ఉద్యమంగా మారుతున్న తెలంగాణా ఆర్టీసి సమ్మె...

  ఆర్టీసి సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది,వరుస ఆత్మహత్యలతో ఉద్యమ రూపం దాల్చుతోంది. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేంద్ర గౌడ్ లు ప్రాణాలు తీసుకోవటం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఆత్మ బలి దానాలు వద్దంటూనే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయటానికి ఆర్టీసీ,జెఏసీ కొత్త కార్యాచరణకు సిధ్ధమయ్యింది. శ్రీనివాస్ రెడ్డి  ఆత్మహత్య నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతుంది. ఆర్టీసి కార్మికులు రాత్రి డిపోల ముందు కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. ఈరోజు అన్ని డిపోల ముందు బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. అర్టీసి, జేఎసి నాయకులు గవర్నర్ తమిళసాయిని కలవబోతున్నారు. ఆర్టీసి సమ్మె ఎందుకు చేపట్టారో దాని తరువాత పరిణామాలేంటి అన్న విషయాలను గవర్నర్ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. దీంతో సమ్మె ఎటువైపు తిరుగుతోంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.  ఆర్టీసీ,జెఏసీ కి ఇప్పటికే విపక్షాలు మద్దతు పలికాయి, ఆర్టిసి కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసి కార్మికులు చేపడుతున్న ఆంధోళన కార్యక్రమాలకు భేషరతుగా మద్దతుని ప్రకటిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని నిర్ణయించాయి. కొన్ని ప్రజా సంఘాలు, రెవెన్యూ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతును ప్రకటించాయి. దీంతో సమ్మె కాస్తా ఉద్యమంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్టీసి కార్మికులను రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. ఆర్టీసి కార్మికులను తమ గుప్పెట్లోకి తీసుకుని సర్కార్ పై కుట్ర చేస్తున్నాయని మంత్రులు ఆగ్రాహాన్ని వ్యక్తం చేశారు.  ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించింది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత పెంచాలని నిర్ణయించింది. కార్మికుల ఆత్మహత్యలకు రాజకీయ శక్తులే కారణమని సర్కార్ చెప్తుంది. ఆర్టీసి కార్మికులు రాజకీయ పార్టీల ట్రాప్ లో పడ్డారంటూ తెలంగాణా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. తమను సంప్రదించకుండానే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళారని ఆరోపించారు, సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిస్తే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా ఉద్యమం తరువాత ఆర్టీసీ సంఘాలు తమతో ఎప్పుడూ కలవలేదని ప్రకటించారు. ఆర్టీసీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటే తాము కూడా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్టీసీ సమ్మెకు తెలంగాణా ఎన్జీవోలు, టిఎన్జీవోలు ప్రస్తుతానికి దూరంగా ఉంటారని అర్ధమౌతుంది. ఇదిలా ఉండగా తెలంగాణా ఆర్టీసీ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి కార్మిక సంఘాలు మద్దతుని ప్రకటించాయి, తెలంగాణా ఆర్టీసి కార్మికుల డిమాండ్ లు న్యాయమని చెప్తున్నాయి.

మనస్థాపానికి గురై ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం, పరిస్థితి విషమం

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పెద్ద చర్చనీయంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఏం జరగబోతోంది అని అందరిలోనూ ఒక ఆందోళన మొదలైయ్యింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆయన శరీరం తొంభై శాతం వరకు కాలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేస్తున్నారు. టీఎంయూ నేతగా కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన కొద్ది సేపటికే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారని తోటి కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు ఏకంగా యాభై వేల ఉద్యోగులను కేసీఆర్ ఒక్కసారిగా డిస్స్మిస్ చేయడం పట్ల తీవ్రంగా మండి పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గత ఇరవై సంవత్సరాలు ఖమ్మం డిపో లోని డ్రైవర్ గా పని చేస్తున్నారు. అదే విధంగా టీఎంయూలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ సమ్మె పై కేసీఆర్ ప్రసంగించిన తరువాత ప్రెస్ నోట్ ని విడుదల చేసిన వెంటనే తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా తొంభై శాతం శరీరం మొత్తం కాలిపోయింది. ప్రస్తుతానికి అతనిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించినట్లు తెలియజేశారు. దాదాపుగా అన్ని యూనియన్ సంఘాలు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగాను, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుండటమే కాక ఇటువంటి పాలనతో ఎవరిని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరిని కూడా ప్రభుత్వం అణిచివేస్తున్న తీరుకు నిరసనగా ఆందోళన తీవ్రతరం చేస్తామని దీనిని జిల్లా పరంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉదృక్తం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వామపక్ష పార్టీలు, యూనియన్ నేతలు చేరుకున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి వద్ద చేరుకోవడమే కాక అదనపు బలగాలను కూడా తీసుకొచ్చెందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

మావోయిస్టుల ప్రభావం విద్యార్ధుల పై ప్రభావం చూపనుందా?

  నేటి విద్యార్ధులే రేపటి భావి భారత పౌరులు అన్నారు పెద్దలు. కానీ ఇప్పటి పరిస్థితులకు మాత్రం విద్యార్ధులనే లక్షంగా చేసుకుంటున్నారు కొందరు. వివరాళ్లోకి వెళ్తే విద్యార్థి నేతల పై నిఘా పెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలిక మళ్లీ మొదలైంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులని మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో విద్యార్ధులను రెచ్చగొడుతోన్న వివిధ నిషేధిత సంస్థల పై నిఘా పెట్టారు పోలీసు అధికారులు. అంతేకాదు కొందరు అనుమానితులను అదుపులోకి  కూడా తీసుకున్నారు.  మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ విద్యార్ధి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటితో పాటు జగన్, సాయన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు. మరో వైపు విద్యార్ధి నేతలు అనుదీప్, నాగరాజు, రమేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సందీప్, గోపి, ఖాసిమ్ ల పై పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేశారు. మావోయిస్టులకు పలు విద్యార్థి సంఘాలు సహకరిస్తున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో ముప్పై విద్యార్థి సంఘాలను నిషేధించినట్టు తెలిపారు. గత కొంత కాలంగా జగన్ మావోయిస్టులతో టచ్ లో ఉన్నాడనీ మావోయిస్టులకు ఫండ్ ఇవ్వాలనీ కొన్ని కంపెనీల బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో జగన్, మద్దిలేటి ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మావోయిస్ట్ నేత హరిభూషణ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. జగన్, మద్దిలేటిపై పూణే కర్ణాటకల్లో కేసులున్నట్లు గుర్తించారు. కొన్ని నిషేధిత మావోయిస్టు సంస్థలు విద్యార్ధులను రెచ్చగొట్టి వారిని నక్సలిజం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తుపాకీ పట్టి వయోలెన్స్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. అయితే భారతదేశంలో ఇలాంటి వాటికి స్థానం లేదన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సిపి అంజనీ కుమార్. ప్రభుత్వం ఇటువంటి చర్యల పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

భలే మంచి చౌక బేరం.. విజయవాడ నడిబొడ్డున రూపాయికే ఐదెకరాల స్థలం!!

