జగనూ, ఆరా మస్తానూ.. ముంచేశారు కదయ్యా...
posted on Jun 10, 2024 @ 3:07PM
వైసీసీ బంపర్‌గా గెలుస్తుందని సర్వే రిపోర్టు ఇచ్చిన ఆరా మస్తాన్ అనే సెఫాలజిస్టు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిచి పారిపోతే మంచిది. అలా పారిపోయే ప్రయత్నంలో వుండగా... ఎవరైనా గుర్తుపట్టి, ‘మీరు ఆరా మస్తాన్ గారు కదూ?’ అని ప్రశ్నిస్తే, కాదు.. కాదు.. నాపేరు... దారినపోయే దానయ్య అనో, పొరుగూరు పుల్లయ్య అనో చెప్పి అక్కడి నుంచి జారుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఈ ఆరా మస్తాన్ అనేవాడు ఎక్కడ కనిపిస్తాడా.. బుర్ర రాంకీర్తన పాడించాలా అని ఎదురుచూస్తున్నారు. పొరపాటున ఆరా మస్తాన్ ఎవరికైనా దొరికాడంటే ఏ కీలుకు ఆ కీలు ఊడదీసేలా పరిస్థితి వుంది మరి.
2019 ఎన్నికల సందర్భంలో లగడపాటి రాజ్‌గోపాల్ టీడీపీ గెలుస్తుందని సర్వే రిపోర్టు ఇచ్చారు. ఆయన సర్వేలకు వున్న క్రెడిబిలిటీ గురించి తెలిసినవాళ్ళు అలాగే జరుగుతుందని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేతి దురద ఆగక ‘టీడీపీ గెలుస్తుంది’ అని భారీ సంఖ్యలో బెట్టింగ్ కట్టారు. ఆ తర్వాత టీడీపీ ఓడిపోయింది. బెట్టింగ్ కట్టిన వేలమంది కట్టుబట్టలతో మిగిలారు.
2024లో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కాకపోతే, ఆ పరిస్థితి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎదురైంది. పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీలో వున్న బెట్టింగ్ రాయుళ్ళు తమ పార్టీ మీద బెట్టింగ్ కడదామా... వద్దా.. అనే సందిగ్ధంలో వుండగా, జగన్ సార్ ఐప్యాక్ ఆఫీసుకి వెళ్ళి ‘వైనాట్ 175’ అనేశారు. దాంతో వైసీపీ వర్గాల్లో ఉత్సాహం వచ్చింది. ఇంకా ఏమైనా సపోర్టింగ్ దొరుకుతుందా అని చూస్తున్న సమయంలో ఆరా మస్తాన్ తన అమూల్యమైన సర్వే బయటపెట్టారు. ఈసారి వైసీపీ ఇరగ్గొట్టేస్తుంది అని ఆయన తన సర్వే వెల్లడించారు. అంతే, అప్పటి వరకు వెనుకా ముందు ఆలోచిస్తూ వున్న వైసీపీ వర్గాలు రెచ్చిపోయి వైసీపీ గెలుస్తుందని బెట్టింగులు పెట్టేశారు. జూన్ 4 తర్వాత పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. 2019లో బెట్టింగులకు దిగినవాళ్ళు కట్టు బట్టలతో అయినా మిగిలారు.. ఇప్పుడయితే వేలాదిమంది వైసీపీ నాయకులు కట్టుబట్టలు కూడా లేకుండా మిగిలారు. అలాంటివాళ్ళందరూ ఇప్పుడు జగన్ మీద ఎలాగూ ఆగ్రహం వ్యక్తం చేసే సీన్ లేదు కాబట్టి, ఆరా మస్తాన్ మీద ఆగ్రహంగా వున్నారు. ఆదివారం సాయంత్రం తిరువూరు నియోజకవర్గ వైసీపీ నాయకుల ముఖ్య సమావేశం జరిగింది. తిరువూరులో ఓడిపోయిన నల్లగట్ల స్వామిదాసుతోపాటు సమావేశంలో పాల్గొన్న అందరి నోటి వెంట ఇదే లబోదిబో! మనల్ని ఒకవైపు జగన్ ముంచేస్తే, మరోవైపు ఆరా మస్తాన్ ముంచేశాడు అని! సమావేశం జరిగినంతపూ ఆరా మస్తాన్ నామస్మరణతో ఆ సమావేశం మార్మోగింది. ఇక్కడే కాదు.. ఎక్కడ వైసీపీ నాయకుల సమావేశం జరిగినా, జగన్‌ని గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా, ఆరా మస్తాన్‌ని గుర్తు చేసుకుని, అతన్ని మనసారా తిట్టుకుని శాంతిస్తున్నారు.