కొనసాగుతున్న గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు...

  తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గోదావరి వరద తగ్గటంతో ధర్మాడి సత్యం టీమ్ రంగంలోకి దిగి ఆపరేషన్ కొనసాగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోట్ వెలికితీత పనులు మళ్లీ రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే నిన్నంతా దేవీపట్నం నుంచి కేవలం ఐరన్ రోప్ లతో పాటు తాళ్లు అన్నీ తీసుకొని అలాగే ధర్మాడి సత్యం బృందంకి సంబంధించి ఒక ఇరవై ఐదు మంది బృందం దేవీపట్నం నుంచి కచ్చులూరుకు రావడం జరిగింది. మళ్లీ పంటల మీద ఉన్న రోప్ అంతటిని కూడా గోదావరి మధ్యలోకి ఎక్కడైతే ప్రమాదం జరిగిందని చెప్తున్నారో ఆ ప్రమాద ఘటన జరిగిన స్థలం దగ్గర నుంచి రోప్ లు వేసుకొని రావటం జరుగుతుంది. గోదావరి వరద ఉధృతి తగ్గు ముఖం పట్టడంతో గోదావరి లోతు కూడా తగ్గింది. ఘటన జరిగిన సమయంలో చూసినట్లయితే రెండు వందల పదిహేను అడుగుల వరకు ఉన్న గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు సుమారు ముప్పై నుండి నలభై అడుగుల వరకు దాని నీటి మట్టం తగ్గడం జరిగింది. స్తుతం మొత్తం నూట డెబ్బై నుంచి నూట ఎనభై అడుగుల వరకూ కూడా లోతు ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. రోప్ సాయంతోటి యాంకర్ లన్నింటినీ కూడా గోదావరిలోకి దింపడం జరిగింది. గోదావరిలోకి దింపిన తర్వాత అక్కడి నుంచి ఘటన ఎక్కడ అయితే జరిగిందో దానికి పదిహేను మీటర్లకి ముందు నుంచి ఈ యాంకర్ లన్నింటినీ వేయటం జరిగింది. ప్రస్తుతం నాలుగు యాంకర్ లను ఉపయోగిస్తున్నారు, ఈ నాలుగు యాంకర్లను కూడా పై నుంచి లాక్కొని వచ్చి అక్కడ నుంచి కూడా కిందకి లాక్కురావడం జరుగుతది. ఎక్కడైతే పట్టుబడతదో ఆ పట్టుపట్టిన తరువాత అప్పుడు రోప్ సాయంతో లాగుతారు. ఇప్పటికే బోటు వెలికితీతకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు కాగా తర్వాత సుమారు ఎనిమిది లక్షల వరకు కూడా ఖర్చు కావటం జరుగుతది. అయితే ధర్మాని సత్యానికి సంబంధించిన బాలాజీ మెరైన్ సంస్థ ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే పది లక్షల ఖర్చు చేసిన కారణంగా ఒకవేళ బోటు తీయలేని పక్షంలో మొత్తం నష్టం వాటిల్లుతుందేమో అని  చెప్పి ఎలాగైనా బోటును బయటకు తీయాలనే కృతనిశ్చయంతో సత్యం బృందం మొత్తం ప్రయత్నించడం జరుగుతున్నది.    

దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసుకు తెర పడబోతోందా?

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయం లో హిందువులు ముస్లింల మధ్య శతాబ్ద కాలానికిపైగా వివాదం నడుస్తోంది.పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం పెద్దదైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది చనిపోయారు. ఆ సంఘటన తర్వాత అయోధ్యలోని భూమిపై వివాదం నడుస్తోంది. ఈ కేసును అలహాబాద్ హై కోర్టు విచారించింది. రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైన తీర్పు ప్రకటించింది. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించారని అలహాబాద్ హై కోర్టు తీర్పిచ్చింది .ఈ మూడు భాగాల్లో ఒక భాగం హిందూ మహాసభ ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.అలహాబాద్ హై కోర్టు రెండు వేల పది సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పులో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది. అక్కడున్న ఒక దేవాలయాన్ని కూల్చేసిన తరవాత మసీదు నిర్మించారని  పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పై ఇరువర్గాల సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, దీంతో సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సస్పెండ్ చేసింది.సుప్రీం కోర్టులో ఈ కేసును తుది దశకు చేరుకుంది. ఎట్టకేళ్ళకు అయోధ్య భూ వివాదం విచారణ ఇవాళ ముగియనుంది. సుప్రీం కోర్టు ఈ కేసులో వాదనలను ఇవాళ మధ్యాహ్నంలోగా ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.దీనికి సంబంధించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ సూచనప్రాయంగా తెలియచేసింది.హిందూ ముస్లిం పక్షాలు తమ తమ అభిప్రాయాల్ని సమర్పించటానికి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ముప్పైతొమ్మిది రోజుల నుంచి సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబర్ పధ్ధెనిమిదివ తేదీనాటికల్లా విచారణ పూర్తి చేయాలనుకుంది. ఆ తర్వాత అందుకు ఒక రోజు ముందే అంటే పదిహెడువ తేదీన తుది గడువుగా పెట్టుకుంది.ఇప్పుడు అంతకంటే ముందే ఇవాళ విచారణని పూర్తి చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. అయోధ్యలోని రామజన్మభూమి వద్ద మసీదును నిర్మించడం ద్వారా మొఘల్ చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారంటూ మహన్ సురేష్ దాస్ అనే హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది పరాశరన్ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట తన వాదనని వినిపించారు. అయోధ్యలో పలు మసీదులున్నాయని అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని అయితే హిందువులు మాత్రం శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చలేరని అన్నారు. అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వానికి తావు లేదని సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడం మంచిదని ఇండియన్ ముస్లీమ్స్ ఫర్ పీస్ అనే సంస్థ చేసిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు.ఈ మాటను ఆ సంస్థ మధ్యవర్తిత్వం సాగుతున్న సమయంలో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పుడు ఆ గడువు మించిపోయిందని చెప్పారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ పదిహెడున రిటైర్ కానున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు నవంబర్ నాలుగు నుంచి పదిహేనులోగా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్ పదిహెడవ తేదీలోగా చీఫ్ జస్టిస్ గొగోయ్ తీర్పు ప్రకటించలేకపోతే ఆ అంశాన్ని కొత్త ధర్మాసనం విచారిస్తోంది. సుప్రీంకోర్టు వివాదాస్పద భూమి ఎవరికి చెందుతుందనే అంశంపై తీర్పు నివ్వనుంది.ఆ భూమి ఎవరికి చెందుతుంది ఏ భాగం ఎవరికి లభిస్తుందని అంశంమ్మీద స్పష్టతనిస్తూ సిజెఐ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ ధర్మాసనం సమర్థించవచ్చు.అలాగే అన్ని పక్షాలకు ఉత్తమమని తాను భావించిన విధంగా ఆ భూభాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం విభజించే అవకాశం కూడా ఉంది.తీర్పు వెలువరించే రోజు అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం మీదకొచ్చి తీర్పులో తాము రాసిన భాగాన్ని ఒక్కొక్కరిగా చదివి వినిపిస్తారు.సిజిఐ స్వయంగా తీర్పు చదవడం ప్రారంభించే అవకాశం కూడా ఉంది. అయితే అయోధ్యపై వేసిన పిటిషన్ను సున్నీ వక్ఫ్ బోర్డ్ విత్ డ్రా చేసుకుంటుందన్న ఒక కీలక మలుపు  కూడా వినిపిస్తోంది.మొత్తానికి దశాబ్దాల కాలానికి చెందిన ఈ కేసుకు నేటితో తెర పడబోతోంది. ఏమి జరగబోతోందో వేచి చూడాలి. 

అందుకోసమే రాజధాని నిర్మాణాలు ప్రభుత్వం ప్రారంభించిందా..?

  రాజధాని నిర్మాణానికి భూసేకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పదమూడు ప్యాకేజీల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇందులో సిమెంటు రహదారులు, విద్యుత్, మంచి నీరు పైపు లైన్లు, అత్యంత అధునాతనమైన రహదార్లు, సైకిల్ ట్రాక్ ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. పదిహేడు వేల కోట్ల రూపాయల పనులను ఐదు వేల కోట్ల రూపాయలకు తగ్గించాలని భావిస్తుంది. సిమెంట్ రహదారుల స్థానంలో తారు రోడ్డు, సైకిల్ ట్రాక్ ఎత్తేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులకు సూచించింది. రాజధానులు, రహదారుల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధానిలో రహదారుల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లను పిలిచింది. అనేక రహదారుల నిర్మాణం దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం వరకు పూర్తయ్యాయి, కొన్ని రహదారుల నిర్మాణం ప్రారంభం కాలేదు. అవసరమైన రహదారుల నిర్మాణం మాత్రమే చేపట్టాలని మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలకు ఖర్చును కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాజధానుల్లో నిత్యం రాకపోకలకు అవసరమైన రహదారులను మాత్రమే చేపట్టాలని సూచించింది. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెప్తోంది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంస్థలు వెనక్కు వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని హై కోర్టును కూడా తరలిస్తున్నారనే ప్రచారం కోస్తా జిల్లాల్లో ఊపందుకోవడంతో పరిమిత వనరులతో అవసరమైన మేరకే రాజధాని నిర్మాణం చేపడితే ఈ ప్రచారానికి తెర దించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లే రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తుందని చెబుతున్నారు. 

రాజధాని పనుల్లో మళ్ళీ కదలిక ప్రారంభమైంది...

  అమరావతి నిర్మాణంలో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ప్రాథమిక చర్చలు ముగిశాయి. కాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదం పొందిన తర్వాత నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టు సంస్థలకు వర్తమానం పంపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి వరకూ రాజధానిలో నిర్మాణాల కోసం కాంట్రాక్టు సంస్థలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముప్పై ఐదు వేల మంది కార్మికులు వెనుదిరిగి వెళ్లిపోయారు. నివాస భవనాలు, సెక్రెటరీ టవర్లు, హైకోర్టు నిర్మాణం, మంత్రుల నివాసాలు నిర్మాణ దశలో ఉన్నాయి. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది, ప్రస్తుతం ఈ విచారణ జరుగుతోంది. నివేదిక అందిన తర్వాత అక్రమాలు ఉన్నాయో లేవో తేలుతోంది. అయితే ఇటీవల ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిలో పర్యటించారు. అనేక నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన పర్యటన అనంతరం ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. రెండ్రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తం పదమూడు పనులను నవంబర్ ఒకటవ తేదీ నుంచి పున ప్రారంభించాల్సిందిగా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులన్నీ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవోలూ, గెజిటెడ్ అధికారులు, సచివాలయ ఉద్యోగుల అపార్ట్మెంట్ నిర్మాణాలను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన మూడు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పనుల పున: ప్రారంభానికి లిఖిత పూర్వకంగా లేఖలు పంపాలని కూడా నిర్ణయించారు. గతంలో రద్దు చేద్దామనుకున్న హై కోర్టు, సచివాలయ టవర్లు, మంత్రి నివాస భవనాలు, సీఎం నివాసాలను హొల్డ్ లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే ఇప్పటికే ఈ భవనాల నిర్మాణం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పూర్తయింది. వీటిని రద్దు చేయటం మంచిది కాదని ఇంజనీరింగ్ నిపుణులు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెక్రటేరియట్, హెచ్ఓడి టవర్లు అంతస్తులు కుదించి పదిహేను లేదా ఇరవై అంతస్తులతో నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంతోంది. అయితే వ్యయం తగ్గదని భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టడం కూడా ఇబ్బంది అవుతుందని నిపుణులు సూచించినట్టు తెలుస్తుంది.

తగ్గుతున్న రెండువేల రూపాయల నోట్ల ముద్రణ అందుకోసమేనా..?

  రెండు వేల రూపాయల నోటును త్వరలో బ్యాన్ చేస్తారు, గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట ఇది. అయితే అలాంటిదేమీ లేదంటున్నాయి ఆర్బిఐ, కేంద్ర ఆర్థిక శాఖ. పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ప్రవేశ పెట్టిన రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించబోతున్నట్లు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న వార్తలకు కేంద్రం బలం చేకూర్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రెండు వేల నోటును కూడా ఆర్బిఐ ప్రింట్ చేయకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి పెద్ద నోట్లుగా చలామణి అయిన 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను 2016 నవంబర్ లో రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ క్రమంలో నోట్ల కొరతను తగ్గించేందుకు కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది ఆర్బీఐ. అయితే అది కూడా కొద్దికాలమే ఉంటుందని అప్పట్లోనే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగానే రెండు వేల రూపాయల నోటు ముద్రణ తగ్గిపోతూ వచ్చింది. 2016 -17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ ల రెండు వేల రూపాయల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లు, 2018-19 సంవత్సరంలో 46.690 మిలియన్ నోట్లను మాత్రమే ప్రింట్ చేసింది. ఈ ఏడాది ఒక్క రెండు వేల రూపాయల నోటును కూడా ఆర్బిఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం చేసింది. రెండు వేల రూపాయల నోట్ల వల్ల మనీ ల్యాండరింగ్ కేసులు పెరుగుతున్నట్లు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణ నిలిపేయాల్సిందిగా ఆర్బీఐని సూచించినట్టు తెలుస్తున్నది. ముద్రణ నిలిపివేసినా నోట్లు చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్న తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లు...

  టికెట్ ధరకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం, రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నాం ఇది ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ చేస్తోన్న ప్రకటన. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడా బస్సులు సరిపోవటం లేదు, నడుస్తున్న బస్సుల ఆదాయానికి సంబంధించిన లెక్కా పత్రం లేదు. అడిగేవారు లేకపోవడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఒక్కో బస్సులో పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. తీరా లెక్కలేసే సరికి నష్టాలు వస్తున్నాయని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. సమ్మె నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బస్సులు నడుపుతున్నా టిక్కెట్ ఇవ్వడం లేదు, టిక్కెట్ వ్యవస్థపై ఆర్టీసీ కసరత్తు చేయకపోవడంతో తాత్కాలిక కండెక్టర్ లు నోటిమాటగా ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా గుడ్డి లెక్కన సాగుతోంది. అడిగేవారు లేకపోవటంతో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న చాలా మంది కండెక్టర్ల పంట పండుతోంది. అధిక చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది, దీంతో అధికారులంతా హడావుడిగా ఏర్పట్లు చేశారు. హెవీ లైసెన్స్, బ్యాడ్జి నెంబర్ ఉన్న వారిని పరీక్షించి తాత్కాలిక డ్రైవర్ లుగా నియమించారు. అలాగే పదో తరగతి పాసైన వారికి కండెక్టర్ లుగా అవకాశం కల్పించారు. సమ్మె మొదలైన నాలుగైదు గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తైంది, చేరిక సందర్భంగా ఆయా కండెక్టర్ లకు వసూలు చేయాల్సిన టిక్కెట్ చార్జీల వివరాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు సాధారణ టికెట్ రుసుంలకు మించి ఎవరికి తోచినంతగా వాళ్లు వసూలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కండెక్టర్ లు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారు, ప్రశ్నించే ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నైపుణ్యం లేని డ్రైవర్ లు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నారు. నిజానికి ప్రైవేటు డ్రైవర్ లు, కండెక్టర్ లను తీసుకున్నా ప్రయాణ చార్జీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని అధికారులు ప్రకటించారు. నిర్ణీత ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు, బస్సుల్లో ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. అయినా క్షేత్రస్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు, పర్యవేక్షణ లేకపోవటంతో అధికారుల ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసిఫాబాద్ లో అధిక చార్జీల వసూలుపై అక్కడి ప్రయాణికులు ఏకంగా జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఆయన కండెక్టర్ ను మందలించి డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇప్పించారు. అయినా కొన్ని ఏరియాల్లో కండెక్టర్ లు అధిక మొత్తంలో వసూలు చేస్తూనే వున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. తగినన్ని వాహనాలూ అందుబాటులో లేకపోవటంతో ఉన్న బస్సుల్లోనే ఎక్కుతున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు లేకపోవటంతో కండెక్టర్ లు అడిగినంత సొమ్ము చెల్లిస్తున్నారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. సహజంగా ప్రతి రోజూ ఒక డిపో పరిధిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి ఎందరు ప్రయాణం చేస్తున్నారు, లెక్కలకు సంబంధించిన ఆక్యుపెన్సీ రేషియో ఒక క్రమ పద్ధతిలో చూస్తారు. అయితే సమ్మె మొదలైనప్పటి నుంచి ఆ పద్ధతి పూర్తిగా అటకెక్కింది. ఈ లెక్కలకు సంబంధించి ఎక్కడా పారదర్శకత లేదు, కేవలం బస్సులు నడపడం మినహా లెక్కాపత్రం లేకుండా పోతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరు డిపోల పరిధిలో ఆరు వందల ఇరవై నాలుగు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులున్నాయి. సమ్మె కారణంగా ఎక్కడికక్కడ తాత్కాలిక డ్రైవర్ లు, కండెక్టర్ లను నియమించుకున్నారు. వీటికి అదనంగా ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్, ఇతర వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. పండుగ సీజన్ కావడంతో ప్రతి వాహనం కిక్కిరిసిపోతోంది. అన్ని రూట్ల లోనూ భారీగా కలెక్షన్ లు వచ్చాయి, ఒక్కో బస్ లో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నారు. కొన్ని బస్సుల్లో డ్రైవర్ లు, కండెక్టర్ లు కలిసి కలెక్షన్స్ లో కొంత భాగాన్ని నొక్కేస్తున్నారు. ఇక డిపోకు చేరుకున్న బస్సుల లెక్కల్లోనూ పారదర్శకత లేకుండా పోతోంది, ఇలాంటి సందర్భాల్లో లాభాల కంటే ప్రయాణికుల సౌకర్యమే తమకు ముఖ్యమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరిట ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను చాలా మంది తాత్కాలిక కండక్టర్ లు, డ్రైవర్ లు సొమ్ము చేసుకుంటున్నారు. లెక్కాపత్రం లేకపోవటం తో సమ్మె కాలం దొచుకున్నోడికి దోచుకున్నంతగా మారుతోంది.

జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ ఆగ్రహం...

  ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ తెగ మండిపడుతోంది. పార్టీ ఓటమిపాలైనప్పుడు టిడిపి లో చేరి ఇప్పుడు అధికారంలోకి రాగానే తిరిగి వైసీపీ లో చేరారని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో క్యాడర్ తో పాటు కొంత మంది నాయకులు కూడా జూపూడిపై ఫైర్ అవుతున్నారట, ఎన్నికల ఫలితాల ముందు వరకూ తెలుగు దేశం పార్టీలో జూపూడి ప్రభాకర్ ముఖ్య నేతగా పని చేశారు.  అయితే 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా కొండపి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జూపూడి ప్రభాకర్ ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి పరాజయం పాలవడంతో పెద్దగా టైం తీసుకోకుండా జూపూడి ప్రభాకర్ టిడిపిలోకి జంపైపోయారు. ఎమ్మెల్సీ పదవి గుమ్మం ముందు వరకూ వచ్చినా సాంకేతిక కారణాలు అడ్డం పడ్డాయి, ఆ వెంటనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జూపూడి ప్రభాకర్ ని వరించింది. దీంతో తెలుగు దేశం పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రెస్ మీట్లలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించేది. వైసిపిలో ఉన్నప్పుడు జగన్ కి సన్నిహితంగా వ్యవహరించిన జూపూడి ప్రభాకర్.. టీడీపీలో చేరాక ఆయనపైనే విమర్శలు, సెటైర్ లు కూడా వేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని జూపూడి భావించారు. గతంలో ఓటమి పాలయిన కొండపి నుండి మరోసారి పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. టిడిపి టికెట్ దక్కించుకునేందుకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామితో పోటీ పడ్డారు. కానీ, చివరి నిమిషంలో పార్టీ టికెట్ స్వామికే దక్కింది. దీంతో నామినేటెడ్ పదవిపై ఆశతో ఎన్నికల బరి నుండి తప్పుకున్న జూపూడికి టిడిపి ఓటమి జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఆ క్రమంలో సొంత గూటికి చేరుకునేందుకు జూపూడి వైసీపీ నేతలతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు. అయితే వైసీపీ నుండి బయటకు వెళ్లిన సమయంలో జూపూడి ప్రభాకర్ చేసిన కామెంట్ లను వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట.  జూపూడి ప్రభాకర్ టిడిపి లో ఉన్న సమయంలో చేసిన కామెంట్ లకు సంబంధించి తేదీలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూపూడి ప్రభాకర్ ని వైసిపి అధిష్టానం తిరిగి పార్టీలో చేర్చుకున్నా వైసీపీ క్యాడర్ మాత్రం తాము క్షమించబోమని పోస్టులు పెడుతోంది. జూపూడి ప్రభాకర్ తప్పి పోయిన గొర్రెపిల్లలా పక్కదారి పట్టామని బహిరంగంగా చెప్పినా వైసీపీ క్యాడర్ మాత్రం జూపూడిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. సొంత గూటికి చేరుకున్న జూపూడిపై వైసీపీ క్యాడర్ ఆగ్రహం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.  

