కులంపై కొందరు, కులం అడ్డు పెట్టుకుని కొందరు..

కులం… భారతదేశంలో ఇదో బ్రహ్మపదార్థం! ఎవరికి నచ్చినట్టు వారు అర్థం చేసుకుంటారు! కొందరు కులమే అన్ని సమస్యలకి కారణం అంటే… కొందరు కులం పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునే వారి వల్లే అశాంతి అంటారు. ఏది ఏమైనా కులం గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు రాసినా, ఎవరు చదివినా భావోద్వేగాలు చెలరేగటం మాత్రం సర్వ సాధారణం.     వేలాది ఏళ్ల కుల వ్యవస్థ ఒక్కసారిగా పోదనేది నిజం. కానీ, మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చీ, రాజ్యాంగం రాసుకుని, కుల వివక్ష నేరమని నిర్ణయించుకున్నాక కూడా కులం పోయిందా? లేదు! కనీసం బలహీనపడిందా? అదీ అనుమానమే! చాలా సందర్భాల్లో కులం గతం కంటే చాలా బలహీనమైందని మనకు అనిపిస్తూ వుంటుంది. గతంలో లాగా ఇప్పుడు గుళ్లలోకి దళితుల్ని రానీయకపోవటం, అంటరానితనం, ఇతర వెనుక బడిన కులాల వార్ని కూడా అనేక పద్ధతుల్లో అవమానించటం, దోపీడి చేయటం బాగా తగ్గింది. కానీ, అదే సమయంలో కులం చుట్టూ కొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి. విచిత్రంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత ప్రాముఖ్యత మీడియాలో ఇప్పుడు కులం పొందుతోంది! అదే ఆందోళనకరం!     ఈ మధ్యే… క్రికెటర్ గా మనందరికీ తెలిసిన మహ్మద్ కైఫ్ ఓ న్యూస్ వెబ్ సైట్ పై మండిపడ్డాడు. ట్విట్టర్ లో ది వైర్ అనే వెబ్ సైట్ వారు ప్రచురించిన ఆర్టికల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంతకీ, మహ్మద్ కైఫ్ కు కోపం తెప్పించిన ఆ వ్యాసం దేని గురించి అంటే… భారత క్రికెట్ లో ఎస్టీ, ఎస్టీల సంఖ్య సరైన నిష్పత్తిలో లేదని! ది వైర్ వారి ఉద్దేశం ప్రకారం… 86 ఏళ్ళ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురే ఎస్సీ, ఎస్టీ క్రీడాకారులున్నారు. జనాభా లెక్కల ప్రకారం చూస్తే వారు 70 మంది దాకా వుండాలి. కానీ, దళితులకి, గిరిజనులకి ఇండియన్ క్రికెట్ లో అవకాశాలు రావటం లేదని వ్యాస కర్త ఆరోపణ! మహ్మద్ కైఫ్ దీనిపై ఘాటుగా స్పందించాడు. ఇండియాలో కుల వివక్ష లేని అతి కొద్ది రంగాల్లో క్రికెట్ ఒకటని, అనవసర విశ్లేషణలు చేసి దాని పేరు చెడగొట్టవద్దని కైఫ్ అన్నాడు. అతడికి నెటిజన్స్ నుంచీ మద్దతు కూడా బాగానే వచ్చింది. క్రికెట్ కాస్త డబ్బున్న వాళ్ల ఆట. కాటట్టి అందులో ఎలాగూ దళితులు, గిరిజనులు తక్కువే వుంటారు. వారే కాదు బీసీలతో సహా చాలా వర్గాలు ఇండియన్ క్రికెట్లో తక్కువగా ప్రాతినిధ్యం కలిగి వున్నాయి. అందుకు వివక్ష కొంత కారణం కావచ్చేమోగాని… అంతకంటే ఎక్కువగా క్రికెట్ ఆడే ఆర్దిక స్థోమత కేవలం కొన్ని వర్గాలకే వుండటం ప్రధాన కారణం. ఇంత చిన్న విషయం ది వైర్ అనే మీడియా సంస్థకి తెలియదా? తెలిసినా ఈ మధ్య అనేక పేపర్లు, ఛానళ్లు, వెబ్ సైట్లు కులం మీద చర్చోపచర్చలు నడిపి జనాన్ని ఎమోషనల్ చేసి పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి. ఆ మధ్య కంచ ఐలయ్య వర్సెస్ వైశ్యుల వివాదంలో మన మీడియా అత్యుత్సాహం మనం మరిచిపోగలమా?     ది వైర్ లాంటి పేరున్న మీడియా సంస్థలు క్రికెట్ లో కులం అంటూ చిన్న సమస్యని భూతద్దంలో చూపిస్తుంటే… అసలు కులం ప్రభావం మరికొన్ని చిన్న వార్తలు చూస్తే మనకు తెలిసిపోతుంది. రాజస్థాన్ లోని ఓ గ్రామంలో తండ్రి చివరి కోరికగా తన నలుగురు కుమార్తెల్నే తలకొరివి పెట్టమన్నాడు. ఆయనకు కొడుకులు లేకపోవటంతో అమ్మాయిలే ఆ పని చేయాల్సి వచ్చింది. కానీ, కూతుర్లు చితికి నిప్పు పెట్టడం కుల పెద్దలకు నచ్చలేదట. తండ్రి లేని ఆ నలుగురు కూతుళ్లకి రాజస్థాన్ లోని ఆ గ్రామపు ఖాప్ పంచాయితీ పెద్దలు బహిష్కరణ విధించారు. విషాదం చోటు చేసుకున్న వారింటికి ఎవరూ భోజనం పంపటం లాంటి కనీస సహాయం కూడా చేయలేదట. సాటి కులస్థులు వచ్చి ఓదార్చాల్సింది పోయి మరింత దాష్టీకం ప్రదర్శించారు! ఎక్కడో రాజస్థాన్ లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనూ కులం ఎప్పుడూ కలకలమే! ఒక వైపు రాజకీయ నేతలు కుల రిజర్వేషన్లు అంటూ పబ్బం గడుపుకుంటూ వుంటే… మరో వైపు సిద్ధిపేటలోని ఓ గ్రామంలో చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందని అన్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇష్టానుసారం పొడిచి పారిపోయాడు. ఆమె చావు బతుకుల మధ్య వుంది. కులం అసలు సిసలు ప్రభావం ఇది!     క్రికెట్ లో ఏ కులం వారున్నారు, లేరు అన్న దాని కన్నా ముందు పోరాడాల్సింది … సాటి మనుషుల్ని, స్వంత కుటుంబీకుల్నే చంపుకునే కులోన్మాదంపైన! కానీ, మన మీడియా రాను రాను సంచలనాల మీదే దృష్టి ఎక్కువగా పెడుతోంది. కులం పేరుతో ఎంత రచ్చైతే అంత టీఆర్పీ అన్నట్టుగా కథ నడిపి లాభం పొందుతోంది. అందుకు తగ్గట్టే కొందరు మేధావులు, ఉద్యమకారులు కొంత వర్గం స్వార్థ మీడియాతో చేతులు కలుపుతున్నారు. కులం ప్రాతిపదికన ఎంత అసహనం, అశాంతి రేగినా వీరు తమ పని తాము చేసుకుపోతుంటారు. అలాగని నిజమైన కుల వివక్షకు లోనవుతున్న వారికి వీరి ఉద్యమాలు, చర్చలు, వ్యాసాంగాల వల్ల లాభం అంటే… చాలా స్వల్పమనే చెప్పాలి! స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లైన ఈ తరుణంలో మనం కులంపై పెద్ద పెద్ద విజయాలే సాధించాం. ఇంకాస్త నిజాయితీ వుంటే ఇంకా త్వరగా పూర్తి గెలుపు సాధిస్తాం. కానీ, అంత వరకూ జనం స్వార్థ రాజకీయ నేతలు, మీడియా ట్రాప్ లో పడకుండా… కులంపై నిజంగా పోరాటం చేస్తున్న వారి వెంట నడవాలి!

అంపశయ్యపై "కరుణ"

తాను ఎప్పుడు మరణించాలో నిర్ణయించుకున్న మహానుభావుడు భీష్ముడు. భారతంలో భీష్ముడ్ని మించిన ధీరుడు లేడు. భారతంలో భీష్ముడికి మించిన యోధుడూ లేడు. దక్షిణ భారతదేశంలో ఆనాటి భీష్ముడికి సరితూగే నాయకుడు తమిళనాట పుట్టాడు. ఆయనే నేడు అంపశయ్యపై ఉన్న కలియుగ భీష్ముడు ముత్తువెల్ కరుణానిధి. నేటి రాజకీయాలను... నేటి సినిమాలను... నేటి సమాజాన్ని చూసి కరుణానిధిని అంచనా వేయడం ఏమంత మంచిది కాదు. ఆయన దీక్షాదక్షతులు తెలియాలంటే కాసింత వెనక్కి వెళ్లాల్సిందే. విప్లవ పోరాటమంటే తెల్లగుర్రమ్మీద స్వారీ అనుకున్నావా నా స్వామీ అన్నాడు ఓ విప్లవ కవి.ఆ మాటలు కరుణానిధికి సరిగ్గా అతికినట్లు సరిపోతాయి. రాజకీయ పోరాటమంటే తెల్ల గుర్రం మీద స్వారీ కాదని కరుణానిధికి ఎప్పుడో... ఏనాడో తెలిసింది. పోరాటం గురించి తెలుసుకోవాలంటే కరుణానిధి గురించి తెలుసుకోవాలి.     నిరంతరం నల్ల కళ్లాద్దాల వెనుక దాగి ఉన్న ఆ కళ్లలోని కసిని... ఆరాటాన్ని.... ఏదో చేయాలనే ఆరాటాన్ని తెలుసుకోవాలంటే కష్టమే. ఆ పనిని ఆయన వారసులే చేయలేకపోయారు. అందుకే చెట్టుకొకరు... పుట్టకొకరుగా మారారు. కరుణానిధి అంటే ఓ ముఖ్యమంత్రే కాదు.... ఆనాటి సమాజానికి మిగిలిన ఏకైక తీపి గురుతు. ఆ తీపి గురుతు అందర్ని వదిలి వెళ్లిపోవాలనుకుంటోంది. నిజంగా అలాగే అనుకుంటున్నారా కరుణానిధి. అదే కోరుకుంటున్నారా... కాదు అంటున్నారు ఆయనే. అందుకే గడచిన కొన్ని రోజులుగా ఆయన అంపశయ్యపై ఊగిసలాడుతున్నారు. ఏదో చేయాలనే తపనతో కొట్టిమిట్టాడుతున్నారు. ఆయన ప్రాణాలు తమిళ ప్రజల కోసం ఆరాటపడుతున్నాయి. చావు అందరికి సమానమే అయినా... చావు అందరినీ సమానంగా ప్రేమించలేదు.... సరిగ్గా కరుణానిధి విషయంలోనూ అదే జరిగింది. అదే జరుగుతోంది. 94 నాలుగేళ్ల వయసులో కరుణానిధి మరణంతో పోరాడుతున్నారు. కాదు... కాదు... ఓ విఫలయత్నంతో ఆరాటపడుతున్నారు.   సమాజాన్ని మార్చాలనుకోవడమే ఆ విఫల యత్నం. విఫలం అనేది కరుణానిధి ప్రయత్నమే తప్ప లక్ష్యం కాదు... అందుకే 94 ఏళ్ల వయసులోనూ ఆయన శరీరం మరణం వైపు చూడడం లేదు. 1969 సంవత్సరంలో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి 50 సంవత్సరాలు అయ్యింది. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఇరవై ఏళ్లకే కరుణానిధి తన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి వరకూ ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధికి ఆ పదవి కంటే కూడా కవిత్వం... రచనలు... సాహితీ చర్చలంటేనే ఎక్కువ ఇష్టం. ఆయన జీవితమంతా రచనలతోనూ.... వివిధ స్క్రిప్టులతోనే గడిచింది. తొలినాళ్లలో నాటక రంగంలోనూ... ఆ తర్వాత సినీ రంగంలోనూ రచయితగా వెలుగొందిన కరుణానిధి... తన మిత్రుడు, తమిళ మహా నటుడు ఎం.జీ.ఆర్ గా పిలువబడే ఎం.జి.రామచంద్రన్ తో కలిసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.     ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉన్నంత వరకూ కరుణానిధికి ఢోకా లేకుండానే పోయింది. ఆయన మరణంతో ఓ మంచి మిత్రుడ్ని కోల్పోయిన కరుణానిధికి రాజకీయ పోరు అప్పుడే జయలలిత రూపంలో ఎదురైంది. జయలలిత బతికి ఉన్నంత వరకూ ఈ ఇద్దరు నేతల మధ్య నీరు కూడా నిప్పుగా మారింది. వీరిద్దరి ఆధిపత్య పోరులో ఒకసారి ఒకరిది పైచేయి అయితే... మరొకసారి వేరొకరిది పైచేయిగా నిలిచింది. అయితే, జయలలిత అధికారంలో ఉండగా చూపించిన కక్షపూరతి చర్యలను కరుణానిధి మాత్రం ఎప్పుడూ చూపించలేదు. ఇది ఆయన రాజకీయ విచక్షణకు గీటురాయి. జయలలిత ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే కరుణానిధి ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపించి ఆయనను అరెస్టు చేసిన తీరును తమిళ ప్రజలే కాదు... యావత్ దేశ ప్రజలందరూ తప్పు పట్టారు. అప్పటికే ముదుసలి అయిన కరుణానిధిని తమిళ పోలీసులు కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా ఆయన్ని అరెస్టు చేశారు. ఇది తమిళ ప్రజలకు... ముఖ్యంగా డిఎంకె కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయ కక్షలకు ఆ సంఘటన ఓ మచ్చుతునక. కరుణానిధిలో పరిణితి చెందిన  ఓ రాజకీయ నాయకుడ్ని తమిళ ప్రజ చూసింది. ఆయనలోని పట్టుదల... మూర్తీభవించిన మానవత్వం... ప్రజలకు ఏదో చేయాలనే తపనే ఆయనకు ఇంతటి పేరు తీసుకువచ్చింది.     తన రచనల్లోనే కాదు... తన ఏలికలో కూడా తమిళనాడులోని బడుగు, బలహీన వర్గాల వారికి కరుణానిధి చేసిన మేలు వారు మరువలేనిది. ఆయన ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదర్శంగా నిలిచాయి. బహుశా అందుకేనేమో... కరుణానిధిని చికిత్స నిమిత్తం చేర్పించిన కావేది ఆసుపత్రికి లక్షలాది మంది చేరుకుంటున్నారు. తమ నాయకుడిని చూడాలని... ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నారు. తమిళనాట అన్ని దేవాలయాలు... మసీదు... చర్చిలు.. ఇతర ప్రార్ధనా మందిరాల్లోనూ కరుణానిధి ఆరోగ్యం కోసం పూజలు జరుగుతున్నాయి. ఒక నాయకుడికి ఇంతకంటే ఏం కావాలి. ఆయన సంపాదించిన కోట్ల ఆస్తులు... తన వారసులు.. తన గెలుపోటముల కంటే ప్రజాదరణ ఎంతో గొప్పదో మరోసారి బహిర్గతమైంది. నిరంతరం ప్రజల కోసం ఆరాటపడే వారి వెంట ప్రజలు వెల్లువలా ఉంటారనడానికి కరుణానిధే ఓ సజీవ సాక్ష్యం. అంపశయ్యపై ఉన్న కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశిద్దాం.

