ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెడతాం..
posted on Dec 1, 2018 @ 2:18PM
రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఏపీలోనూ వేలుపెడతామని టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలుపెట్టారన్నారు. చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేనేం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు.. నువ్వు తప్పు చేయలేదా..? నువ్వు సుద్దపూసవా..? మీ పార్టీ ఎమ్మెల్యే కాదా 50 లక్షల బ్యాగ్ తో అడ్డంగా దొరికింది? మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అన్నది ఎవరు, తన వాయిస్ కాదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని దుయ్యబట్టారు.
'ఎవరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు సుహాసినికి టికెట్ ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా..? నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే తమ కొడుకును మంత్రిని చేసినట్లు ఆమెను కూడా చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉంది ' అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. పొత్తులు లేకుంటే ఎన్నటికి గెలవలేనని చంద్రబాబుకు తెలుసని, కులాల పేరిట చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, వాటిని తిప్పికొడతామన్నారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని.. ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో తాము ఏనాడూ తగాదాలు కోరుకోలేదన్నారు. 'అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు కేసీఆర్‌ను అహ్వానించారు. చర్చోప చర్చలు తరువాత ఆంధ్రావారు మన సోదరులు అని చెప్పి కేసీఆర్ అమరావతి వెళ్లారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లినప్పుడు కేసీఆర్ 100 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించాలని అనుకున్నారు.కానీ ప్రధాని మోడీ తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు ఇస్తున్నారని తెలిసి.. కేసిఆర్ మౌనంగా ఉండి పోయారు' అని చెప్పారు. నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనలతో జరిపించామని, సీఎం కేసీఆర్ స్వయంగా హాజరయ్యారని కూడా గుర్తు చేశారు.
జగన్ పై కోడి కత్తి దాడి జరిగితే ఖండించామని చెప్పిన కేటీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కేసీఆర్‌ని కలసి రైతులకు 24 గంటలు ఇస్తున్నారని అభినందించారని గుర్తుచేశారు. 2014లో చంద్రబాబుకు బీజేపీ, పవన్ తోడవడంతో అదృష్టం బాగుండి గెలిచారని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్, చంద్రబాబులు ఫిడెల్ వాయించుకోవడమేనని జోస్యం చెప్పారు.