దగ్గుబాటి అసలు వ్యూహం ఏంటి?

  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కోసం ఇన్ చార్జ్ చైర్మన్ గా పరుచూరు నియోజకవర్గానికి చెందిన రావి రామనాధం బాబును నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఆ విషయమే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అదే సమయంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవికి నాగులుప్పలపాడు మండలానికి చెందిన పిచ్చిరెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు కుటుంబ రాజకీయ వ్యవహారాలపై ఇటీవల అధికార పార్టీ దృష్టి సారించి సరికొత్త నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదే నియోజకవర్గానికి చెందిన రావి రామనాధం బాబుకు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. డాక్టర్ దగ్గుబాటి నుంచి స్పష్టత రాకపోవడం కూడా అందుకు ఓ కారణంగా భావిస్తున్నారు. పురందేశ్వరిని బిజెపికి రాజీనామా చేయించి వైసీపీలో చేరుతారని విషయంలో అధికార పార్టీ ముఖ్య నాయకులలో అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఆయన జగన్ ను కలిసిన తర్వాత కూడా నియోజకవర్గానికి రాకపోవటాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఆలోచనతో దగ్గుబాటి ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ నియోజక వర్గ ఇంచార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. అందులో రామనాధం బాబు పేరు ముందు ఉన్నప్పటికీ ఆయనకు సెంట్రల్ బ్యాంక్ పదవి దక్కుతున్నందని వైసీపీ నాయకత్వం మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.అయినప్పటికీ ఆయన వైపు నుంచి సమాచారం కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసిన నడ్డా...

  మహారాష్ట్ర ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించటంలో జోరందుకుంటోంది అధికార బీజేపీ. ఎన్నికల్లో ప్రధాన అస్త్రం అయినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఫూలే సావర్కర్ లకు భారతరత్న ఇప్పించటం దగ్గరి నుంచి ఐదేళ్లలో కోర్టు ఉద్యోగాల వరకు మేనిఫెస్టోని జనరంజకంగా ఉండేటట్టు చూసుకుంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. మేనిఫెస్టోకీ సంకల్ప పత్ర్ అనే పేరును కూడా పెట్టారు. జ్యోతిబాపూలే, సావిత్రిబాయిఫూలే, వీర్ సావర్కర్ లకు భారతరత్న వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. మహిళల సేఫ్టీ ప్యాడ్లను ఒక రూపాయికే అందించటం, ప్రభుత్వాసుపత్రుల్లో ఆయుర్వేద వైద్యాన్ని పెంచటం, ప్రతి జిల్లా కేంద్రంలో ఓ యోగా కేంద్రం, అటల్ విజ్ఞాన్ కేంద్రాన్ని నెలకొల్పడమే కాక మహారాష్ట్ర జీడీపీని ట్రిలియన్ డాలర్ లకు తీసుకెళ్లి రికార్డులకు ఎక్కిస్తామని హామీలు ఇచ్చారు.ఇక 2020 కల్లా అంబేద్కర్ మెమోరియల్ ను పూర్తి చేస్తామన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీని బ్రాడ్ బ్యాండ్ ద్వారా కలపడం, వీర మరణం పొందిన జవాన్ లు, పోలీసుల కుటుంబాలకు ప్రత్యేక వసతులు కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు. 2022 కల్ల మహారాష్ట్రలో ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి సరఫరా చేస్తామన్నారు బీజేపీ నేతలు. అయిదేళ్లలో కోర్టు ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. అదే సమయంలో మహారాష్ట్రని కరువు రహితంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర రైతులకు పన్నెండు గంటల విద్యుత్ సరఫరా కూడా చేసామని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు. ఇక ఈ మేనిఫెస్టోలోని పనులు అన్నింటిని నిజంగా అమలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

