Read more!

తృప్తికరమైన రోజు ఎలా సాధ్యమో తెలుసా?

సృష్టిలోని ప్రాణుల్లోకెల్లా మానవ జన్మ అత్యంత మహిమన్వితమైనది. మానవ జన్మ అనేది ప్రతి మనిషికీ ఒకే ఒక్క సారి వచ్చే పరమాద్భుత అవకాశం. ఈ విషయం అంద రికీ తెలిసికూడా ఎందుకు తమ జీవితాలను సార్థకత వైపుకు మళ్ళించలేకపోతున్నారు? ప్రపంచంలో ఉన్న 64 కళలను నేర్పడానికి మనకు రకరకాల విద్యాలయాలు, శిక్షణా శిబిరాలూ ఉన్నాయి. కానీ! జీవితమును జీవించడమనే మహాత్భుతమైన కళను నేర్పించడానికి ఎటువంటి శిక్షణాలయాలూ లేవు. ఎందుకంటే జీవితం ఎవరో ఉదాహరణలతో నేర్పించే పాఠం కాదు. నేర్చుకోవడానికి. ఒకమనిషి జీవితంలో ప్రతి ఒక్క రోజూ ఒక సరికొత్త నూతన అధ్యాయమే. ప్రతి ఒక్కరి జీవితమూఓ సరిక్రొత్త పుస్తకమే. ఎవరి జీవితమూ మరొకరి జీవితంలా ఉండబోదు. ప్రతి పుస్తకమూ మరొక పుస్తకంలా ఉండదు. సరిగ్గా, ఈ విషయాన్నే మనం అవగాహన చేసుకోవాలి. మనం ప్రతి రోజునూ, ప్రతి నిముషాన్నీ అరుదైన అనుభవాలనూ, అనుభూతులనూ ఆస్వాదించడానికే వచ్చాం.

మనం జీవించాలే గానీ ప్రతి నిముషం ఓ సరిక్రొత్త అనుభవాన్ని చవిచూడవచ్చు. మీ ఒక్క రోజు జీవితాన్ని ఓ నాటకం లేదా ఒక సినిమా అని భావించుకుంటే, ఈ చ లన చిత్రంలోని ప్రతి సన్నివేశమూ ఎన్నో మలుపులతోనూ, ఎన్నో గెలుపు ఓటములతోనూ నిండి ఉంటుంది. ఒక చలన చిత్రాన్ని జనరంజకంగానూ.

అబ్బురపరిచే కథనంతోనూ తెరకెక్కించడానికి దర్శకుడు ఎంతగానో కృషి చేస్తాడు. ప్రతీ సన్నివేశాన్నీ, కలకలిసిన అనుభవాలతో, ఉత్సాహాలతో, ఉల్లాసాలతో మేళవించి ఓ గొప దృశ్యకావ్యంలా మలుస్తాడు. ఇకపై మీరు మీ జీవితమనే చలన చిత్రానికి దర్శకులు, కథానాయకులుగా ఉండండి. ప్రతి రోజూ మీ చలన చిత్రంలోకి గమ్మతైన దృశ్యాలను తెరకెక్కించండి. ఒక క్షణం కూడా విసుగూ, చిరాకు లేని కథనాన్ని ఆవిష్కరించండి. ప్రతి సన్నివేశాన్నీ అత్యద్భుతంగా తీర్చిదిద్దండి. ప్రతి రోజునూ ఓ అద్భుతమైన చలన చిత్రంలా, ఓ అపురూప దృశ్య కావ్యంలా నిర్మించండి. కానీ! ఈ రోజు మీ చలన చిత్రం ఉన్నట్లు, రేపటి చలన చిత్రం ఉండకూడదు. రోజుకో క్రొత్తకథ, రోజుకో క్రొత్త అనుభూతి, రోజుకో క్రొత్త సంచలనాలతో మీ జీవితాన్ని విలువైన దృశ్య కావ్యాల్లా మార్చుకోండి. ఒక మనిషి రోజులోని 24 గంటల సమయాన్ని సంతృప్తిగా, లాభదాయకంగా జీవించడం నేర్చుకోవడమే జీవించే కళ అంటే. 

మీ ప్రతి రోజునీ మీరు క్రొత్త జన్మలా భావించగలిగితే మీరు ఈ పనిని సులభంగా చేయగలుగుతారు. రోజులో ఉదయం పుట్టినట్టు, రాత్రికి మరణించినట్టు భావించాలి. ఇలా చేస్తే   సరిక్రొత్త  చావుపుట్టుకల మధ్యన ఉన్న విలువైన సమయాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతారు. ఇంతటి గొప్ప కాలాన్ని వ్యర్థంగా ఆవిరి చేసుకోకూడదని గ్రహిస్తారు. మనం ప్రతి నిముషాన్నీ  సంపూర్తిగా జీవించడానికే వచ్చామన్న సృహ కల్గి ఉండాలి. 

పుట్టిన బిడ్డను పొత్తిళ్ళలోకెత్తుకొని తండ్రి ఆ బిడ్డను చూసి ఎంత మధురానుభూతిని పొందుతూ తన్మయత్వం చెందుతాడో, అలాగే మీ కోసం జన్మించిన మరో రోజును చూసి మీరు అలాంటి తథాత్మ్యాన్నే పొందడి. ప్రతి రోజునూ మీ చంటి బిడ్డగా భావించి, జాగ్రత్తగానూ, ప్రేమతోనూ పెంచిపోషించండి. మనకు ప్రతి దినం ఓ క్రొత్త జన్మ. ఈ 24 గంటల జన్మ కాలంలో మనం గ్రహించగల్గినంత సంవృద్ధిని ఈ ప్రకృతి నుండి గ్రహిద్దాం.. అనుభవించగల్గినంతటి క్రొత్త అనుభవాలను అనుభూతి చెందుదాం. లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించి మరింత జీవితపు ఉత్పాదకతను పెంచుకుందాం. ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఓ గొప్ప జీవితాన్ని జీవించామనే మహా తృప్తిని మనం పొందగల్గుదాం.

                                                   ◆నిశ్శబ్ద.