బదిలీతో సరి.. అంతేనా?

చట్టం ముందు అంతా సమానమే, కానీ కొందరు కొంచెం ఎక్కువ సమానం.  ఇది ఎప్పటినుంచో  జనం అంటున్న మాట. అనుకుంటున్న మాట. అవును  రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతల  దృష్టిలో చట్టం ముందు అంతా సమానం,.కానీ, రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు, వ్యవస్థల దృష్టిలో కాదు. ఇప్పడు, ఆ వ్యవస్థల జాబితాలో, న్యాయ వ్యవస్థ కూడా చేరిందా అంటే, ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మ,అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తల, ఉదంతం కాదన లేని సాక్ష్యంగా నిలిచిందని అంటున్నారు. అలాగే, న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే అభిప్రాయానికి, జస్టిస్ యశ్వంత్‌వర్మ ఉదంతం మరింత బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు. అయితే, ఈ ఉదంతంతో సంబంధం లేకుండానే,అనేకమంది ప్రముఖులు న్యాయవ్యవస్థ విశ్వసనీయత విషయంలో చట్ట పరిధిలోనే సందేహాలు వ్యక్త పరిచారు.  అందుకే న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే ఆవేదన, న్యాయవ్యవస్థ లోపలి నుంచే వ్యక్తమవుతోంది. అవును  ఎవరో కాదు  భారత మాజీ ప్రధాన మూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ, ఇటీవల (మార్చి 23) చెన్నైలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం సన్న గిల్లుతోందని  అన్నారు. ప్రజల మనసుల్లో నాటుకు పోయిన ఈ భావనను గుర్తించి, పరిష్కారం చూప వలసిన అవసరం ఉందని అన్నారు.  జస్టిస్ ఎన్వీ రమణ ఈ వాఖ్యలు ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి చేసి ఉండకపోవచ్చును, కానీ ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికార నివాసంలో, ప్రమాద వశాత్తు బయటపడిన  నోట్ల కట్టల ఉదంతంతో కలిపి చూస్తే  జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్య  మరింతగా అలోచింప చేస్తోంది. నిజానికి ఇప్పుడే కాదు  గతంలోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగు చూసిన సందర్భాలు లేక పోలేదు. అందుకే  రోజురోజుకూ  న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతూ సమూలంగా తుడిచి పెట్టుకు పోయే ప్రమాద దిశగా సాగుతోందనే   ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.   నిజానికి  ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి నివాసంలో దొరికినట్లు చెపుతున్న నోట్ల కట్టల ఉదంతం కంటే, ఇందుకు సంబంధించి, సర్వోన్నత న్యాయస్థానం సహా, ఇతరత్రా వినవస్తున్న వ్యాఖ్యలు, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం మరింత సన్నగిల్లేలా చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  ముఖ్యంగా  అసలు ఏమి జరిగింది  అనే విషయంలో స్పష్టత లేక పోవడం మొదలు, ఒక న్యాయమూర్తి నివాసంలో అనుమానస్పద నగదు బయట పడిన తర్వాత ఆరేడు రోజుల పాటు ఎటు నుంచి ఎలాంటి  స్పందన లేక పోవడం సహజంగానే పలు అనుమానాలకు ఆస్కారం కల్పించేలా ఉందని అంటున్నారు. అలాగే  న్యాయమూర్తి బదిలీతో’ కేసును క్లోజ్ చేస్తారా? అన్న సందేహాలు వ్యక్త మయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో  న్యాయం జరగడమే కాదు  జరిగినట్లు కనిపించాలి  అనే సహజ సహజ న్యాయ సూత్రం మరుగున పడిపోయిందని, అంటున్నారు. అందుకే  జస్టిస్ వర్మ ఉదంతం చివరకు ఎలా ముగుస్తుంది  అనేది ఆసక్తికరంగా మారింది.  అయితే సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించిన  తర్వాత  తుది ప్రకటన వెలువడనుందని ప్రకటించింది. అంటే కొలీజియం బంతిని,  ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. ఇక ఏమి జరుగుతుంది? ప్రభుత్వం ఏమి చేస్తుంది? బదిలీతో సరి అంటుందా? చూడాలి. 

వేసవి ప్రణాళిక.. చంద్రబాబు సమీక్ష

రోళ్లు పగిలే ఎండలు మార్చిలోనే జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా మే 2, 3 వారాలలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. అటువంటిది ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌ తున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం (మార్చి 24) నాడు సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని  ఆదేశించారు. వేసవి ప్రణాళిక విషయంలో చాలా పకడ్డందీగా వ్యవహరించాలన్నారు.  అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ అలర్ట్ ల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.  అలాగే అవసరమైన అన్ని ప్రాంతాలలోనూ  చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలన్నారు.   ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో  తాగునీటి, పశుగ్రాసం కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల కోసం రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు.   పాఠశాలల్లో విద్యార్థులకు ‘వాటర్‌ బెల్‌’ విధానం అమలు చేయాలన్నారు.  మునిసిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.39 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి పథకం కింద నీటి కుంటల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. సచిన్, విరాట్ కోహ్లీపై కేసు

వేలాది మంది జీవితాలలో చీకటి నింపుతున్న బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైనే కాకుండా వాటిని ప్రమోట్ చేస్తున్న సెలిబ్రిటీలపై కూడా వరుసగా కేసులు నమోదు చేస్తున్నది. ఇప్పటికే ప్రముఖ సినీనటులు ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రాణా వంటి వారిపైనే కాకుండా వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల, బుల్లి తెర నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసింది. ఆయా కేసులలో ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల, బుల్లి తెర నటులు విష్ణుప్రియ తదితరులను పోలీసులు విచారించారు.  తాజాగా 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ ఓనర్లే టార్గెట్ గా కఠినమైన సెక్షన్లు వారిపై నమోదు చేశారు. వీరిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు.  అంతే కాకుండా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండైల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ లపై కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు కేసు నమోదైంది.అర్జున్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు బెట్టింగ్ యాప్స్ ప్రమేట్ చేశారనీ, వీరిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అర్జున్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.   

మాజీ మంత్రి కాకాణిపై కేసు

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదైంది.  అక్రమంగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిపై   పోలీసులు కేసు నమోదు చేశారు.   నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని మైన్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాలో క్వార్ట్జ్‌ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి రుస్తుం మైన్స్‌ లీజు గడువు ముగిసి పోయిన తరువాత  సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారన్న ఆరోపణలున్నాయి. మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.  తాజాగా ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ4గా చేర్చడంతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో  వైసీపీ తరఫున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిని ఏ1గా,  వైసీపీ నేత వాకాటి శివారెడ్డినిఏ2గా, మరో నాయకుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డిని ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే కేసులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఇద్దరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఈ కేసులో ఏ1 నుంచి ఏ4 వరకూ అందరినీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

హైద్రాబాద్ లో పట్ట పగలు అడ్వకేట్ దారుణ హత్య 

హైద్రాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయిల్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇజ్రాయిల్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే  ఉన్న మహిళపై  ఎలక్ట్రిషన్ దస్తగిరి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. వేధింపుల గూర్చి అడ్వకేట్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో   అడ్వకేట్ ఇజ్రాయిల్ పై  దస్తగిరి కక్ష్య పెంచుకున్నాడు. అడ్వకేట్  సోమవారం విధులకు వెళుతున్న సమయంలో  మాటు వేసి  దస్తగిరి హత్యకు పాల్పడ్డాడు హత్య తర్వాత దస్తగిరి ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇజ్రాయిల్ హత్యకు నాలుగు రోజుల ముందే దస్తగిరి రెక్కీ నిర్వహించాడు. కాపు కాసి ఉదయం అడ్వకేట్ ను దుండగుడు  హత్య చేశాడు. ఘటన  తర్వాత కంచన్ బాగ్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.  ఈ ఘటన తర్వాత ఒక న్యాయవాది ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్య వ్యక్తికి రక్షణ ఏ విధంగా ఉంటుంది  అనే ప్రశ్న ఉత్పన్నమైంది. 

వసూళ్ల లో ఆమె స్టైలే వేరు- ట్రాఫిక్ పోలీసుల తీరు!

  రోడ్డుమీద ట్రాఫిక్ పోలీసు ఎవరినైనా ఆపితే ఏం చేస్తాడు? హెల్మెట్, ఆర్సీ బుక్, లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి తనిఖీ చేసి ఏది తేడాగా కనిపించినా సరే వేల రూపాయల్లో చలానా కట్టవలసిందే అంటూ పుస్తకం పెన్ను తీస్తాడు. దానికి ఎవరైనా ఎలా స్పందిస్తారు?  సార్ సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు సార్.. వదిలేయండి సార్.. ప్లీజ్.. వందో అయిదొందలో ఇస్తాను  అంటూ బ్రతిమాలుతారు! కాసేపు బ్రతిమాలిన తర్వాత వారిచ్చే సొమ్ము పుచ్చుకొని చలానా పుస్తకాన్ని తిరిగి సంచిలో పెట్టుకొని.. మరొకరి కోసం నిరీక్షిస్తాడు ట్రాఫిక్ పోలీసు!  తన నియోజకవర్గం పరిధిలో అడ్డగోలుగా అరాచకాలను సాగించడంలో మాజీ మంత్రి విడదల రజని అనుసరించిన వ్యూహం ఇంతకంటే భిన్నంగా ఎంత మాత్రమూ లేదు! అచ్చంగా ట్రాఫిక్ పోలీసుల లాగానే ఆమె భారీ మొత్తాలు జరిమానాలుగా చూపించి బెదిరిస్తూ, చిన్న మొత్తాలను గుట్టు చప్పుడు కాకుండా దండుకున్నారనేది ఆరోపణ. చిన్న మొత్తాలు అనగా ఏమిటనుకుంటున్నారో అథమపక్షం రెండు కోట్ల రూపాయలన్న మాట. విడదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన ఏడాదిలో లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ క్రషర్ యజమానులే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు తరువాత.. విడదల రజనికి రెండుకోట్లు, ఆమె మరిది గోపి, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా లకు చెరి పది లక్షల వంతున ముడుపులు సమర్పించినట్టుగా కేసు నమోదు అయింది. నమోదైన కేసు, ఆరోపణల ప్రకారం.. ఈ దందా సాగిన తీరు మాత్రం..  అచ్చంగా ట్రాఫిక్ పోలీసు వ్యవహారం లాగానే ఉన్నదని ప్రజలు నవ్వుకుంటున్నారు. అదెలాగో తెలుసుకోండి.. స్టెప్ 1 : రజని తరఫున ఆమె పీఏ రామకృష్ణ క్రషర్ యజమానుల వద్దకు వెళ్లి.. మేడం వాళ్లను కలవాలనుకుంటున్నట్టుగా చెప్పారు.  స్టెప్ 2 : వారు వెళ్లి కలిసినప్పుడు.. తన నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోవాలంటే.. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని, మిగిలిన సంగతులు పీఏతో మాట్లాడుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.  స్టెప్ 3 : వారం రోజులు కూడా గడవక ముందే అధికారి పల్లె జాషువా.. పెద్దఎత్తున సిబ్బంది మందీ మార్బలంతో క్రషర్ కు తనిఖీలకు వచ్చారు. క్షుణ్నంగా తనిఖీలు జరిపి వెళ్లిపోయారు. నెల తర్వాత ఫోను చేసి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు 50 కోట్ల రూపాయల జరిమానా విధిస్తామని.. అలా కాకుండా ఉండాలంటే.. వెళ్లి రజని మేడం తో వ్యవహారం సెటిల్ చేసుకోవాలని బెదిరించారు.  స్టెప్ 4 : క్రషర్ యజమానులు మళ్లీ విడదల రజని వద్దకు వెళ్లి.. అయిదు కోట్ల రూపాయలు ఇచ్చుకోలేం అని.. బతిమాలి రెండుకోట్లకు బేరం కుదుర్చుకున్నారు.  స్టెప్ 5 : రజని సూచన మేరకు పురుషోత్తమపట్నంలోని ఆమె మరిది గోపికి వద్దకు రెండు కోట్లరూపాయలు అందజేశారు. అలాగే ఆ గోపికి పది లక్షలు, అధికారి పల్లెజాషువాకు కూడా పది లక్షలు ముట్టజెప్పారు.  ..చూశారుగా.. జరిమానా వేస్తే వేలల్లో పడిపోతుందని బెదిరించి వందల రూపాయల ముడుపులు స్వీకరించే ట్రాఫిక్ పోలీసు వ్యవహారంలాగానే.. యాభై కోట్ల జరిమానా పడుతుందని బెదిరించి.. రెండు కోట్లు ముడుపుల కింద స్వీకరించడం.. విడదల రజని స్టయిల్ ఆఫ్ రాజకీయం అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

పాపం రియా చక్రవర్తి.. అయిదేళ్లు వేదనకి ఊరటేది?

ఆరోపణలతో కుంగిపోయింది.. అవమానాల్ని మౌనంగా భరించింది.. చేయని తప్పుకి జైలుకెళ్లింది.. దాదాపు ఐదేళ్ల పాటు సహనం కోల్పోకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇన్నేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడింది. బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. మొత్తానికి రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సుశాంత్ సూసైడ్‌కి, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. సుశాంత్  కేసుకు సంబంధించిన క్లోజర్ రిపోర్ట్‌‌లను సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉందన్న వాదనల్ని సీబీఐ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సుశాంత్ మరణంతో ఎలాంటి ప్రమేయం లేకపోయినా.. సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలతో.. రియా చక్రవర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చేయని తప్పుకు ఆమె 27 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా  రియా, ఆమె కుటుంబ సభ్యులు మౌనంగా భరించారు. కానీ.. సుశాంత్ మరణం తర్వాత వారిపై జరిగిన ప్రచారం, నిరాధార ఆరోపణలతో ఇంతకాలం వారెంతో కుంగిపోయారు. ఇప్పుడు రియాకు క్లీన్ చిట్ రావడంపై బాలీవుడ్ యాక్టర్స్ రియాక్ట్ అవుతున్నారు. అప్పట్లో రియాను, ఆమె కుటుంబాన్ని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసినందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 2020 జూన్ 14న సుశాంత్ విగతజీవిగా కనిపించారు. అతని మరణవార్త బయటకు తెలిశాక కొందరు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సోషల్ మీడియాలో విద్వేష ప్రకటనలు చేశారు. ఇప్పుడు సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేదాకా  సుశాంత్ మరణానికి ఆవిడే కారణం అనుకున్న వాళ్లెందరో ఉన్నారు. ఇంత జరిగినా.. రియా కుటుంబం మౌనంగానే ఉంది. తమతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నా సహనంతోనే ఉన్నారు. అయితే, ఆ కుటుంబం ఇంతకాలం పడిన మానసిక వేదనకు.. ఇప్పుడు విముక్తి దొరికినట్లేనా? అనే ప్రశ్న తలెత్తితే.. ఎక్కడా సరైన సమాధానం దొరకట్లేదు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో మీడియా వేధింపులకు రియా, ఆమె ఫ్యామిలీ అనుభవించిన క్షోభని మాటల్లో చెప్పలేం. నిరాధార ఆరోపణలతో ప్రసారం చేసిన కథనాలు వాళ్లను వెంటాడుతూనే ఉంటాయ్. సుదీర్ఘ విచారణ తర్వాత సుశాంత్ మరణంతో ఆమెకు సంబంధం లేదని తేలాక వాళ్లకు కొంత ఊరట మాత్రం దక్కింది. కానీ.. దీనితోనే సమాజం వేసిన ముద్ర తొలగిపోతుందా? వారికి అంటుకున్న ఆరోపణల మరకలు తుడిచిపెట్టుకుపోతాయా? అనేదే.. అసలు ప్రశ్న. సుశాంత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత.. రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, డ్రగ్స్ సప్లై, మనీ లాండరింగ్ లాంటి ఆరోపణలతో.. ఆమెతీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థల విచారణని కూడా ఆమె ఎదుర్కొంది. తన సోదరుడితో పాటు రియా కూడా జైలు శిక్ష అనుభవించింది. సుదీర్ఘ కాలంలో ఇలాంటి పరిణామాల తర్వాత సీబీఐ నుంచి క్లీన్ చిట్ దొరకడం, రియాకు  నిజంగా ఓ విడుదలలా అనిపించొచ్చు. ముంబై స్పెషల్ కోర్టులో సీబీఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్టులో, రియాకు ఎలాంటి నేరం ఆపాదించలేదు. దీంతో, ఆమెపై ఉన్న చట్టపరమైన ఒత్తిడి దాదాపుగా తొలగిందనే చెప్పాలి. చట్టపరంగా కొంతవరకు ఆమెకు ఇది ఊరట కలిగించినా.. ఐదేళ్లుగా మీడియా ట్రయల్, సోషల్ మీడియాలో విమర్శలు, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడుల వల్ల.. రియా ఎదుర్కొన్న మానసిక వేదనని పూర్తిస్థాయిలో తొలగించదనే చెప్పాలి. రియా విషయంలో.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజీలు.. ఆమెని నేరస్తురాలిగా చిత్రీకరించడం, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయడం లాంటివి విస్తృతంగా జరిగాయ్. ఈ పరిస్థితుల్లో.. ఆమె కెరీర్ దెబ్బతినడమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్లీన్ చిట్ ద్వారా.. ఆమెకు న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. సమాజంలో ఆమెపట్ల ఏర్పడిన అభిప్రాయాలు, ఆమె కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు.. రాత్రికి రాత్రే మారిపోయే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే.. రియా తప్పు చేయకపోయినా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ క్లీన్‌ చిట్‌తో చట్టపరంగా కొంత విముక్తి దొరికినా.. ఆమె మానసికంగా పూర్తిగా కోలుకునేందుకు, సమాజంలో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. ఆమె మళ్లీ ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఇదొక మంచి అవకాశమే అయినప్పటికీ.. రియా అనుభవించిన వేదన, గతం తాలూకు గాయాలు అంత ఈజీగా మానిపోవు.

 తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా

హైద్రాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి వచ్చే మే 1తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్డ్ విడుదల చేసింది.  ఈ నెల 28 నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ  నోటిఫికేషన్తో మొదలవుతుంది. వచ్చే  నెల 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న మజ్లిస్ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఏప్రిల్ నాలుగో తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  అదే నెల ఏడో తేదీన నామినేషన్ల స్కూట్ని ఉంటుంది. ఏప్రిల్ 9 వతేదీ వరకు   నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.  ఏఫ్రిల్ 23న పోలింగ్ , 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.   

విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు!?

