లగడపాటి సర్వే.. తెలంగాణలో గెలిచే మూడో అభ్యర్థి ఇతనే
posted on Dec 3, 2018 @ 1:49PM
లగడపాటి రాజగోపాల్ సర్వేకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన్ని ఆంధ్రా ఆక్టోపస్ అని కూడా అంటుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సర్వే కోసం తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లగడపాటి మాత్రం ఆయన సర్వే ఫలితాలను పోలింగ్ జరుగు తేదీ అనగా డిసెంబర్ 7 సాయంత్రం ప్రకటిస్తానని తెలిపారు. సర్లే ఎన్నికల ఫలితాలకు కనీసం మూడు రోజులు ముందైనా ఫలితాల మీద ఒక అవగాహన వస్తుందిగా అనుకుంటుంటగా.. లగడపాటి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి ఇండిపెండెంట్లు 8 నుంచి 10 మంది గెలుస్తారన్నారు. అంతేకాదు గెలిచే ఇద్దరి పేర్లు కూడా చెప్పారు. వారిలో ఒకరు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట అభ్యర్థి శివకుమార్‌రెడ్డి కాగా.. మరొకరు ఆదిలాబాద్ జిల్లా బోథ్ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్. ఇలా రోజుకి ఇద్దరి పేర్లు చెప్తా అన్నారు. టీఆర్ఎస్ మాత్రం లగడపాటి సర్వేని వ్యతిరేకిస్తూ విమర్శలు చేసింది. ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. మరి ఏమైందో ఏంటో తెలీదు కానీ లగడపాటి తన సర్వే ప్రకారం గెలిచే మిగతా ఇండిపెండెంట్ల పేర్లు చెప్పలేదు. అయితే తాజాగా లగడపాటి ఓ కాంగ్రెస్ అభ్యర్థికి ఫోన్ చేసి తన సర్వే ప్రకారం నియోజకవర్గంలో నీకే గెలుపు అవకాశాలున్నాయని చెప్పారట.
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్ చేసి తను చేసిన సర్వే వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. చిన్న వయస్సులోనే పెద్ద ఫాలోయింగ్ సంపాదించావు.. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నావు.. ఇది ఎలా సాధ్యమయిందని లగడపాటి మేడిపల్లిని అడిగారట. తాను చేసిన సర్వే వివరాలతోపాటు, ఈ ఎన్నికల్లో మేడిపల్లికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది తెలిపారట. దీంతో మేడిపల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. దీన్ని బట్టి చూస్తుంటే లగడపాటి సర్వే ప్రకారం గెలిచే మూడో అభ్యర్థి మేడిపల్లి సత్యం అనమాట అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.