మన్మోహన్‌సింగ్ హాయాంలో 3 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి
posted on Dec 1, 2018 @ 3:04PM
'సర్జికల్ స్ట్రైక్స్' ఇది అంత ఈజీగా మరచిపోలేము. ఒకవేళ మర్చిపోయినా ప్రధాని మోదీ గుర్తు చేస్తారు. అయితే సర్జికల్ స్ట్రైక్స్ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ మేమేదో సర్జికల్ స్ట్రైక్స్ చేశామని పదే పదే చెప్పుకుంటున్నారు కానీ ఇలాంటివి కాంగ్రెస్ హయాంలో కూడా జరిగాయంటూ మనకి తెలియని విషయాన్ని రాహుల్ బయటపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ హయాంలో మాత్రమే మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు. మన్మోహన్‌సింగ్ హాయాంలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఈ దాడులు చేయాలా వద్దా అన్నదానిపై స్పష్టత కోసం ఆర్మీ అప్పటి ప్రధాని మన్మోహన్‌ను సంప్రదించింది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సూచించగా ఆయన అంగీకారం తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ దాడులను రహస్యంగా ఉంచాలని ఆర్మీ కోరింది' అని రాహుల్ తెలిపారు.
ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ని ప్రధాని మోదీ తన రాజకీయాలకు అనువుగా మార్చుకున్నారని రాహుల్ విమర్శించారు. యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడు ఆర్మీ కోరిక మేరకు మేం దాన్ని అత్యంత గోప్యంగా ఉంచాం. కానీ మోదీ సర్కారు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం మిలిటరీని రాజకీయ పావుగా వాడుకుంది అని విమర్శించారు. ప్రధాని మోదీ అన్నీ తనకే తెలుసనుకుంటారని అన్నారు. ఆర్మీ గురించి ఆర్మీ జనరల్ కంటే తనకే ఎక్కువ తెలుసునని మోదీ అనుకుంటారు. విదేశాంగ వ్యవహారాలు చూసుకోవాల్సిన విదేశాంగ మంత్రి కంటే తనకే విదేశాంగ వ్యవహారాలు తెలుసని నమ్ముతారు. వ్యవసాయ మంత్రి కంటే తనకే ఎక్కువ తెలుసనుకుంటారు. అన్నీ తనకే తెలుసన్న ఆలోచనలోనే ఆయన ఉంటారు అని రాహుల్ విమర్శించారు.
దేశానికి సంబంధించి కీలక నిర్ణయాల విషయాల్లో విపక్షాలను మన్మోహన్ సంప్రదించే వారు. కానీ గత ఐదేళ్లలో కాంగ్రెస్ చీఫ్‌ను మోదీ ఒక్కసారి కూడా పిలిచిన సందర్భం లేదని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 26/11 దాడులు చోటుచేసుకున్నప్పుడు మన్మోహన్ చేసిన రెండో ఫోన్ కాల్ బీజేపీ నేత ఎల్.కె.అద్వానీకేనని రాహుల్ తెలిపారు. ఏదైనా జరిగితే అది విపక్షాలకు కూడా తెలియాలని మన్మోహన్ నమ్మేవారని, అయితే మోదీ గత ఐదేళ్లలో తనకు ఒక్కసారి కూడా సంప్రదించలేదని రాహుల్ అన్నారు.