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మంతా లెక్కల్లో చూపనిదిగా తేలింది.  లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో   అగ్నిప్రమాదం సంభవిం చడంతో ఈ నోట్ల కట్టల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకుకుంది. ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది.   దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి న్యాయపరమైన ఎటువంటి బాధ్యతలూ అప్పగించరాదని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ వెంటనే   ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను సైతం తొలగించారు. అలాగే నోట్ల కట్టల విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను నియమించింది.    

స్వామి స్వరూపానంద భూ కబ్జాపై నోటీసులు

జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అందులో బాగంగానే జగన్ కు రాజగురువుగా గుర్తింపు పొందిన స్వరూపానందకు నోటీసులు జారీ అయ్యాయి. స్వరూపానంద స్వామికి చెందిన   ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల   ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా తేల్చిన అధికారులు ఆ స్థలంలో నిర్మించిన కట్టడాలను తొలగిం చాలని నోటీసులు జారీ చేశారు.   తొలుత చినముషిడి వాడలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. జగన్ హయాంలో ఈ కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. దీంతో దాదాపు 15 వందల గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. నోటీసులు జారీ చేసినప్పటికీ స్వరాపానంద విశాఖలో అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడీ నిర్మాణాలు తొలగిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

తమ్మినేని డిగ్రీ చదువుకున్నారా? కొన్నారా? తేల్చనున్న ప్రభుత్వ విచారణ

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. రాజకీయ ప్రవేశానికి కానీ, పదవులకు కానీ చదువు అనేది ఒక అర్హత కానే కాదు. పంచాయతీ  బోర్డు సభ్యడి నుంచి ప్రధాని పదవి వరకూ దేనికీ ఎటువంటి విద్యార్హతా అక్కర్లేదు.  ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు ఆదరించి గెలిపిస్తే ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఇలా ఏదైనా కావచ్చు. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు. డిగ్రీలు అక్కరలేదు. అయినా   రాజకీయ నాయకుల విద్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉన్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న  అరవింద్ కేజ్రివాల్  చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.   అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ..ఇంకా కొందరు ముఖ్య నేతలకు సంబందించిన  విద్యార్హతల విషయంలోనూ విషయంలోనూ వివాదాలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  తమ్మినేని  సీతారం పేరు ఈ జాబితాలో ఉంది.  ఆయన   డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది.  సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే  స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అప్పట్లోనే అంగీకరించేశారు. అంగీకరించడమంటే నేను డిగ్రీ చదువుకోలేదు.. డిగ్రీ కొనుక్కున్నాను స్వయంగా తనంతట తాను చెప్పడం కాదు.  ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన దాఖలు చేసిన నామినేషన్ సందర్భంగా సమర్పించిన  అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు? అన్న చర్చ అప్పట్లో గట్టిగా జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో దీనిని పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తమ్మినేని విద్యార్హతలపై ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.  దీంతో తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదా? కాదా అన్నది ఈ విచారణ తేల్చనున్నది. తమ్మినేని స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్న నేపథ్యంలో ఆయన డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడిది? ఎలా వచ్చింది? డిగ్రీ చేయకుండా లా ఎలా చదివారు ఇత్యాది విషయాలన్నీ దర్యాప్తులో తేలనున్నాయి. 

హైదరాబాద్ లో   బాలివుడ్ నటిపై అత్యాచార యత్నం..  పరారీలో నిందితులు

హైద్రాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది.  మాసాబ్ ట్యాంక్ శ్యామలా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో చోటు చేసుకున్నఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓ షాప్ ఓపెనింగ్ కోసం సదరు బాలివుడ్ నటిని  నిర్వాహకులు ఆహ్వానించారు. ప్లైట్ చార్జిలు, రెమ్యునరేషన్ మాట్లాడుకున్న నటి బస చేయడానికి అపార్ట్ మెంట్ లోని ఓ గదిని కేటాయించారు. అపార్ట్ మెంట్ కు  శుక్రవారం (మార్చి 21) రాత్రి గుర్తు తెలియని యువకులు  వచ్చారు. వారి వెంట ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు యువకులతో  వ్యభిచారం చేయమని  ఆ మహిళలు ఒత్తిడి తెచ్చారు. నటి ప్రతిఘటించినప్పటికీ యువకులు కాళ్లు , చేతులు తాళ్లతో కట్టేసి అత్యాచారయత్నం చేశారు. దీంతో నటి పెద్దగా అరవడంతో యువకులు నటి దగ్గర ఉన్న 50 వేల నగదు తీసుకుని పారిపోయారు. ఈ   వర్దమాన నటి  పలుబాలివుడ్ చిత్రాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తుంది . అపార్ట్ మెంట్ నుంచి ఎలాగో అలా బయటపడ్డ నటి 100 కు డయల్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చిక్కుల్లో మాజీ స్పీకర్ తమ్మినేని 

