికి కొన్ని వేలు, లక్షల మంది తెలంగాణ విద్యార్థులకి చదవటమే కాదు.. జీవితాన్ని , సమాజాన్ని చదవటమూ నేర్పింది! అదీ శత వసంతాల ఉస్మానియాకు అనుపమాన శోభను తెచ్చిపెట్టేది!   బీఏ, ఎంఏ లాంటి డిగ్రీలతో మొదలైంది ఉస్మానియా ప్రస్థానం. అప్పటి నిజాముల రాజభాష ఉర్దూలోనే ఊపిరిపోసుకుంది. కానీ, ఇప్పుడు ఎల్ఎల్బీ, మెడిసిన్, ఇంజనీరింగ్, పీహెచ్డీలతో ఎంతో ఎదిగింది. ఇంగ్లీషు సహా ఎన్నో భాషల్లో బోధన జరుగుతోంది. దానితో పాటే స్వాతంత్రానికి ముందు ఇక్కడ వందేమాతర నినాదం మోగింది.అది మొదలు 2014లో పార్లెమెంట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దద్ధిరిల్లిన జై తెలంగాణ నినాదాల వరకూ ఉస్మానియా అడుగడుగునా ఉద్యమాలే! పోరాటాలే! రణన్నినాదాలే! సమాజంపై ప్రభావం చూపే ఈ పోరాట పటిమే నిజంగా వందేళ్ల ఉస్మానియా అందించిన వారసత్వం! కేవలం సర్టిఫికెట్ ముక్కలు జారీ చేయటానికి విశ్వవిద్యాలయాలే అక్కర్లేదు. రేకుల షెడ్డు వేసుకుని కూర్చున్నా సరిపోతుంది! విశ్వవిద్యాలయం అంటే విశ్వాన్ని మరింత పరిపక్వం చేసే మేధస్సుల ప్రయోగశాల అయ్యి వుండాలి! ఆ కోణంలో వందేళ్ల ఉస్మానియాది వంద శాతం విజయం!   ప్రస్తుత మన బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి, నవ తెలంగాణ రథసారథి కేసీఆర్ ఉస్మానియాలో గుక్క తిప్పిన యోధుడే! గల్లీ నుంచీ దిల్లీ దాకా ఈ ఓయూ పూర్వవిద్యార్థి చేసిన ఉద్యమం జగమెరిగిన సత్యమే! అయితే, ఉస్మానియా చరిత్రలో ఒక్క కేసీఆర్ కాదు…ఎందరో కేసీఆర్లు వున్నారు! తమ తమ రంగాల్లో వారు ఇప్పటి మన సీఎం లాగే అద్బుత విజయాలు సాధించారు. వారందరి పేర్లు చెబితే ఉస్మానియా జ్ఞానాకాశం కీర్తిమంతులైన తారలతో తళతళలాడిపోతుంది. ఇక ముందు కూడా ఈ శత వసంతాల నవ యవ్వన జ్ఞానాలయం బోలెడు మంది విద్యార్థి చంద్రులతో వెలిగిపోవాలని కోరుకుందాం! వారు దేశాన్ని సరికొత్త వెన్నల వెలుగులతో దేదీప్యమానం చేయాలని ఆశిద్దాం!   ఉస్మానియా వందేళ్ల మైలురాయి దాటిన ఈ సమయంలో చాలా మంది కోరుకుంటోంది, రాష్ట్రపతి ప్రణబ్ కూడా చెప్పింది ఇదే… విశ్వవిద్యాలయాలు పరిశోధన వైపు దృష్టి పెట్టాలి. ఉస్మానియా పై కూడా ఆ బాద్యత వుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే ఉత్సాహంతో ముందుకు దూకుతోంది. అందుకు కేవలం జీడీపీలు, పర్ క్యాపిటీ ఇన్ కమ్ లు సరిపోవు. నాణ్యమైన జ్ఞానం విశ్వవిద్యాలయాల్లోంచి బయటకొ ప్రవహించాలి. ఉస్మానియాలోనూ అదే జరగాలి. ముందు ముందు పాలకులు, పరిశ్రమల అధిపతులు పరిశోధన విద్యపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగే చర్యలు తీసుకోవాలి! దేశంలోనే అత్యున్నత ప్రాంగణాల్లో మన ఉస్మానియా కూడా ఒకటి కావాలి!

మార్పు కోసం… ట్రిగ్గర్లే నొక్కాలా… ఈవీఎం మీటలు చాలవా?

ఛత్తీస్ గఢ్ రక్తసిక్తం అయింది. మరో మారు యువ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు! అదీ పాతిక మంది. ఇంత మందిని ఒకేసారి బలి తీసుకోవటం ఉగ్రవాదులు, పాక్ సైన్యం వల్ల కూడా కాదేమో! కాని, మన స్వంత భారతీయులైన మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు! ఇంతకీ ఎందుకు? ఇదే ఈ తరం భారతీయ యువతకి ఎంతకూ అర్థం కాని ప్రశ్న! అడవుల్లో వుండే అన్నలు, వారికి మద్దతుగా నిలిచే జనారణ్యాల్లోని మేధావులు సవివరంగా సమాధానం ఇవ్వాల్సింది కూడా ఇదే!   భారతదేశం స్వతంత్రం సంపాదించాక దాదాపు రెండు దశాబ్దాల అనంతరం … నక్సలిజమ్ మొదలైంది. అది 1970ల నుంచీ పెరిగి, విరిగి, మళ్లీ మొలిచి ఇవాళ్ల మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో నక్సల్స్ చంపిన రాజకీయ నేతలు, ఇన్ ఫార్మర్లు, అమాయక జనం, పోలీసులు, సైనికులు ఎందరో! నిజానికి చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాలు చేసిన భారత్ కదన రంగంలో కోల్పోయిన ప్రాణాల కంటే వామపక్ష ఉగ్రవాదం చేతిలో నిర్జీవులైన వారే ఎక్కువనిపిస్తుంది. అయితే, మావోయిస్టులు కోరేదేంటి? వారిని అవకాశం వచ్చినప్పుడల్లా కాల్చి చంపించే ప్రభుత్వాలు, పాలకులు నిరాకరించేది ఏంటి? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు లేవు. మావోయిస్టుల అంతిమ లక్ష్యం అసలు ఇప్పుడున్న వ్యవస్థనే కూల్చేయటం , మార్చేయటం అంటారు. కాని, జనం కోట్లాదిగా వచ్చి ఓట్లు వేసి తమ పాలకుల్ని ఎంచుకుంటోన్న ఈ ప్రజాస్వామ్యాన్ని కాదని చెప్పటం ఎంత వరకూ సబబు? పోనీ ఎంత వరకూ సాధ్యం?   పూర్తిగా వ్యవస్థని, రాజ్యాంగాన్ని మార్చేయటం లాంటి సుదూర లక్ష్యాలు పక్కన పెడితే తమ తక్షణ డిమాండ్లుగా మావోలు చెప్పేవి ఏంటి? ఆదివాసీల రక్షణ, గనులు, ఖనిజల వంటి సహజ సంపదల రక్షణ, భూ పంపీణి… ఇలాంటి అనేకం వుంటాయి. అవేవీ ప్రస్తుతం వారు అడవుల్లోంచి సాగిస్తోన్న సాయుధ పోరాటం వల్ల సాధ్యమయ్యేవి కావు. అదే గత ముప్పై, నలభై ఏళ్ల యుద్ధం నేర్పిన పాఠం! అయినా మావోయిస్టులు తమ పంథా మార్చుకోవటం లేదు.   మన జవాన్లు మన దేశ పౌరుల చేతుల్లోనే నిర్ధాక్షిణ్యంగా చనిపోవటం బాధాకారం. కాని, అంతకంటే బాధాకారం ఇల్లు, వాకిలి వదిలి సమాజం కోసం గన్ను పట్టిన నక్సల్స్ బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించటం. దాన్ని కూడా ఎవ్వరమూ సమర్థించలేం. కాని, ఇక్కడ సమస్యల్లా యుద్ధం ముగించటం మావోయిస్టుల చేతుల్లో వుండటంతోనే వుంది. వారు సాయుధులుగా వున్నంత కాలం రాజ్యం కూడా హింసాత్మకంగానే ఎదుర్కుంటుంది. అంతకన్నా వేరే మార్గాలు కూడా పాలకులకి వుండవు. రాజ్యాంగం ప్రజలకి ఓటు హక్కునిచ్చి ప్రతీ అయిదేళ్లకొకసారి మార్పు సాధించుకునే అవకాశం ఇచ్చినా మావోలు పట్టించుకున్నట్టు కనిపించదు. బుల్లెట్ వార్ ఆశించిన ఫలితాలు ఇప్పటికే ఇవ్వలేకపోయింది కాబట్టి బ్యాలెట్ వార్ కి దిగటం ఎంతో మేలు. దాని ద్వారా కూడా సమ సమాజ స్థాపన వీలు కాదని మావోయిస్టు మద్దతుదారులు, మేధావులు వాదిస్తుంటారు. కాని, సాయుధ పోరాటం కూడా అటుఇటుగా అర్థ శతాబ్దం కావొస్తున్నా సాధించింది ఏం లేదు. ఎన్నో అమూల్యమైన ప్రాణాలు మాత్రం సమాధి చేసింది. అందుకే, అడవుల్లోని విప్లవకారులు ట్రిగ్గర్ కన్నా ఈవీఎం మీటలు మేలేమో అలోచించుకోవాలి. వాటి ద్వారా అమాంతం ఆశించిన విప్లవం రాకున్నా ఆలస్యంగానైనా మంచి జరుగుతుంది. అంతే కాని, ఆగమ్యమైన అమానుష హింస ద్వారా ఎవ్వరూ ఎక్కడికి వెళ్లలేరు. ఏమీ సాధించలేరు!   ప్రభుత్వాలు మావోయిస్టు హింస విషయంలో ఉక్కుపాదంతో అణచటమే కాకుండా మరే ఇతర మార్గాలు సత్ఫలితాలు ఇస్తాయో కూడా చూడాలి. ఎలాగైతే మావోలకు గన్ను ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదో.. అలాగే, పాలకులకి కూడా ఇవ్వబోదు. మరో కొత్త తరం సాయుధ ఆలోచనల దిశగా వెళ్లకుండా ఆపటానికి ఖచ్చితంగా తెలివైన మార్గాలు వుంటాయి. వాట్ని అన్వేషించాలి. అప్పుడే ఇవాళ్ల కాకుంటే రేపు అంతర్గత హింస నుంచి భారతదేశానికి విముక్తి లభిస్తుంది!

ముందస్తుకి జైకొడితే… విజయోస్తు గ్యారెంటీనా?

  రాజకీయాల్లో ఎన్నికలు అనివార్యం. భారీ ఖర్చులు చేసి , రాత్రింబవళ్లూ ఒళ్లు హునమయ్యేలా ఊరారా తిరిగి ఓట్లు అర్థించాలని రాజకీయ నేతలకు కూడా వుండదు. అయినా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ లేకుండా బండి నడవదు. అందుకే, అయిదేళ్లకొకసారి దేశం దేశమంతా బ్యాలెట్ వార్ లో తలమునకలైపోతుంది! నాయకులు టెన్నన్ గా, జనం అటెన్షన్ గా ఎన్నికల్ని ఎదుర్కొంటూ వుంటారు! అయితే, పైకి కనిపించే ఎన్నికల ఎంటర్టైన్మెంట్ వెనుక చాలా పెద్ద మ్యాథమెటిక్సే వుంటుంది. ప్రతీ తిక్కకూ ఒక లెక్క వుంటుంది!   ఎన్నికలంటేనే రాజకీయ నేతలు ఇబ్బందిగా ముఖం పెడతారు. అదీ అధికారంలో వున్నవారైతే ఎలక్షన్స్ రావాలని అస్సలు కోరుకోరు. ఎందుకంటే, అది ఏ విధంగా చూసినా రిస్కే! జనం వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువ! అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం ముందస్తు కోలాహలం నడుస్తోంది. సీఎం చంద్రబాబు 2019 సంగ్రామం 2018లోనే వచ్చేస్తుందని సంకేతాలు ఇస్తున్నారు. ఇంకా పక్కాగా ప్రీ ఎలక్షన్స్ అంటూ ప్రకటించలేదు కాని… మీడియాకి, క్యాడర్ కి సిగ్నల్స్ అందుతూనే వున్నాయి. ఇంతకీ, ఏపీ ముఖ్యమంత్రి ఎందుకని ముందస్తుకి ముందుకు దూకుతున్నట్టు?   రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం చంద్రబాబుకి క్షేత్ర స్థాయిలో జరుగుతోన్న పరిణామాలపై పక్కా రిపోర్ట్ వుందని తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన అనేక ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగిస్తోంది. ఓటములు కూడా వున్నాయి. అయినా కూడా ఏదో ఒక సీటు గెలిచిన ప్రతీ చోటా టీడీపీ ఓట్ల శాతం క్రమంగా పెరుగుతోంది. ముస్లిమ్, ఎస్సీ వర్గాల్లో ఈ మార్పు మరింతగా కనిపిస్తోందట. తెలంగాణ, ఆంధ్రాగా సమైక్య రాష్ట్రం విడిపోయాక 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు జనం అనుభవంలో సీనియర్ అయిన చంద్రబాబుకే పట్టం కట్టారు. భారీగా ఓట్ల శాతం తేడా లేకున్నా క్లియర్ మెజార్టీ వచ్చింది టీడీపీకి. జనం పెట్టుకున్న ఆశలకి తగ్గట్టుగానే చంద్రబాబు అమరావతి నిర్మాణం, తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ ల ఏర్పాటు వంటి పనులు సమర్థం చేశారు. రైతుల్నుంచీ భూములు సంపాదించటం కూడా మరీ సమస్యాత్మకం కాకుండా సాధించగలిగారు. ఇలా కొత్త రాష్ట్రానికున్న బాలారిష్టాల్ని విజయవంతంగానే ఎదుర్కొన్నారు. ఇదే ఇప్పుడు కింది స్థాయిలో టీడీపీకి అనుకూలంగా వుందని రిపోర్ట్స్ వచ్చాయంటున్నారు. మంత్రిగా మారి మరింత క్రీయాశీలకం అయిన చినబాబు కూడా చంద్రబాబుతో టీడీపీ దూకుడును చర్చించారంటున్నారు. జనంలో మంచి మూడ్ వున్నప్పుడే ఎలక్షన్స్ కి వెళితే మరో అయిదేళ్లు అధికారం చేజిక్కించుకోవచ్చని ఆయన అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి!   ముందస్తుకి వెళ్లటంలో చంద్రబాబు మరో కాలిక్యులేషన్ కూడా వుండవచ్చు. జగన్ అవినీతి కేసులు ఇంకా తెరిపిని ఇవ్వలేదు. ఏ క్షణం ఏమవుతుందోనన్న టెన్షన్ ప్రతిపక్ష నేతలో వుంది. అందుకే, ఒత్తిడి పెరిగిన ప్రతీసారి దిల్లీ ఫ్లైటెక్కి మొక్కులు చెల్లించుకుని వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ముందస్తు వస్తే ఆయన ఎలక్షన్స్ పై పూర్తి స్థాయిలో కాన్సన్ ట్రేట్ చేసి గెలవటం కాస్త కష్టమైన విషయమే!   ముందస్తుతో జనాన్ని మెప్పించి, జగన్ ని తప్పించి… తిరిగి అధికారంలోకి రావటం మంచి వ్యూహమే! కాని, ఇందులో చాలా చాలా రిస్క్ వుందంటున్నారు రాజకీయాల్లో తలపండిన వారు. ఎక్కడ ఏ తేడా జరిగినా మొత్తమంతా తలక్రిందలు అవ్వొచ్చంటున్నారు. ఉదాహరణగా, 2004ను చూపుతున్నారు. అప్పట్లో వాజ్ పేయ్ ముందస్తుకు ముందకు కదిలారు. అలిపిరి దాడి నుంచి తప్పించుకున్న చంద్రబాబు కూడా కూడికలు , తీసివేతలు చేసుకుని ఎన్నికల బరిలో కాలుపెట్టారు. కాని, ఫలితం అనూహ్యంగా వచ్చింది. పదేళ్లు అధికారానికి దూరం చేసింది. ఇప్పుడూ అలాంటి పరిణామం వుండబోదని గ్యారెంటీ లేదు. అందుకే, సర్వేలు, రిపోర్టులు ఒకటికి పదిసార్లు సరి చూసుకుని పంజా విసిరితే బావుంటుంది! ఆఫ్ట్రాల్… పాలిటిక్స్ ఈజ్ మోర్ మ్యాథ్స్ ద్యాన్ సోషల్!

ఒక ఎన్నికలు… ఒకేసారి ఎన్నికలు… ఓకేనా?

ఎన్నికలు… ఈ పేరు చెప్పగానే పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీలు, మీడియా, జనం… ఇలా అంతటా, అన్నిటా, అందరిలో ఆసక్తి మొదలవుతుంది! అయితే, అదే టైంలో కీలకమైన ఎలక్షన్స్ వస్తున్నాయంటే టెన్షన్ కూడా మొదలవుతుంది. భారతదేశం లాంటి భారీ దేశంలో కోట్లాది మంది ఓటర్లు వుంటారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షులు, ప్రధానుల్ని ఎన్నుకునే ఓటర్ల సంఖ్య కంటే మన దగ్గర మున్సిపల్ కార్పోరేషన్లకు ఓటు వేసే వారి సంఖ్య ఎక్కువ! ఇక పార్లమెంట్ ఎన్నికలు వస్తేనైతే ఆరు నెలల కోలాహలం! కోట్లాది మంది క్యూలైన్లలో నిలబడే ప్రజాస్వామిక కుంభమేళా!   ఎన్నికలు లేకుంటే అసలు ప్రజాస్వామ్యమే వుండదు. అందుకే, ఎన్నికలు, అదీ పారదర్శకమైన ఎన్నికలు వుండాలి. కాని, మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, అయిదేళ్లకొకసారి దేశానికి ఎన్నికలు, ఆ అయిదేళ్ల మధ్య కాలంలో ఎక్కడో అక్కడ అసెంబ్లీల ఎన్నికలు, అవి చాలవన్నట్టు పదే పదే మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికలు… ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. వీటి వల్ల లాభం వుందన్నది అందరూ ఒప్పుకునేదే! ఎన్నికలు జరుగుతుంటేనే పాలన కొనసాగేది. కాని, ప్రతి రెండు, మూడు నెలలకొకసారి ఎన్నికలు తన్నుకొచ్చేయటంతో… పాలన బాగా జరగటం కంటే ఎక్కువగా కుంటుపడుతోంది! అదీ అసలు సమస్య!   భారతదేశంలోని ముప్పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏవో ఒక ఎన్నికలు ఎల్లప్పుడూ జరుగుతూనే వుంటాయి. చిన్న చిన్న ఓట్ల పండుగలు పక్కన పెట్టినా పెద్ద పెద్ద వాటి వల్ల అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడుతుంటాయి. కారణం… ఎలక్షన్ కోడ్ అమలు కాగానే ఎలాంటి ప్రధాన నిర్ణయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకూడదు. అంతే కాదు, త్వరలో ఎలక్షన్స్ అంటే… ఏ పార్టీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు  కొన్ని నెలల ముందు నుంచే తీసుకోదు! జనాన్ని మచ్చిక చేసుకునే విధంగా సంస్కరణల్ని పక్కన పెట్టేస్తుంది. అంటే అభివృద్ధి ఆగిపోతుందన్నమాట! ఇక ప్రతీ సంవత్సరం ఏదో ఒక చోట భారీ ఎన్నికలు జరుగుతూనే వుంటే… మన ప్రభుత్వాలు ధైర్యంగా సంస్కరణలు చేపట్టేది ఎప్పుడు? అభివృద్ది ఫలాలు అందేది ఎప్పుడు?   బీజేపీకి ప్రధానిగా వున్న మోదీయే స్టార్ క్యాంపైనర్. ఆయన ఎక్కడ ఎన్నికలు జరిగినా దిల్లీలోని పనులన్నీ ఆపుకుని ప్రచారానికి వెళ్లాలి. ఇదే పరిస్థితి చాలా ప్రాంతీయ పార్టీల సీఎంలది. ఎన్నికలు అనగానే వారు పనులు పక్కన పెట్టి జిల్లాలు తిరుగుతుంటారు. ఇలా ఎన్నికల వల్ల ప్రధాని, ముఖ్యమంత్రులు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోలేని ఒత్తిడికి గురవుతున్నారు!   పదే పదే ఎన్నికల వల్ల జరుగుతోన్న నష్టాన్ని నివారించేందుకే మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం తీసుకొస్తున్నారు. దీని ప్రకారం 2018 చివర్లో ఎలక్షన్ పండగ జరగవచ్చు! ప్రధానమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకుంటే ఒకేసారి కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమీషన్ కూడా భావిస్తోంది! నీతీ ఆయోగ్ మీటింగ్ లో మోదీ ఒకేసారి ఎన్నికలపైన తమ తమ అభిప్రాయాల్ని చెప్పాలని అన్ని రాష్ట్రాల్ని కోరారు!   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాగే మరి కొన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పార్లెమెంట్ తో కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి. 2018లో మిగతా రాష్ట్రాల అసెంబ్లీల్ని కూడా ముందస్తుగానో, లేదంటే, కాస్త ఆలస్యంగానో ఎన్నికలకు సిద్ధం చేస్తే ఒకేసారి ఓటింగ్ పెట్టటం కష్టమేం కాదు. దీని వల్ల ప్రధానంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు వేగంగా, ధైర్యంగా తీసుకోగలుగుతాయి. ఒక్క సంవత్సరం ఎన్నికల కోసం ఖర్చైనా… మిగిలిన నాలుగు యేళ్లూ మరే ఎన్నికల భయం లేకుండా సంస్కరణలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా సాగవచ్చు!   దేశంలోని అత్యధిక రాష్ట్రాలు బీజేపీ చేతిలో, బీజేపి మోదీ చేతిలో, ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ఆయన మనస్సులో వుంది కాబట్టి… వన్ నేషన్, వన్ ఎలక్షన్ త్వరలోనే నిజం అవుతుందని భావించవచ్చు!

ఎర్త్ డే జరుపుకునే మనం… ఎవ్రీ డే ఏం చేస్తున్నాం?

  భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉదయాన్నే లేవగానే ఒక ప్రార్థన చేస్తారు! అదేంటంటే… విష్ణు పత్ని అయిన భూమాతకి నమస్కారం. నీపైన కాళ్లు మోపుతున్నందకు మమ్మల్ని క్షమించు తల్లీ అనీ! ఇది పైకి ఏదో మూఢ భక్తిలా అనిపిస్తుంది! కాదంటే, హిందువుల విశ్వాసం అని సరిపెట్టుకోవచ్చు. కాని, అంతర్లీనంగా ఎంతో గొప్ప ఉపదేశం, ఉపయోగం వున్నాయి! ఏప్రెల్ 22 ప్రపంచ భూమాతా దినోత్సవ సందర్భంగా మనం ఒక్కసారి అదేంటో తరచి చూద్దాం!   భూమిని భూమాతగా ఎందుకు భావించాలి? నిజానికి మనిషికి ప్రాణంపోసేది, ప్రాణం నిలిపేది ఏది అయినా తల్లితో సమానమే! అందుకే, నీటిని గంగమ్మ అన్నట్టు భూమిని భూమాతా అన్నాం. కాని, భూమికి మరోక ప్రత్యేకత కూడా వుంది. అదే… మనిషితో పాటూ అన్ని జీవుల్ని అంతిమంగా భూమే తనలో కలుపుకుంటుంది! పైగా మనం పుట్టింది కూడా భూమి నుంచే మన సనాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఎలాగంటే, భూమి నుంచి ఆహారం ఉత్పత్తి అవుతోంది. ఆ ఆహారం స్వీకరించిన తండ్రిలో … ఆహారం కారణంగానే శుక్ర కణం ఉత్పత్తి జరుగుతోంది. అది తల్లి కడుపులోకి చేరి అండంతో కలిసి పిండంగా మారి ప్రాణంగా బయటకొస్తోంది! ఆ విధంగా భూమ్మీది జీవులన్నిటికి ఆహారం పెట్టే భూమే… సకల జీవరాశికి తల్లి!   మాతృమూర్తి లాంటి భూమాతని భూమ్మీది మరే జీవీ ఇబ్బంది పెట్టడం లేదు. దోచుకోవడం లేదు. నష్టపర్చటం లేదు. మనిషి మాత్రమే ఉన్మాదంతో భూమిని అస్తవ్యస్తం చేస్తున్నాడు. భూమిపైని పచ్చదనం నరికేస్తున్నాడు. భూమి లోపలి ఘనుల్ని తోడేస్తున్నాడు. నేల లోపలి జల సిరుల్ని విచ్చలవిడిగా వాడుకుని… కాంక్రీట్ అరణ్యాలు సృష్టించి.. భవిష్యత్ తరాలకు కన్నీళ్లే తప్ప నీళ్లు లేని దుస్థితి తెస్తున్నాడు! ఇంతా చేసి సంవత్సరానికి ఒక రోజు, ఏప్రెల్ 22న, ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే జరుపుకుంటున్నాడు. మిగతా అన్ని రోజులు తన రాక్షసత్వం కొనసాగిస్తున్నాడు!   ఎర్త్ డే నిజానికి 1970లలో అమెరికాలో మొదలైంది. పారిశ్రమిక విప్లవానికి వ్యతిరేకంగా జనం నిరసనలు తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహించారు. కాని, పారిశ్రమలు మాత్రం ఆగలేదు. వాయు, ధ్వని, భూ కాలుష్యమూ ఆగలేదు. 2009కల్లా భూమి విషవాయువులతో గతంలో ఎప్పుడూ లేనంతగా వేడెక్కింది. అప్పుడు యూఎన్ఓ అమెరికా వారు మొదలు పెట్టిన ఎర్త్ డేను అంతర్జాతీయ భూమాతా దినోత్సవంగా ప్రకటించింది! ఎర్త్ డే.. మదర్ ఎర్త్ డే అయినా కూడా మానవ సమాజంలో పెద్దగా మార్పు వచ్చిందేం లేదు! 2009 తరువాత కూడా ఎర్త్ డేలు జరుపుకుంటూనే ఎర్త్ ను దోచుకుంటూ, దోపిడీ చేసే పనులు చేస్తూనే వున్నాం!   ఊళ్లకు ఊళ్లు నిర్వీర్యం చేసే భారీ పరిశ్రమలు మొదలు ఒక్కొక్కరూ వాడేసే ఏసీలు, వాహనల వరకూ అంతా కాలుష్యమే! ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే… భూమ్మీది ఏ ప్రాంతమూ కలుషితం కాకుండా లేదు. సముద్రాలు కూడా మనిషి స్వార్థానికి బలైపోతున్నాయి. వాటిల్లో పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ధృవ ప్రాంతాల వద్దకు వెళ్లి తేలుతున్నాయట! గ్రీన్ ల్యాండ్ నుంచీ అంటార్కిటికా వరకూ ఎక్కడా స్వచ్ఛత లేకుండా పోయింది! ఎర్త్ డే నాడు అందరూ ఆందోళన చెందాల్సిన విషయం ఇదే!   భూమిని మనిషిని ఇలాగే పరాభవిస్తూ పోతే ముందు ముందు అది తన అంతానికే ఆరంభం అవుతుంది! ఒక్కసారి సహనానికి ప్రతి రూపమైన భూమాత ఆగ్రహిస్తే భూకంపాలు మొదలైపోతాయి. సునామీలు ముంచుకొస్తాయి. ప్రళయం అనివార్యమవుతుంది. అప్పుడు ఎర్త్ డే జరుపుకోటానికి మానవ సమూహమంటూ మిగలటం కూడా అనుమానమే! అణు యుద్ధాలు వస్తాయో రావో తెలియదు. కాని, మనిషి తన సుఖం కోసం, స్వార్థం కోసం చేస్తోన్న కాలుష్యంతో… భూ ప్రళయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది! మానవ నాగరికత అణువణువూ వణికిపోతుంది. అది జరగక ముందే జాగ్రత్తపడాలి!

వీసాల… ఆయాసాలు!

  హైద్రాబాద్లోని చిలుకూరు బాలాజీ దేనికి ఫేమస్సో తెలుసుగా? ఆయనని ఒక దశలో వీసాల వేంకటేశ్వరుడని విపరీతంగా ఆరాధించే వారు యువత! ఇప్పటికీ నమ్మకం వున్న వారు శ్రద్ధగా పూజిస్తున్నారు. శ్రద్ధ వున్న వార్నీ ఆయన కూడా చక్కగా ఆదుకుంటున్నాడు! అయితే, వీసాల విషయంలో మాత్రం రోజు రోజుకి పరిస్థితి దారుణంగా తయారవుతోంది! చిలుకూరు బాలాజీ దేవుడు వరమిచ్చినా…. ట్రంపు అనే పూజారి వరమివ్వటం లేదు! కరువులో వాంతిలాగా ట్రంప్ లాగే మారిపోతున్నారు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బ్రిటన్ పాలకులు కూడా!   అసలు గత కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో ఒక అవమానకర ట్రెండ్ విజృంభిస్తోంది! మనకు పర్సనల్ గా అదొక పెద్ద గర్వకారణం కావచ్చు…. కాని, మన దేశం వారు విదేశాలకు వెళ్లి నానా తిప్పలు పడి డాలర్లు పోగేయటం… మన దుస్థితిని చూపిస్తుంది. అదే ఇంతకాలం కొనసాగింది. ఇక్కడ ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు అందించిన విద్య అభ్యసించి…సరైన అవకాశాలు లేక వలసలు పోతున్నారు. మా వాడు అమెరికాలో స్థిరపడ్డాడని మనం గొప్పగా చెప్పుకున్నా… భారతదేశానికి మాత్రం అది హానికరం, అవమానకరం!   ఇక ఇప్పుడు… మంచికో, చెడుకోగాని… మన బెస్ట్ బ్రెయిన్స్ ని ఇంతకాలం చౌకగా వాడేసుకున్న వెస్టన్ కంట్రీస్ అలా చేయమంటున్నాయి. వీసాలు జారీ చేసే విషయంలో రోజు రోజుకి రూల్స్ కఠినతరం చేస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ ఈ ట్రెండ్ కి తెర తీసినా తరువాత అతడ్ని సైలెంట్ గా ఫాలో అవుతున్నాయి మరికొన్ని దేశాలు. ఎవరు పడితే వారు ఇండియా నుంచి తమ తమ దేశాలకు కారు చౌకగా వచ్చేయకుండా నియమాలు సవరిస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాల పాలకులు! ఈ టీమ్ లో లేటెస్ట్ గా చేరింది న్యూజీలాండ్!   కివీ దేశంలో మొత్తం జనాభానే 48లక్షలు! అందుకే, వలస వచ్చిన భారతీయులకి మంచి అవకాశాలే ఇచ్చేది ఆ దేశం. కాని, రాను రాను అక్కడ వలస వచ్చిన వారి సంఖ్య 71వేలు దాటిపోవటంతో ఆందోళన మొదలైంది! న్యూజీలాండ్ ఫస్ట్ నినాదం ఊపందుకుంది. ఇప్పుడు అక్కడ కూడా అమెరికాలో మాదిరిగానే మినిమం సాలరీ లెవల్ భారీగా పెంచేశారు. లోకల్ న్యూజీలాండ్ ఉద్యోగిని పెట్టుకుంటే ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ పే చేస్తే తప్ప బయటి వారిని పెట్టుకోలేకుండా చేసేశారు. అదే ఇప్పుడు ఇండియన్స్ కి ఇబ్బందిగా మారనుంది!   న్యూజీలాండ్ పక్కనే వుండే ఆస్ట్రేలియా కూడా ఆల్రెడీ వీసాలు విరివిగా ఇచ్చే విషయంలో వేషాలు వేస్తోంది. గతంలోలా ఈజీగా ఇచ్చేయమని , ఆ రూలని, ఈ రూలని మాటలు చెబుతోంది. అన్నిటి సారాంశం ఒక్కటే. నిజమైన దమ్మున్న ఇండియన్స్ మాత్రమే ఇక మీద ఆస్ట్రేలియాలో కాలుపెట్టగలరు!   అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటూ ఇప్పటికే భారతీయులకి డోర్స్ క్లోజ్ చేసిన మరో దేశం బ్రిటన్! గాంధీ, నెహ్రూల కాలం నుంచీ మనోళ్లు బ్రిటన్ వెళుతూనే వున్నారు. కాని, ప్రస్తుతం అక్కడి ఎడ్యుకేషన్ , వర్క్ వీసాల పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేనంత టఫ్ గా మారిపోయింది. సాదాసీదా ఇండియన్స్ లండన్ డ్రీమ్స్ మర్చిపోవటమే బెటర్!   అమెరికా నుంచీ ఆస్ట్రేలియా దాకా అందరూ ఇండియన్స్ కి నో ఛాన్స్ అనటానికి కారణం ఏంటి? ఏం లేదు… ఆయా దేశాల్లో వలస ఉద్యోగులు పెరిపోతున్నారు. దాని వల్ల లోకల్ చంటిగాళ్లకు మంటపుడుతోంది. ప్రజాస్వామ్య దేశాల్లో ఓట్లు అవసరం కాబట్టి లోకల్ వాళ్లని ఎవరు మాత్రం రెచ్చగొడతారు! అందుకే, ట్రంప్ లాగే అందరూ అవుట్ సైడర్స్ ముఖాలపై గేట్లు వేసేస్తున్నారు! అయితే, ఇక్కడే ఇండియా పాలకులు గమనించాల్సింది… ఇండియన్స్ లో హైలీ స్కిల్డ్ వారికి మాత్రం ఇప్పటికీ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బ్రిటన్… అన్నీ స్వాగతం పలుకుతూనే వున్నాయి! అంటే… మన దేశంలోని అత్యున్నత జ్ఞానాన్ని అవ్వి వాడుకోటానికి రెడీనే అన్నమాట!   నిజానికి నేషన్ ఫస్ట్ అన్నది ప్రపంచంలో … ఫస్ట్ మన మోదీనే! ఆయన ఇండియా ఫస్ట్ అన్నాకే … చాలా దేశాల్లో ఈ ఫస్ట్ నినాదాలు ఊపందుకున్నాయి! కాబట్టి మోదీ సర్కార్ ఈ క్లిష్ట పరిస్థితిని సవాల్ గా తీసుకుని మన దేశంలోని అత్యున్నత మేధస్సుకి బయటకి వెళ్లే ఛాన్స్ ఇవ్వకూడదు! అమెరికా లాంటి దేశాలు మన మామూలు మెదళ్లను వద్దని గొప్ప తెలివి వున్న వారికి మాత్రం గాలం వేస్తున్నాయి. అలా జరగనివ్వకుండా… మన దేశం కూడా ఇండియా ఫస్ట్ నినాదంతో దూసుకుపోవాలి. దేశం కాని దేశంలో శ్రీనివాస్ కూచిభోట్ల లాగా ఎవరు మాత్రం దురదృష్టకరంగా అసువులు బాయాలనుకుంటారు? అందుకే, మన దేశం ముందు మన వారికి అద్బుతమైన అవకాశాలు కల్పించాలి! అప్పుడు వీసాల ఆయాసాలు వుండవు. భారతదేశమూ వెలిగిపోతుంది!   ఇండియాలో నిరుద్యోగ సమస్య అంత తేలిగ్గా తీరిపోయే సమస్య కాదు. అయినా ఏదో ఒక క్షణం నుంచీ కంకణం కట్టుకుంటే సాధించలేనిది ఏముంటుంది? అభివృద్ధి చెందిన దేశాలకు చెలగాటం… మనకు ప్రాణ సంకటం అన్నట్టు ఎంత కాలం నెట్టుకొస్తాం? ఆలోచించుకోవాలి!

ఆయన చంద్రుడు… ఆంధ్ర రాష్ట్రమొక కలువ!

కొందరు అదృష్టం కొద్దీ ఎదుగుతారు. కొందరు ఎదగటం జాతి అదృష్టం! ఏప్రెల్ 20, 1950న పుట్టిన చంద్రబాబు అదృష్టం కొద్దీ ఎదగలేదు. కఠోర శ్రమని నమ్ముకున్నారు. ఇప్పటికీ విరామం ఎరగక పని చేస్తారాయన. అటువంటి నాయకుడు లభించటం తెలుగు వారి అదృష్టం! ఆయనంటే పడని వారు, ప్రత్యర్థి పార్టీల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు మహానేత అంటే ఒప్పుకోకపోవచ్చు. కాని, నాయకత్వం కేవలం హావభావాల్లో, ఆహా ఓహో అనిపించే పంచ్ డైలాగుల్లో వుండదు! గుక్క తిప్పుకోకుండా చేసే ప్రసంగాల్లో అస్సలు వుండదు. జనాల జీవితాల్లో మార్పు రావాలి. ఆ మార్పుకి నాయకుడు కారణం , కర్త కావాలి! అప్పుడే అది విజయం అనిపించుకుంటుంది!   నారా వారి పల్లెలో పుట్టి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి దాకా తన గమనం సాగించిన చంద్రబాబు ప్రేరణ పొందాలనుకునే వారికి అడుగడుగునా తన అడుగుజాడలు చూపిస్తారు. ఆయన ఎదుగుదల కేవలం ఒక రాజకీయం కాదు. నాటకీయం అంతకన్నా కాదు. ప్రాక్టికల్ గా ఒక స్టెప్ తరువాత మరో స్టెప్ వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒక సాదాసీదా వ్యవసాయ కుటుంబం నుంచీ వచ్చి ఇప్పటి వరకు మొత్తం ఆంధ్ర దేశాన్ని తన క్షేత్రంగా మార్చుకుని అభివృద్ధి సాగు చేస్తున్నారు. భావి తరాల కోసం అమరావతిని నారు వేసి, నీరు పోసి పెంచి పెద్ద చేస్తున్నారు!   స్కూలు జీవితంలో ఎందరో మధ్య తరగతి గ్రామీణ విద్యార్థుల్లాగే చంద్రబాబు కూడా మైళ్లు నడిచి వెళ్లి చదువుకునేవారు. కాని, తనతో బడికి వచ్చిన వారంతా తమ ఊరికో, జిల్లాకో పరిమితం అయిపోతే ఆయన మాత్రం తిరుపతి మీదుగా హైద్రాబాద్ దాకా వచ్చారు! చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎదుగుదల ఆయన ఆరాధించే వెంకన్న దయ అయితే కావొచ్చు… కాని, దానితో పాటూ ఆయన తెలివిగా వేస్తూ వచ్చిన అడుగులు కూడా! కాంగ్రెస్ లో వున్నా, టీడీపీలో వున్నా, ఇప్పుడు తానే టీడీపీగా మారిపోయినా… ప్రతీ మలుపులోనూ ఆయన తెలివిని, దార్శనికతని మనం చూడొచ్చు. మొదట్లో ఎమ్మెల్యే అవ్వటానికి, ఎన్టీఆర్ అల్లుడు అవ్వటానికి, రాష్ట్ర మంత్రి అవ్వటానికి… ఆయన ఎంత నిజాయితీగా కృషి చేశారో… ఆ తరువాత అంతే నిజాయితీగా రాష్ట్ర సంక్షేమం కోసం పాటుబడ్డారు. అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన ఆయన బిర్యానీ గురించి గొప్పగా చెప్పుకునే హైద్రాబాద్ కు ఐటీ ఘుమఘుమలు జోడించారు! చార్మినార్ బొమ్మతో చూపించే భాగ్యనగరిని సైబర్ టవర్స్ తో సరికొత్తగా ఆవిష్కరించారు! రాజకీయ శత్రువులు, కొందరు మేధావులు హైద్రాబాద్ మేకోవర్ లో చంద్రబాబు పాత్రని తక్కువ చేయోచ్చు. ఒప్పుకోకపోనూ వచ్చు. కాని, చరిత్ర మాత్రం ఆయనని నిజాముల నగరానికి నిఖార్సైన నిగనిగలు తెచ్చినవాడిగా తప్పకుండా గుర్తు పెట్టుకుంటుంది!   అధికారంలో వున్నప్పుడు అమెరికా అధ్యక్షుడ్ని అయినా ఆహ్వానించవచ్చు. కాని, ప్రతిపక్షంలో వున్నప్పుడు స్వంత రాష్ట్ర సీఎంనే తట్టుకోలేము! అదీ మన ప్రత్యర్థి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి రాజకీయ అగ్నిపర్వతం అయితే… ఆ వేడి తట్టుకోవటం మరింత దుర్భరం! అయినా చంద్రబాబు పదేళ్లు ఆ పాత్రలోనూ పరిణతితో ఇమిడిపోయారు! ముఖ్యమంత్రిగా దూకుడు చూపితే… ప్రతిపక్ష నేతగా తెగువ చూపారు! కాంగ్రెస్ సీఎంలు ఎందరు మారుతూ , జగన్ మరోవైపు నుంచీ ఎంతటి తుఫానులా తరుముకొచ్చినా, రాష్ట్ర విభజన పేరున సోనియా వైపు నుంచి ఎంత రాజకీయం నడిచినా…. చంద్రబాబు కదలక మెదలక తొణకకుండా నెగ్గుకొచ్చారు! అదే అతనిలోని నాయకత్వ పటిమకు నిదర్శనం!   నిజాముల కాలం నుంచీ రైళ్లు, విమానాలతో తులతూగిన హైద్రాబాద్ ను చంద్రబాబు ఎంత గొప్పగా రూపు మార్చారో అందరికీ తెలుసు! కాని, కనీసం అసెంబ్లీ, సచివాలయం కట్టుకోడానికి భూములు కూడా లేని అమరావతిని ఆయన నవ్యాంధ్రాలో పరమాద్భుతంగా ఆవిష్కరించారు! ప్రతీ రోజూ అమరావతి విషయంలో కోడి గుడ్డుపైన ఈకల ఛందంగా విమర్శలు చేసేవారు ఎందరున్నా… ఇవాళ్ల దుర్గమ్మ పాదాల చెంత కొత్త చరిత్రకు రచన జరుగుతోందంటే అందుకు కారణం… చంద్రబాబు చాతుర్యం, అనుభవం, ఓర్పు తప్ప మరొకటి కాదు.  66ఏళ్ల ఆయన తాపీ పట్టుకుని తాపీగా మరో హైద్రాబాద్ నిర్మాణం చేస్తున్నారు ఆంధ్రుల కోసం...   రాష్ట్ర విభజనతో అనుకోని మలుపులో అనూహ్య స్థితిలో చిక్కిన ఆంధ్ర రాష్ట్రానికి… ఇప్పుడు చంద్రబాబు అవసరం ఎంతైనా వుంది. అందుకే, ఆయన జనం తన మోపిన బాధ్యతని ఎప్పటిలాగే సమర్థంగా నిర్వహిస్తూ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అందరం కోరుకుందాం!

చిన్నమ్మపై మోడీకి అంత పగ దేనికీ..?

