చంద్రబాబు సర్కార్ కి నలుగురు గౌరవ సలహాదారులు

వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌ శ్రీధర ఫణిక్కర్‌ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్‌ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు  ఆ పదవుల్లో ఉంటారు. సుచిత్ర ఎల్ల భారత్‌ బయోటెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. భారత్‌ బయోటెక్‌తోపాటు, ఎల్ల ఫౌండేషన్‌కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారికి వ్యాక్సిన్‌ను అందించడంతో పాటు, బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికిగాను 2022లో భర్త డాక్టర్‌ కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగానూ సేవలందిస్తున్నారు. పారిశ్రామిక, సామాజిక సేవా రంగాల్లో ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా సౌండ్‌ ఇండియా బిజినెస్‌ అచీవర్స్‌ అవార్డ్, సార్క్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డ్‌ వంటి అనేక పురస్కారాలు వరించాయి. జి.సతీష్‌రెడ్డి ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త. సిస్టమ్స్‌ మేనేజర్‌. గతంలో రక్షణ మంత్రికి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు. డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా, డీడీఆర్‌డీ కార్యదర్శిగా, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిస్సైల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు. మిషన్‌శక్తి, లాంగ్‌రేంజ్‌ గైడెడ్‌ బాంబ్, క్షిపణి సాయంతో టార్పెడో విడుదల వ్యవస్థల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. లండన్‌లోని రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ సభ్యత్వంతోపాటు అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌ మిస్సైల్‌ సిస్టమ్స్‌ అవార్డు, ఏరోనాటికల్‌ ప్రైజ్, నేషనల్‌ సిస్టమ్స్‌ గోల్డ్‌మెడల్, నేషనల్‌ డిజైన్‌ అవార్డ్, హోమీబాబా గోల్డ్‌మెడల్‌ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం రక్షణశాఖ సలహాదారుగా ఉన్నారు. డాక్టర్‌ కేపీసీ గాంధీ ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్త. గతంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల ఫోరెన్సిక్‌ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో చేరారు. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ లో పనిచేసి ఫోరెన్సిక్‌ దర్యాప్తులో నైపుణ్యం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సంబంధించి సొంతంగా ట్రూత్‌ ల్యాబ్స్‌ను స్థాపించారు. ప్రస్తుతం దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పేస్‌ టెక్నాలజీ రంగ గౌరవ సలహాదారుగా నియమితులైన శ్రీధర్‌ ఫణిక్కర్‌ సోమనాథ్‌కు ఈ రంగంలో 40 ఏళ్ల విశేష అనుభవముంది. 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకు ముందు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌కు కార్యదర్శిగా పనిచేశారు. స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.  

చిరుకి యూకే లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ పురస్కారం

సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసి అందరివాడుగా నిలిచిన మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కీర్తికిరీటంల మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మ విభూషన్ పురస్కారాలు అందుకున్న చిరంజీవి తాజాగా బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో  ప్రజాప్రతినిథులు, ప్రముఖుల సమక్షంలో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు. బ్రిటన్ అధికార  లేబర్ పార్టీ ఎంపి నయెందు మిశ్రా ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమంలో  రాజకీయ సినీ రంగాలలో చిరంజీవి సేవలకు గుర్తింపుగా యూకే గుర్తింపుగా యుకె పార్లమెంట్  లైఫ్ టైం అఛీవ్ మెంట్ పురస్కారం అందజేసింది. యూకే పార్లమెంటు నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు చిరంజీవే కావడం గమనార్హం.   ప్రతిష్ఠాత్మకమైన యూకే పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కు శుభాకాంక్షలు అందజేస్తూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక అన్నయ్య కంటే తండ్రి సమానుడిగా ఆయన్ను గౌరవిస్తానని, జీవితంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు దిక్సూచిగా నిలిచిన మార్గదర్శి చిరంజీవి అని గుర్తు చేసుకున్నారు.  3 నంది, 9 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా లక్షలాది మందికి రక్త, నేత్ర దానాలు చేయించిన చిరు సేవలను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.  

బాబు దార్శనికతకు బిల్ గేట్స్ ఫిదా.. సీబీఎన్ తో భేటీ అద్భుతం అంటూ ట్వీట్

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు బుధవారం (మార్చి 19) ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో  భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పావుగంట పాటు జరిగిన ఈ భేటీ తరువాత చంద్రబాబు ఎక్స్ వేదిగా ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఈ భేటీ అత్యంత కీలకం అంటూ పేర్కొన్నారు. ఈ భేటీ  రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ భేటీ ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు.  కాగా చంద్రబాబుతో భేటీపై బిల్ గేట్స్ కూడా స్పందించారు. చంద్రబా దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ గురించి బుధవారం ఆ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. బిల్ గేట్స్ తో తాను సమావేశం అయ్యానని.. ఏపీ ప్రగతిలో కీలకం కానున్న ఈ బేటీ తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబుతో భేటీ అద్భుతంగా సాగిందంటూ బిల్ గేట్స్ గురువారం (మార్చి 20)  సందించారు.  ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తమ ఫౌండేషన్ కీలక ఒప్పందంపై సంతకం చేసిందన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించుకుని పురోభివృద్ధి సాధించే లక్ష్యంతో సాగుతున్న ఏపీకి తమ ఫౌండేషన్ ద్వారా సంపూర్ణ సహకారం అందించనున్నామనీ, ఒప్పందంలో భాగంగా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించామని బిల్ గేట్స్ పేర్కొన్నారు.   వాస్తవానికి బిల్ గేట్స్, చంద్రబాబుల స్నేహ బంధం 1995లో మొదలై సాగుతూనే ఉంది.  నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం హోదాలో చంద్రబాబు… అతికష్టం మీద గేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించారు. వారి తొలి భేటీ ఢిల్లీలోనే జరిగింది. ఓ రాజకీయ నేతగా ఉండి టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో వినియోగించే దిశగా మాట్లాడుతున్న చంద్రబాబును బిల్ గేట్స్ మెస్మరైజ్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు విజ్ణప్తి మేరకు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అది మొదలు పలు దిగ్గజ సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి.   ఇటీవలే దావోస్ లో కలిసిన సందర్బంగా ఏపీకి సాయం చేయాలంటూ బాబు కోరితే… రెండు నెలలు తిరక్కుండానే గేట్స్ రంగంలోకి దిగారు, కీలక ఒప్పందాలు కుదిరాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో గేట్స్ ఫౌండేషన్ ఏపీ సర్కార్ కు సహకారం కార్యరూపం దాల్చింది. 

