ఆత్మకూరు బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
posted on Jun 25, 2022 @ 11:42AM
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు జరిగాయి. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధర్ బాబు సూచించారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూక్ష్మ పరిశీలకులు, సుపర్ వైజర్లు, అసిస్టెంట్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో చక్రధర్ బాబు మాట్లాడారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో బ్యాలెట్ ఓట్లు, వీవీ పాట్స్, ఈవీఎంల లెక్కింపుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకొని బాధ్యతగా,పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని కౌంటింగ్ సిబ్బందికి సూచించారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలౌతుందని, ఉదయం 6 గంటలకే కౌంటింగ్ సుపర్ వైజర్లు, అసిస్టెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో ఏదైనా సమస్య వస్తే.. వెంటనే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల సంఖ్య సరిపోవాలని, ఓటర్లకు సంబంధించి 17ఏ ను 17సీతో లెక్కింపు సిబ్బంది తప్పని సరిగా సరిచూసుకోవాలని ఆదేశించారు.