  'భలే మంచి చౌక బేరము' అనే సాంగ్ వినే ఉంటారు. ఇప్పుడు ఈ న్యూస్ వింటే అదే సాంగ్ పాడుకుంటారు. విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న ఖరీదైన ఐదెకరాల స్థలాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ దక్కించుకున్న సంస్థకి రూపాయికే లీజుకిస్తారట. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయడం.. ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సంచలనం అవుతోంది. ఏపీఎస్ఆర్టీసీ 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రిబిడ్డింగ్ సమావేశానికి ముందే.. ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేశారు. అప్పుడే.. పోలవరం రివర్స్ టెండర్లను తక్కువకు వేసిన సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి డబుల్ రేట్లకు.. టెండర్ కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగింది. అదే సంస్థ తెలంగాణలో కి.మీ రూ. 36కి ఎలక్ట్రిక్ బస్సులను ఆపరేట్ చేస్తోంది. ఏపీలో మాత్రం రూ. 60 అడిగినట్లుగా తెలుస్తోంది. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారం అని చర్చ జరుగుతోంది.  అయితే.. బస్సుల కాంట్రాక్ట్ మాత్రమే కాదు.. ఆ కంపెనీ అత్యంత విలువైన ఆర్టీసీ భూముల్ని కూడా కట్టబెట్టబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విజయవాడలో విద్యాధరపురం, గన్నవరంలలో ఆర్టీసీకి విలువైన స్థలాలు ఉన్నాయి. మార్కెట్‌ రేటు ప్రకారం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుంది. సిటీ డివిజన్‌ పరిధిలో ఎలక్ర్టిక్‌ బస్సుల నిర్వహణ కోసం మెయింట్‌నెన్స్‌ డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆర్టీసీ అధికారులే ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. అయితే మెయింట్‌నెన్స్‌ డిపోకు కేటాయించే స్థలాలను సంవత్సరానికి రూపాయికి అద్దెకు ఇస్తున్నట్టు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) లో సూచించటం ఇప్పుడు దుమారాన్నే రేపుతోంది. కి.మీ లెక్కల ఖర్చులు ఆర్టీసీ చెల్లిస్తున్నప్పుడు.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ మొత్తం సదరు కంపెనీనే పెట్టుకోవాలి. కానీ.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ భారం ఆర్టీసీపై పడేలా.. స్థలాన్ని ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆర్టీసీలో సాధారణ బస్సులను అనేకం అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. అద్దెకు బస్సు ఇచ్చేవాళ్లే బస్సును సొంతంగా నిర్వహించుకుంటారు. డ్రైవర్‌ యజమానికి చెందిన వారు ఉంటే.. కండక్టర్‌ మాత్రం ఆర్టీసీకి చెందిన వారు ఉంటారు. వ్యాపారం అతనే చేస్తున్నాడు కాబట్టి.. మెయింట్‌నెన్స్‌ కూడా అతనే చేసుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం.. ఆ భారం మొత్తం ఆర్టీసీపై వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్దె ప్రాతిపదికన తీసుకునే బస్సుల కోసం సంస్థ ఆస్థులను అప్పనంగా కట్టబెట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా కార్పొరేట్‌ స్థాయి కలిగిన బల్క్‌ సప్లయిర్‌కు ఈ విధంగా అప్పనంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను అప్పగించాలను కోవటం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తీసుకునే సాధారణ బస్సుల విషయంలో ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో.. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కూడా ఆర్టీసీ అధికారులు అదే వైఖరిని అవలంభించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదు: మంత్రి అజయ్

  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని విలీనం చేస్తామని కానీ.. ప్రైవేటీకరిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని పండగ సమయంలో సమ్మెకు వెళ్లారని విమర్శించారు. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రజల కోణంలో ఆలోచించకుండా రాజకీయం చేస్తున్నాయని.. ప్రతిపక్షాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని అజయ్ పేర్కొన్నారు. టెంట్‌ వేసిన చోటల్లా విపక్షాలు వాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కర్రు కాల్చి వాత పెట్టినా ప్రతిపక్షాలు మారడం లేదని అజయ్ అన్నారు. ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం సరికాదని, 2014బ్యాలెన్స్ షీట్‌లో ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4,416 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో ఆర్టీసీకి నష్టాలే వచ్చాయన్నారు. కేసీఆర్‌ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీకి 14 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,303 కోట్లు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని అజయ్ ప్రశ్నించారు. 5 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని, బస్సు సర్వీసులను పెంచుతామని తెలిపారు. అన్ని రకాల బస్సు పాస్‌లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అజయ్ హెచ్చరించారు.

పల్నాడులో దాడులు, హత్యలు నిజమే.. కానీ?

