రాష్ట్ర విభజన కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేర్లు ఖరారు
posted on Oct 8, 2013 @ 10:29PM
ఒకవైపు సీమంద్రా జిల్లాలు సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడికిపోతుంటే, కేంద్రం మాత్రం రాష్ట్ర విభజనకి రంగం సిద్దం చేస్తోంది. కేంద్రం మొన్న ఖరారు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్యానల్ ను పూర్తిగా మార్చి ఈరోజు సరికొత్త ప్యానల్ ను ప్రకటించింది.
రక్షణ మంత్రి ఏకే అంటోనీ ఛైర్మన్ గా ఉండే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే, ఆర్ధిక మంత్రి పీ.చిదంబరం, పెట్రోలియం మరియు గ్యాస్ మంత్రి యం. వీరప్ప మోయిలీ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి గులాం నబీ ఆజాద్ మరియు పట్టణాభివృద్ది శాఖా మంత్రి జై రాం రమేష్ దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రధాని కార్యాలయానికి చెందిన మంత్రి వ్.నారాయణ స్వామీ ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు.
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చూడవలసిన అంశాలు:
1. రెండు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించడం. రెండు రాష్ట్రాలలో నియోజక వర్గాలను నిర్దారించడం. ఆర్ధిక, అధికారిక, పరిపాలనా పరమయిన వ్యవస్థల నిర్ధారణ చేయడం.
2. రెండు రాష్ట్రాలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసుకొని 10సం.లు సజావుగా పాలన చేసుకొనేందుకు వీలుగా అవసరమయిన న్యాయపరమయిన మరియు పరిపాలనా వ్యవస్థలను నిర్దారించడం.
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి అవసరమయిన న్యాయ, ఆర్ధిక, పరిపాలనా ఏర్పాట్లకి సూచనలు, సలహాలు.
4. రెండు రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమయిన సూచనలు, సలహాలు.
5. రెండు రాష్ట్రాలలో శాంతి భద్రతలు, ప్రజల రక్షణకు మరియు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడే దీర్గకాలిక సమస్యల అధ్యనం మరియు వాటికి తగిన పరిష్కారాలు.
6. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడ్డ పోలవరం ప్రాజెక్టుతో సహా రెండు రాష్ట్రాల మధ్య జలవనరులు మరియు సహజ నిక్షేపాలు (బొగ్గు, నీళ్ళు, గ్యాస్ మరియు చమురు) పంపకాలపై తగిన సలహాలు మరియు ఇతర రాష్ట్రాలతో పంపకాలను పునర్నిర్వచించడం.
7. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలకి అవసరమయిన సలహాలు, సూచనలు.
8. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల పంపకాలు.
9. రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత ఉద్యోగులతో సహా ఉద్యోగుల నియామకాలు, సర్దుబాట్లలలో ఇమిడి ఉన్నసమస్యలను గుర్తించడం, తగిన పరిష్కారాలు సూచించడం.
10. రాష్ట్ర విభజన నేపద్యంలో ఉద్యోగుల నియామకం, బదిలీలు తదితర అంశాలకు సంబంధించి సెక్షన్ 371డీ జారీ చేయబడిన రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా తలెత్తే సమస్యలను అధ్యయనం, పరిష్కారం.
11. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తే మరే ఇతర సమస్యల అధ్యయనం మరియు పరిష్కారాలు సూచించడం.
ఆరువారాలలోగా ఈ వ్యవహారాలనీటిపై ఒక సమగ్ర నివేదిక ఈయవలసి ఉంటుంది.