సంకట స్థితిలో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు

మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ పార్టీ నేతలకు ప్రజలనుంచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.   తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ డీలిమిటేషన్, త్రిభాషా సూత్రాలకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ముందుకు వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల తరఫున తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. దక్షిణాది రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాది పార్టీలను కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడానికి నడుంబిగించారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిథులు తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నాయకులను చెన్నై వేదికగా ఈ నెల 22న జరిగే అఖిల పక్ష భేటీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. చెన్నై వేదికగా డీఎంకే నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష భేటీలో కేంద్రం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలకు, కసరత్తుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. డీఎంకే నేతలు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. త్రిభాషా సూత్రం విషయంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులలో, పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల నేతలందరిలో ఏకాభిప్రాయమే వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా డీలిమిటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాదిరిగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ సర్కార్ డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగా విమర్శించారు.  దక్షిణాదికి చెందిన రాజకీయ నేతలంతా డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలు మాత్రం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.  ఇష్టం ఉన్నా లేకున్నా డీలిమిటేషన్ కు అనుకూలంగా తప్ప వ్యతిరేకంగా నోరెత్తలేని సంక్లిష్ట స్థితిలో వారు మిగిలిపోయారు. ఎందుకంటే పార్టీ లైన్ కు వ్యతిరేకంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నోరెత్తలేరు.. అలాగని దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చే నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. డిలిమిటేషన్ పేరిట కాంగ్రెస్, డీఎంకేలు విభజన రాజకీయాలకు తెరతీస్తున్నారని బీజేపీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండి పడ్డారు. దక్షిణాది బీజేపీ నేతలు డిలిమిటేషన్ పై ఈ విమర్శ మాత్రమే చేయగలరనీ, అయితే ఇదేమీ వారికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదనీ పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.  దక్షిణాదిలో కర్నాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఒకింత బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ డిమిలిటేషన్ వ్యవహారం తెలంగాణలో కూడా ఆ పార్టీ పరిస్థితిని మళ్లీ మెదటికి తీసుకువస్తుందన్న భావన రాజకీయవర్గాలలోనే కాదు, బీజేపీ శ్రేణులలో సైతం వ్యక్తం అవుతోంది.  

పార్ట్ నర్ కోల్పోవడంతో కన్నీరుమున్నీరైన  ఏనుగు 

అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో పిడుగు పడినా తమకు పట్టనట్టుంటున్నారు. ఇరుగు పొరుగు అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైంది. నగరాల్లో ఇలా ఉంటే గ్రామాల్లో శుభవార్త అయినా, దుర్వార్త అయినా కలిసి పంచుకుంటున్నారు. రష్యాలో ఓ సర్కస్ లో రెండు ఏనుగుల్లో ఒకటి  చనిపోయింది. మరోటి తట్టుకోలేకపోయింది. కంటితడి పెట్టింది. అంతేకాదు చనిపోయిన ఏనుగు దగ్గరికి ఎవరినీ రానీయకుండా కాపాలా కాసింది.  ఇది చూసిన సర్కస్ కంపెనీ సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. సర్కస్ కంపెనీలో  ఓ ప్రేక్షకుడే  వీడియో తీసి  సోషల్ మీ డియాలో పో స్ట్ చేశాడు.  ఈ వీడియో నెట్టింట  వైరల్  అయ్యింది. పాతికేళ్ల పాటు ఈ జోడి ఏనుగులు సర్కస్ కంపెనీలో చేసిన వినోదం అంతా ఇంతాకాదు. తన పార్ట్ నర్ చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఏనుగు గంటలకొద్దీ అక్కడే గడిపింది.  జెన్నా,  మాగ్దా పేర్లు గల ఏనుగుల్లో ఒకటి చనిపోవడంతో మరోటి తట్టుకోలేకపోయింది.   మనుషుల్లో  బంధాలు బంధవ్యాలు తగ్గిపోతున్న తరుణంలో  ఈ ఏనుగుల బంధం గొప్ప సందేశాన్ని సభ్య సమాజానికి అందించాయి.   

వివేకా హత్య కేసు.. శిక్ష బాధితులకేనా?

వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు.  తన తండ్రిని హత్య చేసిన  దోషులకు శిక్ష పడాలంటూ వివేకా కుమార్తు డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. వివేకా వర్ధంతి సందర్భంగా సునీత మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ కేసులో ముఖ్య సాక్షులు ఒకరి తరువాత ఒకరు మరణించడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. వివేకా కేసులో నిందుల కంటే బాధితులే ఎక్కవ శిక్ష అనుభవిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఇప్పటికి స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   కేసు ఆంధ్రప్రదేశ్ పరిధిలో లేకపోయినా.. ఇక్కడ ఉన్న సాక్షులను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానిదేనన్న సునీత.. ఆ బాధ్యత నెరవేర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆరోపించారు.  సాక్ష్యులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంటే.. ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.   గత వైసీపీ ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుకుందనీ, వీలైతే కేసు దర్యాప్తును అటకెక్కించేందుకు ప్రయత్నించిందనీ చెప్పిన సునీత.. ఆ ప్రయత్నాలను తాను న్యాయపోరాటం ద్వారా అడ్డుకున్నాననీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాతైనా న్యాయం జరుగుతుందనుకుంటే.. నిరాశే ఎదురౌతోందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.  

కాకినాడలో దారుణం... పిల్లల తలలను బకెట్లో ముంచి చంపిన తండ్రి 

పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను కట్టేసిన ఓ తండ్రి తలలను బకెట్లో ముంచి చంపేసాడు. తర్వాత తానూ ఊరివేసుకుని చనిపోయాడు. కాకినాడ  జిల్లా వాకల పూడిలో అసిస్టెంట్ అకౌంట్ గా పని చేస్తున్న వానపల్లి చంద్రకిషోర్ ఒకటో తరగతి చదువుతున్న జోషిల్ , యుకేజీ చదువుతున్న నిఖిల్ పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య తనూజతో ఓ ప్లాట్ లో ఉంటున్న చంద్ర కిషోర్ తన పిల్లలను  ఉన్నత స్కూళ్ళలో పోటీ పరీక్షలు రాయించాడు. పిల్లలిద్దరూ రాణించలేకపోవడంతో మనస్థాపం చెంది భార్య ఇంట్లో లేని సమయంలో పిల్లలిద్దరి కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి తలలను బకెట్లో ముంచి చంపేశాడు.. ఆతర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల ప్రాణాలు కాపాడాల్సిన  ఆ తండ్రే దారుణంగా చంపేయడం సంచలనమైంది. 

ఇదేం రుబాబు రఘునందనా?

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి, ఆంధ్రప్రదశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అల్టిమేటమ్ జారీ చేసినట్లుగా మాట్లాడారు. ఈ వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ అంగీకరించకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిథులం అందరం తిరుమల వచ్చి చేయగలిగింది చేస్తామని హెచ్చరించారు. అసలాయన ఎక్కడి వారు, ఎక్కడకు వచ్చి ఏం మాట్లాడారు? అంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి పద్మారావు వంటి వారు కూడా తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ కూడా రాశారు. ఆ లేఖపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం ఫిబ్రవరి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలను తిరుమలలో పరిగణనలోనికి తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఇప్పుడు తాజాగా మార్చి నెల సగం గడిచిపోయిన తరువాత కూడా తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫా రసు లేఖను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ రఘునందనరావు తిరుమలలో రుబాబు చేశారు. శుక్రవారం (మార్చి 14)న ఆయన తిరుమలేశుని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిథి హోదాలో ఆయనకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం కల్పించింది. అయితే ఆయన సిఫారసు లేఖలకు అనుమతిపై ఏపీ సర్కార్, టీటీడీపై విమర్శలు గుప్పించడమే కాకుండా హెచ్చరిక కూడా జారీ చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  రాష్ట్రంలోని మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించేది. వారి సిఫారసు లేఖల మేరకు భక్తులకు దర్శనం కల్పించేది. అయితే రాష్ట్ర విభజన తరువాత  తిరుమలలో  తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలా వద్దా అన్నది పూర్తిగా టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిం చుకోవలసిన అంశం. దీనిపై పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిథులు రుబాబు చేయడం పూర్తిగా అనుచితం అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో రఘునందనరావుపై విరుచుకుపడుతున్నారు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం పది శాతం మంది భక్తులకు మాత్రమే రాష్ట్రప్రజాప్రతినిథుల లేఖల ద్వారా బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం లభ్యమౌతోంది. మిగిలిన 90శాతం మందీ కూడా సామాన్య భక్తులే. అయినా టీటీడీలో శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రాల వారీ కోటా ఏమీ లేదు. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిథులు తమ లేఖలను పరిగణనలోనికి తీసుకోవాలంటే హఠం చేయడం ఎంత వరకూ సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా తిరుమలేశుని దర్శనం కోసం టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రాల వారీ రిజర్వేషన్లు ఏమీ ఉండవు. అంటే తెలంగాణ భక్తులు కానీ మరో రాష్ట్రం భక్తులు కానీ తిరుమలేశుని దర్శనం విషయంలో వివక్షకు గురి కావడం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాసులకు ప్రత్యేక వెసులుబాటు కూడా ఏమీ లేదు.  తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమల వచ్చిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తోంది. ఇప్పుడు రఘునందరనావు కూడా కుటుంబ సమేతంగా  వతిరుమలలో  వీఐపీ దర్శనం చేసుకున్నారు. ఇక సిఫారసు లేఖలను కూడా అనుమతించాలని పట్టుబట్టడంలో అర్ధం లేదని నెటిజనులు విమర్శిస్తున్నారు. సామాన్య భక్తులకు సత్వర దర్శన భాగ్యం కల్పించడంపైనే టీటీడీ దృష్టి సారించాలని కోరుతున్నారు. రఘునందనరావు తిరుమలలో చేసిన రుబాబు ఆయన స్థాయికి తగినట్లుగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.  

