అసలు మ్యాచ్ కు ముందు ఫ్రెండ్లీ మ్యాచ్… అవిశ్వాస తీర్మానం!

ఇప్పుడు తెలుగు మీడియా, హిందీ మీడియా, ఇంగ్లీషు మీడియా అన్న తేడా లేకుండా అంతటా ఒకటే చర్చ! అదే… పార్లెమంట్లో అవిశ్వాస తీర్మానం! చివరకు, ప్రభుత్వ మనుగడకి  కూడా ఈ అవిశ్వాస తీర్మానం మూలంగా మారటంతో స్టాక్ ఎక్స్ ఛేంజ్ కూడా షేక్ అవుతోంది. నష్టాల్లో ముగుస్తోంది. అయితే, నిజంగా ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ఎఫెక్ట్ ఎంత? దీని తక్షణ ఫలితాలు, రాజకీయ పరిణామాలు ఏంటి?     కేంద్ర ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం గండం అంటే దేశమంతా అలెర్ట్ అవుతుంది. అందుక్కారణం ఒకవేళ ప్రస్తుతం వున్న సర్కార్ కూలితే అన్ని రంగాలు ఒడిదుడుకులకు లోనవుతాయి. కానీ, దాదాపు ఒక దశాబ్దమున్నర తరువాత ఎన్డీఏ ఎదుర్కొంటోన్న బల పరీక్ష గవర్నమెంట్ కూలిపోయేంత ప్రమాదకరమైందేం కాదు. అందుకే, ఒక విధంగా మోదీ, అమిత్ షా నింపాదిగా వున్నారు. స్వయంగా కమలదళానికే మ్యాజిక్ ఫిగర్ దాటేంత శక్తి వుంది. అయినా చిన్నా చితక రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా మద్దతిచ్చేందుకు చాలా పార్టీలే ఎన్డీఏ  లోపలా, బయటా వున్నాయి. కాబట్టి అవిశ్వాస తీర్మానం వల్ల తక్షణం జరిగే గొప్ప మార్పులేం వుండవు. అయితే, అవిశ్వాస తీర్మానం రానున్న సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఎలా వుండబోతోందో స్పష్టం చేయనుంది. ఎటు వైపు ఎవరు మోహరించి యుద్ధం చేస్తారో దాదాపుగా తేలిపోతుంది! 2014లో మోదీ నేతృత్వంలోని బీజేపికి క్లియర్ మెజార్టీ వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే, ఈసారి అలాంటి పరిస్థితి వుంటుందా అంటే… అనుమానమే! మోదీపై ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేయనుంది. అందుకే, మోదీకి భాగస్వామ్య పక్షాల అవసరం వుంది. కానీ, అమిత్ షా దూకుడు, మోదీ విధాన పరమైన నిర్ణయాల వల్ల టీడీపీ లాంటి కీలక పక్షాలు ఎన్డీఏకి దూరమయ్యాయే తప్ప కొత్త పార్టీలేం రాలేదు. ఎన్డీఏలోకి వచ్చిన నితీష్ కుమార్ కూడా 2019 ఎన్నికల్లో ఎటువైపు వుంటారో క్లారిటీ ఇవ్వటం లేదు! ఎన్డీఏలో ఇప్పటికీ వున్న శివసేన, అకాళీదళ్ లాంటి పార్టీలు కూడా బీజేపీ పెద్దన్న మనస్తత్వం జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా , అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఇప్పుడు వస్తుండటంతో ఎవరు మోదీ వైపో, ఎవరు కాదో తేలిపోనుంది!     జాతీయ స్థాయిలో అందరి దృష్టి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వుంది. కానీ, ఏపీలో మాత్రం టీడీపీ కోణం నుంచే రాజకీయం నడుస్తోంది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అవిశ్వాస తీర్మాన రాజకీయం చేశారు. అది ఫలించి మోదీ చర్చకు సై అన్నారు. కాకపోతే, ఈ అవిశ్వాస తీర్మానం ఎవరి నిజ స్వరూపం ఏంటో తేల్చేసింది. టీఆర్ఎస్ నిన్న మొన్నటి వరకూ టీడీపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు అనుకూలంగానే మాట్లాడినా అవిశ్వాసానికి మాత్రం మద్దతిచ్చేది లేదని తేల్చేసింది. ప్రత్యక్షంగానే మోదీకి సపోర్ట్ చేస్తోంది. ఇదే దారిలో అన్నాడీఎంకే కూడా వుంది. జయలలిత మరణం తరువాత పూర్తిగా మోదీ అదుపాజ్ఞల్లో వుంటోన్న ఆ పార్టీ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయమని తేల్చింది. ఇలాగే ఇంకా కొన్ని పార్టీలు వున్నాయి. ఒడిషాలోని బీజూ జనతాదళ్ ఎటూ తేల్చటం లేదు. అయితే, ఓటింగ్ టైంలో ఆ పార్టీ వారు గైర్హాజరై మోదీకి పరోక్షంగా సాయపడతారనే టాక్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా వున్న మోదీ వ్యతిరేక, అనుకూల పార్టీలు ఏవో తేలటమే కాదు… అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీలోని అసతంతృప్తుల సత్తా ఏంటో కూడా తేలిపోనుంది! శతృఘ్న సిన్హా లాంటి వారు నిత్యం మోదీ వ్యతిరేక కామెంట్లు చేస్తూ వచ్చారు ఇంతకాలం. ఇలాంటి వారొక ఆరుగురు వుంటారని అంచనా. ఈ రెబెల్స్ ను తమవైపుకు లాగాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అది ఫలిస్తుందా లేదా అన్నది కూడా ఓటింగ్ టైంలో తేలిపోతుంది. కానీ, శతృఘ్న సిన్హా తన ఓటు ఎన్డీఏ సర్కార్ కి అనుకూలంగానే వుంటుందని ఇప్పటికే చెప్పేశారు!     అవిశ్వాస తీర్మానికి అటు కాంగ్రెస్ చెబుతోన్న కారణాలు, ఇటు టీడీపీ చెప్పిన ప్రత్యేక హోదా ఏవీ కూడా బల పరీక్ష కారణంగా నెరవేరే అవకాశాలు లేవు. అలాగని మోదీ ప్రభుత్వం కూలే ఛాన్స్ కూడా లేదు. ఈ పార్లమెంట్ యుద్ధం కేవలం రానున్న బ్యాలెట్ యుద్దానికి మూడ్ సెట్ చేసేలా మాత్రమే వుంది! ఒక విధంగా ఇది అసలు టోర్నమెంట్ కు ముందు ఫ్రెండ్లీ మ్యాచ్ అనుకోవచ్చు! అయినా కూడా చాలా పార్టీలు, నాయకులు ఆశిస్తున్నట్టు 2019లొ మోదీని అడ్డుకోవటం ఎంత వరకూ సాధ్యం? ఇది మాత్రం అస్సప్టంగా అయినా ఈ బలపరీక్షతో తెలిసిపోనుంది!

అవిశ్వాస ఆయుధం..

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై అవిశ్వాసం రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.....ఆశలు నెరవేర్చని ప్రభుత్వాలపై సంధించే ఓ అస్త్రం. ఏలికలు సక్రమంగా పాలన చేయడం లేదని భావించిన పార్టీలు అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించడమే అవిశ్వాస తీర్మానం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అంశంపై, అధికార బిజేపిపై,  ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై బుధవారం నాడు అవిశ్వాస అస్త్రాన్ని తెలుగుదేశం పార్టీ ప్రయోగించింది. తొలుత ఈ తీర్మానంపై చర్చకు పదిరోజులు గడువు కావాలన్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం నాడే చర్చకు అనుమతించారు. ఈ పరిణామం బిజేపి రాజకీయ ఎత్తుగడో, మరొకటో తేలాల్సుంది. శుక్రవారం నాటి అవిశ్వాసానికి వ్యతిరేకంగా బిజేపికి ఉన్న బలం 312 మంది. ఇక మోదీ ప్రభుత్వం పై తమకు విశ్వాసం లేదంటున్న వారు 141 మంది. అటూ, ఇటూ కాకుండా అవిశ్వాసంపై ఏటూ తేల్చని సంఖ్య 80.     తెలుగుదేశం ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, కొనకళ్ల లోక్‌సభలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం కనీసం అమోదానికి కూడా రాకుండా సభలో గందరగోళం జరిగింది. ఆ సమయంలో బిజేపి వ్యూహాత్మకంగా తమిళనాడు ఎంపీలతో కావేరి సమస్యపై సభను అడ్డుకునేలా చేసింది. ఈసారి మాత్రం చర్చకు అనుమతి వచ్చేలా చేసారు. దీని వెనుక బిజేపి వ్యూహమేమిటో తర్వాత తెలియాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తాజా అవిశ్వాసంతో కలిపి 27 సార్లు ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మాన ఆయుధాన్నిప్రయోగించారు. భారత్-చైనా యుద్ధం తర్వాత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం పై ఆచార్య క్రుపాలానీ తొలిసారిగా 1963లో అవిశ్వాస తీర్మానం పెట్టారు.       ఆ తర్వాత 1967 లో అప్పటి ప్రధాని ఇందిర గాంధీపై భాజపా నేటి సీనియర్ నేత వాజ్‌పాయ్ తొలిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. దేశంలో  ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధాని ఇందిరా గాంధీయే. తన హయాంలో ఇందిర 15 సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఆమె తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, పి.వి. నరసింహారావులు మూడేసి సార్లు అవిశ్వాసం పాలయ్యారు.     అవిశ్వాసం పై చర్చ పూర్తి కాకుండానే తన పదవికి రాజీనామ చేసింది  మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే. 1979 లో జరిగిన ఈ చర్య  మొరార్జీ దేశాయ్ నైతికతకు అద్దం పడుతుంది. ఇక రాజీవ్ గాంధీ, వాజ్‌పాయ్,  ప్రస్తుత ప్రధాని మోదీ అవిశ్వాస ఆయుధాన్ని ఒక్కోసారే ఎదుర్కున్నారు.శుక్రవారం జరిగే అవిశ్వాస తీర్మాన చర్చలో పాల్గొనాలని లోక్‌సభకు విధిగా హాజరుకావాలని బిజేపి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసాయి.     అవిశ్వాసంపై చర్చ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చామో చెప్పేందుకు బిజేపి లెక్కలు తీస్తోంది. అలాగే ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన నిధులు, రావాల్సిన బాకాయిలపై రాజధాని అమరావతిలో అధికారులు లెక్కలు తీస్తున్నారు. మొత్తానికి ఈ అవిశ్వాసం ఓ చరిత్రకానుంది.   నిరంతరం సంచలన వ్యాఖ్యాలతో వార్తల్లో ఉండే తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు జే.సి. దివాకర్ రెడ్డి ఈ అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటాననడం  కొసమెరుపు.

మంద న్యాయానికి కారణం ఏంటి? మందగిస్తున్న న్యాయమేనా?

