Read more!

ఆందోళనను గుర్తించాల్సిన సమయమిదే!

మనిషికి శారీరక రుగ్మతలు ఎన్ని ఉన్నా.. వాటిని ఔషధాలతో తగ్గించుకోవచ్చు. కానీ శరీరానికి నొప్పి లేకుండా మనిషిని వేధించే సమస్యలు మానసిక సమస్యలు. మానసిక సమస్యలలో ఆందోళన ఒకటి. ప్రతి నిమిషం మనిషిని భయానికి, సంఘర్షణకు లోను చేసి జీవితంలో అల్లకల్లోలం పుట్టించే ఈ ఆందోళన మనిషి పాలిట పెద్ద శాపమే అని చెప్పవచ్చు. కానీ దురదృష్ట వశాత్తు తాము అనుభవిస్తున్నది మానసిక సమస్య అని, దాని పేరు ఆందోళన అని చాలామందికి తెలియదు. తెలుసుకోకుండానే ఎంతోమంది జీవితంలో నలిగిపోతూ కాలాన్ని వెళ్లబుచ్చుతుంటారు. 

చాలామంది మానసిక సమస్య అంటే పిచ్చి అనే ఒకానొక భావనతో ఉంటారు. అందుకే తమకు మానసిక సమస్య ఉందని బయటకు చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ ఈ సమస్యను గుర్తించడం చాలా అవసరం, దీనికి సరైన పరిష్కారాలు వెతకడం, దీని ప్రభావాన్ని తగ్గించడం, నిర్మూలించడానికి ప్రయత్నాలు చేయడం ఎంతో అవసరం. 

చరిత్రలోకి చూస్తే.. 19వ శతాబ్దం చివరలో ఆందోళన అనేది ఒక ప్రత్యేక అనారోగ్యంగా వర్గీకరించబడలేదు. కానీ ప్రజలు మాత్రం దీన్ని వేర్వేరు పేర్లతో పిలిచారు. మానసిక రుగ్మతల గురించి సగటు మనిషికి అవగాహన లేని కాలంలో దీని దీని ప్రభావం ఇప్పుడున్న ప్రభావవంతంగా లేదు. 

18వ శతాబ్దంలో, బోయిసియర్ డి సావేజెస్ పానిక్ అటాక్స్, సాధారణీకరించిన యాంగ్జయిటీ డిజార్డర్‌ని 'పనోఫోబియాస్'గా గుర్తించిన నోసోలజీని ప్రచురించారు. తర్వాత 19వ శతాబ్దంలో, అలసట, తలనొప్పి, చిరాకుతో కూడిన వైద్య పరిస్థితిని లక్షణాలుగా వర్ణించి 'న్యూరాస్తెనియా' అనే పదాన్ని రూపొందించారు. ఈ ఆందోళన లక్షణాలు కొత్త వ్యాధి నిర్మాణాలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. 

ఇక భారతదేశంలో ప్రజలు ఆందోళన అనేది పూర్తిగా మనసుకు సంబంధించిన రుగ్మతగా భావించారు. మనస్సును శాంతపరచడానికి మానసిక స్థితిని సానుకూలంగా మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా అనేక ఆయుర్వేద మూలికలను ఉపయోగించారు. వీటిలో అత్యంత సాధారణమైనవి బ్రాహ్మి, అశ్వగంధ.

వైద్యశాస్త్రంలో పురోగతికి సాధించడానికి ముందు, పురాతన చికిత్సలలో వైద్యం అందించేవారు. వీటిలో  మూలికలు, ఔషధతైలం మధ్యయుగ కాలంలో సాగింది. హైడ్రోపతి విధానంలో చికిత్స అందించడం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇందులో  శరీరాన్ని విపరీతమైన ఉష్ణోగ్రతలకు గురిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా..  అత్యంత చల్లని ప్రవాహాలు, నదులలో స్నానం చేయడం, హెల్త్ స్పాలు, జలగలను ఉపయోగించి రక్తాన్ని తీయడం వంటివి ఉన్నాయి. అయితే మనోవిశ్లేషణలో క్రమంగా  ఫ్రాయిడ్ పరిశోధనల ఆధారంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు. 

అన్నిటిలోకీ.. ఈమధ్య కాలంలోనే మానసిక సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిమీద దృష్టి పెట్టడం, వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేయడం సగటు వ్యక్తులలో కూడా కనబడుతోంది.  మానసిక సమస్యలు కూడా ఈమధ్య కాలంలో చాలా దారుణంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా కాలం మనుషుల్లో ఆందోళనను పెంచిందని చెప్పాలి. మానసిక సమస్యలున్నవారితో సామరస్యంగా మాట్లాడటం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా ఇప్పించడం, వారి ఆందోళనను పోగొట్టడానికి చేయూత ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఆందోళన అనే సమస్య దూదిపింజలా ఎగిరిపోతుంది.

                                      ◆నిశ్శబ్ద.