కిరణ్ బంగారు కలలు కలలుగా మిగిలిపోతాయా
posted on Jul 17, 2013 8:00AM
వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటే బహుశః ఇదేనేమో. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గ సభ్యులకి కూడా తెలియనీయకుండా, క్యాబినెట్ అనుమతి తీసుకోకుండా అట్టహాసంగా ప్రారంభించిన బంగారు తల్లి, అమ్మ హస్తం, ఇందిరమ్మ కలలు వంటి పధకాలను ప్రవేశ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి తన స్వంత ఇమేజ్ పెంచుకొనేందుకే ఇటువంటివి ప్రకటిస్తున్నారని స్వంత పార్టీవారే తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతాయనుకొన్న ఆ పధకాలను తీరాచేసి ఇప్పుడు అమలు చేయబోతే వరసపెట్టి ఎన్నికలు తరుముకు వస్తుండటంతో వాటి అమలుకు ఎన్నికల కోడ్ అడ్డం పడుతోంది.
ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ‘అమ్మహస్తం’ పధకం ద్వారా ప్రభుత్వం కాంగ్రెస్ నేతల బొమ్మలు ముద్రించిన బ్యాగులలో తొమ్మిది రకాల సరుకులు అందజేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకు వస్తుందని గనుక వెంటనే నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి లేఖ వ్రాసింది.
అదేవిధంగా ఇటీవల ప్రవేశపెట్టిన బంగారు తల్లి, ఇందిరమ్మ కలలు కూడా ఈ ఎన్నికల కోడ్ కారణంగా ముఖ్యమంత్రి కన్న కలలుగానే మిగిలిపోవచ్చును. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ తరువాత వెంటనే సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు, పురపాలక ఎన్నికలు రానున్నాయి. ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలు దాటిపోవచ్చును.
ఇక, డిశంబరులోఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరునున్నాయి. దానితో బాటే సాధారణ ఎన్నికలను కూడా జరిపించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా కేంద్రం ఏప్రిల్ నెలలోనే సాధారణ ఎన్నికలకు వెళ్లాలని భావించినా కూడా ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అంటే ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన పధకాల గురించి ప్రభుత్వం ప్రచారం చేసుకొని లబ్ది పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అర్ధం అవుతోంది.
అంతే గాకుండా, కేంద్రం ఒకవేళ రాష్ట్ర విభజనకు సిద్దపడితే, ఈ పధకాల గురించి కిరణ్ కుమార్ రెడ్డి కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. విభజన తరువాత ఏర్పడే కొత్త రాష్ట్రాలకి ఎవరు ముఖ్యమంత్రులవుతారో ఊహించడం కష్టం. గనుక ఆయన పధకాలన్నీ వృధా ప్రయాసగానే మిగిలిపోక తప్పదు. దీని వల్ల ఆయనకీ ప్రయోజనం కలుగదు. వాటిని అమలు చేసే వీలులేకపోవడం వలన ప్రజలకీ ప్రయోజనం కలుగదు.
కానీ, పధకాలను ఆర్భాటంగా ప్రకటించినందుకు సర్వత్రా నిరసనలు, విమర్శలు మూటగట్టుకోక తప్పలేదు. అదేవిధంగా వాటి ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చయిపోయింది. ఇప్పుడు తన పధకాల ప్రచారం కోసం ఆయన ఎన్నికలను నిలిపివేస్తారా? లేక ఎన్నికల కోడ్ వల్ల తన పధకాలను నిలిపివేస్తారా? అనేది ఆయనే చెప్పాలి.