స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పు! దక్షిణాఫ్రికా ప్రకటనతో కలకలం..

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధానం కావడంతో అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపట్టాయి. యుద్ధప్రాతిపదికన టీకాలను సమకూర్చుకుని దేశ ప్రజలకు అందిస్తున్నాయి. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న టీకాలను కొనుగోలు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే వ్యాక్సినేషన్ లో భారతదేశం అద్బుత మైలురాయిని క్రాస్ చేసింది. వంద కోట్ల టీకాలతో బహుబలిగా నిలిచింది.    అయితే వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది.రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పుందంటూ దక్షిణాఫ్రికా సంచలన కామెంట్లు చేసింది. అడినోవైరస్ టైప్ 5 వెక్టార్లతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని.. అదే వెక్టార్ తో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ వల్ల పురుషుల్లో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. హెచ్ఐవీ ముప్పు ఉంది కాబట్టి రష్యా వ్యాక్సిన్ ను అనుమతించలేమని దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ గత సోమవారం తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన డేటానూ రష్యా సమర్పించలేదని, ఆ డేటాను అందజేశాక టీకా అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనతో ఆఫ్రికా దేశమైన నమీబియా స్పుత్నిక్ వ్యాక్సిన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే అక్కడ జనానికి స్పుత్నిక్ టీకాలు ఇస్తున్న ఆ దేశం.. మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నమీబియా ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చేంత వరకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ను నిలిపేస్తున్నామని తేల్చి చెప్పింది. దక్షిణాఫ్రికా ఆరోగ్య సంస్థ ప్రకటన, నమీబియా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు స్పుత్నిక్ వీ టీకా  తయారుదారు సంస్థ మాత్రం దక్షిణాఫ్రికా ప్రకటనను ఖండించింది. స్పుత్నిక్ వీ టీకాతో హెచ్ఐవీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.  

ఢిల్లీలో చంద్రబాబు ఏం చేస్తారో.. వైసీపీలో కలవరం..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రం పెద్దలను కలవబోతోంది. సోమవారం మధ్యాహ్నం టీడీపీ బృందానికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది. సోమవారం  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారైన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేతలు  ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఆదివారం  సాయంత్రం  అచ్చెం నాయుడు, కేశినేని నాని ఇతర నేతలు ఢిల్లీకి వెళుతున్నారు. సోమవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంత మంది నేతలు ఢిల్లీకి పయనం కానున్నారు.  సోమవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భారత రాష్ట్రపతితో టీడీపీ నేతలు భేటీ అవనున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నారు.  రెండున్నర సంవత్సరాల తరువాత చంద్రబాబు హస్తినకు వెళుతున్నారు. హోంమంత్రితో పాటు మరికొందరిని కూడా కలిసే అవకాశం ఉంది. ఏపీలో మాదకద్రవ్యాలు , వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. రెండు రోజులపాటు  చంద్రబాబు బృందం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసంపై ఢిల్లీలో నేతలకు బృందం సభ్యులు వివరించనున్నారు. టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసం, అక్రమ కేసులు వంటి అంశాలను  టీడీపీ బృందం కేంద్ర పెద్ద దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

ఏపీలో ఏమి జరుగుతోంది? అరాచకం రాజ్యమేలుతోంది..!

సహజంగా ఎక్కడైనా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తాయి, అలజడులు సృష్టిస్తాయి. కానీ,ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం బండి రివర్స్’లో నడుస్తోంది. అనుభవ రాహిత్యమో, అజ్ఞానమో లేక ఆ రెండూ కలగలిసిన దురహంకారమో కానీ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు, తెలుగు దేశం పార్టీ టికెట్’పై గెలిచి, అధికారికంగా వైసీపీలో చేరకుండానే, చేరినట్లుగా వ్యవహరిస్తున్న,గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరకు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి వంకర చూపులు చూస్తున్నారు. వక్ర బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెయ్యి అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక తప్పునుంచి తప్పించుకునేందుకు, వంద తప్పులు చేస్తూ పోతోంది. అందుకే ప్రజల ముందు, న్యాయస్థానాల ఎదుట  అభాసు పాలవుతోంది.  అందుకే, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? అని రాష్ట్ర హై కోర్టు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టే, రాష్ట్రం ఎటు పోతోందో, ఎంతలా దిగజారి పోతిందో  వేరే చెప్పవలసిన అవసరం లేకుండా అర్ధమవుతోంది.  రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన సాగడం లేదు, అన్నదే హై కోర్టు  రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేసిన తాజా అక్షింతల సారాంశం.హైకోర్టు అక్షింతలు వేసిది పోలీసల నెత్తినే కావచ్చును కానీ,అధికారంలో ఉన్నవారిలో, ప్రభుత్వ సలహాదారు సజ్జల వారితో సహా ఏ ఒక్కరికైనా ఒకింత  విజ్ఞత, వివేచనా ఉన్నా న్యాయస్థానం ఎవరిని ఉద్దేశించి, అంత తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిందో అర్థమవుతుంది. అంతటి విజ్ఞత, వివేచనా ప్రభుత్వానికి లేదనే కావచ్చును, న్యాయస్థానం సర్కార్ తప్పును వివరంగా, విశదపరించింది.  “రాష్ట్రంలో పోలీసులకు చట్టబద్ద పాలన అంటే గౌరవం లేదు. హై కోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ద పదవులలో ఉన్న వారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉత్సాహం చూపించని పోలీసులు, ముఖ్యమంత్రిని దూషించారనే కారణంతో  తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి విషయంలో అంత ఉత్సాహం చూపవలసిన అవసరం ఏముంది? గౌరవం, వ్యక్తిగత ప్రతిష్ట ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడవలసిన బాద్యత పోలీసుల పై  ఉంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు, ముఖ్యమంత్రి  అయినా సరే, పోలీసుల వ్యవహార శైలి పై అభ్యంతరాలతో కోర్టు ముందుకు ప్రతి రోజు పలు వ్యాజ్యాలు వస్తున్నాయి . పట్టాభి అరెస్ట్’ విషయంలో పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు” అంటూ న్యాయస్థానం పోలీసుల వ్యవహారశైలి పైనే కాదు, ప్రభుత్వం దుర్నీతి, దుర్మార్గ వ్యవహార శైలి పైనా అక్షింతలు వేసింది. ఒక రకంగా చూస్తే, రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వాన్ని పరోక్షంగానే అయినా అభిశంసించిందని కూడా  అనవచ్చునేమో. అనే విధంగా వ్యాఖ్యలు చేసింది.  అయితే అదేమీ విచిత్రమో కానీ, బుగ్గకార్లలో తిరుగుతున్న, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్’లు, వందమందో ఆపైనో ఉన్న సలహాదారులకు ఈ విషయం ఎందుకో  తలకెక్కడం లేదు. ఈ ప్రభుత్వ వైఖరి సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇలా మంత్రులు, అధికారులు, సలహాదారులు ఎవరికి వారు మనకెందుకులే అని కొందరు, భయంతో ఇంకొందరు  మౌనంగా ఉన్నా,లేక ముఖ్యమంత్రి తానా అంటే, తాము తందానా అన్నా, పరిస్థితి విషమించి చేజారి పోయేందుకు అట్టే కాలం పట్టదు. ఇప్పుడు ఏపీలో జరిగింది, జరుగుతోంది కూడా అదే, ముఖ్యమంత్రి ఏది చెబితే అదే పవిత్ర బైబిల్ సూక్తి అనంట్లుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఇలా అధికార యంత్రాగంలో జీ హుజూర్ మనస్తత్వం బలిసి పోవడం వలన  ఇలంటి జరగరాని అనర్ధాలు అన్నీ జరిగి పోతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అధికారులు కూడా, కోర్టు బోనులో నిలబడి సంజాయిషీ ఇచ్చుకోవలి వస్తోంది. అయినా, అందరూ కాకపోవచ్చును కానీ, కొందరు  అధికారులు అదే పంధాలో పోతున్నారు.   ఇక ప్రస్తుత బూతుల భాగోతం విషయానికే వస్తే, ఈ చండాలం అంతటికీ మూలం, రాష్ట్రం డ్రగ్స్, గంజాయి అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందనే ఆరోపణ,ఆ ఆరోపణ చుట్టూ అల్లుకున్న వివాదం. నిజానికి,ఇది కేవలం ఆరోపణ మాత్రామేకాదు,నిజం. అలాగే, డ్రగ్స్, గంజాయి అక్రమ దందా, ఇప్పుడే మొదలైందా అంటే కాదు. అధికార పార్టీ నాయకులు, చివరకు సంబంధిత  ప్రభుత్వ అధికారులు కూడ తమను తాము డిఫెండ్ చేసుకునేందుకు చెపుతున్న గతాన్ని కొట్టివేయడం కుదరదు. అయితే, గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడూ ‘జరగవచ్చును’ అనేది మాత్రం  తప్పు. ఆ మొదటి తప్పును అసలు సమస్యను కప్పి పుచ్చుకునేందుకు, పట్టాభి తిట్టును అడ్డుపెట్టుకుని, దానికి విరీత అర్థాలు జోడించి, తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపి వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం రెండవ తప్పు. ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి పట్టాభి తిట్టుకు ఉన్న నానార్ధలలో తమకు అనుకూలమానుకున్న, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్నే ... అంత మాటన్నారని, అమ్మను అవమానించే ఆ మాటను తననోటితోనే బహిరంగ వేదిక నుంచి రాష్ట్ర మంతా వినిపించడం, అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు  అందరూ బీపీ రోగులని నిర్ధారించడం, బీపీలు పెరిగే దాడులు చేశారని ముఖ్యమంత్రి బహిరంగాంగా సమర్ధించడం అన్నిటినీ మించిన అతి పెద్ద తప్పు. నిజానికి ఆది తప్పు మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని ఉల్లంగించడం కూడా ఆవుతుంది.  అందుకే వైసీపీ బీపీ బ్యాచ్, బీపీ ఇంకా పెరిగి మర్దల్లో, మాన భంగాలో చేసినా ముఖ్యమత్రి వాటినీ సమర్దిస్తారా అని అడుగుతున్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేసే వారు, రథాలను దగ్ధంచేసే వారు  మతి స్థిమితం లేని పిచ్చోళ్ళు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయలపై దాడులు చేసే వారేమో .. బీపీ రోగులు. బాగుంది, ఇక మర్డర్లు ఇతర నేరాలు చేసే వారికి కూడా ముఖ్యమంత్రి ఏదో ఒక రోగాన్ని అతికిస్తే,, సరిపోతుందని, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం చేయవలసింది బూతుల విచారణ కాదు, ఈ మొత్తం  రచ్చకు మూలమైన డ్రగ్ మాఫియా, గంజాయి దందా మీద దృష్టి పెట్టాలని మాజీ  ఐఏఎస్, ఐపీఎస్ సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణ డీజీపీ ఫోన్ ట్యాప్! హుజురాబాద్ ఎన్నికల వేళ కలకలం...

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. లేట్ గా ప్రచారానికి వచ్చినా... హుజురాబాద్ లో అదరగొట్టారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం పలు సభల్లో ప్రసంగించిన రేవంత్ .. కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  హుజూరాబాద్ లో అధికార పార్టీ అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్ ను వ్యసనాలకు అడ్డాగా మార్చాయన్నారు. పంపకాల్లో తేడా వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పోలీస్ విభాగం రెండుగా విడిపోయిందని సంచలన ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికలో పోలీసులు నిజాయతీగా వ్యవహరించడం లేదని, టీఆర్ఎస్ నేతలు పోలీసు విధులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డీజీపీ ఫోన్ నూ ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.  డీజీపీపై నర్సింగరావు, తమపై వేణుగోపాలరావు నిఘా పెట్టారని చెప్పారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన పోలీసులను వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడు అని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆయన  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఇతర మంత్రులూ  అనామకులేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని నాన్ లోకల్ అంటున్నారని, మరి, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో పోటీ చేసిన వారెలా స్థానికులవుతారని ప్రశ్నించారు. దళితబంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని విమర్శించారు. సిద్దిపేటలో దళితబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ ను నిలదీశారు రేవంత్ రెడ్డి. జనాలను భయపెట్టి ఓట్లేయించుకునేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే టీఆర్ఎస్ లో ముసలం ఖాయమని, కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబంలో ప్రాణ త్యాగాలు ఎవరూ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 

ఏపీలో బుసకొడుతున్న అరాచకం.. దగ్గరుండి మరీ రెండు దేవలయాల కూల్చివేత

ఏపీలో జగన్ సర్కారు అరాచకానికి అంతు లేకుండా పోతోంది. అమ్మవారి భక్తుల సెంటిమెంట్లు పట్టడం లేదు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని అందరూ చూస్తుండగానే దారుణంగా అవమానించారు. అసలు హిందువుల సెంటిమెంట్లంటేనే జగన్ ఖాతరు చేయడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వందకు పైగా ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. హిందువుల మీద విపరీతమైన ద్వేషం ప్రదర్శించేవారిని  వెనకేసుకొస్తున్న జగన్ వైఖరి కారణంగానే.. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మరో రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఆంజనేయస్వామి గుడిని కొట్టేసి విగ్రహాన్ని దగ్గరలోనే ఉన్న బావిలో పడేయడం హిందూ భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. నిత్య పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం తమ కళ్ల ముందే బావిలో పడేస్తుంటే ఏం చేయాలో, ఎవరిని నిలదీయాలో తెలియక అమాయకులైన పాతపట్నం గ్రామప్రజలు  నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఆ దృశ్యాలు కాస్తా కొందరు విలేకరుల దృష్టికి రావడంతో ఈ అరాచకం బయటపడింది.  శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే స్థానిక పెట్రోల్ బంకు దగ్గర నుంచి ఫ్లైఓవర్ వెళ్తోంది. ఆ పెట్రోల్ బంకు వద్దనే ఆంజనేయస్వామి గుడి ఉంది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వచ్చిన సిబ్బంది ఆలయాన్ని పూర్తిగా కొట్టేయాలంటూ ముందుకొచ్చారు. స్థానికులు, గుడి పూజారి అధికారుల ముందుకొచ్చి ఒక గంట సమయం ఇవ్వాలని ఎంతో ప్రాధేయపడ్డా వినకుండా అప్పటికప్పుడే ఆంజనేయస్వామి గుడిని పూర్తిగా నేలమట్టం చేశారు. గుడిని నేలమట్టం చేయడం ఒక ఎత్తయితే... ప్రతిరోజూ పూజలందుకునే ఆంజనేయస్వామి విగ్రహం మీద కక్ష కట్టినట్టు.. దాన్ని బావిలో పడేయడాన్ని మాత్రం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంజనేయస్వామి భక్తుల మనోభావాలు, హిందువుల సెంటిమెంట్లు దారుణంగా గాయపడ్డాయి. గుడిని గానీ, ఏదైనా ప్రార్థనా స్థలాన్ని గానీ తొలగించాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆస్తికి ఇచ్చేపాటి విలువ కూడా హిందువుల ఆరాధ్య దైవానికి ఇవ్వకపోవడంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, కనీసం విగ్రహాన్ని తరలించే సమయం కూడా ఇవ్వకుండా కక్ష కట్టినట్టు వ్యవహరించడమేంటని ప్రజలంతా నిలదీస్తున్నారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబం రోడ్డున పడి విలపిస్తోంది. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పాతపట్నం ప్రజల హాహాకారాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లైఓవర్ నిర్మాణకర్తల విధ్వంసకాండ కొనసాగింది. అక్కడే ఉన్న నీలమణి దుర్గమ్మ గుడి మీద కూడా ప్రతాపం చూపారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే అమ్మవారి గుడిని సగభాగం కొట్టేశారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానకమైన వాతావరణం కమ్ముకొంది. స్థానిక ప్రజలంతా ఈ అరాచకాన్ని ఆపేదెవరు.. తమ గోడు వినేవారెవరు... అంటూ రోదిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకైనా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా, తమకు సమయం ఇవ్వకుండా ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రెండు గుళ్లను కొట్టేయడమేంటని ప్రజలు నిలదీస్తున్నారు. మరి జగన్ ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు స్థానికులు.

రెండున్నర ఏండ్ల తర్వాతబిగ్ ఫైట్.. భారత్- పాక్ మ్యాచ్ తో క్రికెట్ ఫీవర్...

ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సమరం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో  దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఈ ఉత్కంఠ సమరానికి వేదిక కానుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో భారకత్- పాక్ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడపోతున్నాయి. చివరిసారిగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. బ్రాడ్‌కాస్టర్ల ఖజానా నింపే ఈ మ్యాచ్‌ కోసం 17,500 టిక్కెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి.  ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యంగా ఉంది. వన్డే వరల్డ్‌క్‌పలో ఏడు సార్లు.. టీ20 ప్రపంచక్‌పలో ఐదుసార్లు గెలిచింది. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లాడితే భారత్‌ ఏడింటిలో గెలిచింది.టీ20 ప్రపంచక్‌పలో తొలిసారిగా కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు పాక్‌ను ఎదుర్కొనబోతోంది.  కెప్టెన్ కోహ్లీకి ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఇదే ఆఖరి టోర్నీ కూడా. అందుకే అన్ని విధాలా ఈ మ్యాచ్‌ చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంతకుముందు ఐదుసార్లు ఈ మెగా టోర్నీల్లో ధోనీ ఆధ్వర్యంలోనే జట్టు బరిలోకి దిగింది. ఇప్పుడు ధోనీ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఫార్మాట్‌లో బలంగా కనిపిస్తున్న పాక్‌ జట్టును.. గత రికార్డును దృష్టిలో ఉంచుకుని తేలిగ్గా తీసుకుంటే షాక్‌ తప్పదు.  భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. పేసర్‌ షహీన్‌ షా అఫ్రీదిని వీరు దీటుగా ఎదుర్కొని పరుగులు రాబడితే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కోహ్లీ నెంబర్‌ త్రీలో రావడం ఖాయం కాగా, ఆ తర్వాత మిడిల్‌ ఓవర్లలో సూర్యకుమార్‌ దూకుడు జట్టుకు లాభించనుంది. ఆరో నెంబర్‌లో హార్దిక్‌ వైపే కోహ్లీ మొగ్గు చూపుతున్నాడు. స్పిన్‌ విభాగంలో జడేజాకు జతగా అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌లలో ఒకరిని ఆడించవచ్చు. పేస్‌ త్రయం బుమ్రా, షమి, శార్దూల్‌ పాక్‌ బ్యాటర్స్‌ పనిబట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై విజయాలు లేకున్నా పాక్‌ ఆ గతాన్ని గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ జట్టు టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆడిన 25 టీ20ల్లో 15 మ్యాచ్‌లు గెలిచారు. పాక్‌ టాపార్డర్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (1462), కెప్టెన్‌ ఆజమ్‌ (1363) ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన  టాప్‌-2 క్రికెటర్లు. ఆజమ్‌ ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. ఇదే జోరును భారత్‌పైనా చూపాలనుకుంటున్నారు. ఇక నెంబర్‌ 3లో ఫఖర్‌ జమాన్‌ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. రెండు వామ్‌ప మ్యాచుల్లో కలిపి అతను 98 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో లెఫ్టామ్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రీది ఇబ్బందిపెట్టవచ్చు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మహ్మద్‌ ఆమిర్‌ను భారత టాపార్డర్‌ ఆడలేక మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక స్పిన్నర్లు ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌ కూడా జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నారు.

బుర్జ్ ఖలీఫాపై మెరిసిన బతుకమ్మ.. తెలంగాణకే గర్వకారణమన్న కవిత

తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ. సంస్కృతి, సంప్రాదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే బతుకమ్మ సంబరాలు విజయదశమికి ముందు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ప్రపంచంలో పూలను పూజించే ఏకైకం పండుగగా గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైంది.  ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ బతుకమ్మ కనువిందు చేసింది. శనివారం రాత్రి రెండుసార్లు.. 9.40 గంటలకు ఒకసారి, 10.40 గంటలకు మరోసారి మూడు నిమిషాలపాటు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించారు.  తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతోపాటు జైహింద్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలను కూడా ప్రదర్శించారు.   బుర్జ్ ఖలీఫాపై మెరిసిన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది వీక్షించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రవాసులు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదించారు. తెలంగాణ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ఒక్క తెలంగాణకే కాదని, మొత్తం దేశానికే గర్వకారణమని అన్నారు. బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు

టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత..

తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కృష్ణా జిల్లాకు చెందిన  టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం ఆయనకు గుండె నొప్పి రావడంతో  ప్రయివేట్ ఆసుపత్రి లో చేరారు. అయితే వైద్యం అందిస్తుండగానే.. సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు కాట్రగడ్డ బాబు. గత 25 ఏళ్లుగా బెజవాడ నగరంలో టీడీపీ పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు కాట్రగడ్డ బాబు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్లిన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆయన నిత్యం అందుబాటులో వుండేవారు. కాట్రగడ్డ బాబు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. 

బీజేపీకి హరీష్ రావు 15 ప్రశ్నలు.. హుజురాబాద్ లో సవాళ్లు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. నేతలంతా హుజురాబాద్ లోనే మకాం వేశారు. టీఆర్ఎస్ కు అంతా తానే వ్యవహరిస్తున్న మంత్రి హరీష్ రావు.. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ కేంద్రంగా ఆయన బీజేపీకి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు 15 ప్రశ్నలు సంధించారు. 1. రైతుల పట్ల ఇంత నిర్దయగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత కౄరంగా వ్యవహరించే పార్టీ, ప్రభుత్వం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా బీజేపీ తప్పమరో పార్టీ, మరెక్కడా కనిపించదని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులను ఉగ్రవాదులతో పోల్చిన బీజేపీ నాయకులకు బుద్దిచెప్పాలి. నడి రోడ్డుపై రైతులను హత్య చేసి, మళ్లీ ఆ రైతులనే ఓట్లు అడుగుతారా ? 2. రైతులను కొట్టి జైలుకు వెళితే పెద్ద లీడర్లు అయితరు అని హర్యానా రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ రెచ్చగొడతడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కారు ఎక్కించి కేంద్ర మంత్రి కొడుకు నలుగురు రైతుల ప్రాణాలు తీస్తడు.కర్షకుల కోసం కొట్లాడే వాళ్లంతా ఖలిస్తాన్ తీవ్రవాదులని కేంద్ర మంత్రి అంటడు అని హరీశ్ రావు బీజేపీ పై మండిపడ్డారు. 3. రైతు చట్టాలను వ్యతిరేకించడం దేశ ద్రోహమని ఇంకో కేంద్ర మంత్రి అంటడు.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎమన్నడు? బీజేపీ కార్యకర్తలను ఎట్లు రెచ్చగొట్టిండు. బీజేపీ కార్యకర్తలు ఎక్కడిక్కడ గ్రూపులుగా తయారు కాండి. 500 మంది, వెయి మందితో జమ కాండి. వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపే రైతులను కర్రలతో తరిమి కొట్టండి. అయితే కేసు అయితది. కాని మీరు పార్టీలో పెద్ద లీడర్లు అయితరు. అని హర్యానా ముఖ్యమంత్రే బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టిండు.ఉత్తర ప్రదేశ్ లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కారు ఎక్కించిండు. నలుగురు రైతుల ప్రాణాలు తీసిండు. ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వమే ఆశిష్ పై హత్య కేసు పెట్టింది.కేంద్రమంత్రి అజయ్ మిశ్రా ఎమంటున్నడు. అసలు రైతులంతా ఖలిస్తాన్ తీవ్రవాదులని ముద్ర వేసిండు. రైతులకు అడుగడుగునా అన్యాయం చేసి, ప్రతీ అంశంలో దగా చేసిన బీజేపీకి గట్టి బుద్ది చెప్పాలి.ఇన్ని దుర్గాలు చేసిన బీజేపీ నాయకులకు కనీసం పశ్చాతాపం లేదు. బాధ లేదు. రైతుల పట్ల సానుభూతి లేదు. ఉత్తర ప్రదేశ్ లో అంత ఘోరం జరిగినా ఒక్క బీజపీ నాయకుడు కూడా కనీసం విచారం వ్యక్తం చేయలేదు ఇదేనా బీజేపీ నాయకులకున్నమానవత్వం? 4. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే పాకిస్తాన్ అని ముద్ర వేయడం, రైతుల గురించి మాట్లాడితే ఖలిస్తాన్ అని ముద్ర వేయడం, న్యాయం గురించి మట్లాడితే హిందుస్తాన్ అని అరవడం ఇది బీజేపీ నాయకులకు దుర్నీతి. అన్నం పెట్టే రైతులను చంపిన బీజేపీ నాయకులు జాతి ద్రోహులు. అలాంటి దేశ ద్రోహ పార్టీకి ఓట్లేస్తమా. 5. హూజూరాబాద్ లో బీజేపీని ఓడించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారనే సందేశం మనం దేశానికి ఇవ్వాలి.నేను బీజేపీ నాయకులను అడుగుతున్న అసలు రైతులు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి.? ఒక్కరంటే ఒక్క కారణం చెప్పండి.రైతులు టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో నేను వంద కారణాలు చెబుతా. మీరు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పండి.. అని హరీశ్ రావు ప్రశ్నించారు.రైతులను నడి రోడ్డు మీద చంపినందుకు మీకు ఓటెయ్యాలా? రైతులను కర్రలతో కొట్టండి అని పిలుపునిచ్చినందుకు బీజేపీకి ఓటెయ్యాలా? రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినందుకు బీజేపీకి ఓటెయ్యాలా? 6. వ్యవసాయ మార్కెట్లు బంద్ పెట్టడం కోసం కొత్త చట్టం తెచ్చినందుకు ఓటెయ్యాలా? ఎనర్జీ ఆడిట్ పేరుతో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టాలని చట్టం తెచ్చినందుకు బీజేపీకి ఓటెయ్యాలా? పెట్రోల్ లీటరు ధర రూ 111.18 లీటర్ డిజీల్ ధర రూ. 103.94 కు పెంచినందుకు, గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయలు చేసి సబ్సిడీని రూ. 250 నుంచి రూ. 39 కు తగ్గించినందుకు బీజేపీకి ఓటు వేయాలా? 7.బీజేపీ ప్రభుత్వం డిజిల్ రేట్లు పెంచడం కారణంగా రైతుల వ్యవసాయఖర్చు పెరిగింది. ట్రాక్టర్ తో ఎకరం భూమి దుక్కి దున్నడానికి ఇంతకుముందు ఎకరానికి రూ. 2 వేలు ఖర్చు అయ్యేది. అలాంటిది డిజిల్ రేట్ల పెంపు వల్ల, ఇవాళ ఎకరం దుక్కి దున్నడానికి రూ. 6 వేలు ఖర్చవుతుంది. రైతులకు రెండింతల సాగు ఖర్చు పెంచినందుకు బీజేపీకి ఓటు వేయాలా.? 8.సీఎం కేసీఆర్ గారు రైతు బంధు పథకంతో ఎకరానికి ఐదు వేలు కుడి చెత్తో సాయం చేస్తుంటే, బీజేపీ డిజిల్ రేట్లు పెంచి ట్రాక్టర్, వరి కోత మిషన్ల కు అయ్యే డిజిల్ ఖర్చు ద్వారా ఆ మొత్తాన్ని ఎడమ చేత్తో తీసుకుంటున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా.? 9.  ఎఫ్.సీ.ఐ ద్వారా ధాన్యం సేకరించేది లేదని మొండి చెయ్యి చూపించినందుకు బీజేపీకి ఓటెయ్యాలా? దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నా , విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకుని ఇక్కడి రైతుల పంటకు ధర రాకుండా అన్యాయం చేస్తున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా? 10.  కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంవచ్చిన తర్వాత బడా కంపెనీలకు 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. కాని ఒక్కరంటే ఒక్క రైతు రుణం మాఫీ చేయలేదు. పిట్టలను కొట్టి గద్దలకు పెడుతున్న బీజేపీ పార్టీకి ఓటెయ్యాలా? 11. ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయనికి అనుబంధం చేసి అటు రైతులకు,ఇటు కూలీలకు మేలు చేయండని దేశమంతా మొత్తుకొంటోంది. అయినా ఆ పని మాత్రం చేయలేదు. ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయన్ని బాగు చేయడానికి ఉపయోగించనందుకు బీజేపీకి ఓటెయ్యాలా? 12. తెలంగాణలో రూ. 2 లక్షలకోట్ల వ్యయంతో రైతుల కోసం ప్రాజక్టులు కడుతున్నాం. కనీసం ఒక్క రూపాయి అయినా కేంద్రం సాయం చేసిందా.? ఒక్క ప్రాజెక్టు కూడా కట్టనందుకు బీజేపీకి ఓటెయ్యాలా? 13. కృష్ణా నీటిలో తెలంగాణ వాటా నిర్ణయించి,తెలంగాణకు న్యాయంచేయాలని వందల సార్లు ప్రధానికి చెప్పినా పట్టించుకోలేదు. నీటి వాటాలో అన్యాయాన్ని సవరించనందుకు బీజేపీకి ఓటెయ్యాలా? 14. కృష్ణా నది నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల ద్వారా తరలిస్తున్నా మౌనం వహిస్తున్నందుకు బీజేపీకి ఓటెయ్యాలా.?

