జగన్ కు బిగ్ షాక్.. పట్టాభి రిలీజ్.. ఏపీకి కేంద్రం లెటర్.. రేవంత్ సూపర్ షో.. టాప్ న్యూస్@7PM
posted on Oct 23, 2021 @ 7:45PM
టీడీపీ నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతి కేసుకూ.. ప్రతి దాడికీ.. బదులు చెప్తామని హెచ్చరించారు. టీడీపీ నేత గురజాల సందీప్ మహదేవ్ అరెస్ట్ దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు.రాజ్యాంగ హక్కుల్ని కూడా హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
--------
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల అయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. కింది కోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
--------
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఎంపీ ల్యాడ్స్ నిధులపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరింది. ఎంపీ ల్యాడ్స్ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేశారని, చాలా చోట్ల ఇదే తరహాలో నిధులు వినియోగించారని కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం వివరణ కోరుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది.
--------
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తన భాషతో ఆయన కృష్ణా జిల్లాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అన్నారు. టీడీపీ గుర్తుపై గెలిచిన వంశీ... ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ లనే తిడుతున్నారని విమర్శించారు. వంశీ భాషను వింటే ఆయన భార్య, పిల్లలు కూడా సిగ్గుపడతారని అన్నారు.
-------
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగాలు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అనాగరిక భాషను వాడటం, హింసకు దిగడం దురదృష్టకరమన్నారు. ప్రతివారూ ఇతరుల్లో తప్పుల్ని చూస్తున్నారని, రాజకీయాల్లో ఈ వేడి తగ్గాలని.. ప్రశాంతత కావాలని చెప్పారు. ప్రభుత్వానికి, సీఎంకు, ప్రతిపక్షనేతకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు
-----------
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్నాలు చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా పోల్చారని మండిపడ్డారు. రైతులని చంపిన వారిపై ఇంత వరకు కేసు నమోదు చేయలేదని తప్పుబట్టారు. ‘‘కిషన్ రెడ్డి, సంజయ్ మీకెందుకు ఓటెయ్యాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు ఓటు వెయ్యాలా. ధాన్యం కొనుగోళ్లు చెయ్యమని చెప్పినందుకు ఓటెయ్యాలా అని లేఖలో ప్రశ్నించారు.
-------
రిసార్ట్ లో ఈటల, రేవంత్ రహస్యంగా మంతనాలు చేశారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటలను తాను బహిరంగంగానే కలిశానని వెల్లడించారు. వేం నరేందర్ రెడ్డి కుమారుడి పెళ్లిపత్రిక అందజేత సందర్భంగా నేతలందరం కలిశామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేతప్ప ఈటలను తానేమీ చీకట్లో కలవలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుట్రలను ఈటల వివరించారని రేవంత్ తెలిపారు.
-------
ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నారని భట్టి విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజాసమస్యలు ఉండగా, టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై బురద చల్లేందుకు ప్రయత్నించడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు.
-------
కశ్మీర్ యువత ఇవాళ అభివృద్ధిని కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. మూడు రోజల పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లో శనివారం జరిగిన జే&కే యూత్ క్లబ్ సభ్యుల సమావేశాన్ని ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడుతూ, 2019 ఆగస్టు 5వ తేదీని స్వర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుందని అన్నారు. టెర్రరిజం, ఆశ్రితపక్షపాతం, అవినీతికి ఆరోజు చరమగీతం పాడామని అన్నారు.
-------
ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ సూపర్-12 ప్రస్థానాన్ని గెలుపుతో ఆరంభించింది. అబుదాబిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కంగారూలు 5 వికెట్ల తేడాతో నెగ్గారు. సఫారీలు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించారు. రెండు పరుగులు చేస్తే గెలుస్తారన్న దశలో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది.