బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు

సుప్రీం కోర్టులో రేవంత్ సర్కార్ కు చుక్కెదురైంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల  వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.  జీవో నంబర్.9పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను  జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం (అక్టోబర్ 16) విచారించింది.

 తెలంగాణ సర్కార్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది.  దీంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అశంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బీసీ సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

పాతబస్తీలో రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

  పాత బస్తీలో గ‌జం ఖాళీ జాగా లేకుండా ల‌క్ష‌లాది నివాసాలున్న చోట‌.. ఏకంగా 7 ఎక‌రాల‌ను ఓ ప్ర‌బుద్ధుడు క‌బ్జా చేస్తే.. ఆ భూమిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. పోలీసు స్టేష‌న్లో కేసుల‌కు వెర‌వ‌కుండా.. కోర్టు ఫైన్లు కూడా ప‌ట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకుల‌తో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ప్ర‌హ‌రీ నిర్మించి.. ఆక్ర‌మ‌ణ‌లో ఉన్నవారిని హైడ్రా ఖాళీ చేయించింది. రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఇనుప రేకుల ప్ర‌హ‌రీని తొల‌గించి.. అక్క‌డ హైడ్రా ఫెన్సింగ్  ఏర్పాటు చేసింది.   ప్ర‌భుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది.  దీంతో అక్క‌డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న పాత‌బ‌స్తీలో గ‌జం జాగా దొర‌క‌ని ప్రాంతంలో ఏకంగా 7 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా శుక్ర‌వారం కాపాడిన 7 ఎక‌రాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. క‌బ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బ‌మృక్‌నుద్దౌలా మాదిరి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు.  కేసులున్నా వెర‌వ‌ని క‌బ్జాదారులు. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ విలేజ్‌లోని మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్:ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది.  సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్క‌డ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.  కాని ఆ చెరువు ఆన‌వాళ్లు ఎక్క‌డా లేకుండా మ‌ట్టితో క‌బ్జాదారులు క‌ప్పేశారు. ఈ  భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పోరాడుతున్నారు. వీరి పై భవానిపురం పోలీసు స్టేష‌న్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు.  ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఒక ప‌క్క‌న ఈ భూమి త‌మ‌దంటూ చెబుతుండ‌గా.. వారి వ‌ద్ద నుంచి ప‌ట్టాభి రామి రెడ్డి కొన్నానంటూ మ‌రోవైపు క‌బ్జాలో భాగ‌స్వామ్యం అయ్యాడు.  ఈ మేర‌కు కోర్టులో కేసు కూడా వేశాడు.  అయితే ప్ర‌భుత్వ భూమిని ఏ ప్రాతిప‌దిక‌న త‌న‌దిగా చెప్పుకుంటార‌ని.. కోర్టు స‌మ‌యం వృథా చేసినందుకు కోటి రూపాయ‌లు ఫైన్ కూడా వేసింది.  అయినా క‌బ్జాదారులు ఖాళీ చేయ‌కుండా  కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.   స్థానికుల హ‌ర్షం.. మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంట ను క‌బ్జా దారుల చెర‌ నుంచి విముక్తి క‌ల్పించిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.  హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే.. స్థానికంగా విచారించి.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు ఆనందం వ్య‌క్తం చేశారు.  రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. వీరి వెనుక బ‌డాబాబుబులున్నారంటూ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయ‌కుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అటువైపు ఎవ‌రూ వెళ్ల‌డానికి వీలు లేకుండా చేశారంటూ వాపోయారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఆక్రమణదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. అక్క‌డ నాలాతో పాటు.. చెరువును పున‌రుద్ధ‌రిస్తే పాత‌బ‌స్తీలో చాలా ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని స్థానికులు పేర్కొన్నారు.  