  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భౌతిక దాడులు, హత్యలు జరిగాయని.. అనేక మంది టీడీపీ సానుభూతి పరులు గ్రామాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పల్నాడులో పరిస్థితులపై విచారణ చేయాలంటూ.. ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో డీజీపీ ఓ కమిటీని నియమించారు. నెల రోజుల పాటు విచారణ జరిపిన రవిశంకర్ కమిటీ.. గొడవలు, ఘర్షణలు నిజమే కానీ.. టీడీపీ ఆరోపిస్తున్నట్టు వాటికి రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. తాజాగా ఏడీజీ రవిశంకర్‌ అయ్యనార్ మీడియా మాట్లాడుతూ.. అవన్నీ రాజకీయ హత్యలు కాదని.. రౌడీగ్రూపు హత్యలేనన్నారు. రాజకీయ గొడవల్లో ఒక్కరు మాత్రమే చనిపోయారన్నారు. 110 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయనడంలో వాస్తవం లేదన్నారు. అన్ని కేసులు రాజకీయ ఘర్షణల కేసులు కావని ఏడీజీ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు నమోదైన 10 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. 70 మంది వైసీపీ, 41 మంది టీడీపీ వారిపై కేసులు నమోదు చేశామని ఏడీజీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పిన ఏడీజీ రవిశంకర్‌.. మరోవైపు ఎన్నికల తర్వాత పల్నాడులో అనేక ఘటనలు జరిగాయన్న విషయాన్ని అంగీకరించారు. ఎనిమిది హత్యలు జరిగింది నిజమేనని కూడా అంగీకరించారు. కానీ అవి రాజకీయ ఘర్షణలు కాదని గ్రామాల్లో గ్రూపుల మధ్య జరిగే గొడవలను రాజకీయ ఘర్షణలుగా చెబుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అంటే ఘటనలు జరిగాయన్న విషయాన్ని మాత్రం అంగీకరించారు. మరి అలాంటప్పుడు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎలా చెప్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిన్న పంచెకట్టులో మెరిసిన మోడీ.. నేడు మరో ఊహించని అవతారం!!

  రాజకీయ నాయకుల్లో ప్రధాని మోడీ రూటే సెపరేట్. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర మాతృ భాషలో ప్రసంగం మొదలుపెడతారు. ఆ రాష్ట్రానికి తగ్గట్టు ఆహార్యాన్ని మారుస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దశావతారం సినిమాలో కమల్ హాసన్ లాగా.. ఒక్కోసారి ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంటారు. అయితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ నిన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి మహాబలిపురంలో పర్యటించారు. అది కూడా పంచెకట్టులో. తమిళులు తమిళ బాషా అన్నా, పంచెకట్టు అన్నా చెవి కోసుకుంటారు. అందుకేనేమో మోడీ పంచెకట్టుతో సందడి చేసారు. మరి తమిళులు మోడీ పంచెకట్టుకి ఫిదా అయ్యారో లేదో తెలియదు కానీ.. ఈరోజు మోడీ మరో కొత్త అవతారం ఎత్తారు.  ఈరోజు ఎర్లీ మార్నింగ్ తమిళనాడులోని మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లిన మోడీ.. భుజాన సంచి వేసుకొని, బీచ్ లో చెత్త ఏరుతూ కనిపించారు. మోడీ ప్రధాని అయ్యాక స్వచ్ఛభారత్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ భారత్ పిలుపునివ్వడమే కాదు.. దాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు మోడీ. గతంలో చీపురు పట్టి వీధులు ఊడ్చిన మోడీ.. ఇప్పుడు బీచ్‌లో చెత్తాచెదారాన్ని ఏరిపారేశారు. శనివారం తెల్లవారుజామున మామల్లాపురం బీచ్ కి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన మోడీ అక్కడ బీచ్ లో చెత్తాచెదారాన్ని ఏరిపారేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను, మద్యం బాటిళ్లను తీసి సంచిలో వేసుకొని భుజాన వేసుకున్నారు. దాదాపు అరగంట పాటు మోడీ బీచ్ లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జనం సంచరించే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని.. మనమంతా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత ముఖ్యమంటూ ట్వీట్ చేశారు. మోడీ చెత్త ఏరివేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని అయ్యుండి చెత్త ఏరివేసి ఆదర్శంగా నిలిచారంటూ కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం కెమెరాలో కనపడాలనే పిచ్చితో క్లీన్ చేసారు, బోలెడంత పబ్లిసిటీ కొట్టేసారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

పంచెకట్టులో అర్జున తపస్సు ప్రదేశాన్ని జిన్ పింగ్ కు వివరించిన మోదీ

  తమిళనాడు లోని మహాబలిపురం లో అర్జున తపస్సు ప్రదేశాన్ని విశిష్ట అతిథి జిన్ పింగ్ కు మోదీ వివరించారు. ప్రతి స్తంభాన్ని శిల్ప సంపదను జిన్ పింగ్ కు చాలా ఆత్మీయంగా మోదీ వివరించారు. రెండు అగ్ర దేశాధినేతల ఆత్మీయ సమావేశాన్ని ప్రపంచం అంతా చాలా ఆసక్తికరంగా చూస్తోంది. ఇరుదేశాధినేతల ఈ సమావేసం భవిష్యత్ శుభ పరిణామానికి నాందిగా ప్రపంచ విశ్లేషకులు భావిస్తున్నారు. స్నేహ హస్తాన్ని అందించటంలో మోదీ స్టైలే వేరు, అందరి కంటే ఒకడుగు ముందుకు వేసే ఊహించని రీతిలో ఆయన స్నేహా స్వభావం ఉంటుంది. భారతదేశ సంప్రదాయ వస్త్రధారణ నేటి తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లోని సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో దర్శనమిస్తూ ఓ అతిపెద్ద దేశాధినేతకు మహాబలిపురంలోని ఆలయాన్ని వివరించారు. ఆలయాలపై ఉన్న శిల్పా సంపదను మోదీ ప్రత్యేకంగా వివరించారు. శిల్ప సంపదకు పుట్టినిల్లు భారతదేశం అద్భుతమైన శిల్పాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. తమిళనాడు మహాబలిపురంలో అర్జున తపస్సు ప్రదేశం తో చైనాకు భారతదేశాని కి అవినాభావ సంబంధముంది. ఇక్కడ నుంచి వాణిజ్య సంబంధాలను నెరిపేవారు, అందులో భాగంగానే మోదీ విదేశాంగ విధానంతో పాటు దక్షిణ భారతదేశంలో తమిళనాడుని ఆతిథ్య ప్రదేశంగా ఎంచుకోవడంలో ఆయన ఆలోచనే వేరు. పంచెకట్టులో రాజసంగా మోదీ నడుచుకుంటూ వెళుతుంటే పక్కనే మరో అగ్రదేశాధినేత ఆయనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఈ స్నేహం ఎటువంటి శుభ పరిణామాలకు దారి తీయబోతోందని ప్రపంచం చర్చించుకుంటోంది. కానీ, పాకిస్థాన్ మాత్రం ఏం జరుగుతుందో అని కంటవిప్పుతో చూస్తూ ఉంటుంది. 