రాజస్థాన్, యూపీలోకీ చొచ్చుకొచ్చిన ఖలిస్తాన్.. కొత్త మ్యాప్ కలకలం

ఇస్లామిక్ టెర్రరిజం మరో కొత్త టర్న్ తీసుకుంటోంది. భారత్ లో చిచ్చు పెట్టడానికి దొరికిన అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటోంది. సిక్కులను శాశ్వతంగా భారత్ నుంచి దూరం చేసే కుట్రను తీవ్రతరం చేసింది. ఖలిస్తాన్ పేరుతో సరికొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఈ నెల 31న లండన్ లోని క్వీన్ ఎలిజబెత్ సెంటర్ లో జరిగే రెఫరెండంకు ప్రిపరేషన్లో భాగంగా విడుదల చేసిన తాజా మ్యాపును ప్రపంచమంతా ఖండిస్తోంది. సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలంటున్న డిమాండ్ కు సిక్కుల నుంచే మద్దతు లేకపోవడం గమనించాల్సిన అంశం. ఈ నెలాఖరున లండన్లో జరిగే రెఫరెండం ద్వారా యావత్ సిక్కుజాతిని ఖలిస్తాన్ వైపు కదిలించాలని కొందరు వేర్పాటువాదులు, ఉగ్రమూకలు కలిసి పన్నాగం పన్నుతున్నాయి. ఖలిస్తాన్ డిమాండ్ ఇప్పటిదే కాకపోయినా.. కాలం చెల్లిన, ప్రజల మద్దతు దొరకని ఆ డిమాండ్ కు మాత్రం సోషల్ మీడియా కారణంగా ప్రచారమైతే పెరుగుతోంది.  ఈ క్రమంలో ఈ నెలాఖరున లండన్లో సిక్కులతో ఓ రెఫరెండం నిర్వహించాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జె) నిర్ణయించింది. తాజాగా విడుదల చేసిన మ్యాపులో భారత్ లోని పూర్తి పంజాబ్ తో పాటు యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను కూడా చేర్చారు. దీనిపై భారత్ నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ డయాస్పోరా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అసలు సిక్కుల తొలి గురువు నానక్ దేవ్ జన్మస్థలమైన కర్తార్ పూర్, నన్కానా సాహిబ్ (పాకిస్తాన్లో ఉన్నాయి) గ్రామాలు తాజా మ్యాపులో లేకపోవడంతో ఈ దుశ్చర్య ఎవరిదో ప్రపంచానికి మరోసారి తేటతెల్లమవుతోంది. సిక్కుల కోసం సొంత దేశం కావాలంటున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్లోని నానక్ జన్మస్థలాన్ని విస్మరించడం గమనించాల్సిన అంశం. దీనివెనుక పాక్ ఉగ్రవాద శిక్షణా సంస్థ అయిన ఐ.ఎస్.ఐ హస్తం ఉందని తాజా దృష్టాంతంతో తేలిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ లో రెఫరెండాన్ని ప్రస్తావిస్తూ ఎస్.ఎఫ్.జె తాజా మ్యాపును పోస్టు చేసిన కాసేపటికే నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. మ్యాపులో రాజస్థాన్ లోని జోధ్ పూర్, గంగానగర్ వంటి జిల్లాలను కూడా చేర్చడంపై రాజస్థాన్ పౌరులు పాక్ కుట్రపై మండిపడుతున్నారు. పాక్ లో ఉన్న కర్తార్ పూర్ ను అడిగే దమ్ములేని ఆటబొమ్మలు ఖలిస్తానీ వాదులంటూ పంజాబ్ లోని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.  భారత్ లో చిచ్చు పెట్టేందుకు ఉగ్రవాదులను చాపకింద నీరులా పంపిస్తున్న పాకిస్తాన్... సిక్కులను నయానా, భయానా లొంగదీసుకుంటోంది. పాక్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులను మతమార్పిళ్లకు గురిచేస్తూ, వారి ఆస్తులను కబ్జా చేస్తూ దేశం నుంచి పారిపోయేలా చేస్తున్నారు. అయితే ఖలిస్తాన్ అనే సెంటిమెంట్ ను ఆసరా చేసుకొని సిక్కుల ప్రత్యేక ప్రాంతానికి కుట్రపూరితంగా మద్దతిస్తూ, వారి వేర్పాటువాదానికి అవసరమైన వనరులు సమకూరుస్తూ లండన్లో ఉగ్రవాద సంస్థలతో కలిసి ఈ రెఫరెండం నిర్వహిస్తోంది.  ఇటీవల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేసుకోవడం విశేషం. పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఎంపికైన నవజోత్ సింగ్ సిద్ధూను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా కెప్టెన్ అభివర్ణించారు. సిద్ధూ మీద ఇతర ఆరోపణలేవీ చేయని కెప్టెన్... ఆయన వైఖరిని మాత్రమే ప్రస్తావించారు. దేశానికి సరిహద్దులో ఉన్న పంజాబ్ నిర్ణయాలు సిద్దూలాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళితే దేశానికి పూడ్చుకోలేని నష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానంతో ఎగిరి గంతేసిన సిద్దూ పాక్ లో పర్యటించారు. అయితే ఇటీవల సిక్కులను టార్గెట్ చేస్తూ మత మార్పిళ్లు, లవ్ జిహాద్ లు, ఆస్తుల లూటీలు జరుగుతున్నా సిద్దూ ఏనాడూ నోరు మెదపలేదు. బహుశా ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే కెప్టెన్ అమరీందర్ సిద్ధూ గురించి తీవ్రమైన అనుమానం వ్యక్తం చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1984లో ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసేందుకే ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. అందుకు కాంగ్రెస్ భారీ మూల్యం కూడా చెల్లించింది. మరి ఖలిస్తాన్ మద్దతుదారులు ఇప్పుడు ఏకంగా భారత్ లోని అనేక రాష్ట్రాలను మ్యాపులో చేర్చి విడుదల చేస్తే కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలంటున్నారు నెటిజన్లు.