41 మంది మావోయిస్టులు సరెండర్

  మావోయిస్టులుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి  ఎదుట  41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ముగ్గురు రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్ గఢ్ కు చెందిన మావోయిస్టులు సరెండర్ అయినారు. లొంగిపోయిన వారిలో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. సరెండర్ అయిన మావోయిస్టుల నుంచి 24 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాస్‌ సంతోష్‌, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్‌ కమిటీ సభ్యులు, ఇద్దరు సెంట్రల్‌ విజన్‌ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీలో  సీఎం చంద్రబాబు  పర్యటన కొనసాగుతుంది.  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పూర్వోదయం ద్వారా ఏపీని గ్రోత్ ఇంజన్‌గా మర్చేందుకు, రాయలసీమను హర్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు.  అలాగే కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలను తరలించే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. సాస్కీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న యూనిటీ మాల్, గండికోట పర్యాటక ప్రాజెక్టులతో పాటు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10,054 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.  కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో రా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు  

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!

వచ్చే ఏడాది జరగనున్న   ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విజేత జట్టుకు బంపర్ ఆఫర్ తగలనుంది. ఫిఫా ప్రపంచ కప్  టోర్నీ ఛాంపియన్‌కు రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.  2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా రూ.379కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా 48.9శాతం పెంచింది.  అంటే 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ దక్కనుంది. విజేత జట్టుకు రికార్డు స్థాయిలో రూ.451 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. 2022 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫాభారీగా పెంచింది. 2022 కప్‌ టోర్నీ  మొత్తం ప్రైజ్‌మనీ రూ.3971 కోట్లు కాగా.. ఇప్పుడు దానిని భారీగా రూ.5911 కోట్లకు పెంచారు. గ్రూప్ దశలో 48 జట్లు పోటీపడనున్నాయి. జట్టుకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఈ టోర్నీ సన్నద్ధత కోసం ప్రతి జట్టుకు రూ.13.53కోట్లు లభిస్తాయి. రౌండ్ ఆఫ్ 32 దశకు చేరే జట్లకు రూ.99.27 కోట్ల చొప్పున.. ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించే టీమ్‌లకు రూ.135 కోట్ల చొప్పున లభిస్తాయి. క్వార్టర్స్ చేరే జట్లకు రూ.171 కోట్ల చొప్పున దక్కుతాయి. నాలుగో స్థానంలో నిలిచే జట్టు రూ.243 కోట్లు, మూడో స్థానాన్ని సాధించే టీమ్ రూ.261 కోట్లు సంపాదిస్తాయి.  రన్నరప్‌కు రూ.297 కోట్లు లభిస్తాయి. ప్రపంచ కప్ విజేతతో పోలిస్తే క్లబ్ ప్రపంచ కప్‌లో గెలిచే జట్టుకే ఎక్కువ నగదు బహుమతి దక్కనుంది. 2025 క్లబ్ ప్రపంచ కప్ నెగ్గిన చెల్సీకి రూ.1128 కోట్లు లభించాయి. జాతీయ జట్లతో పోలిస్తే క్లబ్ జట్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చులు అవుతుండటంతో ఫిఫా అందుకు తగ్గట్టే ప్రైజ్‌మనీ అందిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. రిపేర్లు మొదలుపెట్టిన పాక్

