హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టలకట్టల నోట్లు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. వివరాల్లోకి వెడితే.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బులు కనిపించడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరని తెలుస్తోంది. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించినట్లు తెలుస్తోంది. అగ్నికీలలను ఆర్పేశాక.. అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే డబ్బును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. పట్టుబడిన నగదు మొత్తం లెక్కల్లో చూపని నగదుగా ఐటీ అధికారులు గుర్తించారు. మరోవైపు ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకుకుంది. ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తే సరిపోదని.. ఆయన రాజీనామా చేయాలని కొందరు కొలీజియం సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. ఓ న్యాయమూర్తి అయ్యిండి ఆయన ఇంట్లో ఇంతలా నోట్ల కట్టలు లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది. ఇంత డబ్బును న్యాయమూర్తి ఎలా సంపాదించారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

సీబీఎన్ మార్క్ ..వెతికి మరీ ప్రభుత్వ సాయం

దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ 14 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది.. కుమారుడు మానసిక వైకల్యంతో సరిగా నడవలేడని, మాట్లాడలేని పరిస్థితి. పింఛను కూడా రావడం లేదు. ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఏసమ్మ తన గోడు చెప్పుకొంది. తన కుమారుడికి కనీసం దివ్యాం గ పింఛన్‌ మంజూరు చేయాలని కోరింది. దీంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.లక్ష ఆమె బిడ్డ పేరున డిపాజిట్‌ చేయాలని   అక్కడికక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. మహిళ నుంచి దరఖాస్తు లేకున్నా, ఏసమ్మ వివరాలు లేకపోయినా సీఎంను కలిసిన ఆమె ఫొటో ఆధారంగా రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. రూ.లక్ష చెక్‌ను గురువారం కలెక్టర్‌ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి భీమవరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఏసమ్మ, ఆమె కుమారుడికి అందజేశారు. సీఎం చంద్రబాబు చేసిన సహాయం ఎన్నటికీ మరువలేమని ఏసమ్మ పేర్కొన్నారు. పింఛన్‌ మంజూరుకు, ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆమెకు కలెక్టరు భరోసా ఇచ్చారు.

ఆ ఏడుగురిదీ ధిక్కారమే? జగన్ చేతులెత్తేశారా?

వైసీపీ లేని, రాని ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీకి చెందిన జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలూ సమష్టిగా పోరాడుతున్నారని అంతా భావించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆరు నెలల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా వారు అందుకు సిద్ధపడే శాసన సభను బాయ్ కాట్ చేశారని అంతా భావిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సెషన్ కు జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలూ హాజరయ్యారో.. అప్పుడే అందరికీ   అనర్హత వేటుతో శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయి ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికీ లేదని అర్ధమైపోయింది. అందుకే కేవలం అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టడానికే వారు ఆ ఒక్క రోజూ సభకు వచ్చారని స్పష్టమైపోయింది. అదలా ఉంచితే..  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి సంతకం పెట్టినా అది రెగ్యులర్ సెషన్ లోకి రాదని స్పీకర్ సభా నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టత ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి వ్రతమూ చెడింది. ఫలమూ దక్కలేదన్నట్లైంది. దీంతో ఇక చేయగలిగిందేముంది, రోట్లో తలపెట్టాం.. రోకలి పోటుకు ఎదురు చూడాల్సిందే అన్నట్లుగా జగన్ అండ్ కో చేతులెత్తేశారు. కానీ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఇక్కడే తమ ధిక్కారాన్ని సున్నితంగానైనా పార్టీ అధినేత జగన్ కు తెలియజేయాలనుకున్నారు. జగన్ అభీష్ఠానికి విరుద్ధంగా, కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టి వచ్చేశారు.  సభలో వారు ఏ కార్యక్రమంలోనూ పాల్గొన లేదు. కేవలం అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టి వచ్చేశారంతే. దీని వల్ల పుణ్యమూ పురుషార్థమూ దక్కుతాయని వారు భావించారు. అయితే అలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టేసినంత మాత్రాన వారు సభకు హాజరైనట్టుగా తాను పరిగణిం చబోననీ, అయినా దొంగల్లా అసెంబ్లీకి రావాల్సిన ఖర్మ ఎందుకు దర్జాగా వచ్చి సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోండి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారికి హితవు పలికారు. అయితే జగన్ కు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో అడుగుపెట్టి సంతకాలు పెట్టేసిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఏం చర్య తీసుకుంటారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. చర్య అంటూ తీసుకుంటే జగన్ పార్టీ బలం అసెంబ్లీలో నాలుగుకు పడిపోతుంది. పోనీ చర్య తీసుకోకుండా వదిలేస్తే ఇక ఎమ్మెల్యేలెవరూ జగన్ ను లెక్క చేసే పరిస్థితి ఉండదు. దీంతో వీరి విషయంలో జగన్ పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్లు తయారైందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. 

లండన్ హిత్రూ ఎయిర్ పోర్ట్ క్లోజ్డ్.. ఎందుకంటే..?

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో   ఒకటైన లండన్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో  విమానరాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. విమానాశ్రయం సబ్ స్టేషన్ లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదమే ఇందుకు కారణం. సబ్ స్టేషన్ లో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో విమానాశ్రయంలో విమానరాకపోకలను నిలిపివేశారు. దీంతో లండన్ వెళ్లాల్సిన పలు విమానాలు వివిధ విమానాశ్రయాలలో నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా కూడా లండన్ కు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేసింది.   హీత్రూ నుండి  లండన్ హీత్రూ విమానాశ్రయంలో విద్యుత్తు అంతరాయం ప్రపంచవ్యాప్తంగా  1300 విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. హిత్రూ విమానాశ్రయంలో విమనరాకపోకలను ఎప్పటిలోగా పునరుద్ధరించేది ఇంకా అధికారికంగా వెళ్లడించలేదు. 

యాంకర్ శ్యామలకు చట్టాలంటే గౌరవం లేదా?

 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో నిందితురాలు యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టునాశ్రయించారు. వైకాపా అధికార ప్రతినిధి హోదాలో ఉన్న శ్యామలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అనే విషయం తెలియంది కాదు. కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ నిసిగ్గుగా ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కొరడా జులిపిస్తున్నారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. శ్యామలపై కూడా కేసు నమోదైంది. ఇందులో భాగంగా శ్యామలకు  పోలీసులు నోటీసులు పంపి వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ ఆమె  మాత్రం పోలీసులకు వివరణ ఇవ్వాల్సిందిపోయి న్యాయస్థానం కోర్టుకెళ్లారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చట్టాల పట్ల గౌరవం లేని వైకాపా నేతలపై కేసులు నమోదు కాగానే కోర్టులను ఆశ్రయిం చడం ఈ మధ్యకాలంలో మామూలైంది. కూటమి నేతలను అనుచిత వ్యాఖ్యలు చేసి ఎపిలో 17 పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదైన వైకాపా నేత పోసాని కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి భంగ పడ్డారు. శ్యామలకు కూడా అదే గతి పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.వైకాపాలో కీలకమైన అధికార ప్రతినిధి హోదాలో ఉండి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమేమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.   కాగా కేసులు నమోదైన టీవీ యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి స్టేషన్ కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.    

డ్రగ్స్ కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష? 

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నిరుడు జులైలో సింగపూర్ ప్లాగ్ ఉన్న ఓడలో నిషేధిత డ్రగ్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు భారతీయుల సమాచారం ఇండో నేషియా పోలీసులకు అందింది. వెంటనే రైడ్స్ చేయడంతో 106 కిలోల గంజాయి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్ , సెల్వదురై దినకరన్, విమల కందన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ ముగిసింది తీర్పు రిజర్వ్ చేశారు. ఏప్రిల్ 15న ఇండోనేషియా కోర్టు తీర్పు వెలువడనుంది.  ఇండియన్స్ తరపున జాన్ పాల్ కేసు వాదిస్తున్నారు. ఓడ కెప్టెన్ కు తెలియకుండా మాదక ద్రవ్యాలను ఓడలో దాచిపెట్టినట్లు ఈ ఇండియన్స్ పై ఆరోపణలున్నాయి.   కెప్టెన్ అనుమతితో మాదక ద్రవ్యాలను ఓడలో దాచిపెట్టినట్టు నిందితుల తరపు న్యాయవాది వాదించారు.  ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష విధించే అవకాశం మెండుగా ఉంది.  ప్రస్తుతం ఈ ముగ్గురు ఇండియన్స్ ఇండోనేషియా జైల్లో ఖైదీలుగా ఉన్నారు.   

నష్టమే తప్ప లాభం లేదు.. విద్యాశాఖ మూసివేత.. ట్రంప్ సంచలన నిర్ణయం

వ్యక్తిత్వ వికాసానికి, మానవాళి పురోగమనానికీ విద్య ఎంతో దోహదం చేస్తుంది. నూతన ఆవిష్కరణలు చేయాలన్నీ, వ్యక్తిత్వం ఉన్నతంగా ఉడేలా మలుచుకోవాలన్న విద్య ఎంతో అవసరం. ప్రభుత్వాలు విద్యపై ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంతగా దేశంలో విద్యాభివృద్ధి జరుగుతుంది. అందుకని దేశంలో విద్యావ్యవస్థను పర్యవేక్షించి, పరిపుష్టం చేయాలంటూ ప్రాథమిక స్థాయి నుంచీ విద్య విషయంలో గట్టి పునాదులు ఉండాలి. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రాన్ని చూసినా ఆయా  రాష్ట్రాల బడ్జెట్ లో విద్యకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి. ఆ కేటాయింపుల పారదర్శక వ్యయం కోసం విద్యాశాఖ బలోపేతంగా ఉండాల్సిన అవసరం ఉంది.  అలాంటి విద్యాశాఖ వల్ల మా దేశానికి ఎలాంటి లాభం లేదు. అందుకే ఆ శాఖ అనవసరం అంటూ అగ్రదేశం అశ్యక్షుడు డొనాల్డ్ ట్రప్  సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యా శాఖ వల్లే ఖర్చే తప్ప లాభం ఇసుమంతైనా లేదంటూ గత కొంత కాలంగా, అంటే అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన విద్యాశాఖలో భారీ కోతలు విధించారు. స్కాలర్ షిప్పులు, ఫీజురాయితీల వల్ల ఖజానాకు చిల్లు పడటం తప్ప  ఇసుమంతైనా లాభం ఉండటం లేదంటూ ట్రంప్ తాజాగా దేశంలో విద్యాశాఖనే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ ఈ సంచల నిర్ణయం తీసుకున్నారు.  నాలుగు దశాబ్దాలుగా విద్యపై భారీ మొత్తంలో వ్యయం చేసినా విద్యాప్రమాణాలు ఇసుమంతైనా పెరగలేదన్న ట్రంప్ విద్యాశాఖను మూసి వేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా, విద్యా శాఖను మూసివేస్తూ ఎగ్జిక్యూటివ్ సంతకం చేసేశారు. ఏప్రిల్ నుంచి ఈ మూసివేత అమెరికాలో అమలులోకి వస్తుంది.  

ఎపిలో వింత...ఎండాకాలంలో వర్షాలు

సూర్యుని జన్మని సూచించే  రథ సప్తమి రాగానే ఎండలు ప్రారంభమవుతాయి.  వర్షాకాలం వచ్చే వరకు వానలు ఉండవు. అయితే ఈ సంవత్సరం భిన్నంగా ఫిబ్రవరి నాలుగో తేదీకి  ముందే  రథసప్తమి ముందే ఎండలు మండిపోయాయి. ఇవ్వాల్టి వరకు ఎండలు దంచి కొడుతున్నాయి.  ఎపిలో మాత్రం రేపట్నుంచి మూడు రోజులు వర్షాలు ముంచెత్తుతాయని  విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.  మార్చి 22  నుంచి ఉత్తర కోస్తా జిల్లాలలో వర్షాలు పడతాయి.  వారం రోజుల పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయి. ఈ వర్షాల కారణంగా పది రోజుల పాటు చల్లటి వాతావరణం ఉంటుంది.  గంటకు 40  నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.   

సుబ్రహ్మణ్యం మీద సుబ్రహ్మణ్యేశ్వరుడిది ప్రేమా.. పగా?

