పెద్దపల్లిలో  పట్టాలు తప్పిన గూడ్స్ 

తెలంగాణలో  గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది.  పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కూత వేటు దూరంలో​ జరిగింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ గూడ్స్​ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి యూపీలోని గజియాబాద్​కు వెళుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.కరీంనగర్​, పెద్దపల్లి రైల్వే స్టేషన్లు దాటి తర్వాత రాఘవాపూర్​ వద్ద జరిగింది. భారీ శబ్దంతో పట్టాలు తప్పడంతో సమీప గ్రామాలకు చెందిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు.

తెలంగాణలో ఎన్నికల హీట్ ను తలపిస్తున్న రాజకీయ రణం

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార స్థాయిలో కొన‌సాగుతోంది. అధికార కాంగ్రెస్ తో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాగా త్వ‌ర‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అరెస్ట్ ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఈ మేర‌కు  మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇదే స‌మ‌యంలో రేవంత్ స‌ర్కార్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ స‌రికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ప‌ద‌కొండు నెల‌ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిందంటూ బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వ  అవినీతిపై పాల్ప‌డిందంటూ ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమ‌లులో విఫ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేలా బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిజంగానే కేటీఆర్ ను అరెస్టు చేస్తుందా..?  బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ స‌ర్కార్ ను ఇరుకు పెడుతుందా..? అనే అంశాల‌పై తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్నది. మాజీ మంత్రి కేటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 2023 ఫిబ్రవరిలో హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ జ‌రిగింది. ఈ రేసింగ్ లో భారీగా  ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రేవంత్ స‌ర్కార్ ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టి ఆధారాలు సేకరించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన  వాంగ్మూలం ప్రకారం రూ.55 కోట్ల నిధులను కేటీఆర్   ఆదేశాల మేరకే నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ క్ర‌మంలో అవినీతి నిరోధక చట్టం 17ఏ క్రింద కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో ముందుస్తుగా నెల రోజులు హైదరాబాద్ లో పోలీస్‌శాఖ 144 సెక్షన్ విధించింది. నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఫైల్ ఇప్ప‌టికే సిద్దం చేసింద‌ని, మ‌రికొద్ది రోజుల్లోనే కేటీఆర్ అరెస్టు కావ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, కేటీఆర్ మాత్రం.. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెబుతూనే.. అరెస్టుకైనా   సిద్ధ‌మేన‌ని చెప్పారు. కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్న నేప‌థ్యంలో.. రేవంత్ స‌ర్కార్ కు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డుతోంద‌ని విమ‌ర్శించిన కేటీఆర్‌.. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వం అవినీతిపై త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, అర్హ‌త లేక‌పోయినా శోదా కంపెనీకి టెండ‌ర్ల‌ను క‌ట్ట‌బెట్టార‌ని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని, త‌న బావ‌మ‌రిది సృజ‌న్ రెడ్డికి టెండ‌ర్ల‌ను అప్ప‌గించార‌ని అన్నారు. మొత్తం రూ. 8,888 వేల కోట్ల టెండ‌ర్ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి టెండ‌ర్లు ర‌ద్దు చేయాల‌ని కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ను కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీకి వెళ్లి  ఫిర్యాదు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని, త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వులు కూడా పోవ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణలో జ‌రుగుతున్న అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేటీఆర్,   డిమాండ్ చేస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంపై స్పందించ‌కుంటే  తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక‌టేన‌ని బ‌లంగా ప్ర‌చారం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంది.  కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌లు సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసిన స‌మ‌యాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ స్ప‌దిస్తూ బీఆర్ఎస్ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇస్తుండ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో జ‌రిగిన అవినీతిపై కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌ర‌ప‌కుంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ క‌లిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాల‌ని చూస్తున్నాయ‌ని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేలా బీఆర్ఎస్ నేత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీజేపీ మాత్రం రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం అయ్యేలా దృష్టిసారించింది. డిసెంబ‌ర్ 1 నుంచి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బీజేపీ పాద‌యాత్ర‌లు చేప‌ట్ట‌నుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీ అమలు చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు పాద‌యాత్ర‌ల ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఈ రాజ‌కీయ చంద‌రంగంలో బీఆర్ఎస్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌గ‌ల‌దా అనే అంశంపై తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రతీక్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోనికి తీసుకున్నారు. లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై స్థానికులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి   ప్రధాన నిందితుడు, బీఆర్‌ఎస్ కార్యకర్త సురేశ్ రాజ్   పరారీలో ఉన్నాడు.  సురేష్ రాజ్ వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నారనే ప్రాథమిక సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. కలెక్టర్‌పై దాడికి ముందు, తర్వాత నరేందర్ రెడ్డితో సురేశ్ రాజ్ దాదాపు 40 సార్లు ఫోన్ లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు.  

ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ, శాసనమండలిలో  చీఫ్ విప్ లు, విప్ లను నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి పేర్లను ఖరారు చేశారు. శాసనసభలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులును, శాసనమండలి చీఫ్ విప్ గా పంచుమర్తి ఆంజనేయులను ఖరారు చేశారు. ఇక  అసెంబ్లీలో 15 మందిని, మండలిలో ముగ్గురిని విప్ లు గా ప్రకటించారు. విప్ లలో జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. అసెంబ్లీ మండలిలోచీఫ్ విప్, విప్ ల జాబితా ఇలా ఉంది. .  అసెంబ్లీలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శాసనమండలిలో చీఫ్ విప్: పంచుమర్తి అనురాధ అసెంబ్లీలో విప్ లు... 1. బొండా ఉమ (టీడీపీ) 2. కాలవ శ్రీనివాసులు (టీడీపీ) 3. యార్లగడ్డ వెంకట్రావు (టీడీపీ) 4. ఆదినారాయణరెడ్డి (బీజేపీ) 5. బొమ్మిడి నాయకర్ (జనసేన) 6. బెందాళం అశోక్ (టీడీపీ) 7. రెడ్డప్పగారి మాధవి (టీడీపీ) 8. అరవ శ్రీధర్ (జనసేన) 9. తంగిరాల సౌమ్య (టీడీపీ) 10. దాట్ల సుబ్బరాజు (టీడీపీ) 11. దివ్య యనమల (టీడీపీ) 12. పీజీవీఆర్ నాయుడు (టీడీపీ) 13. తోయక జగదీశ్వరి (టీడీపీ) 14. బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన) 15. వీఎం థామస్ (టీడీపీ) మండలిలో విప్ లు.. 1. వేపాడ చిరంజీవి (టీడీపీ) 2. పి.హరిప్రసాద్ (జనసేన) 3. కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ) 

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును చంద్రబాబు ఎంపిక చేశారు. మంగళవారం (నవంబర్ 12) తెలుగుదేశం కూటమి శసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ స్వీకర్ పదవి కోసం పలువురి పేర్లను  పరిశీలించిన చంద్రబాబు చివరకు రఘురామకృష్ణం రాజు పేరును ఖరారు చేశారు. ఈ పదవి కోసం బుధ (నవంబర్ 13) లేదా గురు (నవంబర్ 14) వారాలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో ఈ పదవి కోసం మరెవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజు ఎన్నిక లాంఛనం మాత్రమే.  ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవ్వడం ఖాయమనే చెప్పాలి.   2019 ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీచేసి గెలిచారు. 2024 ఎన్నిక‌లకు ముందు ఆర్ఆర్ఆర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.  వైసీపీ రెబల్ ఎంపీగా రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ తప్పులను నిర్భయంగా ఎత్తి చూపారు.  దీంతో రఘురామకృష్ణంరాజును దారిలోకి తెచ్చుకోవడానికి జగన్ సామ, దాన, భేద, దండోపాయాలన్నిటినీ ఉపయోగించారు. అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం జగన్ అరాచక పాలనను, అస్తవ్యస్థ విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. తన రచ్చబండ కార్యక్రమం ద్వారా జగన్ తప్పుడు విధానాలను ఉతికి ఆరేశారు. దీంతో రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారు. వీటన్నిటినీ తట్టుకుని ఆయన జగన్ అరాచక పాలనపై అలుపెరుగని పోరాటాన్ని సాగించారు. చివరకు 2024 ఎన్నికల ముందు ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.   

పిల్ల సజ్జలపై లుక్ ఔట్ నోటీసు

వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ ఇన్ చార్జ్  సజ్జల భార్గవ రెడ్డిపై కడప జిల్లా పోలీసులు లుక్  ఔట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి. జగన్ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది.  జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన  ముఖంలా, గొంతులా వ్యవహరించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జల డిఫాక్టో సీఎంగా పెత్తనం చెలాయించారు.  ఆ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించుకునే సజ్జల  వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను తన పుత్రరత్నం, పిల్ల సజ్జల అదేనండి సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు.  దీంతో సజ్జల భార్గవరెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రిపుంతలు తొక్కింది. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయింది. సరే జగన్ సర్కార్ పతనమైన తరువాత సజ్జల భార్గవ రెడ్డి అయిపు లేకుండా పోయారు.  సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టులు పెట్టిన వారిపై  ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా  వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమీప బంధువు అర్జున్‌ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.     

మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం? 

మాజీ మంత్రి   కెటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వహాయంలో ఫార్ములా ఈ రేస్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. ఐఎఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం 55  కోట్ల నిధులను కెటీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకే  నిర్వహణ సంస్థకు బదిలీ చేసి నట్లు  చెప్పారు.   అవినీతి నిరోధక చట్టం 17 ఏ క్రింద కెటిఆర్ ను అరెస్ట్ చేయనుందని తెలుస్తోంది. గతంతో ఎపిలో ఇదే చట్టం క్రింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసింది. నిధుల దుర్వినియోగం జరిగితే కెటీఆర్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశముంది.  ఏడు సంవత్సరాలు చట్ట సభలకు పోటీ చేసే అవకాశం ఉండదు. గవర్నర్ అనుమతి తీసుకుని ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇదే యాక్ట్ క్రింద అరెస్ట్ చేస్తే మూడు నెలల వరకు బెయిల్ రాకపోవచ్చు. తన ఆదేశం మేరకే అరవింద్ నిధులు బదిలీ చేశారని కెటీఆర్ సైతం అంగీకరించడంతో అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కెటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనాప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు తెలిపారు. కెటీఆర్ అరెస్ట్ తో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించింది.  నిధుల దుర్వినియోగం కేసులో ఎసిబి ఫైల్ సిద్దం చేసింది.  ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని బిఆర్ఎస్ అంటోంది. కెటీఆర్ బావమరిదికి లాభం చేకూరేలా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని కాంగ్రెస్ ఆరోపించింది. 

జగన్ కు ‘మహా ’డేంజర్ బెల్స్

ఎంకి పెల్లి సుబ్బి చావుకోచ్చిందంటారు. అలా తయారైంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అసలే రాష్ట్రంలో ఘోర పరాజయంతో ఇటు జనానికీ, అటు అసెంబ్లీకి ముఖం చూపించలేక ప్రెస్ మీట్లతో నెట్టుకొచ్చేస్తున్న జగన్ కు మహారాష్ట్ర ఎన్నికలు మహా డెంజర్ గా పరిణమించాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం బీజేపీకి అత్యంత అవసరం, కీలకం కూడా. అయితే ఈ ఎన్నికలలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో సంభవించిన రాజకీయ పరిణామాలు బీజేపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమయ్యాయంటున్నారు. మహాలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఆ రాష్ట్రంలోని రెండు అత్యంత కీలకమైన బలమైన ప్రాంతీయ పార్టీలను చీల్చింది. బీజేపీ పుణ్యమా అని రాష్ట్రంలో బలమైన శివసేన రెండుగా చీలి బలహీన పడింది. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్డీయే కూడా నిట్ల నిలువుగా చీలి రెండు ముక్కలైంది. ఈ రెండు చీలిక వర్గాలూ కూడా బీజేపీ పంచన చేరి ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయం సాధించలేకపోతే.. శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలకు బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు ఆ రెండు చీలిక వర్గాలకూ కలిపి లోక్ సభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎన్డీయేలో కొనసాగుతారా లేదా అన్న విషయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయంపై ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు జగన్ కు డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  ఫర్ సపోజ్ మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించలేకపోతే  కేంద్రంలో ఎన్డీయే సర్కార్ చిక్కుల్లో పడుతుంది. ఎందుకంటే లోక్‌సభలో సింపుల్ మెజారిటీకి  272 స్థానాలు అవసరం కాగా, బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం, జేడీయూల మద్దతుపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. మొత్తం మిత్రపక్షాలతో కలిసి లోక్ సభలో ఎన్డీయే బలం 293. ఒక వేళ మహా ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైతే  శివసేన, ఎన్సీపీ ఎంపీలు ఏడుగురినీ ఎన్డీయే సభ్యులుగా భాజించలేం. అంటే ఏడుగురు సభ్యుల మద్దతును బీజేపీ కోల్పోతుంది. అంటే లోక్ సభలో ఎన్డీయే బలం 286కు పడిపోతుంది. అంటే కేంద్రంలో బీజేపీ మరింత బలహీనపడుతుంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం నిస్సందేహంగా అవకాశంగా తీసుకుని జగన్ కేసుల సత్వర విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుంది. అంటే ఫలితాల తరువాత జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు బెయిలు రద్దు పిటిషన్ లో సీబీఐ జగన్ బెయిలు రద్దు చేయాలంటూ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలు జగన్ కు మహా డేంజర్ గా మారాయని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.  