జమ్మూ కశ్మీర్‌  పహల్గామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన  ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా పాక్, పీఓకేలోక చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆ సందర్భంగా భారత్ దాడుల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక భవనం ధ్వంసమైందనీ,  ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. పాక్ డ్రోన్ కార్యకలాపాలకు కేంద్రమైన ఈ భవనంపై జరిగిన దాడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ లో దెబ్బతిన్న ఇతర ఎయిర్‌బేస్‌లలోనూ మరమ్మతులు జరుగుతున్నా యి.    26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై భారత వైమానిక దళం బాంబులు వర్షం కురిపించింది. పాకిస్థాన్‌కు చెందిన మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై కూడా దాడిచేసింది. ఆ దాడిలో ధ్వంసమైన భవనానికి పాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టినట్టు తాజాగా హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు బయటపెట్టాయి. భారత్ దాడిలో భవనం పైకప్పు కూలిపోయి, నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. డిసెంబర్ 16 నాటి వంటోర్  ఫోటోలు పాకిస్థాన్ డ్రోన్‌లను ఆపరేట్ చేసే ఒక పెద్ద కాంప్లెక్స్ పక్కనే ఉన్న భవనాన్ని ఎర్రటి టార్పాలిన్‌తో కప్పి ఉంచడాన్ని చూపిస్తున్నాయి. ఈ టార్పాలిన్‌ను రిపేర్లు లేదా జరిగిన నష్టాన్ని శాటిలైట్ నిఘా కంటబడకుండా ఉండేందుకు సైన్యాలు సాధారణంగా ఉపయోగిస్తాయి. జూన్ నెలలో తీసిన ఫోటోల్లో భవనంపై చిన్న ఆకుపచ్చ టార్పాలిన్ కనిపించింది. ఇప్పుడు మొత్తం భవనం పెద్ద టార్పాలిన్ కింద మరమ్మతు లేదా పునర్నిర్మాణంలో ఉంది. దీనిపై దాడికి రూఫ్-పెనెట్రేటింగ్ వార్‌హెడ్‌లు కలిగిన క్షిపణులను ఉపయోగించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణులు భవనం పైకప్పును చీల్చుకుని లోపల పేలి, ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పంజాబ్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న మురిద్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ వైమానిక దళానికి  ముఖ్యమైన స్థావరం. ఇక్కడ నుంచే షాహ్‌పర్ సిరీస్, బుర్రాక్, బేరక్టార్ టిబి2/ అకిన్సీ, వింగ్ లూంగ్ II వంటి డ్రోన్‌లను  ఆపరేట్ చేస్తారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కషిఫ్ అబ్దుల్లా కాల్పుల విరమణ కోసం భారత్ డీజీఎంఓకి కాల్ చేయడానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ముందు 26కు పైగా ప్రదేశాలలో పాక్ డ్రోన్‌ దాడులకు తెగబడటంతో ప్రతిగా భారత వాయు సేన ఈ దాడులు చేసింది. ఈ సమయంలో ఐఏఎఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నోడ్స్, ఎయిర్‌బేస్‌లు, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థపై పాక్ దాడులు చేసింది. ఉధంపూర్, పఠాన్‌కోట్, అదంపుర్, భుజ్‌లలోని ఐఏఎఫ్ స్థావరాలకు, సిబ్బందికి స్వల్ప నష్టం జరిగింది. మే 10న మురిద్‌పై భారత్ రెండో దాడి చేయగా.. అక్కడ భూగర్భ సదుపాయానికి 30 మీటర్ల దూరంలో మూడు మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడినట్టు శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ భూగర్భ స్థావరం ప్రత్యేక పరికరాల నిల్వకు లేదా భారీ బాంబు దాడులను తట్టుకోగలిగేందుకు ఉద్దేశించినదట. దాడులకు గురైన తన ఎయిర్‌బేస్‌లలో పునర్నిర్మాణ పనులు దాయాది దేశం ప్రారంభించింది. సర్దార్‌లోని ముషఫ్ ఎయిర్‌బేస్, దక్షిణ పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్‌లోని దెబ్బతిన్న రన్‌వేలను మరమ్మతు చేసుకుంది. జాకబ్‌బాద్, భోలారి, సుక్కూర్‌లలోని హ్యాంగర్‌లు ధ్వంసమయ్యాయి. జాకబ్‌బాద్‌లో పలుఎ ఫ్-16 ఫైటర్ విమానాలు ధ్వంసమైనట్టు నివేదికలు వచ్చాయి. భోలారిలోని హ్యాంగర్‌పై దాడిలో ఒక ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసమైంది. సుక్కూర్‌లో హ్యాంగర్‌ను నేలమట్టం చేసింది. ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత వైమానిక దళం జరిపిన  దాడులలో ధ్వంసమైన కాంప్లెక్స్ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టింది.

పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాక్!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మరోసారి షాకిచ్చింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భనిరోధక సాధనాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను ఐఎంఎఫ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. పన్ను వసూళ్లలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, కండోమ్‌లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని తొలగించేందుకు ద్రవ్య నిధి ససేమిరా అంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి పొందుతున్న బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భనిరోధక సాధనాలపై పన్ను తగ్గిస్తే రాబడి లక్ష్యాలు దెబ్బతింటాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఒకవేళ రాయితీలు ఇవ్వాలనుకుంటే వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే పన్నుల అమలు యంత్రాంగం బలహీన పడుతుందనీ, పైగా ఈ వస్తువుల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. కేవలం కండోమ్‌లే కాకుండా మహిళలకు అవసరమైన శానిటరీ ప్యాడ్‌లు, శిశువుల డైపర్లపై కూడా పన్ను రాయితీలు ఇవ్వడానికి ఐఎంఎఫ్ నో అంది. పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పంపిన ఈ ప్రతిపాదనల వల్ల దాదాపు 400 నుంచి 600 మిలియన్ పాకిస్థాన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసి, ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ప్రస్తుతం అక్కడ ఏటా దాదాపు 60 లక్షల మంది జనాభా అదనంగా చేరుతున్నారు. జనాభా వృద్ధి రేటు 2.55 శాతంగా ఉంది. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వ సేవలు, సామాన్యుల ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలో గర్భనిరోధక సాధనాలను చౌకగా అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఐఎంఎఫ్ నిబంధనల వల్ల విధించిన 18 శాతం జీఎస్‌టీ కారణంగా, ఇవి సామాన్యులకు అందనంత భారంగా మారాయి.   విదేశీ అప్పుల కోసం నిత్యావసరాలను కూడా పాక్ ప్రభుత్వం  లగ్జరీ వస్తువులుగా పరిగణించాల్సి రావ డం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రుణం కోసం ఐఎంఎఫ్ షరతులను నెరవేర్చడానికి పాకిస్థాన్ నానా పాట్లూ పడుతోంది. పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి దాదాపు 3.3 బిలియన్ డాలర్ల నిధులను పాక్ పొందింది. ఈ అప్పుల నుంచి బయటపడలేక.. చివరకు దేశ జనాభా నియంత్రణ అంశాన్ని కూడా ఆర్థిక లెక్కలకే  వదిలేయాల్సిన దుస్థితిలో పాకిస్థాన్ ఉంది. 

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థిని మృతి

గురుకులంలో  ఫుడ్ పాయిజినింగ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మరణించింది. ఈ ఘటనఅస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌లోని   సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్‌కు చెందిన లింగం కుమార్తె 14 ఏళ్ల సాయి లిఖిత ఈ గురుకుల పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 5న కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను  మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు కూడా ఫుడ్ పాయిజినింగ్ అయ్యిందని ధృవీకరించారు. చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు జాండిస్ అటాక్ కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను మరింత మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్‌  నిలోఫర్‌ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ లిఖిత బుధవారం (డిసెంబర్ 17) కన్నుమూసింది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా గురువారం (డిసెంబర్ 18) పాఠశాలను సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్‌ అన్నారు. 

టోల్ గేట్లకు చెల్లు చీటీ!

ఇక టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఉండవు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ గేట్లనూ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే టోల్ వసూళ్లు మాత్రం ఆగవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధానం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   ఇక నుంచి ఏఐ,  శాటిలైట్  ఆధారిత సిస్టమ్ ద్వారా టోల్ వసూళ్లు జరిగేలా చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈ విషయాన్ని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ఈ నూతన టోల్ విధానం  పూర్తిగా ఉపగ్రహ, ఏఐ సాంకేతికతలపై ఆధారపడి ఉంటుందన్నారు. దీని వల్ల వాహనదారులు  టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. దీని వల్ల వాహనదారులకు  ఇంధనం ఆదా అవడమే కాకుండా,  ప్రభుత్వానికి అదనంగా ఆరువేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని గడ్కరీ పేర్కొన్నారు.   ఈ విధానంలో టోల్ గేట్లకు బదులుగా గాంట్రీ గేట్స్ నిర్మిస్తారు.  వీటిపై   హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చడం ద్వారా,  వాహనాలు గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. ఆ వాహనం  నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది.  దీంతో టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయని గడ్కరీ తెలిపారు.

ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ విఫలయత్నం!

ఆస్ట్రేలియా  బీచ్ కాల్పుల నిందితుడు ఆస్ట్రేలియా-భారత్ మధ్య తరచూ రాకపోకలు ఆస్ట్రేలియా సిడ్నీ  బీచ్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో హతమైన ఐసిస్ అనుబంధ ఉగ్రవాది సాజిత్ అక్రమ్  గతంలో ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడని ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి.  ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి సారీ అతడి దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిపాయి.   హైదరాబాద్‌లోని జోచిచాక్ అల్ హసన్ కాలనీలో నివసిస్తున్న సాజిత్ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత 27 ఏళ్లుగా సాజిత్ హైదరాబాద్, ఆస్ట్రేలియా మధ్య  రాకపోకలు సాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రయాణాల వెనుక ఉన్న కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో  బీఏ పూర్తి చేసిన సాజిత్ అక్రమ్, 1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000లో అక్కడే బియాన్ వెనెస్సా గోసాను వివాహం చేసుకున్నాడు. ఆమె అప్పటికే ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ కావడంతో, 2001లో సాజిత్ తన వీసాను పార్ట్‌నర్ వీసాగా మార్చుకున్నాడు. తదనంతరం 2008లో రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందిన సాజిత్, పీఆర్ హోదాను కొనసాగించాడు. పీఆర్ కలిగిన వారికి ఐదేళ్లపాటు ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చి వెళ్లే అవకాశం ఉండటంతో, అతడు ఈ వీసా ద్వారా దేశంలో తన ఉనికిని కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు, పాస్‌పోర్టు, విదేశాల్లో రాయబార కార్యాలయాల రక్షణ పొందాలంటే పౌరసత్వం అవసరం. ఈ నేపథ్యంలో సాజిత్ అక్రమ్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వానికి దరఖాస్తు చేసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. అయితే ప్రతి దరఖాస్తు తిరస్కరణకు గురైందని, తిరస్కరణ కారణాలను సాజిత్ ఎప్పుడూ తమతో పంచుకోలేదని అతడి కుటుంబ సభ్యులు  తెలిపారు. సాజిత్ కుమారుడు నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో జన్మించడం తో అతడికి ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు లభించాయి.  2003లో తొలిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన సాజిత్, కుటుంబీకుల సమక్షంలో సంప్రదాయ నిఖా చేసుకున్నాడు. 2004లో తన కుమారుడిని బంధువులకు చూపించేందుకు మరోసారి నగరానికి తీసుకువచ్చాడు. 2006లో తండ్రి మృతి అనంతరం కుటుంబీకులను కలుసుకుని వెళ్లిన సాజిత్, 2018లో వారసత్వంగా తనకు వచ్చిన శాలిబండ లోని ఇంటిని విక్రయించేం దుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ ఆస్తి విక్రయం తో వచ్చిన డబ్బుతో ఆస్ట్రే లియాలోని బోసరగ్ ప్రాంతం లో ఇల్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది ఫిబ్రవరిలో తన వాటాను కూడా భార్య పేరు కు బదిలీ చేసినట్లు సమా చారం. 2012 ఫిబ్రవరిలో సాజిత్ అక్రమ్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చి కుటుం బీకులను కలుసుకుని వెళ్లాడు. అదే సమయంలో పదేళ్ల కాలపరిమితికి సంబం ధించిన పాస్‌పోర్టు రిన్యూ వల్ కూడా చేయించుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సిడ్నీ కాల్పుల ఘటన నేపథ్యంలో సాజిత్ అక్రమ్ గత జీవితం, అంతర్జాతీయ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, సంబం ధాలపై భారతీయ, ఆస్ట్రే లియా భద్రతా సంస్థలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌  కేసు మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేశారు.  ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి  ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్​ఎదుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్​అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు తెలుస్తోంది