కాకుల దాడులకు చెక్ పెట్టడానికి గద్దను పెంచుతున్నాడు!
posted on Jun 25, 2022 @ 12:31PM
పిల్లల జోలికి వెళితే కుక్కలే కాదు, పక్షులూ దాడిచేస్తాయి. కానీ కాలిఫోర్నియా లాస్ ఏంజెలస్ కౌంటీ పార్కులోకి ఎవరు వెళ్లినా అక్కడి రెండు కాకులు అమాంతం మనుషులపై దాడి చేసి చీకాకు పరుస్తున్నాయి. దీంతో అక్కడి బీచ్‌కి దగ్గరలోని నోబెల్ పార్క్ అనే హోటల్ యజమాని చాలా నష్టపోతున్నాడట!
సాయంత్రాలు సరదాగా గడపడానికి బీచ్‌కి వెళ్లడం వైజాగ్‌లో లా ప్రపంచంలో ఎక్కడయినా సముద్ర తీరం వున్న పట్టణాల వారికి అలవాటు. కొంతసేపు ఆట పాటలతో గడిపి రావాలని అనుకుంటారు. సహజంగా అక్కడ కుక్క పిల్లలు ఏదో ఒక కాయ కోసమో, పండు కోసమో వెంట బడటం మామూలే. కానీ ఏకంగా కాకుల దాడి మాత్రం వింతే! కాకులకు జనాల్ని గుర్తు పెట్టుకునే శక్తి వుంటుందిట. ఎవరయినా ఏదన్నా తింటూ, కుక్కల్ని పట్టుకుని అలా షికారుగా వెళుతుంటే కాలిఫోర్నియాలో మాత్రం అమాంతం చెట్ల మీంచి విమాన వేగంతో వచ్చి రెక్కలతోనో, ముక్కుతోనో ఒక్కటి కొట్టి అంతే వేగంతో పోతున్నాయి.
ఈ కాకుల దాడి కూడా మే, జూన్ మాసాల్లోనే ఎక్కువగా వుంటుంది. కారణం ఆ మాసాల్లో అవి గుడ్లు పెడతాయి. ఆ సమయంలో అవి మరింత జాగ్రత్తగా వుండాలన్న ధోరణితో ఎక్కువ దాడులు చేస్తున్నా యిట. కానీ మరీ ఆస్పత్రికి వెళ్లాల్సినంత గాయాలు కావడం లేదని బీచ్ పోలీసులు అంటున్నారు. ఏమయినా దాడి దాడే, కుక్కయినా, కాకయినా!
వాటి ధాటికి భయపడి చాలామంది ఆ బీచ్‌వేపు వెళ్లడం లేదట. అలా పర్యాటకుల శాతం తగ్గిపోయిందని అక్కడి హోటల్ యజమాని తెగ బాధపడుతున్నాడు. ఎందుకంటే నలుగురూ వస్తేనేగా తన దగ్గర సమోసాలో, మిర్చిబజ్జీలో అమ్ముడయ్యేది! ఇలా అందర్నీ దూరం చేసుకోవడం ఇష్టంలేక ఆయన ఒక చిత్రమైన ఆలోచన చేసేడు. అదేమంటే కాకుల్ని అక్కడి నుంచి పారిపోయేలా చేయడానికి ఆయన తన డబ్బులతో ఒక డేగను పెంచుతున్నాడట. నాలుగు డబ్బులు వచ్చే ఆలోచన చేయమంటే వచ్చేదానిలో రెండు రూపాయలు పోయేలా చేసుకుంటున్నాడు. కానీ తప్పడం లేదు మరి!