  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అన్నాడీఎంకే పార్టీలో చీలిక దేశంలో రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. జయ తర్వాత అన్నీ తానే అవ్వాలనుకున్న శశికళ పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని పెద్ద డ్రామానే నడిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ఎత్తుగడల ముందు చిన్నమ్మ చిత్తయిపోయింది. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ ప్రధాని నరేంద్రమోడీనే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమ్మ ఉన్నన్నీ రోజులూ చిన్నమ్మ తెరచాటు వ్యవహారాలు నడిపారు..ఆ తర్వాత ఆమె అందరికీ అమ్మ కావాలని ఆశ పడింది. సీఎం పీఠం ఎక్కడం అటుంచితే..కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. పార్టీపై చెరగని ముద్ర వేద్దామనుకుని చివరకు ఏ గుర్తూ లేకుండా పోయింది. దీనికి కాలం కలిసి రాలేదు అనేకన్నా..మోడీ లాంటి పొలిటికల్ మాస్టర్ ముందు నిలబడలేకపోయారని చెప్పవచ్చు.   జయ మరణం తర్వాత పార్టీని గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ..తదనంతర కాలంలో చిన్నమ్మను సీఎం కాకుండా విజయవంతంగా అడ్డుకున్నారు మోడీ. రెండాకుల పార్టీలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ఆయన పన్నీర్‌కు అండగా నిలబడ్డారు. తాను జైలు పాలైనా తన వర్గం చేతిలో అధికారం ఉండాలని శశికళ పథకం వేశారు. అందుకు అనుగుణంగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా మేనల్లుడు దినకరన్‌ను నియమించి ఆర్కేనగర్‌ నుంచి సీఎం కుర్చీపై కూర్చొపెట్టాలనుకున్నారు. ఇక్కడే మోడీ తెలివిగా వ్యవహరించారు. దినకరన్‌ వర్గీయులు, మంత్రులు  ఓట్లర్లకు డబ్బులు పంచుతున్న ఫోటోలను సంపాదించి ఈసీకి ఫిర్యాదు చేయించారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో ఎన్నికల కమిషన్ ఆర్కేనగర్ ఉపఎన్నికను రద్దు చేసింది. ఇక ఇరు వర్గాలు పార్టీ గుర్తు మాదంటే..మాది అని ఎన్నికల కమిషన్ దాకా వెళ్లాయి. చివరకు రెండాకుల గుర్తు కోసం దినకరన్‌ ఈసీ అధికారులకు రూ.60 కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు..దీంతో దినకరన్ తనంతట తనే మోడీకి జుట్టు అందించినట్లైంది. ఇక ప్రధాని తన స్టైల్లో వ్యవహారం నడిపారు. శశికళను, దినకరన్‌లను పార్టీకి దూరంగా ఉంచితే తన వర్గాన్ని పార్టీలో వీలినం చేస్తానని పన్నీర్ బహిరంగంగా ప్రకటించారు.   పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని గ్రహించిన అన్నాడీఎంకే సీనియర్ నేతలు రంగంలోకి దిగారు..వీలిన ప్రక్రియపై కమిటీని నియమించారు. అంతేకాకుండా దినకరన్‌ను, శశికళ బంధువర్గాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే శశికళను అనధికారికంగా దూరం పెట్టినట్లే..ఈ పరిణామాలన్నింటి వెనుక సూత్రధారి మోడీయేనని రాజకీయం తెలిసిన వారెవ్వరికైనా అర్థం అవుతుంది. మన్నార్ ‌గుడి మాఫియాను దూరంగా పెట్టి అన్నాడీఎంకేను గుప్పెట్లో పెట్టుకున్నారు ప్రధాని మోడీ. తద్వారా త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ బలం మోడీకి లభించినట్లైంది.

తలాఖ్ పై తలా ఒక మాట! అయినా, చర్చ జరగటమే ఇప్పుడు కావాల్సింది!

2014లో మోదీ సంపూర్ణ మెజార్టీతో ప్రధాని అయ్యారు! అది స్వతంత్ర భారత చరిత్రలో పెద్ద మలుపు! ఇక ఇప్పుడు భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రాన్ని కూడా కాషాయ దళం కాషయం ధరించిన యోగి చేతుల్లో పెట్టింది. ఇది ఇంకా పెద్ద మలుపు. ఈ పరిణామాల వల్ల ముందు ముందు భారీ మార్పులే వస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా, యూనిఫామ్ సివిల్ కోడ్ కు దారితీసే ట్రిపుల్ తలాఖ్ అంశం వేగంగా రూపు మారుతోంది. దశాబ్దాలుగా అందరికీ తెలిసినా, ఎవ్వరూ మాట్లాడని విషాదం… ఇప్పుడు రోజువారీ చర్చా విషయంగా మారిపోయింది! ఎంతగా అంటే , యోగీ ఆదిత్యనాథ్ లాంటి కరుడుగట్టిన హిందూత్వవాదులు మొదలు బాలీవుడ్ పాటల రచయిత జావేద్ అఖ్తర్ వరకూ ఎవ్వరూ ట్రిపుల్ తలాఖ్ పై కామెంట్ చేయకుండా వుండలేకపోతున్నారు! ఇలాంటి చర్చ ఎప్పుడో జరగాల్సి వున్నా… కనీసం ఇప్పుడు జరుగుతున్నందుకు మనం సంతోషించాలి!   అసలు మన దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించటమే రెండుగా చీలిపోతూ అయింది. ఇండియా, పాకిస్తాన్ అంటూ రెండు దేశాలు అస్థిత్వంలోకి వచ్చాయి అఖండ భారత్ లోంచి. అయితే, విచిత్రంగా ట్రిపుల్ తలాఖ్ లాంటి నియమం ముస్లిమ్ దేశంగా పుట్టిన పాకిస్తాన్లో ఎప్పుడో పోయింది. ఇక్కడ మాత్రం సెక్యులర్ ముసుగులో కొనసాగూతూనే వుంది. డెబ్బై ఏళ్లు అవుతున్నా ముస్లిమ్ మహిళలందరికీ చేటూ చేసే ఈ దుర్మార్గాన్ని మన నేతలు, మేధావులు, ఉద్యమకారులు ఎవ్వరూ బలంగా వ్యతిరేకించలేదు. సౌదీ అరేబియా లాంటి నిఖార్సైన ఇస్లామిక్ దేశం కూడా వద్దని పక్కన పెట్టిన ట్రిపుల్ తలాఖ్ మనకెందుకని ఎవ్వరూ అడగలేదు. ఇందుకు కారణం, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాలే!   ఇప్పుడు చరిత్రలో తొలిసారిగా కాంగ్రేసేతర పార్టీ మోదీ నేతృత్వంలో దేశాన్ని నడుపుతోంది. ఆ ఎఫెక్టే ట్రిపుల్ తలాఖ్ పైన కూడా పడుతోంది. అయితే, బీజేపి హిందూత్వవాద పార్టీ కాబట్టి ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేకించటంలో దాని లెక్కలు దానికుంటాయి. అవన్నీ మనం సమర్థించాల్సిన పని లేదు. కాని, మోదీ, యోగీ లాంటి నాయకులు బహిరంగంగా , బలంగా ట్రిపుల్ తలాఖ్ ను వ్యతిరేకించటం మాత్రం తప్పక అభినందించాల్సిన పరిణామం. అందువల్ల మహిళల హక్కులకి తీవ్రమైన భంగం కలిగిస్తోన్న ఒకానొక దురాచారంపై చర్చ మొదలైంది.   బాలీవుడ్ రచయిత జావేద్ ఆఖ్తర్ తాజాగా ఘాటైన ట్వీట్స్ చేశాడు. ఆలిండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ ట్రిపుల్ తలాఖ్ రద్దును వ్యతిరేకిస్తూ విచిత్రమైన ప్రతిపాదనలు చేయటం అవివేకం అన్నాడు. పర్సనల్ లా బోర్డ్ ఈ మధ్యే ట్రిపుల్ తలాఖ్ దుర్వినియోగం చేసే వార్ని సామాజిక బహిష్కరణకి గురి చేయాలని నిర్ణయించింది! దీనికి స్సందించిన ఆఖ్తర్, ‘’ ట్రిపుల్ తలాఖ్ ను దుర్వినియోగం చేయటం ఏంటి? లైంగిక వేధింపుల్ని, రేప్ ని ఎవరైనా దుర్వినియోగం చేస్తారా? అసలు అవ్వి చేయటమే దుర్మార్గం! ఇంక దుర్వినియోగం ఏంటి? ‘’ అని సూటిగా ప్రశ్నించాడు. కొన్నాళ్ల క్రితం వరకూ ఇలాంటి బహిరంగ చర్చ మనం అస్సలు ఊహించగలమా? కాని, మారిన ప్రభుత్వాల నేపథ్యంలో గొంతుకలు కూడా మారుతున్నాయి!   యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ అయితే …. ట్రిపుల్ తలాఖ్ ద్రౌపతీ వస్త్రాపహరణం లాంటిదన్నారు! దీనిపై సహజంగానే కాంగ్రెస్, ఇతర బీజేపి వ్యతిరేక పార్టీలు గొడవ చేస్తున్నప్పటికీ… ఆయన అసలు ఉద్దేశం ఇక్కడ చాలా ముఖ్యం. ద్రౌపతి వస్త్రాపహరణం చేసిన వారిది ఎంత నేరమో, అంతే నేరం ఆ సమయంలో మౌనంగా వున్న వారిది కూడా! ట్రిపుల్ తలాఖ్ కూడా దశబ్దాలుగా ముస్లిమ్ మహిళల జీవితాలు నాశనం చేస్తుంటే పాలకులు, మేధావులు, ఉద్యమకారులు మౌనంగా వుండటం ఎలా భావించాలి? ఇప్పటికైనా శుభ సూచకంగా ట్రిపుల్ తలాఖ్ పై చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఇలాగే అన్ని మతాల్లోని , అన్ని దురాచారాలపైనా చర్చ జరగాల్సిందే. అదే ప్రజాస్వామ్య లక్షణం! ఇక ట్రిపుల్ తలాఖ్ పైన ఎవరి అభిప్రాయం ఎలా వున్నా సుప్రీమ్ కోర్టుదే అంతిమ నిర్ణయం! అది కూడా సాధ్యమైనంత త్వరలోనే వెలువడాలని ఆశిద్దాం…

కులం, మతం ఓకే… ప్రతిభకి రిజర్వేషన్ వద్దా?

