ఈ నాన్సెన్స్ అంతా అందుకేనేమో
posted on Oct 11, 2013 @ 10:24AM
ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేర చరితులయిన ప్రజా ప్రతినిధులను వెనకేసుకు వస్తూ యూపీయే ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ ను “నాన్సెన్స్” అని తీసి పారేయడం, వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం దానిని రద్దుచేయడం అంతా యాదృచ్చికంగా జరిగిందేమీ కాదని, రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై అధిష్టింపజేసేందుకే కాంగ్రెస్ ఈ తతంగం అంతా నడిపిందని అనుమానం కలుగుతోంది.
ఆయన ‘నాన్సెన్స్’ తో యుపీయే ప్రభుత్వానికి తాత్కాలికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఆ నాన్సెన్స్ వల్ల ప్రజలలో ఆయన ఇమేజ్ కొంత పెరిగింది. అధిష్టానానికి భజన చేస్తూ తరించే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదే అదునుగా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతున్నారు.
ఇక గొప్ప ఆర్ధికవేత్త, మేధావిగా పేరున్న ప్రధాని డా. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ కోసం తను ప్రధాని పదవి నుండి తప్పుకోవడమే గాక రాహుల్ నేతృత్వంలో పనిచేసేందుకు కూడా సిద్దమేనని నిస్సిగ్గుగా ప్రకటించారు. బహుశః తను తప్పుకోవడానికి ఒప్పుకొన్నాఒప్పుకోకపోయినా రాహుల్ గాంధీ తన కుర్చీపై ముచ్చటపడితే తనను తప్పించడం ఖాయమని గ్రహించినందునే ప్రధాని లౌక్యంగా ఈవిధంగా అని ఉండవచ్చును.
మన్మోహన్ ప్రధాని పదవిలో కొనసాగడం గురించి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఖాతరు చేయలేదు. పార్టీలో చిన్నా పెద్దా అందరూ కూడా ఆయన స్థానంలో రాహుల్ గాంధీని కూర్చోబెట్టడం గురించి మాట్లాడుతూ ప్రధాని పదవికే అవమానం కలిగిస్తూ ఆయనకు ఎటువంటి విలువలేదని స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ డా. మన్మోహన్ సింగ్ దానిని ఎన్నడూ అవమానంగా భావించకపోవడం చాలా విచారకరం. బహుశః ప్రధాని పదవిలో వీలయినంత ఎక్కువ కాలం కొనసాగాలనే కోరిక చేతనే ఆయన ఈ అవమానాలను భరిస్తున్నారేమో తెలియదు.
రాజకీయాలలో నైతిక విలువల గురించి అనర్గళంగా ప్రసంగాలు చేసే రాహుల్ గాంధీ కూడా తమ పార్టీ నేతలు ఈవిధంగా మాట్లాడటాన్నితప్పుగా భావించలేదు. భావించి ఉంటే ఆయన ఆవిధంగా మాట్లాడవద్దని ‘హుకుం’ జారీ చేసేవారు. కానీ చేయలేదు. అంటే ప్రధాని కుర్చీలో నేడు కాకపోతే రేపయినా కూర్చొనే “ప్రాధమిక అర్హత” తనకే ఉందని ఆయన భావించడమే అందుకు కారణం అనుకోవచ్చును.
ఆయన ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్టంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో “యువ ప్రభుత్వం” ఏర్పడపోబోతోందని ప్రకటించారు. అంటే తను ప్రధాని పదవి చెప్పట్టబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించుకొనట్లయింది.
కాంగ్రెస్ భజన మండలి సభ్యులందరూ ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పడానికి పోటీలు పడతారిక. అందరి కంటే ముందుగా హోం మంత్రి షిండే స్వాగతించారు. త్వరలో మిగిలిన వారు స్వాగతిస్తారు. వారందరి కోరిక మేరకు కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే రాహుల్ ను తమ ప్రధాని అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించడంతో ఈ తంతు పూర్తవ్వవచ్చును. బహుశః దీని కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ ‘నాన్సెన్స్’ కధంతా నడిపించిందేమో!
అయితే అసలు కేంద్రంలో మళ్ళీ యుపీయే అధికారంలోకి రావడమే “నాన్సెన్స్” అని యువభారత్ అభిప్రాయ పడుతోంది.