దొందుకు దొందూ దొందప్పలే
posted on Oct 21, 2013 @ 3:08PM
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లలో కొందరు రాష్ట్ర మంత్రులు, అధికారులు కూడా ఈ అవినీతిలో కుట్రదారులేనని పేర్కొన్నప్పుడు, వారందరూ ఈ వ్యవహారంలో తామేమి తప్పు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు ప్రకారమే అన్ని వ్యవహారాలు నడిపించామని వాదించారు. అయితే చనిపోయిన రాజశేఖర్ రెడ్డిపై నిందలు వేసి తప్పించుకోవడం ఏమిటని వైకాపా నేతలు నిలదీసినప్పుడు, సదరు మంత్రులు క్యాబినెట్ సమిష్టి నిర్ణయం ప్రకారమే నడుచుకొన్నామని మాట మార్చారు.
అంటే లక్షలకోట్ల అవినీతి జరిగిందని సీబీఐ ప్రాధమికంగా నిర్ధారించినా, అందులో ప్రధమ ముద్దాయి జగన్ మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా తాము నిరపరాదులమనే వాదిస్తూ తప్పించుకోజూస్తున్నారు. అయితే ఈ లక్షల కోట్ల అవినీతి ఎలా జరిగిందనే ప్రశ్నకు జవాబు వెదకవలసి ఉంది. కానీ ఇప్పుడు సీబీఐకి కూడా రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో అసలు ఈ అవినీతిలో కుట్రదారులను నిరూపించి, దోషులకు అసలు శిక్ష పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పుడు కేంద్రంలో కూడా ఇంచుమించుగా ఇదేవిధమయిన డ్రామా నడుస్తోంది. ఇక్కడ రాష్ట్రంలో మంత్రులు, అధికారులు ఏవిధంగా ఈ అవినీతి భాగోతాలతో తమకు సంబంధం లేదని వాదిస్తున్నారో, అదేవిధంగా కేంద్రంలో కూడా బొగ్గు కుంభకోణంలో ప్రధాన మంత్రికి, మాజీ బొగ్గు శాఖా కార్యదర్శి పీసీ పరేఖ్ కూడా తమకు ఎటువంటి సంబంధమూ లేదని వాదిస్తున్నారు. ఇప్పుడు సీబీఐ చేసిన తాజా చార్జ్ షీట్లో కుమార్ మంగళం బిర్లా, పీసీ పరేఖ్ ల పేర్లతో బాటు ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును నేరుగా పేర్కొనకుండా ‘కాంపిటెంట్ అధారిటీ’ కూడా ఇందుకు బాధ్యత వహించాలని సీబీఐ పేర్కొన్నపుడు, ఆ ‘కాంపిటెంట్ అధారిటీ’ అయిన ప్రధాని మన్మోహన్ సింగ్ ను వెనకేసుకు వస్తూ కేంద్ర కాంగ్రెస్ మంత్రులు మరియు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కొందరు పరేఖ్ మరియు ప్రతిపక్షాల ఆరోపణలపై ఎదురు దాడికి దిగారు.
కోర్టులో ఉన్న వ్యవహారంపై మాట్లాడటం సమజసం కాదని చెపుతూనే, ప్రధాని స్వయంగా అన్ని ఫైళ్ళను చదవడం అసంభవం గనుక, ఆయన ఆ ఫైళ్ళపై సంతకాలు చేసినంత మాత్రాన్న అందులో ఆయనను దోషిగా పేర్కొనడం సమంజసం కాదని వాదిస్తున్నారు. అయితే ప్రధాని కార్యాలయంలో ఉన్న అనేక మంది అధికారులు ఆ ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, ఆ వివరాలను క్లుప్తంగా ప్రధానికి వివరించిన తరువాతనే ఆయన సంతకాలు చేస్తారు గనుక, ఇందులో ప్రధానికి సంబంధం లేదనడం అతితెలివి ప్రదర్శించడమేనని పరేఖ్ విమర్శించారు.
ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో రెండు చోట్ల లక్షల కోట్ల అవినీతికి స్వయంగా ఆమోదం తెలుపుతున్న మంత్రులు, అధికారులు దానితో తమకు ఎటువంటి సంబంధమూ లేదని వాదించడం చూస్తే, బహుశః ఫైళ్ళపై సంతకాలు చేసిన వారే పూర్తి భాద్యులని మళ్ళీ సుప్రీంకోర్టు మరో నిర్వచనం లేదా తీర్పు చెప్పి కొరడా జళిపించవలసి ఉంటుందేమో.