బుర్జ్ ఖలీఫాపై మెరిసిన బతుకమ్మ.. తెలంగాణకే గర్వకారణమన్న కవిత
posted on Oct 24, 2021 9:18AM
తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ. సంస్కృతి, సంప్రాదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే బతుకమ్మ సంబరాలు విజయదశమికి ముందు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ప్రపంచంలో పూలను పూజించే ఏకైకం పండుగగా గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైంది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ బతుకమ్మ కనువిందు చేసింది. శనివారం రాత్రి రెండుసార్లు.. 9.40 గంటలకు ఒకసారి, 10.40 గంటలకు మరోసారి మూడు నిమిషాలపాటు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతోపాటు జైహింద్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలను కూడా ప్రదర్శించారు.
బుర్జ్ ఖలీఫాపై మెరిసిన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది వీక్షించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రవాసులు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదించారు.
తెలంగాణ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ఒక్క తెలంగాణకే కాదని, మొత్తం దేశానికే గర్వకారణమని అన్నారు. బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు