కొడంగల్ లో 144 సెక్షన్.. రేవంత్ రెడ్డి సవాల్
posted on Dec 3, 2018 @ 11:19AM
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొండగల్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో చూపించాలి అనుకుంటుంటే.. మరోవైపు టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలీదు కానీ కొడంగల్ లో రాజకీయ వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరగడం కూడా కలకలం రేపింది. ఆ దాడుల్లో కోట్ల రూపాయిలు దొరికినా బయటకి చెప్పకుండా అధికారులు నిజాన్ని దాచిపెట్టారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస పరిణామాలతో వేడెక్కుతున్న కొడంగల్ ఇప్పుడు మరింత వేడెక్కనుంది. రేపు కేసీఆర్ కొండగల్ లో పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. తనపై కోపంతో కేసీఆర్ సర్కారు కొడంగల్ ను అభివృద్ధి చేయలేదేని.. కేసీఆర్ తన నియోజక వర్గానికి తీరని ద్రోహం చేశారని.. అందుకే కేసీఆర్ సభ జరగనీయబోమని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ మండిపడింది. ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఈసీ డీజీపీని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కొడంగల్ లో 144 సెక్షన్ విధించారు. అధికార పార్టీ ఎంతగా ధన, కండ బలాన్ని వినియోగించినా తాను లెక్కచేయబోనని, పోరాటం ఆపేదిలేదని.. తాను కొండను ఢీకొంటున్నానని, కొండగల్ ప్రజలు తనకు సహకారం అందించాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన కొండగల్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.