విశాఖలో చోటుచేసుకున్న అతి దారుణ ఆత్మహత్య ప్రయత్నం

  విశాఖలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య కోసం ఏకంగా గ్యాస్ సిలిండర్ ను ఉపయోగించింది. సిలిండర్ పేలి ముగ్గురు మరణించడం ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో మొదట అది ప్రమాదమనుకున్నారు. కాని కాదు ఓ కుటుంబం గ్యాస్ సిలిండర్ పైప్ ను కట్ చేసి ప్రమాదాన్ని సృష్టించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇదే ఇప్పుడు కీలకాంశం.విశాఖ నగరంలోని సాగర్ నగర్ గుడ్లవాని పాలెంలో జరిగింది ఈ  ఘటన. హెచ్ఐజీ 101 ఫ్లాట్ లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఉమామహేశ్వరరావు, కుమార్తె లావణ్య, కొడుకు సతీష్ చంద్ర అద్దెకుంటున్నారు. ఇరుగుపొరుగుతో పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.అర్ధరాత్రి సడెన్ గా గ్యాస్ సిలెండర్ పేలడం తో హుటాహుటిన ఫైర్ సేఫ్టీని పిలిపించారు. అప్పటికే లావణ్య చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న సతీష్ చంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.ఇక ఉమామహేశ్వరరావు చికిత్స పొందుతూ చనిపోయాడు.గ్యాస్ పేలినప్పుడు సౌండ్ వంద మీటర్ ల వరకూ వినిపించింది. అద్దాలు పగిలి ఎగిరిపడ్డాయి. పొరుగిళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.పిల్లలు ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే గత ఉమామహేశ్వర రావ్ కొంత కాలంగా  డిప్రెషన్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఎందుకు వారి కుటుంబం ఇంత దారుణానికి పాలైందో తెలియక ఇరుగు పొరుగు అయోమయంలో ఉన్నారు. ఒక్కసారీగా ఇంత పెద్ద ఎత్తున ఎగిసిపడిన భారీ మంటలకు మరియు భారీగా వచ్చిన శబ్దాలకు పక్కన ఇళ్ళ వస్తువులు,అద్దాలు,కిటీకీలు కూడా ధ్వంశం అవ్వడం చూసి అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు.ఇక పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టీఆర్ఎస్ కు ఊహించని షాక్.. ఫుల్ జోష్ లో కాంగ్రెస్!!

  రాజకీయాల్లో ఎప్పుడు ఏ పార్టీ.. ఏ ఇతర పార్టీకి మద్దతిస్తుందో ఊహించడం చాలా కష్టం. అలాంటిదే హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతివ్వడం. అసలు సీపీఐ తీసుకున్న నిర్ణయానికి దాదాపు అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు సీపీఐ మద్దతు ఉపసంహరించుకొని టీఆర్ఎస్ కు ఊహించని షాకిచ్చింది. హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టుగా గ‌త‌వారంలో సీపీఐ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే.. మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ కు స‌పోర్ట్ చేస్తున్న‌ట్టుగా సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే సీపీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వామపక్షాలను తోక పార్టీలన్న కేసీఆర్ చెంతకు ఎలా చేరతారంటూ పలువురు విమర్శలు గుప్పించారు. క‌మ్యూనిష్టుల‌పై నానావిమ‌ర్శ‌లు చేసిన కేసీఆర్ కి ఎలా మ‌ద్ద‌తు ఇస్తారు?, చేజేతులా పార్టీని ఉనికి కోల్పోయేట్టు చేస్తున్నారంటూ సీపీఐ తీరుపై విమ‌ర్శ‌లు వినిపించాయి.  దానికితోడు అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె తెర మీదికి వ‌చ్చింది. దీంతో హుజూర్ న‌గ‌ర్లో టీఆర్ఎస్ కి ఇచ్చిన మ‌ద్ద‌తుపై సీపీఐ పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. వామపక్షాలు అంటేనే కార్మికుల పక్షాన పోరాడే పార్టీలుగా పేరుంది. అలాంటిది కేసీఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా అంతమంది కార్మికులు రోడ్డెక్కితే.. అదే కేసీఆర్ పార్టీకి మద్దతిచ్చి తప్పు చేస్తారా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో సీపీఐ ఆలోచనలో పడింది. చివ‌రికి టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తుని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టుగా చాడా వెంక‌ట రెడ్డి ప్ర‌కటించారు. ఆర్టీసీ ప‌ట్ల కేసీఆర్ అనుస‌రిస్తున్న వైఖ‌రి మీద విముఖ‌త తెలుపుతూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెంక‌ట‌రెడ్డి చెప్పారు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా హుజూర్ న‌గ‌ర్లో టీఆర్ఎస్ కి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అనుకున్నామ‌నీ, అప్ప‌టికి ఆర్టీసీ కార్మికుల స‌మ్మె మొద‌లుకాలేద‌ని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయ‌మైన‌ డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కూ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తామ‌ని చాడా వెంక‌ట రెడ్డి స్పష్టం చేసారు.  సీపీఐ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డం టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే హుజూర్ న‌గ‌ర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ని ఓడించడం అంత తేలిక కాదు. అందుకే టీఆర్ఎస్.. సీపీఐ ఓటు బ్యాంకుపై ఆధార‌ప‌డాల‌నుకుంది. కానీ, ఇప్పుడు సీపీఐ ప‌క్క‌కి త‌ప్పుకుంది. సీపీఐ తాజా నిర్ణ‌యంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అయితే, టీఆర్ఎస్ కు దూర‌మైన సీపీఐ.. మరి కాంగ్రెస్ కి మ‌ద్ద‌తు ఇస్తుందా? లేక వేరే ఏదైనా పార్టీకి మద్దతిస్తుందో చూడాలి.

సౌదీ అరేబియా తీరంలో ఇరాన్ కు చెందిన చమురు ట్యాంకర్ పై దాడి...

