పోలవరంపై లోక్ సభలో గళమెత్తిన కేశినేని చిన్ని
posted on Jul 22, 2024 @ 5:05PM
తొలి సారి ఎంపీ అయిన కేశినేని చిన్ని లోక్ సభలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తారు. సోమవారం ఆయన లోక్ సభలో రాష్ట్ర సమస్యలపై అనర్గళంగా మాట్లాడారు. దేశంలో ఆరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.
2019 నాటికి సివిల్ పనులు 71.93% , భూసేకరణ , పునరావాసం 18.66% పూర్తయ్యాయనీ, గత ప్రభుత్వం హయంలో ఐదేళ్లలో జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణం 3.84% సివిల్ పనులు, 3.89% భూ సేకరణ పనులు మాత్రమే జరిగాయని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్ట్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావటానికి చేపట్టనున్న చర్యల గురించి వివరించారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తొలి సారిగా పోటీ చేసిన కేశినేని చిన్ని.. రెండు సార్లు ఎంపీ, వైసీపీ అభ్యర్థి, తన సోదరుడు అయిన కేశినేని నానిపై భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి విదితమే.