జైలు నుంచి పట్టాభి రిలీజ్.. పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి.ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్‌ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.  విచారణ సందర్భంగా హైకోర్టు  పలు కీలక వ్యాఖ్యలు చేసింది.  పోలీసులు పట్టాభి అరెస్టులో సరైన విధానాన్ని అమలు చేయలేదని, రిమాండ్‌ రిపోర్ట్‌ తప్పుల తడకగా ఉందని పేర్కొంది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సెక్షన్‌ 41 ఏ నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సూచించింది. 41 ఏ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు అమలు చేయలేదని తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

జగన్ కు బిగ్ షాక్.. పట్టాభి రిలీజ్.. ఏపీకి కేంద్రం లెటర్.. రేవంత్ సూపర్ షో.. టాప్ న్యూస్@7PM 

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతి కేసుకూ.. ప్రతి దాడికీ.. బదులు చెప్తామని హెచ్చరించారు. టీడీపీ నేత గురజాల సందీప్ మహదేవ్ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు.రాజ్యాంగ హక్కుల్ని కూడా హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -------- రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల అయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. కింది కోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. -------- ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఎంపీ ల్యాడ్స్‌ నిధులపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరింది. ఎంపీ ల్యాడ్స్‌ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు ఖర్చు చేశారని, చాలా చోట్ల ఇదే తరహాలో నిధులు వినియోగించారని కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం వివరణ కోరుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది.  -------- గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తన భాషతో ఆయన కృష్ణా జిల్లాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అన్నారు. టీడీపీ గుర్తుపై గెలిచిన వంశీ... ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ లనే తిడుతున్నారని విమర్శించారు. వంశీ భాషను వింటే ఆయన భార్య, పిల్లలు కూడా సిగ్గుపడతారని అన్నారు. ------- ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై జయప్రకాష్‌ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగాలు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అనాగరిక భాషను వాడటం, హింసకు దిగడం దురదృష్టకరమన్నారు. ప్రతివారూ ఇతరుల్లో తప్పుల్ని చూస్తున్నారని, రాజకీయాల్లో ఈ వేడి తగ్గాలని.. ప్రశాంతత కావాలని చెప్పారు. ప్రభుత్వానికి, సీఎంకు, ప్రతిపక్షనేతకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు ----------- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్నాలు చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా పోల్చారని మండిపడ్డారు. రైతులని చంపిన వారిపై ఇంత వరకు కేసు నమోదు చేయలేదని తప్పుబట్టారు. ‘‘కిషన్ రెడ్డి, సంజయ్ మీకెందుకు ఓటెయ్యాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు ఓటు వెయ్యాలా. ధాన్యం కొనుగోళ్లు చెయ్యమని చెప్పినందుకు ఓటెయ్యాలా అని లేఖలో ప్రశ్నించారు.  ------- రిసార్ట్ లో ఈటల, రేవంత్ రహస్యంగా మంతనాలు చేశారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటలను తాను బహిరంగంగానే కలిశానని వెల్లడించారు. వేం నరేందర్ రెడ్డి కుమారుడి పెళ్లిపత్రిక అందజేత సందర్భంగా నేతలందరం కలిశామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేతప్ప ఈటలను తానేమీ చీకట్లో కలవలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుట్రలను ఈటల వివరించారని రేవంత్ తెలిపారు. ------- ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నారని భట్టి విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజాసమస్యలు ఉండగా, టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై బురద చల్లేందుకు ప్రయత్నించడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు.  ------- కశ్మీర్ యువత ఇవాళ అభివృద్ధిని కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. మూడు రోజల పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లో శనివారం జరిగిన జే&కే యూత్ క్లబ్ సభ్యుల సమావేశాన్ని ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడుతూ, 2019 ఆగస్టు 5వ తేదీని స్వర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుందని అన్నారు. టెర్రరిజం, ఆశ్రితపక్షపాతం, అవినీతికి ఆరోజు చరమగీతం పాడామని అన్నారు. ------- ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ సూపర్-12 ప్రస్థానాన్ని గెలుపుతో ఆరంభించింది. అబుదాబిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కంగారూలు 5 వికెట్ల తేడాతో నెగ్గారు. సఫారీలు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించారు. రెండు పరుగులు చేస్తే గెలుస్తారన్న దశలో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది. 