మొబోక్రసీ… డెమొక్రసీ తెలుసుగానీ ఇదేంటి అంటారా? అచ్చ తెలుగులో చెప్పుకుంటే మంద న్యాయం! ఒక్కరిపైనో, ఇద్దరిపైనో, లేదా కొందరిపైనో… ఓ మంద అమాంతం దాడి చేసి చావబాదటం. ఆగ్రహం తప్పకపోతే చంపేయటం! ఇదీ క్లప్తంగా మొబోక్రసీ! ఈ పదం సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టు వాడి మరీ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. జనం మందలుగా మారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటాన్ని అరికట్టాలనీ అభిప్రాయపడింది. అందుకు తగిన చట్టం కూడా చేయాలని పార్లమెంట్ కు సూచించింది. అంతలా మొబొక్రసీ పెచ్చరిల్లిపోతోంది.     అత్యున్నత న్యాయస్థానం గోరక్షకుల ముసుగులో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడింది. కానీ, మందగా ఎగబడి అమాయకుల్నో, నేరం చేసిన వార్నో జనమే చంపేయటం చాలా చోట్ల జరుగుతోంది. గోరక్షకులు ఎవరిపైనైనా దాడి చేస్తే రాజకీయ కారణాల చేత సెక్యులర్ పార్టీలు చర్చ లేవదీస్తున్నాయి. కానీ, మిగతా సందర్భాల్లో అందరూ నిశ్శబ్ధంగా వుండిపోతున్నారు. గోరక్షకులు ముస్లిమ్ లనో, దళితుల్నో్ కొడతారు కాబట్టి పార్టీలు మాట్లాడుతున్నాయి. బీజేపిని టార్గెట్ చేస్తున్నాయి. కానీ, చాలా సందర్భాల్లో గోరక్షకులు కాని వారు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. విపరీతమైన కోపం వల్లో, లేదంటే నేరం చేశారని భావిస్తున్న వారిలోని అమానుషత్వం పట్ల కసితోనో జనం ఇలా చేస్తున్నారు. మందలుగా మీదపడి చంపేయటంలో చాలా సందర్భాల్లో దురుద్దేశాలు వుండకపోవచ్చు. కానీ, అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడిచే ఒక దేశానికి , సమాజానికి శ్రేయస్కరం కాదు. ఇది ప్రభుత్వం, ప్రజలు గమనించాలి.     ఒకవైపు కోర్టు మంద న్యాయంపై చట్టం తీసుకుర్మమని సూచిస్తుండగానే చెన్నైలో లాయర్లే ఆవేశంతో ఊగిపోయారు. మైనర్ ని ఏడు నెలల పాటూ పదిహేడు మంది అత్యాచారం చేశారని తెలిసి చావగొట్టారు. వారి ఆవేశంలోని నిజాయితీని, బాధని శంకించలేం. కానీ, అదే సమయంలో లాయర్లే ఇలా తక్షణ శిక్షలకి సిద్ధపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? కోర్టులు, జైళ్లు ఎందుకు? అత్యాచారం చేసిన వారు ఖచ్చితంగా రాక్షసులే. కానీ, వార్ని కొట్టి చంపేయటం రాజ్యాంగబద్ధమైన చర్య కాదు కదా! ఇప్పుడు చర్చ జరగాల్సింది దీనిపైనే.     మంద బలంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటంలో మరో కోణం కూడా వుంది. కోర్టు రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని చెబుతుండగానే జార్ఖండ్ లో స్వామీ అగ్నివేష్ పై దాడి జరిగింది. ఆయన మాటలు హిందువులు, హిందూత్వవాదానికి వ్యతిరేకంగా వున్నాయని దాడి చేసిన వారి వాదన. ఒకవేళ అదే నిజమైనా రోడ్డు మీద పడేసి కొట్టడం, ప్రాణాలకే హాని తలపెట్టడం…ఎంత మాత్రం అంగీకారం కాదు. మైనర్ ని రేప్ చేసిన వారిపై లాయర్ల దాడి ఒక కోణం అయితే, స్వామి అగ్నివేష్ పై దాడి మరో కోణం. ఈ రెండూ ప్రమాదకరమే. అయితే, గోరక్షకుల దాడులు, స్వామి అగ్నివేష్ పై దాడి వంటివి కొంత వరకూ ప్లాన్డ్ గా జరుగుతాయని ఒప్పుకోక తప్పదు.     బాగా ఆలోచిస్తే జనం ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటానికి ప్రధాన కారణాలు… మందగా మారి ఎవరిపై దాడి చేసినా శిక్షలు కఠినంగా పడే ఆస్కారం లేకపోవటం. దీనికి కఠినమైన కొత్త చట్టం పరిష్కారం చూపుతుంది. దురుద్దేశాలతో దాడులు చేసే వారు భయపడేలా తీవ్రమైన శిక్షలు వుంటే రౌడీ మూకలు చాలా వరకూ వెనక్కి తగ్గుతాయి. ఇక నిజంగా కొన్ని సందర్భాల్లో జనం కడుపు మండిపోయి దారుణమైన నేరాలు చేసిన వారిపై దాడులు చేయటం మన న్యాయ వ్యవస్థ లోపాల్ని ఎత్తి చూపుతుంది. నిర్భయ రేపిస్టులు , హంతకులు ఇంకా బతికే వున్నారు. అందులో ఒకడైతే మైనర్ అని చెప్పి కొందరు లాయర్లు వాడ్ని మూడేళ్ల శిక్షతో బయటపడేశారు. ఇలాంటివి జనాల మనస్సులో గాయాలు రేపుతున్నాయి. న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి. ఒకవేళ న్యాయం దక్కినా ఏళ్ల తరబడి జరిగే విచారణ సగటు భారతీయుడ్ని వెక్కిరిస్తుంది. ఈ కారణాలే జనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరం చేశారని భావింపబడుతోన్న వార్ని రోడ్డు మీదే అంతం చేసేలా చేస్తున్నాయి. తాము చావబాదకపోతే, చంపకపోతే కోర్టులు, జైళ్లు నేరస్థుల్ని కాపాడతాయని జనం అనుమానం. కాదంటే నమ్మకం. ఇది పోవాలి. పోయేలా న్యాయవ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలి. నేరం చేసిన వాడు తప్పించుకోలేని స్థితి రావాలి. సత్వరం శిక్షలు పడాలి. లేదంటే జనం ఆవేశాన్ని ఏ కొత్త చట్టమూ శాంతింపజేయలేదు. న్యాయం మందగించినంత కాలం మంద న్యాయమూ వుంటూనే వుంటుంది!

మహిళలు మన్నించకండి... క్షమించకండి...

ఈ దేశంలో ఆడ పిల్లలుగా పుడుతున్నందుకు.... మృగాళ్ల  చేతుల్లో నలిగిపోతున్నందుకు.... దేశంలో మహిళల్లారా ఇక్కడి మగవాళ్లని మన్నించకండి. జన్మనిచ్చిన అమ్మని కూడా వదలని రాక్షస దేశంలా మారుతున్నందుకు క్షమించకండి. అన్నెం... పున్నెం ఎరుగని... ఆటలు... పాటలు... చదువు తప్ప తెలియని పసి మొగ్గలను కూడా చిదిమేస్తున్న మగ మ్రగాలు నానాటికి పెరిగిపోతున్న కాలం. ముదుసలి వయసులో కన్నూమిన్నూ కానక మగవాళ్లు చేస్తున్న దారుణాలు దేశ ప్రజలని కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేదు.... ప్రదేశంతో పని లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే పరిస్థితి. ఆ రాష్ట్రం... ఈ రాష్ట్రం అని బేధం లేదు. దేశ రాజధాని నుంచి ప్రతి చోటా మహిళలపై.... చిన్నారులపై అనాగరిక చర్చలే. చెన్నైలో పన్నెండేళ్ల చిన్నారిపై ఏడు నెలలుగా 24 మంది కామాంధులు పాశవికంగా జరిపిన అత్యాచారం దేశంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడే చర్య. బాధితురాలు వినికిడి లోపంతో బాధ పడుతోంది.     చెన్నైలోని అయనావరం కున్నూరు హైరోడ్డులోని సయానీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో 14 అంతస్థుల సన్నివేల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లో చాలా ఫ్లాట్లు ఖాళీవే. అక్కడే లిప్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్న 66 ఏళ్ల ముదుసలి రవికుమార్ ఈ చిన్నారిపై కన్ను వేశాడు. నిత్యం పాఠశాలకు వెళ్లేందకు ఆ చిన్నారిని లిప్ట్‌లో కిందికి దిగి బస్పులో వెళ్తుంది. ఏడు నెలల క్రితం ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసాడు. ఈ విషయం బయట పెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ చిన్నారిది మూగరోదనగానే మిగిలింది. ఆ తర్వాత మరికొందరితో కలిసి ప్రతి రోజూ ఆ చిన్నారికి నరకం చూపించారు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి... చిన్నారిపై అత్యాచారం చేసి వాటిని సెల్‌ఫొన్లలో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించారు. ఇలా చిన్నారిని చిదిమేసిన వాళ్లు 24 మంది. ఊరి నుంచి వచ్చిన తన అక్కకు విషయం తెలియడంతో  వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారిలో లిప్ట్ ఆపరేటర్‌తో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.     దేశంలో నిర్భయ చట్టం ఉంది. దేశంలో దోషులకు కఠిన శిక్షలు వేసే చట్టాలూ ఉన్నాయి. అయినా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. పైగా అవి నానాటికి పెరుగుతున్నాయి. దీనికి కారణం చట్టాలున్నా అవి పటిష్టంగా లేకపోవడం. తప్పు చేసిన వారిని అరెస్టు చేసినా రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తామనే భరోసా ఉంది. వారి తరఫున తిమ్మిని బమ్మిని చేస్తూ వాదించే న్యాయవాదులున్నారు. ఇదే కారణం. ఇదే భరోసా. ఇదే దీమా. అందుకే దేశంలో ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారికి శిక్షలు వేయాలి తప్ప అవి మరణ శిక్షలు కాకూడదనే మానవ సంఘాలూ ఉన్నాయి. అలా వాదించే వారికి ఏడు నెలలుగా ఆ చిన్నారి అనుభవించిన నరకం గుర్తుకు రాదు. అలా సమర్ధించే వారికి ఆ చిన్నారి మనోవేదన పట్టింపునకు రాదు.     ఇదీ మన వ్యవస్ధ. ఇదీ మన దౌర్భాగ్యం. ఇదీ మన దుస్థితి. ఈ స్థితిలో మార్పు రావాలంటే మనిషిలో మార్పు రావాలి. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా ఉండాలి. వాటిని పటిష్టంగా అమలు చేసే వ్యవస్ధ కావాలి. ఇందుకోసం పాలకులు కఠినంగా వ్యవహరించాలి. ప్రజలు కూడా బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాలి. నిందితులను కోర్టులో హాజరు పరిచే సమయంలో అక్కడి న్యాయవాదులు వారిపై విరుచుకుపడ్డారు. వారిని మెట్లపై నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చారు.  చెన్నై సంఘటనలో ఓ చిన్న ఆశాజనకమైన అంశం... అక్కడి న్యాయవాడులెవరూ నిందితులకు అనుకూలంగా వాదించమని చెప్పడం. ఈ కేసును ఎవరూ చేపట్టమని ప్రకటించడం.

హిమ దాస్ … సవాళ్ల మీద పరుగు తీసిన సంచలనం! 

అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించరు! అద్భుతం జరిగాక ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు! భారత్ కు అధ్లెటిక్స్ లో తొలి స్వర్ణం సాధించి పెట్టిన హిమ దాస్ … అలాంటి ఓ అద్భుతం! ఆమె తమ వరి పొలాల్లో తెల్లెవారుఝామున చెప్పులు సైతం లేని అరికాళ్లతో పరుగులు పెడుతుంటే… దేశంలో ఎవ్వరూ ఆమెని గుర్తించలేదు. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ పొటీల్లో స్వర్ణం సాధించింది. మనతో సహా అందరం తెగ మాట్లాడుకుంటున్నాం! కానీ, అవేవీ ఆమెకు పెద్దగా ఉపయోగపడేవి కావు. స్వంతంగా ధగధగ మెరిసే తారజువ్వలా ఆకాశానికి ఇప్పటికే ఎగిసిపోయింది!     హిమ దాస్ ఈ మద్య కాలంలో భారతదేశం నుంచి తళుక్కున మెరుస్తోన్న క్రీడాకారిణుల్లో ఒకరు! అంతే అయితే ఇంతగా మాట్లాడుకోవటం అనవసరం. సంవత్సరంలో జరిగే అనేక క్రికెట్ టోర్నమెంట్లలో అడపాదడపా కొత్త క్రికెటర్లు వస్తూనే వుంటారు. అభిమానుల్ని తమ విన్యాసాలతో కట్టిపడేస్తుంటారు. అలాగే, సానియా, సైనా, సింధూ ఇలా బోలెడు మంది ఇతర క్రీడల్లోని ఛాంపియన్స్ కూడా మనల్ని మెస్మరైజ్ చేస్తుంటారు. కానీ, హిమ దాస్ విజయం కేవలం క్రీడలకు సంబంధించిన అద్భుతం కాదు. అదీ ఇక్కడి ప్రత్యేకత! కేవలం పట్టుదలనే తన కాలికి బూట్లుగా తగిలించుకుని దీక్ష అనే ట్రాక్ పై రన్నింగ్ చేసింది హిమ! అందుకే, ఆమె జీవితంలో ఏ రంగంలో ప్రయత్నం చేస్తోన్న వారికైనా అద్భుతమైన ప్రేరణ! ఆమె ఆటల్లో విజయం సాధించి వుండవచ్చు. కానీ, హిమ దాస్ విజయం మాత్రం ఓ ఆట కాదు!     హిమ దాస్ ఏ ముంబై, దిల్లీ లాంటి సకల సౌకర్యాలున్న మహానగరంలోనో పుట్టలేదు. ఈశాన్య భారతదేశంలో మారుమూలన వున్న ఆసోంలో పుట్టింది. ఆమె ఊరు థింగ్. తండ్రి వరి పండించే రైతు. పొలంలో పండేది అన్నమే అయినా వారికి కడుపునిండా ఆహారం వుండేది కాదు. అలాంటి రైతులు మనకు కొత్తేం వుంది? ఏ రాష్ట్రంలో చూసినా రైతులు ఎలా ఇబ్బందులు పడుతుంటారో అలాంటి ఓ సగటు భారతీయ రైతే హిమ దాస్ తండ్రి. కానీ, ఆయన కూతురు మాత్రం సగటు భారతీయ అమ్మాయి కాదు. సగటు భారతీయ అమ్మాయిలో పట్టుదల భగ్గుమంటే ఎలా వెలిగిపోతుందో కళ్లారా చూపించిన వెలుగు దివ్వె! మొదట ఫుట్ బాల్ బాగా ఆడిన హిమ తండ్రితో పాటూ పొలంలో నేల దున్నేది, విత్తనాలు వేసేది, ట్రాక్టర్ నడిపేది. కానీ, ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు బంతి వెంట సుడిగాలిలా దూసుకుపోతోన్న ఆమె వేగాన్ని ఓ ఉపాధ్యాయుడు గమనించాడు. అథ్లెటిక్స్ కి మారి పరుగు పందంపై దృష్టి పెట్టమన్నాడు! అదే హిమ దాస్ ని రైట్ ట్రాక్ పైకి తీసుకొచ్చింది.       తమ స్వగ్రామం నుంచీ అసోం రాజధాని గువాహటీకి చేరుకుని ఓ దాత ఇచ్చే డబ్బులతో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విజయాలు నమోదు చేసింది. హిమ దాస్ ని ఇంటి నుంచి గువాహటీకి పంపేటప్పుడు ఆమె తండ్రి అంతర్జాతీయ స్వర్ణాలు ఆశించలేదు. నలుగురు సంతానంలో ఆమె అన్నా ఇంటికి దూరంగా వుంటూ మూడు పుటలా సరిగ్గా అన్నం తింటుందని భావించాడు! అలాంటి పేదరికం వారిది! అయినా, భూమిపై కదిలే మానవ రాకెట్ లా దూసుకుపోయే హిమని దారిద్ర్యం అడ్డుకోలేకపోయింది. పైగా అదే ఇంధనంలా మారి ముందుకు తోసింది. ప్రపంచ అథ్లెటిక్స్ లో మన దేశం మొత్తాన్ని గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది!     ఒక సానియా, ఒక సైనా, ఒక సింధూ విజయాలు సాధించనప్పుడు ఎలాంటి హంగామా చేశారో ఇప్పుడూ అదే చేస్తున్నారు పొలిటీషన్స్. మీడియా కూడా హిమ దాస్ అంటూ జపం చేస్తోంది. కానీ, అసలు గుర్తించాల్సింది హిమ దాస్ ని కాదు! ఆమె ఎదుర్కొంటూ వచ్చిన సవాళ్లని! ఈ దేశంలో అడుగడుగునా హిమ దాస్ లే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్త శుద్ధి వుండాలే కానీ ఎక్కడ పిడికెడు మట్టి తీసినా… మాణిక్యాలే బయటపడతాయి. అంత జనాభ, అంత శక్తి, సామర్థ్యాలు, అంతటి అవకాశాలు వున్నాయి. అయినా ఒలంపిక్స్ వచ్చిన ప్రతీసారి ఒకటి , అరా మెడల్స్ కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తూ వుంటాం. కారణం … హిమ దాస్ లాంటి వార్ని పట్టించుకోకపోవటమే. డబ్బున్న సంపన్నలు, ఎంతో కొంత ఖర్చు చేయగలిగే మధ్య తరగతి వారు డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు అయిపోయి మరింత డబ్బు సంపాదిస్తున్నారు. మిగతా అన్ని రంగాల్లో దేశాన్ని సగర్వంగా నిలపగలిగే వారు ఊళ్లలో, నగరాల్లోని మురికి వాడల్లో మగ్గిపోతున్నారు. వారంతా హిమ దాస్ లాంటి తారజువ్వలే! కావాల్సింది వారికి సౌకర్యం, అవకాశం అనే అగ్గిని అందించటమే! ఒక్కసారి గ్రామ గ్రామంలోని హిమ దాస్ లాంటి లెక్కలేనంత మందికి ప్రభుత్వాలు ప్రొత్సాహమనే నిప్పుని తాకిస్తే ఆకాశాన్ని అంటుకుంటారు! ఓ అంతర్జాతీయ విజయం సాధించి వచ్చిన వారికి కోట్లు గుమ్మరించటం కాకుండా కోట్ల మంది అంతర్జాతీయ విజయాలు సాధించేలా ఏం చేయాలో ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి!

వర్షాకాల సమావేశాల్లో తెలుగు "వేడి"

దేశ రాజధానిలో వేడి పుట్టనుంది. గడచిన కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వర్షాలతో సతమతమైంది. అక్కడి ప్రజలు వర్షాలతో చలి కాచుకున్నారు. బుధవారం నుంచి వారే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేడి పుట్టించే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం లోక్‌సభ సమావేశాలను వేదికగా చేసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ అధికార భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించింది.     ఇందుకోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పవన్ కల్యాణ‌ జనసేన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల పాలైన తమను ఆదుకుంటామని, ప్రత్యేక హోదాతో అక్కున చేర్చుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి ఇప్పుడు ఆ మాటే ఎత్తకపోవడం తెలుగు ప్రజలను వంచించడమే. గడచిన ఐదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతూండడం విశేషం. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు వారి మాయలో పడ్డారు. ప్రధానమంత్రిని నమ్మినందుకు నాలుగేళ్ళ తర్వాత పశ్చాత్తాపం పడుతున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అది వేరే సంగతి. నాలుగేళ్ల పాటు హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మంచిదని నమ్మబలికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం వంచించిందంటున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా అంశంపై నాలుగేళ్ల పాటు పార్లమెంటులో మాట్లాడని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇప్పుడే ఈ అంశంపై పోరాటం చేయడం రాజకీయ ఎత్తుగడగానే పరిగణించాలి.     ఈ మొత్తం వ్యవహారంలో సమిధులైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మూడు పార్టీల మూడు ముక్కలాటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జోకర్‌లుగా మిగిలారు. లోక్‌సభ సభ్యత్వాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు రాజనామా చేశారు. ఆ రాజీనామాలను స్పీకర్ అంగీకరించడం కూడా జరిగిపోయింది. దీంతో బుధవారం నుంచి జరిగే వర్షాకాల సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులే. బుధవారం నుంచి జరిగే లోక్‌సభ సమావేశాల్లో  ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ బద్ద శత్రువుగా చూసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ముఖ్యమంత్రి అమరావతిలో భేటీ అయ్యారు. ఇది మంచి పరిణామం. కొంతకాలంగా ఉంవడల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక హోదాపై పలు సూచనలు చేస్తున్నారు. ఇంతకు ముందు పత్రికల ద్వారా సూచనలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికే నేరుగా చెప్పారు.      ఈ సూచనల్లో ప్రధానమైనది ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలే తెలుగు వారికి ఆయుధాలని చెప్పడం ప్రధానం. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ సమావేశాల్లో మన వాదనను వినిపించ వచ్చునన్నది ఉండవల్లి సూచన. అయితే దీనికి మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు రాకపోవచ్చు. వారు వ్యతిరేకించకపోయినా సభలో ఏం మాట్లాడకుండా ఉంటే సరిపోతుందన్నది అధికార తెలుగుదేశం ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం లోక్‌సభ ప్రజాప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యుల దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, జితేందర్ రెడ్డిలను  దగ్గరకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, కొనకళ్ల కలిసారు. తెలుగు వారి ఇబ్బందులపై కలసి పోరాడాలన్న వారి వినతికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సానుకూల స్పందన రావడం ముదావహం. మొత్తానికి బుధవారం నుంచి రాజధాని ఢిల్లీలో  తెలుగు వారి వాడీ, వేడీ ఎలా ఉంటుందో చూడాలి...!?

సాకర్ జగజ్జేత ఫ్రాన్స్

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఫుట్‌బాల్ అభిమానుల కేరింతలతో నెల రోజులు జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. అంచలంచెలుగా ప్రత్యర్ధులను తమ గోల్స్‌తో మట్టి కరిపించిన ఫ్రాన్స్ ఫైనల్ ప్రత్యర్ధి క్రొయేషియాపై 4 - 2 గోల్స్ తేడాతో అఖండ విజయం సాధించింది. నెల రోజులుగా ఆశగా చూస్తున్న  ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు ఆ జట్టు ఆటగాళ్లు. ఫ్రాన్స్‌కు ఇది రెండో ప్రపంచ కప్ విజయం. తొలిసాకి 1998 సంవత్సరంలో తొలిసారి ప్రసంచ కప్ గెలిచిన ఫ్రాన్స్ ఆ కల ఈడేరడం కోసం ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.  ఇరవై సంవత్సరాల తర్వాత తీరిన కలతో ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆ జట్టు అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు. మన దేశంలో కూడా ఫుట్‌బాల్‌ పట్ల ఎంతో ఆదరణ ఉంది.     క్రికెట్‌ను మాత్రమే ఆదరిస్తారని ఇన్నాళ్లూ అన్నుకున్న భారత క్రికెట్ అభిమానులకు ఈ ఫుట్‌బాల్ అభిమానులు చూపించిన ఆదరణకు అదిరిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పట్ల ప్రజల్లో ఎంత క్రేజ్ ఎంతో ఉందో ఈసారి పోటీలు మళ్లీ మరోసారి నిరూపించాయి. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ పోటీలకు ఈసారి రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ ప్రపంచ కప్ పోటీలు అన్నీ ఉత్కంఠగా జరిగినవే. చివరికి అతి చిన్న జట్టుగా అసలెలాంటి అంచనాలు లేని క్రొమేషియా ఫైనల్‌కు రావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ ఫైనల్‌పై పడింది. జయపజయాల మాట పక్కన పెడితే ఫుట్‌బాల్ క్రీడ మనుషుల్లో ఉన్న ఓ పట్టుదలను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపిస్తుంది.     అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకు లేని క్రేజ్ ఈ ఫుట్‌బాల్ పట్ల చూపిస్తారు అభిమానులు. క్రికెట్ పట్ల కేవలం పది పన్నెండు దేశాలు మాత్రమే ఆసక్తి చూపిస్తే ఫుట్‌బాల్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. దానికి కారణం ఈ పోటీ గంట లోపే ఫలితం తేలడంతో పాటు బరిలో ఇరు జట్లు చూపించే వ్యూహప్రతివ్యూహాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అందుకే కోట్ల మంది ఈ క్రీడ పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో నూ, కేరళలోనూ మాత్రమే ఫుట్‌బాల్ పట్ల క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రాల నుంచే భారత ఫుట్‌బాల్ జట్టుకు క్రీడాకారులు ఎంపికవుతారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ క్రీడపై ఆసక్తి పెంచేందుకు భారత ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. దే:శంలో ఇంతకు ముందు ప్రపంచం గర్వించే ఫుట్‌బాల్ క్రీడాకారులున్నారు.     వారిలో అగ్రగణ్యుడు నివీల్డి డిసౌజా. భారత ఫుట్‌బాల్ క్రీడకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన క్రీడాకారుడు డిసౌజా. 1956 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ గోల్స్ సాధించి అనూహ్య విజయాన్ని అందించింది డిసౌజానే. ఆయన తర్వాత భారత ఫుట్‌బాల్‌‌కు దేవుడిచ్చిన వరంగా చెప్పుకునే బైచుంగ్ భాటియా. ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో బ్రెజిల్ క్రీడాకారులు పీలే, అర్జెంటీనా క్రీడాకారుడు డిగో మరడోనాలు ఎంత గొప్పవారు మన దేశానికి భాటియా కూడా అలాంటి క్రీడాకారుడే.     దేశంలో క్రికెట్ పట్ల మాత్రమే శ్రద్ధ చూపించే ప్రభుత్వాలు ఇతర క్రీడలపై కూడా ఆదరణ చూపిస్తే మనకు పీలేలు, డిగో మరడోనాలు తయారవుతారు. భారత జాతీయ క్రీడ హాకీని పట్టించుకోకపోవడం వల్ల ఆ క్రీడ దాదాపుగా కనుమరుగవుతోంది. క్రికెట్ ఒక్కటే మన క్రీడగా మిగులుతున్న దశ ఇది. ఈ జాడ్యం పోతే హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, కో కో వంటి క్రీడల్లో భారత్ ప్రపంచ దేశాలకు తమ సత్తా ఎంతటిదో చూపిస్తాయి.