 మత్తు ... గమ్మత్తుగా...కు ల్ఫీ ఐస్ క్రీంలో గంజాయి మిక్స్ 

హోలి ముసుగులో హైదరాబాద్ ధూల్ పేటలో గంజాయి విక్రయాలు జరిగినట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టి ఎఫ్ ) పోలీసులు గుర్తించారు. మండే ఎండలను ఎన్ క్యాష్ చేసుకోవడానికి  వ్యాపారులు ఐస్ క్రీం విక్రయాలు జరపడం సబబే. కానీ ఈ ఐఎస్ క్రీంలలో గంజాయి కలిపి విక్రయించడం ధూల్ పేటలో వెలుగు చూసింది. ఐస్ క్రీంలలో నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్ టిఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు.  నిందితుడు ఐస్ క్రీం, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి మిక్స్ చేసి విక్రయిస్తున్నాడు. మత్తులో గమ్మత్తుగా ఊగే యువతే టార్గెట్ గా  గంజాయి ఐస్ క్రీం విక్రయాలు బాగా  జరిగినట్టు పోలీసులు అంగీకరించారు. 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, కొన్ని సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐస్‌క్రీమ్, కుల్ఫీ విక్రయించే నిందితుడే  గంజాయిని మిక్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి బర్ఫీ, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

అప్పుడే రోళ్లు పగులుతున్నాయి!

తెలంగాణలో ఎండలు మండి పోతున్నాయి. ఎప్పుడో మే చివరి వారంలో రోహిణీ కార్తె సందర్భంగా రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి అని చెప్పుకోవడం మనకు తెలుసు. అయితే ఈ సారి మాత్రం మార్చి రెండో వారంలోనే రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. ఆదిలామాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మరో ఐదు  రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ శాఖ ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.  అలాగే హైదరాబాద్ నగరంలో కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకూ రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 20 తరువాత రెండుమూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 

వరుదు కళ్యాణిపై గ్రీష్మ ప్రమోగం!

ఏపీ శాసన మండలిలో వైసీపీకి బొత్స లాంటి లీడర్లు ఉన్నా సడన్‌గా లైమ్‌లైట్‌లోకి వచ్చారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి . తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టినా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తూ సబ్జెక్ట్ బేస్డ్‌గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ లేడీ మెంబర్. ఆమె వాగ్దాటికి బ్రేక్ వేయడానికి మంత్రి లోకేష్ వంటి వారు రంగంలోకి దిగాల్సి వస్తుంది.. ఇప్పుడు టీడీపీ నుంచి మరో యువ మహిళా నేత కావలి గ్రీష్మ మండలికి ఎన్నికయ్యారు.. కల్యాణి దూకుడుని  కట్టడి చేయడానికి టీడీపీ గ్రీహ్మను ప్రయోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.  శాసనమండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన వారే కావడంతో మైకు బాగానే దొరుకుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్సీల వాయిస్ మండలిలో గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనమండలిలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  చాలామంది బలమైన లేడీ లీడర్‌లు ఉన్నారు.  అధికారం మనదే కదా అని రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా సైలెంట్ అయిపోయారు.  ఏపీ శాసనమండలిలో ఉన్న వైసీపీ నాయకుల్లో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తప్ప ఆ పార్టీ వాయిస్ వినిపించే నేతలే లేరు. అయితే కళ్యాణి శాసనమండలిలో  తన వాడైన మాటలతో  అందర్నీ ఆకర్షిస్తున్నారు.  శాసనమండలిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వరుదు కల్యాణి ఓన్లీ సబ్జెక్టుతో మాట్లాడుతున్నారు. వైసీపీ సీనియర్లలా  అసభ్యకరమైన బాష వాడట్లేదు. ఆమె ధాటిగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఆమెను నిలువరించడానికి లోకేష్, వంగలపూడి అనిత వంటి మంత్రులు రంగంలోకి దిగాల్సి వస్తుంది. సహజంగానే అది కూటమికి ఒక విధంగా ఇబ్బందికరంగా మారుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో శాసనమండలికి కొత్తగా అయిదుగురు కూటమి నుంచి గెలిచి వస్తున్నారు. అందులో టీడీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో మహిళా నాయకురాలు ఉత్తరాంధ్ర కు చెందిన కావలి గ్రీష్మ ఉన్నారు. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె అయిన గ్రీష్మ ఇప్పటికే పార్టీలో ఫైర్‌‌బ్రాండ్‌గా ఫోకస్ అవుతున్నారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో వైసీపీపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతూ గ్రీష్మ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ క్రమంలో గ్రీష్మకు టీడీపీ ఉమెన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టింది. దీంతో మళ్లీ తెరమీదకు వచ్చిన గ్రీష్మకు ఇంతలోనే ఎమ్మెల్సీ అయ్యారు.  వైసీపీ మీద అలాగే వరుదు కళ్యాణి వంటి మహిళా నేతల మీద గ్రీష్మను ప్రయోగించే వ్యూహంలో కూటమి ఉందని అంటున్నారు. బేసికల్ గా వరుదు కళ్యాణి కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ఆమె రాజకీయ జీవితం కూడా టీడీపీ నుంచి అక్కడే మొదలైంది. అయితే వైసీపీలో చేరాక విశాఖకు మకాం మార్చి ఉమ్మడి జిల్లాను తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. గ్రీష్మ కొత్త ఎమ్మెల్సీగా రావడంతో సిక్కోలు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ల మధ్య రాజకీయ సమరానికి శాసనమండలి వేదికగా మారబోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

‘కోటరీ’ కిమ్మనలేదేం?

వైసీపీ అధినేత జగన్ కోటరీపై ఆ పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ తీరు గురించి తెలిసిన వారెవరైనా సరే ఇక విజయసాయిపై వైసీపీ నేతలు విరుచుకుపడతారని భావిస్తారు. ఆయన వ్యక్తిగత విషయాలు సహా పార్టీకి ఆయన ద్రోహం చేశారంటూ మీడియా, సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున కథనాలు వండి వారుస్తారని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, కాకాణి, అంబటి వంటి ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప అసలు విజయసాయి వ్యాఖ్యలకు కనీసం రిటార్డ్ కూడా ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా కోటరీ అంటూ విజయసాయి అన్యాపదేశంగా టార్గెట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు అయితే పూర్తిగా మౌనం దాల్చారు.   కాకినాడ పోర్టు కేసు మొదలైనప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నారు. కనుక అదంతా ఓ కట్టుకధ, కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనంటూ అప్పట్లో ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేసిన తరువాత  అదే కేసులో  విజయవాడ సీఐడీ పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరై అదే పోర్టు కేసులో కర్త, కర్మ,క్రియ మొత్తం విక్రాంత్ రెడ్డే అని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు తన అల్లుడి సోదరుడు, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి తరపున కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుతో డీలింగ్ చేశారని వెల్లడించారు. ఇలా చెప్పడం ద్వారా విజయసాయిరెడ్డి ఈ కేసులో అప్రూవర్ గా మారడానికి రెడీ అయిపోయారా అన్న అనుమానాలు వైసీపీలోనే వ్యక్తం అవుతున్నాయి. అలా మారి జగన్ ను ఇరికించేందుకు చూస్తున్నారా అన్న ఆందోళనా వ్యక్తం అవుతోంది.   అంతే కాదు తొలి సారిగా విజయసాయి  నేరుగా జగన్మోహన్ రెడ్డిపై, ఆయనకు అత్యంత సన్నిహితులపై తీవ్ర ఆరోపణలు చేసినా, విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డిల పేర్లు ప్రస్తావించినా వైసీపీ నుంచి కనీస స్థాయి స్పందన లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయసాయిని ఇంకా కెలికితే.. జగన్ గుట్టు మొత్తం బయటపడుతుందన్న భయమే ఇందుకు కారణమని, విజయసాయి విషయంలో ఆచితూచి స్పందించాలని జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి ఉంటాయనీ పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కేసులే కాదు.. జగన్ అక్రమాస్తుల కేసులలో   ఏ-2గా ఉన్న విజయసాయి నోరు విప్పితే మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా ఆయనపై వైసీపీయులు విమర్శల దాడికి వెనుకాడటానికి కారణం అని విశ్లేషిస్తున్నారు. విజయసాయి వంటి వ్యక్తితో సై అంటే సై అని తలపడటం కంటే.. ఆయన విమర్శలు, ఆరోపణలపై స్పందించకుండా మౌనం దాల్చడమే మేలని వైసీపీ అధినేత పార్టీ నేతలు, శ్రేణులకు సూచించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.  

బీఆర్ఎస్ పిలుపునకు తెలంగాణ సమాజం స్పందించలేదా?

బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం  పెద్ద సీరియస్ గా తీసుకోలేదా?.. ఆ పార్టీ ఇచ్చిన నిరసన పిలుపును పట్టించుకోలేదా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలను, ప్రభుత్వ విధానాలపై చేస్తున్న పోరాటాలనూ తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణలుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టైనప్పుడు ప్రజల నుంచి ఏ మాత్రం వ్యతిరేకత రాని విషయాన్ని గుర్తు చేయడమే కాకుండా, ఆ తరువాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరవ్వడాన్ని కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇక తాజాగా అసెంబ్లీ నుంచి ప్రస్తుత బడ్జెట్ సెషన్ పూర్తయ్యే వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి నిరసనగా గురువారం (మార్చి 13)న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా శుక్రవారం (మార్చి 14) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరగలేదు. అధవా కొన్ని చోట్ల జరిగినా జనం భాగస్వామ్యం కనిపించలేదు. అతి తక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు మాత్రమే మొక్కబడిగా నిరసన తెలిపారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వంటి నేతలు కూడా పార్టీ ఇచ్చిన నిరసన పిలుపు కంటే హోలీ వేడుకలకే ప్రాధాన్యత ఇచ్చారు.  

హైకోర్టులో యడ్యూరప్పకు ఊరట.. పోక్సో కేసులో ట్రయల్ కోర్టు విచారణకు హాజరు నుంచి మినహాయింపు

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను కర్నాటక హైకోర్టు నిలిపివేసింది. దీంతో ఈ కేసులో యడ్యూరప్ప వ్యక్తిగతంలో ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.  గత ఏడాది మార్చిలో యడ్యూరప్పపై నమోదైన పోక్సో కేసులో ట్రయల్ కోర్టు ఆయనతో సహా మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. ఆ సమన్ల మేరకు వీరు శుక్రవారం (మార్చి 15) ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ట్రయల్ కోర్టు సమన్లను సవాల్ చేస్తూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ట్రయల్ కోర్టు సమన్లపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా  ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తన 17 ఏ్ల కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి విదితమే.   

జగన్ పై బాలినేని బాంబు.. నా ఆస్తులు లాక్కొన్నారంటూ సంచలన ఆరోపణ

జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని  మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పిఠాపురంలో శుక్రవారం (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  బాలినేని కూడా జగన్ కు సమీప బంధువు. నిన్న మొన్నటి దాకా ఆయన వైసీపీలోనే ఉన్నారు. పలు మార్లు ఆ పార్టీ అధినేతతో విభేదించారు. అలకబూనారు. ధిక్కార స్వరం వినిపించారు. అయినా సర్దుకు పోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత కూడా ఆయన కొంత కాలం వైసీపీలో కొనసాగారు. ఒంగోలులో తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తరువాత వైసీపీ తీరుతో, మరీ ముఖ్యంగా జగన్ వైఖరితో విసికి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.   ఇప్పటి వరకూ జగన్ పై రాజకీయ విమర్శలే చేస్తూ వచ్చిన బాలినేని జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనవే కాదు తన వియ్యంకుడి ఆస్తులు కూడా జగన్ లాగేసుకున్నారని ఆరోపించారు. జగన్ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఆస్తల కబ్జాల గురించి  తర్వాత సమయం వచ్చినప్పుడు  వివరంగా చెబుతానని బాలినేని అన్నారు.  జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని ఓ సారి సీఎం కాగలిగారన్నారు. ఇక మరోమారు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని బాలినేని కుండబద్దలు కొట్టారు.  త్వరలో జనసేనాని పవన్ కల్యాణ్ హీరోగా తాను ఓ సినిమా నిర్మించనున్నట్లు బాలినేని జయకేతనం సభ వేదికగా ప్రకటించడం కొసమెరుపు.  

డీలిమిటైజేషన్ కలిపింది ఇద్దరినీ..!

తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు, నిప్పు వంటి వారు. విమర్శల స్థాయిని వారిరువురూ దూషణల స్థాయికి దిగజార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతుంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే.. కేసీఆర్ విపక్షంలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే మాట మాట్లాడటం అన్నది.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ విషయంలోనైనా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం అన్నది ఇప్పటి వరకూ జరగలేదు. అసలలాటిం సందర్భం ఒకటి వస్తుందన్న ఊహ కూడా రాజకీయవర్గాలలోనే కాదు, సామాన్య జనంలో కూడా రాలేదు.  రేవంత్, కేసీఆర్ మధ్య మాటలయుద్ధం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ మర్యాదలకు కూడా తిలోదకాలిచ్చి వారు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటుంటారు.  అయితే అనూహ్యంగా ఆ ఇరువురి నోటీ ఒకే మాట వచ్చింది. ఏదో సినిమాలో నువ్వాదరిని.. నేనీ దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అన్న పాటను స్ఫురింపచేసేలే.. నిప్పూ ఉప్పులా చెరో వైపూ ఉండే రేవంత్ రెడ్డి, కేసీఆర్ లను నియోజకవర్గాల పునర్విభజన అంశం ఏకతాటిపైకి తెచ్చింది. ఔను డీలిమిటైజేషన్ ను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటా ఒకే మాట వచ్చింది.  కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటీ ఒకే మాట వినిపిస్తోంది.   జనాభా ప్రాతిపదికగా మాత్రమే జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నచర్చ జోరుగా సాగుతోంది. ముందుగా ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన గళం ఎత్తారు.  జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిషేషన్ తో పెరిగే సీట్లన్నీ ఉత్తరాదిలోనే పెరుగుతాయనీ, దక్షిణాదిలో నామమాత్రంగా సీట్లు పెరగడమో… లేదంటే అసలు సీట్లే పెరగకపోవడమో.. ఇంకా చెప్పాలంటే సీట్ల సంఖ్య  తగ్గిపోవడమో జరుగుతుందన్న ఆందోళనను డీఎంకే వ్యక్తం చేసింది.  దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడానికి దోహదం చేసింది. అంతే కాకుండా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో ఈ నెల 22న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చెన్నై వేదికగా జరగనున్న ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లకు డీఎంకే  ఆహ్వానించింది. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ కూడా ఈ సమావేశాన్నిస్వాగతించారు. హాజరవ్వడానికి అంగీకరించారు.   డీఎంకేతో కాంగ్రెస్   పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అటువంటిది డీఎంకే సమావేశానికి హాజరౌతామని కేటీఆర్ అంగీకరించడం విశేషమేనని పరిశీలకులు అంటున్నారు. అదీ కాక రేవంత్, కేటీఆర్ లు ఇద్దరూ ఈ సమావేశానికి హాజరు కానుండటం రాజకీయవర్గాలలో ఆసక్తి రేకెత్తించింది.  మొత్తం మీద రేవంత్, కేటీఆర్ ల నోట ఏ విషయంలోనైనా సరే ఏకాభిప్రాయం వ్యక్తం కావడం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. చెన్నై వేదికగా జరిగే అఖిలపక్ష సమావేశంలో ఇరువురూ ఒకే వేదిక పంచుకుంటే అది రాజకీయంగా ఒక గొప్ప విశేషంగానే చెప్పుకోవలసి ఉంటుంది. చూడాలి మరి.. రేవంత్ కేసీఆర్ లు ఆ సమావేశానికి స్వయంగా హాజరౌతారో తమతమ పార్టీల తరఫున ప్రతినిధులను పంపుతారో. 

బంగారం తుప్పు పడుతుందంట.. గాలి కబుర్లు

బంగారం  తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా?  .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ  మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి.కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా, తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది. బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్‌ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది.

పాముకు పాలు పోస్తున్న చంద్రబాబు

పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు  తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు. వైసీపీ నేతలను దగ్గరకు రానీయొద్దు.. తెలుగుదేశం నేతలను ప్రలోభపెట్టాలని వైసీపీ నేతలు,  వారి సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారు, మనతోనే వాళ్ల పనులు చేయించుకుంటారంటూ పార్టీ నేతలకు చాలా పెద్ద ఎత్తునే హితబోధ చేశారు చంద్రబాబు. అలాంటి వాళ్లను దగ్గరకు రానీయొద్దంటూ పెద్ద లెక్చరే పీకారు.  కానీ అదే చంద్రబాబు రెండు రోజులు తిరిగే సరికి.. వైసీపీతో అంటకాగిన వారిని,  గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వారికి ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు తెచ్చిపెడుతున్నారు. పెద్ద ఎత్తున భూములూ కట్టబెట్టేస్తున్నారు. తాజాగా జరిగిన ఎస్ఐబీపీ సమావేశంలో గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం నుంచి, ఆ రంగంలోని వివిధ కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీల నుంచి రావాల్సిన అమ్యామ్యాలను వసూలు చేసి పెట్టిన వారికి పెద్ద పీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం.  షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యానికే చెందిన మరో సంస్థ ఇండోసోల్ కంపెనీకి భారీ ఎత్తున భూములు కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58469 కోట్ల రూపాయలతో ఇండోసోల్ ప్రాజెక్టు పెట్టుబడి పెడుతుందని.. దానికి ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎస్ఐపీబీ సమావేశంలో 119659 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతున్న వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇందులో 58469 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న ఇండోసోల్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఓ విధంగా చెప్పాలంటే ఇండోసోల్ కోసం లేటెస్ట్ ఎస్ఐపీబీ సమావేశాన్ని ప్రభుత్వం పెట్టినట్టుగా కన్పిస్తోంది.  ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పిన ఇండోసోల్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 8348 ఎకరాల భూమిని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో కేటాయింపులు జరుపుతున్నారు. ఇక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నందుకు ప్రభుత్వం వైపు నుంచి భారీగా ఆర్థిక, ఆర్థికేతర ప్రొత్సహాకాలివ్వాలని ఇండోసోల్ కోరింది. ఆర్థిక ప్రొత్సహకాలు ఎంతో తెలుసా.. ఏకంగా 41254.50 కోట్ల రూపాయలు. ఇది కాకుండా,  ఆర్థికేతర ప్రొత్సహకాలు ఉన్నాయి. వీటిల్లో ఇండోసోల్ పెట్టిన మెజార్టీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ స్థాయిలో జగన్ కు బినామీ అనుకున్న సంస్థకు ఎలా కట్టబెడతారనేది ఇప్పుడు తెలుగుదేశం సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.  పోనీ ఇదేదో పై స్థాయిలో జరుగుతోంది.. చూసీ చూడనట్టు పోదామన్నా.. వీల్లేని పరిస్థితులు కల్పిస్తోంది ఇండసోల్ సంస్థ. ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి నేరుగా చేస్తున్నారో.. లేక ఆయన పేరుతో ఎవరైనా చేస్తున్నారో తెలియదు కానీ,  తెలుగుదేశం పార్టీకి చెందిన   వారు.. పార్టీ సానుభూతి పరులు విద్యుత్ కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన టెండర్లను వేస్తే వాటిని అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు పెత్తనం చేస్తున్నారట. సదురు సంతోష్ రావు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భక్తుడు. ఈ సంతోష్ రావు చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కుతున్నాయి. హిందూపురం తోపుదుర్తి గ్రామంలో విశ్వేశ్వర రెడ్డి సోదరుడు బ్రహ్మానంద రెడ్డి విద్యుత్ కాంట్రాక్టర్. దీంతో విశ్వేశ్వర రెడ్డి అండతో.. సంతోష్ రావు సహకారంతో సదురు బ్రహ్మానంద రెడ్డికే పనులు దక్కుతున్నాయట. తెలుగుదేశం పార్టీకి  చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ గంగాధర నాయుడు విద్యుత్ కాంట్రాక్టులకు టెండర్లు వేయాలన్నా.. వేయనీయకుండా అడ్డుకుంటున్నారట. మళ్లీ చంద్రబాబు చెప్పిన పాముకు పాలు పోస్తే సామెతను ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తోంది. పై స్థాయిలో విశ్వేశ్వర రెడ్డిని బలోపేతం చేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో టీడీపీ వాళ్లను కాదని.. విశ్వేశ్వర రెడ్డి తమ్ముడిని బలోపేతం చేస్తున్నారు. వీళ్లు ఆర్థికంగా బలోపేతమై.. అమరావతిలో కూర్చొన్న విశ్వేశ్వర రెడ్డి చంద్రబాబకు, లోకేషుకు ఎర్త్ పెట్టడమో,  హిందూపురంలో బాలయ్య సీటుకు ఎర్త్ పెట్టడమో చేయరని గ్యారెంటీ ఏంటీ అనే చర్చ జరుగుతోంది. పాము పాలు థియరీ చెప్పడం కాదు.. పాటిస్తే ఇంకా బాగుంటుందని తెలుగుదేశం కేడర్.. లీడర్లు విసుక్కుంటూ సణుక్కుంటున్నారట.

టార్గెట్ మిథున్ రెడ్డి.. భుజం కసిరెడ్డిది!

ఎవరీ రాజ్ కసిరెడ్డి..? జగన్ దగ్గర రాజ్ కసిరెడ్డి అంత ప్రాపకం ఎలా సంపాదించారు..? పెద్దిరెడ్డి అండ్ సన్స్ కు రాజ్ కసిరెడ్డికి ఉన్న లింకులేంటీ..? జూనియర్ పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? రాజ్ కసిరెడ్డి.  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు. దీంతో జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని వైసీపీలో నెంబర్ టూగా వ్యవహరించి.. ఇప్పుడు రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి చెప్పేశారు. అంటే లిక్కర్ స్కాంను జరిగిందని నిర్ధారించారు విజయసాయి రెడ్డి. ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ప్రస్తావించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు..? అనే చర్చ జరుగుతోంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యనభ్యసించాడని వైసీపీ నేతలు చెబుతారు. ముందుగా ఐ-ప్యాక్ టీంలో ఓ సాధారణ మెంబరుగా ఉండేవారట. ఆ తర్వాత తనకున్న సామాజిక వర్గం నేపథ్యం చూపించారో.. లేక తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారో కానీ.. రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారని వైసీపీ వర్గాలే చెబుతాయి. అదీ ఎంతగా అంటే.. పార్టీలో చాలా కాలం ఐటీ వింగ్ లో పని చేసిన వారికి కూడా ఇవ్వని ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి కట్టబెట్టేటంతగా ఎదిగిపోయారు రాజ్ కసిరెడ్డి.  అయితే ఐటీ సలహలకంటే.. రాజ్ కసిరెడ్డి సంపద సృష్టి సలహలే ఎక్కువ ఇచ్చినట్టున్నారు.. ఎక్సైజ్ శాఖ నుంచి ఎంత వరకు పిండొచ్చు.. ఎన్నిరకాలుగా పిండొచ్చు.. ఏయే దారుల్లో పిండొచ్చనే కథా కమామిషు మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారానే జరిగిదని టాక్. డబ్బులు పిండుకోవడం.. ఆ డబ్బులను మళ్లించడం.. ఆ డబ్బులను అనుకున్న గమ్యస్థానానికి చేర్చడం వంటి పనులను తూచా తప్పకుండా చేసింది అంతా రాజ్ కసిరెడ్డేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా చెప్పేశారు. అయితే రాబోయే ప్రమాదాన్ని రాజ్ కసిరెడ్డి ముందే గ్రహించాడో..  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాడో కానీ.. ఏడాదిన్నరకు ముందే వైసీపీ క్యాంప్ నుంచి రాజ్ కసిరెడ్డి సైలెంటుగా జంప్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయినా లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండడంతోపాటు.. లిక్కర్ స్కాం సూత్రధారి-పాత్రధారి కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడంతో మరోసారి రాజ్ ఎపిసోడ్ మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇదంతా ఓ ఎత్తు అయితే.. ఇప్పుడు లిక్కర్ స్కాం రాజ్ కసిరెడ్డి ఎంత వరకు దొరుకుతాడో ఏమో కానీ.. జూనియర్ పెద్దిరెడ్డి అంటే.. మిధున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు సమాచారం. ఈ మద్యం కిక్ బ్యాగ్స్ వ్యవహరంలో తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ మిధున్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్పరెన్స్ కూడా పెట్టాడు. దీంతో తన అరెస్ట్ గురించి మిధున్ రెడ్డి ముందుగానే ఊహించినట్టున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖకు మంత్రిగా నాటి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. కానీ ఆయన్ను డమ్మి చేసి ఎక్సైజ్ శాఖకు అనధికారిక మంత్రిగా చెలాయించింది పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డేనని అందరికీ తెలిసిందేనంటున్నారట. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి ప్రస్తావించడం.. అదే రోజున మిధున్ రెడ్డి స్పందించడం వంటివి చూస్తుంటే.. మిధున్ రెడ్డికి కటకటాల కష్టాలు తప్పవేమోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  ఇదే సందర్భంలో మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పని చేసిన ఓ ఉద్యోగి అప్రూవర్ గా మారినట్టు సమాచారం. ఇదే నిజమే అయితే.. అతి త్వరలో మిధున్ రెడ్డి కేంద్రంగా అతి పెద్ద డెవలప్మెంట్ జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి.. ఏం చేసిందంటే?

అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది. తాజాగా అలా జనావాసాలపై వైపు వచ్చిన ఓ చిరుత పులి.. ఓ ఇంట్లోకి దూరి ఆ ఇంటి పెంపుడు కుక్కను నోట కరుచుకుని పారిపోయింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యింది. చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంటి యజమాని ఫోన్ లో బిజీగా ఉన్నారు. చిరుత మాత్రం పిల్లిలా ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఆడుకుంటున్న కుక్క పిల్లను నోట కరుచుకుని పారిపోయింది. ఈ సంఘటన పుణెలోని భోర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జయానంద్ కాలే అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత జయానంద్ కాలే పడుకుని ఉన్న మంచం కింద ఉన్న కుక్కపిల్లను నోట కరుచుకుని ఉడాయించింది.   ఈ వీడియోపై నెటిజనులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెంపుడు కుక్కను కోల్పోయిన జయానంద్ కాలేపై సానుభూతి వ్యక్తం చేస్తూనే, అతడు అదృష్టవంతుడని కామెంట్లు పెడుతున్నారు. కుక్కపై కాకుండా అతనిపై దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల నుంచి ప్రజలకు రక్షణ కరవైందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.  

కొందరు అధికారుల తీరు.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారు!

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కూడా అన్నీ బాగా ఉన్నా కూటమి సర్కార్  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల పట్ల ఉదాశీనంగా ఎందుకు ఉంటోందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలనాయంత్రాంగంపై పట్టు కోల్పోయిందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కొందరు అధికారుల తీరు కూటమి సర్కార్ ప్రతిష్ఠ మసకబారేలా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి  అధికారులపై నియంత్రణ లేకుండా పోయిదా అన్న భవం కలిగేలా కొందరుర అధికారుల తీరు ఉంటోంది.  తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి అధికారులపై నియంత్ర లేదన్న భావన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో అధికారులు ఆయా శాఖల మంత్రులను కూడా లేక్క చేయకుండా వ్యవహరించిన ఉదంతాలపై రాష్ట వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు శాఖలని కాకుండా పీఎంవో సహా దాదాపు అన్ని శాఖల్లోనూ కొందరు అధికారుల వ్యవహార శైలి కూటమి సర్కార్ కు చెడ్డ పేరు తీసుకువచ్చేలా, ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కాంట్రాక్టర్లతో వ్యవహరించిన తీరుపై  సెక్రటేరీయేట్, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బిల్లుల బకాయిలపై మాట్లాడేందుకు తన వద్దకు వచ్చి విజ్ణప్తి చేసిన కాంట్రాక్టర్లతో పియూష్ కుమార్ దురుసుగా   కాంట్రాక్టుల్లో లాభాలు వచ్చినప్పుడు బానే తీసుకున్నారు కదా? ఇప్పుడు బిల్లుల కోసం కొంత కాలం వేచి చూడలేరా అంటూ మండిపడ్డారట.  ప్రజలకు, ప్రభుత్వానికీ వారథులుగా ఉండాల్సిన అధికారి ఇలా వారి మధ్య అగాధం సృష్టించేలా మాట్లాడటమేమిటన్న విస్మయం వ్యక్తం అవుతోంది. పియూష్ కుమార్ తీరు వల్ల ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజీ అయ్యిందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  ఈ సందర్భంగానే పీయూష్ కుమార్ గతంలో చేసిన నిర్వాకాలను కూడా గుర్తు చేసుకుంటున్నాయి.  కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలోనే  పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిపేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లకు ఎలా చెల్లింపులు జరుపుతారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేసింది పియూష్ కుమారే అని తరువాత తేలింది.  సాంకేతిక తప్పిదంగా పీయూష్ కుమార్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు సంబంధించి వేరు బి్ల్లుల హడావుడి చెల్లింపుల వెనుక కూడా పీయూష్ కుమారే ఉన్నారని తేలింది. ఇలా పియూష్ కుమార్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబార్చడం, వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పని చేస్తాన్నారా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.   ఇక సీఎంఓలోని ఒకరిద్దరు ఉన్నతాధికారుల అండతో పీయూష్ ఆర్థిక శాఖను తన ఇష్టం వచ్చిన రీతిలో నడుపుతున్నారన్న ఆరోపణలు ప్రభుత్వ వర్గాల నుంచే వస్తున్నాయి.  ఒక్క పియూష్ కుమార్ అనే కాకుండా మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ కూడా తమతమ శాఖలలో కొందరు ఉన్నతాధికారుల తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.  ఇటువంటి అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వ ప్రతిష్ట, వ్యక్తిగతంగా చంద్రబాబు ప్రతిష్ట కూడా మసకబారుతుందని తెలుగుదేశం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.