వ‌ద‌ల జ‌గ‌న్ నిన్నొద‌ల‌.. సుప్రీంకోర్టులో ర‌ఘురామ పిటిషన్

వ‌ద‌ల జ‌గ‌న్ నిన్నొద‌ల‌. ఆరు నూరైనా నిన్నొద‌ల‌. సీఎం జ‌గ‌న్‌ను తిరిగి జైలుకు పంపే వ‌ర‌కూ వ‌ద‌ల బొమ్మాళిలా వెంట‌బ‌డతానంటున్నారు ఎంపీ ర‌ఘురామ‌. ఈ కోర్టు కాక‌పోతే ఆ కోర్టు.. ఈ పిటిష‌న్ కాక‌పోతే మ‌రో పిటిష‌న్‌.. ఏది ఏమైనా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయించ‌డ‌మే ర‌ఘురామ టార్గెట్‌లా కనిపిస్తోంది. తాజాగా, జ‌గ‌న్ కేసులో ర‌ఘురామ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం వైసీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.  జగన్ అక్రమాస్తుల కేసులను వేగంగా విచారించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్  దాఖ‌లు చేశారు. అందుకు త‌గ్గ‌ట్టు లా పాయింట్ బ‌య‌ట‌కు తీశారు. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమిన‌ల్‌ కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిందని పిటిషన్‌లో తెలిపారు. సుప్రీంకోర్టు పాత తీర్పునే ఆధారంగా చూపిస్తూ.. అదే సుప్రీంకోర్టులో ర‌ఘురామ కేసు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  ఇప్పటికే రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని.. వారి బెయిల్‌ రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టులో ఉండగా.. ర‌ఘురామ‌ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం వ్యూహాత్మ‌క అడుగు అంటున్నారు. అయితే, ఆ వివ‌రాలు చెబుతూ.. మా జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు రావాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశానంటూ ర‌ఘురామ సెటైర్ వేయ‌డం మ‌రింత హైలైట్‌.   

లేటైనా లేటెస్ట్ గా.. హుజురాబాద్ లో రేవంత్ షో అదుర్స్  

తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఈటల రాజేందర్ తో కాంగ్రెస్ కుమ్మక్కైందంటూ అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు దిమ్మతిరిగే కౌంటరిచ్చేలా ఆయన హుజురాబాద్ లో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ తో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, ఈటల రాజేందర్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.   ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని ఆరోపించారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు.  ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ కు.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని హెచ్చరించారు. మోదీ, కేసీఆర్‌ కలిసి పెట్రో ధరలతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లు జోడు గుర్రాల్లా ఈటల-హరీష్‌రావు తిరిగారని విమర్శించారు. ఇప్పుడు తనకు, ఈటలకు పడటంలేదని హరీష్‌రావు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ ఆరోపించారు. ఈటల దేని కోసం కొట్లాడారని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారో చెప్పాలంటూ హరీశ్ రావును నిలదీశారు. ఈటల అవినీతిపై విచారణ ఏమైందో కేటీఆర్ చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆదివారం కూడా హుజురాబాద్ లో ప్రచారం చేయనున్నారు.   

గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండరు.. ఓట‌మి భ‌యంలో కేటీఆర్‌..

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసిపోయాయి. రేవంత్‌రెడ్డి, ఈట‌ల ఓ హోట‌ల్‌లో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. ఎన్నిక‌ల త‌ర్వాత ఈట‌ల కాంగ్రెస్‌లో చేరిపోతారు. క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ ఎన్నిక‌ల మాదిరి హుజురాబాద్‌లోనూ కాంగ్రెస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ కుట్ర చేశారు. ఆ రెండు పార్టీలు క‌లిసి టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కుమ్మ‌క్క‌య్యాయంటూ అధికార పార్టీ, మంత్రి కేటీఆర్ ప‌దే పదే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఒక‌టేన‌నే ఆరోప‌ణ‌పై తాజాగా సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి విక్ర‌మార్క ఖండించారు. ఓడిపోతామ‌నే భ‌యంతోనే మంత్రి కేటీఆర్ ఇలాంటి అబాంఢాలు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే... బీజేపీ మతతత్వ పార్టీ.. కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ. రెండూ భిన్న ధృవాలు. కేటీఆర్‌కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలో ఓటమి భయంతోనే కేటీఆర్‌ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈటలను గెలిపించడం కోసం కాంగ్రెస్‌ ఎందుకు పనిచేస్తుంది? అంటూ ప్ర‌శ్నించారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితమ‌ని భ‌ట్టి క్లారిటీ ఇచ్చారు.  ఇక‌, అధికార పార్టీనీ కార్న‌ర్ చేశారు భ‌ట్టి. టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య లోపాయకారీ ఒప్పందాలు ఉన్నాయన్నారు. ఈటల అవినీతిపై ప్రభుత్వ విచారణ ఎటుపోయింది? కేసీఆర్ ఢిల్లీ మంతనాల సంగ‌తేంటి? టీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే మంతనాలు జరిగాయా, లేదా? అంటూ రివ‌ర్స్ అటాక్ చేశారు.  కాంగ్రెస్‌ నాయకులపై బురద జల్లితే ప్రజలు నమ్మరు. గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండరు... కాంగ్రెస్‌ భావజాలం ఉన్న వారే ఉంటారు. కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం టీఆర్ఎస్‌కు త‌గ‌దు.. అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌కు సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి ధీటుగా జ‌వాబిచ్చారు.   దళితబంధును ఆపడంలో టీఆర్ఎస్‌, బీజేపీ పాత్ర ఉంది. ఇద్దరు దొంగలు కలిసి దళితబంధును ఆపారు. బల్మూర్‌ వెంకట్‌ బలమైన అభ్యర్థి.  కాదని ఎవరన్నా అంటే అది వారి అవగాహనా రాహిత్యం.. అంటూ అధికార పార్టీ, కేటీఆర్ చేస్తున్న అన్నిర‌కాల ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు భ‌ట్టి విక్ర‌మార్క‌. 

ఉత్తర తెలంగాణలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలు

తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అదే అనుమానాలకు కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా వరదలు పోటెత్తుతున్నాయి. తాజాగా భూ ప్రకంపనలు రావడం కలకలం రేపుతోంది.  దక్షిణ భారతదేశంలోనే ఒక గట్టి పీఠభూమిగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువ పరిశోధనల్లో తేలింది. అయితే అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో తెలంగాణలో తరుచూ భూమి కంపిస్తోంది. తాజాగా ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించడంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు.  ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలు రామంగుండంలలో భూప్రకంపనలు సంభవించాయి. రామగుండం పెద్దపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోను స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4 గా నమోదైంది. కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కి.మీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.  మంచిర్యాల జిల్లాలోనూ పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలలోని రాంనగర్ గోసేవ మండల్ కాలనీ నస్పూర్ లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఇళ్లలోంచి పరుగులు తీశారు.భూప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

రూ.2 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌.. ఏపీలో క‌ల‌క‌లం..