కుమారస్వామి ఏడ్చాడు! కాంగ్రెస్ ఏడ్పించింది! మోదీ నవ్వబోతున్నాడు!

కుమారస్వామి కంటతడి పెట్టారు. ఇది నిజంగా షాకింగే! మరీ ఆశ్చర్యపోవాల్సిన విషయమూ కానప్పటికీ… 2019లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం కంటతడి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయమే. అసలింతకీ ఆయనెందుకు ఏడ్చారు? నలభై సీట్లు కూడా లేని జేడీఎస్ నేత నక్క తోక తొక్కినట్టు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ భయంతో కాంగ్రెస్ అతడ్ని బంపరాఫర్ ఇచ్చి రథ సారథని చేసింది. యడ్యూరప్ప సీఎం అవ్వకుండా ఆపగలిగింది. మరో రాష్ట్రం మోదీ వశం కాకుండా అడ్డుకుంది. కానీ, కాంగ్రెస్ మార్కు రాజకీయం నిత్యం భరిస్తూ ముళ్లపాన్పు లాంటి సీఎం కుర్చీపై కూర్చోటం కుమారస్వామికి ఎంత కష్టమో త్వరగానే తెలిసిపోయింది!     చరిత్రలో అనేక సార్లు కాంగ్రెస్ సంకీర్ణ  ప్రభుత్వాల్లో వుంటూ వచ్చింది. కానీ, ఎప్పుడూ కూడా తాను ప్రధాన పార్టీగా వుంటేనే ఆ గవర్నమెంట్లు అయిదేళ్లు నెగ్గుకొచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తూ మరో పార్టీ ప్రభుత్వం నడుపుతుంటే … ఆ సర్కార్ అయిదేళ్లు నడవటం అసాద్యమే. ఇది పదే పదే హస్తం నేతలు నిరూపించారు. కాంగ్రెస్ వ్యవహారంతో కొందరు ప్రధాని పదవులు కోల్పోతే అనేక మంది సీఎం పదవులు కోల్పోయారు. ఇప్పుడు కుమార స్వామి వంతు అన్నట్టు కనిపిస్తోంది పరిస్థితి. తనకు విషం తాగుతున్నంత కష్టంగా వుందని పార్టీ నాయకులు, కార్యకర్తల ముందు ఏడ్చేశాడు దేవెగౌర రాజకీయ వారసుడు. ఆ విషం తాగిస్తున్నది సంకీర్ణంలోని కాంగ్రెస్సేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! ఒకవైపు నుంచీ మాజీ సీఎం సిద్దరామయ్య, మరో వైపు నుంచీ డాక్టర్ శివ కుమార్, మధ్యలో మల్లిఖార్జున ఖర్గే… ఇలా ఎవరికి వారు కన్నడ ప్రభుత్వంలో వేలు పెడుతున్నారు. కుమార స్వామి ఫ్రస్ట్రేషన్ కి కారణం అదే! ఆయన నిమిత్తమాత్రుడైన సీఎంలా మిగిలిపోయే ప్రమాదం పొంచి వుంది. అలా రబ్బర్ స్టాంప్ లా వుండటం ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడైన కుమార స్వామికి రాజకీయంగా ఆత్మహత్య అవుతుంది. అదే ఆయన దుఃఖానికి కారణం!     కుమార స్వామిని ముఖ్యమంత్రిగా జనం ముందు పెట్టి తరువాత అతడ్ని ఏమీ చేయకుండా అడ్డుకుంటున్నారు కన్నడ హస్తం నేతలు. వాళ్లు అలా చేస్తుండటంతో చెడ్డ పేరంతా కుమార స్వామి భరించాల్సి వస్తుంది. ఇది ముందు ముందు జేడీఎస్ పై జనం ఆగ్రహించే స్థితి తీసుకు రావచ్చు. అదే సమయంలో మరింత మంది ఓటర్లు బీజేపి వైపు మొగ్గ చూపవచ్చు. కాంగ్రెస్ ఆకతాయితనం వల్ల పార్లమెంటు ఎన్నికల ముందో తరువాతో మళ్లీ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు వస్తే కమలానికి జనం స్పష్టమైన మెజార్టీ ఇవ్వొచ్చు. ఇదే కుమార స్వామి భయమంతా! అయినా కూడా కర్ణాటక కాంగ్రెస్ నేతల మాటలు ఆందోళనకరంగా వుంటున్నాయి. కుమార స్వామి కంటతడిపై కామెంట్ చేసిన మల్లిఖార్జున ఖర్గే… ఆయన ఇబ్బందుల్ని పరిష్కారిస్తామని అనలేదు. కాంగ్రెస్ మరింత సహకరిస్తుంది అని కూడా అనలేదు. సంకీర్ణంలో ఇలాంటి ఒత్తిళ్లు సహజం. తట్టుకుని ముందుకు సాగాలి అని సెలవిచ్చారు! అంటే, తమ వైపు నుంచి పెద్దగా మార్పుండదని చెప్పకనే చెప్పేశారు!     జేడీఎస్ కి, కర్ణాటక కాంగ్రెస్ కి మధ్య గొడవ నిజానికి జాతీయ సమస్య కాదు. అది ఆ రాష్ట్రానికే పరిమితం. కానీ, త్వరలోనే పార్లెమంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కర్ణాటక పరిణామాలు దిల్లీపై కూడా ప్రభావం చూపుతాయి. ఎలాగంటే, ఏ క్షణమైనా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కూలితే అది మోదీ, షాలకు బంగారు ఆవకాశం. జనం ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే జై కొట్టే చాన్స్ వుంటుంది. కాంగ్రెస్ , జేడీఎస్ లను నమ్మకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కూలకపోయినా… కుమారస్వామి చేత నిత్యం విషం తాగిస్తూనే కాంగ్రెస్ వారు ఇబ్బంది పెడితే… అది కూడా రెండు పార్టీలకు నష్టమే. ఎన్నికల్లోపు ఎంతో కొంత మంచి చేస్తేనే ఓటర్లు బీజేపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. లేదంటే, రాహుల్, కుమారస్వామి, సిద్దరామయ్య లాంటి వారి కంటే మోదీనే బెటర్ అని ఆయన వైపు మొగ్గు చూపుతారు.పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఛరిష్మా కూడా పని చేస్తుంది. ఇలా ఎలా చూసినా కుమార స్వామి కంటతడి… యడ్యూరప్ప ఆనందభాష్పాలుగా మారే సూచనలు పుష్కలంగా వున్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక, దక్షిణాదిలో కాంగ్రెస్ కు ఇంకా కాస్త పట్టుమిగిలిన కన్నడ నాట… హస్తం పార్టీ చాలా జాగ్రత్తగా వుంటే తప్ప మోదీని నిలువరించటం సాద్యం కాదు. ఈ విషయం గుర్తు పెట్టుకుని రాహుల్ కన్నడ కాంగ్రెస్ నేతల్ని నియంత్రించి కుమారస్వామి కళ్లు తుడిచే ప్రయత్నం చేయాలి! లేదంటే… మోదీకి కావాల్సిన ఎంపీ సీట్లు, యడ్యూరప్పకి కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు రెండూ త్వరలోనే కమలం ఖాతాలో పడిపోవచ్చు! 

సోషల్ మీడియా వెర్రితలలు

అతి సర్వత్రా వర్జయేత్. ఈ నానుడి సోషల్ మీడియాకు సరిగ్గా సరిపోతుంది. ఏ అంశంలోనూ ఎక్కువగా ఆలోచించకూడదని, దేని పైనా ఎక్కువ ప్రేమను కాని, ద్వేషాన్ని కాని పెంచుకోకూడదని కూడా ఈ ఆర్యోక్తి ప్రతిసారీ రుజువు చేస్తోంది. దీనికి తాజా ఉదాహరణ బీదర్‌‌లో జరిగిన సంఘటన. అక్కడున్న తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబంపై గ్రామస్థులు కిడ్నాపర్లు అనే అనుమానంతో దాడి చేశారు. దాదాపు రెండు వందల మంది గ్రామస్థులు విక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో మహ్మద్ అజాం అనే యువకుడు మరణించగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి కారణం ఒకవైపు అనుమానాలైతే... మరోవైపు దావానలంలా వ్యాపించిన వాట్సప్ మెసేజ్‌లు.     ఇది ప్రపంచంలో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యం చెబుతున్నా.... మరోవైపు సోషల్ మీడియా మరో రూపాన్ని కూడా చాటుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి బీదర్‌లో వ్యవసాయ క్షేత్రముంది. వారాంతపు సెలవులు కావడంతో ఆ కుటుంబంలో నలుగురు తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు తమ కారులో బీదర్ వెళ్లారు. వీరిలో ఒకరు గూగుల్ ఉద్యోగి కాగా మరొకరు ఖతర్ దేశంలో పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహ్మద్ సలాం. ఆయన ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఖతర్ నుంచి వచ్చిన మహ్మద్ సలాం వరుసకు సోదరులైన మహ్మద్ అజం, మ‌హ్మద్ సల్మాన్, నూర్ మహ్మద్ నలుగూరూ తమ సొంత వాహనంలో బీదర్‌ జిల్లా హండీకేరాలో ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముర్కి గ్రామ పరిథిలోని టోకుల్లా బ్యాండ్ వద్ద వీరి కారు నిలిపారు. అక్కడికి సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్ధినులకు ఖతర్ నుంచి తీసుకువచ్చిన చాక్లెట్లు పంచిపెట్టారు.      అదే వీరు చేసిన నేరం. వీరిని కిడ్నాపర్లుగా భావించిన ఉమేష్ బరాద్ అనే యువకుడు పిల్లలకు చాక్లెట్లను ఎందుకు పంచుతున్నారని ఓ వైపు ప్రశ్నిస్తూనే గ్రామస్థులకు తన వాట్సప్ ద్వారా గ్రామంలోకి కిడ్నాపర్లు వచ్చారనే సమాచారాన్ని అందించారు. అంతే ఒక్కసారిగా వందలాది మంది గ్రామస్థులు పాఠశాల సమీపానికి చేరుకుని నలుగురు యువకులపైనా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా పడింది. గ్రామస్ధుల విచక్షణారహిత దాడిలో గూగుల్ ఉదో్యగి మహ్మమద్ అజీం ప్రాణాలు కోల్పోయారు.     ఈ సంఘటన రెండు వాస్తవాలను చెబుతోంది. ఒకటి విచ్చలవిడిగా.... అడ్డూ అదుపు లేకుండా వాడకంలోకి వచ్చిన సోషల్ మీడియా అయితే మరొకటి దేశంలో పిల్లలకు భద్రత లోపించిందనే అంశం. ముందుగా సోషల్ మీడియా విస్తరణ కారణంగా సమాజంలో నేరాలు... ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్ ప్రేమలు... వివాదాలు.... దొంగ మెసేజ్‌లతో డబ్బులు దొంగిలించడం... చివరకు ఆధార్ కార్డుల రూపకల్పన, సెల్‌ఫోన్ సిమ్‌ల తయారీ వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చేసింది. ఏ బస్సులో చూసినా... ఏ రైలులో చూసినా... పది మంది కూడిన ఏ ప్రదేశంలో చూసినా మాటల్లేవు... మాటాడుకోవడాల్లేవ్... అందరిదీ ఒకే బాట... వాట్సప్‌ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో చాటింగ్‌లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో సందేశాలు. దీనికి వయసుతో సంబంధం లేదు. చిన్నాపెద్దా విచక్షణ లేదు.     ఈ సోషల్ మీడియా కారణంగా రోజురోజుకూ ఎన్ని అనర్ధాలు జరుగుతున్నా ప్రజల్లో దీని పట్ల మమకారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఒక్క మేసేజ్‌తో వందల మంది గ్రామస్థులు ఒక చోట చేరి ఈ ఘోరం చేశారంటే  సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాణానికి మరోవైపు అన్నట్లుగా దీని వల్ల కొన్ని చోట్ల మంచి జరుగుతున్నా అది చాలా తక్కువ సందర్భాల్లోనే. దీనిపై స్వీయ నియంత్రణే చేసుకోవాలి తప్ప ప్రభుత్వాలు చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు అన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులు, మంత్రులు, సినీ స్టార్లు, క్రికెటర్లు... ఇలా సమాజంలో పెద్దవారు అనుకునే వారంతా ఈ సోషల్ మీడియాకు దాసులైపోయారు.     ఇక దేశంలో చిన్నారుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు ఎక్కువయ్యాయి. వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నా దేశంలో ఉన్న చట్టాలు నేరం చేసిన వారిని సునాయాశంగా జైళ్ల నుంచి విడుదల చేయిస్తున్నాయి. దీంతో ఈ ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తే ఈ దారుణాలకు స్వస్తి పలకవచ్చు. ముందుగా వ్యక్తిలో మార్పు రావాలి. అందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు క్రషి చేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. దేనిని ఎంత వరకూ ఉపయోగించాలో కూడా ఎరుకలో ఉండాలి.