బాల్యాన్ని కాపాడుకుందాం....!!

బాల్యం కనపడడం లేదు. బాల్యం బాగుండడం లేదు. బాల్యం బరువులు ఎత్తుతోంది. బాల్యం భారాన్ని  మోస్తోంది. బాల్యమంటే బంగారం కదా...! బాల్యమంటే దాచుకోవాల్సిన నెమలీక కదా...! బాల్యమంటే కొన్ని గురుతుల సంగమం కదా...! నేడు నలభైలు దాటిన వారందరి బాల్యం దాచుకున్నదే కదా.... ఆనందంగా... "ఆ రోజుల్లో మేం" అని చెప్పుకుంటున్నదే కదా...! మరి ఈనాటి బాల్యానికి ఆనాటి మన బాల్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. ఆవకాయ కలిపి ఎర్రటి అన్నం ముద్దలు ఎందుకు తినిపించలేకపోతున్నాం. ఓ పలకా... బలపం... కొంచెం ఎదిగితే రెండంటే రెండే పుస్తకాలు.... ఇవే కదా ఆనాటి చదువుల వనరులు. మరి నేడెందుకు బండెడు పుస్తకాల బరువును బాల్యం నడుముకి కట్టేస్తున్నాం. నలభై.. ఏభై, అరవై ఏళ‌్ల  క్రితం వాళ్లే కదా.... ఇప్పుడున్న ఉన్నతాధికారులు. ప్రధానులు... ముఖ్యమంత్రులు... మంత్రులు...వారంతా సర్కార్ బడుల్లో చదువుకునే ఇప్పుడు ఈ స్థితిలో వచ్చారు.  ఈ నారాయణలు... చైతన్యలు కూడా చదువుకున్నది... మోసింది ఆ పాఠశాలలు.... ఆ తేలిక పాటి చదువులే కదా... మరి మనమెందుకు ఈనాటి బాల్యాన్ని కష్టాల పాలు చేస్తున్నాం.     దేశంలో బాల్యానికి సంకెళ‌్లు పడ్డాయి. ర్యాంకుల జైళ్లలోకి ఎప్పుడెప్పుడు తోసేద్దామా అని తలిదండ్రులు రెట్టించిన ఉత్సాహం చూపుతున్నారు. నిజానికి ఇరవై సంవత్సరాల క్రితమే బాల్యానికి దేశ బహిష్కరణ జరిగిపోయింది. మన దేశం నుంచి బాల్యం అనే పదం ఎప్పుడో ఎగిరిపోయింది. మనది బాల్యం లేని దేశంగా.... పసితనం ఎరుగని దేశంగా.... చిన్నారుల నిషేధిత దేశంగా "ఎదిగిపోయింది ". మన వాళ్లు అమెరికా విమానాలకు క్యూలు కట్టడం... డాలర్ల మాయకు దాసోహమవ్వడం ఎప్పుడు ప్రారంభమైందో ఆనాడే మన ఇళ‌్ల నుంచి బాల్యం గెంటివేయబడింది. పల్లెటూళ్లు లేవు... పట్టణాలు కనుమరుగవుతున్నాయి. నగరాలు అత్యంత ఆధునికతలో " ఊగిపోతున్నాయి". ఇక భవిష్యత్‌ని గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుంది. ఉండదు.. ఉండకూడదు. ఒకవేళ ఒకరిద్దరికి ఉన్నా.... వారు అమయాకులు...బతకడం చేత కాని వారు... తమ పిల్లల " భవిష్యత్‌ని కాలరాస్తున్నవారు". " మా అబ్బాయికి మూడో తరగతిలోనే ఫస్ట్ ర్యాంకు వచ్చింది.  మాది కోనసీమే అయినా... మా అమ్మాయికి తెలుగులో మాట్లాడడం రాదు. ఇంచక్కగా ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది" ఇది నేటి తలిదండ్రుల గొప్పతనం.     పరాయి భాష చుట్టంలాగో... ఆపదలో ఆదుకునే స్నేహతుడిలాగో ఉండాలి తప్ప తల్లి భాషలా... ఆ మాటకొస్తే తల్లినే ఏమార్చే భాషలా ఉండకూడదని మన జాతికి తెలియడం లేదు. బ్రిటీషు వారి పాలనలో తెలియక బానిసత్వంలో మగ్గిన భారతదేశం... ఇప్పుడు అన్నీ తెలిస.ి... కావాలనే... ఇష్టంతోనే....బానిసగా మారుతోంది. ఇదే ఇక్కడి అసలైన విషాదం. గందరగోళంలో పడి మన బాల్యం ఏం చేయాలో... ఎటు పోవాలో తెలియక అయోమయంలో ఉంది. దీన్ని మార్చాల్సిన ప్రభుత్వాలు కూడా తాత్కాలికంగా ఏమారుస్తున్నాయే తప్ప పట్టింపు లేకుండా ఉంటున్నాయి. దీనికి ఫలితం కొందరు ఇప్పుడే అనుభవిస్తున్నా... మరికొందరు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు. కాస్లులో ఇంగ్లీషు అర్ధం కావడం లేదని ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీలో సీటు రాలేదని మరో అమ్మాయి ఏకంగా 13 అంతస్తుల నుంచి దూకేసి చచ్చిపోయింది. చిన్నతనం నుంచి గ్రామంలోనే పెరిగిన ఆ అబ్బాయికి ఇంగ్లీషు ఎలా అర్ధం అవుతుంది. ఇంగ్లీషు రానంత మాత్రాన తనువు చాలించాల్సిందేనా... మరి పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయికి మెడికల్ కాలేజీలో సీటు రాకపోతే మరణమే శరణ్యమా.... ఈ చదువులు ఎవరు చెబుతున్నారు.        ఏ క్లాసుకు సంబంధించి అయినా... ఏ ప్రవేశ పరీక్షలకు సంబంధించి అయినా ఫలితాలు వస్తున్నాయంటే భయమేస్తోంది. ఎక్కడ ఎలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందో అని. చదువంటే మార్కులేనా... చదువంటే ర్యాంకులేనా... బాల్యమంటే పుస్తకాల మోతేనా.... అవే తప్ప మరింకేమీ లేకుండా చేసిన... చేస్తున్న ప్రభుత్వాలు... పాఠశాలలు... కళాశాలలను ఏం చేయాలి...? బాల్యానికి భరోసా ఇవ్వకుండా చేస్తున్న ప్రభుత్వాలను ఏం చేయాలి...? తాను పరీక్షలో తప్పినా... తన స్నేహితుడు పరీక్షలో నెగ్గాడనే ఆనందాన్ని తన తాతతో పంచుకున్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మనమేం నేర్చుకోమా...? వీధి బడిలో చదువుకున్న అబ్దుల్ కలామ్ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడని తెలిసీ మనం ఇలాగే మిగులుదామా...? సంతకం కూడా చేయడం రాని టంగుటూరి అంజయ్య సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పని చేశాడని గుర్తు చేసుకోమా...? బాల్యాన్ని చిదిమేసి... ఛిద్రం చేసి... అసలు అది లేకుండా చేసేసి మానవ జన్మలో ఓ అపురూప దశను కనుమరుగు చేసేద్దామా..?     బాల్యం అనేది ఒకటుందని... అది అత్యంత అపురూపమని... నేటి తరానికి అర్ధం అయ్యేలా చెప్పలేమా...? వీడియో గేమ్స్... టీవీలో వచ్చే నానా చెత్త... తెలుగు సినిమాల్లో చిన్నారుల చేత చేయించే విచిత్ర వేషాలు.... కొత్తగా దిగుమతి అవుతున్న బ్లూవేల్ గెమ్స్ వంటి దారుణాల నుంచి బాల్యాన్ని రక్షించాలి కదా... దీనికి ఎవరు నడుం కడతారు... దీనికి ఎవరు ముందుకురుకుతారు... దీనికి ఎవరు తొలి అడుగు వేస్తారు... ఎవరో కాదు... మనమే... ప్రతి కుటుంబమే.... ప్రతి వ్యక్తే... ప్రతి తల్లే... ప్రతి తండ్రే... ప్రతి తాతే... ప్రతి మామ్మే... ప్రతి మామయ్యే... ప్రతి అత్తమ్మే.. దేశం కోల్పోతున్న బాల్యాన్ని దేశానికి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాజకీయ నాయకులూ... నేటి బాలలే... రేపటి మీ ఓటర్లు.... కనీసం అందుకోసమైనా ఈ మన బాల్యాన్ని కాపాడండి. అక్కున చేర్చుకోండి...

ఎన్నికల నాటికి మెగా ఫ్యామిలి జనసేనకు ‘ సైరా ‘ అంటుందా?

తెలుగు సినిమా రంగంలో టాలెంట్ వున్న వారికి ఎప్పుడూ ఆదరణ వుంటుంది లాంటి కామెంట్స్ ఎన్ని వినిపించినా… టాలీవుడ్ అనగానే మనకు కొన్ని ఫ్యామిలీలే గుర్తుకు వస్తాయి. వాటిలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి! నందమూరి, అక్కినేని, దగ్గుబాటి లాంటి కుటుంబాల్లాగే చిరు ఫ్యామిలీ కూడా తెలుగు సినిమా రంగంలో పాతుకుపోయింది. చిరంజీవి నుంచీ నిహారిక వరకూ తెలుగు సినిమాని ఆ కుటుంబం ఎంతగా ఆక్రమించవచ్చో అంతా అక్రమించేసింది. అయితే, అది తప్పనేం చెప్పలేం. జనం ఆదరిస్తున్నారు కాబట్టి మేం సినిమాలు చేస్తున్నాం అంటారు మెగా సెలబ్రిటీలు! అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే, మెగా ఫ్యామిలీ పొలిటికల్ గా కూడా అంతా ఒక్కటై ముందుకు సాగుతారా? ఇప్పుడు ఇదే డౌట్ మెగా ఫ్యాన్స్ లో ఏర్పడుతోంది! జనసేనతో జనంలో దూసుకుపోతోన్న పవన్ ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటారా? ఎలక్షన్ సినిమా క్లైమాక్స్ కల్లా మెగా హీరోలంతా పవర్ స్టార్ కి మద్దతుగా ప్రచారం హోరెత్తిస్తారా?     మెగా ఫ్యామిలి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది చిరంజీవే! ఆయన స్వయంకృషితో వేసిన పునాది రాళ్లే ఇప్పుడు నాగబాబు, పవన్, అల్లు అర్జున్, చరణ్, సాయి ధర్మతేజ్, వరూణ్ తేజ్, శిరీష్, నిహారిక… ఇంత మందికి నిలువ నీడనిస్తున్నాయి. మెగా హీరోలు, హీరోయిన్ కి టాలెంట్ వుంటే వుండొచ్చు. కానీ, వారందరికీ చిరు పేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పిస్తుందనేది కూడా నిజమే! ఇదే సూత్రం పాలిటిక్స్ లోనూ నిజమైంది. చిరంజీవి ప్రజా రాజ్యం ప్రాజెక్ట్ డిజాస్టరే అనే చెప్పుకోవాలి. అయినా అదే ఇవాళ్ల జనసేన ఆవిర్బావానికి మూలం. పీఆర్పీలో యువరాజ్యం నాయకుడిగా పవన్ చురుగ్గా పని చేశాడు. కానీ, ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ అయిపోయాడు. కారణాలు ఏవైనా కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం తరువాత మరింత మౌనం దాల్చాడు. ఉన్నట్టుండీ 2014కి ముందు జనసేనతో జనంలోకి వచ్చి మోదీకి, బాబుకి మద్దతు పలికాడు. కానీ, అన్నయ్య మాత్రం కాంగ్రెస్ లో వుండిపోయారు. తమ్ముడు కాంగ్రెస్ హఠావ్ అంటూ చెలరేగిపోయాడు!     పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్స్ ఇప్పటి పరిస్థితి ఏంటి? 2019లోనూ చిరు కాంగ్రెస్ పక్షానే ప్రచారం చేస్తారా? అసలు ఏపీ కాంగ్రెస్ కు చిరంజీవి అంతటి పాలోయింగ్ వున్న స్టార్ అవసరం వుందా? మరీ దయనీయంగా తయారైన ఆంధ్రా కాంగ్రెస్ కు చిరంజీవి ఏం ఉపయోగపడగలరు? ప్రస్తుతానికైతే సైరా సినిమా చేస్తోన్న మెగా స్టార్ ముందు ముందు జనసేనకి మద్దతు ఇవ్వటానికి సైరా అనరని గట్టిగా చెప్పలేం!     మెగా స్టార్ మౌనంగా సాగిపోతున్నా మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అవసరమైనప్పుడు నోరు తెరుస్తున్నారు. ఆయన కూడా జనసేనలో అధికారికంగా చేరకున్నా పవన్ కు మద్దతు అవసరమైన్పుడు గట్టిగా స్పందిస్తున్నారు. తాజాగా జగన్ వ్యక్తిగత దూషణతో పవన్ పై దాడి చేసినప్పుడు నాగబాబు రంగంలోకి దిగారు. మెగా ఫ్యామిలి నుంచీ పవన్ కు మద్దతుగా మాట్లాడిన వ్యక్తి నాగబాబు ఒక్కరే! జగన్ మాటల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంతకంటే ముందు నాగ బాబు కత్తి మహేష్ విషయంలో కూడా కలుగజేసుకున్నారు. పవన్ పై కత్తి వ్యాఖ్యల్ని పబ్లిగ్గా ఖండించి ఘాటు హెచ్చరికలు చేశారు. రాముడిపై కత్తి మహేష్ వ్యాఖ్యల దుమారం సమయంలో కూడా నాగబాబు అతడ్ని టార్గెట్ చేశారు. అలా చేయటం … పవన్ మీద గతంలో కత్తి చేసిన వ్యాఖ్యల వల్లేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! నిజంగా రాముడి మీద కత్తి వ్యాఖ్యల్ని నాగబాబు ఖండించారని అనుకోవటం మన అమాయకత్వమే అవుతుంది!     పవన్ కు ఇబ్బంది వచ్చినప్పుడల్లా… ఇప్పటికైతే నాగబాబే మాట్లాడుతున్నారు. మరి ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ పరిస్థితి మారుతుందా? నాగబాబు అధికారకంగా జనసేనలో చేరి పోటీ చేయటం లాంటివి చేస్తారా? చిరు కూడా సైరా పూర్తికాగానే తమ్ముడికి అండగా బరిలోకి దిగుతారా? పోటీ చేయకున్నా ప్రచారం చేసి పెడతారా? చరణ్ , బన్నీ లాంటి యంగ్ హీరోల సంగతేంటి? ఇప్పుడే చెప్పలేం! కానీ, మెగా ఫ్యామిలి అనుబంధం తెలిసిన వారు మాత్రం … అందరూ ఏ క్షణానైనా పవన్ వెనుక నిలిచే ఛాన్స్ వుందనే అంటారు! అదే జరిగి చిరు నుంచీ చరణ్  వరకూ మెగా టీమ్ మొత్తం జనసేనకు జైకొడితే అది రాష్ట్ర రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మార్పే అవుతుంది! ప్రధానంగా సీఎం అయిపోయినట్టు గట్టిగా భావిస్తోన్న ప్రతిపక్ష నేత జగన్ … ఉసూరుమనే ఫలితాలు కూడా రావచ్చు!

ఆకాశంలో ఓ అద్భుతం

ఖగోళంలో కనువిందు జరిగింది .... ఆకాశంలో  అద్భుతం జరిగింది. దివిలో దివ్యం జరిగింది. సైన్స్ ఒక పక్క, సంప్రదాయం మరొక పక్క వాదులాడుకుంటుంటే ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది. క్యాలండర్లు లేవు.... మూహుర్తాలూ లేవు... సీమా సమయ సందర్భాలూ నిర్ణయం కాలేదు. అయినా పంచభూతాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటున్నాయి. ఇది సైన్స్‌కి, సంప్రదాయానికి మధ్య భువిలో జరుగుతున్న వాదోపవాదమే తప్ప, సృష్టికి మాత్రం ఓ ప్రక్రియ. శుక్రవారం రాత్రి 11.54 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సరిగ్గా ఒంటి గంటకు సంపూర్ణ సూర్య గ్రహణంగా రూపాంతరం చెందింది. ఈ గ్రహణానికి ఆధునికులు, సనాతనులు ఎవరికి వారు తమ సంకల్పం చెప్పుకుంటున్నారు. ఇవేమీ పట్టని ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుంటోంది. ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుంచి చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు  వస్తూనే ఉన్నాయి. మరో వైపు మానవుడు తన మేథస్సుతో ఖగోళ రహస్యాలను తెలుసుకుంటూనే ఉన్నాడు. అయినా ప్రకృతిపై విజయం మాత్రం మానవాళికి అందడం లేదు.     భారతదేశ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.54 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి దేశంలో కోట్లాది మంది ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. తమ కళ్ల ముందే సంపూర్ణ చంద్రుడు కొద్ది కొద్దిగా కనుమరుగు కావడమనే అద్భుతాన్ని వీక్షించారు.  తెల్లని చంద్రుడు తమ ముందే ఎర్రని చంద్రునిగా మారడాన్ని చూసి దేశ ప్రజలు అచ్చరవొందారు. ఈ అద్భుత అందాన్నిదేశ ప్రజలు తనివితీర చూస్తూ ఆనందించారు. వెలుగును పంచే సూర్యుడికి, వెన్నెలను అందించే చంద్రుడికి మధ్య అప్పుడప్పుడు భూమి ప్రవేశించడమే గ్రహణం అంటే. ఈ చంద్ర గ్రహణ సమయంలో మాత్రం మరో అద్భుతం జరిగింది, అదే అంగారక గ్రహం భూమికి సమీపంలో రావడం. భూమికి దగ్గరైన అంగారకుడు అంతరిక్షంలో చంద్రగ్రహానికి అత్యంత సమీపంగా వచ్చాడు. దీంతో అంగారక గ్రహం అరుణ వర్ణంలో కనిపించింది.సంపూర్ణ చంద్రగ్రహణంపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.     శాస్త్రవేత్తలు చంద్రగ్రహణ సమయంలో ఏదైనా  తింటూ సెల్‌ఫోన్లతో చంద్రగ్రహణం సెల్ఫీ తీసుకోమంటూ ప్రచారం చేసారు. ఈ ప్రచారం వెనుక చంద్రగ్రహణం సైన్స్ మాత్రమేనని ప్రపంచానికి తెలియజేయడం వారి ఉద్దేశ్యం. మరోవైపు సనాతనులు చంద్ర గ్రహణంతో వివిధ రాశులలో ఉన్న నక్షత్రాలకు చెందిన మానవులపై పడే ప్రభావాన్ని చెబుతున్నారు. కర్కాటక రాశివారికి చిక్కులని, తుల రాశి వారికి మరొకటని ..... ఇలా అన్ని రాశుల వారికి చంద్ర గ్రహణ ఫలిత క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇంత శాస్త్ర, సాంకేతికత అభివ్రుద్ది జరగక ముందే ఎప్పుడో హేతువాది గోరాగారు ఈ గ్రహాణాలపై ప్రజలను అప్రమత్తం చేసారు.     అయితే ప్రజల విశ్వాసం మాత్రం సైన్స్‌కు దీటుగా పెరుగుతూనే వచ్చింది. అటు సనాతనులు చేస్తున్న వాదనలోను బలం ఉంది. తారిఖులు, దస్తావేజులు లేకుండానే సనాతనులు తమ ధర్మాన్ని అనుసరించి గ్రహణాలపై చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా తమ అనుభవాలను పరిగణలోకి తీసుకుని వారి వాదాన్ని వినిపిస్తున్నారు. వీరివురి సిద్దాంతాలను పక్కన పెడితే గ్రహణం అనేది మానవ జీవితంలో ఒక అద్భుతం.....కళ్ల ముందే గ్రహాలు కనుమరుగు కావడం ఊహకందని రహస్యం. ఈ రహస్యం ఇలా ఉంటేనే అందం......ఆనందం....అద్భుతం.... ఇంతటి అద్భుత గ్రహణం సంభవించేది మళ్లీ 2123 నాటికే. అంటే దాదాపు వందేళ్ల తర్వాతే. అందుకే ఈ అద్భుతాన్ని మధ్య ఆసియా నుంచి తూర్పు ఆఫ్రికా వరకూ అన్ని దేశాల ప్రజలు కనులారా వీక్షించారు.     శుక్రవారం రాత్రంతా పలు దేశాలలోని ప్రజలు టెలీస్కోపులకు అతుక్కుపోయారు. తమకు అత్యంత సమీపంలోకి వచ్చిన అంగారక గ్రహాన్ని చూసి అశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతం కనుకే గ్రహణాలకు ఇంత ప్రాధాన్యం. భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయమంటే అరిష్టం. అందుకే తెలుగు రాష్ట్రాలలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదాద్రి దేవాలయం, శ్రీశైలంలోని మల్లికార్జున గుడి, సింహాచలం అప్పన్న ఆలయం, భద్రాచలంలోని రామాలయంతో పాటు చిన్నా చితకా ఆలయాలన్నింటినీ శుక్రవారం మధ్యాహ్నం మూసి వేశారు. గ్రహణం వీడిన తర్వాత శనివారం తెల్లవారుజామున అన్ని దేవాలయాల తలుపులు తెరచి సుప్రభాత సేవలు ప్రారంభించారు. గ్రహణం పట్టడమంటే ఓ అపశకునంగానే భావించే దేశ ప్రజలు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. గ్రహణం వీడిన తర్వాత మాత్రమే స్నానాదికాలు ముగించి దైవ దర్శనం తర్వాత ఎంగిలి పడతారు. దీనికి ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు.     వందల ఏళ్ల నుంచి వస్తున్న ఈ సనాతన ధర్మ ఆచారాలను ఏ సైన్స్ ఏమీ చేయలేదని మరోసారి రుజువైంది. నిజానికి ఏ ఆచారమైనా చెడు చేసేదిగా ఉంటే దాన్ని విసర్జించేందుకు మానవులు సంసిద్ధంగా ఉంటారు. గ్రహణం కారణంగా ఎలాంటి చెడు లేనప్పుడు విశ్వాసాలను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు... ఎందుకు వదులుకోవాలి.. అలాగే సైన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యంలోనూ దేశ ప్రజలు ఏమాత్రం తగ్గరు. దాని విలువను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. అందుకే సువిశాల భారతదేశంలో అటు సనాతనం.... ఇటు శాస్త్రం వేలాది సంవత్సరాలుగా కలిసి మెలిసి ఉంటున్నాయి. వైరుధ్యాల కూడలిలో ఎవరి దారి వారిదే అయినా ఒక దానిని మరొకటి గౌరవించుకోవడంలో కూడా దేశం ప్రజలు శభాష్ అనిపించుకుంటున్నారు.

మాటల బౌండరీలు సరే… చేతల సిక్సర్లు కొడతాడా?

పాకిస్తాన్ కు కొత్త ప్రధాని దొరికేశాడు. అయితే, ప్రపంచానికి కొత్త పాకిస్తాన్ లభిస్తుందా? అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెబుతున్నారు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే, కొత్త పీఎం పోస్టులోకి వచ్చిన ఇమ్రాన్ అప్పుడే మాటలు మొదలు పెట్టాడు. ఆయన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే కొత్త సీసాలో పాత వైన్ అన్నట్టుగా భావన కలుగుతుంది. పైగా భారత్ లాంటి దేశాలు ఇమ్రాన్ సారథ్యం వహించే పాకిస్తాన్ తో జాగ్రత్తగా వుండాలని చెబుతున్నారు పొలిటికల్ పండితులు!     ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ ఇరవై రెండేళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది. 1996లో ఇమ్రాన్ దీన్ని స్థాపించాడు. తరువాత ఒక్క సీటు కూడా సాధించలేని స్థితి నుంచీ ఆయన పార్టీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది మెచ్చుకోవాల్సిన పరిణామమే. కానీ, ఇందులో అనేక ఆందోళనకర అంశాలున్నాయి. ముఖ్యంగా, ఇమ్రాన్ ఖాన్ ఎదుగుదల జనం మద్దతుతో ఏం కాలేదు. పాకిస్తానీలు కొందరు ఆయన ‘నయా పాకిస్తాన్’ నినాదానికి ఆకర్షితులై ఓటు వేసినా… ఇమ్రాన్ చెప్పినట్టు అవినీతి అంతం , ఆర్దిక అభివృద్ధి లాంటివి జరుగుతాయని ఎవ్వరూ భ్రమపడటం లేదు! పాక్ ఇప్పుడున్న స్థితిలో దాన్ని గాడిలో పెట్టడం చాలా కష్టం.     అందులోనూ ఇటు మిలటరీకి, అటు ఉగ్రవాదులకి అత్యంత ప్రియుడైన ఇమ్రాన్ ఖాన్ ఆ పని చేయటం మరింత అసాధ్యం. ఎందుకంటే, పాక్ బాగుపడాలంటే అక్కడ ఉగ్రవాదం, ఉగ్రవాదులు నశించాలి. అది చేయగలిగేటంత సత్తా ఇమ్రాన్ కు లేదు. ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన తాలిబన్ ఉన్మాదులకి ఆయన పార్టీ భారీ విరాళం ఇచ్చిందంటేనే… మనోడి నైతికత అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఇమ్రాన్ ను గెలిపించటంలో పాక్ మిలటరీ పాత్ర కూడా చాలా వుంది. దాన్ని నమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్ భారత్ తో యుద్ధం చేసినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే పాకిస్తాన్ ఆర్దికంగా చితికిపోవటం తప్పనిసరి. కానీ, అలాంటిదేదో చేయకపోతే పాకిస్తాన్ మిలటరీ బాస్ లు ఇమ్రాన్ ఖాన్ ప్రశాంతంగా వుండనీయరు!     ఆర్మీ, ఉగ్రవాదుల సంగతి పక్కన పెడితే ఇమ్రాన్ ఖాన్ మాటల్లోనే ఆయన భవిష్యత్ వ్యూహాలు ధ్వనిస్తున్నాయి. అమెరికాను కాదని చైనాకు దగ్గరవుతోన్న దాయాది దేశం ఇప్పుడు మరింత దూరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబోయే పాక్ ప్రధానిగా… ఖాన్ అమెరికాకు అప్పుడే సూచనలిచ్చాడు. అమెరికా, పాకిస్తాన్ ల మధ్య సమమైన లబ్ధి వుండాలని పేర్కొన్నాడు. అంటే, పాక్ అమెరికాకు సాయం చేయటం ఎంతో వుంటుందో అంతే సాయం అగ్ర రాజ్యం కూడా పాకిస్తాన్ కు చేయాలన్నమాట. మరో రకంగా చెప్పుకుంటే అమెరికా భారత్ వైపు మొగ్గటం ఇమ్రాన్ కు ఇష్టం లేదు. కానీ, వైట్ హౌజ్ అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఇండియాను కాదని పాకిస్తాన్ వైపు వెళ్లే అవకాశాలు లేవు. అంటే, మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ మరింత చైనాకు దగ్గరై అమెరికాకు దూరం అవటం దాదాపు ఖాయం. అంటే, అది ఇండియాకు కూడా పరోక్షంగా ఇబ్బందికరమే!     అమెరికా గురించే కాదు, ఇండియాతో సంబంధాల గురించి కూడా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ గత పాకిస్తానీ పాలకుల మాదిరిగానే కశ్మీర్ గురించి మాట్లాడాడు. కశ్మీర్ సమస్య భారత్ అంతర్గత విషయమని ఇప్పటికే చాలా సార్లు భారత్ తేల్చి చెప్పింది. దాంట్లో కలుగజేసుకోవాలని ఇమ్రాన్ ఉత్సాహంగా వున్నాడు. అదే ఆయన ఉద్దేశం అయితే భారత్, పాకిస్తాన్ ల మధ్య అనుబంధం ఎంత మాత్రం బాగుపడదు. పైగా మిలటరీ మాటలు విని కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఇమ్రాన్ పెంచి పోషిస్తే అది మరింత దుష్ఫలితాలు ఇస్తుంది. దురదృష్టవశాత్తూ ఇమ్రాన్ మాటలు, రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలు చూస్తుంటే అదే నిజమయ్యేలా వుంది!     ఇంకా పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయని ఇమ్రాన్ ఖాన్ విలాసవంతమైన పీఎం నివాస గృహాన్ని పేదల కోసం హాస్పిటల్ గా మార్చేస్తానన్నాడు. అక్కడితో ఆగక గవర్నర్ల అధికారిక గృహాల్ని కూడా హోటల్స్ గా మార్చి దేశానికి ఆర్దిక వనరుల్ని అందిస్తానన్నాడు. ఇలాంటి మాటలు వినటానికి బాగానే వున్నా నిజంగా కార్య రూపం దాలుస్తాయా? దాల్చినా ఎంత ఉపయోగం వుంటుంది? మునిగిపోతున్న పాక్ ఆర్దిక రంగానికి ఇమ్రాన్ చెబుతోన్న మాటలు ఏ మాత్రం ఉపయోగపడతాయి? ఇలా బోలెడు ప్రశ్నలు! చూడాలి మరి… పాతాళం నుంచీ అధః పాతాళానికి వెళుతోన్న పాకిస్తాన్ ను ఇమ్రాన్ ఖాన్ పైకి తెస్తాడో లేదో! లేక మరింత కిందకు తోస్తాడో!  

