సాంబార్ ఇడ్లీ సూత్రంతో సమస్యల పరిష్కారం
posted on Aug 10, 2021 @ 9:30AM
కొన్ని సందర్భాల్లో ఒకే సమస్య పదే పదే ఎదురవుతుంది. యాంత్రికమైన జీవితంలో ఆ సమస్యను విశ్లేషించుకొని సరిదిద్దుకునే ఓపిక ఎవరికీ లేదు. అసలు అంత దూరం ఆలోచించే విచక్షణ ఎంతమందికి ఉంటుంది. ముఖ్యంగా యువకులు కొన్ని ఒత్తిడులకు లోనవుతుంటారు. సమస్య పరిస్కారానికి కొన్ని అంశాలను చెప్తాను.
1 మూలం
2 సమస్య పునరావృత్తం
3 నివారణ
ఏదైనా సమస్యను విశ్లేషించుకున్నప్పుడు పై మూడింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని చమత్కారంగా సాంబార్ ఇడ్లి అనే సూత్రంతో వివరించడానికి ప్రయత్నిస్తాను.
◆సాంబార్ ఇడ్లి సూత్రం
మనం ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ సర్వర్ తో మనకి పదే పదే గొడవ అవుతుంది. కారణం ఏంటంటే మనం ఆర్డర్ చేసిన సాంబార్ ఇడ్లి లో సాంబార్ చల్లగా ఉండటంతో ఆ సర్వర్ పై కొపగించుకుంటాము. హోటల్ లో కస్టమర్లు నిండుగా ఉంటారు. అతని పనిలో అతను ఉంటాడు. తిరిగి సర్వర్ ని పిలిచి సాంబార్ తీసుకు రమ్మని చెప్పినప్పుడు అతను మళ్లీ చల్లగా ఉండే సాంబార్ నే తీసుకొస్తాడు. మొదటిసారి జరిగిన పొరపాటే మళ్లీ జరుగుతుంది. తిరిగి ఆ సర్వర్ పై కేకలు వేస్తాము. సఖ్యత చెడి ప్రశాంతంగా తిని వెల్దాము అని వచ్చినవాడివి అనవసర ఆవేశానికి లోనై ప్రశాంత కోల్పోతాము. వాస్తవానికి అక్కడ ఉన్న రద్దీకి ఎన్ని సార్లు సాంబార్ తీసుకు రమ్మని చెప్పినాగానీ చల్లగా నే టేబుల్ పైకి వస్తుంది. ఇందులో సర్వర్ పై కోపడ్డం వలన లాభం లేదు. ఉదాహరణకు ఈ సమస్యనే విశ్లేషించుకుంటే సమస్య మూలం ఇక్కడ సాంబార్. దానివలనే ముందుగా మనం అసహనానికి లోనయ్యాము. తిరిగి అదే సాంబార్ వలన కోప్పడ్డాము. అంటే సమస్య పునరావృత్తం అయింది. ఇది గ్రహించి అంతటితో సాంబార్ ని నిలిపేసి నివారణ గురించి ఆలోచిస్తే సమస్య తీవ్ర రూపం కాకుండా ఉంటుంది. ఇక్కడ సమస్యకి మూలం సాంబార్, సమస్య పునరావృత్తం కారణం సాంబార్ అలాంటప్పుడు దాన్ని గ్రహించి దాని ప్లేస్ లో మరో ఆప్షన్ ని చూసుకొని ఆర్డర్ చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది. తేలికగా తమాషాగా అర్ధమయ్యేలా వివరించడానికి ఈ సాంబార్ ఇడ్లి సూత్రం చెప్పాను అంతే!
ముగింపు
చిన్న చిన్న సమస్యలకు ఎక్కువ స్పందించి మానసిక అనారోగ్యం తెచ్చుకుంటారు. అలాంటివారు కాస్త వివేకంతో ఆలోచిస్తే సమస్య నివారణ బోధపడుతుంది. యువత ఈ సాంబార్ ఇడ్లి సూత్రం ఫాలో అయితే చాలు.
◆ వెంకటేష్ పువ్వాడ