దిగ్గీ రాజా చెప్పిన తాజా కబుర్లు
posted on Oct 17, 2013 @ 6:18PM
రాష్ట్ర విభజన సంగతేమో గానీ దాని గురించి కాంగ్రెస్ నేతలు రోజూ చెప్పే పిట్ట కధలు మాత్రం చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. వారు చెప్పే ఈ కధలన్నీ వింటుంటే ఇదంతా కూడా రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగమనే అభిప్రాయం, ఇంకా చెప్పాలంటే అసలు రాష్ట్ర విభజన ఈవిధంగానే చేయాలేమోననే నమ్మకం జనాలకి కలిగిస్తున్నారు.
ఇక విషయంలోకి వస్తే, రోజుకో తాజా పిట్ట కధలో భాగంగా నేడు దిగ్విజయ్ సింగ్ కొత్తగా ఏమి చెప్పారంటే, షరా మామూలుగా తెలంగాణా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆచమనం చెప్పుకొన్న తరువాత విభజన వ్రత కధ మొదలుపెట్టారు.
"తెలంగాణా ఏర్పడాలంటే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో తెలంగాణా బిల్లుకి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడే తెలంగాణా సాధ్యమవుతుంది. ఇక మా పార్టీకి జగన్మోహన్ రెడ్డితో, ఆయన పార్టీతో ఏదో రహస్య ఒప్పందం ఉన్నదనే మాట ఒట్టి అబద్దం. అది కేవలం తెదేపా పుట్టించిన పుకార్లు మాత్రమే. తెలంగాణా విషయంలో తెదేపా ‘యూ’ టర్న్ తీసుకొని తన విశ్వసనీయతను కోల్పోయింది. అందుకే అటువంటి ప్రచారం చేస్తోంది."
"మేము ఇప్పటికీ వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలనే అనుకొంటున్నాము. మరి దానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తాయ లేదా విషయం అవే నిర్ణయించుకోవాలి,” అని అన్నారు.
ఇక కేసీఆర్ ఈ నెల మొదటి వారంలోగా కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి ప్లగ్గు పీకేయ బోతోందని తనకు హాట్ లయిన్లో కబురు అందిందని ఇటీవల హైదరాబాదు సభలో ప్రకటించారు. కానీ దిగ్గీ రాజా మాత్రం ఆ హాట్ లైన్ వేరేవరి నుండో అయి ఉండవచ్చునని సూచిస్తూ “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుండి తప్పించడంలో వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆయనొక క్రమశిక్షణగల కాంగ్రెస్ నాయకుడు. ఆయన అధిష్టానం నిర్ణయాన్ని తప్పక అమలుచేస్తారు,” అని చెపుతూ కేసీఆర్ ప్లగ్గు పీకేయడం విశేషం.
ఇక తెరాసతో పొత్తులు విలీనం గురించి మాట్లాడుతూ ఇంతవరకు ఆ పార్టీ నుండి మాకు అటువంటి ప్రతిపాదనేమి రాలేదు. ఒకవేళ వస్తే, మా పార్టీ నేతలతో చర్చించి ఏమి చేయాలో నిర్ణయించు కొంటాము,” అని చెవిలో పువ్వు సర్దుకొంటూ చెప్పారు.
ఇక సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఉద్యోగుల సమ్మెలు అన్నీ ఒకటొకటిగా నిలిచి పోతున్నాయి. గనుక అక్కడ పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నాయని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర విభజన లో సీమంధ్ర ప్రజలు భయపడనవసరం లేదని, వారికి భారీ ప్యాకేజీ ఇస్తామని ఆయన అభయ (కాంగ్రెస్) హస్తం ఇచ్చారు.
అందువల్ల నేటి కధలో మనం తెలుసుకోవలసిన నీతులు ఏమిటంటే,
1. బీజేపీ బిల్లుకి మద్దతు ఇస్తేనే తెలంగాణా ఏర్పాటు.
2. జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి రహస్య ఒప్పందం కుదరలేదు.
3. తెరాసతో కూడా ఎటువంటి రహస్య ఒప్పందం లేదు.
4. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి రాష్ట్ర విభజన దగ్గరుండి చేయిస్తారు.
5. సీమాంద్రా ప్రజలు విభజనకు అంగీకరించినట్లే గనుక వారికో బంపర్ గిఫ్ట్.