    సౌదీ అరేబియా తీరంలో ఇరాన్ కు చెందిన చమురు ట్యాంకర్ పై దాడి జరిగింది. జెద్దా తీరంలో చమురు తీసుకెళుతున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్టుగా ఇరాన్ మీడియా తెలిపింది. ట్యాంకర్ లో పేలుడుతో చమురు ఎర్ర సముద్రం లోకి లీకైంది. సౌదీ అరేబియా జెద్దాకు సమీపంలో ఉన్న తీరం వద్ద ఇరాన్ కు చెందిన ఇంధన ట్యాంకర్ పేలింది. ఇరాన్ కు చెందిన నేషనల్ కంపెనీ ఆయిల్ కూడా భారీ ఇంధనంతో వెళ్తుండగా జెద్దా పోర్ట్ కు అరవై నాటికల్ మైళ్ల దూరంలో మిస్సైళ్ల తో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఓడలో ఉన్న రెండు ప్రధాన చమురు స్టోరేజీ ట్యాంకులు ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఎర్ర సముద్రంలోకి చమురు లీక్ అవుతోంది. ఓడను మిసైల్ ఢీకోట్టినట్లు ఆయిల్ కంపెనీ చెప్తుండగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇంకా బయటకు రాలేదు. ఇంధన ట్యాంకర్ ల నుంచి వెలువడిన మంటలను ఆర్పినట్లు ఇరాన్ ప్రకటించింది. సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపధ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో సౌదీ అరేబియాలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రం అరంకోకు చెందిన రెండు భారీ స్టోరేజ్ కేంద్రాలపై మిస్సైళ్ల దాడి జరిగింది. ఈ దాడులకు ఇరాన్ కారణమని అమెరికా సౌదీ దేశాలు ఆరోపించాయి. అయితే దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

ఈ.ఎస్.ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్

  కార్మిక బీమా వైద్య సేవల సంస్థ ఈ.ఎస్.ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మొత్తం రెండు వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అంచనా వేస్తున్న ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకూ పదమూడు మంది నిందితులను అరెస్టు చేసిన అధికారులు తరువాత ఏడుగురు నిందితులను రెండ్రోజుల పాటు తమ కస్టడీ లోకి తీసుకోనున్నారు. ఈ.ఎస్.ఐ ఐ.ఎం.ఎస్ విభాగంలో మందుల కుంభకోణం కేసులో ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. ఈ కేసులో పదమూడు మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు దేవికారాణి, పద్మ, రాధికతో పాటు మరో నలుగురిని బుధవారం నుంచి రెండు రోజుల పాటు కోర్టు అనుమతితో ఏసీబీ కస్టడీ లోకి తీసుకోనుంది. ప్రస్తుతం వీరంతా చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. దేవికారాణితో పాటు మిగతా ఆరుగురిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించటం వల్ల కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించారని అధికారులు భావిస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమాల్లో ఎవరెవరి వాటా ఎంత, ఫార్మా సంస్థల ప్రతినిధులతో ఏ విధంగా కుమ్మక్కయ్యారు అనే అంశాలు తేల్చే పనిలో ఏసీబీ అధికారులున్నారు. దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు భావిస్తున్న విచారణ బృందం ఇందుకు ఎవరెవరు సహకరించారనే ఆధారాలు సేకరిస్తున్నారు. అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేయడం, నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించటం డిస్పెన్సరీ లకు చేరాల్సిన రోగ నిర్ధారణ పరీక్షల కిట్ లను ప్రైవేటు వ్యక్తులకు చేరవేసి బహిరంగ మార్కెట్ లో విక్రయించడం వంటి మోసాలకు ఈ.ఎస్.ఐ ఆధికారులు ఫార్మా సంస్థలతో కలిసి పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఆయా అంశాలపై నిందితులను పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధమైంది. నిందితుల కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టిన తర్వాత మరి కొంత మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి ఫార్మసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ ఆఫీస్ ఉద్యోగి పాషాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

విజయసాయిరెడ్డిపై వంద కోట్ల పరువు నష్టం దావా!!

  టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు వైసిపి నేత విజయసాయిరెడ్డిపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించామని రవిప్రకాష్ మేనేజర్ తెలిపారు. ఎబిసిఎల్ సంస్థ లోకి రామేశ్వరరావు, మేఘా క్రిష్ణారెడ్డి చట్ట వ్యతిరేఖంగా ప్రవేశించారని వారిద్దరే రవిప్రకాష్ పై ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. నెల క్రితం ఇవే ఆరోపణలను రామేశ్వరరావు, మేఘా క్రిష్ణారెడ్డి అనుచరుడైన రామారావు లిఖిత పూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ఆరోపణలు కేవలం గాలి కబుర్లే నని అధికారులు నిర్ధారించారని వివరించారు. అప్పట్లో రామారావు పంపిన లేఖ ప్రతినే ఎంపీ విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై ఇప్పుడు పంపించారని పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన చానళ్లపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు రవిప్రకాష్ మేనేజర్ ఆ ప్రకటనలో వివరించారు. మీడియాను అడ్డం పెట్టుకుని రవిప్రకాష్ అక్రమంగా భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారని నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ వీటిపై ఈడీ, సిబిఐ విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్ కు విజయసాయిరెడ్డి తాజాగా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఫెమా ఆర్.బీ.ఐ రెగ్యులేషన్స్ మనీ లాండరింగ్ తోపాటు ఆదాయ పన్ను ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. మోయిన్ ఖురేషి, సానా సతీష్ తో కలిసి చాలామందిని మోసం చేశారని సానా సతీష్, మొయిన్ ఖురేషి, రవిప్రకాష్ కలిసి నకిలీ డాక్యుమెంట్ లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు. హవాలా సొమ్మును కెన్యా, యుగాండాలో సిటీ కేబుల్లో రవిప్రకాష్ పెట్టుబడులు పెట్టారని రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితా పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను చీఫ్ జస్టిస్ కు విజయసాయి లేఖలో తెలిపారు. అలంద మీడియా కేసులో అరెస్టయిన టీవీ నైన్ మాజీ సీఈవో రవిప్రకాశ్ పై వై.యస్.ఆర్.సి.పి ఎంపి విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ తో విచారణ జరిపించాలని ఆయన చేసిన స్కామ్ లపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ సిజెకి విజయసాయి లేఖ రాశారు. రవిప్రకాష్ పై ఈడీ, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విజయసాయి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది. గతంలో జగన్ ను రవిప్రకాష్ టార్గెట్ చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. టిడిపికి అనుకూలంగా వై.యస్.ఆర్.సీ.పీ కి వ్యతిరేకంగా రవిప్రకాష్ పని చేశారని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. టీవీ 9 కొత్త యాజమాన్యం అధీనం లోకి వెళ్లాక కూడా సి.ఇ.ఒ పదవి నుంచి వైదొలగడానికి రవిప్రకాష్ అంగీకరించలేదని, తన మాటను చెల్లుబాటు చేసుకోవటానికే ప్రయత్నించారని వార్తలొచ్చాయి. ఇప్పుడు రవిప్రకాష్ చేతుల్లో ఏ మీడియా లేక పోయినప్పటికీ త్వరలోనే ఓ మీడియా ఛానల్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఆ ప్రయత్నాలు మొగ్గ లోనే తుంచివేయడం కోసమే ఆయనపై విజయసాయిరెడ్డి సీజేకి లేఖ రాశారని తెలుస్తోంది. ఏబీసీఎల్ సంస్థలో చట్ట వ్యతిరేకంగా ప్రవేశించిన రామేశ్వరరావు మేఘా క్రిష్ణారెడ్డి ద్వయం ఈ నీచమైన ఆరోపణలు చేస్తోందని రవిప్రకాష్ కార్యాలయం ఆరోపించింది. నెల క్రితం ఇవే అసత్య ఆరోపణలు రామేశ్వరరావు, మేఘా క్రిష్ణారెడ్డి అనుచరుడైన రామారావు అనే వ్యక్తితో లిఖిత పూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని ఇప్పుడు అవే ఆరోపణలు పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి చేస్తున్నారనీ రవిప్రకాష్ మీడియా కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కట్టుకథలు వెనుక ఈ పెద్దలే ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంది.