రిజర్వేషన్ …. ఈ పదం ఏ క్షణాన రాజ్యాంగంలో చేరిందోగాని… బలంగా పాతుకుపోయింది! ఆ మధ్య ఏదో ఊపులో ఆరెస్సెస్ వారు రిజర్వేషన్స్ పై పునః సమీక్ష జరగాలి అన్నారు. పూర్తిగా రద్దు చేయాలని కూడా వారు అనలేదు. అయినా ఆ వెంటనే బీహార్లో బీజేపి ఓటమితో ఇప్పుడు కమలదళం కూడా రిజర్వేషన్స్ విషయంలో రిజర్వర్డ్ గా వుంటోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నాలుగడుగులు ముందుకేసి నాలుగు శాతం వున్న ముస్లిమ్ రిజర్వేషన్స్ పన్నెండు శాతానికి పెంచారు! రిజర్వేషన్స్ చుట్టూ పెద్ద రాజకీయమే నడుపుతున్నారు!   రిజర్వేషన్స్ ఏ పార్టీకైనా కత్తి మీద సామే! ఏ ప్రాంతంలో అయినా ఒక్క సారి రాజుకుంటే ఆగే మంట కాదు రిజర్వేషన్స్ దావానలం! ఉత్తరాదిలో పాటీదార్లు, జాట్లు మొదలు మన తెలుగు ప్రాంతంలో కాపుల వరకూ రిజర్వేషన్స్ అనగానే అందరూ చాలా ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా స్పందిస్తుంటారు. ఎక్కడ తేడా వచ్చినా ప్రభుత్వాల జాతకాలే మారిపోతుంటాయి. అందుకే, రిజర్వేషన్స్ తేనెతుట్టేలోంచి తమకు కావాల్సిన హనీ తీసుకుని నేతలు వాడుకుంటారుగాని… మొత్తానికి మొత్తంగా రిజర్వేషన్స్ తేనెతుట్టేను కదిలించే సాహసం చేయరు!   కేసీఆర్ చెబుతోన్న ముస్లిమ్ రిజర్వేషన్స్ మన నేతల పొలిటికల్ టాలెంట్ కి నిదర్శనం. ఇలాగే ముస్లిమ్ లకు విద్యా, ఉద్యోగాలంటూ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్ని కోర్టులో బోర్లాపడగా, మరికొన్ని నిర్ణయాలు కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే, ఇక్కడ మన వాళ్ల మాటలగారడీ మనం జాగ్రత్తగా గమనించాల్సి వుంటుంది. ముస్లిమ్ ల ముందుకి వెళ్లినప్పుడు తాము పెంచింది ముస్లిమ్ కోటా అని చెబుతాయి మన పార్టీలు. కాని, అదే కోటా గురించి కోర్టు అడిగితే మాత్రం బీసీ కోటాలో మార్పులు మాత్రమే చేశామంటుంటారు పాలకులు! ఇది తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో జరుగుతూ వస్తోంది. కోర్టు మత ప్రాతిపదిక ఒప్పుకోదు కాబట్టి ముస్లిమ్ లలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కోటాలో ఇస్తున్నామంటారు. కాని, అదే విషయం ప్రజల ముందు చెప్పరు. ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి రిజర్వేషన్స్ ఇవ్వటానికి, ముస్లిమ్ లకు రిజర్వేషన్స్ పెంచుతున్నామని చెప్పటానికి … చాలా తేడా వుంది! దాన్నే ఎదురుదాడితో బీజేపి క్యాష్ చేసుకుంటూ వుంటుంది!   ముస్లిమ్ లకి రిజర్వేషన్స్ పెంపు అంటే… దాదాపుగా ఏ లౌకిక పార్టీ నోరు మెదపదు. ఆ బలహీనతని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వుంటుంది కాషాయదళం. తెలంగాణ అసెంబ్లీలో కూడా బీజేపి నేత కిషన్ రెడ్డి నిర్ద్వద్వంగా ముస్లిమ్ రిజర్వేషన్స్ కి నో అన్నారు. అలా ఇతర పార్టీలు ఓటు బ్యాంక్ ఒత్తిళ్ల అనలేకపోవటమే బీజేపికి కలిసొచ్చే అంశం!   ఎన్నికల్లో రిజర్వేషన్స్ పెంపు అంశం ఎన్ని ఓట్లు ఎవరికి రాలుస్తుందనేది ఇప్పుడు తేలిది కాదు. కాని, అప్పటి వరకూ మాత్రం ఈ ముస్లిమ్ రిజర్వేషన్ల గోల బీజేపి, టీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ పంచ్ లకు మంచి అవకాశం ఇస్తుంది. టీడీపీ, కాంగ్రెస్ లకు చేటు చేస్తూ రెండూ పార్టీలకు లాభం చూకూర్చినా ఆశ్చర్యపోనవసరం లేదు! ఇక ప్రాక్టికల్ గా ముస్లిమ్ పేదలు రిజర్వేషన్ల ఫలితాలు చవి చూడాలంటే కోర్టులు, కేంద్రం అడ్డంకుల్ని దాటుకుని బిల్లు కార్యరూపం దాల్చాలి. దానికి కూడా బోలెడు సయమం పట్టే సూచనలే కనిపిస్తున్నాయి. కాని, అంతవరకూ కేసీఆర్ మాత్రం వీలైనంత మైలేజీ పొందే ఛాన్స్ వుంది. ఇప్పటికే ఏపీలో వున్న ముద్రగడ పద్మనాభం ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. రిజర్వేషన్స్ విషయంలో కేసీఆర్ అన్నమాట నిలబెట్టుకున్నారని మెచ్చుకున్నారు. పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ చేయటమే దీని ఉద్ధేశం! ఇలాంటి రిజర్వేషన్ రాజకీయాలు వచ్చే ఎన్నికల దాకా అందరికందరూ తమదైన రీతిలో చేస్తూ పోతారు!   రిజర్వేషన్స్ పెంపు, మతం ఆధారంగా రిజర్వేషన్స్ … ఇవన్నీ పైకి రాజకీయ ఎత్తుగడల్లా కనిపించినా… నిజమైన ఆర్దిక, సామాజిక వెనుకబాటుతనం వున్న వారికి ఉపయోగపడితే అదే పదివేలు! కాని, అలా జరుగుతున్నట్టు కనిపించటం లేదు. పైపెచ్చు… తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసినట్టు రిజర్వేషన్స్ 50 నుంచి 60 శాతం దాటిపోతే… పర్యవసానం ఏమైనట్టు? జనరల్ కోటాలో కోతపడ్డట్టు! జనరల్ క్యాటగిరి ఎవరిది? కేవలం ఓసీలదైతే కాదు. ప్రతిభ వున్న ప్రతీ సామాజిక వర్గానికి జనరల్ క్యాటగిరి అవశాలపై హక్కుంటుంది. అటువంటి ప్రతిభకి పట్టం కట్టే జనరల్ కోటాలో కోత విధించటం అంటే దేశాభివృద్ధిపై ప్రభావం చూపటమే! ప్రతిభ వున్న వారిని రిజర్వేషన్స్ ,రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా దేశం కోసం ఉపయోగించుకోవటం జాతి బాధ్యత! దాన్ని మరిచి జనరల్ క్యాటగిరిలో కోతలు పెట్టటం నిజంగా పెద్ద విషాదం… 

అంబేద్కరిజమ్… అందరూ అంటారుగాని… ఆచరించేది ఎందరు?

  అంబేద్కర్ … అంబేద్కరిజమ్… ఇప్పుడు ఈ పదాలు అందరి నోటా వినిపిస్తున్నాయి! ఇంతకీ వీటిలోని అసలు ఉద్దేశం ఇటు రాజకీయ నేతలకి, అటు ఉద్యమకారులకి, మరో వైపు మేధావులకి, ఇంకో వైపు విద్యార్థి నేతలకి… అందరికీ అసలు తెలుసా? ఖచ్చితంగా తెలిసిన వారు కొందరే! ఎవరికి వారు తమకు తోచింది చెప్పేస్తూ అదే అంబేద్కరిజమ్ అనేస్తున్నారు. తమ తమ వ్యక్తిగత భావాజాలాలు వదిలి పెట్టకుండానే అంబేద్కరిజాన్ని నెత్తిన పెట్టుకుని దాంట్లో తమ అభిప్రాయాలు కలిపేస్తున్నారు. తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అంతే తప్ప దళితుల కోసం రేయింబవళ్లు తపించిన అంబేద్కర్ అసలు సిద్ధాంతం ఏంటో ఎవరూ పట్టించుకోవటం లేదు!   అంబేద్కరిస్టులు అంతా మోసం చేస్తున్నారని అనలేం. వాళ్లలో చాలా మంది సిన్సియర్ గానే దళితుల కోసం కృషి చేస్తున్నారు. కాని, సమస్యంతా రాజకీయ నేతలు, పార్టీలు అంబేద్కరిజాన్ని తల కెత్తుకోటంతోనే వస్తోంది. ఎంఐఎం నుంచీ బీజేపి దాకా ఏ పార్టీ కూడా అంబేద్కరిజాన్ని వ్యతిరేకించటం లేదు. ఇక బీఎస్పీ లాంటి దళితుల కోసమే ఆవిర్భించిన పార్టీ అయితే పూర్తిగా అంబేద్కర్ వాదం మీదే అస్థిత్వం కొనసాగిస్తోంది. కాని, ఇక్కడ విచిత్రం ఏంటంటే… పరస్పర విరుద్ధమైన భావజాలాలు వుండే పార్టీలు కూడా దళితులు,అంబేద్కర్ అనగానే ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించేస్తున్నాయి. ఉదాహరణకి కమ్యూనిస్టులు, బీజేపీనే తీసుకుంటే… వీరిద్దరికీ రాజకీయాల్లో ఒక్క అంశంలో కూడా సారూప్యత వుండదు. కాని, అంబేద్కర్ అంటే మాత్రం ఇరు పార్టీలు సై అంటాయి!   గతంలో బీజేపికి అగ్రవర్ణాల పార్టీ అంటూ ముద్ర వుండేది. ఇప్పుడు ఒక బీసీని ప్రధాని చేసిన ఏకైక జాతీయ పార్టీగా కొత్త రూపు సంతరించుకుంటోంది. అదే క్రమంలో కమలదళం దళితుల్ని కూడా అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆరెస్సెస్ , బీజేపి రిజేర్వషన్లకు వ్యతిరేకం అంటూ ఇతర పార్టీలు అప్పుడప్పుడూ ప్రచారం చేసినా… మోదీ టీమ్ అంబేద్కర్ ద్వారా తాము దళితులకి, రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదని నిరూపించే పనిలో వుంది. అందుకే, అంబేద్కర్ 126వ జయంతిని కూడా నమో ప్రత్యేకంగా నాగపూర్ వెళ్లి జరుపుకున్నారు. అక్కడ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన దీక్షా స్థలంలో ప్రత్యేకంగా ఉపన్యాసం చేశారు!   ఒకవైపు బీజేపి అంబేద్కర్ ను తమ వాడని చెప్పే ప్రయత్నం చేస్తోంటే… కాంగ్రెస్, కమ్యూనిస్టులు గతంలోనే ఈ పని చేశారు! అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేయటంలో , ఆయన గురించి గొప్పగా స్పీచ్ లు ఇవ్వటంలోనూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇద్దరూ ఇద్దరే! కాని, అటు కాంగ్రెస్ పాలనలోగాని, ఇటు కమ్యూనిస్టుల పాలనలోగాని దళితులకి వారు ఆశించినంత మేలేం జరగలేదు. అందుకు క్రమంగా ఆ పార్టీలకు దళితులు దూరమవుతుండటమే నిదర్శనం. ఇలాంటి పరిస్థితే ప్రాంతీయ పార్టీలకు ఎదురవుతోంది. దాదాపుగా ఏ ప్రాంతీయ పార్టీ కూడా అంబేద్కర్ వాదానికి వ్యతిరేకం కాదు. కాని, అన్ని పార్టీలు పైపై మాటలు చెప్పటమే తప్ప దళితులకి నిజంగా మేలు చేసి అంబేద్కరిజాన్ని ఆచరించింది లేదు. అందుకే, దళితుల సంక్షేమమే నినాదంగా వచ్చిన బీఎస్పీని కూడా దళితులు వంద శాతం నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగిన యూపీ ఎన్నికల్లో దళితులు కూడా పూర్తిస్థాయిలో బీఎస్పీకి ఓటు వేయలేదన్నది బీజేపి సాధించిన 325సీట్లతోనే నిరూపితమైంది!   తెలిసో, తెలియకో, కావలనో గాని… మన పార్టీలు అంబేద్కరిజాన్ని ఇంకా అంటరానితనం వద్దనే ఆపేస్తున్నాయి. దళితులు అనగానే మన నాయకులు, మేధావులు వివక్షకి గురైన పౌరులుగానే చూస్తున్నారు. నిజంగా దళిత కులాల ప్రధాన సమస్య అంటరానితనమే. కాని, అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. ఇప్పుడు అంటరానితనం పూర్తిగా సమసిపోలేదు. అయినా కూడా దళితులు సామాజిక వివక్షనే కాకుండా ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కోరుతున్నారు. వాళ్లు కూడా విద్యా, ఉ్యదోగం, అభివృద్ధి, ఆధునిక జీవన శైలి వంటివి కోరుతున్నారు. అవన్నీ అందినప్పుడే నిజంగా కూడా వివక్ష దూరమయ్యేది. కేవలం అగ్రవర్ణాల వాళ్లు వచ్చిన పక్కన కూర్చుంటే, ముట్టుకుంటే దళితులకి ఒదిగేం లేదు. వాళ్లు సామాజికంగా, ఆర్దికంగా ఎదగాలి. మిగతా వారికి సమానం అవ్వాలి. సమాన హక్కులు, అవకాశాలు పొందాలి. అలా జరిగేలా చేయకుండా దళితుల కోసమే మేం వున్నామని ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అంబేద్కరిజం అమల్లోకి రాదు! అంబేద్కరిజం అంటే కేవలం ఉపన్యాసాలు, నినాదాలు మాత్రమే కాదు… అంతిమంగా దళితుల అభివృద్ధే అంబేద్కర్ వాదం!