పదేళ్లలో 103 సార్లు పాము కాటు ప్రతి సారీ చావు అంచుదాకా వెళ్లి బతికి బట్టకడుతున్న వైనం హేతువుకు అందని వింత నాగదేవుడి పేరు పెట్టుకున్న ఆ వ్యక్తిపై పాములు పగబట్టాయా? లేక భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నాయా? తెలియదు కానీ సుబ్రహ్మణ్యం అన్న నామధేయం ఉన్న ఆ వ్యక్తిని గత పదేళ్లలో  పాములు 103 సార్లు కాటు వేశాయి. అలా పాము కాటుకు గురైన ప్రతి సారీ అతడు బతికి బయటపడ్డారు. పాము కాటునుంచి తప్పించుకునేందుకు అతగాడు చేయని ప్రయత్నం లేదు. ఊర్లు మారాడు, రాష్ట్రాలు మారాడు. కానీ అదేమిటో అతడెక్కడ పని చేస్తే అక్కడ పాము కాటుకు గురౌతూ వస్తున్నాడు. ఇది వింతా, మిస్టరీయా తెలియదు కానీ.. సుబ్రహ్మణంను వెతికి వెతికి మరీ పాములు కాటువేస్తున్నాయి.  విషయమేంటంటే.. చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లి మండలం చల్లారు గుంట వాసి వడ్డెర సుబ్రహ్మణ్యం (47) గత పదేళ్లలో 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. సుబ్రహ్మణ్యం అని నాగదేవత పేరు పెట్టు కున్నసుబ్రహ్మణం ఇలా తరచుగా పాము కాటుకు గురి కావడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. పాము కాటుకు గురైన ప్రతి సారీ సుబ్రహ్మణ్యం చావు అంచుల దాకా వెళ్లి వస్తున్నాడు. తాజాగా ఈ నెల 15న మరో సారి అంటే 103వ సారి సుబ్రహ్మణ్యంను పాము కాటేసింది. పెద్ద పంజాణి జేఎంజే అస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే ఇన్ని సార్లు పాములు సుబ్రహ్మణ్యంనే ఎందుకు కరుస్తున్నాయి..అంటే సమాధానం దొరకదు. పాము కాటుకు గురైన ప్రతిసారీ వైద్య సహాయంతో బతికి బట్టకడుతున్నాడు కానీ, ఆ వైద్యం కోసం సుబ్రహ్మణ్యం తనకున్న మూడెకరాల పొలాన్నీ అమ్మేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు భార్యా బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.  సర్పదోషనివారణ పూజలు,రాహుకేతు పూజలు చేశాడు. అయినా పాములు మాత్రం అతడిని వదల డం లేదు.  మొత్తం మీద ఇన్ని సార్లు పాముకాటుకు గురైన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం గిన్నిస్ రికార్డులకు ఎక్కే అవకాశం లేకపోలేదని నెటిజనులు అంటున్నారు. సుబ్రహ్మణ్యం వెర్సెస్ పాములు వెనుక కారణాలు కనుగొనడానికి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

పదిహేనేళ్ల పాటు బాబే సీఎం..నేనే డిప్యూటీ.. తేల్చేసిన పవన్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలనా పరంగా ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా పాలన సాగిస్తోంది. పాలనా పరంగా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులూ లేకపోయినా, కూటమి పార్టీలలో సఖ్యత విషయంలో అనుమానాలు పొడసూపుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనల మధ్య అగాధం ఏర్పడిందన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. ఈ విషయమై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్యా విభేదాలు ఉన్నాయని జనం భావించే లక్ష్యంతో వైసీపీ మీడియా ఈ ప్రచారం సాగిస్తోందని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ ప్రచారాన్నిఖండిస్తున్నాయి. అయినా కూడా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాని పరిస్థితి ఉంది. తాజాగా ఇటీవల పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేనాని పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలు అభూతకల్పనలేనని పవన్ కల్యాణ్ తేల్చేశారు. అది కూడా జనసేన, తెలుగుదేశం ఎమ్మెల్యేల సమక్షంలో చంద్రబాబును పక్కన పెట్టుకుని తమ రెండు పార్టీల మధ్యా ఎలాంటి పొరపొచ్చాలూ లేవని విస్ఫష్టంగా చెప్పాశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం (మార్చి 20) ముగిశాయి. సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు కూడా అదే రోజు ముగిశాయి. ఈ సందర్భంగా  విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రజాప్రతినిథుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వీటిని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం, జనసేనల బంధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని విస్పష్టంగా చెప్పారు. దేశానికి నరేంద్ర మోడీ వరుసగా మూడో సారి ప్రధాని అయ్యారనీ, అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటారనీ పవన్ కల్యాణ్ అన్నారు. అంటే చంద్రబాబు 15 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటారనీ, ఈ 15ఏళ్లూ తానే ఉపముఖ్యమంత్రిగా ఉంటాననీ పవన్ కల్యాణ్ చెప్పారు. కూటమి సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉంటుందనీ, అంత కాలం తెలుగుదేశం అధినేత చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారనీ, తాను ఉప ముఖ్యమంత్రిగా ఆయన కింద పని చేస్తాననీ పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్న సమయంలో చంద్రబాబు సహా తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ఆయన వైపే చూస్తు ఉండిపోయారు.  ఈ మాటలతో తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు పొడసూపాయంటూ జరుగుతున్న ప్రచారానికి పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. చంద్రబాబు పని తీరుకు, ఆయన విజ్ణతకు, దార్శనికతకు తాను అభిమాననని, రాష్ట్రప్రగతి విషయంలో ఆయన చిత్తశుద్ధిపై తనకు పూర్తి విశ్వాసం ఉందనీ పవన్ కల్యాణ్  చెప్పడం ద్వారా తెలుగుదేశంతో జనసేన పొత్తు సుదీర్ఘ కాలం సాగుతుందని తేటతెల్లం చేసేశారు.  

మంత్రి ఫరూక్ కు సతీ వియోగం

ఆంధ్రప్రదేశ్  మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్   సతీమణి షెహనాజ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమెశుక్రవారం (మార్చి 21)  ఉదయం తుదిశ్వాస విడిచారు. సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. షెహనాజ్‌ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు.  శనివారం (మార్చి 22) అంత్యక్రియలు నిర్వహిస్తారు.   గత ఐదారు నెలలుగా షెహనాజ్  అనారోగ్యతో బాధపడుతున్నారు.మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్  మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు.  ఫరూక్   ఫరూక్‌ కుటుంబానికి అల్లా మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థించారు. అలాగే మంత్రి లోకేష్, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రగాఢ సంతాపం తెలిపారు.  

 స్మగ్లర్ వీరప్పన్ కూతురుకి ఎన్టీకే పార్టీలో కీలక పదవి 

తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నేరాలను పెంచి పోషించిన వారి వారసులకు అక్కడి రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకుని కీలక పదవులు కట్టబెడుతున్నాయి. నేర ప్రవృత్తి అభ్యర్థుల అర్హతగా మారిపోయింది. గంథపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణికి తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీలో కీలక పదవి వరించింది.  ఆ పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర కన్వీనర్లలో ఒకరిగా నియమించారు.   పార్టీ  ప్రధాన సమన్వయకర్త సీమాన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ  విద్యారాణి నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. పిఎంకె పార్టీలో చేరి ఆమె రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 2020లో  బిజెపిలో చేరారు.  తాజాగా ఎన్టీకేలో చేరి కీలక పదవిని కైవసం చేసుకోవడం చర్చనీయాంశమైంది.  గత లోకసభ ఎన్నికల్లో కృష్ణగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి  ఎన్టీకే అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు. మూడు రాష్ట్రాలను గడ గడలాడించిన కరడు గట్టిన స్మగ్లర్ వీరప్పన్ 2004లో కర్నాటక అడవుల్లో ఎన్ కౌంటరయ్యారు. వీరప్పన్ కు ఉన్న క్రేజ్ ను ఎన్టీకే వినియోగించుకోవాలని చూస్తోంది. వన్నీయర్ సామాజిక వర్గానికి చెందిన  వీరప్పన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు జనాభాలో 12 నుంచి 15 శాతం వన్నీయార్ లు ఉన్నారు. వీరప్పను లాగే అతని కూతురుని వన్నీయార్లు ఆదరిస్తారని ఎన్టీకే భావిస్తోంది.  

తెలుగుదేశం వైపు మర్రి రాజశేఖర్ చూపు!

వైసీపీ భవిష్యత్ పట్ల ఆ పార్టీ నాయకులు ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీ కీలక నేతలంతా జగన్ కు దూరం జరుగుతూ పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బుధవారం (మార్చి 20) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీని కూడా వీడతాననీ, తన కార్యకర్తలతో చర్చించి తెలుగుదేశం గూటికి చేరతాననీ ప్రకటించారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఇప్పటి వరకూ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. మర్రి రాజశేఖర్ కంటే ముందు పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంటకరమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే.. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన వైసీపీ తరఫున విజయం సాధించారు. చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఇండిపెండెంట్ గా విజయం సాధించిన మర్రి, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు.  ఇక 2019 ఎన్నికలలో ఆయన చిలకలూరి పేట నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019లో చిలకలూరి పేట స్థానం నుంచి విడదల రజనీని జగన్ రంగంలోకి దింపారు. అప్పట్లోనే తీవ్ర అసంతృప్తికి లోనైనా మర్రి రాజశేఖర్.. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, కేబినెట్ లోకి తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు.   అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ ఇచ్చిన హామీ మేరకు మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం 2023 వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికలలో మర్రికి టికెట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మర్రి రాజశేఖర్ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. కాగా రాజీనామా చేయవద్దంటూ జగన్ రాయబారాలు పంపినా మర్రి ఖాతరు చేయలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా మర్రి రాజీనామా చేయవద్దంటూ ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.  