సంక్షోభంలో పాకిస్తాన్

పొరుగు దేశం పాకిస్తాన్ సంక్షోభంలో పడింది. అగ్ర నాయకుల అరెస్టులు ఒకవైపు... ఉగ్రవాదుల పంజా మరోవైపు పాకిస్తాన్‌ను  కలవరపెడుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీష్‌ను, ఆయన కుమార్తె మరియంలను లాహోర్ విమానాశ్రయంలో పాకిస్తాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లండన్‌లో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు షరీఫ్ తన కుమార్తె మరియంతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో పాకిస్తాన్ చేరుకున్నారు. వారిద్దరు అబుదాబీ మీదుగా లాహోర్ చేరుకోగానే అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశంలో సంచలనం రేపుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌కు తాను అరెస్టు అవుతానని ముందుగానే తెలుసు. అయినా ఆయన వాటి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది ఆయనలో ఉన్న ధైర్యానికి ప్రతీక.     నవాజ్ షరీఫ్ అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతి సొమ్ముతో లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న అవెన్‌ఫీల్డ్‌లో నాలుగు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్నారని అభియోగం. ఈ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్షను విధించారు.  అయితే ఈ అపార్ట్‌మెంట్లేవీ నవాజ్ షరీఫ్ పేరిట లేకపోవడం గమనార్హం. తన ఎన్నికల అఫిడివిట్‌లో ఈ ఆస్తులను చేర్చలేదని పాక్ ప్రభుత్వం షరీఫ్‌పై కేసులు పెట్టింది. ఈ అక్రమాస్తుల విలువ 65 కోట్ల రూపాయలు.పాకిస్తాన్‌లో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశంతో పోలీస్తే 65 కోట్ల రూపాయల అక్రమార్జన ఏమంత పెద్దది కాదు. ఇంతటి అవినీతి భారత్‌లో సాధారణ గ్రామ లేదూ పట్టణ స్ధాయి నాయకులు చేస్తారు. అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఇది పెద్ద నేరంగానే పరిగణించడం విశేషం.     నవాజ్ షరీఫ్ అరెస్టును అవినీతి కోణం నుంచి కాకుండా రాజకీయ కోణం నుంచి మాత్రమే చూడాలి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ మాజీ ప్రధాని, దేశంలోనే సీనియర్ నాయకుడైన నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేయడం ముమ్మాటికి రాజకీయ కుట్రగానే సభ్య దేశాలు చూస్తున్నాయి. తనను అరెస్టు చేస్తారని ముందుగానే తెలిసినా... ఆ సమయానికి షరీఫ్ లండన్‌లో ఉన్నా ఆయన పారిపోవడానికి కాని, మరోచోట తలదాచుకోవడానికి కాని ప్రయత్నించలేదు. భార్య ఆరోగ్య పరిస్థితిని స్వయంగా చూపి.. ఆమెను సముదాయించి కుమార్తెతో సహా స్వదేశానికి బయలుదేరారు. ఇది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి. అయితే భారత్‌తో పోలిస్తే మాత్రం అరెస్టు అవుతానని తెలిసీ ఇలా రావడం మాత్రం ఆశ్చర్యమే. పాకిస్తాన్‌లో  ఒకవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అరెస్టు అయితే మరోచోట పెషావర్‌లో విషాదం చోటుచేసుకుంది. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న వేళ ఉగ్రవాదులు మానవబాంబుతో ఓ పార్టీ చేపట్టిన ర్యాలీపై దాడి చేశారు. ఈ దాడిలో ఏకంగా 128 మంది అమాయకులు బలైపోయారు.     పాకిస్తాన్‌లో అంతో ఇంతో పేరున్న పార్టీగా పేరున్న బలూచిస్థాన్ అవామీ పార్టీ నాయకుడు సిరాజ్ రైసానీ మరణించారు. నిజానికి ఉగ్రవాదుల దాడి ఆయన లక్ష్యంగానే జరిగిందని అంటున్నారు. ఎవరిది ఏ లక్ష్యమైనా జరిగింది మాత్రం మహా ఘోరం. దారుణం. వందల మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు ఈ మారణహోమం వల్ల ఏమి సాధించారో మాత్రం అర్ధం కాదు. ఒకరినో.. పదిమందినో.. వందల మందినో హతమార్చడం ద్వారా అధికారంలోకి వస్తామని కాని, ఆ దేవుడు కరుణిస్తాడని కాని అనుకోవడం ముమ్మాటికి ముర్ఖత్వమే. ఇలాంటి చర్యలకు వారి దేవుడే కాదు... ఏ దేవుడైనా హర్షించడు. ఈ సత్యం ప్రపంచంలోని ఉగ్రవాదులందరికీ ఎంత త్వరగా తెలిస్తే మానవాళి మనుగడకు అంత ప్రశాంతత దొరుకుతుంది.

ధర్మం గెలుస్తుంది... న్యాయం నిలుస్తుంది

ధర్మానికి మరణం ఉండదని, న్యాయానికి  సంపూర్ణ ఆయుష్షు ఉంటుందని మరోసారి రుజువైంది ఎప్పుడో 23 సంవ‌త్సరాల క్రితం న‌మోదైన యూరియా కేసుకు ఇప్పుడు మోక్షం క‌లిగింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండ‌గా... తెలుగు వాడు పి.వి.న‌ర‌సింహారావు  ప్రధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దేశాన్ని కుదిపేసిన యూరియా స్కాం కేసుకు ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న పి.వి.నరసింహారావు సమీప బంధువు సంజీవ రావుకు కోటి రూపాయల జరిమానాతో  పాటు మూడు సంవత్సరాల జైలు శిఓ విధించింది.     ఈయనకు సహకరించిన మరో ఇద్దరు మల్లేశం గౌడ్, సాంబశివరావులకు ఐదేసి కోెట్ల జరిమానా విధించింది. ఇక ఈ కేసులో కీలకనిందితులైన టర్కీ దేశస్ధులు టంకే అలంకస్, సిహాన్ కరాన్సీలకు వంద కోట్ల జరిమానా విధించింది. ఒక కేసులో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక విధంగా ఇది దేశంలోనే చారిత్రక తీర్పుగా నిలిచిపోతుంది. ఆ రోజుల్లో దేశాన్ని కుదిపేసిన యూరియా కుంభకోణం విలువ ఏకంగా 133 కోట్ల రూపాయలు. ఈ రోజుల్లో 133 కోట్ల రూపాయలు పెద్ద మొత్తంగా కనిపించకపోవచ్చు కాని... ఆ రోజులతో పోలిస్తే అది చాలా పెద్ద మొత్తం. అందుకే ఈ కుంభకోణం అప్పట్లో సంచలనం రేపింది. నైతికత... నిజయితీ ఇంకా పూర్తిగా నాశనం కాని కాలంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.     దేశవ్యాప్తంగా ఉత్కంఠను, కలకలాన్ని రేపిన యూరియా కేసుపై సర్వత్రా చర్చ జరిగింది. ఈ కేసుపై సిబిఐ ప్రత్యేక శ్రద్ధ కనబరిచినా పెద్దగా సంచలనాలు ఏవీ వెలుగులోకి రాలేదు. టర్కీ దేశం నుంచి దేశానికి అవసరమైన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసేందుకు అక్కడి కంపెనీతో ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం. దీనికి గాను 38 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 133 కోట్ల రూపాయలు ముందే చెల్లించాలని ఒప్పందం. ఈ తతంగమంతా పూర్తి అయిన తర్వాత చూస్తే టర్కీలో అసలు కంపెనీయే లేదని తేలింది. ఇదీ ఈ కుంభకోణంలో కీలకం.కేసులు నమోదు చేసి... విచారణ ప్రారంభించినప్పటికీ అది నత్తనడకనే సాగింది. అటల్ బిహారీ వాజపేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తూతూ మంత్రంగా సాగిన విచారణ ఆ తర్వాత యుపిఏ పాలనలో నీరుకారింది. ఇది మన రాజకీయ వ్యవస్ధకు అద్దం పట్టింది.   అధికారంలో ఉన్న వారు ఎలాంటి చర్యలకైనా తెగబడతారని, ఎంతటి పెద్ద కుంభకోణమైనా పక్కదారి పట్టిస్తారని ప్రపంచానికి తెలియడానికి యూరియా కుంభకోణం కేసే ఓ పెద్ద ఉదాహరణ. అయితే, ధర్మం నాలుగు పాదాల కాకపోయినా... రెండు పాదాలపైనైనా నడుస్తుంది అనడానికి యూరియా కుంభకోణం కేసే ఓ నిరూపణ. దేశంలో నానాటికి పెరిగి పోతున్న అవినీతిని నిలువరించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంచి పరిణామం. తప్పులు చేసే ముందు మనకేం కాదులే అని అనుకునే వారికి ఈ తీర్పు ఓ గగుర్పాటు. ఎలాంటి నేరమైనా... ఎంతటి భారీ కుంభకోణమైనా చేసేసి హాయిగా బయట పడవచ్చుననుకునే వారి వెన్నులో వణుకు ఈ తీర్పు.     ఈ దేశాన్ని బాగుచేయలేం.... అవినీతిని రూపుమాపలేం అంటూ అరుగుల మీదా... పట్టణాలు, నగరాల్లోనూ ప్రధాన కూడళ్ల వద్ద చర్చలు జరిపే వారికి దేశంలో న్యాయం బతికే ఉందని చెప్పింది ఈ తీర్పు. ఇలాంటి తీర్పుల వల్ల అవినీతి పూర్తిగా సమసిపోతుందని, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందని పూర్తిగా చెప్పలేం. అయితే తాజా తీర్పు కారణంగా నేరానికి, ఏదైనా కుంభకోణం చేసేందుకు ప్రయత్నించే వారికి మాత్రం ఐదు నిమిషాల పాటు ఆలోచించేలా చేస్తుంది. ఆ ఐదు నిమిషాలు చాలు మనిషి తన ఆలోచనలను మార్చుకోవడానికి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చారిత్రాత్మకం... అద్భుతం... అమోఘం.

దేశం దూసుకుపోతోంది! కాంగ్రెస్ మాత్రం అక్కడే ఆగిపోయింది! 