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో 55 మంది అరెస్ట్  

 వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  .  గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు.  ఎలాంటి అల్లర్లు జరగకుండా లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు.ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో ఏకంగా కలెక్టర్ పై దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బిఆర్ ఎస్ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ప్రభుత్వానికి నివేదిక అందినట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీకి భూ సేకరణ చేపట్టాలని నిర్ణయించి గ్రామస్థుల చేత అభిప్రాయ సేకరణ చేపడుతుండగా దాడి జరిగింది.   

బీఆర్ఎస్ బీజేపీ జుగల్ బందీ.. కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా?

ఇప్పుడనేమిటి? గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏదో రహస్య బంధం ఉందన్న ఆరోపణలు, అనుమానాలూ వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అసలు ఆ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలు పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెరవెనుక ఈ రెండు పార్టీల సంబంధాలే కారణమని కూడా అంటారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడానికే.. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని జనం భావించేలా రెండు పార్టీలూ బయటకు విమర్శల యుద్ధం చేసుకుని అంతర్గతంగా మాత్రం పరస్పర సహకారం అందించుకున్నారని కాంగ్రెస్ అప్పట్లో విమర్శించిన సంగతి తెలిసిందే. నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాపంకం కోసం పాకులాడుతోందని కాంగ్రెస్ తాజాగా విమర్శలు గుప్పిస్తోంది. అందుకే అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లుగా ఎప్పుడో రెండు నెలల కిందటే బీఆర్ఎస్ విమర్శలు గుప్పించి, ఆందోళనలు చేసి.. వాటిలో పస లేదని గ్రహించి వదిలేసిన అమృత్ పథకంపై ఆరోపణలకు మళ్లీ దుమ్ము దులిపి కేంద్రానికి ఫిర్యాదు చేసిందని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. ఫిర్యాదు మిషతో హస్తిన వెళ్లి అక్కడ కేంద్ర పెద్దలను మంచి చేసుకుని ఫార్ములా ఇ రేస్ కేసు నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. అమృత్ టెండర్లపై కేటీఆర్ గతంలోనే ఆరోపనలు గుప్పించారు. విచారణ జరిపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఏ ప్రయోజనం లేక ఆ అంశాన్ని మూలన పడేశారు. ఇప్పుడు హఠాత్తుగా కేటీఆర్ నాడు చేసిన ఆరోపణలను మళ్లీ ఫిర్యాదు రూపంలో చేస్తాను అప్పాయింట్ మెంట్ ఇవ్వండి అని అడిగీ అడగకుండానే కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంట్ ఇచ్చేశారు. వచ్చి ఫిర్యాదు చేసుకోండి అంటూ రెడ్ కార్పెట్ పరిచారు. దీంతో కేంద్ర మంత్రితో భేటీ అయి ఫిర్యాదు చేసిన కేటీఆర్ హస్తినలోనే మీడియా సమావేశం పెట్టారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్ సర్కార్ పైనా విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణ రాష్ట్రం ఏటీఎమ్ గా మారిందని ప్రధాని మోడీ ఆరోపణలనే వల్లె వెశారు.  కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ కూడా దీటుగానే స్పందించింది. కేటీఆర్ హస్తిన వెళ్లి ఫిర్యాదు చేయడం అన్నది బీజేపీ ప్లాన్ ప్రకారమే జరిగిందని ఎదురుదాడికి దిగింది. మహా రాష్ట్ర ఎన్నికలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీజేపీ.. కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించినా ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ ను ఆశ్రయించిందని అంటున్నారు. మహా ఎన్నికలలో తమకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పార్టీ హైకమాండ్ కనుసన్నలలో నడుస్తాయనీ, రాష్ట్ర ప్రయోజనాల కంటే హైకమాండ్ పెద్దల మొప్పు కోసమే పని చేస్తాయనేలా విమర్శలు గుప్పిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ప్రస్తుతం కనిపిస్తున్న పాజిటివ్ వైబ్ తగ్గుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే కేటీఆర్ ను హస్తినకు రప్పించుకుని మరీ అమృత్ టెండర్లపై ఫిర్యాదు స్వీకరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. క్విడ్ ప్రోకో చందంగా కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే, ఆరోపణలు గుప్పిస్తే ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి ఆయనను బయటపడేస్తామని బీజేపీ పెద్దలు బేరాలాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేసీఆర్ ను విచారించడానికి అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతోంది.  మొత్తం మీద బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య స్నేహంపై అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 

అన్నమయ్య జిల్లాలో చిరుత పులి సంచారం 

అన్నమయ్య జిల్లాలో  నిమ్మనపల్లె మండలంలో చిరుత పులి సంచారం ప్రజలను భయాందోళనలకు  గురి చేస్తోంది. మూడు వేర్వేరు ప్రాంతాలలో పశువులపై చిరుత పులి దాడి చేయడం ప్రజలు వణికి పోతున్నారు. పశువుల కాపర్లు మేతకు కూడా వెళ్లడం లేదు. ఇంటి ముందు కూడా పశువులను కట్టేయడం లేదు. ఏ నిమిషంలో నైనా చిరుతపులి అటాక్ చేస్తుందని భయపడుతున్నారు. నేలమళ్లేశ్వరస్వామి అటవీ ప్రాంతం, చల్లావారిపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రాంతంలోని చలిమామిడి కొండ, నిమ్మనపల్లె, వాల్మీకిపురం సరిహద్దు ప్రాంతంలో ఉన్న నూరుకుప్పల కొండలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం. గత ఆగస్టులో చిరుతపులి అటాక్ చేయడంతో మర్రిబండ వద్ద దూడ, మేకలకు గాయాలయ్యాయి.  గత నెల 31న చల్లావారిపల్లెకు చెందిన ఆదెన్న సమీపంలోని బోడికొండ వద్ద   తన పొలంలో షెడ్డు వేసుకుని ఆవులను పోషిస్తున్నాడు. దూడను ఎత్తుకెళ్లి చిరుత చంపేసింది.  ఈ నెల 1న గౌనిగారిపల్లెకు చెందిన శంకర తన గొర్రెలను బోడికొండ సమీపంలో మేపుతుండగా చిరుతపులి  దాడి చేసి రెండు గొర్రెలపై దాడి చేస్తుండగా గొర్రెల కాపరి అరుపులకు పరుగులు తీసింది. ఈ నెల 8న చిరుతలగుట్ట వద్ద పారేశువారిపల్లెకు చెందిన రామయ్య మేకను పట్టుకెళ్లింది. దీంతో చిరుత సంచారాన్ని  అటవీ అధికారులు  కన్ఫర్మ్  చేశారు. 

అసెంబ్లీ బహిష్కరణ.. జగన్ సెల్ఫ్ గోల్!

ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభను బాయ్ కాట్ చేయాలని  జగన్ తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా సెల్ఫ్ గోల్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ చేసిన తప్పులను తెలుగుదేశం కూటమి సభ్యులు అసెంబ్లీలో ఎండగడతారన్న భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  కేవలం ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం వైసీపీ భవిష్యత్ ను అంధకారం చేయడం ఖాయమని అంటున్నారు.  బడ్జెట్ ప్రసంగాల ద్వారా అధికార పార్టీ తప్పులు, బడ్జెట్ లో జరగని కేటాయింపుల పై నిలదీతకు వచ్చిన అవకాశాన్ని వైసీపీ చేజేతులా జారవిడుచుకుందని అంటున్నారు.   ప్రతిపక్ష హోదా ఇస్తామని హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ,తమకు సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలనీ, ఆ విషయాన్ని స్పీకర్ చేత చెప్పించాలని వైసీపీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తరువాత అసెంబ్లీలో ఆ పార్టీ అధినేత, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విపక్ష హోదా గురించి చేసిన ప్రసంగాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు విపక్ష నేతగా ప్రతిపక్ష హోదా అడిగేందుకు తనకు ఏ మాత్రం అర్హత లేదన్న విషయం జగన్ కు అర్ధమౌతుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.   అసలు 11మంది సభ్యులున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిబంధన ఎక్కడుందో చూపాలని జగన్ నిలదీయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.   అదీ కాక శాసన సభకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు శాసనమండలికి హాజరవడం ఆ పార్టీ ఒక పద్ధతీ పాడూ లేని విధంగా వ్యవహరిస్తోందనడానికి నిదర్శనంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అసలు అసెంబ్లీ అంటేనే శాసనసభ, శాసనమండలి కదా..  బడ్జెట్ సమావేశాలకు శాసన సభను బహిష్కరించి మండలికి హాజరవడం వైసీపీ రాజకీయ అజ్ణానానికి నిలువెత్తు నిదర్శనంగా తెలుగుదేశం కూటమి అభివర్ణిస్తోంది.  శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామనడం ప్రజాస్వామ్య వ్యవస్థ లో తప్పు అవుతుంది. ఈ విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరి ఇలానే కొనసాగితే తమపై అనర్హత వేటు పడుతుందని  భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ,అధికారం కోల్పోయినప్పుడు జగన్ ఒంటెద్దు పోకడలో మార్పు లేదని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎమ్మెల్యే లతో సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా అసెంబ్లీకి ముఖం చాటేసి రేపు ప్రజలు ముందుకు ఏ ముఖం పెట్టుకువెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం 10 శాతం సభ్యులున్న పార్టీలకే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది పట్టించుకోకుండా విపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ బహిష్కరణ అని భీష్మించడం వల్ల అభాసుపాలు కావడం వినా మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని బడ్జెట్ సమావేశాలకు హాజరై గౌరవాన్ని కాపాడుకుంటే పార్టీకీ, ఆయనకూ కూడా మంచిదని హితవు చెబుతున్నారు. 

నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాపు వేగం పుంజుకుంది. నిన్నటి వరకూ అధికారులకు నోటీసులు, వారి విచారణలకే పరిమితమైన పోలీసులు ఇప్పుడు రాజకీయ నాయకులకూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకరరావును అమెరికా నుంచి తీసుకువచ్చి విచారించాలన్న పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసినా ఫలితం లేకపోయింది. దానికి తోడు ఇటీవల ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు కూడా రావడంతో ఇక ఆయన విచారణ ఇప్పట్లో సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన పోలీసులు మిగిలిన నిందుతులపై దృష్టి సారించారు. ఈ కేసు కేవలం అధికారులకే పరిమితం కాదనీ, రాజకీయ పెద్ద తలకాయలకు కూడా ఇందులో ప్రమే యం ఉందనీ మొదటి నుంచీ ఆరోపణలు వినవస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా సోమవారం (నవంబర్ 11)న పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చి విచారణకు రావలసిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా పోలీసులు ఫోన్  ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాలకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందినట్లు చెబుతున్నారు. తమ విచారణలో భాగంగా లభించిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.   