రిజర్వేషన్స్… రాజకీయ అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మారిపోయాయా?

కేసీఆర్ ముస్లిమ్ లకు 12శాతం రిజర్వేషన్స్ అనటం… వెంటనే బీజేపి వారు మతాల ఆధారంగా రిజర్వేషన్స్ ఏంటంటూ అంతెత్తున్న ఎగరటం… రెండూ జరిగిపోయాయి. ఇక ఇప్పుడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సదరు రిజర్వేషన్ల పెంపు బిల్లును పాస్ చేయటమే మిగిలి వుంది. కాని, ఆ తరువాత బాల్ కేంద్రం కోర్టులోకి వెళుతుంది. కేంద్రం అడ్డుకుంటే సుప్రీమ్ కి వెళతామని కూడా కేసీఆర్ ప్రకటించారు. అసలు ఒకవైపు ముస్లిమ్ లకు రిజర్వేషన్లు పెంచుతామని చెబుతూనే… అవ్వి మతం ఆధారంగా ఇస్తోన్నవి కాదంటూ వెరైటీగా చెప్పుకొచ్చారు సీఎం! బీసీ ఈ కోటాలో ముస్లిమ్ లకు రిజర్వేషన్లు పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఎలా చెప్పినా టీఆర్ఎస్ టార్గెట్ ముస్లిమ్ లకు అవకాశాలు పెంచటమే! అది అందరికీ తెలిసిన విషయమే! దాన్ని ఇప్పుడు బీజేపి క్యాష్ చేసుకునే పనిలో పడింది. ముస్లిమ్ రిజర్వేషన్లను వద్దనగలిగే పార్టీ అదొక్కటే మిగిలింది తెలంగాణ అసెంబ్లీలో!   ముస్లిమ్ లకు మతం ఆధారంగా రిజర్వేషన్స్ ఇస్తే ఏమవుతుంది? కేంద్రాన్ని దాటుకుని సుప్రీమ్ లో తేల్చుకోవాల్సిన విషయం ఇది. అప్పటి వరకూ టీఆర్ఎస్ తాము రిజర్వేషన్స్ ఇచ్చామని ప్రచారం చేసుకుంటుంది. బీజేపి అడ్డుకున్నామని చెప్పుకుంటుంది. ఇలా రాజకీయ క్రీడ నడుస్తూనే వుంటుంది. కాని, ఏప్రెల్ 14… అంబేద్కర్ జయంతి వేళ… మనం ఈ రిజర్వేషన్స్ ని రాజకీయ అంశంగా కాకుండా సామాజిక అంశంగా కూడా చూడాలి! నేతల ఓటు బ్యాంక్ రాజకీయాలతో దేశానికి జరుగుతోన్న నష్టమేంటో కూడా చూడాలి! అసలు రిజర్వేషన్స్ ఎంత కాలం కొనసాగించాలి అన్న విషయంలో రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టత లేదు. అందుకే, మన నాయకులు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లవుతోన్నా రిజర్వేషన్ల అంశాన్ని బంగారు బాతులా చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా దాన్ని బయటకి తీసి కులాల మీద, మతాల మీద ప్రయోగిస్తున్నారు!   రిజర్వేషన్స్ అసలు ఉద్దేశ్యం పేదల విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంచటం. వార్ని ఆర్దికంగా, సామాజికంగా గౌరవప్రదమైన స్థానంలో వుంచటం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇప్పటికన్నా కుల వివక్ష ఎక్కువ వుండేది కాబట్టి రిజర్వేషన్స్ కులాల ఆధారంగా ఇచ్చారు. కాని, అప్పుడు కూడా మతాల ఆధారంగా రిజర్వేషన్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే కుల వివక్ష వున్నట్లుగా మత వివక్ష లేదు. పైగా మతం దృష్టితో రిజర్వేషన్స్ ఇస్తే దేశ సమగ్రతకి ముప్పని కూడా కొందరు భావించారు. తరువాతి కాలంలో మత రిజర్వేషన్లు చెల్లవని సుప్రీమ్ కూడా తేల్చేసింది. ఇంకా కొన్ని కేసులు ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం ముందున్నాయి. అయినా ఎక్కడికక్కడ మన ఓటు బ్యాంకు నేతలు రిజర్వేషన్లు పెంచుతామని హామీలు గుప్పించి రచ్చకి కారణం అవుతున్నారు!   తెలంగాణలో ముస్లిమ్ రిజర్వేషన్ల మాదిరిగానే ఆంధ్రాలో కాపుల్ని బీసీల్లో చేర్చటం అనే వివాదం కూడా వుంది. అసలు గొడవకి కారణం మతమైనా, కులమైనా నేతల దృష్టంతా ఎన్నికలు, ఓట్ల మీదే వుండటంలోనే వుంది. అంతకు మించి ఇంకేం వద్దనుకునే పరిస్థితి వుండటంతోనే రిజర్వేషన్ల వ్యవస్థలోని లోపాలపై ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నారు. కులాలు, మతాల ఆధారంగానే రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలి? పేదరికం ఆధారంగా ఎందుకు ఇవ్వకూడదు? రిజర్వేషన్స్ వల్ల కుల వివక్ష ఎంత వరకూ పోయింది? అసలు రిజర్వేషన్స్ కి, వివక్షకి ఏమైనా సంబంధం వుందా ? ఇలాంటి ప్రశ్నలు వేసే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు. అందుకు మంచి ఉదాహరణే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ముస్లిమ్ రిజర్వేషన్ల బిల్లు. అది కేంద్రం, సుప్రీమ్ లను దాటుకుని నిజమైన పేద ముస్లిమ్ లకు మేలు చేయటానికి ఎంత కాలం పడుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి!   డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకున్న స్వతంత్ర దేశంగా ఇప్పటికైనా రిజర్వేషన్ల పై సమగ్ర పునః సమీక్ష జరగాలి భారత్ లో. మరింత సమర్థంగా, ప్రతీ పేదవాడికి వాటి వల్ల లాభం కలిగేలా సంస్కరణలు తేవాలి. అలాగే, నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాలకు రిజర్వేషన్లు ఉపయోగపడకుండా నియమాలు రూపుదిద్దుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా, అంబేద్కర్ అకాంక్షించినట్టు … రిజర్వేషన్స్ అనేవి కుల వివక్ష సమసిపోయేలా వుండాలి. అందుకోసం ఏం చేయాలో అందరూ తక్షణం ఆలోచించాలి!

12శాతం ముస్లిమ్ జనాభాకు 12శాతం రిజర్వేషన్లు సాధ్యమా?

  ఎన్నికల సమయంలో ప్రతీసారీ వినిపించే పదం… రిజర్వేషన్స్! రాజ్యాంగంలో ఏ క్షణాన రిజర్వేషన్లు చేర్చారోగాని మన నేతలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అంశాన్ని వాడేసుకుంటూ వుంటారు. ఇప్పుడు ఆ వంతు తెలంగాణ శాసన సభకు వచ్చింది. ఏప్రెల్ 16న ముస్లిమ్ లు, గిరిజనులకి రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుందని అంటున్నారు!   ముస్లిమ్ లకి పన్నెండు శాతం రిజర్వేషన్ అంశం కేసీఆర్ ఎన్నికల సమయంలోనే లేవనెత్తారు. ఓట్ల కోసమో, నిజంగానే ముస్లిమ్ లలో పేదలున్నారన్న కారణంగానో ఆయన రిజర్వేషన్ల పెంపుకు మాటిచ్చారు. అయితే, ఈ అంశం కోర్టుల్లో గతంలో వీగిపోతూ వస్తోంది. మతం ఆదారంగా రిజర్వేషన్ ఇవ్వకూడదని న్యాయస్థానాలు చెబుతున్నాయి. దేశాన్ని ఏలుతోన్న బీజేపి కూడా ముస్లిమ్ లకు మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది. అయినా కేసీఆర్ తన వాగ్ధానంపై ముందుకే పోవాలని నిర్ణియించారు. త్వరలోనే శాసన సభ సమావేశమై ముస్లిమ్ లకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే బిల్లుకు అమోదం తెలుపనుంది. ఇక దీనికి బీజేపి నుంచి తప్పు ఇతర పార్టీల నుంచీ వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కూడా లేదు. ముస్లిమ్ ఓటు బ్యాంక్ ను దెబ్బ తీసే విధంగా ఏ పార్టీ కూడా కేసీఆర్ వేస్తున్న ఈ ఎత్తును ప్రతిఘటించదు. కాంగ్రెస్ టీడీపీ, అన్ని పార్టీలు తలూపవచ్చు!   తెలంగాణలో ముస్లిమ్ లు వున్నదే పన్నెండు శాతం. వారికి బీసీ కోటాలో పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తే దాదాపు మొత్తం అందరికీ రిజర్వేషన్లు వర్తిస్తాయనే! గిరిజనులైతే పది శాతానికి మించటం లేదట. వారికి కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ అంటే… జనాభా కంటే రిజర్వేషన్లు ఎక్కువగా వుంటాయని అర్థం! ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితే! అయితే, ఇంతా చేసి రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిమ్, గిరిజన రిజర్వేషన్ బిల్లు అమోదించేస్తే… తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశం లేదు! పార్లమెంట్ కు పంపాల్సి వుంటుంది. అక్కడ వున్న ఎన్డీఏ సర్కార్ అమోదం లభించాలి. బీజేపి మత రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి అది అంత తేలిగ్గా జరగకపోవచ్చు! ఇక ముస్లిమ్ రిజర్వేషన్లకు వున్న అంతిమ గండం కోర్టు! న్యాయస్థానంలో ఎవరు కేసు వేసినా తీర్పు ఎలా వుంటుందో మనం ఊహించవచ్చు!   ఏప్రెల్ 16న కేసీఆర్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు బిల్లు సభలో పెట్టినా… ఫలితం ప్రజల దాకా చేరేందుకు చాలా సమయమే పడుతుంది. అసలు రిజర్వేషన్ల పెంపు సాధ్యమా అనేది కూడా పెద్ద డౌటే! కాని, ఈ మధ్యలోనే రాజకీయంగా టీఆర్ఎస్ కు ఈ రిజర్వేషన్ల అంశం బాగా కలిసి రావచ్చు. ముస్లిమ్ లకు, గిరిజనులకు మేలు చేసేందుకు తాము కట్టుబడి వున్నామని పీలింగ్ కలిగించటానికి ఈ తతంగం బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ రిజర్వేషన్ల పెంపు కుదరకపోయినా బీజేపి, మోదీ సర్కార్ లను కారణంగా చూపిస్తూ వచ్చే ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవచ్చు!   వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ముస్లిమ్ రిజర్వేషన్ పేరుతో హామీలు ఇస్తూనే వున్నాయి. వాటి అమలు ఎలా వుందో కూడా అందరికీ తెలిసిందే! ఎక్కడా పేద ముస్లిమ్ లు చెప్పుకోదగ్గ స్థాయిలో బాగుపడటం లేదు. వారికి నిజంగా మేలు చేసే చర్యలు చేపడితే మంచిది. అంతే కాని, రాజకీయ దుమారానికి, కోర్టు కేసులకి అవకాశమిచ్చే పొలిటికల్ స్టంట్స్ వల్ల ఉపయోగం వుండదు!