గత రెండు, మూడు రోజుల్లో జాతీయ వార్తల్ని గమనించే వారందరి కళ్లు రెండు మూడు ప్రధానమైన వార్తలపై పడ్డాయి. వాటిలో మొదటిది మన దేశం ఫ్రాన్స్ ను అధిగమించింది! దేంట్లో? ఆరో అతి పెద్ద ఆర్దిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు ఫ్రాన్స్ ను దాటేసింది! ఇది చిన్న సక్సెస్ ఏం కాదు. అలాగని మరీ జబ్బలు చరచుకోవాల్సింది కూడా! ఇక రెండోది, స్టాక్ట్ మార్కెట్లు ఆకాశాన్ని అంటుతూ దూసుకుపోతున్నాయి. మరోమారు బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్, నేషనల్ ఎక్స్ ఛేంజ్ రెండూ ఆల్ టైం హైని టచ్ చేశాయి. ఇది కూడా ఒక కోణంలో సంతోషించాల్సిన విషయమే! ఎందుకంటే, ప్రపంచ పటంలో పెరుగుతోన్న మన ప్రాధాన్యతకి ఇలాంటివే నిదర్శనాలు! ఇప్పుడిక మూడో వార్తకొద్దాం! కాంగ్రెస్ లోని మేధావి నేత శశిథరూర్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో జోస్యం చెప్పారు! 2019లోనూ మోదీయే పీఎం అయితే భారత్ హిందూ పాకిస్తాన్ గా మారిపోతుందట!     భారత్ ఫ్రాన్స్ ను అధిగమించటం, సెన్సెక్స్ దూసుకుపోవటం, శశిథరూర్ మాటలు… వీటి మధ్య పైకి ఎలాంటి సంబంధం కనిపించకపోవచ్చు! కానీ, అంతర్గతంగా పెద్ద లింకే వుంది! అదేంటంటే… మోదీ చేసే పనులు చాలా మందికి నచ్చకపోవచ్చు. అలాగే, డీమానిటైజేషన్ లాంటి వాటి వల్ల సామాన్య జనం ఇబ్బంది కూడా పడి వుండవచ్చు. అయినా, భారత ఆర్దిక రంగం ప్రపంచాన్ని విస్మయపరిచేలా దూసుకుపోతోంది. కామన్ ఇండియన్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ క్రమంగా పెరుగుతోంది. నిజంగా అద్భుతమైన లాభాల్ని సామాన్యులు చవిచూడటం లేదు. అయినప్పటికీ జరుగుతున్న అభివృద్ధి కూడా కాదనలేనిదే! రానున్న రోజుల్లో బీజేపీ జనం ముందుకు ఈ విజయాల్నే తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో విదేశాంగ విధానం, ఆర్దిక సంస్కరణల విషయంలో మోదీ గొప్ప విజయాలు సాధించాడని ఆ పార్టీ వారు చెప్పుకుంటారు! అందరూ కాకున్నా ఒక వర్గం ఓటర్లు వారి వాదనతో ఏకీభవించవచ్చు! మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది?     మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు తమకు అవసరం అనుకుంటే హిందూత్వ ఎజెండా ఎత్తుకుంటారు. లేదంటే అభివృద్ధి జపం చేస్తారు. ఆ రెండు విషయాల్లో వారి చిత్తశుద్ధి ఎలావున్నా అవసరానికి ఏది వాడాలో కమలనాథులకి బాగా తెలుసు. కానీ, ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ మాత్రం సెక్యులర్ వ్యామోహంలో ఎంతకీ ముందుకు సాగటం లేదు! శశిథరూర్ హిందూ పాకిస్థాన్ వ్యాఖ్య అందుకు నిదర్శనం! ఒకప్పుడు మోదీ వస్తే ముస్లిమ్ లు బతకలేరని ప్రచారం చేసిన కాంగ్రెస్ వారు ఇప్పుడు మళ్లీ మోదీ వస్తే హిందూ పాకిస్తాన్ అంటున్నారు! ఇది కొంత మంది మైనార్టీలకు బావుంటుందేమో కానీ… లాజిక్ వాడే ఏ మైనార్టీకి, హిందువుకి కూడా నచ్చదు. బీజేపీ మీద , మోదీ మీద వున్న అక్కసు కాంగ్రెస్ నేతలు హిందూత్వం మీద కక్కటం దుష్పలితాలు ఇస్తుంది. గతంలో ఇలాగే హిందూ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు చేతులు కాల్చుకున్నారు! మోదీ దేశదేశాలు తిరుగుతుంటే ఆయన విదేశాంగ విధానం గురించి కాక ఆయన సూటు, బూట్ల గురించి విమర్శింటం, ఒకపక్క ఆర్దికంగా దేశం పురోభివృద్ధి సాధిస్తుంటే ఇంకా సెక్యులర్ రాజకీయ కామెంట్లు చేయటం… కాంగ్రెస్ ఇదే మూసలో వుండిపోతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ మీద అదే పాత కాలపు మతోన్మాద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నాయి. మోదీకి శ్రీరామ రక్షగా మారుతోంది ఇదే! వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవటం మరీ అంత సులువు కాదు. అయినా మోదీ, షా దైర్యంగా వుంటున్నారంటే… ప్రతిపక్షాలు చేస్తోన్న పొరబాటే! యంగ్ ఇండియన్స్ ఏం కావాలనుకుంటున్నారో బీజేపీ గుర్తించింది. అవి ఇచ్చినా ఇవ్వకున్నా మాటల మాయాజాలం అన్నా చేస్తోంది. కాంగ్రెస్ , కొన్ని ఇతర సెక్యులర్ పార్టీలు అది కూడా చేయటం లేదు. ఎంతసేపు హిందూత్వం గురించి, లేనిపోని, కానిపోని హిందూత్వ ఉగ్రవాదం, మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాయి. అందుకే, బీజేపీని వద్దనుకునే వారు కూడా కాంగ్రెస్ ని ముద్దనుకోవటం లేదు!     భారతదేశంలోని ప్రతిపక్షాలు, ప్రధానంగా రాహుల్ ని ప్రధానిని చేయాలని తాపత్రయపడుతోన్న కాంగ్రెస్… బీజేపీని, మోదీని నియంత్రించాలంటే… ముందు హిందూ వ్యతిరేక భావజాలానికి స్వస్తి పలకాలి. అలాగే, దేశంలో పోగవుతన్న లక్షల కోట్ల సంపద ఎందుకు సామాన్యుల దాకా రావటం లేదో గుర్తించి… ఆ లొసుగుల్ని ఎత్తి చూపాలి. ఇలా సామాన్యుల సమస్యలు మాట్లాడితేనే మోదీ కార్నర్ అయ్యేది. లేదంటే 2019లోనూ ఓటర్లు అనివార్యంగా ఆయన వైపే మొగ్గు చూపాల్సి రావచ్చు!  

ప‌టిష్టమవుతున్న భార‌త ఆర్థిక వ్యవ‌స్థ..!

ఇది శుభ సూచ‌క‌మే. ఇది ఆనందించే అంశ‌మే. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఆర్థికంగా ఎంతో వెనుక‌బ‌డి ఉన్నామ‌నుకునే భార‌త్ కు ఆర్థిక రంగంలోప్రపంచ‌ బ్యాంక్ ఇచ్చిన రేటింగ్ కొత్త ఆశ‌లు చిగురింప‌జేస్తోంది. ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుద‌ల చేసిన లెక్కల ప్రకారం ఫ్రాన్స్ దేశాన్ని వెన‌క్కు నెట్టి భార‌తదేశం ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తోంది. జ‌నాభా ప్రకారం చూసుకున్నా భార‌తదేశం ఫ్రాన్స్ కంటే చాలా పెద్దది. అయినా ఆ దేశాన్ని వెన‌క్కి నెట్టి ఆర్థికంగా దేశం పురోగ‌తి సాధించ‌డం మంచి ప‌రిణామ‌మే. ఇన్నాళ్లూ ఆర్థిక ప్రగ‌తిలో ఫ్రాన్స్ 2.597 ల‌క్షల కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది.     ప్రపంచ బ్యాంక్ కొత్త లెక్కల ప్రకారం ఫ్రాన్స్ ఆ స్ధానాన్ని కోల్పోయింది. ఆ స్థానంలోకి భార‌త్ చేరుకుంది. ఇది మంచి ప‌రిణామ‌మే. దీనికి కార‌ణం భార‌త్‌లో వ‌స్తు త‌యారీ పెర‌గడం.. దాని వినిమ‌యం కూడా అధిక స్ధాయిలో ఉండ‌డ‌మే అని ప్రపంచ‌బ్యాంక్ తేల్చింది. దీని కార‌ణంగా భార‌త ఆర్థిక వ్యవ‌స్థ పుంజుకుంది అన్నది ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్‌కి కార‌ణంగా చెబుతున్నారు. ఇది దేశ ప్రజ‌ల‌కు శుభ వార్తే అయినా... ఇక్కడి ఆర్థిక ప‌రిణామాలు మాత్రం మ‌ధ్యత‌ర‌గ‌తి, సామాన్యుల‌ను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. దేశంలో నోట్ల ర‌ద్దు కుదిపిన కుదుపున‌కు ఇంకా ఎవ‌రూ తేరుకోలేదు. ఏటిఎం సెంట‌ర్ల ముందు ప్రజ‌లు ఇంకా బారులు తీరి నిలుచున్న చిత్రాలు పాల‌కుల‌ను వెక్కిరిస్తున్నాయి. కేంద్రం తీసుకువ‌చ్చిన జి.ఎస్‌.టి కూడా ప్రజ‌ల న‌డ్డివిరుస్తోంది. ఏది అస‌లు ధ‌రో.... ఏదీ జిఎస్టీనో తెలియ‌క స‌గ‌టు భార‌త పౌరుడు నానా హైరానా ప‌డుతున్నాడు. నిత్యావ‌స‌రాలు ధ‌ర‌లు కొండ‌నెక్కాయి. వంటింట్లో ఆడ‌వారు పాల‌కుల‌పై శివ‌తాండ‌వం చేస్తున్నారు. పెట్రోలు ధ‌ర‌లు నిమిష నిమిషానికి కాదు... క్షణ‌క్షణానికి మారుతున్నాయి. వంట గ్యాస్ ధ‌ర‌లు వెక్కిరిస్తున్నాయి. కూర‌గాయ‌లు కొనాలంటే సామాన్యులను చుక్కలు వెక్కిరిస్తున్నాయి.      దేశంలో అంత‌ర్గతంగా ఇలాంటి ప‌రిస్థితులుంటే దేశం వెలుప‌ల మాత్రం భార‌త్ ప్రభ వెలిగిపోతోంది. అంటే దేశాన్ని, దేశ ప్రజ‌ల‌ను ఓ భ్రమ‌లో ఉంచి త‌మ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని ప్రపంచంలో ఆర్థికంగా బ‌లంగా ఉన్న అమెరికా వంటి దేశాలు త‌ల‌పోస్తున్నాయ‌ని భావించాలా...? దేశంలో ఆర్ధిక ఇబ్బందులు అతలాకుతలం చేస్తూంటే ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ర్యాంకింగ్‌లు ఇవ్వడం పట్ల ఆర్థికవేత్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రంగాన్ని చూసినా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వ్యవసాయం కుంటుపడింది.     పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. నిరుద్యోగులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఓ ఆర్థిక అనిశ్చితి కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్‌ భారత్‌ను ఏ తీరాలకు తీసుకువెళ్తుందో చూడాలి. అయినా భారత ప్రజలు ఆశావాహులు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అనుకుని కాలం వెళ్లదీసేవారు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన తాజా ర్యాంకుల్లో నిజమున్నా... కుట్రలు ఉన్నా.... భారత ప్రజలు మాత్రం అన్నింటినీ దిగమింగి ఆర్థికంగా... సామాజికంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే... మేరా భారత్ మహాన్...

మోదీ పన్నే ‘కమల’వ్యూహంలో… చిన్న పార్టీలు చిక్కాల్సిందేనా?