విజ‌య సార‌ధి ఇమ్రాన్

పొరుగుదేశం పాకిస్తాన్‌లో ఎన్నికల పర్వం ముగిసింది. ఎవరూ ఊహించనంతగా మాజీ క్రికెటర్, స్పీడ్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్  ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యావత్ ప్రపంచానికి దిగ్బ్రాంతి కలిగించే విధంగా అక్కడి ఎన్నికలు జరిగాయి.  ప్రపంచవ్యాప్తంగా  అన్ని దేశాలు ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలించాయి. ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్ ప్రజలకు ఆరాధన, ఆయన్ని గెలిపించాలని ఉన్నా.. ఈ ఎన్నికల ప్రక్రియలో సైన్యం పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వారే దగ్గరుండి ఈ ఎన్నికలను నిర్వహించి ఇమ్రాన్‌ఖాన్ విజయం సాధించేలా చేసాయని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో తేలాలంటే కొన్నాళ‌్లు వేచి చూడాల్సిందే. మరోవైపు మైదానాల్లోనే తమ ఆరాధ్య క్రీడాకారులకు ప్రేక్షకులు నీరాజనాలు పలకరని, వారిని తమ పాలకులుగా కూడా చేసుకోవడానికి వెనుకాడరని పాకిస్తాన్ ఎన్నికలు రుజువు చేశాయి.     క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఓ సందేశం అందింది. అది మైదానంలో తమను దేవుళ్లుగా చూసే అభిమానులు తమ నుంచి కేవలం ఆటలో గొప్పతనాన్నీ, అద్భుత ప్రదర్శనను మాత్రమే ఆశించడం లేదని చాటి చెప్పారు పాకిస్తాన్ ప్రజలు. పాకిస్తాన్ ఎన్నికలు ఆటలు, ప్రజలకూ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. విజయమంటే అలా అలవోకగా తెచ్చుకునేది కాదని, లేదూ ప్రత్యర్ధుల బలహీనతల నుంచి వచ్చేది కాదని ఇమ్రాన్ ఖాన్ తన విజయంతో నిరూపించారు. ఈ గెలుపు కోసం ఇమ్రాన్ ఖాన్ చాలా కష్టపడ్డారు. ఎంతో శ్రమించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నిటింకీ సమాధానమే ఈ విజయం అని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల‌్డ్ స్మిత్ ట్విట్ చేసిందంటే ఇమ్రాన్ ఖాన్ ఎంత కష్టపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఈ శ్రమంతా అక్కడి సైన్యం, ఐఎస్ఐ వంటి ఉగ్రవాదుల జోక్యంతో నీరుగారిపోయింది. పాకిస్తాన్ ఎన్నికల్లో 272 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్‌కు అధికారానికి కావాల్సిన అన్ని స్ధానాలు దక్కాయి. ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధికార పగ్గాలు అందుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 137 స్ధానాలకు దగ్గర దగ్గరగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడం ఖాయం.      ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. నిత్యం అలజడులతో, ఆందోళనలతో, సైనిక చర్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు కావాల్సింది ప్రశాంతత. ఇది కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలా తీసుకు వస్తారనేది అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా చూపిస్తున్న కొన్ని దేశాలకు ఇమ్రాన్‌ఖాన్ ఎలా సమాధానం చెప్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్ కూడా ఎన్నికలకు ముందు దేశ సైన్యానికి దగ్గర అని, మరోవైపు ఉగ్రవాద సంస్ధలకు కూడా దగ్గరని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్నిసార్లు ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాద సంస్ధలకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇమ్రాన్‌ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కొత్త కష్టాలు తీసుకురాక తప్పదు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులోనే సైన్యం కీలకంగా వ్యవహరించడంతో అక్కడి ప్రజాస్వామ్యంపై అనుమానపు నీలినీడలు వస్తున్నాయి. ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ తీసుకునే ప్రతి నిర్ణయంపైనా పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలోనూ చర్చను రేపుతాయి. ముఖ్యంగా భారతదేశంతో ఆయన అనుసరించే వైఖరిపై ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తాయి.     అధికారంలోకి రావడానికి ముందూ... వచ్చిన తర్వాత మరో విధంగానూ దేశం ఉంటుందని ఇమ్రాన్‌ఖాన్‌కు త్వరలోనే అర్ధం అవుతుంది. ఓ క్రికెట్ క్రీడాకారునిగా, ఫాస్ట్ బౌలర్‌గా బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో మైదానంలో  బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందుల పాలు చేసిన ఇమ్రాన్ ఖాన్ ఇక ముందు ప్రతిపక్షాలు, పొరుగు దేశాల నుంచి వచ్చే బౌన్సర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా పాక్ సైనికులు, అక్కడ ప్రతి విషయంలోనూ కలుగుజేసుకునే ఉగ్రవాదసంస్ధలతోనూ ఎలా వేగుతారో వేచి చూడాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎదుర్కొనే ప్రధాన సమస్య భారత్. అది కూడా కాశ్మీర్‌పై ఇమ్రాన్‌ఖాన్ వైఖరి ఎలా ఉంటుందనేది ప్రధాన ప్రశ్న. తొలి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌కు భారత్ పట్ల అంత మంచి అభిప్రాయం లేదని ఇరు దేశాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇమ్రాన్‌ఖాన్ మాత్రం భారత్ పట్ల తాను సానుకూలంగానే వ్యవహరిస్తానని,కాశ్మీర్ సమస్యను సానుకూలంగానే పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. అంతే కాదు.... పేదరిక నిర్మూలనకు తనకు చైనా ఆదర్శమని కూడా ప్రకటించారు.     ఇది శుభపరిణామం. భారత్‌తో తాను క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను అని కాకుండా ఇరు దేశాలకు చెందిన కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశంగా చూస్తే బాగుంటుందని సర్వత్రా వినిపిస్తోంది. భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పదవీ కాలం మరో ఏడాదే ఉంది. ఈ లోగా పెద్దగా ఏమీ జరగకపోవచ్చు కాని... ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు... వారితో పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందన్నదే ఇక్కడ ముఖ్యం. కొత్త ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానాలు చేయడం కాని, ప్రకటనలు చేయడం కాని సమంజసం కాదు. క్రీడాకారునిగా ఎంతో పరిణితితో వ్యవహరించి క్రికెట్‌లో ఆ దేశానికి వరల్డ్ కప్ తీసుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ తన పాలనతో కూడా ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులను దోచుకుంటాడని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ ఇమ్రాన్.  

అప్పుడు బాబుని! ఇప్పుడు పవన్ని! జగన్ సెల్ఫ్ గోల్స్!

పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శల పర్వం ఏపీలో పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే, తాను పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎంత రచ్చవుతుందో జగన్ కి తెలియదా? ఖచ్చితంగా తెలిసే మాట్లాడి వుంటాడు. అయితే, పవన్ మాత్రం ఈ విషయంలో కొంత తెలివిగానే స్పందించాడు. మొదట జగన్ని టార్గెట్ చేసింది జనసేన అధినేతే. అయితే, ఆయన తనికి ఎమ్మెల్యేలు వుంటే అసెంబ్లీ వదిలి వెళ్లే వాడ్ని కానని అన్నారు. అది పూర్తిగా రాజకీయ విమర్శ. మరి జగన్ చేసింది ఏమిటి? రాజకీయ జవాబు ఇవ్వకుండా వ్యక్తిగత వెటకారానికి దిగాడు. పవన్ కి నలుగురు పెళ్ళిళ్ళైనా వైసీపీ నాయకుడికొచ్చిన ఇబ్బంది ఏంటి? జనంలో వున్న జగన్ని జనసేనాని విమర్శించకూడదా? ఇదే ఇప్పుడు కాస్తో, కూస్తో ఆలోచించగలిగే వారి మెదళ్లలో మెదులుతోంది!     జగన్ పవన్ పై వ్యక్తిగత దాడి చేయటంతో జనసేన అధినేత మరో రూటులో రియాక్షన్ ఇచ్చాడు. తన అభిమానులు, కార్యకర్తలు జగన్ని  వ్యక్తిగతంగా విమర్శించొద్దని, అతడి ఇంటి ఆడపడుచుల్ని గొడవలోకి లాగొద్దని విజ్ఞప్తి చేశాడు. దీంతో పవన్ ది నైతికంగా పై చేయి అయింది! మరి ఇప్పుడు జగన్ ఏం చేస్తాడు? పవన్ కి సారీ చెప్పేసి ఈ గొడవని ఇక్కడితో ముగిస్తాడా? జగన్ తత్వం తెలిసిన వారెవరూ అలా ఆశించరు! జగన్ వెనక్కి తగ్గటం అంత తేలిగ్గా జరగదు. కాబట్టి ఎన్నికల వరకూ పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ కనినపిస్తూనే వుండే ఛాన్స్ వుంది!     ఇక జగన్ కి ఇప్పుడు పవన్ అభిమానులు, కార్యకర్తలు చేసే విమర్ళల కంటే ఎక్కువ నష్టం కాపు సామాజిక వర్గం నుంచి వచ్చేలా వుంది. అది వైసీపీలోని కొందరు నేతల్ని కలవరపెడుతోంది. పవన్ కు అభిమానులు తెలుగు రాష్ట్రాలంతటా వుండవచ్చు. కానీ, ఆయన సామాజిక వర్గం మాత్రం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో వుంది. వారంతా పవన్ కు ఫ్యాన్సా అంటే కాదు. అలాగే వారంతా జనసేన కార్యకర్తలూ కాదు. పోయిన సారీ పెద్ద ఎత్తున టీడీపీకి ఓటు వేసి చంద్రబాబు గెలుపుకి కారణమయ్యారు! ఈ సారి జగన్ సరిగ్గా పావులు కదిపితే ఈయనకూ ఓటు వేసే వారు. కానీ, ఇంతలోనే ఏపీ పాలిటిక్స్ లో కీలకమైన కాపు నేతగా ఎదుగుతోన్న పవన్ ను జగన్ అవసరానికి మించి టార్గెట్ చేశాడు. ఇది మంచి కంటే చెడు ఎక్కువ చేసేలా వుందంటూ తలలు పట్టుకుంటున్నారట వైసీపీ కాపు నేతలు!     తూర్పూ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ తరుఫున మోహరించి ఎన్నికల బరిలో దిగాలనుకున్న చాలా మంది కాపు నేతలకి పవన్ కళ్యాణ్ ఉదంతం పెద్ద దెబ్బగా మారింది. జగన్ చేసిన విమర్శలు కాపు ఓటర్లలో ఎలా రియాక్షన్ తెస్తాయో అర్థం కావటం లేదు. ఇప్పటికే కాపునాడు లాంటి సంఘం ఘాటుగా స్పందించింది కూడా! జగన్ వ్యాఖ్యలు పవన్ పరిధిని దాటి కులం రంగు పులుముకున్నాయి. అదే వైసీపీకి నష్టం తెచ్చేలా వుంది. ఎన్నికలు రేపో, మాపో అయితే లేవు కాబట్టి… ఈ దుమారం కొంత కాలానికి చల్లారవచ్చని కూడా భావించవచ్చు. కానీ, జగన్ ఇక ముందు కూడా పవన్, చంద్రబాబు లాంటి వార్ని విమర్శించేటప్పుడు వ్యక్తిగత దాడికి కూడా దూరంగా వుంటే మంచిది. అనవసరంగా చంద్రబాబును చెప్పులతో కొట్టమని, ఉరితీయాలని నోరు జారి ఉప ఎన్నికల్లో ఓటమి కొనితెచ్చుకున్నాడు గతంలోనూ. ఇప్పుడు అలాంటి ఫలితమే పవన్ పై చేసే విమర్శల కారణంగానూ ఎదురు కావచ్చు! సామెత పాతదే అయినా… నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది… నిజమే కదా!