ఆంధ్రా యువనేతని కాపాడేది… ఢిల్లీ పెద్దల ఆశీర్వాదాలేనా?

  జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు! ఇందులో పెద్ద విశేషం ఏంటి అంటారా? కరెక్టే… ఎలాంటి విశేషం లేదు! కాకపోతే, ఒక్కోసారి ఒక్కో నెపంతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే యువనేత ఈసారి సేవ్ డెమోక్రసీ అంటూ బయలుదేరారు! వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వటం అప్రజాస్వామికం అని ఆయన గడప గడపకూ తిరిగి వాదిస్తున్నారు! వాపోతున్నారు! అయితే, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే… జగన్ మనసులో మాట సేవ్ డెమోక్రసీ కాదు! తనని తాను సేవ్ చేసుకోవటం!   జగన్ ఇలా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవటం, ఇతర పార్టీల వార్ని కలవటం, వీలైతే ప్రధానితోనూ మాట్లాడి రావటం… ఇదీ ఇప్పటి తతంగం కాదు. యూపీఏ హయాంలోనూ సేమ్ టూ సేమ్ జరిగేది. కాకపోతే అప్పుడు అక్కడ సోనియా తప్ప అందరి అనుగ్రహమూ లభించేది! ఇప్పుడేమో మోదీ దర్శనం కూడా దొరకటం లేదు! అంతే తేడా!   జగన్ కాంగ్రెస్ ను విడిచి బయటకొచ్చిన రోజు నుంచీ ఆయనకున్న ఏకైక టెన్షన్ కేసులు! ఏ క్షణాన నోటిసులు వస్తాయో తెలియదు. ఏ క్షణాన ఆస్తులు జప్తు అవుతాయో అర్థం కాదు. ఇక ఇప్పుడైతే ఏ నిమిషం బెయిల్ రద్దు అవుతుందోనన్న భయం! ఇదీ పరిస్థితి. దీనికి ఉపశమనంగానే జగన్ ఢిల్లీ వెళ్లి వస్తుంటారు! మనసు బాగాలేనప్పుడు వాతావరణ మార్పు కోసం కొత్త ఊరు వెళ్లినట్టు ఆయన దేశ రాజధాని ఎంచుకున్నారు! పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని తిరిగి వస్తుంటారు. కాని, ఒక్కసారి రాష్ట్రంలో కాలుపెట్టాక మాత్రం మళ్లీ పాత సీనే! టీడీపీ వాళ్ల భీభత్సమైన దాడితో రాజకీయంగా చిరాకు, కోర్టు వ్యవహారాల కారణంగా లీగల్ టెన్షన్….   జగన్ రాష్ట్రపతిని కలిసి మోదీతో కూడా భేటీ కావాలని ప్రయత్నిస్తున్నారట. 2014లో బీజేపికి జై కొట్టిన పవన్ ఇప్పుడు ఏకు మేకయ్యాడు కాబట్టి జగన్ తనని అక్కున చేర్చుకోమని కోరనున్నట్టు టాక్. కాని, కొంత మంది విశ్లేషకులు మాత్రం బీజేపి వైసీపీని విలీనం చేయమంటోందని అంటున్నారు. అలా చేస్తే జగన్ భవిష్యత్ మరింత అంధకారమయం అయ్యే సూచనలే ఎక్కువ. అందుకే, ఎలాగైనా పార్టీని కాపాడుకుంటూ బీజేపితో దోస్తి చేయాలని జగన్ తాపత్రయపడుతున్నారట! కాని, ఏపీలో ఆల్రెడీ టీడీపీతో పొత్తులో వున్న కమల దళం జగన్ తో జోడీ కట్టే రిస్క్ ఎందుకు చేస్తుంది? పైగా జగన్ మద్దతు తీసుకుని అతడ్ని వెనకేసుకొస్తే అవినీతిని సమర్థించినట్టు చెడ్డపేరు కూడా తప్పదు!   బీజేపీ, మోదీల అనుగ్రహం జగన్ కి దక్కుతుందో లేదో… అలాగే, ఆయన ఎత్తుకున్న సేవ్ డెమోక్రసీ నినాదం నిలబడుతుందో లేదో…  ఏది ఏమైనా ఎన్నికల కంటే వేగంగా తరుముకొస్తున్న కోర్టు కేసులు మాత్రం జగన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నది నిజం! 2019 ఎలక్షన్స్ కంటే ముందే జైలు నుంచి పిలుపొస్తే… సేవ్ డెమోక్రసీ కంటే ఎక్కువగా అవసరమయ్యేది సేవ్ జగన్ నినాదం!

రాజా సింగ్… రాజుకుంటున్న కాషాయ ఫైర్ బ్రాండ్

బీజేపి అధికార చిహ్నం … కమలం! కమలానికి చాలా రెక్కలుంటాయి! అవ్వి ఒక్కోటి ఒక్కో సైజులో, రూపంలో వుంటూ వుంటాయి! ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కమలదళ నాయకులు కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వ్యూహం అమలు చేస్తుంటారు! ఒకవైపు మోదీ, పారికర్, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వారు అభివృద్ధి అంటూ మత సంబంధమైన విషయాలకు దూరంగా వుంటే… మరో వైపు గిరిరాజ్ కిషోర్, సాక్షి మహారాజ్ లాంటి వారు వీలైనప్పుడల్లా హిందూత్వ కామెంట్స్ చేస్తూ బోలెడంత కలకలం రేపుతుంటారు. తాజాగా వారి జాబితాలో చేరిపోయాడు మన తెలుగు కాషాయ ఎమ్మెల్యే రాజా సింగ్!   రాజా సింగ్ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే. ఆయన ఒంటరిగా ఎంఐఎం ను ఎదుర్కుంటూ వుంటాడని చాలా మంది అభిప్రాయం. క్షేత్రస్థాయిలో కూడా హిందువులకు ఎప్పుడూ అందుబాటులో వుంటాడని చెప్పుకుంటారు. అందుకే, ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. రేపో మాపో అమిత్ షా హైద్రాబాద్ పై , తెలంగాణ పై దృష్టి పెడితే రాజా సింగ్ కీలకమయ్యే అవకాశాలు కూడా వున్నాయి. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ లాంటి సాఫ్ట్ లీడర్ కాదు రాజా భాయ్! కరుడుగట్టిన హిందూత్వవాది. బీజేపి వారికి ఉత్తరాదిలో వుండే అనేక మంది కట్టర్ హిందూ నాయకుల లాంటి మాస్ లీడర్! అదే ముందు ముందు రాజా సింగ్ కు రాజా యోగం పట్టించినా ఆశ్చర్యం లేదు!   రాజా సింగ్ డేరింగ్ అండ్ డాషింగ్ అప్రోచ్ ఫ్యూచర్లో ఆయనకు మంచి చేస్తే చేయొచ్చేమో కాని ఇప్పుడైతే ఇబ్బందులే తెచ్చిపెడుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఓల్డ్ సిటీలో జరిగిన శోభా యాత్రలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణానికి అడ్డు పడితే తలలు నరుకుతామని ఘాటుగా హెచ్చరిక చేశారు. ఇది ఏ వర్గాన్ని ఉద్దేశించిందో అర్థం చేసుకోటానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు కదా! ఆ వర్గం నుంచే ఒకాయన డబీర్ పురా పీఎస్ లో కేసు కూడా పెట్టాడు! అయితే, రాజా సింగ్ కు కేసులే కాదు జైలు కూడా కొత్త కాదు! ఆయన సమైక్యాంధ్రప్రదేశ్ ని కాంగ్రెస్ పాలించిన పదేళ్లలో అనేక సార్లు ఊచలు లెక్కించారు. ఎంఐఎం ఒత్తిడి మేరకే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజా సింగ్ ను పదే పదే జైలు కి పంపిన దాఖలాలున్నాయి. కాని, అవన్నే రాజా సింగ్ కు పాత బస్తీలో ఇమేజ్ ను , ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి!   రామ మందిర విషయంలో కమలం నాయకులు అవసరాన్ని బట్టీ ఘాటుగా, స్మార్టుగా మాట్లాడటం మామూలే! కోర్టు తేల్చుతుందని చెప్పే వారు మొదలు తలలు తెగుతాయని బెదిరించే వారి దాకా అందరూ ఒకే పార్టీలో కనిపిస్తారు మనకు! అందులో రెండో రకమే రాజా సింగ్! ముందు ముందు ఈ ఫైర్ బ్రాండ్ కాషాయ లీడర్ అమిత్ షా ఎలా ఉపయోగించుకుంటారో … వేచి చూడాలి! 

చిరంజీవి విషయంలో క్లారిటీ ఇచ్చిన పల్లం.. నిజమేనా!

  2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాభవం చెందినప్పటినుండి, చిరంజీవి పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన పార్టీ మారే సూచనలు ఉన్నాయని కొందరు అభిప్రాయ పడ్డారు. ఇంకొందరయితే, తమ్ముడు పవన్ కళ్యాణ్ జన సేన పార్టీలో చేరుతాడని జోస్యం చెప్పారు. అయితే, ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తన పార్టీ లో చేరే అవకాశమే లేదని గట్టిగా చెప్పారు. ఒక వేళ చిరంజీవి కి నిజంగా జన సేన పార్టీలో చేరే ఉద్దేశ్యం ఉన్న కూడా తమ్ముడి స్టేట్మెంట్ తో నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి. మరి చిరు దారి ఎటు వైపు. కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతారా, లేదంటే వేరే పార్టీలోకి జంప్ అవుతారా?   ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి చిరంజీవి గైర్హాజరవడం అనేక సందేహాలకు తావిచ్చినట్టయింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్, సీనియర్ నేత కుంతియా, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, సి.రామచంద్రయ్య, కిల్లి కృపారాణి, పల్లం రాజు తదితరులు హాజరుకాగా చిరంజీవి మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.   కేంద్ర మాజీ‌మంత్రి పల్లం రాజు చిరంజీవి విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. "వ్యక్తిగత కారణాలవల్లే చిరంజీవి సమావేశానికి హాజరుకాలేదు. ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని, ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటారని," మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మరి చిరుకి నిజంగా పార్టీలో కొనసాగే ఉద్దేశ్యమే ఉంటే, ముఖ్యమైన పార్టీ కార్యకలాపాలకి కూడా ఎందుకు రావట్లేదు అనేది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న.   ఇప్పటికి స్తబ్దుగా ఉన్న చిరంజీవి, 2019 లో ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని, తన నిర్ణయం వచ్చే సంవత్సరం వెలిబుచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన సినిమాలు, టీవీ షోలతో బిజీ గా ఉన్నారు. ఖైదీ నం 150 పెద్ద హిట్ అవడంతో, ఈ ఒకటి రెండు సంవత్సరాలలో వీలయినన్ని మంచి సినిమాలు చేయడం ద్వారా తన అభిమానుల సంఖ్య మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, పొలిటికల్ మైలేజ్ పెంచుకోవంటే మాత్రం సినిమాలో, టీవీ షోలో సరిపోవు. జనాల్లోకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. దానికి ముందు, కాంగ్రెస్ లో ఉంటారా, లేక వేరే ఇతర పార్టీ వైపు వెళ్తారా అనే విషయంలో త్వరితమైన నిర్ణయం తీసుకోవాలి!