హౌస్ అరెస్ట్ ప్లీజ్.. బతిమాలుకుంటున్న వైసిపి నేతలు!

వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం  అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఏకపక్షంగా  మీరు ఉద్యమాలు చేయండి, పోరాడండి అని ఆదేశాలు మాత్రం జారీ చేస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకే  వైసీపీ నాయకులు పోలీసులలో తమకు పరిచయం ఉన్న వారికి ఫోన్ చేసి పార్టీ పిలుపు ఇచ్చిన రోజులలో తమన హౌస్ అరెస్ట్ చేయాల్సిందిగా వేడుకుంటున్నారు! హౌస్ అరెస్టు అయిపోతే ఇక వేరే ఇబ్బందులు ఉండవని, బయటకు వెళ్లే పనిలేదని అనవసరపు ఖర్చు తప్పించుకోవచ్చు అని వారు భావిస్తున్నారు. వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి రకరకాల ఆందోళనలకు పిలుపు ఇస్తూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ట్విటర్ నుంచి కదలకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులంతా  రోడ్లెక్కి పోరాటాలు  చేయాలని పిలుపు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి, ఆస్తులు అమ్ముకున్న నాయకులు.. పార్టీ చెప్పే పోరాటాల పేరిట ప్రతిసారీ డబ్బుల ఖర్చుకు వెనుకాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో చేస్తానన్నా తరువాత ఆ పర్యటనల గురించి పట్టించుకోకవపోవడానికి ఇది కూడా ఒక కారణం అని, ఖర్చు పెట్టడానికి స్థానిక నేతలెవ్వరూ సిద్ధంగా లేరని ఒక ప్రచారం ఉంది.  కాగా.. తాజాగా విశాఖపట్టణంలోని క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు తొలగించినందుకు వైసీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఎప్పుడో ఏర్పాటు అయిన స్టేడియంకు ఉన్న పేరుకు ముందు జగన్ హయాంలో  వైఎసఆర్ పేరును ముందు జోడించారు. ఆ స్టేడియం విషయంలో ఆయన పాత్ర, ప్రమేయం ఏమీ లేనందున కూటమి ప్రభుత్వం ఆ పేరును తొలగించింది.  వైఎస్సార్ పేరు చూస్తే కూటమి ప్రభుత్వం భయపడుతున్నదంటూ వైసీపీ నేతలు కొందరు నానా యాగీ చేశారు. ఈలోగా విశాఖలో స్టేడియం వద్ద ధర్నా చేయాలని పిలుపు ఇచ్చారు.  అసలే విశాఖ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానని జగన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఒక్క సీటులో కూడా పార్టీని గెలిపించని నగరం అది. అలాంటిచోట పార్టీ పిలుపు ఇచ్చే ఆందోళనకు జనాన్ని పోగేయడం అంటే.. నాయకులకు తలకు మించిన భారమే. ఆర్థికంగా చిలుము వదిలిపోతుందని వారి భయం. అందుకే.. పోలీసులను ఆశ్రయించి లోపాయికారీగా తమను హౌస్ అరెస్టులు చేయాల్సిందిగా బతిమాలు కున్నట్టుగా తెలుస్తోంది.  పోలీసుల్ని బతిమాలి హౌస్ అరెస్టులు చేయించుకోవడం వైసీపీ నేతలకు ఇవాళ కొత్త కాదు. గతంలోనూ తిరుపతిలో నివాసం ఉండే ఓ వైసీపీ ఎంపీ.. తమ సొంత నియోజకవర్గంలో ఘర్షణల నేపథ్యంలో పర్యటనకు వస్తానని ప్రకటించి, వెళ్లే ధైర్యం లేక, తానుగా పోలీసులకు ఫోనుచేసి హస్ అరెస్టు చేయాల్సిందిగా వేడుకుని.. ఇల్లు కదలకుండా కూర్చున్నట్టుగా అక్కడ గుసగుసలు ఉన్నాయి.  