నాయకులారా... ఇవేం మాటలు...!!!

తెలుగు ప్రజలు సిగ్గు పడుతున్నారు. తెలుగు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తెలుగు ప్రజలు ఆందోళన ప‌డుతున్నారు. తెలుగు ప్రజలు.. "వీరా... మా నాయకులు"  అని ముక్కున వేలేసుకుంటున్నారు. సమైక్య రాష్ట్ర సమయంలో వేడెక్కిన మాటలు అలా... అలా పెరిగి వ్యక్తిగత విమర్శలు, దూషణలు, తిట్ల వరకూ వెళ్లిపోతోంది. ఇది ఒక్క తెలంగాణాకో... లేదూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికో పరిమితం కాలేదు. రెండు రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి.  ఈ పార్టీ... ఆ పార్టీ అని లేదు. ఈ నాయకుడు... ఆ నాయకుడు అని లేదు.     అందరిది ఒకే దారి.. అందరిదీ ఒకే బాట... అందరిదీ ఒకే మాట. " చెయ్యేత్తి జైకొట్టు తెలుగోడా... గతమెంతో ఘన కీర్తి కలవోడా"  అని గతాన్ని తవ్వుకుని తలపోసుకోవాలే కాని... ఆ రోజులు...  ఆ పాటలు ఇక రావని ఓ నిర్దారణకు వచ్చేయాలి. దీనికి తెలుగు ప్రజలది ఏమాత్రం తప్పు కాదు. తప్పంతా వారిని ఏలుతున్న నాయకులదీ... ఏలాలకునుంటున్న నాయకులది. గతంలో వ్యక్తిగత విమర్శలకు ఏమాత్రం చోటు లేని  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ నూతన తిట్ల పోకడలు రాజకీయాల పట్ల ఓ అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ ఏవగింపు పుట్టిస్తున్నాయి. మనదీ ఒక బతుకేనా.... అని శ్రీశ్రీ అన్నట్లు మనదీ ఓ రాజకీయమేనా... ! అని తెలుగు ప్రజలు ఏవగించుకుంటున్నారు.     ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి,  జనసేనాని పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అలాగని తెలుగు ప్రజలందరూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రేమ, సానుభూతి కురిపిస్తున్నారనుకోవడం కూడా పొరపాటే. ఈ ఇద్దరి వ్యక్తిగత దూషణలపై ఇప్పుడు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాదు... ఎక్కడెక్కడి నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యక్తిగత దూషణలు, కుటుంబ వ్యవహారాలను రచ్చకీడ్చుకోవడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. " వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి వారి సొంతం... పబ్లిక్‌లో నిలబడితేనే ఏమైనా అంటాం" అన్న మహాకవి శ్రీశ్రీ మాటలకు  అర్ధం ఇది కాదు అని,  రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఏది పడితే అది మాట్లాడడానికి కాదని అంటున్నారు. దీనర్ధం మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేం మిమ్మల్ని ఏమైనా అంటాం అని చెప్పడం. పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని జగన్... మీ సోదరి మాటేమిటని పవన్ కల్యాణ్ ప్రశ్నించడం వారిద్దరికి ఏం మేలు చేస్తుందో తెలియదు కాని.... ఆ నలుగురు మహిళలకు.... జగన్ సోదరికి... ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా  లోకాన్ని అవమానించడగానే పరిగణించాలి. బహుశా పురుషులు ఒకరిపై మరొకరు తమ కోపాన్ని వెళ్లగక్కుకోవడానికి మహిళలను తెర మీదకు  తీసుకు రావడం వారి దిగజారుడుతనంగానే చూడాలి.     రాజకీయాల్లో తిట్ల పురాణానికి తెర తీసింది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులను రెచ్చగొట్టేందుకు, వారిలో ప్రత్యేక ఉద్యమాన్ని రగుల్‌కొల్పేందుకు ఇలా మాట్లాడుతున్నారని అంతా అనుకున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కె.చంద్రశేఖర రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, తెరాస నాయకులు పరుష పదజాలాన్నే వాడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. తమ ప్రత్యర్ధులను ఎందుకూ పనికి రానివారని, వారి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేందుకు తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను బహిరంగ వేదికలపై మాట్లాడడం రాజకీయ నాయకులకు సంస్కారం అనిపించదు. వారు తమను పరుష పదజాలంతో తిట్టారు కాబట్టి తామూ వారిని అలాగే తిడతామని మిగిలిన పార్టీలు ఆ పంథాలోనే పయనించడం వారి వివేకానికి వదిలేయాల్సిందే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ తిట్ల... ఈ వ్యక్తిగత దూషణలకు ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్‌లో యువతరం రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అదే జరిగితే దేశంలో నైతిక రాజకీయాల స్థానంలో కార్పొరేట్ రాజకీయాలు రాజ్యమేలుతాయి.      ఇది ఇప్పటికే వివిధ దశల్లో ప్రారంభమైంది. ఇది మరింత పెరగడానికి రాజకీయ నాయకుల మాటలు.. తిట్లు... బూతులు.. వ్యక్తిగత విమర్శలు మరింత ఊతమిస్తాయి. ఆ రోజులు రాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులు తమ నోటిని అదుపు చేసుకోవాలి. రాజకీయాలు వేరు... వ్యక్తిగత జీవితాలు వేరు అని గుర్తెరగాలి. అందరూ వివిధ మార్గాల్లో ప్రజల కోసమే పని చేస్తున్నామనే ఎరుక ఉండాలి. ఇందుకోసం ఎవరో ఒకరు ముందుకు రావాలి. అంత వరకూ ఈ వ్యక్తిగత... దారుణ విమర్శలకు... రాజకీయ శత్రువులను అడ్డం పెట్టుకుని మహిళలపై చేస్తున్న విమర్శలకు చరమాంకం ఉండదు. దీనికి రాజకీయ నాయకులే కాదు... మహిళ నాయకురాళ్లూ తమ తమ రాజకీయ విశ్వాసాలను, నమ్మకాలను , సిద్ధాంతాలను పక్కన పెట్టి పురుష రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉంది. ఆ రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పురుష రాజకీయ నాయకులదే. వారే కాదు.... అన్ని రాజకీయ పార్టీలలోనూ ఉన్న మహిళా రాజకీయ నాయకులది కూడా.

కాంగ్రెస్ త్యాగం చేస్తోందా? లేక ప్రాంతీయ పార్టీలు ఆగం చేస్తున్నాయా?

భారతదేశ తదుపరి ప్రధాని ఎవరు? దీనికి ఖచ్చితమైన సమాధానం ఎవరి వద్దా వుండదు. కానీ, ఎవరి విశ్లేషణలు వారికి వుంటాయి. కొందరు మోదీ తప్పకుండా మళ్లీ పీఎం అవుతారని చెప్పవచ్చు. కొందరు మోదీ తప్పకుండా ఓడిపోతారని చెప్పవచ్చు. కానీ, సమస్య ఏంటంటే… తరువాతి ప్రధాని అన్న చర్చ మోదీ చుట్టూనే జరుగుతోంది తప్ప మరో నాయకుడెవరూ సోదిలోకి రావటం లేదు! మోదీ కాకుంటే ప్రధాని అయ్యేది ఎవరు? రాహుల్ అనే వారే అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఇక మిగతా ప్రాంతీయ నేతల ప్రధాని కలలైతే మరీ బలహీనంగా వున్నాయి. వారి వారి పార్టీల చోటామోటా నాయకులే మా నేత నెక్ట్స్ పీఎం అంటారు తప్ప మరెవరూ మాట్లాడరు. ఇదీ పరిస్థితి!     మోదీనే తప్పకుండా మళ్లీ ప్రధాని అవుతారని కేవలం ఆయన భక్తులే కాదు చాలా మంది వ్యాపార వర్గాల వారు కూడా నమ్ముతున్నారు. నోట్ల రద్దు , జీఎస్టీ వంటి నిర్ణయాలతో మోదీ కొంత వరకూ ఇబ్బంది పెట్టినా ఆయనని ఢీకొట్టే వ్యూహం ఏదీ ప్రతిపక్షాల వద్ద లేదనేది చాలా మంది విశ్లేషణ. తాజాగా ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక మోదీ ఎట్టి పరిస్థితుల్లో మరోసారి పీఠం ఎక్కడనే వారికి కూడా కొదవ లేదు. కాంగ్రెస్ వాళ్ల నుంచీ కమ్యూనిస్టుల దాకా చాలా మంది మోదీని మళ్లీ వద్దనుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీల్ని సపోర్ట్ చేసే చాలా మంది ఓటర్లు కూడా మోదీ పట్ల సుముఖంగా ఏం లేరు! మొత్తం ఇలా ఎటూ స్పష్టత లేని స్థితిలో వున్న సమయంలో రాహుల్ చేజేతులా మంచి అవకాశాన్ని వృథా చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది! నెక్ట్స్ పీఎంగా మోదీకి కాస్త ఎక్కువ మద్దతే కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కూడా చాలా వర్గాలకే ఆశాదీపంగా వున్నారు. అయితే, ఆయన మాటలు, చేష్టలు, వ్యూహాలు మంచికంటే చెడు ఎక్కువగా చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానంలో ఎవరూ ఊహించని విధంగా మోదీని వాటేసుకుని కలకలం సృష్టించాడు. దాని వల్ల అద్భుతం జరిగిందంటూ కొంత మేర ప్రచారం జరిగినా సోషల్ మీడియాలో సామాన్యుల అభిప్రాయం మాత్రం మరోలా వుంది. ప్రధానిని హగ్ చేసుకుని ఊరుకుంటూ కొంత వరకూ బాగానే వుండేది. కానీ, అంతలోనే కన్నుగీటి చేజేతులా కామెడీ చేసుకున్నాడు. ఇలాంటి ప్రవర్తనే రాహుల్ ని ప్రధాని పదవి రేసులో నిలపలేకపోతోంది.     రాహుల్ మోదీని వాటేసుకోవటం ద్వారా జనంలోకి సంచలనకరమైన మెసేజ్ పంపాలని మూడు నెలల కిందటే ప్లాన్ చేసుకున్నాడని కొన్ని కాంగ్రెస్ వర్గాలు మీడియాకి లీకులు కూడా ఇస్తున్నాయి. అంత ప్లాన్ చేసుకుని అలాంటి పబ్లిసిటీ స్టంట్ చేయటం ఎందుకు? ఇక్కడే కాంగ్రెస్ , కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి బలహీనతలు బయటపడుతున్నాయి. వీటినే మోదీ పదే పదే క్యాష్ చేసుకుంటూ వస్తున్నారు! మోదీ , రాహుల్ గాంధీల పార్లమెంట్ డ్రామాలు, హావభావ భంగిమలు పక్కన పెడితే అవిశ్వాస తీర్మానం ఫలితం మాత్రం హస్తం పార్టీపై తీవ్రంగానే ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తుంది! పార్లమెంట్లోని 350 మంది దాకా ఎంపీలు మోదీవైపున నిలవటం సోనియా, రాహుల్ ను పునరాలోచనలో పడేసిందట. అందుకే, కాంగ్రెస్ పెద్ద త్యాగానికి కూడా సిద్ధమైపోయిందని అంటున్నారు. రాహుల్ ప్రధాని అయినా కాకున్నా మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దు అనేది వారి తాజా వ్యూహమట! అందుకోసం మమతా బెనర్జీ, మాయావతి లాంటి ఆరెస్సెస్, బీజేపీ నేపథ్యం లేని సెక్యులర్ నేతల్ని ప్రధానిగా ముందుంచబోతోందట. ఇంకా దీనిపై ఎలాంటి అదికారిక నిర్ణయం తీసుకోనప్పటికీ రాహుల్ ప్రధాని పదవి త్యాగం చేయటం మాత్రం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, అవిశ్వాస తీర్మానంలో మోదీకి వచ్చిన మద్దతుతో కాంగ్రెస్ కు తన పరిస్థితి ఏంటో క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ కు రికార్డు స్థాయిలో సీట్లు వస్తే తప్ప రాహుల్ నేతృత్వంలో పని చేయటానికి ఇతర పార్టీల వారు సిద్ధంగా లేరు! అదీ అసలు సమస్య…     అసలే అంతంత మాత్రంగా వున్న విశ్వాసాన్ని రాహుల్ రోజు రోజుకు పెంచుకుంటున్నట్టు ఎంత మాత్రం కనిపించటం లేదు. మీడియాలో గంటల తరబడి చర్చలే తప్ప యువనేతకు ఓట్ల బరిలో ఒదుగుతున్నదేం లేదు. కర్ణాటకలో బీజేపీ రాకుండా ఆపగలిగినా అక్కడ తమ సీఎం సీటు కోల్పోయి కుమార స్వామి లాంటి ప్రాంతీయ నేతకు దాసోహమానల్సి వచ్చింది. త్వరలో రాబోయే ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ ఎన్నికల్లోనూ హస్తానికి అలాంటి దుస్థితే ఎదురయ్యేలా వుంది. మాయవతి కాంగ్రెస్ కు అండగా వుంటానని ఫీలర్లు ఇస్తూనే తాను కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే నెక్ట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పొత్తు పై పునరాలోచన అంటోంది. అంటే, కాంగ్రెస్ మోదీని అడ్డుకునే తాపత్రయంలో మాయవతి వంటి ప్రాంతీయ నేతలకి లొంగాల్సిన స్థితి వచ్చేసిందన్నమాట! కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ మధ్యే రాహులే తమ పీఎం క్యాండిడేట్ అని ఘనంగా ప్రకటించింది. పొత్తులు కూడా ఆయన ఇష్టమేనని ఎప్పటిలాగే గాంధీ కుటుంబ విదేయత చాటుకుంది. కానీ, పార్టీ గుర్తించలేకపోతోన్న విషయం ఏంటంటే… మోదీని ఎదుర్కోవటం గాంధీ కుటుంబ విధేయత వల్ల సాద్యం కాదు. రాష్ట్రాల్లో మళ్లీ పునర్వైభవం సంపాదించుకోవాలి. అలా కాకుండా తాము గెలవాలని కాకుండా మోదీ ఓడాలని రాజకీయం చేస్తూ పోతుంటే… కుమార స్వామి, మాయవతి, మమతా… ఇలా అందరూ హస్తాన్ని తమకు నచ్చినట్టు మెలిపెట్టేస్తారు! అప్పుడిక రాహుల్ ప్రధాని కల… శాశ్వత పగటి కలగా మిగిలిపోయే ప్రమాదమూ వుంది!