డ్రోన్ల వినియోగంతో నేరాలకు అడ్డుకట్ట.. సీబీఎన్ విజన్ కు నిలువెత్తు నిదర్శనం

టెక్నాలజీని పాలనలో సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా చేసి చూపుతారు. తాజాగా ఆయన దార్శనికత, టెక్నాలజీ వినియోగంపై ఆయన దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన ఇది. ఇటీవల అమరావతి డ్రోన్ సమ్మిట్ సందర్భంగా చంద్రబాబు డ్రోన్లను విజిబుల్ పోలీసింగ్ తగ్గించేందుకు వినియోగించుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి అసాంఘిక శక్తులను అరికట్టవచ్చని చెప్పారు. ఆయన మాటలు అక్షర సత్యాలని పోలీసులు తాజాగా నిరూపించారు. ఐదెకరాల విస్తీర్ణంలో సాగు అవుతున్న గంజాయిని డ్రోన్ల వినియోగం ద్వారా గుర్తించిన పోలీసులు ఆ గంజాయి పంటను దగ్ధం చేశారు. ఈ సంఘటన  అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగింది. జిల్లాలోని జీ.మాడుగుల మండలం డేగలరాయి గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ల వినియోగం ద్వారా గుర్తించారు. వెంటనే దానిని దగ్ధం చేశారు. అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు సమాయత్తమౌతున్నారు. తాజా సంఘటన చంద్రబాబు దార్శనికతకు అద్దం పడుతోంది. టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు అందరికంటే ముందుంటారనేందుకు ఇదో నిదర్శనమని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత కంటే ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా బెజవాడ వరద బాధితులకు ఆహారం, నీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్లను వినియోగించింది. వరద బాధితులను డ్రోన్ల సహాయంతో ఆదుకోవడం అదే తొలిసారి. టెక్నాలజీని సమాజహితం కోసం వినియోగించే విషయంలో చంద్రబాబు అందరికంటే ముందుంటారనడానికి ఇవే తాజా ఉదాహరణలని అంటున్నారు.  విజన్ 2020 ద్వారా ఐటీ రంగం అభివృద్ధిని నాడు అందిపుచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు విజన్ 2047 ద్వారా భవిష్యత్ భారత్ ను ఇప్పుడే దర్శించి.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

మహా ఎన్నికల ప్రచారానికి ఏపీ ఉపముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమి తరఫున ఆయన మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాలలో పర్యటించి ప్రచారం చేస్తారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న ఓకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో ఎన్డీయే, ఇండీ కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. పవన్ కల్యాణ్ ను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కోరినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్  ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన సంగతి విదితమే. ఆ సందర్భంగా అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికలలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాలలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. కాగా ఈ ప్రచారంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొననున్నారు.  

ముఖ్యమంత్రి బావమరిది కంపెనీకి అమృత్ టెండర్లపై రగడ

అమృత్ టెండర్లను రద్దు చేసి విచారణ చేపట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కెటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్ లో ఇదే అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్  మరోమారు ఫిర్యాదు చేసినట్లు  కెటీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత బావమరిదికి సృజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి అమృత్ టెండర్లు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.  అమృత్ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో 15వందల కోట్ల నిధులు ముఖ్యమంత్రి బామ్మర్దులకు కేటాయించడం శోచనీయమన్నారు.  వారికి ఎలాంటి అర్హత లేనప్పటికీ అమృత్ టెండర్లు అప్పగించడం వెనక భారీ  అవినీతి జరిగిందని కెటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి మధ్య ఎటువంటి సంబంధం లేకుంటే వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

పెట్టుబడుల ఊతంతో ఏపీ ప్రగతి పరుగులు!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఐదేళ్ల అరాచక పాలన అంతమై.. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి నిండా ఐదు నెలలు పూర్తికాకుండానే.. సన్ రైజ్ స్టేట్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపును సాధించింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. బాబు దార్శనికతపై ఇన్వెస్టర్లలో, పారిశ్రామిక వేత్తలలో ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. చంద్రబాబు అంటే సంపదసృష్టికర్త, ఆ సృష్టించిన సంపదను సమాజంలోని అణగారిన వర్గాలకు సంక్షేమంగా అందించాలన్న దృక్ఫథం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన మార్క్ అభివృద్ధిని ప్రపంచానికే రోల్ మోడల్ గా మార్చింది. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో  ఏపీ అభివృద్ధి తిరోగమనంలో పడింది. అస్తవ్యస్థ విధానాలు, అరాచక పాలన, దోపిడీ, దౌర్జన్యం, కక్ష సాధింపు ఇవే ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు సాగాయి. పరిశ్రమలు తరలివెళ్లిపోయాయి. ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ వైపే చూడటం మానేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయింది. ఏపీ ఇమేజ్ దెబ్బతింది.  2024 ఎన్నికలలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత కూడా సర్వత్రా అనుమానాలే. చంద్రబాబు ఏపీకి పోయిన బ్రాండ్ ఇమేజ్ ను మళ్లీ తీసుకురాగలరా? సంపదసృష్టితో అభివృద్ధి సంక్షేమాలను జోడుగుర్రాళ్లీ పరుగులెత్తించగలరా? అన్న సందేహాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్ ఐదేళ్ల హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇక ఎన్నటికీ తేరుకోలేదన్నంతగా విచ్ఛిన్నమైంది. కానీ చంద్రబాబు తన అనుభవంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. అన్ని విధాలుగా అధోగతి పాలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు.   ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రిలయెన్స్ ముందుకు వచ్చింది. అంటే దేశంలో గుజరాత్ రాష్ట్రం తరువాత రిలయెన్స్ ఏపీలోనే భారీగా పెట్టుబడులు పెట్టడానికి  రెడీ అయ్యింది. రాష్ట్రంలో 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి రిలయెన్స్ ముందుక వచ్చింది. ఇటీవల ముంబైలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ అనంత్ అంబానీతో భేటీ అయ్యారు. ఆ భేటీ ఫలితమే ఇప్పుడీ పెట్టుబడులు. అలాగే  టాటా పవర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో సౌర, పవన్ విద్యుత్ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది.  అంతే కాకుండా  విశాఖ టిసీఎస్ కంపెనీ కొత్తగా ఐ‌టి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. అలాగే టాటా గ్రూప్ ఏపీలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అలాగూ ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల నడిబొడ్డున భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా అక్కడి నించి విమానసేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 

 నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఎపిలో భారీ వర్షాలు 

నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు ​నైరుతి రాష్ట్రాలు విడిచి వెళ్లినప్పటికీ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఎపిలో  నంద్యాల, వైఎస్ ఆర్ , అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ , బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో   భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ  హెచ్చరికలు జారీ చేసింది.  అల్పపీడనం పశ్చి మ దిశగా  నెమ్మదిగా కదులుతున్నాయి. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు అల్పపీడనం వెళ్లనుంది అని  విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.  రాబోయే రెండు మూడు రోజుల్లో రాయల సీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మ నాథ్  తెలిపారు. 

ఇప్పుడిక పోసాని వంతు!

అధికారం అండతో     సామాజిక మాధ్యమంలో ఇష్టారీతిగా చెలరేగిపోయి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసిన ఒక్కొక్కరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బూతులు, దూషణలే విమర్శలు అన్నట్లుగా చెలరేగిపోయిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అసభ్య, అశ్లీల వ్యాఖ్యలతో ఇష్టారీతిగా వ్యవహరించింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఇంకా పలువురిపై కేసులు నమోదు చేసింది.  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదు చేసింది. సినీమా రంగం నుంచి ఇలా నోటికొచ్చినట్లు మాట్లేడేసిన వారిలో పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పోసాని కృష్ణమురళి సైలెంటైపోయారు.  అయితే జనసేన అధినేతపై ఆయన పేలిన అవాకులు, చవాకులను ఆ పార్టీ నేతలూ, పవన్ కల్యాణ్ అభిమానులూ మరిచి పోలేదు. తాజాగా రాజమహేంద్రవరం జనసేన నేతలు పోసాని కృష్ణమురళిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై పోసాని కృష్ణమురళి ఇష్టారీతిన దూషించారనీ, అప్పట్లో తానము పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పిన వారు, ఇప్పుడు సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల విషయంలో పోలీసులు సీరియస్ గా స్పందిస్తుండటంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. దీంతో ఇక పోసానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోనికి తీసుకుని విచారించే అవకాశం ఉంది.