Read more!

ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నారా? అసలు కారణాలివే!

బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించి, ఒక బంధాన్ని వెతుక్కుని, పెళ్లి పిల్లలు అంటూ ఒక కుటుంబాన్ని సృష్టించుకుని మనిషి తన జీవితాన్ని విస్తారం చేసుకుంటాడు. కానీ జీవితం అయితే విస్తారం అవుతుంది. కానీ మనిషి మాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం, మెరుగైన వసతులు ఉన్నా సరే.. జీవితంలో సంతోషాన్ని పొందలేకపోతున్నాడు. దీనికి కారణం వసతుల లేమి కాదు.. సమాజంలో  కలుగుతున్న మార్పులు, వ్యాధులు, ఆందోళన, అనిశ్ఛితి మొదలైనవి  అని వైద్యులు, మనస్తత్త్వ శాస్ర్తవేత్తలు అంటున్నారు. కానీ వీటన్నింటికంటే మనిషి సంతోషంగా లేకపోవడానికి ఆ వ్యక్తి దినచర్య కూడా కారణమవుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

చాలా అలవాట్ల వల్ల ప్రజలు సంతోషంగా ఉండడం కష్టంగా మారింది.  నిద్ర లేకపోవడం  ఈ కారణాలలో  ఒకటి. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం, నిద్ర లేకపోవడం  మానసిక,  భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది, దీని కారణంగా ఒత్తిడి-ఆందోళన పెరుగుతుంది. ఇది ఇలానే ఉంటే వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా సరే సంతోషంగా ఉండలేరు.

మనిషిపై నిద్ర ప్రభావం ఎలా ఉంటుంది..

పరిశోధకుల అధ్యయనాలలో  నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తేలింది. అందుకే ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన యువత  కూడా మునుపటి కంటే ఎక్కువ చిరాకు, కోపం, అసంతృప్తి,  అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇప్పట్లో సమాజంలో నిద్ర రుగ్మతల సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తుంది, ఇది వ్యక్తుల్ని మానసికంగా బలహీనపరుస్తుంది. నిద్రలేమి కారణంగా నిద్రపొయిన సమయంలో కూడా  కలత నిద్ర,  భావోద్వేగ పనితీరుపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. భావోద్వేగాల విషయంలో బలహీనంగా ఉండటం వల్లే  ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నాం.

నేటికాలంలో యువత రాత్రిళ్లు నెట్ బ్రౌజింగ్, బయట పార్టీలు, నైట్ టైమ్ బయటకు వెళ్లడం, అర్థరాత్రుల వరకు చాటింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. వీరు ఏ రెండు లేదా మూడు గంటలకు పడుకుని ఉదయం 8 గంటలకు నిద్ర లేస్తారు. దీని వల్ల నిద్రా చక్రం దెబ్బతింటుంది. అది మానసిక సమస్యలకు, మెదడు మీద ఒత్తిడికి కారణం అవుతుంది. అస్తవ్యస్థమైన పనితీరు, వేళకాని వేళలో ఆహారం తినడం, తీసుకునే ఆహారం అనారోగ్యకమైనది కావడం వంటి కారణాల వల్ల మొత్తం లైప్ స్టైల్ దెబ్బతింటుంది. అందుకే నిద్ర అలవాటు మార్చుకుంటే మొత్తం జీవనశైలి కూడా మెల్లగా ఓ కొలిక్కి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. సంతోషం కోసం ఈ అలవాట్లు తప్పక మార్చుకోవాలి.

                                              *నిశ్శబ్ద.