బిజేపీ భోఫోర్స్

రెండూ జాతీయ పార్టీలే, రెండూ దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలే, రెండూ గొప్ప గొప్ప నాయకులను, మేథావులను దేశానికి అందించిన పార్టీలే. ఇన్నాళ్లూ ఒక పార్టీ మరొక పార్టీకి సరిపోలదని, తాము "డిఫరెంట్" అని గొప్పలు చెప్పుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీలూ దొందుకు దొందూ ఒకటేనని, రెండూ ఒకే తానులో ముక్కలని మెల్లమెల్లగా బయట పడుతోంది. ఆ రెండు జాతీయ పార్టీలలో ఒకటి కాంగ్రెస్ అయితే మరొకటి భారతీయ జనతా పార్టీ. కుంభకోణాలకు, అవినీతికి తాము దూరమని చెబుతున్న భారతీయ జనతా పార్టీ కుంభకోణాలలో కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ కాదని మెల్లమెల్లగా రుజువవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారమే. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఒక్కొక్క కుంభకోణం వెలుగులోకి వస్తున్నాయి.     తాజాగా యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారం లోక్‌సభ సాక్షిగా బయటపడింది . దీంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి వ్యవహారం బట్టబయలు అయ్యింది. తెలుగు వారి కోడలు పరకాల నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చేసిన సెల్ఫ్ గోల్‌తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో  అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాఫెల్ విమానాల కొనుగోలు కుట్ర బహిర్గతమైంది. ఈ చర్చలో మాట్లాడిన రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ధరలను వెల్లడించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు.      దీనిపై సమాధానం చెప్పిన నిర్మలా సీతారామన్ విమానాల కొనుగోలు ఒప్పందం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిందని  వెల్లడించారు. అదే ఇప్పుడు బిజేపిని ఇరుకున పెడుతోంది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యుద్ధ విమానాల తయారీ సంస్ధ రాఫెల్  మన జాబితాలోనే లేదని బయటపడింది. ఈ విషయాన్ని అప్పటి రక్షణ మంత్రి ఏ.కే. ఆంటోని ప్రకటించడం తాజా సంచలనం. రాఫెల్ యుద్ధ విమానాల ధరలు కూడా ఈ వివాదంలో కీలకంగా మారాయి. ఈ యుద్ధ విమానం ధర ఒక్కొక్కటి  560 కోట్లు. రాఫెల్ యుద్ధ విమానం ధర 740 కోట్లు. ఎన్‌డిఏ ప్రభుత్వం వీటికి 1670 కోట్లు వెచ్చించినట్లు తేలింది. దీంతో దేశ ఖజానాకు దాదాపు 13000 కోట్లు నష్టం వాటిల్లింది. ఇదే బిజేపి ప్రభుత్వాన్ని ఇరుకున  పెడుతోంది. ఇన్నాళ్లు మచ్చ లేదంటూ బడాయిపోయిన నరేంద్ర మోదీ దీనికి ఏం సమాధానం చెప్తారని కాంగ్రెస్ ప్రశ్నింస్తోంది.     ఇంతకు ముందు రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన భోఫోర్స్ కుంభకోణం మాదిరిగానే ఈ రాఫెల్ కుంభకోణం కూడా వెలుగు చూసిందని దేశమంతటా ప్రచారం జరుగుతోంది. నాటి భోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీని పదవికి దూరం చేస్తే ... ఈ రాఫెల్ కుంభకోణం ప్రధాని నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని ఏం చేస్తుందో వేచి చూడాలి. దేశాన్ని కుదిపేయనున్న రాఫెల్ కుంభకోణం వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఆయుధం కానుంది.    

టీడీపీ లాగే శివసేన దూరమైతే మోదీ గతేంటి?

ఒక మిత్ర పక్షం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం!  ఈ మాటలన్నది బీజేపీకి మరో మిత్రపక్షమైన శివసేన! ఈ మద్య కాలంలో ఉద్ధవ్ థాక్రే మోదీ, అమిత్ షాలపై మండిపడటం సాధారణ విషయం అయిపోయింది. అయితే, ఆయన తాజా వ్యాఖ్యలు మాత్రం కాస్త ఆసక్తి కలిగించేవే! శివసేన చీఫ్ థాక్రే అభిప్రాయం ప్రకారం ఆదునిక చాణుక్యులైన మోదీ, అమిత్ షాలు మిత్రపక్షమైన టీడీపీ చేత అవిశ్వాస తీర్మానం పెట్టించుకున్నారు! పరిస్థితి అంతగా దిగజారేలా రాజకీయం నడిపారు. దీన్ని ఎలా చూడాలని ఆయన సూటిగా ప్రశ్నించారు!     టీడీపీ, శివసేనలు వాజ్ పేయ్ ప్రభుత్వ కాలంలో కూడా కమలదళానికి నమ్మకమైన మిత్రపక్షాలు. అయితే, మోదీ సర్కార్ లో ఈ రెండూ పార్టీలు తీవ్రమైన కష్టాలు, నష్టాలే కాక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా మిత్రుల్ని దూరం చేసుకుని మోదీ, షా ఏం లాభం సాధించబోతున్నారో వారికే తెలియాలి. ఇక్కడ ఏపీలో ఎలాగైతే టీడీపీని వ్యతిరేకిస్తూ ఒంటరి పోరుకు బీజేపీ సై అంటోందో మహారాష్ట్రలోనూ అదే చేస్తోంది. ఈ మధ్యే అమిత్ షా మరాఠా బీజేపీ నేతలందరికి ఒంటరి పోరు చేసేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. శివసేనకు ఈ మాటలు పుండు మీద కారం చల్లినట్టుగా వుంటున్నాయి. అందుకే, ఉద్ధవ్ విమర్శల తీవ్రత పెంచారు.     రోజూ ఏదో ఒక విధంగా మోదీని విమర్శిస్తోన్న ఉద్ధవ్ థాక్రే తాజాగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం గురించి మాట్లాడారు. సభలో ఆయన పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతైతే ఇవ్వలేదు. కానీ, టీడీపీ బీజేపీకి మిత్రపక్షంగా నిలిచిన పార్టీ. ఆ పార్టీనే అవిశ్వాస తీర్మానం పెట్టిందంటే మీరు చేస్తున్న రాజకీయం ఎలా వుందో ఆలోచించుకోండని చురకలు వేశారు థాక్రే. ఆయన మాటలకి కారణం, శివసేనని కూడా మోదీ, అమిత్ షా అంతకంతకూ కార్నర్ చేయటమే. గత కొన్నేళ్లుగా… ముఖ్యంగా, శివసేన స్థాపకుడైన బాల్ థాక్రే మరణం తరువాత వారసుడు ఉద్దవ్ ను బీజేపీ ఆటాడుకుంటోంది. మహాలో ఒకప్పుడు శివసేన ప్రధాన పార్టీగా ఉంటే ఇప్పుడు బీజేపీ అధికార పక్షంగా మారింది. శివసేన తోక పార్టీ అయిపోతోంది. ఇదే ఉద్దవ్ ఆక్రోశానికి కారణం. తమతో దశాబ్దాలుగా స్నేహం కొనసాగిస్తోన్న సాటి హిందూత్వ పార్టీకి కమలదళం ఇస్తోన్న ప్రతిఫలం అసలు వారి అస్థిత్వమే లేకుండా చేయటం!     శివసేన పార్టీ కోపంతోనో, ఆక్రోశంతోనో కానీ బీజేపీ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ అదే పార్టీతో కొనసాగుతోంది. దీన్ని మరాఠీలు ఎలా అర్థం చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేం. కానీ, మూకదాడుల వంటి కీలక వివాదాల్లో మోదీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతోంది. గోరక్షకుల ముసుగులో ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత మంది చెలరేగిపోతున్నారు. వారి చేష్టలన్నీ మోదీ ప్రభుత్వానికి అంటుకుంటున్నాయి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైనా తేడా వస్తే అందుకు ఈ మూక దాడులు కూడా ప్రధాన కారణమే. సరిగ్గా అటువంటి వివాదంలో కూడా శివసేన బీజేపీకి మద్దతు ఇవ్వకుండా విమర్శలకు దిగుతోంది. ఆవులకు వున్న రక్షణ కూడా మనుషులకు , ముఖ్యంగా, స్త్రీలకు లేదంటూ ఉద్దవ్ కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పార పట్టారు. ఇది రోజురోజుకి మోదీ, అమిత్ షాలకి తలనొప్పనే చెప్పాలి. ఒకవైపు టీడీపీ లాంటి మిత్రపక్షాన్ని దూరం చేసుకుని ఏపీలో కనుమరగయ్యే స్థితి తెచ్చుకున్న మోదీ మహారాష్ట్రలో ఎంత మూల్యం చెల్లిస్తారో ముందు ముందు చూడాలి. శివసేన నిత్యం విమర్శలు గుప్పించటం మరాఠా ఓటర్ల మనస్సులో పెద్ద ప్రభావమే చూపవచ్చు!

హోదా గోదాలో రాజకీయ పక్షాలు

  ప్రత్యేక హోదా... ఓ సంజీవని. ప్రత్యేక హోదా.. అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం. ప్రత్యేక హోదా... అట్టడుగున ఉన్న రాష్ట్రాల ఎదుగుదలకు ఉపకరించే ఒకే ఒక్క సాధనం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రత్యేక హోదాపై అంత పట్టుబడుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేయడానికి, కేంద్రంపై యుద్ధం ప్రకటించడానికి కారణం హోదాకున్న విలువే. భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని ఆ తర్వాత నాలుగేళ్ల పాటు అక్కడ కేంద్రంలోనూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములైన ఇరు పార్టీలు ప్రత్యేక హోదా కారణంగా కత్తులు నూరుకుంటున్నాయి. ప్రత్యేక హోదా కంటే, ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గు చూపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హోదా పాట పాడుతోంది.     నాలుగేళ్ల స్నేహాన్ని  ప్రక్కన పెట్టి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే వరకూ వెళ్లింది. ప్రత్యేక హోదాకున్న  పవర్ ఏ పాటిదో ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తన అధికార దాహాన్ని ప్రత్యేక హోదా నీళ్లతో తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో అతి కీలక సమావేశంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశం కూడా ప్రత్యేక హోదా చుట్టూనే తిరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైలుపై తొలి సంతకం చేస్తానని కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్ది రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ సమావేశంలోనే తమకూ ప్రత్యేక హోదా కావాలని ఒడిషా, బిహార్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పట్టుపట్టినా ఏకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు.     ఈ సంఘటనే ప్రత్యేక హోదాకున్న ప్రత్యేకతను తెలియజేస్తోంది. ప్రత్యేహోదాతోనే ఆంధ్ర‌ప్రదేశ్ లో పోగొట్టుకున్న ప‌వ‌ర్ ను తిరిగి రాబ‌ట్టుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే ఇర‌త రాష్ట్రాల వారిని కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌కూడ‌ద‌ని హుకుం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వరాద‌ని పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా ప‌ట్టుబ‌డుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తమ ఎంపీల చేత సభ్యత్వాలకు రాజీనామా చేయించింది.     అంతేకాదు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చింది. అన్నీ వర్గాల వారు ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రకటించడం ఈ అంశానికి ఉన్న గొప్పతనమే. ఆయన ప్రత్యేక హోదాపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ‌్ రాజకీయాలలోకి దూకుడుగా వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా  పైనే సమరం చేస్తున్నారు. వామపక్షాలు, మేథావుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా హోదా గోదాలో తలమునకలయ్యయి. ఇది ప్రత్యేక హోదాకున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.

కాంగ్రెస్ దూకుడు

కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు చర్చలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించిన తీరు....ప్రవర్తించిన విధానంతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు వచ్చినట్లేనని సీనియర్లు భావిస్తున్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు రెట్టింపు అయ్యాయి.  రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంతో యావత్ దేశం తమ వైపు చూస్తోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.     నిజానికి అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగం టానిక్‌లాంటిదే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏభై ఏళ్ల వరకూ అధికారం వైపు కాదు కదా... కనీసం ఒకటి రెండు స్ధానాలు కూడా గెలిచే పరిస్ధితి లేదని ఆ పార్టీలో ఉన్న నాయకులే చెబుతున్నారు. ఇలాంటి స్ధితిలో లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం రాష్ట్రంలో పార్టీకి సంజీవనిలా పని చేస్తుందని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఆదివారం నాడు జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో సమస్త అధికారాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే కట్టపెట్టారు. ఇది ఓ విధంగా మంచి పరిణామం. వివిధ రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో... ఎవరిని దూరం ఉంచాలో... ఎవరికి దగ్గర కావాలో.... పార్టీ అధ్యక్షుడు నిర్ణయించడం మంచి సంప్రదాయం.     దీని వల్ల క్షేత్ర స్ధాయిలో సమస్యలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఆయా రాష్ట్రాలకు చెందిన పొత్తులు... స్నేహాలు... విరోధాలు... శత్రుత్వాలు... ఆయా రాష్ట్రాలకు చెందిన పిసిసిలే నిర్ణయించేవి. దీని వల్ల ఆయా రాష్ట్రాల్లో పార్టీ పటిష్టత కంటే నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం వచ్చేది. దీంతో కాంగ్రెస్ నాయకులు " వ్యక్తిగతంగా" లాభ పడ్డారు తప్ప పార్టీకి మాత్రం మేలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాల ఇన్‌ఛార్జిలు... వారిచ్చిన నివేదికలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు. దీంతో క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతోందో అధి నాయకత్వానికి తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జిల నివేదిక ప్రమాణికంగా టిక్కట్ల కేటాయింపు నుంచి పొత్తుల వరకూ కీలక నిర్ణయాలు జరిగిపోయేవి. ఇది పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఆ పాత పద్దతికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పొత్తుల ఖరారుపై నిర్ణయాన్నే కాదు.... పార్టీ ప్రచార బాధ్యతలను కూడా సిడబ్ల్యూసి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే అప్పగించింది.     సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన కమిటీ. ఈ కమిటీ తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలే పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ అవలంభిస్తుంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా 23 మంది మాత్రమే సిడబ్ల్యూసి సభ్యులుగా ఉన్నారు. ఆదివారం నాటి ఈ కీలక సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చాలా ఉత్సాహంగా ప్రసంగించారని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దించుతామని ఆయన సిడబ్ల్యూసీ వేదికగా ప్రకటించారు. " బిజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది " అని ఈ వేదిక నుంచి ప్రకటించారు. ఇది రాహుల్ గాంధీ అత్యుత్సాహం అనే కంటే పెరిగిన నమ్మకంగానే పరిగణించాలి. ఈ నమ్మకం... ఈ విశ్వాసం... ఈ లక్ష్య నిర్దేశాలకి వేదిక లోక్‌‌సభ కావడం... అది కూడా విభజనతో నష్టపోయిన  ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి కావడం కాకతాళీయమే అనుకోవాలి.    