ఎపి మాజీ సభాపతి తమ్మినేని సీతారాం చిక్కుల్లో చిక్కుక్కున్నారు. తాజాగా  ఆయన చుట్టూ నకిలీ డిగ్రీసర్టిఫికేట్  వివాదం చుట్టుకుంది. టిడిపి ఎమ్మెల్యే  కూనరవికుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి విచారణ చేయనుంది. తమ్మినేని మొదట్నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో మాజీ సభాపతి  తప్పుడు ధ్రృవపత్రం సమర్పించినట్లు  కూనరవికుమార్ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, సిఐడిలకు వేర్వురుగా ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. తమ్మినేనిపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.  కూనరవికుమార్ ఫిర్యాదును సిఐడి స్వీకరించింది. తమ్మినేనికి నోటీసులు జారి చేయనుంది. తమ్మినేనిపై వచ్చిన ఆరోపణలపై  గత వైకాపా ప్రభుత్వం  ఉదాసీనంగా వ్యవహరించింది. 

ఢీ.. లిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాల భయాలేంటి?!

ఆలు లేదు చూలు లేదు .. కొడుకు పేరు సోము లింగం అన్నట్లు, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం పై, ఏడు రాష్ట్రాలకు చెందిన 14 పార్టీల నాయకులు చెన్నై లో సమావేసమయ్యారు. అయితే, దాహం వేసినప్పడు బావిని తవ్వడం కంటే, రేపటి అవసరాన్ని ముందుగానే గుర్తించి, ముందుగానే పలుగు పార ఎత్తడం విజ్ఞత అనిపించుకుంటుంది. సో.. నియోజక వర్గాల పునర్విభజన ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, అడుగు ముందు కేయడం తప్పేమీ కాదు. అయితే, ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఇటూ అటూ కూడా ఆచి తూచి అడుగులు వేయడం అవసరం.  నిజానికి డిలిమిటేషన్ కు సంబందించి కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో  ఎవరికీ తెలియదు. ఇందుకు సంబందించి, దక్షిణాది రాష్ట్రాల్లో  ‘ఒక్క’ సీటు కూడా తగ్గదు అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చేసిన ప్రకటన తప్ప  కేంద్రం నోటి నుంచి మరొక్క మాట బయటకు రాలేదు. అసలు కేంద్రం మనసులో ఏముందో  తెలియక  పోవడమే కాదు.. ఇటు  నుంచి  మరో పాతికేళ్ళు, లోక్ సభ స్థానాల సంఖ్య విషయంలో  యథాతథ స్థితిని కొనసాగించాలనే ప్రతిపాదన తప్ప మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏదీ పస్పుటంగా బయటకు రాలేదు. అదొకటి అయితే అసలు డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభానికే ఇంకా చాలా సమయం వుంది. అంతకు ముందు జనగణన జరగాలి. జనగణనతో ముడి పడిన కుల గణన కుంపటి ఒకటి అలా  రగులుతూనే వుంది. ఈ అన్నిటినీ మించి మరో పాతికేళ్ళ పాటు, పునర్విభజన జోలికి వెళ్లరాదని, 2001 వాజపేయి ప్రభుత్వం విధించిన గడవు 2026లో గానీ ముగియదు. ఆ గడువు ముగిసన తర్వాతనే పునర్విభజన గురించి ఆలోచన చేస్తామని, అంతవరకు పునర్విభజన జరిపేది లేదని గతంలోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్ కు స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా లోక్’సభ.శాసన సభ సీట్ల సంఖ్యను పెంచాలని, బీఆర్ఎస్ నోటి మాటగానే కాదు లిఖిత పుర్వకంగానూ సమాధానం ఇచ్చింది.  అయితే  జనాభా దామాషా ప్రాతిపదికన లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  లేవనెత్తిన ఆందోళన  దక్షణాది రాష్ట్రాలను ఏకం చేసింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్టాల ఐక్య వేదిక పురుడు పోసుకుంది. ఐక్య వేదిక తొలి సమావేశం ఆదివారం(మార్చి 22) చెన్నైలో  జరిగింది.  తమిళ నాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకే స్టాలిన్  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. అలాగే  కేరళ ముఖ్యమంత్రి  విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగంత్ మాన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ తోపాటుగా మరికొందరు ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటం సాగించాలని తీర్మానం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి ‘‘జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం. ఉత్తరాది మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించి వేస్తుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ వంటి రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయి అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదని,  దీనికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతే కాదు,  పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసన సభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అప్పుడు చర్చిద్దామని ప్రతిపాదించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, దక్షిణాదిలోని ప్రతి ఒక్కరూ హక్కుల రక్షణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఒక విధంగా చూస్తే, తమిళనాడు సిఎం  స్టాలిన్ లేవనెత్తిన అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చంక నెత్తు కున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి  డీకే శివకుమార్ కూడా సభకు హజరైనా, రేవంత్ రెడ్డి కొంచెం ఎక్కువ చురుగ్గా వ్యవహరించడం.. తదుపరి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించడం విషయంలో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక మవుతున్నాయి, అలాగే  ఈ విష యం లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే పడవలో ప్రయాణించడం పట్ల కూడా  అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

జగన్, కేసీఆర్ పై సోము విమర్శల వర్షం.. కారణం అదేనా?

కూటమి పార్టీలలో ఎవరికీ ఇష్టం లేకపోయినా.. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధిష్ఠానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిపోయారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏపీ నేతలు ఎవరూ కూడా అధిష్ఠానం నుంచి సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఆఘ‘మేఘా’లపై వస్తుందని ఊహించలేదు. చివరి నిముషంలో కమలం సోము వీర్రాజు పేరు ప్రతిపాదించి, అంతే వేగంగా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ఆమోదముద్ర వేయించుకుని తెలంగాణ నుంచి ఓ విమానంలో సోము పేరు మీద బీఫాంను, హస్తిన నుంచి మరో విమానంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని అమరావతిలో ల్యాండ్ చేసింది. అలా చివరి నిముషాలలో సోము వీర్రాజు చేత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన వేయించింది. అది పక్కన పెడితే.. ఎవరి వాడూ కాకుండానే ఏపీలో ఎమ్మెల్సీ అయిపోయిన వీర్రాజు ఇప్పుడు కూటమి పార్టీల్లో అందరి వాడు అనిపించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు.  అసలు 2024 ఎన్నికలకు ముందు పొత్తును గట్టిగా వ్యతిరేకించిన బీజేపీ నేత ఎవరైనా ఉన్నారంటే అది సోము వీర్రాజు మాత్రమే. పైకి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే లక్ష్యమంటూ కబుర్లు చెప్పినా, తెలుగుదేశంతో బీజేపీ, జనసేనలు జట్టు కట్టకుంటే జగన్ కు ప్రయోజం చేకూరుతుందన్న ఉద్దేంతోనే సోము వీర్రాజు గతం మరిచిన గజనీలా వైసీపీ అధినేత సోము జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా  జగన్ విషయంలో సోముకు ఇంకా సాఫ్ట్ కార్నర్ పోలేదనే పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఆయన జగన్, కేసీఆర్ లపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో జగన్ వి ద్వంద్వ ప్రమాణాలన్నారు. మరో సారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటున్నారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదని జోస్యం చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ పై మాత్రం తీవ్ర స్థాయిలో విరుకుకుపడ్డారు. కేసీఆర్ ను గుంటనక్కతో పోల్చారు. కేసీఆర్ మానసిక సమతుల్యం కోల్పోయారనీ, ఆయనకు రాత్రిళ్లు నిద్రపోలేరరనీ, వింత వింత రాజకీయ వ్యాఖ్లు చేస్తున్నారనీ సోము విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి పదేళ్ల పాటు అధికారం చెలాయించారనీ, ఆయన నిజస్వరూపం తెలిసిన తరువాత జనం ఛీకొట్టారనీ సోము అన్నారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం పని చేస్తోందన్నారు.. అదే సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు పెరిగితే చాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద సోము వీర్రాజు అనూహ్యంగా కేసీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి మరీ విమర్శలు గుప్పించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పొత్తులే కారణమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సోము వీర్రాజు ఈ విమర్శలు చేశారని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకూ జగన్ కు గట్టి మద్దతుదారైన సోము వీర్రాజు ఏకకాలంలో జగన్ ను ఆయన మిత్రుడు కేసీఆర్ ను విమర్శించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మనిషిగా ముద్రపడిన వీర్రాజు ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.   

