రాష్ట్ర విభజనపై త్వరలో వైకాపా కూడా తుది నిర్ణయం
posted on Jul 26, 2013 @ 7:22PM
ఈ రోజు సీమంధ్రకు చెందిన వైకాపా నేతలు శ్రీకాంత్ రెడ్డి, వంగవీటి రాధా, కొడాలి నాని తదితరులు జగన్ మోహన్ రెడ్డిని జైల్లో కలిసారు.ఆ తరువాత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “విభజనపై కాంగ్రెసు పార్టీని నిరసిస్తూ రాజీనామాలు చేయడం తమ వ్యక్తిగతమని, అది పార్టీ నిర్ణయం కాదని, మరొక రెండు మూడు రోజుల్లో తెలంగాణపై పార్టీ నిర్ణయం ప్రకటిస్తామని” తెలిపారు. ఆ తరువాత నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ “రాష్ట్రంలోని అన్నిప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర విభజనను కోరుకోవడంలేదని” అన్నారు. ఒకరు త్వరలో పార్టీ నిర్ణయం ప్రకటిస్తామని చెపుతుంటే, మరొకరు రాష్ట్రవిభజన కోరుకోవట్లేదని చెప్పడం గమనార్హం.
ఇక మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం ప్రకటించబోతుంటే, తాము కూడా మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర విభజనపై తమ పార్టీ అభిప్రాయం ప్రకటిస్తామని చెప్పడం హాస్యాస్పదం.
తెలంగాణా అంశం నిన్న మొన్న కొత్తగా మొదలయినదేమీ కాదు. పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ప్లీనరీలో రాష్ట్ర విభజనపై అభిప్రాయం చెప్పగలిగే అవకాశం ఉన్నపటికీ, అప్పుడు "తమ పార్టీ తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని" చెప్పి పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలమా వ్యతిరేఖమా? అని చెప్పకుండా సమాధానం దాటవేసి, ఆ తరువాత “తెలంగాణా ఇచ్చే, తెచ్చేశక్తిలేని చిన్నపార్టీమాది. తెలంగాణా ఇస్తుందో లేదో ఆ శక్తి ఉన్నకాంగ్రెస్ పార్టీనే నిలదీయండి. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నామాకు అభ్యంతరం లేదు,” అని చెపుతూ ఇన్నాళ్ళు లౌక్యంగా తప్పించుకొని తిరిగిన, వైకాపా ఇప్పుడు రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్దపడుతున్న కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ రాజీనామాల డ్రామాలు మొదలుపెట్టింది.
రాష్ట్ర విభజనపై ఆ పార్టీ చెప్పిన మాటలు పక్కన బెట్టినప్పటికీ, ఆ పార్టీ అఖిలపక్షంలో ఇచ్చిన లేఖ సంగతి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా ఒంటెత్తు పోకడలు పోతోందని విమర్శిస్తున్న వైకాపా, మరి ఆనాడు అఖిలపక్షంలో ఎందుకు నోరు విప్పలేదు? ఇంతకాలం రాష్ట్ర విభజనపై నోరు మెదపని ఆ పార్టీ ఇప్పుడు ఆఖరి దశలో తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమైక్యరాగం ఆలపించి, పార్టీకోసం శ్రమించిన తన తెలంగాణా నేతలని నట్టేటముంచి, తెలంగాణాలో “విశ్వసనీయత” కోల్పోయిన తరువాత ఆ పార్టీని ఆంద్ర ప్రజలు మాత్రం నమ్ముతారా?
ఇంతవరకు ఒక్కసారి కూడా సాధారణ ఎన్నికలని ఎదుర్కోని వైకాపా, మొదటి ప్రయత్నంలోనే అధికారం కైవసం చేసుకొందామనే దురా(శ)లోచనతో ఇటువంటి ఆలోచనలు చేస్తూ, మొట్ట మొదటగా తనకే స్వంతమనుకొంటున్న‘విశ్వసనీయత’ ను పోగొట్టుకొంటోంది. తన పార్టీ నేతల, తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురయ్యి వారికి సంజాయిషీలు చెప్పుకోవడం గమనిస్తే, తన నిర్ణయం తప్పని అర్ధం అవుతోంది.