డ్ర‌గ్స్‌పై ఏపీలో అల‌జ‌డి రేగుతోంది. డ్ర‌గ్స్‌, గంజాయిపై రాజ‌కీయ ర‌చ్చ న‌డుస్తోంది. వైసీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే మ‌త్తు మాఫియా దందా కొన‌సాగుతోందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి బోసిడీకే అనే ప‌దం వాడ‌టం.. ప్ర‌తీగా టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ మూక‌లు దాడుల‌కు తెగ‌బ‌డటం.. ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదంపై పోరంటూ చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష చేయ‌డం.. ఇలా ఏపీ పాలిటిక్స్ డ్ర‌గ్స్‌, గంజాయి చుట్టూ తిరుగుతున్నాయి. క‌ట్ చేస్తే.. తాజాగా తెలంగాణ‌లో 2 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టంతో మ‌ళ్లీ అంద‌రిచూపు ఏపీ వైపు... మేడ్చల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న మెపిడ్రిన్‌ డ్రగ్‌ను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో 4.92 కిలోల డ్రగ్స్‌, కారును అధికారులు సీజ్‌ చేశారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇద్ద‌రు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. విద్యార్థులకు సరఫరా చేయడానికే ఈ డ్ర‌గ్స్  తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ శాఖ‌ వెల్లడించింది.  అయితే, హైద‌రాబాద్‌లో దొరికిన డ్ర‌గ్స్ ఎక్క‌డి నుంచి తెచ్చార‌నే దిశ‌గా విచార‌ణ జ‌రుగుతోంది. స్థానికంగా త‌యారు చేశారా? గోవా నుంచి తెప్పించారా? లేక‌, అంతా అనుమానిస్తున్న‌ట్టు ఏపీ నుంచే వ‌చ్చిందా? అనే కోణంలో ఎంక్వైరీ న‌డుస్తోంది. ద‌ర్యాప్తులో ఏపీ లింకులు బ‌య‌ట‌ప‌డితే మాత్రం డ్ర‌గ్స్ కేసు మ‌రింత సంచ‌ల‌నంగా మార‌డం ఖాయ‌మంటున్నారు.  ఇక ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ డ్ర‌గ్స్‌, గంజాయి క‌ట్ట‌డికి పోలీస్‌, ఎక్సైజ్ అధికారుల‌తో కీల‌క స‌మీక్ష నిర్వ‌హించారు. డ్ర‌గ్స్‌ దందాపై ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ శాఖ స్పెష‌ల్ టీమ్స్ రంగంలోకి దిగి.. మూడు చోట్ల దాడులు చేసి.. 2 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సీజ్ చేశారు. అయితే, డ్ర‌గ్స్‌పై ఏపీలో అంత ర‌చ్చ జ‌రుగుతున్నా.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఇంత వ‌ర‌కూ డ్ర‌గ్స్‌, గంజాయి క‌ట్ట‌డికి చిన్న మీటింగ్ కూడా పెట్ట‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం.. సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన డ్ర‌గ్స్ స‌మీక్ష‌ను గుర్తు చేస్తూ.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అయినా, వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం డ్ర‌గ్స్‌, గంజాయి దందాపై ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని అంతా మండిప‌డుతున్నారు.   

సీఎం స్టాలిన్ బస్ జర్నీ.. మన ముఖ్యమంత్రులు ఉన్నారే..

ఒకప్పుడు రాజరికం రాజ్యమేలుతున్న కాలంలో రాజులు మారు వేషాల్లో వెళ్లి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే వారని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. రాజరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రులు, మంత్రులు మారు వేషాలు వేసుకుని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం వంటి ‘పిచ్చి’ పనులకు స్వస్తి చెప్పారు. ఇక ఇప్పుడైతే, ముఖ్యమంత్రులు, మంత్రులు,  ఎన్నికల సమయంలో తప్పించి జనంలోకి వెళ్ళడం చాలా వరకు తగ్గించారు.  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన. జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు పేరిట జనంలోకి వెళ్లి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రలలో ముఖ్యమంత్రులు ప్రజలకు కనిపించడమే ఇంచుమించుగా మానేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రగతి భవన్,ఫార్మ్ హౌస్’కు పరిమితం అయితే,ఏపీ సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్’ నుంచి కాలు బయట పెట్టకుండా పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పొరుగు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, స్టైల్ మాత్రం వేరుగా ఉంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వత  ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ తొలి నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.  రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన చెన్నైలోని కన్నాగి ప్రాంతంలో గల ఓ వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునేవారితో మాట్లాడి తిరుగుప్రయాణం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సును చూసి కారు దిగి  బస్సెక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవరు, కండక్టర్‌, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యమంత్రిని చూసిన సంతోషంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. బస్సులో ఆకస్మిక తనిఖీ చేపట్టిన స్టాలిన్‌.. ఆర్టీసీ సౌకర్యాలపై ప్రజలను ఆరా తీశారు. బస్సులు సమయానికి వస్తున్నాయా? మహిళలకు ఉచిత టికెట్లు సరిగ్గానే ఇస్తున్నారా?ఉచిత టికెట్ల వల్ల ప్రయోజనం ఉందా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. బస్సులో కొంతమంది మాస్క్‌లు పెట్టుకోకపోతే వారిని మాస్క్‌లు ధరించాలని సూచించారు.  స్టాలిన్ బస్సు ప్రయాణానికి సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. తమిళనాడులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్టాలిన్‌ ప్రభుత్వం ఆ మధ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏమైనా రాజకీయల్లో పదికాలాల పాటు నిలవాలన్నా, నాయకులను ప్రజలు పదికాలాల పాటు గుర్తుంచుకోవాలన్నా, ఇదిగో ఇలా స్టాలిన్’లా జనంలో కలవాలి, జనంలో తిరగాలి .. అంతేగానీ, ఫార్మ్ హౌసు, ప్యాలెస్ లైఫ్’కే పరిమితం అయితే, జనం ఫీజులు పీకేస్తారని జనం అనుకుంటున్నారు. 

జగన్ రెడ్డికి బిగ్ షాక్.. టీడీపీ నేత పట్టాభికి బెయిల్

తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కు బెయిల్ మంజూరైంది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.  బెయిల్‌ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్‌ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభి బెయిల్ రావడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.