'రైతు భరోసా' పథకం లబ్ధిదారుల జాబితాలో ఏపీ మంత్రి పేరు!!

  వైయస్ఆర్ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా  ఉండటం కలకలం రేపింది.ఒక్కసారిగా అధికారులు కూడా హుటాహుటిన ఆయన పేరును తొలగించేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల్లో ప్రారంభించనున్న వైయస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను రాష్ట్రమంతా విడుదల చేశారు. ఈ జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు కూడా చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం, గణపవరం మండలంలో విడుదల చేసిన జాబితాలో మంత్రి పేరుంది. విషయం తెలుసుకున్న మంత్రి ఈ పొరపాటు ఎలా జరిగిందో విచారణ జరిపించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. జాబితాలో పొరపాటు జరిగిందన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పథకాల లబ్ధిదారుల జాబితాను విడుదల చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని సూచించారు మంత్రి ఆదిమూలపు సురేష్.     ఆదిమూలపు సురేష్ పేరు ఆయన కోడ్,డీటైల్స్ ఆయన తండ్రి పేరు అన్నీ చాలా స్పష్టంగా వైయస్ఆర్ రైతు భరోసా గ్రామ అర్హుల జాబితాలో ఉంది. క్రమ సంఖ్య 223 అలాగే పట్టాదారుల ఖాతా 1881 చాలా స్పష్టంగా ఉంది. ఆయన కూడా దీనిని అంగీకరించారు.ఈ వివరాలన్ని తనవేనని, కానీ ఇందులోకి ఎలా వచ్చాయో అన్న విషయం పై విచారణ జరిపిస్తున్నట్లు తెలియజేశారు.ఈ పధకం కింద లబ్దిపొందాలంటే దాదాపుగా  ఐదెకరాలకు మించి పొలం ఉండకూడదు అలాగే ఆదాయపు పన్ను కడుతున్నా కూడా దీనికి అర్హులు కారు.  అయితే మంత్రి సురేష్ పేరు ఇక్కడ రావడంతో ఆయన ఇంతకు ముందు గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా ఈ రైతు భరోసా పథకం కింద ఏమన్నా లబ్ధిదారిగా ఉన్నారా లేకపోతే కొత్తగా ఈయన పేరు నమోదు చేశారా అనే విషయం కూడా  విచారణకు స్వీకరించారు. ప్రస్తుతం ఐతే పేరును తోలగించడమే కాక విచారణ జరుపుతున్నట్లు తెలియజేస్తున్నారు అధికారులు. 

ఒక్క మ్యాచ్ లో కోహ్లీ రెండు అరుదైన రికార్డులు

  పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చేశాడు. రెండో రోజు ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 63 వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ.. 295 బంతుల్లో 28 ఫోర్ల సాయంతో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 254 పరుగులతో  అజేయంగా నిలిచాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది ఏడో డబుల్ సెంచరీకాగా.. భారత్ తరఫున టెస్టుల్లో ఏడో ద్విశతకం నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ మరో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. కెప్టెన్‌గా తొమ్మిదిసార్లు 150కి పైగా స్కోర్ చేసి.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, బ్రాడ్‌మన్ ఎనిమిది సార్లు 150కి పైగా స్కోర్ చేశాడు. అంతేకాదు.. టెస్టుల్లో 7 వేల పరుగుల మైలురాయిని దాటాడు కొహ్లీ. కాగా, భారత్ 601/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

చెన్నై చేరుకున్న చైనా ప్రెసిడెంట్...

  చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు, చెన్నై విమానాశ్రయంలో జింగ్ పింగ్ కు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళని స్వామి జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. జిన్ పింగ్ రాక సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర పారంపర్య కళలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి జిన్ పింగ్ విశ్రాంతి తీసుకోనున్న గిండి లోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ వరకు స్వాగత ఏర్పాట్లు చేశారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత జిన్ పింగ్ సాయంత్రం నాలుగు గంటలకు మహాబలిపురం బయలుదేరుతారు. చెన్నై విమానాశ్రయంలో పరింది మలై డిప్యూటీ కమిషనర్ ప్రభాకర్ నేతృత్వంలో ముగ్గురు సహాయ కమిషనర్ లు, ఏడుగురు ఇన్ స్పెక్టర్ లు, ఇరవై ఒక్క మంది ఎస్.ఐ లు, నూట ఇరవై మంది కానిస్టేబుళ్లు, భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. విమానాశ్రయం నుంచి జిన్ పింగ్ బయటకు వచ్చే దారిలో ఇద్దరు డిప్యూటీ కమిషనర్ లు, ఆరుగురు సహాయ కమిషనర్ లు, పదహారు మంది ఇన్ స్పెక్టర్ లు, నలభై ఎనిమిది మంది ఎస్సైలు, మూడు వందల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. గిండీ లో జిన్ పింగ్ బస చేయనున్న ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ కు సేలం డీఐజీ నేతృత్వంలో ఏడంచెల భద్రత కల్పించారు. గిండీ నుంచి మహాబలిపురం వరకు ముప్పై నాలుగు ప్రాంతాల్లో రాష్ట్రంతో పాటు దేశంలోనూ ప్రాచుర్యం పొందిన ముప్పై నాలుగు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్ధులు, మహిళా స్వయం సహాయ బృందాలు స్వాగతం పలకనున్నాయి. సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు మహాబలిపురంలో అర్జున తప్పసు వద్దకు చేరుకోగానే ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఇరువురు నేతలు కోవలంలోని తాజ్ ఫిషర్ మెన్ హోటల్ కు చేరుకుంటారు. శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత జిన్ పింగ్ తో కలిసి శనివారం మహాబలిపురం లోని సీషోర్ టెంపుల్, అర్జున తపస్సు, ఐదు రథాలు, వెన్నముద్ద రాయి మొదలైన చారిత్రిక చిహ్నాలను మోదీ సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి సీషోర్ టెంపుల్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాల కోసం రెండు ఆడిటోరియంలు పచ్చిక మైదానాలను సిద్ధం చేశారు.

నోరుజారిన చెవిరెడ్డి.. మెగా అభిమానులకు కోపమొచ్చింది!!

  ఏపీ సీఎం వైఎస్ జగన్‌, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఈరోజు జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు వీరిద్దరూ భేటీ కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో జగన్ అపాయింట్‌మెంట్ కోరిన చిరంజీవి ఈ సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించేందుకే ఆయనను కలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి. సీఎం అపాయింట్‌మెంట్ కోరిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు అపాయింట్‌మెంట్ ఖరారైంది. దీంతో చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి జగన్‌ను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అనివార్య కారణాల వలన ఈ భేటీని 14వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం. అయితే ఇంతలోనే, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి చిరంజీవిని కించ పరిచేలా ఒక పోస్ట్ వెలువడింది. ” ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి, చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జగన్ అరెస్ట్ అయ్యారు. అప్పుడు రామ్ చరణ్ సంతోషం పట్టలేక, 'చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది' అని కామెంట్ చేసారు. వైయస్ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి. అదే తండ్రీ కొడుకులు ఇప్పుడు జగన్ దర్శనం కోసం పడిగాపులు పడి అనుమతి సంపాదించారు. తన సినిమాను ప్రత్యేకంగా చూడాలంటూ ప్రార్థించబోతున్నారు. అదే కాల మహిమ అంటే” అని రాసుకొచ్చారు.  అయితే చెవిరెడ్డి వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుని కూడా తన సినిమా చూడమని చిరంజీవి అడిగారని, అదే కోవలో ఇప్పుడు జగన్ ని కోరుతున్నారని, దీన్ని ఆసరాగా తీసుకుని చిరంజీవిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వారంటున్నారు. స్వయం కృషితో పైకి వచ్చిన చిరంజీవి మీద విమర్శలు చేసే స్థాయి చెవిరెడ్డి కి లేదని మండిపడుతున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకు వేసి, ఈరోజు శుక్రవారం కాబట్టి , అక్రమ ఆస్తుల కేసులో విచారణ కోసం జగన్ కోర్టుకు హాజరు కావాలని, అందుకే జగన్ అపాయింట్మెంట్ వాయిదా వేసి ఉంటారని సెటైర్ వేస్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి సోషల్ మీడియా అకౌంట్ లో వచ్చిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ప్లాస్టిక్ పాలు!!

  మనం ఎన్నో రకాల కల్తీలు చూస్తుంటాం. కానీ స్వఛ్చంగా భావించే పాలు కూడా ప్లాస్టిక్ ఐతే అనే ఆలోచన అందరిలో అలజడి రేపుతోంది .హైదరాబాద్ లో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి. పాల ప్యాకెట్ ను కట్ చేసి కాగబెట్టి గానే ప్లాస్టిక్ ముద్దగా మారిపోతున్నాయి. ఇలాంటి పాలను ఏమరపాటుగా తాగితే అంతే సంగతులు. ప్రగతినగర్ లో ఈ కల్తీ పాల వ్యవహారం బయటపడింది. పవన్ సౌమ్య దంపతులు ప్రగతినగర్ లో నివాసముంటున్నారు. ప్రగతినగర్ చౌరస్తా వద్ద ఉన్న సాయితేజా మిల్క్ సెంటర్ లో రెండు పాల ప్యాకెట్ లను కొని ఇంటి కి తీసుకొచ్చాడు పవన్. భార్య సౌమ్య ఒక అర లీటర్ ప్యాకెట్ ను గిన్నెలో పోసి స్టౌ పై కాగపెట్టింది.పాలు ఒక్కసారి గా విరిగిపోయి ప్లాస్టిక్ ముద్దలాగా మారిపోయాయి. గిన్నె ఏదైనా బాలేదేమోనని  మరోక పాకెట్ పాలను వేరే గిన్నెలో పోసి వాటిని కాగపెట్టారు. ఆ పాలు కూడా ప్లాస్టిక్ ముద్దగా మారడంతో సౌమ్యా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. పాల గురించి మిల్క్ సెంటర్ నిర్వాహకుడు నరసింహను ప్రశ్నిస్తే అతను దురుసుగా సమాధానమిచ్చాడు.ఈ పాలను చిన్నపిల్లలు తాగితే ప్రాణానికే ప్రమాదమని ఇలాంటి పాలను అమ్మవద్దని చెప్పినా నిర్వాహకుడు పట్టించుకోలేదు.ఇక చేసేది లేక పవన్ దంపతులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు.బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. "ఎప్పడు తమకు పాలు పోసే పాలవాడు దసరా సెలవుల సందర్భంగా ఊరు వెళ్లిన కారణంగా తాము దగ్గరలో ఉన్న పాల బూత్ కు వెళ్లి పాలు తెచ్చుకున్నామని,కానీ అవి కాచిన వెంటనే ప్లాస్టిక్ ముద్దగా మారటం చూసి ఆశ్చర్యపోయామని బాధితుదు తెలియజేశారు.ఇలా జరగటం పై ఆ బూత్ యజమానిని ప్రశ్నించగా అతడు దురుసుగా ప్రవర్తించిన తీరును వ్యక్తం చేశాడు".అభం శుభం తెలియని పసి పిల్లలు ఈ పాలను తాగితే వారి ప్రాణాలకే ప్రమాదం ఉండవచ్చు.అసలు ఇటువంటి కల్తీ సరుకుని అనుమతిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఏం చేస్తున్నారోనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మద్యం పాలసీ.. మరో బాంబు పేల్చనున్న ఏపీ సర్కార్!!