మాజీ  ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఎసిబి నోటీసులు 

ఎపి  ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వైకాపా  హయాంలో ఆయన జగన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు దోచి పెట్టారు. వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారన్న  ఆరోపణలు ఉన్నాయి.2019 నుంచి 24 మధ్య సాక్షి పత్రికకు 371 కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో విజయ్ కుమార్ రెడ్డి దోచి పెట్టారు. ఐఅండ్ పిఆర్ లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నిబంధనలకు విరుద్దంగా నియమించారు.  సాక్షి మీడియాలో పని చేస్తున్న సిబ్బందికే ప్రాధాన్యత ఇచ్చారు. మిగతా పత్రికలు, చానళ్లకు ప్రకటనలు ఇవ్వకుండా పక్ష పాత వైఖరి అవలంబించారని ఎసిబి ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆయా సంస్థలకు   బిల్లుల చెల్లింపుల్లో కూడా  వివక్షత కనబరచారని విచారణలో తేలింది.  2019లో ఆయన నియామకమైనప్పుడు కేవలం రెండేళ్లవరకే ఈ పదవిలో ఉండాలి.   ఈ నిబంధనను జగన్ సర్కార్ పక్కకు  పెట్టింది.  వైకాపా అధికారం కోల్పోయే వరకు ఐ అండ్ పిఆర్ కమిషనర్ గా ఆయన  కంటిన్యూ అయ్యారు. తనకు ఐఅండ్ పి ఆర్ కమిషనర్ పదవి రాగానే విజయ్ కుమార్ రెడ్డి జగన్ ఇంటికి వెళ్లి  సత్కరించి తన విధేయతను చాటుకున్నారు.  సాధారణంగా మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వాలంటే తక్కువ కొటేషన్, ఎక్కువ సర్క్యులేషన్ ప్రాతి పదికన ఇస్తారు. కానీ విజయ్ కుమార్ రెడ్డి అవేమీ పట్టించుకోలేదు . సాక్షి ఇచ్చిన టారిఫ్ ను ఎక్స్ అఫిషియో హాదాలో పెంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయనపై  ఎసిబి కేసు నమోదుచేసి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే వారం గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. నోటీసులను ఈ-మెయిల్ ద్వారా ఎసిబి పంపింది. దీనితో  పాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ అధికారులు వెళ్లారు. నోటీసులను ఇంటికి అతికించారు.   ప్రస్తుతం ఆయన కోల్‌కతాలో పని చేస్తున్నారు. విచారణకు హాజరవుతారా డుమ్మా కొడతారా తేలాల్సి ఉంది. 

దొంగ రాజకీయాలు.. దొంగచాటు సంతకాలు!

వైసీపీ చేసేవన్నీ దొంగ రాజకీయాలే. ఒక్క విషయంలో కూడా చెప్పినది చెప్పినట్లు చేసిన దాఖలాలు కనిపించవు. విపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానికి బేషరతు మద్దతు అంటూ ప్రకటించి.. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాటతో దొంగ రాజకీయాలు నెరపింది. అలాగే 2019 ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాది లోగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. భారీ ఎత్తున మద్యం ధరలు పెంచేసి, నాసిరకం మద్యం సరఫరాకు తెరతీసి జగన్ ప్రభుత్వమే దొంగ వ్యాపారం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ దొంగ రాజకీయాల గురించి లెక్కకు మించి ఉదంతాలు ఉంటాయి. తాజాగా అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో కూడా వైసీపీ అదే దొంగ రాజకీయాలు నెరపుతోంది. అసెంబ్లీ బాయ్ కాట్ అన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. సభకు హాజరు కావడం లేదు కానీ దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టేసి పారిపోతున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా అసెంబ్లీ ముఖంగా గురువారం (మార్చి 20) వెల్లడించారు.  వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం మీరెవరైనా చూశారా అంటే సభ్యులను ప్రశ్నించిన ఆయన.. సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ సభ్యులు ఇలా దొంగచాటుగా అసెంబ్లీ హాజరుపట్టీలో సంతకాలు పెట్టేసి సభకు హాజరు కాకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వారికి గౌరవం కాదని స్పీకర్ అన్నారు. సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు హాజరు కావాల్సి ఉందన్న అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి హాజరుపట్టీలో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన అలా సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఇలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెడుతున్నారని వివరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన రోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారనీ,  ఆ తరువాత వారెవరూ సభకు రాలేదనీ స్పీకర్ స్పష్టం చేశారు.  సభకు హాజరు కాకుండా హాజరుపట్టిలో దొంగచాటుగా సంతకాలు చేసినంత మాత్రాన వారు సభకు హాజరైనట్లు తాను గుర్తించడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేసి.. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించవద్దంటూ వైసీపీ సభ్యులకు హితవు చెప్పారు.  

కేసీఆర్ క్యాంపు ఆఫీసుకి టులెట్ బోర్డు

మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం (మార్చి 19) టులెట్‌ బోర్డు పెట్టారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్‌ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 15 నెలలైనా కేసీఆర్‌ ఒక్కసారి కూడా గజ్వేల్‌ వైపు చూడలేదని బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా అన్నారు. ప్రజలకు వద్దకు రాని కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ కనబడటం లేదంటూ గజ్వేల్‌, గౌరారం పోలీసుస్టేషన్లలో యూత్‌ కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైరయ్యారు. అల్లరిమూకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తాళాలు పగలుగొట్టి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాయంటూ గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ ఇరుకున పెడతారోనని వారు భయపడేవారు. కానీ నేడు దానికి భిన్నంగా అధికారపక్షమే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని కోరుతున్నా కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. ముఖ్యమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సైతం కేసీఆర్‌ అసెంబ్లీకి రావటానికి విముఖత చూపుతున్నారు. గత సంవత్సరం కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి చుట్టపుచూపుగా వచ్చి కాసేపు అసెంబ్లీలో కూర్చొని వెళ్లిపోయారు. అసెంబ్లీకి రావటం లేదు కానీ జీతభత్యాలు మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్నారు.

 పంజాగుట్ట పిఎస్ లో యాంకర్ విష్ణుప్రియ

  బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో టీవీ  యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన న్యాయవాది తో కలిసి ఉదయం పది గంటలకు  పిఎస్ కు చేరుకున్నారు  మంగళవారం సాయంత్రం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ ఆమె హాజరు కాలేదు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కాలేదని విష్ణు ప్రియ చెబుతున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో తన కో ఆర్టిస్ట్ షేకర్ భాషా పంజాగుట్ట పిఎస్ కు వచ్చి ఇదే విషయాన్ని చెప్పారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకానున్న నిందితుల్లో 11 మంది ఉన్నప్పటికీ విచారణకు హాజరైన వారిలో విష్ణు ప్రియ మొదటి స్థానంలో నిలిచింది.  షూటింగ్ కారణంగా విష్ణుప్రియ మంగళవారం  గైర్హాజరైనట్లు ఇవ్వాళ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. తన తరఫున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ల కారణంగా చాలామంది సుసైడ్ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనికి తోడు ఐపిఎస్ అధికారి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు.   ఈ యాప్స్ కు సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఆయన  సోషల్ మీడియా వేదిక ద్వారా యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా ఇందులో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు.

సలహాదారు పదవులకే వన్నె తెచ్చిన నియామకాలు.. దటీజ్ చంద్రబాబు

ఏపీలో గత వైసీపీ గత పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఐదేళ్ల జగన్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయింది. పాలన అంటే దోచుకో, దాచుకో, వ్యతిరేకులపై దౌర్జన్యాలూ, దాడులు, అరెస్టులు, అక్రమ కేసులే అన్నట్లుగా జగన్ హయం సాగింది. జగన్ హయాంలో జనం నిత్యం భయంభయంగా బతికే పరిస్థితి ఉంది. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అన్న ఆందోళన అన్ని వర్గాలలో నెలకొంది. ఐదేళ్ల పాటు జగన్ అరాచక పాలనకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం చరమగీతం పాడారు. తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. తెలుగుదేశం కూటమి కొలువుదీరి తొమ్మిది నెలలు అయ్యింది. ఈ తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో జనం స్వేచ్ఛగా ఉంటున్నారు. అక్రమ కేసుల భయం లేకుండా బతుకుతున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయగలుగుతున్నారు.  ఇక ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే విషయంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని నియమిస్తోంది. అదే జగన్ హయాంలో  సలహాదారుల నియామకం అన్నది ఒక వైసీపీ క్యాడర్ కు ఉద్యోగ కల్పన కోసమే అన్నట్లుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జగన్ హయాంలో భారీగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేవారు. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారు నియామకాలన్నీ.. అర్హత, యోగ్యతతో సంబంధం లేకుండా వైసీపీ అనుకూలురైతే చాలు అన్నట్లుగా జరిగాయి.  అయితే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుల పదవులలో నియమితులయ్యే వారంతా.. తమ సేవల ద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే వారు, చేయగలిగే వారే ఉంటున్నారు.  తాజాగా వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ అడ్వైజర్లుగా నియమించింది.  ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్,  ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ గా డీఆర్ఢీఓ మాజీ చైర్మన్   సతీశ్ రెడ్డి,  ఫోరెన్సిక్ సైన్స్ కు కేపీసీ గాంధీ, హ్యాండ్ లూమ్స్ హబ్ కు సుచిత్రా ఎల్లాలను సలహాదారులుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఈ నియామకాలే రాష్ట్ర పురోభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నాయి. ఇస్రో  మాజీ చైర్మన్ సోమనాథ్  డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డిలను సలహాదారులుగా నియమించడం ద్వారా  ద్వారా వారి అనుభవాన్ని, నైపుణ్యాన్నిరాష్ట్ర పురోభివృద్ధికి వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఇక సుచిత్రా ఎల్లా.. కరోనా కల్లోల సమయంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్. టీటీడీ బోర్డు సభ్యురాలు కూడా. ఆమెను హ్యాండ్ లూమ్స్ హబ్  సలహాదారుగా నియమించారు. అలాగే  ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా సుదీర్గ కాలం పాటు పనిచేసిన గాంధీని.. ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా నియమించారు. ఈ నియమకాలు వీరి నైపుణ్యాన్ని, ప్రతిభను ఆయా రంగాలను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా సలహాదారు పదవికే గౌరవం వచ్చిందని ప్రశంసిస్తున్నారు. 

వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల చుట్టూ ఈడీ ఉచ్చు?

ప్రముఖ యాంకర్, వైసీపీ  అధికార ప్రతినిథి శ్యామలకు ఉచ్చు బిగుస్తున్నదా? అన్న ప్రశ్నకు  ఔననే సమాధానం వస్తున్నది.   నిబంధనలకు తిలోదకాలిచ్చి, చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మందిపై   పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అలా కేసు నమోదైన వారిలో వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల కూడా ఉన్నారు.  అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ  శ్యామల కోర్టును ఆశ్రయించారు.  అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యింది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు? ఎంతెంత డబ్బు, ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది? ఎన్ని చేతులు మారింది అన్న వివరాలు కూపీలాగుతున్నట్లు తెలియవచ్చింది.  ఇక ఈ కేసులో శ్యామల భర్త పాత్ర ఉందా అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే శ్యామల ఆస్తులు, లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోందంటున్నారు. ఈడీ దూకుడు చూస్తుంటే.. ఏ క్షణమైనా శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశముందని రాజకీయ, సినీవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

సి ఎం లెక్క.. భట్టి బడ్జెట్.. ఏది నిజం?

బడ్జెట్ గురించి చర్చ వచ్చినప్పుడు,  బడ్జెట్ అంటే కేవలం అంకెల కుప్ప కాదు.  బడ్జెట్ అంటే  మన విలువలు, మన ఆశలు, ఆశయాల ప్రకటన.  అలాగే, ఒక మంచి బడ్జెట్  నాణేనికి ఒక వైపు నుంచి మాత్రమే కాదు, రెండు వైపుల నుంచీ, (బొమ్మ బొరుసు)  రెండూ చూపిస్తుంది  అంటారు బడ్జెట్ విలువ తెలిసిన పెద్దలు.  అయితే  అధికారంలో ఎవరున్నా, పార్టీలు, జెండాలు, ఎజెండాలతో సంబంధం లేకుండా, బడ్జెట్  అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం స్థిర పడి పోయింది.  విలువలు, ఆశలు, ఆశయాల ప్రకటన అయితే, గాంధీ, నెహ్ర, అంబేద్కర్ లను ఉటంకిస్తూ.. అంత ఘనంగా  ఉంటాయి కానీ  అమలు చేసే ఆలోచన మాత్రం సామాన్యంగా కనిపించదు. అలాగే,  వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ( సాహసం అనాలేమో) ఏ ఆర్ధిక  మంత్రి సహజంగా చేయరు.తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అందుకు మినహాయింపు కాదు. బుధవారం (మార్చి 19)  ఆయన  ప్రవేశ పెట్టిన   2025 – 2026 పూర్తి స్థాయి వార్షిక  బడ్జెట్ కూడా అందుకు మినహాయింపు కాదు.   ఇటీవల ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఎలాంటి దాపరికం లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని కుండ బద్దలు కొట్టారు.  ఏ నెలకు ఆ నెల రిజర్వు బ్యాంకు నుంచి రూ. 400 కోట్లు చేబదులు తెచ్చుకుంటేనే  ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీకుకు జీతాలు ఇవ్వ గలుగు తున్నామని  అసెంబ్లీ వేదికగా చెప్పారు. అలాగే  రాష్ట్ర ప్రభుత్వ నెలసరి ఆదాయ వ్యయపట్టికను  ఏ గోప్యతా లేకుండా సుత్తి లేకుండా, సుతి మెత్తగా మూడు ముక్కల్లో చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వ నెలసరి ఆదాయం రూ. 18 వేల కోట్ల నుంచి రూ. 18, 500  కోట్లు, అందులో, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపుకు రూ. 6,500కోట్లు ఖర్చవుతుంది. మరో రూ.  6,500కోట్లు అప్పుల వడ్డీల చెల్లింపునకు పోతుంది.  చివరకు చేతిలో మిగిలేది, రూ. 500 నుంచి రూ.5,500 కోట్లు.  సంక్షేమ, అభివృద్ధి  పధకాలు వేటికైనా..  ఈ రూ.500 ప్లస్ కోట్ల నుంచే ఖర్చు చేయాలని ఖుల్లం ఖుల్లాగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు.  కాదంటే, రాష్ట్ర అవసరాల రీత్యా ఇంకా ఏదైనా చేయాలంటే, ఏమి చేయాలో ఆయన చెప్పారో లేదో కానీ, అదేమంత రహస్యం కాదు. గత ప్రభుతం చేసి చూపిన మార్గంలోనే అప్పు చేయడం, ఆస్తులు, అమ్మడం ద్వారా ఖాజానాను కాపాడుకో వచ్చును. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు  డిఎ పెంపు పై ఆశలు పెట్టుకోవద్దని  చెప్పినంత నిజాయతీగా  సక్షేమ పధకాల అమలు విషయంలోనూ ,  నిజాయతీగా  ‘ఆల్ ఫ్రీ, అందరికీ ఫ్రీ’ అనే పద్దతిలో కాకుండా, ఏట్లో పారేసినా ఎంచి పారేయాలన్న ఆర్థిక సూక్తిని, లబ్దిదారుల ఎంపికలో అంత్యోదయ విధానాన్ని పాటించడం ద్వారా ఖజానా బరువు ఇంకొంచెం పెంచుకోవచ్చును, అంటున్నారు. అయితే  అలా చేయడం ఆర్థిక సూత్రాల పరంగా  అంటే ఎకానమికల్లీ రైట్ అయినా  రాజకీయంగా కొంప ముంచుతుంది. అందుకే   భట్టి  విక్రమార్క  తమ దారిలోనే  వెళ్ళారు. మొత్తం పద్దు  రూ.3,04,965 కోట్లలో రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా  చూపించారు. అంటే  అభివృద్ధిని  ఆఫీషియల్ గా అటక ఎక్కిచారు.  అందుకే పాత పద్దతిలోనే  కొంచెం అటూ ఇటుగా కేటాయింపులు చేసుకుంటూ వెళ్లారు. కేటాయింపుల విషయానికి వస్తే  రైతు భరోసాకు, రూ. 18వేల కోట్లు, వ్యవసాయానికి రూ. 24,439 కోట్లు, పశు సంవర్డక శాఖకు  రూ. 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు  రూ. 5,734 కోట్లు, విద్యా శాఖకు  రూ. 23,108 కోట్లు, కార్మిక ఉపాధి కల్పన శాఖకు  రూ. 900 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు, రూ. 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 2862 కోట్లు కేటాయించారు. అందుకే, భట్టి బడ్జెట్  రాష్ట్ర వాస్తవ పరిస్థితిని, వాస్తవ అవసరాలను, అవకాశాలను అంచనావేయడంలో విఫల మైందనీ, కాదంటే, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి  రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసిందనే  మాటే ప్రముఖంగా  వినిపిస్తోంది. అయితే, రాజకీయంగా అయినా, ప్రయోజనం చేకురుస్తుందా  అంటే, అదీ అనుమానమే  అంటున్నారు.  నిజానికి ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు ఏవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షు డు కేటీఆర్  ప్రశ్నించారు.  భట్టి బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేవనీ,  కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే  కట్  అంటూ.. రైతులకు రుణమాఫీ కట్ , రైతులకు రైతుభరోసా కట్ , రైతులకు రైతుబీమా కట్ ,  ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ కట్  గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ కట్,  విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ కట్, మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్, ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కట్, కాంగ్రెస్ అంటే కటింగ్  అంటూ ‘ఎక్స్’ వేదికగా రెచ్చిపోయారు. ఆఫ్ కోర్స్, కేటీఅర్ చెప్పిందంతా నిజమని  అనవలసిన అవసరం లేదు కానీ, స్వయంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ అని, ‘విప్పి’  చెప్పిన నేపధ్యంలో  భట్టి  బడ్జెట్ మీద అనుమానాలు రావడం సహజం. ఆర్థిక నిపుణులు కూడా అదే అంటున్నారు.

మర్రిని నిందించే నైతిక హక్కు జగన్‌కు లేదు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే సంగతి ఆ పార్టీలోని నాయకులు అందరికీ అర్థం అవుతోంది. భవిష్యత్ లేని పార్టీలో ఉండడం కంటే.. రాజకీయాలు మానుకోవడమే బెటర్ అని కొందరు రాజీనామా చేస్తున్నారు. వెళ్లిపోయిన వారు పార్టీ మీద నిందలు వేయడం.. వెళ్లిపోయిన వారు ద్రోహులని పార్టీ నింద వేయడం చాలా మామూలు సంగతి.  వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారందరి గురించి జగన్ కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చిలకలూరిపేట నాయకుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసిన నేపథ్యంలో, ఆయనను నిందించడానికి గానీ, పార్టీకి ద్రోహం చేశాడని అనడానికి గానీ జగన్ కి  నైతిక హక్కు లేదని.. పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉంటూ.. ఆయన వెంట నడిచినందుకు.. ఆయన వంచనకు గురైన వారిలో మర్రి రాజశేఖర్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు జగన్ చేసిన అన్యాయానికి ఆయన ఇన్నాళ్లూ పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే చాలా పెద్ద విషయం అని ఆ పార్టీలో ఉన్న వారే వ్యాఖ్యానిస్తున్నారు.   వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ ను అంటిపెట్టుకుని ఉన్న మర్రి రాజశేఖర్ కు.. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ..  2019 ఎన్నికల్లో మర్రికి టికెట్ నిరాకరించారు జగన్!  అప్పుడే పార్టీలో చేరిన విడదల రజనికి జగన్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం.. మర్రి అభిమానులను ప్రలోభ పెట్టే మాటలు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా చేస్తానని బహిరంగ సభల్లోనే ప్రకటించారు. ఆయనకూడా విడదల రజని విజయం కోసం కష్టపడి పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పదవి రజనికి దక్కింది తప్ప మర్రి రాజశేఖర్ ఊసు వినపడలేదు. ఎమ్మెల్సీగా మాత్రం చేశారు. మధ్యలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించినప్పుడు.. మర్రికి పదవి గ్యారంటీ అని పార్టీలో అంతా అనుకున్నారు. కానీ.. అప్పుడు కూడా జగన్ మాట నిలబెట్టుకోలేదు. రాజశేఖర్ ఎంత సహనంతో ఉన్నప్పటికీ.. 2024 ఎన్నికల సమయానికి సర్వేల్లో విడదల రజనికి ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తేలడంతో ఆమెను నియోజకవర్గం మార్చి గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేయించారు. అప్పుడు మర్రి రాజశేఖర్ టికెట్ ఆశించినా ఇవ్వలేదు. చివరికి ఆ ఎన్నికల్లో పరాజయం తర్వాత.. మళ్లీ విడదల రజినిని వెనక్కు తీసుకువచ్చి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ ఆయనకు మనస్తాపం కలిగించాయి. చాలా కాలంగా ఆయన పార్టీని వీడదలచుకున్నట్టుగా ప్రచారం జరిగింది.  వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్లు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించారు. బుధవారం మండలి ఛైర్మన్ కు రాజీనామా సమర్పించే ముందు బొత్స సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్సీలు కొందరు కూడా రాజీనామా ఆలోచన మానుకోవాలని సూచించారు. అయితే మర్రి వారి మాటలను ఖాతరు చేయలేదు.  ఏ రకంగా చూసినా సరే.. మర్రికి జగన్ చేసిన అన్యాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి గనుక.. ఆయన నిష్క్రమణ.. రాజీనామా గురించి నింద వేయగల నైతిక హక్కు జగన్ కు లేదని.. పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు.

సునీతా విలియమ్స్ ఐసోలేషన్ లో ఎంత కాలం ఉండాలంటే..?

సునీతా విలియమ్స్ 9 నెలల సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చక్కుకుపోయి ఎట్టకేలకు భువికి చేరుకున్నారు. అయితే అంత కాలం అంతరిక్షంలో ఉన్న ఆమె ఇక్కడ భూమి మీద సాధారణ జీవితం గడపడం అంత సులభం కాదు. ఆమె కొంత కాలం ఐసోలేషన్ లో ఉండాల్సిందే.    దాదాపు నెలన్నర పాటు సునీతా విలియమ్స్ నాసా కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.  వైద్యులు, మానసిక నిపుణులు ఈ నెలన్నర అంటే 45 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తారు. అలాగే రోజజుకు రెండు గంటల పాటు వివిధ వ్యాయామాలు చేయిస్తారు.  ఎందుకంటే సుదీర్ఘకాలం రోదసిలో ఉండటం వల్ల సునీతా విలియమ్స్ పలు శారీరిక మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీరో గ్రావిటీ  వాతావరణంలో గడపడం వల్ల భూమి మీద ఆమె మళ్లీ మామూలు జీవితం గడపడానికి కొంత కాలం పడుతుంది.  నడవడం, దృష్టిని స్థిరంగా ఉంచడంలో సునీతా విలియమ్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఆమెను క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్ పై తీసుకురావడాన్ని ప్రపంచమంతా దృశ్యమాధ్యమాల ద్వారా తిలకించింది. ఇదే కాకుండా శరీరంలో రేడియేషన్ స్థాయి ఎక్కువగా ఉండటం, అలాగే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు కూడా సునీతా విలియమ్స్ ఎదుర్కొంటున్నారు. గతంలో అంటే 1984లో భారత సంతతికి చెందిన రాకేష్ వర్మ రోదసిపై కాలు మోపిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో గడపాల్సి వచ్చింది. రోదశిలోకి వెళ్లిన ప్రతి వారూ ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అప్పట్లో రాకేష్ శర్మ రోదశిలో ఏడు రోజుల 21 గంటల 40 నిముషాల సేపు గడిపారు. ఆ కారణంగా ఆయన నెలల తరబడి ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్ లు 9 నెలల పాటు రోదశిలో చిక్కుకుపోయారు. దీంతో వీరు ఎక్కువ రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది.  నాసా కేంద్రంలో వీరికి 45 రోజుల పాటు మూడు దశలలో శిక్షణ ఇచ్చి భూమి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. మొదటి దశలో కండరాల బలోపేతానికి సంబంధించి శరీర శక్తి, రక్త ప్రసరణ పెరిగేందుకు అవసరమైన చికిత్స, వ్యాయామాలు చేయిస్తారు. ఇక చివరిదైన మూడో దశలో  వారిలో చురుకుదనం పెంచేందుకు అవసరమైన వ్యాయామాలతో పాటు, భూవాతావరణానికి అనుగుణంగా శరీకం అలవాటుపడేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు.  ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 45 రోజులు పడుతుందని నాసా  వర్గాలు తెలిపాయి. ఆ కారణంగానే అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వెంటనే సునీతా విలియమ్స్ ను వైట్ హౌస్ కు ఆహ్వానింలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకున్న తరువాత వైట్ హౌస్ కు ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతానని ఆయన అన్నారు. 

కడపలో మహానాడు.. పట్టు నిలుపుకోవడానికి టీడీపీ స్కెచ్

కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది . వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికలలో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడింటిని  కైవసం చేసుకున్న కూటమి జగన్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడదే జిల్లాలో లోకేశ్ కనుసన్నల్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  కడప జిల్లా రాజకీయాలంటే ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు… అక్కడంతా ఆ కుటుంబానిదే హవా. అందుకు తగ్గట్టే… గడిచిన పాతికేళ్ళలో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నామ మాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2004లో ఒక్క చోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు.  ఇక 2019కి వచ్చేసరికి మొత్తం పదికి పది సీట్లు దక్కించుకుని వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ.  కానీ… ఆ తరువాత మాత్రం సీన్‌ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం పుంజుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు.  కడప జిల్లాలో టిడిపి ఐదు,  బిజెపి ఒకటి, జనసేన ఒకటి చొప్పున అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. మొట్ట మొదటిసారిగా జిల్లాలో బిజెపి, జనసేన బోణీ కొట్టాయి. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తయితే కడప జిల్లాలో సత్తా చాటుకోవడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. జగన్ అడ్డాలో ఏకంగా ఏడు ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని,  ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారంట. అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి తెలుగుదేశం మహానాడును కడపలో  నిర్వహించాలని నిర్ణయించారు.   తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలోమహానాడు నిర్వహించడమే  కాకుండా… వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట తెలుగుదేశం పెద్దలు. కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించడం వెనక రీజన్‌ ఇదేనని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. కడప లాంటి ఉమ్మడి జిల్లాలో కూటమి ఏడు సీట్లు గెలవడంతో… స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ పదవులు వరించాయి.  కేడర్లో కూడా జోష్ నింపడానికి  కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనీవినీ ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. నిర్వహణ కోసం కడప నగరంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా నేతలు అధిష్టానానికి నివేదికలు పంపారట. ఇప్పటికే వైసిపి అడ్డాలో పాగా వేసిన తెలుగుదేశం… మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట. అటు వైసిపికి బిగ్ షాక్ ఇవ్వడంతోపాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టిడిపి ధ్యేయంగా చెప్పుకుంటున్నారు. 

గుండెలను పిండేస్తున్న విషాదం

ఆ క్షోభ వర్ణానాతీతం చెమ్మగిల్లని కన్ను లేదన్నది నిజం సుదీక్ష తల్లిదండ్రుల విలాపం భగవంతుడా ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! ఎదిగిన బిడ్డ చదువుకుంటోంది,   మంచి భవిష్యత్తు ఉంటుందని, కలలు కన్నతల్లితండ్రులకు ... ఆ బిడ్డ విహారానికి వెళ్లి సముద్ర తీరం లో గల్లంతైయితే ,పది రోజులు గడుస్తున్నా పోలీసులు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెతికినా ఆచూకీ లేకపోతే ... తమ కుమార్తె బతికే ఉంది అన్న ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి లో... ఊరు కానీ ఊరిలో, సాగర తీరం లో వారు అనుభవిస్తున్న క్షోభ వర్ణనాతీతం. ఆ సాగర హోరులో వారి ఘోష కూడా కలిసిపోతోంది. చివరకు ఒడ్డున దొరికిన కొన్ని దుస్తులు తో ఇంకా ఆచూకీ లభించని స్థితి లో ఆ తల్లితండ్రులు తమ బిడ్డ బ్రతికే ఉండాలి అని కోరుకుంటూనే ... ఆమె మరణ ధ్రువీకరణ పత్రం కోసం పోలీసుల్ని అభ్యర్థిస్తున్నారు.  ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కోనంకి సుబ్బారాయుడు, శ్రీదేవి ల ఇరవై ఏళ్ళ పుత్రిక సుదీక్ష అమెరికా లోని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ లో చదువుకుంటోంది. స్ప్రింగ్ బ్రేక్ లో మార్చి 6న డోమెనికన్ రిపబ్లిక్ లో ని పంటకాన్ బీచ్ కు ఆమె స్నేహితురాళ్లతో కలిసి విహారానికి వెళ్లారు. ఆ రోజు మిత్రుని తో కలిసి బీచ్ లో ఈతకు వెళ్లిన ఆమె సముద్రపు అలల ధాటికి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆచూకీ చిక్కని ఆమె గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆమె తల్లిదండ్రులు చివరకు ఆశలు వదులుకున్నారు. పోలీసులు మాత్రం ఆమె తో ఆఖరి దశ లో కలిసి ఉన్న వ్యక్తి ని అదుపు లో కి తీసుకుని ప్రశ్నించారు. రోజులు గడుస్తున్నా పోలీసులు అతన్ని వదిలిపెట్టలేదు. సుదీక్ష తల్లిదండ్రులు ఆ వ్యక్తి మీద తమకు ఎలాంటి  ఎలాంటి అనుమానాలు లేవని తమ బిడ్డ చనిపోయిందని నమ్ముతున్నామని పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మరణ ధ్రువీకరణ పత్రం కోసం చేస్తున్న అభ్యర్ధన చూసేవారిని కంట తడి పెట్టిస్తోంది.   