భారతదేశ చరిత్రలో తన స్వంత మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రధాని అయిన కాంగ్రేసతర పార్టీ నాయకుడు… మోదీ! 2014లో ఇదో అద్భుతం! నిజానికి అంతా మోదీ ఇచ్చిన కాంగ్రెస్ హఠావ్ నినాదం నిజమైపోతుందని భావించారు కూడా! కానీ, నాలుగేళ్లు పూర్తై మరో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మోదీ గ్రాఫ్ క్రమంగా దెబ్బతింటూ వస్తోంది. 2019లో మళ్లీ మోదీ ప్రధాని అవుతారా? అవును అని బీజేపీ కార్యకర్తలు, అభిమానులే చెప్పలేని స్థితి!     ఇప్పటికీ నరేంద్ర మోదీకి వున్న ఏకైక బలం… ప్రతిపక్షాలకు బలమైన ప్రధాని అభ్యర్థి లేకపోవటమే! రాహుల్ తప్ప మరెవరూ మోదీకి పోటీ ఇచ్చే స్థితి  లేదు. అలాగని రాహుల్ ఓటర్లందరికీ ఆశాజ్యోతిలా వున్నాడా అంటే … అదీ లేదు. మోదీ వద్దనుకునే వారు ఎందరున్నా రాహుల్ కావాలనుకునే వారు అందరు లేరు! ఇక మిగతా నాయకులదైతే మరీ సాదాసీదా పరిస్థితి. ఎవ్వర్నీ వారి పక్క రాష్ట్రంలో గుర్తించే వారు లేరు! ఇదే మోదీకి అతి పెద్ద ప్లస్ పాయింట్. కానీ, కేవలం బలహీనమైన ప్రతిపక్షం కారణంగా 2019లో నమో మరోసారి స్పష్టమైన మెజార్టీ తెచ్చుకుంటారా? డౌటే! వచ్చే ఎన్నికలపై మనకి కాదు… స్వయంగా మోదీ, అమిత్ షాలకు కూడా అనుమానాలు వున్నట్టు కనిపిస్తోంది. పైకి అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా మళ్లీ అధికారం తమదేనని గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ, అదంత తేలిక కాదని కమలనాథులకి తెలుసు. ఆరెస్సెస్ వారికి ఇంకా బాగా తెలుసు. అందుకే, రకరకాల వ్యూహాలతో ప్రతిపక్షాల్ని ఇరుకున పెడుతున్నారు. ఎలాగైనా మాయ చేసి వచ్చే ఎన్నికల్లోనూ మోదీనే ప్రధానిగా పీఠంపై కూర్చోబెట్టాలని ఆరెస్సెస్ పెద్దలు, అమిత్ షా పని చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగమే జమిలి ఎన్నికల హడావిడి!     జమిలి విషయంలో దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు కోరింది లా కమీషన్! బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ తమ అభిప్రాయాలు చెప్పలేదు. మిగిలిన చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీల ఉద్దేశ్యాలు మాత్రం తెలుసుకునే  ప్రయత్నం చేసింది కేంద్రం. సహజంగానే మమతా బెనర్జీ లాంటి వారు నో అన్నారు. కేసీఆర్ లాంటి వారు ఓకే అన్నారు. టీడీపీ లాంటి పార్టీలు జమిలికి సై అన్నా ముందస్తుకి నై అనేశాయి. అంటే, మొత్తంగా జమిలిపై భిన్నాభిప్రాయాలే వెలువడ్డాయన్నమాట. ఇక మిగిలిన ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లలో కాషాయ పార్టీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలాగూ ఓకే! బీజేపీ చెప్పింది కాంగ్రెస్ ఎలాగూ ఒప్పుకోదు కాబట్టి హస్తం పార్టీకి జమిలి సమ్మతం కాదు. ఇదీ పరిస్థితి! అసలు ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు పెద్దగా వర్కవుట్ కాదని అనిపిస్తోన్న జమిలి ఎన్నికల విషయంలో మోదీ ఇంత పట్టుదలగా ఎందుకున్నారు? పైకి ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం వుండదనీ చెబుతున్నప్పటికీ అసలు కారణం అంతరంగంలో వుంది! గతంలో డీమానిటైజేషన్ పేరుతో మోదీ వేసిన అడుగు కూడా ఇలాగే పైకి చాలా ఆదర్శవంతంగా కనిపించింది. కానీ, బ్లాక్ మనీ రాబట్టలేకపోయిన నోట్ల రద్దు తరువాత జరిగిన చాలా ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడింది. ఇతర పార్టీలు ఎలక్షన్ టైంలో చేతిలో డబ్బులు లేకలేక విలవిలలాడిపోయాయి. ఈ పరిణామం బీజేపీ విజయాల్ని చాలా రాష్ట్రాల్లో సునాయాసం చేసింది. ఇప్పుడు జమిలి ఎన్నికల వ్యూహం కూడా అలాంటిదేనని భయపడుతున్నాయి దేశంలోని చాలా పార్టీలు!     ఒకేసారి కేంద్రానికి , రాష్ట్రాలు అన్నిటికీ ఎన్నికలంటే చిన్న పార్టీలకు ఆర్దిక భారం ఎక్కువైపోతుంది. అదే సమయంలో బీజేపీ లాంటి పెద్ద పార్టీకి పోల్ మ్యానేజ్ మెంట్ తేలికవుతుంది. రెండు నెలల కాలంలో మొత్తం రాజకీయ వ్యవహారమంతా చక్కబెట్టేస్తే అయిదేళ్లు ఇక పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టవచ్చు. అలాగే, ఇప్పుడు బీజేపీ కమలం గుర్తు కంటే మోదీ ముఖమే ఎక్కువగా ఓట్లు రాబడుతోంది. అన్ని అసెంబ్లీలకూ ఎన్నికలు ఒకేసారి వస్తే ప్రధాని అభ్యర్థిగా మోదీ చేసే ప్రచారం శాసనసభలపై కూడా వుంటుంది. జనం మోదీ ఛరిష్మా ప్రభావంతో అసెంబ్లీ సీట్లకు కూడా ఓటు వేసే అవకాశం వుంది. ఇలా అనేక కారణాలు బీజేపీకి ప్లస్ గా మారతాయి ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలైతే! కొన్ని పార్టీలు ససేమీరా అంటున్నా మోదీ ఈ సంవత్సరం చివరికల్లా ముందస్తు ఎన్నిలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆగస్ట్ 15న ఆదాయ పన్ను రద్దు చేస్తున్నట్టు ఆయన ఎర్రకోటపై నుంచీ ప్రకటిస్తారని టాక్ వినిస్తోంది. కోర్టులో వున్న అయోధ్య రామ మందిరం కేసు కూడా ఎలానూ వుండనే వుంది. ఇలా అనేక దిక్కుల్లోంచి ఓటర్లను మెస్మరైజ్ చేసే నిర్ణయాలు తీసుకుని ఎన్నికల బరిలోకి దూకవచ్చు. ఇక ఇప్పుడు అత్యధిక శాతం రాష్ట్రాలు కూడా కమలానివే కాబట్టి వాట్ని కూడా ఓట్ల యద్ధంలోకి దింపవచ్చు. మొత్తం మీద ఏకాభిప్రాయం రాకున్నా 2018 చివర్లో మనం ఓ మోస్తరు జమిలి ఎన్నికల్ని ఎదుర్కోక తప్పదు. వాటి ఫలితాలు మోదీకి అనుకూలంగా వుంటే మాత్రం … చిరు పార్టీల భయాలు నిజమేనని తేలిపోతుంది!

ఇదీ బాధ్యతంటే...... ఇదీ రక్షణంటే...!

ప్రభుత్వమంటే ఇలా ఉండాలి. ప్రజల్ని కన్న బిడ్డల్లా సాకే ప్రేమ ఉండాలి...ప్రజల రక్షణకు ఏమైనా చేయాలనే తపన ఉండాలి. ఈ లక్షణాలన్నీ థాయ్‌లాండ్ ప్రభుత్వానికి ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. పదిహేడు రోజులుగా థాయ్‌లాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారి ఫుట్‌బాల్ క్రీడాకారులు, వారి కోచ్‌ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. చీకటి గుహలో చిక్కుకున్న ఆ పదిహేడు మందికి మంగళవారం నిజమైన వెలుగులు నింపిన రోజు. వారే కాదు ప్రపంచ దేశాల్లోని చిన్నారులందరికీ ఇది వెలుగులు నింపిన రోజు. ప్రజల రక్షణకు ప్రభుత్వాలు ఎంతటి విలువ ఇవ్వాలో థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం నేర్పిన పాఠం. గుహలో చిక్కుకున్న పిల్లల్లో ఆదివారం నలుగురిని, సోమవారం మరో నలుగురిని బయటకు తీసుకు వచ్చిన డైవర్స్ మంగళవారంతో ఈ రక్షణ క్రతువును పూర్తి చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. " ఈ ఫుట్‌బాల్ జట్టును ఈ రోజే కలుపుతాం" అని ప్రపంచానికి ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే గుహాలో మిగిలిన ఐదుగురిని సుర‌క్షితంగా బయటకు తీసుకు వచ్చారు.  ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రపంచ దేశాలన్ని థాయ్‌ల్యాండ్ ప్రభుత్వానికి బాసటగా నిలవడం మంచి పరిణామం. చిన్న దేశాల పట్ల కాసింత చులకనగా ఉండే ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ " ఈ ఆపరేషన్‌లో థా‍య్ ప్రభుత్వానికి సహకరిస్తాం" అని స్వయంగా ట్విట్ చేయడం చిన్నారుల పట్ల ఆయన వాత్సల్యానికి నిదర్శనం. ఈ ఆపరేషన్‌లో బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆమెరికా, చైనా, జపాన్‌, స్వీడన్, దేశాలకు చెందిన 90 మంది డైవర్లు పాల్గొనడం ఈ ఘటన పట్ల ఆయా దేశాలు చూపించిన చొరవగానే పరిగణించాలి. 17 రోజుల పాటు నిద్రాహారాలకు దూరమై ఆ చిన్నారులు మనుగడ సాగించారంటే వారి మనోనిబ్బరానికి ప్రపంచం యావత్తూ జేజేలు పలకాలి. వారిలో ఆత్మస్దైర్యాన్ని నింపిన వారి కోచ్ ఎక్కా పోల్ చాంతావాంగ్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఈ కోచ్ కూడా ఏమంత వయస్కుడేం కాదు. నిండా పాతికేళ్ళు కూడా లేని కోచ్ ఎక్ లో ఇంత ధైర్యానికి కారణం అతను పడ్డ కష్టాలే. నా అన్నవారిని కోల్పోయి కష్టాల కొలిమి లోంచి వచ్చిన కోచ్ ఎక్ గుహలో చిన్నారులకు ఆత్మస్దైర్యాన్ని నింపడం నిజంగా అధ్బుతం.  కోచింగ్‌ అంటే ఫుట్‌బాల్‌ను ఎలా తన్నాలో, ఎలా గో‌ల్ చేయాలో, ప్రత్యర్ది జట్టు గోల్ చేయకుండా ఎలా నిలువరించాలో చెప్పడమే కాదని, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పడమేనని కోచ్ ఎక్ నిరూపించారు. ఈ సంఘటన నుంచి ప్రపంచ దేశాలు... ముఖ్యంగా భారతదేశం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడడం అలవర్చుకోవాలి. ఒక ఘటన జరిగితే ఎంత వేగంగా స్పందించాలో నేర్చుకోవాలి. ఏలికలకు ప్రజలపై ప్రేమ, గౌరవం, వారికి రక్షణ కల్పించాలనే బాధ్యత ఉండాలి. ప్రజలంటే ఐదేళ్ళకొకసారి కనిపించే ఓటర్లుగా చూడకూడదు. కుటుంబంలో పిల్లల పట్ల తలిదండ్రులు ఎంత శ్రద్దగా, ప్రేమగా ఉంటారో పాలకులు కూడా ప్రజల పట్ల అంతే ప్రేమ, శ్రద్ద, బాధ్యతతో మెలగాలి.

వైఎస్ యాత్ర కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా?

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ల ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే మహానటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. మరో రెండు బయోపిక్ లు కూడా త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.. వాటిళ్లో ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ కాగా, మరొకటి వైఎస్ఆర్ బయోపిక్.. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నాడు.. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.. ఇక వైఎస్ఆర్ బయోపిక్, యాత్ర పేరుతో ఆనందోబ్రహ్మ ఫేమ్ 'మహి వి రాఘవ' దర్శకత్వంలో తెరకెక్కుతుంది.. వైఎస్ జయంతి సందర్బంగా తాజాగా యాత్ర టీజర్ విడులైంది.. టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.. అయితే ఇప్పుడు యాత్ర సినిమా గురించి ఒక ఆసక్తికమైన చర్చ జరుగుతుంది.. అదే వైఎస్ 'యాత్ర' వైసీపీకి మేలు చేస్తుందా? లేక కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?. యాత్ర సినిమా 'వైఎస్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి ఎలా వెళ్లారు? సీఎం ఎలా అయ్యారు' అనే పాయింట్ మీద తీస్తున్నట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యాత్ర సినిమా విడుదలైతే, జగన్ కూడా తన తండ్రి లాగే కష్టపడుతున్నాడనే భావన ప్రజలకి వెళ్లి, వచ్చే ఎన్నికల్లో జగన్ కి బోలెడంత ప్లస్ అవుతుందనేది వైసీపీ నేతల భావన అని తెలుస్తోంది.. అయితే ఇప్పుడు తాజాగా ఒక కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో వైఎస్ పేరొకటి.. వైఎస్ కాంగ్రెస్ లో ఉండి, కాంగ్రెస్ కోసం పాదయాత్ర చేసారు.. తరువాత సీఎం పదవిని చేపట్టారు.. చివరి శ్వాస కూడా కాంగ్రెస్ లోనే వదిలారు.. అలాంటి వ్యక్తి బయోపిక్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రస్తావన వస్తుంది.. అదే జరిగితే జగన్ కి కాదు కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందనే మాట వినిపిస్తుంది.. ఏపీలో ఒకప్పుడు మెజారిటీ మైనార్టీలు, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు.. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కాంగ్రెస్ ని వీడి వైసీపీ లో చేరారు.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. వైసీపీ బీజేపీ తో దోస్తీ దిశగా అడుగులు వేస్తోంది.. మరోవైపు కాంగ్రెస్ ఏపీలో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టింది.. దీంతో కొందరు తిరిగి కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. ఇదే సమయంలో యాత్ర సినిమా వస్తే.. వైఎస్, కాంగ్రెస్ వ్యక్తి అనే విషయం జనాల్లోకి వెళ్లి కాంగ్రెస్ కి మేలు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది.. చూద్దాం మరి ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ కి యాత్ర బలం అవుతుందో? లేదో?.

ఆ ఇరవై మంది ఓటమే కేసీఆర్ ప్రధాన లక్ష్యం..!

  కేసీఆర్ మాటే కాదు నిర్ణయాలు కూడా దూకుడుగా ఉంటాయని అందరూ అంటుంటారు.. ఓ వైపు కేంద్రంలో బీజేపీ, ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది.. అలానే తెలంగాణలో కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు.. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి, ప్రజలు ప్రభుత్వం మీద సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్ళటం మంచిదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ కూడా విసిరారు.. ప్రతిపక్షాలు కూడా మేమూ సిద్ధం అంటూ ప్రతిసవాల్ విసిరాయి.. అయితే తెరాస నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు పైగా గెలుస్తామని, తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా పోతుందని భావిస్తోన్నారు. 'వంద సీట్లు గెలవడం.. ప్రతిపక్షం లేకుండా చేయడం' దీన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా కేసీఆర్ దాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.. తెరాస గెలుపు కష్టంగా ఉన్న ఒక ఇరవై నియోజకవర్గాల లిస్ట్ రెడీ చేపించారట.. అక్కడున్న బలమైన విపక్ష నేతలను ఓడించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యమట.. ఆ ఇరవై మంది విపక్ష నేతలను ఓడించడం కోసం కేసీఆర్ ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తున్నారట.. ఆ ఇరవై మంది ఓడిపోతే తెలంగాణలో తెరాసకు ఎదురే ఉండదు, అసలు ప్రతిపక్షమే ఉండదని కేసీఆర్ అనుకున్నారట.. ఇదే జరిగితే తెలంగాణలో అధికారం పొందాలని ఆశపడుతున్న కాంగ్రెస్ కు ఏపీలో పరిస్థితే ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తెరాస అనుకున్నట్టు నిజంగా వచ్చే ఎన్నికల్లో వందకి పైగా సీట్లు గెలిచి ప్రతిపక్షం లేకుండా పోతుందా? అంటే.. ఆ ఇరవై మందిని ఓడించగలిగితే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల భావన.. కానీ ఆ ఇరవై మందిని ఓడించడం అంత ఈజీ కాదు.. వాళ్ళని ఓడించే వ్యూహాలు కేసీఆర్ ఎలా రచిస్తారో చూడాలి అంటున్నారు.. అయితే ఆ ఇరవై మంది ఎమ్మెల్యేల లిస్ట్ లో విపక్ష పార్టీల బలమైన నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, కోమటిరెడ్డి, మల్లు భట్టి, రేవంత్ రెడ్డి, డి.కె అరుణ లాంటి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది..  ఇక బీజేపీ నుండి లక్ష్మణ్, కిషన్ రెడ్డి కాగా.. టీడీపీ నుండి సండ్ర వెంకటవీరయ్య పేర్లు వినిపిస్తున్నాయి.. చూద్దాం మరి ఈ నేతల్ని ఓడించడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో.. ముందస్తు ముందస్తు అంటూ వంద సీట్ల టార్గెట్ కోసం కేసీఆర్ ముందు నుండే అస్త్రాలు సిద్ధం చేస్తున్నారుగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

కిరణ్ ఎంట్రీ.. కేవీపీ ఎగ్జిట్..!!

  రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని ఏపీ ప్రజలు అనుకుంటారు కానీ, విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ కూడా అంతే అన్యాయం అయిపోయింది అనేది వాస్తవం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, విభజన అనంతరం ఏపీలో అంధకారంలోకి వెళ్ళింది.. ఆ పార్టీ నాయకులంతా టీడీపీ, వైసీపీ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ కేడర్ చాలావరకు వైసీపీకి వెళ్ళిపోయింది.. దీంతో ఇక ఏపీలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే అనుకున్నారు అంతా..  ఢిల్లీ పెద్దలు కూడా అదే అనుకున్నట్టున్నారు.. అందుకే 2014 ఎన్నికల ఘోర పరాజయం తరువాత, ఇక కాంగ్రెస్ ఏపీ మీద దృష్టి పెట్టలేదు.. ఉన్న ఒకరిద్దరు నాయకులు కూడా వేరే పార్టీలో చేరలేక, కాంగ్రెస్ ని బలపరచలేక కిందామీదా పడుతున్నారు.. నాలుగేళ్లుగా ఏపీ మీద పెద్దగా దృష్టి పెట్టని అధిష్టానం, ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతుంది.. మోడీ మీద ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవ్వడం.. బీజేపీ సౌత్ లో అంతగా బలపడకపోవడంతో.. కాంగ్రెస్, మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలని చూస్తుంది.. అలానే ఒకప్పుడు పట్టున్న సౌత్ రాష్ట్రాల్లో తిరిగి పుంజుకోవాలని చూస్తుంది..  దానిలో భాగంగానే కాంగ్రెస్, ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. పార్టీ ని వీడి, వేరే పార్టీలో చేరకుండా ఉన్న కొందరు సీనియర్ నాయకుల్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తుంది.. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ ని కాంగ్రెస్ సంప్రదించింది.. విభజన సమయంలో 'లాస్ట్ బాల్.. లాస్ట్ బాల్' అంటూ చివరికి చేతులెత్తేసి సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ను వీడిన కిరణ్.. కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి కొన్ని షరతులు, అలానే పార్టీకి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది.. కిరణ్ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తూ ఫస్ట్ బాల్ కే కేవీపీ ని ఔట్ చేయాలని చూస్తున్నారట..  కేవీపీ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా, వైసీపీ కి మద్దతుగా పనిచేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.. దీనివల్లే కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకోలేకపోయిందని భావించిన కిరణ్, ముందు కేవీపీ లాంటి వారికి చెక్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తుంది.. అలానే వైసీపీ మీద సానుభూతి ఉండకూడదు, ఆ పార్టీ ప్రత్యర్థి బీజేపీతో దోస్తీకి సిద్ధమైంది.. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే, అందుకే వైసీపీ ని టార్గెట్ చేసి వారిని తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేలా చేయాలని కిరణ్ సూచించినట్టు తెలుస్తుంది.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే దిశగా పావులు కడుపుతుందట.. చూద్దాం మరి కాంగ్రెస్ ఏ మేరకు తన ఓటు బ్యాంకును తిరిగి సాధించుకుంటుందో.  

మహాకూటమికి భయపడని మోడీ..!!

  2014 ఎన్నికలు సమయంలో మోడీ హవా బాగా కొనసాగింది.. ఎక్కడికెళ్లినా మోడీనే పీఎం అని బలంగా వినిపించింది.. అనుకున్నట్టే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మోడీ పీఎం అయ్యారు.. మోడీ దెబ్బకి కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కించుకోలేకపోయింది.. మోడీ హవాలో ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా.. దానికి తగ్గట్టే మొదటి మూడేళ్లు మోడీ దూసుకెళ్లారు.. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. నాలుగో ఏడాది మోడీ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత, విమర్శలు, కొన్ని మిత్రపక్షాలు దూరం..  ఇలా ఒకదాని తరువాత ఒకటి మోడీని చుట్టుముట్టాయి.. దీంతో కాంగ్రెస్ కి తిరిగి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది.. కాంగ్రెస్ తాము అధికారంలోకి రావడం ముఖ్యం కాదు, మోడీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యం అంటూ పావులు కదపడం మొదలు పెట్టింది.. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమైంది.. అనుకున్నట్టే కొన్ని ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చింది.. కర్ణాటకలో జేడీఎస్ కి మద్దతిచ్చి బీజేపీకి అక్కడ అధికారం దక్కకుండా చేసింది.. ఇదే ఫార్ములాతో వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించాలని కాంగ్రెస్ భావిస్తుంది..  మోడీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసి, మహాకూటమిగా ఏర్పడి, వచ్చే ఎన్నికల్లో మోడీని దెబ్బ తీయాలని భావిస్తుంది.. ఈ మహాకూటమితో మోడీ భయపడతారు.. ఆచితూచి అడుగులు వేస్తారు అనుకున్నారు.. కానీ మోడీలో మహాకూటమి భయం ఏ మాత్రం కనిపించట్లేదు.. మహాకూటమిని చాలా సింపుల్ గా తీసేస్తున్నారు. తాజాగా మోడీ మహాకూటమి గురించి స్పందించారు.. 'మహాకూటమి విషయంలో తనకు ఎలాంటి ఆందోళన లేదని.. అసలు కూటమి సక్సెస్ అయ్యే అవకాశమే లేదని తేల్చేశారు.. పొత్తులు కుదుర్చుకోవాలంటే ప్రధాన పార్టీ ఒకటి ఉండాలి కానీ మహాకూటమిలో ప్రధాన పార్టీ అన్నదే లేదని తేల్చారు..ప్రతిపక్షాలను కలిపి ఉంచుతున్నది మోడీపై ద్వేషం ఒక్కటే.. కాంగ్రెస్ తన మనుగడ కోసం పోరాటం చేస్తోంది.. ప్రతిపక్షాల్లోని అందరి దృష్టి అధికారం మీదనే.. వ్యక్తిగత మనుగడ, ప్రధాని పదవి తప్ప వాళ్లకు మరొకటి అక్కర్లేదు..  ప్రధాని పదవిని చేపట్టటానికి రాహుల్ సిద్ధంగా ఉన్నానని చెప్పారు.. తృణమూల్ అధినేత్రి మమతా కూడా ప్రధాని పదవిపై కన్నేశారు.. కానీ, ఆమెకు వామపక్షాలకు పడదు.. ప్రధాని పదవి తమ అధినేత తప్ప అర్హుడు లేడని సమాజ్ వాదీ అంటుంది.. కాంగ్రెస్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారు.. పొత్తుల కోసం ఎక్కే గడప దిగే గడప అన్నట్లు ఉంది ఆ పార్టీ పరిస్థితి.. ఇప్పుడా పార్టీ ప్రాంతీయ పార్టీలా మారింది' అని మోడీ అన్నారు.. వ్యతిరేకత, విమర్శలు, మహాకూటమి ఇవేమి మోడీని బయపెట్టట్లేదు.. చూద్దాం మరి వచ్చే ఎన్నికల్లో మోడీ అనుకున్నట్టు జరుగుతుందో లేదో.