  నవరత్నాలల్లో ఒకటైన మద్యం నిషేధం పై ప్రభుత్వం పై తీవ్ర దృష్టి పెడుతోంది. మద్య నిషేధం దిశగా మరో కీలక అడుగు వేసే యోచనలో ఏపీ సర్కారు ఉంది. రెండు వేల ఇరవై రెండు వరకు లైసెన్సు ఉన్న బార్ల  వేళలను కుదించడమే కాక పూర్తిగా రద్దు చేయడమా అనే అంశం కూడా ఆలోచన నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది.ప్రస్తుత నిబంధన ప్రకారం మందు బాబులు బార్లకు వెళ్లి మద్యం సేవిస్తున్నారని వాటిని కూడా మూసివేస్తే మంచి పేరు వస్తుందని కొందరు అధికారులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మద్య నిషేధం దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోంది. రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన వైసీపీ ఏడాదికి ఇరవై శాతం చొప్పున మద్యం దుకాణాన్ని మూసేస్తామని బెల్టు షాపులు పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించింది.అయితే బెల్టు షాపుల్ని ఇప్పటికే తొలగించగా ఈ ఏడాది మద్యం దుకాణాలు ఇరవై శాతం తగ్గించి మూడు వేల ఐదు వందల షాపులు మాత్రమే ఏర్పాటు చేసింది వీటిని కూడా ప్రభుత్వమే ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడం ప్రారంభించింది.ఈ షాపుల వేళలు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కుదించింది. అయితే రాత్రి ఎనిమిది గంటల కు మద్యం దుకాణాల మూతపడుతుండటంతో మద్యం ప్రియులు బార్లకు వెళ్లి మద్యం సేవిస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది పైగా ప్రభుత్వం కూడా మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యానికి ఫుల్ బాటిల్ కు ఎనభై రూపాయల చొప్పున పెంచింది. ఈ పరిణామంతో బార్ల వ్యాపారం పెరిగింది.మందు బాబులకు ఖర్చు తడిసి మోపెడవుతోందని తెలియడంతో బార్లో వేళలు కూడా కుదించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మద్యం షాపులు మాదిరిగా చేయాలని భావిస్తున్న తరుణంలోనే మరికొంతమంది అసలు బార్ల లైసెన్స్ ను కూడా ఉపసంహరిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని కూడా పలువురు కీలక నేతలకు సూచించారు. రాష్ట్రంలో ఎనిమిది వందల బార్లున్నాయి.ఇందులో విజయవాడ, గుంటూరు,విశాఖపట్నం నగరంలోని సుమారు యాభై శాతం వరకు ఉన్నాయి. అయితే యజమానులు అక్రమాలకు పాల్పడే సమయంలో లైసెన్స్ సస్పెండ్ చేయడం లేదా రద్దు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ ముప్పై రెండు ప్రకారం సస్పెన్షన్, క్యాన్సిలేషన్, విత్ డ్రాకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో 1995 జనవరి 17న రాష్ట్రంలో మద్య నిషేధం విధించారు. అయితే లైసెన్స్ 1997 మార్చి 31 వ తేదీ వరకు ఉంది. దీని పై మద్యం షాపుల యజమానులు ఆ సమయంలో హైకోర్టునాశ్రయించారు విచారణ తర్వాత సెక్షన్ ముప్పై రెండు ప్రకారం లైసెన్సులను వితడ్రా చేసే అధికారం ఉందని ఇందులో ఎటువంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేసింది.ప్రస్తుతం మద్యం వ్యాపారులు కొందరు అప్పటి హై కోర్టు తీర్పును ఉదాహరిస్తున్నారు. మద్యం షాపుల్ని ఏపీబీసీఎల్ నిర్వహిస్తుండగా ఇంటి దగ్గర మద్యం సేవించలేదని మందు బాబులు గతంలో షాపులు బాటిల్ కొనుగోలు చేసి పర్మిట్ రూమ్ లో కూర్చొని మద్యం సేవించేవారు. కానీ ఇప్పుడు ఆ పర్మిట్ రూమ్ లు లేకపోవటం తో బార్లకు వెళ్లడం ప్రారంభించారు. దీని వల్ల వారికి ఖర్చు పెరిగిపోయిందని చెబుతున్నారు.వేళలు కుదించటం ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయాలకు పూనుకోవడం ద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుండగా అందుకు విరుద్ధంగా ప్రభుత్వానికి మందు బాబుల నుంచి శాపనార్థాలు పెరగటంతో బార్ల లైసెన్స్ ను కూడా ఉపసంహరిస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రారంభమైంది.ఇప్పుడు ఈ అంశంపై మద్యం వ్యాపార వర్గాల తర్జన భర్జన పడుతున్నాయి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దామ లేదా అనే అంశంపై కూడా సతమత పడుతున్నారు. తమకు ఎలాంటి సంకేతం లేనప్పుడు ఎందుకు తొందరపడాలని కొంత మంది మద్యం వ్యాపారులు అంటున్నారు.జగన్ సర్కార్ నిజంగానే నిర్మూలించే అవకాశలు కొంతమెరకు కనిపిస్తున్నాయి.