కేసీఆర్ అంటే.. కావో కమీషన్ రావ్
posted on Dec 3, 2018 @ 3:00PM
గద్వాలలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియమాకాలపై కలలుగన్నారు. ఆ కలలను కేసీఆర్ కూల్చివేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో మోసం చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ రూ.10వేల కోట్లతో డీపీఆర్ చేస్తే.. టీఆర్ఎస్ దాన్ని రీడిజైన్ పేరుతో రూ.60వేల కోట్లకు పెంచింది. కాంట్రాక్టులకు దోచిపెట్టారు. కేసీఆర్ అంటే.. కావో కమీషన్ రావ్ అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డిని రెండు దశల్లో పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు.
రాష్ట్రం వచ్చిన కొత్తలో ధనిక రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైంది. ప్రతి కుటుంబంపై ఇప్పుడు లక్ష రూపాయలు చొప్పున అప్పు ఉంది. అదే సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరూ రూ.400 కోట్లు చొప్పున వెనకేసుకున్నారు. తెలంగాణలో 30 లక్షలమంది ఉపాధి కోసం ఎదురుచూస్తుంటే.. గత నాలుగున్నరేళ్లలో ఎవరికైనా ఉద్యోగం కల్పించారా? లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా వారిని విద్యకు దూరం చేశారు. బంగారు తెలంగాణ అని మనం కలలు కంటే.. బంగారు కుటుంబం ఆవిర్భవించింది అని మండిపడ్డారు.
ఆదివాసీలు, రైతులను కేసీఆర్ మోసం చేశారు. ప్రజలకు ఇళ్లు ఇవ్వరా? ప్రజల బాధలను పట్టించుకునే మనసే ఉంటే ఇళ్లు కట్టించి ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కలను మేం నెరవేరుస్తాం. ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు ఇస్తాం. పింఛన్లు రద్దైన వారికి పునరుద్ధరిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తాం. రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యకు కేటాయిస్తాం. ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడతాం. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తాం అని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.