మోమో, స్పింగ్ రోల్స్ ఫ్యాక్టరీలో కుక్కతల 

ఇండియాలో ఇష్ట పడే స్ట్రీట్ ఫుడ్ లలో మోమో, స్పింగ్ రోల్స్ ఎక్కువ సేలవుతుంటాయి. పంజాబ్ లో వీటిని తయారుచేసే ఫ్యాక్టరీలపై అధికారులు దాడులు చేయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూసాయి. ఈ ఫ్యాక్టరీలో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు మాత్రమే కాదు డీ ఫ్రిజ్ లో కుక్క తల కాయ కనిపించింది. మోమో, స్పింగ్ రోల్స్ లో కుక్క తలకాయ వినియోగిస్తారా అని అధికారులకు డౌటిచ్చింది. వెంటనే పరీక్షలకు పంపారు.  కుక్క తలతో బాటు కుళ్లిన చికెన్, మటన్ కూడా కనిపించడంతో పంజాబ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కూరగాయల్లో  కూడా ఫంగస్  చేరింది.  పూర్తిగా అపరిశుభ్ర వాతావారణంలో ఉన్న ఫ్యాక్టరీలో కుక్క తలను కార్మికులు తినడానికి భద్ర పరచుకున్నారా? మోమో, స్పింగ్ రోల్స్ లో కలపడానికా అనేది తేలాల్సి ఉంది. సదరు ఫ్యాక్టరీల  నుంచి టన్నుల కొద్దీ ఫుడ్ సరఫరా అయినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా పోయింది. 

విశాఖ మేయర్ పీఠం.. కూటమి ఖాతాలోకేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతిపెద్దదైన విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ కూటమి వశం కానున్నదా?  వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయ‌ర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదఏశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా?  అంటే పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతి వ్యూహాలతో  ఒక్కసారిగా సాగర తీరంలో రాజకీయ వేడి పెరిగింది.  నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికలలో విశాఖ మేయర్ పీఠాన్ని అప్పటికి అధికారంలో ఉన్న వైసీపీ దక్కించుకుంది. విశాఖ కార్పొరేషన్ లో 98 కార్పొరేటర్ల స్థానాలు ఉండగా వాటిలో 59 స్థానాలలో వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు.    బీసీ వర్గానికి చెందిన  మ‌హిళ‌ గొల‌గాని హ‌రి వెంక‌ట కుమారిని వైసీపీ అధిష్ఠానం మేయ‌ర్ ని చేసింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలై  తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో విశాఖ కార్పొరేషన్ లో కూడా వైసీపీ బలం క్షీణించింది. పలువురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడిక మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి పార్టీలు సమాయత్తమౌతున్నాయి. నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయితే కానీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఇంత కాలం ఓపికగా వేచి ఉన్న కూటమి పార్టీలు.. ఇప్పుడిక నాలుగేళ్ల కాలపరిమితి ముగుస్తున్న తరుణంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా పకడ్బందీ ప్రణాళికతో అడుగులు కదుపుతున్నారు.  ప్రస్తుతం విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ లో  కూట‌మి బ‌లం 53గా ఉంటే..  వైసీపీ బ‌లం 38కి ప‌డిపోయింది.  కానీ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ కూటమికి మూడింట రెండు వంతులు అంటే 64మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం కూటమికి 53 మంది కార్పొరేటర్ల మద్దతు మాత్రమే ఉంది. అంటే మరో 11 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమతో ఉన్న 38 కార్పొరేటర్లూ గోడ దూకకుండా వైసీపీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. వైసీపీ కార్పొరేటర్లు జారిపోకుండా సీనియర్ నేత, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో విశాఖ రాజకీయం రసకందాయంలో పడింది. రానున్న రోజులలో వైసీపీ నుంచి మరింత మంది కార్పొరేటర్లు కూటమి పార్టీల పంచన చేరుతారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

హైడ్రాపేరిట వసూళ్ల దందా!

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు హైడ్రా పేరిట పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని సంచలన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మూసీ సుందరీకరణ పేరిట పేదలను నిర్వాసితులను చేస్తున్నారనీ, ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  రీజనల్ రింగ్ రోడ్డు పేరిట పేదల భూములను ఆక్రమిస్తున్నారని, ఏ వైపు పేదలపై ప్రతాపం చూపుతూ మరో వైపు పెద్దలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.  ఆరు గ్యారంటీలకు పంగనామాలు పెట్టేసిన రేవంత్ సర్కార్.. ఇదేమిటని ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీలకు ఎగనామం పెట్టేసిందన్నారు.  కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో పాతాళానికి పడిపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పాలన కాదు పీడన సాగుతోందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ను ఆయన సర్కస్ కంపెనీగా అభివర్ణించారు.