రాజస్థాన్, యూపీలోకీ చొచ్చుకొచ్చిన ఖలిస్తాన్.. కొత్త మ్యాప్ కలకలం
posted on Oct 23, 2021 @ 8:24PM
ఇస్లామిక్ టెర్రరిజం మరో కొత్త టర్న్ తీసుకుంటోంది. భారత్ లో చిచ్చు పెట్టడానికి దొరికిన అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటోంది. సిక్కులను శాశ్వతంగా భారత్ నుంచి దూరం చేసే కుట్రను తీవ్రతరం చేసింది. ఖలిస్తాన్ పేరుతో సరికొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఈ నెల 31న లండన్ లోని క్వీన్ ఎలిజబెత్ సెంటర్ లో జరిగే రెఫరెండంకు ప్రిపరేషన్లో భాగంగా విడుదల చేసిన తాజా మ్యాపును ప్రపంచమంతా ఖండిస్తోంది. సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలంటున్న డిమాండ్ కు సిక్కుల నుంచే మద్దతు లేకపోవడం గమనించాల్సిన అంశం. ఈ నెలాఖరున లండన్లో జరిగే రెఫరెండం ద్వారా యావత్ సిక్కుజాతిని ఖలిస్తాన్ వైపు కదిలించాలని కొందరు వేర్పాటువాదులు, ఉగ్రమూకలు కలిసి పన్నాగం పన్నుతున్నాయి. ఖలిస్తాన్ డిమాండ్ ఇప్పటిదే కాకపోయినా.. కాలం చెల్లిన, ప్రజల మద్దతు దొరకని ఆ డిమాండ్ కు మాత్రం సోషల్ మీడియా కారణంగా ప్రచారమైతే పెరుగుతోంది.
ఈ క్రమంలో ఈ నెలాఖరున లండన్లో సిక్కులతో ఓ రెఫరెండం నిర్వహించాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జె) నిర్ణయించింది. తాజాగా విడుదల చేసిన మ్యాపులో భారత్ లోని పూర్తి పంజాబ్ తో పాటు యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను కూడా చేర్చారు. దీనిపై భారత్ నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ డయాస్పోరా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అసలు సిక్కుల తొలి గురువు నానక్ దేవ్ జన్మస్థలమైన కర్తార్ పూర్, నన్కానా సాహిబ్ (పాకిస్తాన్లో ఉన్నాయి) గ్రామాలు తాజా మ్యాపులో లేకపోవడంతో ఈ దుశ్చర్య ఎవరిదో ప్రపంచానికి మరోసారి తేటతెల్లమవుతోంది. సిక్కుల కోసం సొంత దేశం కావాలంటున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్లోని నానక్ జన్మస్థలాన్ని విస్మరించడం గమనించాల్సిన అంశం. దీనివెనుక పాక్ ఉగ్రవాద శిక్షణా సంస్థ అయిన ఐ.ఎస్.ఐ హస్తం ఉందని తాజా దృష్టాంతంతో తేలిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ లో రెఫరెండాన్ని ప్రస్తావిస్తూ ఎస్.ఎఫ్.జె తాజా మ్యాపును పోస్టు చేసిన కాసేపటికే నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. మ్యాపులో రాజస్థాన్ లోని జోధ్ పూర్, గంగానగర్ వంటి జిల్లాలను కూడా చేర్చడంపై రాజస్థాన్ పౌరులు పాక్ కుట్రపై మండిపడుతున్నారు. పాక్ లో ఉన్న కర్తార్ పూర్ ను అడిగే దమ్ములేని ఆటబొమ్మలు ఖలిస్తానీ వాదులంటూ పంజాబ్ లోని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
భారత్ లో చిచ్చు పెట్టేందుకు ఉగ్రవాదులను చాపకింద నీరులా పంపిస్తున్న పాకిస్తాన్... సిక్కులను నయానా, భయానా లొంగదీసుకుంటోంది. పాక్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులను మతమార్పిళ్లకు గురిచేస్తూ, వారి ఆస్తులను కబ్జా చేస్తూ దేశం నుంచి పారిపోయేలా చేస్తున్నారు. అయితే ఖలిస్తాన్ అనే సెంటిమెంట్ ను ఆసరా చేసుకొని సిక్కుల ప్రత్యేక ప్రాంతానికి కుట్రపూరితంగా మద్దతిస్తూ, వారి వేర్పాటువాదానికి అవసరమైన వనరులు సమకూరుస్తూ లండన్లో ఉగ్రవాద సంస్థలతో కలిసి ఈ రెఫరెండం నిర్వహిస్తోంది.
ఇటీవల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేసుకోవడం విశేషం. పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఎంపికైన నవజోత్ సింగ్ సిద్ధూను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా కెప్టెన్ అభివర్ణించారు. సిద్ధూ మీద ఇతర ఆరోపణలేవీ చేయని కెప్టెన్... ఆయన వైఖరిని మాత్రమే ప్రస్తావించారు. దేశానికి సరిహద్దులో ఉన్న పంజాబ్ నిర్ణయాలు సిద్దూలాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళితే దేశానికి పూడ్చుకోలేని నష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానంతో ఎగిరి గంతేసిన సిద్దూ పాక్ లో పర్యటించారు. అయితే ఇటీవల సిక్కులను టార్గెట్ చేస్తూ మత మార్పిళ్లు, లవ్ జిహాద్ లు, ఆస్తుల లూటీలు జరుగుతున్నా సిద్దూ ఏనాడూ నోరు మెదపలేదు. బహుశా ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే కెప్టెన్ అమరీందర్ సిద్ధూ గురించి తీవ్రమైన అనుమానం వ్యక్తం చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1984లో ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసేందుకే ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. అందుకు కాంగ్రెస్ భారీ మూల్యం కూడా చెల్లించింది. మరి ఖలిస్తాన్ మద్దతుదారులు ఇప్పుడు ఏకంగా భారత్ లోని అనేక రాష్ట్రాలను మ్యాపులో చేర్చి విడుదల చేస్తే కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలంటున్నారు నెటిజన్లు.