వైసీపీకి బైబై.. కూటమి పార్టీల్లోకి నేతలు క్యూ
posted on Oct 29, 2024 9:29AM
ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డితోపాటు.. ఆ పార్టీ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. అహంకారంతో పెట్రేగిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు, ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. అధికారం కోల్పోయిన నాటినుంచి ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీని వీడగా.. మరికొందరు ముఖ్యనేతలు సైతం జగన్ కు బైబై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రావడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడంతో పాటు.. సొంత మీడియా, అనుకూల మీడియాతో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రజల్లో వైసీపీని మరింత పలుచన చేస్తున్నారని సొంత పార్టీ నేతలే జగన్ తీరుపై మండిపడుతున్నారు.
మరోవైపు సొంత చెల్లి షర్మిళకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేయడంతో పాటు.. తల్లి విజయమ్మపైనా వైసీపీ నేతలు దుర్భాషలాడుతుండటం పట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గ్రాఫ్ పడిపోతుండటంతో ఇంకా ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని భావిస్తున్న పలువురు నేతలు జగన్ మోహన్ రెడ్డికి బైబై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. జగన్ రెడ్డి తీరు కారణంగానే వైసీపీ ఖాళీ అయిపోతోందంటున్నారు.
వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాలినేని శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో కీలక మహిళా నేతగా పేరున్న వాసిరెడ్డి పద్మ సైతం కొద్దిరోజుల కిందట పార్టీకి గుడ్ బై చెపెప్పేశారు. అంతేకాదు.. ఆ సందర్భంగా జగన్ తీరుపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. పార్టీలో అంతా తానే అనేలా జగన్ వ్యవహరిస్తారని.. ఇతరుల మాటకు కొంచెం కూడా విలువ ఇవ్వరంటూ మాటల తూటాలు పేల్చేశారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం లేదా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ విషయం పక్కన పెడితే వైసీపీ నుంచి మరో ఇద్దరు కీలక మహిళా నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. వీరిద్దరూ వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారే కావటం గమనార్హం.
మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత జగన్ కు బైబై చెప్పేందుకు సిద్ధమయ్యారని వార్తలు గుప్పుమంటున్నాయి. గుంటూరు జిల్లాల్లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కీలక నేత అయిన మేకతోటి సుచరిత మొదటి నుంచీ పార్టీకి వీర విధేయురాలిగా ఉన్నారు. అలాంటి సుచరిత పార్టీని వీడుతున్నారనే వార్తలు రావటం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో మినహా.. మంత్రి పదవి పోయిన తరువాత వైసీపీలో సుచరితకు ప్రాధాన్యత లేకుడా పోయిందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. తమ నేత పేరు కూడా వినిపించని పరిస్థితి రావటంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మేకతోటి సుచరిత త్వరలో వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారనీ, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మేకతోటి సుచరిత వైసీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకుంటారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
ఇక జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మరో మహిళా నేత విడదల రజిని కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ గుంటూరు పర్యటనల్లో రజినీ కడా పాల్గొంటున్నా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అలాగే పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
అసలు రజిని రాజకీయ అరంగేట్రం చంద్రబాబే చేయించారు. అప్పట్లో రజిని తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు కూడా. సైబరాబాద్‌లో మీరు నాటిన మొక్కను సార్ నేను అంటూ అప్పట్లో చంద్రబాబుపై ప్రశంసలు వర్షం కురిపించి రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. తరువాత వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన కొత్తల్లో ఆ పార్టీ పట్ల ఆకర్షితురాలై వైసీపీలో చేరారు. కొద్ది కాలానికే ఆ పార్టీలో కీలక నేతగా మారారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వైసీపీ ఓటమి తరువాత రజిని పార్టీని వీడే ఉద్దేశంలో ఉన్నాన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
విడదల రజనీ ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డితో భేటీ ఆ వార్తలకు బలం చేకూర్చింది. బాలినేని ఇటీవలే వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో రజిని బాలినేని ద్వారా ద్వారా పవన్ కల్యాణ్, జనసేన ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు బీజేపీ నుంచి కూడా రజనీకి ఆహ్వానాలు వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతున్నది. మరో వారంరోజుల్లో విడుదల రజనీ పార్టీ మార్పుపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.
అలాగే మరికొందరు వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డికి బైబై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా వున్న మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి పార్టీ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నాని అంటున్నారు. నాలుగు సార్లు కందుకూరు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మహిధర్ రెడ్డి ఇటీవలి కాలంలో వైసీపీకి దూరం జరిగారు. పార్టీ ఘోర ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. ఆయన తెలుగుదేశంలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అదే విధంగా తెలుగుదేశం సైతం మహీధర్ రెడ్డి రాకపట్ల సానుకూలంగానే ఉందని అంటున్నారు. దీంతో ఆయన త్వరలోనే వైసీపీని వీడి టీడీపీ గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది.