అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరపున 100 కోట్లు.!!
posted on Oct 29, 2018 @ 11:17AM
హైదరాబాద్ నిజాంపేటలో ‘హమారా హైదరాబాద్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారినుద్దేశించి.. అలాగే ఏపీ రాజధాని అమరావతి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ ఉండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి. మీరందరూ నన్ను సోదరుడిగా భావించండి. మీ అందరికీ వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేసీఆర్ కుమారుడిగా, టీఆర్‌ఎస్ నాయకుడిగా హామీ ఇస్తున్నా. పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కకు పెట్టండి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించి కాదని, ఆయన విమర్శించింది చంద్రబాబునేనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో టీఆర్‌ఎ్‌సకు అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని అన్నారు.
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయాలనుకున్న విషయాన్ని కూడా కేటీఆర్ పంచుకున్నారు. అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరపున రూ.100 కోట్లు ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. బహిరంగ సభలో ప్రకటించాలని భావించారు. అయితే అసలు ముందు కేంద్రం ఏమిస్తుందంటూ ఆయన ప్రధాన మంత్రి కార్యదర్శిని ఆరా తీయగా ‘కేవలం మట్టి, నీళ్లు మాత్రమే ఇస్తున్నామంటూ సమాధానం వచ్చింది. కేంద్రం ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే వివాదం రాజుకునే ప్రమాదముందని గుర్తించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాతో రెండు విషయాలు పంచుకున్నారు. ఏపీ ప్రజలు సాదరంగా ఆహ్వానించి బ్రహ్మరథం పట్టారని ఆనందం వ్యక్తం చేశారు. కొత్త రాజధానికి ప్రధాని ఎలాంటి సాయం చేయకపోవడంపై కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు.