చంద్రబాబు మళ్లీ పాత తప్పే చేస్తున్నారా? పార్టీని పట్టించుకోవడంలేదా?
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ పాలనను పరుగులు తీయిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం, పరిశ్రమల స్థాపన కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. గతంలో 18 గంటలు పని చేస్తానని గతంలో చంద్రబాబు చెప్పుకునే వారు. అయితే ఇప్పుడు ఆయన స్పీడ్ చూస్తుంటే 20 గంటలు పని చేస్తున్నారా అనిపించకమానదు. అయితే 2014 నుంచి 2019 వరకూ ఆయన అప్పటికి రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి ఏడాది దేశంలోనే రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపారు. తరువాతి నాలుగేళ్లు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. పట్టిసీమ పూర్తి చేశారు. కియా వంటి అగ్ర శ్రేణి పరిశ్రమలు రాష్ట్రానికి క్యూకట్టాయి. ఐటీలో ఏపీ తెలంగాణను అధిగమించేయడం ఖాయం అన్న భావన సర్వత్రా ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత పేరు తప్ప మరేమీ మిగలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి పథంలో పరుగులెత్తించిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పార్టీని మాత్రం గెలిపించుకోలేకపోయారు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రగతిపైనే దృష్టి సారించి పార్టీనీ, కార్యకర్తలను పట్టించుకోకపోవడమేనని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.
ఇక ప్రస్తుతానికి వస్తే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు విస్పష్టంగా ఈ సారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రగతితో పాటు పార్టీని పట్టించుకుంటారనీ, పార్టీ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తానని పదే పదే చెప్పారు. తాను మారాననీ, ఆ మార్పు మీరు చూస్తారనీ అన్నారు. సరే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పోలవరం, అమరావతి నిర్మాణాలు వేగం పుంజుకుంటయనీ, రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా తరలివస్తాయన్న నమ్మకం జనంలో ఏర్పడింది. జరుగుతున్న పరిణామాలు కూడా ఆ నమ్మకం మరింత బలపడటానికి కారణమైంది.
అయితే చంద్రబాబు రాష్ట్ర ప్రగతిపైనే దృష్టి పెట్టారనీ, గతంలోలాగే పార్టీని పట్టించుకోవడం లేదనీ తెలుగుదేశం శ్రేణులలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు పూర్తి అయినా ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించకపోవడంతో గత ఐదేళ్లుగా పార్టీ కోసం జగన్ వేధింపులు, దౌర్జన్యాలు ఎదుర్కొంటూ పోరాడిన శ్రేణులు, నేతలలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా కష్టపడ్డ నేతలు, తెరవెనుక పనిచేసిన ప్రముఖులు, అలాగే కూటమి భాగస్వామ్య పక్షాల ఎన్నికల్లో పార్టీ కోసం వివిధ రూపాల్లో పనిచేసిన మాజీ అధికారులు పదవులు ఆశిస్తున్న పరిస్థితి. ఊహించని స్థాయిలో విజయం దక్కడంతో.. నేతల ఆశలు-అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం నామినేటెడ్ పదవులపై దృష్టి సారించడం లేదంటూ పార్టీ వర్గాలలో ఒకింత అసంతృప్తి మొదలైంది.
ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరం చంద్రబాబుకు ఒకింత క్లిష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పొత్తులో సీట్లు దక్కని 31 నియోజకవర్గ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ప్రత్యక్షంగా-పరోక్షంగా పనిచేసిన సీనియర్లు, మాజీ అధికారులు, వివిధ సంస్థల అధిపతులు కూడా నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ పార్టీకి సంబంధం లేకుండా, లక్ష్పీపార్ధసారధి ఒక్కరిని మాత్రమే నియమించారు. మిగిలిన అన్ని పదవులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టు, పాలకవర్గం కూడా భర్తీకాలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రేసులో ఒక మీడియా సంస్థ అధినేత సహా పలువురు ఉన్నారు. వీరిలో టీవీ5 అధిపతి బీఆర్ నాయుడు, ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాజు, బీద రవీంద్రయాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇంకా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌ల నియామకాలు చేయలేదు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు డిప్యూటీ చైర్మన్, కూన రవికుమార్‌కు చీఫ్ విప్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. అత్యంత కీలకమైన సీఎం సీపీఆర్‌ఓను కూడా ఇంకా నియమించలేదు. అదేవిధంగా ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిని ప్లానింగ్‌బోర్డు ఉపాధ్యక్ష పదవి కూడా పెండింగ్ లోనే ఉంది. ఏది ఏమైనా నామినేటెడ్ పదవుల భర్తీలో ఇంకెంత మాత్రం జాప్యం తగదన్న భావనకు చంద్రబాబు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో సర్వ విధాలుగా నాశనమైపోయిన రంగాలు, వ్యవస్థలను గాడిలో పెట్టే పనిపై ఈ రెండు నెలలూ దృష్టి కేంద్రీకరించి పని చేసిన చంద్రబాబు.. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టారని పార్టీ నేతలు అంటున్నారు. పొలిట్ బ్యూరో సమావేశంలో నామినేటెడ్ పదవులపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనీ, నియామకాలు కూడా వెంటనే చేపడతారని చెబుతున్నారు.