ఎన్నికల ముందు తాయిలాలు

పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కాసింత ఊరట. గడచిన కొన్నాళ్లుగా ధరాఘాతంతో సతమతమవుతున్న సామాన్యులకు దొరికిన ఆలంబన. నోట్ల రద్దు... జీఎస్టీ వంటి నిర్ణయాలతో దేశంలో సామాన్యుల నడ్డి విరిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలు ప్రతి ఒక్కరికి శరాఘాతంగా మారాయి. దేశంలో ప్రతి ఒక్కరూ ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదు అని పాడుకునే పరిస్థితే కనిపించింది. అయితే దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల కారణంగా కేంద్రం కాసింత తగ్గింది.     తాజాగా జరిగిన జిఎస్టీ మండలి సమావేశంలో 88 వస్తువులు, సేవలపై పది శాతం జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ముదావహం. జీఎస్టీ పుణ్యమాని సామాన్యులు, మధ్యతరగతి మానవులు దేశంలో బతకలేని స్థితి కల్పించారు. ప్రతి వస్తువుపైనా రాష్ట్రం విధించే పన్ను, కేంద్రం విధించే పన్నులతో సతమతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ పేరుతో తీసుకువచ్చిన సరికొత్త వడ్డింపు బతకలేని స్థితికి తీసుకువచ్చింది. పప్పులు... ఉప్పులు... కూరగాయలు... పాలు... దేవుడి విగ్రహాలు.... చీపుర్లు... చివరికు కూరలో కరివేపాకు అని ఇన్నాళ్లూ తీసి పారేసిన ఆ కరివేపాకుపై కూడా జీఎస్టీ అంటూ పన్నులు విధించడం దేశంలో విడ్డూరాల్లో విడ్డూరం. దీని వల్ల రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా తమ ఖజానా నింపుకునే అవకాశం ఉంటుందేమో కాని సామాన్యులకు మాత్రం చుక్కలు చూపించినట్లే అయ్యింది.      ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. శనివారం నాడు కేంద్ర తాత్కాలిక ఆర్ధిక శాఖా మంత్రి పియూష్ గోయోల్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో సామాన్యులకు ఓకింత ఊరట కలిగిందనే చెప్పాలి.   ఈ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా 88 వస్తువులపై భారం తగ్గనుంది. ఈ వస్తువులన్నీ సామాన్యులు నిత్యం వినియోగించేవే. టీవీలు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, మహిళలు ఉపయోగించే హ్యాండ్ బ్యాగులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలపై కూడా ఇంతకు ముందు జీఎస్టీ పేరుతో పన్నుల బాదుడు ఉండేది. తాజా నిర్ణయాల కారణంగా వీటన్నింటిపై ఆ పన్నులు తగ్గుతాయి.     ఇది ప్రజలకు... ముఖ్యంగా మ‌హిళా లోకానికి ఆనందాన్ని పంచే విషయం. జీఎస్టీ కారణంగా దేశంలో సగటు రైతు నానా కష్టాలు పడుతున్నారు. నానాటికీ దేశంలో వ్యవసాయం తీసికట్టుగా మారుతోంది. వ్యవసాయాధారిత దేశంలో రైతులు పడుతున్న అగచాట్లు అంతా ఇంతా కాదు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇక్కడి జరిగినన్ని రైతు ఆత్మహత్యలు మరెక్కడా జరగలేదు. అతివ్రష్టి, అనావ్రష్టితో రైతుల జీవితాలు సతమతమవుతున్నాయి. పంట చేతికి రాక... వచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల తమ కుటుంబాలతో వలసలు పోయి కూలీ నాలీ చేసుకుంటున్నారు.     తాజాగా జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రైతులకు మేలు చేసేవిగా ఉన్నాయి. ఇది పూర్తిగా రైతుల జీవితాలను మారుస్తుందని చెప్పలేం కాని... కొంత మార్పు మాత్రం వస్తుంది. ఈ కీలక సమావేశంలో వ్యవసాయం, విద్య, ఫుడ్ ప్రాసెసింగ్, సామాజిక భద్రత వంటి సేవలపై మినహాయింపులు ఇవ్వడం శుభ పరిణామంగానే చూడాలి. మరో పది నెలల కాలంలో దేశంలో ఎన్నికలు రానున్నాయి. దీనికి ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా విషయంలో  కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నట్లు అయ్యింది. ఆ వేడి ముందు ముందు మరింత ఎక్కువవుతుందని, ప్రజలను ప్రసన్నం చేసుకుందుకు అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు కూడా ఇక జిమ్మిక్కులు చేయడం ప్రారంభిస్తాయి.     ధికారంలో ఉన్న వారు ధరలు తగ్గించడం.... కొత్త కొత్త ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టడం వంటివి ప్రారంభిస్తారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం తాము అధికారంలోకి వస్తే మరిన్ని చేస్తామంటూ వాగ్దానాలు గుప్పిస్తాయి.  ఏది ఏమైనా సామాన్యుడికి మాత్రం రానున్న కాలమంతా ఒకింత మంచిగానే ఉండేట్లుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల పాటు ఏలికలు తమ చేతలతో పెట్టిన ఇబ్బందులను ఏడాది పాటు నిలిపివేసి ప్రజలకు ఊరట కలిగించడం... మరో నాలుగేళ్ల పాటు వారిని కష్టాలు పాలు చేసేందుకే దేశ ప్రజలకు తెలుసు. అయినా అల్ప సంతోషులైన ప్రజలు రాజకీయ నాయకుల ఉచ్చులో పడడం షరా మామూలే.

చతుష్టయం ఏకమవుతోందా?

  అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మోదీ గెలిచారు. మరి రాహుల్ గాంధీ, చంద్రబాబులు? వాళ్లు ఓట్ల సంఖ్యతో చూస్తే ఓడిపోయినట్టే! కానీ, అసలు నాలుగేళ్ల తిరుగులేని పాలనలో మోదీ ఇలా జనం ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావటం? అది ప్రతిపక్షాల గెలుపే! ఆ విధంగా చూసినప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్ర స్థాయిలో బాబు సక్సెస్ అయినట్టే. ముఖ్యంగా, ఏపీ సీఎం జనానికి ప్రత్యేక హోదా ఎవరి వల్ల రావటం లేదో అర్థంమయ్యేలా చేయగలిగారు. హోదా, పోలవరం లాంటివి కేవలం కేంద్రం ఉదాసీనత వల్లే ఆగిపోవటం, మందగించటం జరుగుతోందని ఓటర్లు గ్రహించేలా చేయగలిగారు. దీని ఎఫెక్ట్ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుంది!     అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల ప్రత్యేక హోదా రాదనేది అందరికీ తెలిసిన విషయమే. మరి రాజకీయ ఛాణుక్యుడైన చంద్రబాబు ఆ మాత్రం గ్రహించలేరా? ఆయనకూ హోదా రాదని తెలుసు. మోదీ ప్రభుత్వం కూలదనీ తెలుసు. కానీ, అసలు మొత్తం వ్యవహారం వెనుక లాభమేంటో కాస్త లోతుగా ఆలోచిస్తే మనకే తెలుస్తుంది! నిన్న మోదీ సభలో కేసీఆర్ ని, తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అలాగే, చంద్రబాబుని తాను స్వయంగా వైఎస్ఆర్ సీపీ ట్రాప్ లో పడొద్దని హెచ్చరించానని చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ జనసేనాని కూడా తన ట్వీట్ల రాజకీయం నడిపారు! బీజేపీని తిడుతున్నట్టే ట్వీట్లు చేసి… టీడీపీకి తూట్లు పొడిచే వ్యూహం పన్నారు. తాజాగా పవన్ ట్వీట్లతోనూ , జగన్ ప్రెస్ మీట్లతోనూ చంద్రబాబుపై విరుచుకుపడుతూనే వున్నారు.     బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని చెప్పిన పవన్ టీడీపీ కూడా బీజీపీతో సమానమై ద్రోహం చేసిదంటూ అర్థం వచ్చేలా వ్యాఖ్యానాలు ఇచ్చారు! ఇక జగన్ మంగళవారం ఏపీ బంద్ అంటూ కొత్త అంకానికి తెర తీశారు. కీలకమైన అవిశ్వాస తీర్మానం చర్చలో తన ఎంపీలు ఎవరూ లేకుండా చేసి బీజేపీని కాపాడిన ఆయనే ఇప్పుడు చంద్రబాబును తూర్పార పడుతూ బంద్ అంటున్నారు! బందుల వల్ల జనం ఇబ్బందులు పడతారు తప్ప… లాభమేంటి? జగన్ కే తెలియాలి!     చంద్రబాబు మీద ఒకవైపు నుంచీ పవన్, మరో వైపు నుంచీ జగన్, ఇక ఇంకో వైపు నుంచీ ఎప్పటిలాగే బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా, పురంధేశ్వరీ… ఇలా అంతా కలిసి ముప్పేట దాడి చేయటం దేనికి సంకేతం? రాబోయే ఎన్నికల్లో టీడీపీ చేయాల్సిన ఒంటరి పోరుకి అవిశ్వాస తీర్మానం మరింత స్పష్టతనిచ్చింది. పైకి పవన్, జగన్ బీజేపిని నాలుగు మాటలంటున్నా ప్రధాన దాడి టీడీపీ మీదే చేస్తున్నారు. అది దిల్లీలోని కాషాయ నేతల డైరెక్షన్లోనే అన్నది బలపరీక్ష సందర్భంగా తేలిపోయింది. జగన్ తన ఎంపీల్ని ఉప సంహరించాడు. గతంలో మద్దతు కూడగట్టుకొస్తానన్న పవన్ ట్వీట్లతో టీడీపీనే దెప్పిపొడిచాడు. వీళ్ల వెనుక బీజేపీ కాక మరెవరు వున్నట్టు? అలాగే, టీఆర్ఎస్ ని, కేసీఆర్ ని మెచ్చుకున్న మోదీ గులాబీ పార్టీని కూడా టీడీపీకి వ్యతిరేకం చేసేశారు! అంటే, 2019లో బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ను, ఏపీ టీడీపీకి వ్యతిరేకంగా పవన్, జగన్ లను వాడుకోబోతందన్నమాట! అవిశ్వాసం తేల్చిన సత్యం ఇదే!     అంతా ఒక్కటై దాడి చేస్తోన్న నేపథ్యంలో చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పక పోవచ్చు. రాహుల్ టీడీపీకి, ఏపీకి కాస్త మద్దతుగా మాట్లాడినా… హస్తం పార్టీతో కలిసి ముందుకు సాగటం టీడీపీకి పెద్దగా లాభమూ కాదు. మంచిది కూడా కాదు! కాబట్టి పసుపు సైనికులు ఇప్పట్నుంచే రానున్న కురుక్షేత్రానికి సర్వసన్నధ్దంగా వుండాలి. రాష్ట్రం రెండుగా చీలిన 2014లో కంటే వారికి 2019లోనే పెద్ద సవాలు ఎదురుకానుంది!  

అంకెల్లో విజ‌యం... నైతిక ప‌రాజ‌యం...

అందరూ ఊహించినదే జరిగింది. అందరూ అనుకున్నదే కళ‌్లముందు ప్రత్యక్షమైంది. ఆంధ్రుల కనీస హ‍క్కులకు విఘాతం కలిగింది. దింపుడు కళ్లెం ఆశ నిరాశగానే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మిగిలిన చివరి ప్రయత్నానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సాక్షిగా మంగళం పాడింది. శుక్రవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ... అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు... యావత్ దేశాన్నే ఆశ్చర్యానికి గురి చేసాయి. ఈ అవిశ్వాసానికి మద్దతుగా లోక్‌‌సభలో వివిధ రాజకీయ పార్టీలు సహకరిస్తాయని, కేంద్రం చూపుతున్న వివక్షను దేశం ముందు ఉంచవచ్చునన్న తెలుగుదేశం వ్యూహం కొంత వరకూ ఫలించింది. అయితే నెంబర్ గేమ్‌లో మాత్రం లోక్‌సభ సాక్షిగా ఓడిపోయింది.     534 మంది సభ్యులున్న లోక్‌సభలో 451 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు ఓటు చేస్తే 325 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, అధికార బిజెపి కూటమిలో ఉన్న శివసేవ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒడిషాకు చెందిన బీజేడీ సభ నుంచి వాకౌట్ చేసింది. మొత్తానికి సంఖ్య పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ లోక్‌సభలో విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళన, ఆవేద‌న‌లను జాతీయ స్థాయిలో తెలిసేలా చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నాయకులు పదేపదే చేబుతున్న వాస్తవాల‌ను ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు సభ ముందుంచడంలో సఫలమయ్యారనే చెప్పాలి. దీని ద్వారా జాతీయ స్ధాయిలో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు పడేలా చేశారు.     ఇందుకు తెలుగుదేశం లోక్‌సభ సభ్యులను అభినందించాల్సిందే. లెక్కలే దేనికైనా గీటురాయిగా మారిన దశలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు, అక్కడి ప్రజలు లోక్‌సభలో అంకెల పరాజయాన్ని నైతిక విజయంగానే పరిగణించాలి. అవిశ్వాసంపై గెలుపోటములు ఎలా ఉన్నా ఆవేదన నిండిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన ప్రసంగం ద్వారా కాసింతైనా ప్రధాని స్వాంతన చేకూరుస్తారని అందరూ ఆశించారు. అయితే ప్రధాని ఆ పని కూడా చేయకపోవడం ఏపీ ప్రజల పట్ల ఆయనకున్న వివక్షకు తార్కాణం. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఇవి చేశాం... ఇవి చేస్తాం అని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ తమను వీడి ఎందుకు వెళ్లింది.... విభజన పాపం తమది కాదు అని చెప్పడానికే పరిమితం కావడం ఆయనకూ.... ప్రధాని పదవికీ తగింది కాదు. ప్రధాని ప్రసంగంలో ఎక్కడా సానుభూతి కాని, సహానుభూతి కాని కనిపించకపోవడం ఆ పార్టీకి ఏపీ ప్రజలపై ఉన్న నిర్లక్ష్యాన్ని, వారి నిరంకుశత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వ్యవహరించిన తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు లభించే అవకాశాలున్నాయి.     ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. తనను శత్రుపక్షం... ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పప్పు అని ఎగతాళి చేసినా తాను బాధపడనని చెప్పిన తీరు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. అంతే కాదు తనపై ప్రధానికి అకారణ కోపం ఉందని, దానిని ఈ సభలోనే తొలగిస్తానంటూ సభలో అందరి ముందు ప్రధాని స్ధానం దగ్గరకు వెళ్లి ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి కౌగలించుకున్న తీరు అందరినీ ఆశ్యర్యపరిచింది. రాహుల్ చర్యను అపరిపక్వ చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నా.... ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మాత్రం ప్రశంసిస్తున్నారు. ఇది రాహుల్ గాంధీలో రాజకీయంగా వచ్చిన ఎదుగుదలకు చిహ్నంగా గుర్తిస్తున్నారు.     ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రం కలిసి వచ్చే చర్యగానే చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు లోక్‌సభలో రాహుల్ ప్రసంగం... ఆయన ప్రవర్తించిన తీరు కలిసి వస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఈ తాత్కాలిక విజయానికి సంబరాలు చేసుకోవడం కంటే సభలో వివిధ పార్టీలు తమను ఎండగట్టిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకుని తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్ అంత అందంగా ఉండదు. నియంతగా వ్యవహరించిన ఇందిరాగాంధీకే పాఠాలు నేర్పిన దేశ ప్రజలు... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోదీకీ,  భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించడం తథ్యం.

మోదీని వాటేసుకున్న రాహుల్ .. 2019లో విజయాన్ని కూడా వాటేసుకుంటాడా?

అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఏపీకి కీలకం ప్రత్యేక హోదా. కానీ, దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ రాహుల్ వర్సెస్ మోదీ వార్ పైనే దృష్టి పెట్టాయి! ఎందుకంటే, మరి కొన్ని నెలల్లోనే మోదీ, రాహుల్ ప్రధాని పదవి కోసం తొలిసారి సమరానికి సై అనబోతున్నారు. ఇండియాలో అమెరికా లాంటి ప్రెసిడెన్షియల్ ఎన్నికలు వుండవు కాబట్టి చాలా వరకూ ప్రధాని ఎవరు కాబోతున్నారు అన్నది పెద్దగా ప్రాముఖ్యత వహించదు. కానీ, నెహ్రు, ఇందిర, ఇప్పుడు మోదీ లాంటి వారు వున్నప్పుడు పీఎం ఎవరో ముందే తెలిసిపోతుంది కాబట్టి వ్యక్తుల చుట్టూ రాజకీయం నడుస్తుంది. 2014లో అదే జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒకవైపు మన్మోహన్ మళ్లీ ప్రధాని అని గట్టిగా చెప్పలేదు. రాహుల్ ని కూడా ప్రైమినిస్టర్ చేస్తామని ప్రకటించలేదు. అలాంటి సమయంలో బీజేపీ మోదీని తన ప్రధాని అభ్యర్థిగా పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకుని ముందుకొచ్చింది. అదే కాషాయదళానికి, ఎన్డీఏకి కలిసి వచ్చి మోదీ వేవ్ కొనసాగింది. అయితే, 2019 ఎన్నికలు అందుకు భిన్నంగా వుండబోతున్నాయి!     ఆ మధ్య కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ నేను ప్రధాని పదవికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. అలా ఆయన స్వయంగా చెప్పటం అదే మొదటి సారి. అయితే, ఇప్పుడు చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం పరోక్షంగా రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టగలిగింది. తన సుదీర్ఘ ప్రసంగంలో ఎప్పటిలా పెద్ద పెద్ద తప్పులు ఏం మాట్లాడలేదు రాహుల్. గతంలో కన్నా ఆరోపణల్లో పరిణతి కూడా కనబరిచాడు. మోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూనే ఆయన నాలుగేళ్ల ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టాడు. ఒక విధంగా రాహుల్ రోజు రోజుకు ఎదుగుతున్నాడనే చెప్పుకోవాలి. అలాగే, బీజేపీ వారు, బీజేపీ అభిమానులు, మోదీ భక్తులు సోషల్ మీడియాలో అన్నట్టు రాహుల్ ని పప్పు అనటం ఇక మీదట కాస్త కష్టమే. ఆయన మరీ అపర చాణుక్యుడైన రాజకీయ నేత అయిపోయాడని చెప్పలేకున్నా… మోదీకి ప్రస్తుతం కనుచూపు మేరలో వున్న ప్రత్యర్థి రాహులే అయ్యాడు!     వచ్చే ఎన్నికల్లో మోదీకి 2014లో లాగా స్వంత మెజార్టీ రాకుంటే తాము ప్రధానులు అయ్యేందుకు బీజేపీలోనే చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎన్డీఏలోని పక్షాలు మోదీని తిరస్కరిస్తే పీఎం అయ్యే కలల్లో చాలా మంది కాషాయ నేతలున్నారు. వార్ని పక్కన పెడితే ప్రస్తుతం లోక్ సభలో ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా లేని మాయవతి నెక్ట్స్ పీఎం అవ్వాలని భావిస్తున్నారు. ఆమెలాగే మమతా బెనర్జీ, శరద్ పవార్, ములాయం, మన కేసీఆర్ … ఇలా చాలా మందే ప్రధాని పదవి రేసులో వున్నారు. అయితే, వీరికి అవకాశాలు ఎంతగా వున్నాయి? అదే విషయాన్ని తేల్చేసింది తాజా అవిశ్వాస తీర్మానం! అవిశ్వాస తీర్మానం సందర్భంగా అందరి దృష్టి రాహుల్ మీదే పడింది. ఆయన మోదీపై చేసే ఆరోపణలు ఏంటనే ఎదురు చూశారు. తానే ఆ మధ్య అన్నట్టు భూకంపం పుట్టిస్తాడా అని ఆశించారు! భూకంపం అయితే రాలేదుగాని… పార్లమెంట్లో నవ్వులు పూశాయి! తన ప్రసంగం అయ్యాక మోదీ వద్దకెళ్లి రాహుల్ ఆలింగనం చేసుకున్నాడు! ఇది మోదీతో సహా అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనని పప్పు అని ఎగతాళి చేసినా సరేనంటూ రాహుల్ మోదీ వద్దకెళ్లి ఆలింగనం రాజకీయం చేశాడు! ఇది నిజంగా ఆశ్చర్యకరమే! అంతకంటే ఎక్కువగా మారుతున్న రాహుల్ వ్యక్తిత్వానికి సూచిక!     రాహుల్ అవిశ్వాస తీర్మానం గురించి చేసిన ప్రసంగం రేపటికల్లా అందరూ మరిచిపోవచ్చు. కానీ, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారుతున్న ట్రెండ్ మాత్రం అందరూ గమనిస్తున్నారు. ప్రాంతీయ నేతలు ఎందరు  పీఎం రేస్ లోకి వచ్చినా మోదీ తరువాత నెంబర్ టూగా వుంటోంది రాహులే! మరి ఆయన మోదీని వెనక్కి నెట్టి పీఎం అవుతారా? లేదంటే మరో అయిదేళ్లు కూడా మోదీని విమర్శిస్తూ, ఇలాగే ఆలింగనం చేసుకుంటూ జనంలో తనని తాను సీరియస్ పొలిటీషన్ గా ప్రూవ్ చేసుకుంటారా? 2019 ఎన్నికల ఫలితాలు వచ్చే నాటిదాకా మాత్రం వేచి చూడాల్సిందే! 

సమరానికి సిద్ధం...!

లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లక్ష్యంగా.... దేశంలో పేరుకుపోయిన ఇతర సమస్యలనూ ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం అనూహ్యంగా అంగీకారం తెలిపింది. ఎవరూ ఊహించని ఈ పరిణామానికి బీజేపీ వ్యూహాతక్మంగా తెర తీసింది. తొలుత పది రోజుల్లో అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం 24 గంటలలోపే శుక్రవారం నాడు చర్చకు అనుమతించడం ప్రజాస్వామ్యానికి శుభసూచకం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైతే నేటి అంశాన్ని విపక్షాలు పాలకపక్షం ముందు చూపించి న్యాయం చేయమని కోరే అవకాశం ఉంది.  విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం చేసే యత్నాలకు ఇలాంటి సంఘటనలు అడ్డుకట్ట వేస్తాయి.     సరే, యుద్ధం ప్రారంభమైంది. సమర సమయం కూడా నిర్ణయం అయిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభ వేదికగా చర్చ ప్రారంభమవుతుంది. మొత్తం ఏడు గంటల పాటు ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వివిధ పార్టీలు సభలో చర్చిస్తాయి. లోక్‌సభలో పార్టీల బలాబలాలను బట్టీ ఆయా పార్టీలు మాట్లాడే సమయాన్ని కూడా కేటాయించారు. సభ నియమాల ప్రకారం ఇది పద్దతే అయినా.... సమస్య పరంగా చూస్తే మాత్రం ఈ సమయ పాలన ఆంధ్రప్రదే‌శ్‌కు రుచించదు. ప్రత్యేక హోదాపై అట్టుడికిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను లోక్‌సభలో వెల్లడించేందుకు రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీకి దక్కిన సమయం కేవలం 13 నిమిషాలు. ఈ కాస్త సమయంలోనే మొత్తం ఆవేదనంతా సభలో చెప్పుకోవాలి. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం 38 నిమిషాలు. విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ ప్రజలకు చేరువయ్యేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని చూడడం మంచి పరిణామం. ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ లోక్‌సభ సభ్యులకు ఇచ్చిన సమయం 9 నిమిషాలు. ఈ సమయంలో వారు ప్రత్యేక హోదా కంటే కూడా తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిప‌క్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు రాజీనామా చేయ‌డంతో వారు స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు.      ఈ ఏడు గంటల చర్చ అనంతరం అధికార పక్షానికి సమాధానం ఇచ్చుకునే సమయం చర్చకు కేటాయించిన సమయంలో సగం కంటే ఎక్కువే. అంటే ప్రతిపక్షాలు గంట సేపు సమస్యపై ప్రస్తావిస్తే అధికార పార్టీ మాత్రం దానికి మూడు గంటలకు పైగా సమాధానం ఇస్తుంది. దీనినే వడ్డించే వారు మనవారైతే అంటారు. అవిశ్వాసంపై విజయం అధికార పక్షానిదే అని తేలిపోయింది. సభలో వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధికార పక్షానికి మిత్రపక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడిఎంకే, బిజేడీ వంటివి అవిశ్వాపానికి వ్యతిరేకంగా మాట్లాడతాయి.     ఇందులో అన్నాడిఎంకే అయితే తమ సభ్యులు విధిగా సభకు హాజరుకావాలనే విప్‌ను కూడా జారీ చేయలేదు. పైగా ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య. దీంతో మాకేంటి అని ఆ పార్టీ ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఇంచుమించు ఇదే ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చేసింది. దీంతో ఈ రెండు పార్టీలూ అధికార పక్షం వైపు చేరిపోయినట్లే. ఇక ఒడిషాలోని బిజేడీ అయితే తాము ఓటింగుకు దూరం అని ప్రకటించింది. శివసేనతో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నెరపిన దౌత్యం ఫలించినట్లు కనిపించడం లేదు. ముందు సరే అన్నా... అర్ధరాత్రి శివసేన పులి ప్లేటు మార్చింది.      ఓటింగ్‌పై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక అవిశ్వాసానికి మద్దతుగా తీర్మానం పెట్టిన తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న కాంగ్రెస్ ఓటు వేస్తాయి. వీరికి మద్దతుగా వామపక్షాలు, మమతా బెనర్జీ, అమ్ ఆద్మీ వంటి పార్టీలు బాసగా నిలుస్తాయి. అయితే వీరి సంఖ్యాబలం తక్కువ కాబట్టి తీర్మానం వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ ముందుగా చర్చను ప్రారంభిస్తుంది. ఇందులో కూడా ఆ పార్టీ కాస్త ఇబ్బంది పడింది. ముందుగా తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నాని మాట్లాడతారని ప్రకటించారు. అనూహ్యంగా ఆయన స్ధానంలో గల్లా జయదేవ్ వచ్చారు. దీంతో నాని అనుచరుల్లో కోపం, అసహనం ప్రారంభమైంది. కేశినేని నాని కూడా పైకి తమ నాయకుడు చెప్పినట్లే చేస్తామని ప్రకటించినా లోలోపల ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇక సభకు  రానని భీష్మించుకున్న అనంతపురం ఎంపీ జె.సీ.దివాకర్ రెడ్డి అలక వీడారు. ఆయన అనుకున్నది సాధించుకుని శుక్రవారం సభకు హాజరవుతానని ప్రకటించారు. అంతే కాదు... కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నేడు తేలనుంది. ఈ అంశపై చర్చ అనంతరం ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆదరిస్తారో... ఎవరిని తిరస్కరిస్తారో  తేలిపోతుంది.