హరీష్ కు అనుచరులు దూరమవుతున్నారా? ఆయనపై కుట్ర జరుగుతోందా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి ఇక మిగిలింది మూడే రోజులు. ఎన్నికల ప్రక్రియ మొదలు కంటే, మూడు నెలల ముందు నుంచే నియోజక వర్గంలో ప్రచారం మొదలైంది. అప్పటి నుంచి అలా వాడిగా వేడిగా ప్రచారం సాగుతూనే ఉంది. ఇలా సుదీర్ఘంగా సాగిన ప్రచారంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వం తరపున వరాల జల్లులు కాదు కుంభవృష్టే కురిసింది. రేషన్ కార్డులు, పించన్లు, రైతు బంధు, దళిత బంధు అదీ ఇదీ అని కాదు,వేలకోట్ల రూపాయల పధకాలు హుజూరాబాద్’ను ముంచెత్తాయి. ముద్దచేశాయి. ఇక ఆరోపణలు, ప్రత్యారోపణలకు కొదవ లేదు. ముఖ్యంగా మాజీ మిత్రులు మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ మధ్యన అయితే, మాటల తూటాలు కాదు మర ఫిరంగులే పేలాయి. ఒక విధంగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక మంత్రి హరీశ్ మాజీ మంత్రి ఈటల మధ్య పోటీ అన్నట్లుగానే ప్రచారం సాగుతోంది.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందు ముఖ్యమత్రి కేసీఆర్ ప్రచార, వ్యూహరచనలో కొంచెం చాలా ఎక్కువగానే ప్రత్యేక శ్రద్ద చూపించారు. సర్వేలు చేయించారు. ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పారు.అయితే ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకనో సైలెంట్ అయిపోయారు. ”అతి సర్వత్ర వర్జియేత్” అన్న సంకేతం అందడం వలన,రివైజడ్ వ్యూహంలో భాగంగా ఆయన అలా మౌనముద్రలోకి వెళ్ళిపోయారా,లేక ఇంకేదైనా కారణం ఉందా ఉన్న విషయాన్ని పక్కన పెడితే, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వత కేసీఆర్ ‘లో హుజూరాబాద్ జోష్ తగ్గింది. అలాగే, తెర వెనక ఏమి చేస్తున్నారో, ఏమి చేయడం లేదో కానీ, తెర మీద మాత్రం కేసీఆర్ కనిపించడం లేదు.అంతగా వినిపించడం లేదు.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో అసలే పాల్గొన లేదు. అంతే కాదు హుజూరాబాద్ అయినా ఇంకొకటి అయినా ఉప ఎన్నిక ఉప ఎన్నికే, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరమే లేదని తేల్చేశారు. ఒక విధంగా నెలల తరబడి, అక్కడే తిష్టవేసి తంటాలు పడుతున్న హరేశ్ రావుని కొంచెం నర్మగర్భంగానే అయినా అవహేళన చేశారు. హుజూరాబాద్’లో గెలిచినా ఓడినా ఫరక్ పడదని, గెలిచేస్తే కిరీటం వచ్చి నెత్తిన వాలుతుందని భ్రమలు వద్దని హరీశ్ రావుకు ఆయన స్థానం ఏమిటో గుర్తు చేశారు.హుజూరాబాద్’లో గెలిచినా ఓడినా, జరిగేదే జరుగుతుందని చెప్పకనే చెప్పారు.అంతే కాదు, పోలింగ్ సమయానికి దేశంలోనే లేకుండా ఈ నెల 27 న ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్నారు. పోలింగ్ అయిపోయిన తర్వత కానీ, ఆయన తిరిగిరారు.
కేటీఆర్ విషయాన్ని పక్కన పెడితే, హుజూరాబాద్’లో విజయం సాధించి, ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో తమ ఉనికినీ, ప్రాధాన్యతను నిలుపుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్న హరీష్ రావు, చివరాఖరుకు ఏమి సాధిస్తారో ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే, అటు పార్టీలో ఇటు ప్రజల్లో చులక అవుతున్నారన్న అభిప్రాయమే పార్టీ వర్గాల్లో ముఖ్యంగా ఆయన అనుచర వర్గంలో వ్యక్తమవుతోంది. నిజానికి ఆయన గతాన్ని, వాస్తవాన్ని మరిచి ఈటలఫై చేస్తున్న విమర్శలు బూమ్రాంగ్ అవుతున్నాయని అంటున్నారు. అంతే కాకుండా, హరేశ్ రావు ఇమేజ్’ని డ్యామేజి చేస్తున్నాయని ఆయన అనుచరులే చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా, ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్’ను మోసం చేశారని, వంచించారని హరీశ్ చేసిన తాజా విమర్శ, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు. హరీష్’ను అంతగా నమ్ముకుని, ఆయన వెంట నడించిన ఈటలనే, అంత మాట అన్న తర్వాత, మాలాంటి వారి విషయంలో ఆయన రిస్క్ తీసుకుంటారని నమ్మడం ఎలా, అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
హరీశ్ రావు పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేయడం వేరు,స్వార్ధంతో ఈటలను టార్గెట్ చేయడం వేరు, ఈటలను టార్గెట్ చేయడం ద్వారా హరీశ్ రావు తమ విశ్వసనీయతను కోల్పోయారని ఆయన అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, హరీశ్ రావు నిజాయతీకి అగ్ని పరీక్షగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక, (ఫలితం ఎలా ఉన్నా) అగ్ని పరీక్షలో మాత్రం హరీశ్రావు ఇప్పటికే ఓడిపోయారని, అనుచరుల విశ్వాసాన్ని కోల్పోయారని అంటున్నారు.