ఎంఎంటిఎస్ లో  అత్యాచారయత్నం..రన్నింగ్ ట్రైన్  నుంచి దూకిన బాధితురాలు

సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.  సికింద్రాబాద్ నుంచి మేడ్చెల్ వెళ్లే ఎంఎంటిఎస్ రైలులో  యువతిపై గుర్తుతెలియని యువకుడు అత్యాచారయత్నం చేయబోయాడు. తప్పించుకునేందుకు ఆ యువతి భోగిలో  నుంచే దూకేసింది. దీంతో ఆ యువతి తీవ్ర రక్త స్రావంతో గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆ యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చేసుకుంది. ఆ యువతిని కాపాడే నాథుడే లేకపోవడంతో కొంపల్లి స్టేషన్  సమీపంలో దూకేసింది. మేడ్చెల్ లో ప్రయివేటు హాస్టల్ లో ఉండే ఈ యువతి మొబైల్ ఫోన్  రిపేర్ చేసుకోవడానికి సికింద్రాబాద్ చేరుకుంది. రిపేర్ అయ్యాక తిరుగు పయనమైంది. ఒక్కో స్టేషన్ లో ప్రయాణికులు దిగిపోయారు. మహిళా భోగిలో ఒంటరిగా ఉన్న యువతికి కీడు శంకించింది. ఇంతలో  గుర్తు తెలియని  యువకుడు అల్వాల్ లో  ఎక్కాడు. ఎవరూ లేకపోవడంతో అత్యాచార యత్నం చేయబోయాడు. యువతి గట్టిగా కేకలు వేసినప్పటికీ రక్షించే వారు కరువయ్యారు. నడుస్తున్నభోగినుంచి ప్రమాదం అని తెలిసినప్పటికీ మానాన్ని కాపాడుకోవడానికి ఒక్కసారిగా బోగిలో నుంచి దూకేసింది. రైల్వేట్రాక్ పై పడిపోయి తీవ్ర రక్త స్రావమయ్యింది. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని తాను మాత్రమే గుర్తుపట్టగలనని బాధితురాలుపోలీసులకు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనతో ఎంఎంటిఎస్ మహిళలకు ఎంతవరకు సేఫ్ అనే  ప్రశ్న ఉత్పన్నమైంది. నిత్యం వేలాది మహిళలు ఎంఎంటిఎస్ ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు.   

వైసీపీ పతనమే బీజేపీ లక్ష్యం!?

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుంటారు. భారతీయ జనతా పార్టీ నేతలను తమలపాకుతోను, తెలుగుదేశం, జనసేన పార్టీలను తలుపు చెక్కతోను పరామర్శిస్తుంటారు. బిజెపి పట్ల మెతక ధోరణితో ఉంటే మంచిదని భావిస్తుంటారు. కానీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కీలక నేత మాత్రం తమ అసలు లక్ష్యం ఏమిటో చాలా స్పష్టంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని తమ పార్టీనే శాసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని ఖాళీ చేయడం, ఆ పార్టీ ఓటు బ్యాంకును 20 శాతానికి తగ్గించడం లక్ష్యాలని.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తోంది. పురందేశ్వరికి ముందు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడుగా పనిచేసిన సోము వీర్రాజు, అప్పట్లో దూకుడుగా మాట్లాడగల కమలం నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే తమ పార్టీ బలంగా తయారు కావడానికి ఒంటరిగా రాష్ట్రవ్యాప్తంగా పోటీచేయడం బెటర్ అని నమ్మిన వాళ్లలో ఆయన ఒకరు. తెలుగుదేశంతో జట్టు కట్టిన తర్వాత, ఎన్నికల పర్వంలో ముక్తసరిగా వ్యవహరించారు. కానీ, ఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్సీ అవకాశాలు దక్కినప్పుడు అనూహ్యంగా ఆయన పదవి దక్కించుకున్నారు. ఇప్పుడిక కమలదళంలో కీలక నేతగా తమ పార్టీ లక్ష్యాలు ఏమిటో ఘాటుగానే వివరిస్తున్నారు.  విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీని ఖాళీ చేసేయడమేనని, ఆ పార్టీకి రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు కూడా లేకుండా చేస్తాం అని సోము వీర్రాజు ప్రకటించారు. అసెంబ్లీకి గైర్హాజరవుతున్న జగన్ తీరును ఆయన రెండునాల్కల ధోరణిగా సోము వీర్రాజుఎద్దేవా చేయడం విశేషం. 2014 లో ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి జగన్ రాలేదని, ఇప్పుడు హోదా కావాలనే సాకుతో మళ్లీ ఎగ్గొట్టారని.. ఇది విడ్డూరంగా ఉన్నదని ఆయన గేలి చేస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలతో విరుచుకుపడడం కమలదళంలో సోము వీర్రాజుతో ఆగడం లేదు. జగన్ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంత నాశనం రాష్ట్రానికి చేశారని, ఎందుకూ పనికి రాని భూములను సెంటు స్థలం పేరుతో పేదలకు పంచి వారిని వంచించారని విష్ణుకుమార్ రాజు ఆరోపిస్తున్నారు.  మొత్తానికి రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నది.  వైసీపీని ఖాళీ చేయడం అనేది కూటమి లక్ష్యం అని సోము ప్రకటించినప్పటికీ.. బిజెపి ఆ ఎజెండాతో ఉన్నదని అర్థం అవుతోంది. ఆ నడుమ విశాఖ వైసీపీ నేత అడారి ఆనంద్ బిజెపిలోనే చేరారు. విజయసాయిరెడ్డి కూడా బిజెపిలో చేరుతారనే  వదంతులున్నాయి. ముందు ముందు ఇంకా పలువురు వైసీపీ నేతలకు బిజెపి ఎర వేస్తున్నదేమోనని సోము మాటలను బట్టి పలువురు అనుకుంటున్నారు.