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు  ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.  ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పరీక్షలు జరిగాయి.  పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విద్యార్థులను అనుమతించారు.  పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు రాయనున్నారు.  2, 650  పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి.  పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు చాలామంది విద్యార్థులు సమీపంలోని దేవాలయాలకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం కనిపించింది.  పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పహారా కాశారు. 

హైకోర్టులో శ్యామల క్వాష్ పిటిషన్

వైసీపీ అధికార ప్రతినిథి, యాంకర్ శ్యామల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ ఆమె హై కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం (మార్చి 21) విచారణ జరుపుతుంది.  నిబంధనలకు తిలోదకాలిచ్చి, చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అలా కేసు నమోదైన వారిలో వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల కూడా ఉన్నారు.  అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ  శ్యామల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యింది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు? ఎంతెంత డబ్బు, ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది? ఎన్ని చేతులు మారింది అన్న వివరాలు కూపీలాగుతున్నట్లు తెలియవచ్చింది.  ఇక ఈ కేసులో శ్యామల భర్త పాత్ర ఉందా అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే శ్యామల ఆస్తులు, లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోందంటున్నారు. 

శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు  స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి, నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా మారింది. అందులో భాగంగానే చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా గురువారం రాత్రికే తిరుమల చేరుకున్నారు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తదితరులు చంద్రబాబుకు పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికారు. గురువారం రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, అర్చ‌కులు  స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయక మండపం వద్ద వేదపండితులు  ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం   కుటుంబ సమేతంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు.   అక్కడ భక్తులకు చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ స్వయంగా  అన్న ప్రసాదాన్ని వడ్డించారు.. దేవాన్ష్ పేరుతో అన్న‌దానం నిర్వ‌హించారు. అనంతరం తిరుమల నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. 

కేసీఆర్ లో గజ్వేల్ ఉప ఎన్నిక భయం.. అసెంబ్లీకి ఒక్క రోజు హాజరు అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై.. అధికారానికి దూరమైన క్షణం నుంచీ   రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అనే విధంగా యాక్టివ్ పోలటిక్స్ కు దాదాపు దూరమయ్యారు. అయితే అప్పుడప్పుడు మాత్రం తాను మళ్లీ క్రియాశీలం అవుతాననీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాననీ చెబుతూ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారానికి దూరమైన ఈ 15 నెలల్లోనూ ఆయన అసెంబ్లీకి హాజరైంది కేవలం రెండు సార్లు మాత్రమే. రెండు మూడు సార్లు మాత్రమే బహిరంగంగా సభలలో మాట్లాడారు. అంతే మిగిలిన కాలమంతా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆయన తాను రాజకీయంగా క్రియాశీలం అవుతాననీ, అసెంబ్లీకి హాజరై ప్రభుత్వాన్ని నిలదీస్తాననీ గట్టిగా చెప్పారు. అన్నట్లుగానే అసెంబ్లీకి వచ్చారు. అదీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సెషన్ కు మాత్రమే. ఆ తరువాత మళ్లీ అసెంబ్లీ ముఖం చూడలేదు. యథాప్రకారం ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఈ 15 నెలల కాలంలోనూ ఆయనను ఎవరైనా కలవాలనుకున్నా.. లేదా ఆయన ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా వేదిక ఫామ్ హౌస్ మాత్రమే.   ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్ కు వచ్చారు. అప్పుడూ అంతే ప్రసంగం ముగించేసి మళ్లీ ఫామ్ హౌస్ కు చేరిపోయారు.   ప్రస్తుతం సభలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది కానీ కేసీఆర్  మాత్రం సభకు రాలేదు. దీంతో ఆయన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీకి వచ్చింది. మొక్కుబడి తంతుకోసమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణులలో కూడా వ్యక్తం అవుతోంది.  ఆయన అసెంబ్లీకి హాజరైంది.. కేవలం హాజరు కోసమేనా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం   శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే గైర్హాజరుగా ప్రకటించవచ్చు.  అదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో  కేసీఆర్ ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి భయపడుతున్నారా? అందుకే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీలో హాజరు వేయించుకుని మళ్లీ ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ కాలం నుంచీ ఉప ఎన్నికలను పార్టీ పటిష్ఠతకు, ఉద్యమ బలోపేతానికి అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఉప ఎన్నిక అంటేనే భయపడుతున్నారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అనర్హత   వేటు నుంచి తప్పించుకోవానికే కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యారా, ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ ను ఫాలో అయ్యారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  15 నెలల్లో కేసీఆర్ శాసనసభ్యుడిగా  57లక్షల 84 వేల124 రూపాయల వేతనం తీసుకున్నారనీ, కానీ అసెంబ్లీకి హాజరైంది మాత్రం కేవలం రెండు రోజులేననీ ఎద్దేవా చేశారు. అయితే ఆ విమర్శలను, ఎగతాళిని కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఎవరేమనుకుంటే నాకేం.. అనర్హత వేటు నుంచి తప్పించుకుంటే చాలు అన్నట్లుగా ఆయన వైఖరి కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఫాలో అవుతున్నట్లు తోస్తోంది. అందుకే జగన్ లానే కేసీఆర్ కూడా అసెంబ్లీకి  మొక్కుబడిగా ఒక రోజు హాజరై..మళ్లీ ముఖం చూపడం లేదు. వాస్తవానికి దేశంలో ఉప ఎన్నికలను అత్యంత వ్యూహాత్మకంగా, సమర్ధంగా పార్టీ పురోగతికి, బలోపేతానికి వాడుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో  ఆయన ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్)  ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు తెరలేపేవారు.  అప్పట్లో ఆయన తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల ద్వారా ఉద్యమ స్ఫూర్తి ఇసుమంతైనా తగ్గకుండా ఉంచేవారు. అటువంటిట కేసీఆర్ ఇప్పుడు.. ఉప ఎన్నిక అంటే భయపడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా వ్యవహరిస్తున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో పరాజయాన్ని చవి చూశారు. గజ్వేల్ లో విజయం సాధించారు. కామారెడ్డి పరాజయంతో ఆయన ఇప్పుడు తనపై అనర్హత వేటు పడి గజ్వేల్ కు ఉప ఎన్నిక వస్తే ఆ స్థానాన్ని నిలుపుకోవడం కష్టం అని భావిస్తున్నారనీ, అందుకే   శాసనసభ్యత్వాన్ని కాపాడుకుని, ఉప ఎన్నిక ముప్పును నివారించడానికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున హాజరయ్యారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

సీనియర్లకు శుభ సంకేతాలు!

తెలంగాణ కాంగ్రెస్లో సీన్ రివర్స్ అవుతోందా? ఒకప్పుడు, సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన, చిట్టి పొట్టి నాయకులకు ఎత్తు పీట వేసి పెద్ద చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు, సీనియర్ల వైపు చూస్తోందా? అంటే, కాంగ్రెస్ వర్గాల నుచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి, సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అంతే  కాదు, యంగ్ లీడర్స్ టాలెంట్ గుర్తించక పోవడం, పదవులు పక్కదారి పట్టి సీనియర్ నాయకులకు చేరడంతో   యువ నాయకులు అనేక మంది వేరే దారులు వెతుకున్నారు. ఉదాహరణకు,   రాజస్థాన్, మధ్య ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధిష్టానం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సచిన్ పైలెట్ ను కాదని, వృద్ద నేత అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది. మధ్య ప్రదేశ్ లోనూ అంతే, జ్యోతిరాదిత్య సింధియా ను కాదని కమల్ నాథ్ ను  సిఎంను చేసింది.  నిజానికి, పైలెట్, సింధియా ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి సన్నిహితులు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు. సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్  కాంగ్రెస్  పార్టీలో, ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహ రావు మంత్రివర్గంలో పనిచేసారు. జ్యోతిరాదిత్య సిందియా తండ్రి మాధవ  రావు   సిందియా విషయం అయితే చెప్పనే అక్కర లేదు. నాలుగైదు సార్లు ఎంపీగా గెలవడమే కాదు,   గ్వాలియర్ నుంచి పోటీ చేసిన అటల్ బిహారీ వాజ్ పేయిని ఓడించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు.  పైలెట్, సింధియా ఇద్దరూ కూడా. వారసులుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చినా, నాయకులుగా నిరుపించుకున్నారు. ఎంపీలుగా గెలిచారు, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మన్మోహన్ సింగ్   మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేసి, పరిపాలనా అనుభవం సంపాదించుకున్నారు. రెండు రాష్ట్రల్లోనూ 2018 ఎన్నికలలో  కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ ఇద్దరే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.  అయినా, కాంగ్రెస్ అధిష్టానం యువ నాయకులను కాదని, వృద్ధులకు పదవులు కట్టబెట్టింది. నిజానికి  ఆ ఇద్దరనే కాదు, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది యూత్ లీడర్స్ కు పార్టీలో  గుర్తింపు దక్కలేదు. అందుకే జితిన్  ప్రసాద, ఆర్పీ సింగ్ మొదలు నిన్న మొన్న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన,  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ అంటోనీ వరకు ఎంతో మంది యువ నేతలు ముఖ్యంగా రెండు మూడు తరాలుగా, కాంగ్రెస్ కుటుంబాలుగా ముద్ర వేసుకున్న  నేతల కుమారులు, కాంగ్రెస్ అధిష్టానం తమకు గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని బయటకు వెళ్లి పోయారు. ఈ మధ్యనే  జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవలు అందించిన, అహ్మద్ పటేల్ కుమారుడు, ఫైసల్  పటేల్   కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయి, ఇక చాలని తప్పుకున్నారు. అయినా  యంగ్ టాలెంట్ బయటకు వెళ్లి పోతున్నా చాలా వరకు రాష్ట్రాల్లో ఇప్పటికీ  సీనియర్ నాయకులకే కుర్చీలు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ఎదుకనో ఒక్క తెలంగాణ విషయంలో మాత్రం, ఆనవాయితీకి భిన్నంగా, రెండుమూడు పార్టీలు మారి, కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డిని మాత్రం చేయి పట్టుకుని రాజకీయ వైకుంఠపాళిలో పాముల నోటిన పడకుండా నిచ్చెనలు ఎక్కించుకుంటూ   పైకి తీసుకు పోయింది. 2017లో  తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి   అధిష్టానం అండదండలతో చకచకా  నిచ్చెన మెట్లు ఎక్కారు.   బహుశా కాంగ్రెస్ పార్టీలో ఇంత వేగంగా పదవుల మెట్లు ఎక్కినా నాయకుడు మరొకరు ఉండక పోవచ్చును. 2021 లో సీనియర్ నాయకుల నుంచి తీవ్ర  ప్రతిఘటన  ఎదుర్కుని కూడా ఆదిష్ఠానం   అండదండలతో  టీపీసీసీ  అధ్యక్షుడయ్యారు. అదే క్రమంలో 2023లో కాంగ్రెస్ అధిష్టానం,సీనియర్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ని  ముఖ్యమంత్రిని చేసింది.  అయితే  ఇప్పడు అదే అధిష్టానం కారణాలు ఏమిటో ఖచ్చితంగా తెలియక పోయినా సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్  నియామకం జరిగిన తర్వాత, ఈ  మార్పు   స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.  అలాగే, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిని  పక్కకు నెట్టి, జానా రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్టాం సీనియర్ నాయకులకు  త్వరలోనే పూర్వ వైభవం వస్తుందనే సంకేతాలు ఇచ్చినట్లు, అయ్యిందని సీనియర్ నాయకులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ రాకతో, అధిష్ఠానానికి సీనియర్ నాయకులకు మధ్య మాజీ రాష్ట్ర ఇన్ చార్జిలు, కోటరీ నేతలు కట్టిన అడ్డు గోడలు తొలిగి పోయాయి. సీనియర్ నాయకుడు జానా రెడ్డి వారధిగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో  సీనియర్ నాయకులకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది  అంటున్నారు. అలాగే, ఇటీవల గుజరాత్ లో రాహుల్ గాంధీ, బీజేపీతో భూత, భవిష్యత్, వర్తమానాల్లో పత్యక్ష, పరోక్ష సంబంధాలున్న అందరికీ  ఉద్వాసన తప్పదని చేసిన హెచ్చరిక  నేపధ్యంగా రాష్రంలో చోటు చేసుకుంటున్న  పరిణామాలను సీనియర్ నాయకులు  శుభ సంకేతాలుగా తీసుకుంటున్నారు.