తెలంగాణ రాజకీయాలు.. ఈ భేటీల ఆంతర్యమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రతిపక్షం అనేదే లేని సభలో.. ఉన్న ఒకే ఒక్క ప్రత్యర్థి పార్టీ కూడా హాజరు కాకపోవడంతో సభ సాఫీగా సాగుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ పై చర్చ, వివిధ బిల్లుల ఆమోదం వంటి వన్నీ ఏ ఆటంకాలూ, అవాంతరాలు, అభ్యంతరాలూ లేకుండా జరిగిపోయాయి. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడిగా వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ వేడెక్కుతోంది.  అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలో కొన్ని భేటీలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. వాటిలో ప్రధానంగా కాంగ్రెస్ భహిష్కృత ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్పఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఒకటి. అక్కడ ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. అలాగే మరో మాజీ మంత్రి హరీష్ రావుతో కూడా ముచ్చటించారు. ఆయన వారితో ఏం మాట్లాడారు. ఏ విషయంపై చర్చించారు అన్నది పక్కన పెడితే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వెళ్లి కేటీఆర్, హరీష్ రావులతో చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ భేటీలపై చర్చ కొనసాగుతుండగానే మంగళవారం (మార్చి 18) తెలంగాణ అసెంబ్లీలో మరో సంచలన భేటీ జరిగింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. వీరిరువురూ కలిసి ఫొటోలకు పోజులిచచ్చారు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశం నుంచి కేటీఆర్ బయటకు వెడుతుండగా.. జానా రెడ్డి ప్రవేశిస్తున్న సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జానా కారు చూడగానే కేటీఆర్ హాయ్ అంకుల్ అంటూ పలకరించి ఆయన వద్దకు వెళ్లారు. జానా రెడ్డి కూడా కేటీఆర్ ను ఆప్యాయంగా పలకరించారు. ఈ  సందర్భంగా కేటీఆర్ జానాను హత్తుకుని ఆయన వయస్సుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వయసెక్కడ అయిపోయింది.. సెంచరీ కొట్టాలి, కొడతారు అని కేటీఆర్ అన్నారు. దీనికి జానా రెడ్డి నవ్వులు చిందించారు.  మొత్తం మీద తీన్మార్, జానాలతో కేటీఆర్ భేటీలు తెలంగాణ రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.

ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయ్!

తెలంగాణ ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయా? అంటే  అవుననే సమాధానమే వస్తోంది. అవును. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్    ఈ సంవత్సరం ఆరంభంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి  నుంచి  రాష్ట్రంలో ఆ పది స్థానాలకూ ఉప ఎన్నికలు తప్పవనే చర్చ గట్టిగా వినిపిస్తోంది.  అయితే  అదే సమయంలో పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించక పోవచ్చని  ఫిరాయింపు పేగులు మెళ్ళో వేసుకున్న ఖైరతాబాద్  బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్  నుంచి కాంగ్రెస్ టికె పై పోటీ చేసిన దానం నాగేందర్, వరగల్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన కడియం కుమార్తె  కావ్య కోసం కాంగ్రెస్ లో చేరి బహిరంగంగా  ఆమె తరపున  ప్రచారం చేసిన స్టేషన్ ఘానాపూర్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి మీద మాత్రమే అనర్హత వేటు  పడుతుందని, మిగిలిన ఎనిమిది మంది పైనా వేటు పడక పోవచ్చని భావించారు.  అయితే  సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా  సుప్రీం కోర్టు ధర్మాసంనం చేసిన కొన్ని వ్యాఖ్యలు  ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రటించే విషయంలో స్పీకర్ నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని స్పీకర్ తరపు న్యాయవాది  ముకుల్  రోహిత్  ను ప్రశ్నించడమే  కాకుండా  స్పీకర్ సమాధానికి గడవు విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ , అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుతం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జరీ చేయడంతో  మొత్తం పదిమందిపై వేటు తప్పదని భావించారు.  అందుకే  బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికలు అనివార్యం అనే నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికలకు  రె..ఢీ అంటున్నారు. ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ఉప ఎన్నికలు వస్తున్నాయని ప్రకటించారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా పోరుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులను ఆదేశించారు.  అలాగే  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటి కప్పుడు, ఎక్కడంటే అక్కడ  దమ్ముంటే  పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కాంగ్రెస్ టికెట్  పై గెలిపించుకోవాలని సవాలు విసురుతున్నారు.  మరో వంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాజసభ సభ్యుడు కే.లక్ష్మణ్  ఇతర నేతలు ఉప ఎన్నికలు అనివార్యమని, ఎప్పటికప్పుడు జోస్యం చెపుతున్నారు. గెలుపు   ధీమా వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఉపాద్యాయ,పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కమల దళం నేతలు ఉప ఎన్నికలలో విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. బండి సంజయ్ అయితే పదింట ఏడు మావే’ అని ధీమా వ్యక్త పరిచారు. అలాగే  తెలంగాణ రాజకీయ పరిణామాలను ప్రత్యేక శ్రద్ధతో  గమనిస్తున్న  బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పది నియోజక వర్గాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక  బృందాలను సిద్దం చేసిందని   పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఇదంతా ఒకెత్తు అయితే  అనేక కోణాల్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలలో సత్తా చాటుకోవడం ద్వారా పార్టీ అంతర్గత  బహిర్గత ప్రత్యర్ధులకు సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఎంపిక చేసిన కొందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే  ఎటూ అనర్హతవేటు వేటు తప్పదని నిర్ణయానికి వచ్చిన   మాజీ మంత్రి కడియం శ్రీహరి ని ఓపెనింగ్ బాట్స్మెన్  గా  బరిలో దించుతున్నారని అంటున్నారు.    అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉరమని ఉరుములా  ఆదివారం( మార్చి 16)  స్టేషన్ ఘనపూర్  నియోజకవర్గం పై వరాలను కుంభవృష్టిగా  కురిపించారని అంటున్నారు. స్టేషన్ ఘనపూర్ లో ప్రజాపాలన – ప్రగతి బాట  పేరిట  నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి  రేపో మాపో వచ్చే ఎన్నికల కోసం ఈ సభ ఏర్పాటు చేయలేదని  అనడం ద్వారా  ఉప ఎన్నిక  వస్తోందనే సంకేతం ఇవ్వకనే ఇచ్చారని అంటున్నారు. ఇంచుమించుగా 50 వేల మందితో    నిర్వహించిన  భారీ బహిరంగ సభ ఎన్నికల సభను తలపింప చేసిందని అంటున్నారు. అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ఒకటైతే, ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  ఓ వంక  ఖాజాన నిండుకుందని అంటూనే ఒకే ఒక్క నియోజక వర్గానికి  రూ. 800 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు వర్చువల్ గా ఒకే వేదిక నుంచి శంకుస్థాపనలు చేశారు. మరో వంక ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మరో కోర్కెల చిట్టాను ముఖ్యమంత్రి, ముందు పెట్టారు. అంటే  మొత్తంగా చూస్తే ఓ వెయ్యి కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నవ్వుతూ తల  ఊపడం ఉప ఎన్నికల వస్తున్నాయి అనేందుకు మరో స్పష్ట మైన సంకేతం అంటున్నారు. అలాగే గతంలో హుజురా బాద్  మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా  కేసీఆర్ అమలు చేసిన వ్యూహాన్నే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఉద్యకాలం నుంచి కేసీఆర్ ఉప ఎన్నికలను పబ్లిక్ పల్స్ తెలుసుకునేదుకు ఒక పరీక్షగా , ప్రత్యర్ధులకు చెక్  పెట్టే  ఒక అస్త్రంగా ఉపయోగిస్తూ వచ్చారు. ఇప్పడు రేవంత్ రెడ్డి కూడా అదే  ఆలోచనతో ముందుకు పోతున్నారని అంటున్నారు.   అయితే  కడిం శ్రీహరి రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నిక వస్తుందా  అంటే అనుమానమే అంటున్నారు. రాజీనామా చేసిన తర్వాత, ఎన్నికల సంఘం వేకెన్సీ  నోటిఫై చేసిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది.  ఈ లోగా  పార్టీ ఫిరాయించిన మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు అటో ఇటో తేలిపోయినా తేలిపోవచ్చును. అప్పడు,మొత్తం పది స్థానలకు ఒకేసారి ఎన్నికలు వచ్చినా రావచ్చును  అంటున్నారు. అదో ఇదో ఏది జరిగినా ఉప  ఎన్నికకు రంగం అయితే సిద్దమవుతోంది. ఎప్పుడు ఎన్ని స్థానాలకు అనేదే తెలియాల్సి ఉందంటున్నారు. 

ఒక రోజు కస్టడీలో పోసాని

వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. గుంటూరుజైలులో రిమాండ్ లో ఉన్న పోసానిని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిని సిఐడిపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. వైకాపా హాయంలో పోసాని కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఓబులాపురం పోలీసులు పోసానిని హైద్రాబాద్ నివాసంలో అరెస్ట్ చేసి రాజంపేట జెలుకు రిమాండ్ చేశారు. పోసానికి బెయిల్ వచ్చినప్పటికీ సిఐడి పోలీసులు పీటీ వారెంట్ పై అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు రిమాండ్ చేశారు. కోర్టు అనుమతితో సిఐడిపోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ప్రస్తుతం పోసానిని విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగనుంది.   

హస్తిన వేదికగా బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ.. ఎందుకుంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు ఫిదా అయిన పారిశ్రామిక వేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా బిల్ గేట్స్ తో చంద్రబాబు అనుబంధం కొనసాగుతూనే ఉంది. తొలి సారి బిల్ గేట్స్ తో భేటీకి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినప్పుడు గేట్స్ అయిష్టంగానే అంగీకారం తెలిపారు. అయితే ఆ తొలి భేటీలోనే చంద్రబాబు విజనరీ బిల్ గేట్స్ ను ఆకట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా గేట్స్ పలు సందర్భాలలో చెప్పారు. ఇటీవల విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు బిల్ గేట్స్ తో దావోస్ లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్  కీలక రంగాలలో సహకారం అందించేందుకు అంగీకారం కుదిరింది. ఆ సందర్భంగా చంద్రబాబు పట్ల తనకు ఉన్న అభిమానాన్నిబిల్ గేట్స్ ఒక అపురూప బహుమతితో చాటారు. ఔను బిల్ గేట్స్ చంద్రబాబుకు  తాను కాలేజీని వీడిన తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేయడం నుంచి, తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్ ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు.  బిల్ గేట్స్ ఇచ్చిన ఆ ఆపరూప కానుక నవ్యాంధ్ర పురోగతికి తాను చేసే కృషికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చంద్రబాబు ఆ సందర్భంగా చెప్పారు. అటువంటి అనుబంధం ఉన్న గేట్స్, చంద్రబాబు మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీకి ఢిల్లీ వేదిక కానుంది.  చంద్రబాబు మంగళవారం (మార్చి 18) సాయంత్రం హస్తిన పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పుర్యటనలో భాగంగా  చంద్రబాబు కేంద్ర మంత్రి, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరౌతారు. ఆ తరువాత కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అదే విధంగా ప్రధాని మోడీని కలిసి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అలాగే బుధవారం (మార్చి 19) మధ్యాహ్నం బిల్ గేట్స్ తో సమావేశమౌతారు. ఈ సమావేశంలో  విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య సహకార ఒప్పందం చేసుకుంటారు. ఈ కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీ సర్కార్ కు సహకారం అందించే విషయంపై దావోస్ లో భేటీలో అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే.  అనంతరం అదే రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు హస్తిన నుంచి అమరావతికి తిరిగి వస్తారు. ఆ మరునాడు  అంటే గురువారం (మార్చి20) అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెడతారు. శుక్రవారం (మార్చి 21) తిరుమలేశుని దర్శించుకుంటారు.  

ఎన్టీఆర్ జిల్లాలో హైటెన్షన్.. వైసీపీ టిడిపి మధ్య ఘర్షణ

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్   సెంటర్ లో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు చెప్పులు,  రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయి. ఒక ఎస్ ఐ, నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.  గత అర్ధరాత్రి చినతిరునాళ్ల మహోత్సవంలో గొడవ జరిగింది. పసుపు కుంకుమ మావెంటే తీసుకెళతామని ఇరువర్గాలు గొడవ పడ్డాయి. దక్షిణ భారతంలో అతి ఎత్తయిన ప్రభగా  గుర్తింపు పొందిన ఈ ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రభ ముందు డప్పు వాయిద్యాలు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలను భక్తులను విశేషంగా ఆకర్షించాయి.  రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేశారు.  రంగు రంగుల విద్యుత్ దీపాల  ఆలంకరణతో ఇనుప ప్రభపై  ఉత్సవ విగ్రహాలను ఉరేగించారు.  గ్రామానికి చెందిన ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఇదే సమయంలో  ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.   

విశాఖ వైసీపీకి బిగ్ షాక్ .. 9 మంది కార్పోరేటర్లు టీడీపీ తీర్థం

ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేసి టిడిపి, జనసేన  తీర్థం పుచ్చుకుంటున్నారు.  కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో గెలిచిన  వైసీపీ ప్రజా ప్రతినిధులు  కూటమి వైపు మొగ్గు చూపారు. తాజాగా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన 12 మంది కార్పోరేటర్లు వైసీపీ ని వీడితే తాజాగా 9 మంది కార్పోరేటర్లు టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. చల్లా రజని, గేదెల లావణ్య, సునీత,  బూపతి రాజు సుజాత, ముర్రు వాణితో బాటు  మరో నలుగురు కార్పోరేటర్లు దేశం గూటికి చేరడానికి అమరావతి చేరుకున్నట్లు సమాచారం. 

బెయిలు కోసం కోర్టుకు మిథున్ రెడ్డి.. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు భయం!

వైసీపీ హయాంలో అడ్డగోలు దోపిడీకి, దౌర్జన్యాలకూ తెగబడిన ఒక్కో నేత ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా  చేరారు.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అయిన  రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెైస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఆయనా పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్టిన కేసులతో తనకు ఇసుమంతైనా సంబంధం లేదన్న మిథున్ రెడ్డి లోక్ సభ సభ్యుడినైన తనకు  రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.  ప్రభుత్వం మాత్రం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని విధాన నిర్ణయాలలో ఆయన జోక్యం ఉందని కేసులో పేర్కొంది. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనతో మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం విక్రమాయలు చేసింది. అలాగే   ప్రసిద్ధ మద్యం బ్రాండ్ల కంటే స్థానిక మద్యం బ్రాండ్లనే ప్రోత్సహించింది.  వైసీపీ హయాంలో  జరిగిన మద్యం కుంభకోణంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి  మూడు నెలల్లోగా నివేదిక సమర్పించి దోషులను అరెస్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన అనేక డిస్టిలరీలు నాసి రకం మద్యాన్ని సరఫరా చేశాయనీ, ఆ మద్యాన్నే   ప్రభుత్వం  అధిక ధరలకు విక్రయించిందనీ తేలింది. ఈ డిస్టిలరీలు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉన్నాయని తేలింది.  ఈ విషయాన్ని  ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్  వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే  మిథున్ రెడ్డి  యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు  ఆ పిటిషన్ విచారణ కోర్టులో జరగాల్సి ఉంది.  

విజయశాంతికి నో కేబినెట్ బెర్త్?.. కొండా సురేఖ వ్యాఖ్యల అర్ధం అదేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు మార్లు రేవంత్ కేబినెట్ విస్తరణకు ఇదిగో, అదిగో అంటూ పలు ఊహాగాన సభలు జరిగాయి. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత రేవంత్ కేబినెట్ లో బెర్త్ ఖాయం అంటూ ఇప్పటి దాకా వినిపించని పేరు ఒకటి తెరమీదకు వచ్చింది. రేవంత్ సర్కార్ కొలువుదీరి 15 నెలలు అయినప్పటికీ.. ఇప్పటి దాకా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పడ లేదు. కీలకమైన శాఖలకు మంత్రి లేని పరిస్థితి ఉంది.  ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో ఆయనతో కలిసి 12 మంది ఉన్నారు. మరో ఏడు స్థానాలు భర్తీ చేసుకునే అవకాశం రేవంత్ కు ఉంది. అయినా అధిష్ఠానం పచ్చ జెండా ఊపకపోవడంతో ఆయన ఉన్న వారితోనే బండి లాగించేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కేబినెట్ విస్తరణ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా అధిష్ఠానం ఆశీస్సులతో అనూహ్యంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి కేబినెట్ బెర్త్ కన్ ఫర్మ్ అన్న చర్చ కూడా జోరందుకుంది. కేబినెట్ బెర్త్ వార్తలపై విజయశాంతి కూడా స్పందించారు. అంతా అధిష్ఠానం నిర్ణయం అని చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయవర్గాలలో విజయశాంతికి రేవంత్ కేబినెట్ లో కీలక పదవి ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సరిగ్గా ఈ తరుణంలో మంత్రి కొండా సురేఖ మంత్రివర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.   మీడియా చిట్ చాట్ లో  కొండా సురేఖ మంత్రివర్గ విస్తరణకు ఇంకా సమయం ఉందన్నారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదన్నారు. ఒక వేళ ఉన్నా.. కౌన్సిల్ నుంచి ఎవరికైనా అవకాశం దక్కే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  ఆమె పరోక్షంగా విజయశాంతికి కేబినెట్ బెర్త్ ఉండదని చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు

చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను  వైసీపీ అధికార ప్రతినిధి, నటి, యాంకర్ శ్యామలపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. శ్యామలతో పాటుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న ఆరోపణలపై  పలువురు బుల్లి తెర నటులు, యూట్యూబర్లపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   కలర్ ప్రిడక్షన్, నంబర్ ప్రిడక్షన్, క్రికెట్.. ఇలా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారన్న ఫిర్యాదుపై పంజగుట్ట పోలీసులు వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల, హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి,టేస్టీ తేజ , అజయ్ కిరణ్ గౌడ్, అజయ్ సన్నీ యాదవ్, సుదీర్ రాజు బయ్యాలపై కేసు నమోదు చేశారు. వీరిపై గేమింగ్ చట్టంలోని సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.  

సెకండ్ల వ్యవధిలో గుండె ఘోష కనిపెట్టేసే యాప్!.. 14 ఏళ్ల బుడతడి అద్భుత సృష్టి

గుండె ఘోష తెలియాలంటే..ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఆ స్మర్ట్ ఫోన్ లో  తాను ఆవిష్కరించిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సెకండ్ల వ్యవధిలో గుండెకు సంబంధించిన అన్ని రుగ్మతలనూ ఇట్టే తెలుసుకోవచ్చునంటున్నాడు ఈ 14 ఏళ్ల బుడతడు. అనడమే కాదు.. స్వయంగా స్మార్ట్ ఫోన్ ద్వారా గుండె పరీక్షలు నిర్వహించి ఔరా అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 14 ఏళ్ల సిద్ధార్థ్ నంద్యాల గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గత మూడు రోజులుగా దాదాపు వెయ్యి మందికి హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో గుండె సంబంధిత రుగ్మతలు ఉన్నాయని తేలిన వారందరికీ ఈసీసీ, 2డి ఎకో వంటి పరీక్షలు నిర్వహించి గుండె జబ్బు ఉందని వైద్యలు నిర్ధారించారు. దీంతో  సిద్ధార్థ్ నంద్యాల ఆవిష్కరించిన యాప్ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.    ఈ తరుణంలో సిద్ధార్థ నంద్యాల ఆవిష్కరించిన యాప్ వైద్య సేవల విషయంలో ఒక విప్లవానికి నాంది పలికినట్లేనని అంటున్నారు  వైద్య నిపుణులు.  పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట ఈ 14 సంవత్సరాల బుడతడికి అతికినట్లు సరిపోతుంది. సందేహం లేదు.. ఈ బుడతడి మేధస్సు, సాధించిన విజయాలు, ఆవిష్కరించిన అద్భుతం ప్రపంచానికే దిక్సూచిగా మారబోతున్నది. ఆధునిక సాంకేతికతను గుప్పిట పట్టిన ఈ చిన్నారి తాజాగా సాధించిన అద్భుతం వైద్య సేవలలో అత్యంత కీలకంగా మాపోనున్నది. ఇంతకీ ఈ చిచ్చరపిడుగు ఏం చేశాడనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం..   సాంకేతిక పరిజ్ణానాన్ని అందిపుచ్చుకుని గుండె చప్పుడు వినడానికి ఒక అత్యధునిక అప్లికేషన్ తయారు చేశాడు  ఈ అపర మేధావి పేరు సిద్ధార్థ్.. భారత సంతతికి చెందిన సిద్ధార్థ పుట్టింది అనంతపురంలో అక్కడ నుంచి అతగాడి కుటుంబం హైదరాబాద్ కు అటు నంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది.  సిద్ధార్థ నంద్యాల తండ్రి మహేష్ అమెరికాలో వ్యాపార వేత్త. ఈయన కుటుంబం 2010లోనే అమెరికాలో స్థిరపడింది. ఇక సిద్ధార్థ  యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధార్థ ఒక యాప్ ను ఆవిష్కరించాడు. సిర్కాడియావి అనే ఈ యాప్ 93 శాతం యాక్యురెసీతో గుండె చప్పుడును బట్టి గుండె జబ్బులను నిర్ధారిస్తుంది. అమెరికాలో దాదాపు 15 వేల  మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా వారిలో 3500 మందికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తేలింది. ఈ యాప్ సాయంతో ఇప్పుడు గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు 500 మందికి  సిద్ధార్ధ్ ఆవిష్కరించిన యాప్ సాయంతో  స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో పది మందికి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తేలింది. ఆ పది మందినీ వార్డుకు తరలించి ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయగా, వారికి గుండె జబ్బు ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఈ స్క్రీనింగ్ టెస్టులను తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్మర్ట్ ఫోన్ తో సిద్ధార్ధ స్వయంగా చేయడం విశేషం.  ఇటీవల డల్లాస్ లో సిద్ధార్థ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిశారు. ఆయనకు తన సృజనను వివరించి తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా గుండె జబ్బులను గుర్తించవచ్చనీ, అది కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా ఏడు సెకన్లలో నిర్ధారించవచ్చని డిమాన్ స్ట్రేట్ చేసి వివరించారు. దీంతో ఇంప్రెస్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ సిద్ధార్థ్ ను భారత్ కు ఆహ్వానించారు. దీంతో సిద్ధార్థ్ గుంటూరులోని జీజీహెచ్ లో తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్క్రీనింగ్ పరిక్షలు నిర్వహించారు. ఆ యాప్ కచ్చిత్వానికి వైద్యులు సైతం అబ్బురపడ్డారు.  ఇంతకీ ఈ యాప్ ఎలా పని చేస్తుందంటే... స్మార్ట్ ఫోన్ లో సిద్ధార్థ ఆవిష్కరించిన సిర్కాడియావీ యాప్ ను ఇన్ స్టాల్ చేస్తే చాలు. ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఈ యాప్ ను ఛాతిపై ఉంచితే  హార్ట్ బీట్ ను రికార్డ్ చేస్తుంది. సదరు వ్యక్తిగా గుండె సంబంధిత రుగ్మత ఏదైనా ఉంటే బీప్ సౌండ్ వస్తుంది. రెడ్ లైట్ వెలిగి.. అబ్ నార్మల్ హార్ట్ బీట్ అనే అక్షరాలు ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తాయి. సిద్ధార్థ తన యాప్ ద్వారా గుంటూరు జీజీహెచ్ లో చేసిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు యాక్యురేట్ గా ఉన్నాయి.  ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన సర్టిఫైడ్ ఏఐటెకీగా రికార్డు సృష్టించిన సిద్ధార్థ్ తన ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  కలిసి వివరించి ఆయన అభినందనలు అందుకున్నారు.   

దటీజ్ పిఠాపురం వర్మ!

పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జి ఎస్పీఎస్ఎస్ వర్మ  చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో.. వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు.  గత ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్పీఎస్ఎస్ వర్మకు అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇప్పటికి రెండు సార్లు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అయినా వర్మలో ఎక్కడా అసంతృప్తి కానీ, అసహనం కానీ కనిపించలేదు.  మరో వైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జనసేన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కొంత కాలం కిందట పిఠాపురంలో పర్యటించిన జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఒక అడుగు ముందుకు వేసి  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పిఠాపురం జనసేన ఇన్ చార్జ్ కి మాత్రమే రిపోర్ట్ చేయాలి కానీ వర్మకు కాదన్నది ఆ ఆదేశాల సారాంశం.   ఇక తాజాగా పిఠాపురం వర్మకు తెలుగుదేశం ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించడం వెనుక ఉన్నది స్వయంగా జనసేనానే అని అంటున్నారు.  పిఠాపురంలో ఎమ్మెల్సీ వర్మ మరొక అధికార కేంద్రంగా మారతారన్న భయంతోనే.. పవన్ కల్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి వర్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకుండా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అక్కడితో ఆగకుండా.. తాజాగా జనసేన 12వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా జరిగిన సభలో వర్మ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావిం చకుండానే.. మెగా బ్రదర్ నాగబాబు ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి   విజయానికి  పవన్ కళ్యాణ్, జనసేన క్యాడర్,  పిఠాపురం ప్రజలు మాత్రమే కారణం.. అలాకాకుండా  పవన్ కళ్యాణ్ తమ వల్లే గెలిచారని ఎవరైనా ఊహించుకుంటే, అది వారి కర్మ” అని  చేసిన వ్యాఖ్యల తరువాత కూడా వర్మ సంయమనాన్ని పాటిస్తూ, తన సహచరులను, పార్టీ క్యాడర్ ను కూడా పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అననీయకుండా నియంత్రిస్తున్నారు. తాజాగా మంగళవారం (మార్చి 17) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఒక పోస్టర్ లో కూడా చంద్రబాబునాయుడి పక్కన పవన్ కల్యాణ్ పొటోను ఉంచారు.  ఈ పోస్టర్ ను చూసిన వారంతా దటీజ్ వర్మ అంటూ ప్రశంసిస్తున్నారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎంత క్రమశిక్షణతో ఉంటారో వర్మ తన ప్రవర్తన ద్వారా రుజువు చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  

కెటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ

బిఆర్ ఎస్ కార్యనిర్వాహణాధ్యక్షుడు కెటీఆర్ తో  కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్ కుమార్ )  అసెంబ్లీలో  భేటీ అయ్యారు. తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్  నేతను కలవడం చర్చనీయాంశమైంది. బిసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బిఆర్ఎస్ నేతలైన కెటీఆర్ , హరీష్ రావులను కోరారు. మల్లన్న వెంట బిసీ నేతలు కూడా ఉన్నారు. తాము చేపట్టబోయే ధర్నాకు సంఘీభావం తెలపాలని  బిఆర్ఎస్ నేతలను మల్లన్న కోరారు.   పార్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఆరోపణలపై ఈ నెల ఒకటో తేదీన తీన్మార్ మల్లన్నను  కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. . గత నెలలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారి చేసి వివరణ ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ మల్లన్న సమాధానం ఇవ్వకపోవడంతో  కాంగ్రెస్ పార్టీ సస్పెండ్  చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ అవినీతి అక్రమాలను ప్రశ్నించి కాంగ్రెస్ కు  ఆయన దగ్గరయ్యారు. అనూహ్యంగా ఎంఎల్ సి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై  మల్లన్న ఆరోపణలు చేయడం గమనార్హం.   

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ.. పొట్టి శ్రీరాములు రైల్వే టెర్మినల్!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం పేరు మార్చనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీలు, సంస్థలు ఒకే పేరుపై ఉండటం వల్ల పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయనీ, అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణ కు సంబంధించిన పేర్లే పట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ చెప్పారు. ఇందుకు సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ  చట్ట సరవణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో మంగళవారం (మార్చి 17) ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై  జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నట్లు చెప్పారు.  ఇక చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతామని, ఇందు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని చెప్పారు.  ఇక బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెడతామని చెప్పారు. తెలుగువర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకించింది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్చకుండా.. ఉస్మానియా యూనివర్సిటీకి  సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టాలని ప్రతిపాదించారు అనంత‌రం తెలుగు వ‌ర్శిటి పేరు మార్పు చేసే బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది.

తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫార్సులపై తిరుమలేశుని దర్శనం

తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసులపై తిరుమలేశుని దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలపై శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనుంది.ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను ఆది, సోమవారాలలో మాత్రమే స్వీకరిస్తుంది. ఆ లేఖలపై శ్రీవారి దర్శనాన్ని సోమ మంగళవారాలలో కల్పిస్తుంది. అలాగే రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించిన సిఫారసు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే టీటీడీ స్వీకరిస్తుంది. ఇక  ఒక ప్రజా ప్రతినిధికి ఒక సిఫారసు లేఖ మాత్రమే ఇవ్వాలనీ, అదీ ఒక లేఖపై ఆరుగురికి మించకుండా ఉండాలని టీటీడీ పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు,  భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణన‌లోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకుల పల్లి గ్రామ మాజీ ఎంపీటీసీమోహన్ రెడ్డి, మాజీ  సర్పంచ్ పవిత్రాదేవి దంపతుల  కుమార్తె ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్, కుమార్తె అత్త సునీతలు ఈ ప్రమాదంలో మరణించారు. ప్రగతి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడు గాయపడ్డారు.  భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సంఘటనాస్థలంలోనే ప్రగతి రెడ్డి, హర్వీన్, సునీతా మరణించారు. కారు, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.   కాగా అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గరు మృత్యువాత పడటం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో  గాయపడిన రోహిత్ రెడ్డి, ఆయన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థుల అరెస్టు

ఓయూలో ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై  విద్యార్థి లోకం భగ్గు మంది. విద్యార్థుల స్వేచ్ఛను కాలరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళ‌న‌ల‌ను నిషేదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉత్త‌ర్వుల‌ను నిర‌సిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో యూనివర్సిటీలో అవాంచిత ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ హాస్టళ్లలోకి ప్రవేశించి బందుకు పిలుపునిచ్చిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ స్టూడెంట్ లీడర్లను పోలీసులు యూనివర్సిటీ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఖబర్ధార్ వీసీ అంటూ విద్యార్థుల హక్కులకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మెడలో మిర్చి దండలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్  సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ మెడలో మిర్చి దండలు వేసుకుని నిరసనకు దిగారు. వెంటనే మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలనీ, మిర్చికి   పాతివేలు గిట్టుబాటు ధర చెల్పించాలని డిమాండ్ చేశారు.   రాష్ట్రంలో గత సీజన్ లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు జరిగిందనీ, అయితే  గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ సీజన్ లో మిర్చి సాగు 2లక్షల 40 వేల ఎకరాలకు పడిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.  ప్రభుత్వం తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చికి కనీసం క్వింటాల్ కు పాతిక వేలు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు.   రాష్ట్రంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే మిర్చిని సుగంధ ద్రవ్యాల జాబితా నుంచి ఆహార ధాన్యాల జాబితాలోకి మార్చాలని కోరారు.  

ఇరాన్ లో బ్లడ్ రెయిన్ కు  కారణమిదే 

ఇరాన్ లో ఇటీవలె బ్లడ్ రెయిన్ కురిసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు.  స్వచ్చమైన నీరు రంగు రుచి వాసన ఉండదు. ఈ మూడు లేనిదే స్వచ్చమైన నీరు అని  మనం అభివర్ణిస్తుంటాం.  కానీ ఇరాన్ లో బ్లడ్ రెయిన్ వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. సాధారణంగా వర్షపు నీరు స్వచ్చంగా ఉంటుంది.  కానీ ఇరాన్ లోని రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షం నీరు ఎర్రటి రంగులో ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త  టాప్ టెన్ లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధించారు. ఇరాన్ రెయిన్ బో ఐ ల్యాండ్ లో  కురిసిన వర్షానికి ఎలాంటి రంగులేదని పరిశోధకులు తేల్చేశారు. ప్రపంచంలోని ఏడో వింత అని వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. తాజాగా రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షాన్నిఅక్కడి జనం ఎంజాయ్ చేశారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ప్రపంచనలుమూలల నుంచి అక్కడికి చేరుకున్నారు. బ్లడ్ రెయిన్ వార్త తెలుసుకుని ఇరాన్ బీచ్ లో ప్రత్యక్ష మయ్యారు. ఇరాన్ లో రెయిన్ బో ఐల్యాండ్ లో  ఆకాశం నుంచి వర్షపు నీరు పడి జలపాతంలా క్రిందకు దూకడంతో అద్భుతమైన దృశ్యం పలువురిని ఆకర్షించింది. రెయిన్ బో ఐ ల్యాండ్ లో అగ్ని పర్వతం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పర్వతం బద్దలు కావడంతో ఆ ప్రాంతమంతా ఐరన్  ఆక్సైట్  కంటెంట్ తో నిండిపోయింది. వర్షం పడినప్పుడు చిలుముతో నిండిన ఐరన్ మీద వర్షపునీరు పడటంతో అది ఎర్రగా మారిపోయి ప్రవహించింది.  ఎర్రటి రంగులో ఈ నీరు ప్రవహించడంతో బ్లడ్ రెయిన్ అనే ప్రచారం జరిగింది.