వైకాపా రాజీనామాల మతలబు ఏమిటి
posted on Jul 25, 2013 @ 10:59PM
తొలి దశ పంచాయతీ ఎన్నికలతో తిరుగులేని ఆధిక్యత సాధించామని గొప్పగా ప్రకటించుకొన్న వైకాపా, రెండవ,మూడవ దశ ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని హటాత్తుగా సమైక్యంద్ర నినాదం ఎత్తుకొని, ఆ పార్టీకి చెందిన 11మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడం చూస్తే ఇక ఆ పార్టీ తెలంగాణాలో ‘కేల్ ఖతం దుకాన్ బంద్’కు సిద్దపడినట్లు అర్ధం అవుతోంది. తెలంగాణాలో ఎంత చమటోడ్చినా ఒక మహబూబ్‌నగర్ లో తప్ప మరెక్కడ పార్టీ పత్తా లేకపోవడంతో, ఇక మున్ముందు కూడా తెలంగాణాలో ఇంత కంటే గొప్పగా సాధించేదేమీ ఉండదని గ్రహించి, 'తెలంగాణాలో రాకపోతే పాయె కనీసం ఆంధ్ర ప్రాంతంలోనయినా పార్టీని గట్టిగా నిలబెట్టుకొంటే అదే పదివేలు' అని భావించడం వల్లనే, అకస్మాత్తుగా తెలంగాణా వ్యతిరేఖ నినాదం చేయగలిగింది. లేకుంటే ఎన్నికల సమయంలో ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నపార్టీ అయినా, ఎన్నికల మధ్యలో ఇటువంటి సాహసానికి ఒడిగట్టదు.
ఇప్పుడు హటాత్తుగా సమైక్యరాగం ఆలపించడం ద్వారా తెలంగాణాను వదులుకొని, అదే సమయంలోఅందరి కంటే ముందు తానే ‘సమైక్యత్యాగం’ చేసి ఆంద్ర ప్రాంతంలో ఆలోటు భర్తీ చేసుకోవాలని ఆలోచనలా ఉంది.
తెలంగాణాలో ‘పోయిన పరువెలాగు పోయింది, ఇక పోతే పోయేది ఒట్టి గోచి మాత్రమే’నన్నట్లు, అక్కడ పంచాయితీ ఎన్నికలు గెలిచినా ఓడినా ఒక్కటే గనుక, వైకాపా సమైక్య రాగాలాపన చేస్తోందిప్పుడు. వైకాపా పంచాయితీ ఎన్నికలకు ముందే తెలంగాణపై కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూ ఒక లేఖ వ్రాసింది. అప్పుడే ఆ పార్టీకి వేరే ఆలోచనలున్నాయనీ భావించిన ప్రజలు ఆ పార్టీని పక్కనబెట్టారు. అందువల్ల పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఫలితాలు చూసుకొన్న వెంటనే సమైక్యరాగం అందుకొంది. ఒకవేళ ఆ పార్టీకి తెలంగాణాలో మంచి ఆధిక్యత వచ్చి ఉండి ఉంటే బహుశః నేడు ఇటువంటి ఆలోచన చేసి ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.
ఇప్పుడు ఈ కొత్త ఎత్తుతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న తెదేపాను ఆంధ్ర ప్రాంతంలో దోషిగా నిలబెట్టవచ్చును. ఇంకా వీలయితే తెదేపాపై ఒత్తిడి తెచ్చి ఆపార్టీలో సమైక్యవాదం పేరిట చీలిక తేగలిగితే, అప్పుడు ఆ పార్టీని అటు తెలంగాణాలోనూ, ఇటు ఆంద్ర ప్రాంతంలోనూ పూర్తిగా దెబ్బ తీయవచ్చునని వైకాపా దూర దురాలోచన కూడా కనబడుతోంది.
ఇక, ఇదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని కూడా రెండు ప్రాంతాలలో ఘోరంగా దెబ్బ తీయవచ్చునని ఆలోచన కూడా ఉంది. తెరాస చేతిలోంచి కాంగ్రెస్ తెలంగాణా సెంటిమెంటును కాకిలా ఏవిధంగా ఎత్తుకుపోయిందో, అదేవిధంగా ఇప్పుడు సమైక్యాంధ్ర సెంటిమెంటుని కాంగ్రెస్ నేతల చేతిలోంచి వైకాపా తన్నుకుపోవాలనే ఆలోచనతో ఈ రాజీనామాల డ్రామకు తెర తీసింది.
రేపటి నుండి వైకాపా సమైక్య పోరాటం మొదలుపెడితే, అప్పుడు ఇంత కాలం దానికోసం పోరాడుతున్న కాంగ్రెస్ నేతలు దానిని వైకాపాకు అప్పజెప్పి, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతున్నామని చెప్పలేరు. చెపితే వారిని సమైక్య ద్రోహులుగా ముద్ర వేసేయవచ్చును. అలాగని వారు రాజీనామాలు చేసి ఉద్యమాలకి దిగితే, రాష్ట్ర విభజనకి సిద్దపడుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడటం ఖాయం. అప్పుడది తెలంగాణపై మరోమారు వెనకడుగు వేయడం కూడా అంతే ఖాయం. అదే జరిగితే కాంగ్రెస్ ను అక్కడ కేసీఆర్ దెబ్బతీస్తే, ఇక్కడ తానూ దెబ్బ తీయవచ్చునని ఆలోచన ఉంది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు, వైకాపా తన సమైక్య రాగాలాపనతో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తోంది. అయితే, ప్రతీ సారిలాగే ఈసారి కూడా ఆ పార్టీ ఇది కూడా మరొక తప్పటడుగు అని త్వరలోనే అర్ధం చేసుకోవచ్చును. ఎందుకంటే, కళ్ళముందు కనబడుతున్న తెలంగాణా రాష్ట్రాన్ని ఈసారి తమకి దక్కకుండా చేస్తే తెలంగాణా ప్రజల ఆగ్రహం ఆ పార్టీ తట్టుకోలేదు. అందుకు అది చాలా భారీ మూల్యం చెల్లించక తప్పదు.