విశాఖలో నేపాల్ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి.....

విశాఖలో నేపాల్ కు చెందిన ఓ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే బాలిక మృతదేహాన్ని దహనం చేసేందుకు తల్లిదండ్రులు శ్మశానానికి తీసుకువెళ్లారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి ప్రకటించడంతో తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు. కాటికాపరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మధురవాడ చైతన్య కాలేజీలో నేపాల్ కు చెందిన బహుదూర్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు తన కుమార్తె మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి కమల తెలిపింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని దహనం చేసేందు కు కాన్వెంట్ జంక్షన్ స్మశాన వాటికకు తీసుకువెళ్ళారు. సాయంత్రం వేళ తీసుకువెళ్ళి దహనం చేద్దామని భావించిన తల్లిదండ్రులకు కాటికాపరి అడ్డుకున్నారు. మృతురాలి మెడపై ఉరివేసు కున్న గుర్తు లు తలపై గాయాలు ఉండడం తో శ్మశానవాటిక సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.అసలు ఎందుకు ఈ అభం శుభం తెలియని చిన్నారి ఇంత పెద్ద అఘయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమాలు వెల్లడవుతున్నాయి. తన తల పై  ఉన్న దెబ్బలు కూడా పలు అనుమానాలకు తెర లేపుతన్నాయి. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

ముగిసిన అయోధ్య కేసు ఆఖరి విచారణ

అయోధ్య కేసు రోజు రోజుకు ఓ మలుపు తిరుగుతోంది.అయోధ్యలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.అయోధ్య వివాదం పై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్. సుప్రీం కోర్టు విచారణ చేపట్టి ముప్పై తొమ్మిది రోజులయ్యిందని రేపు నలభై రోజు చివరి రోజు విచారణ జరుగుతుందన్నారు. విచారణ ముగిసిన వెంటనే తీర్పు వెల్లడిస్తామని తెలిపారు చీఫ్ జస్టిస్. అయోధ్య వివాదం పై ఇటు హిందూ సంస్థలు, అటు ముస్లిం సంస్థలు తమ వాదనలను వినిపించాయి. సుప్రీం కోర్టు తీర్పు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయోధ్య పట్టణంతో పాటు మొత్తం జిల్లాలో 144 సెక్షన్ విధించారు అధికారులు. రామ మందిరం, బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సెక్షన్ 144 ని విధించారు. ఈ ఆదేశాలు డిసెంబర్ పది వరకు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయోధ్య కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఆగస్టు ఆరు నుంచి జరుగుతున్న విచారణ రెండ్రోజులలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అయోధ్యలో బాబ్రీ మసీదు కేసు విచారణ విచారణ వీలైనంత త్వరలో ముగిస్తామని తెలిపింది.ఈ విషయం పై కోర్ట్ విచారణలో ఏం జరగబోతోందో ఎలాంటి నిర్ణయాలు తీసుకొబోతోంది అనేది వేచి చూడాలి.

ఆర్టీసీ సమ్మెతో  మిన్నంటిన కూరల ధరలు...

  ఆర్టీసీ సమ్మెతో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు రాష్ట్రంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఒక వైపు, ఆర్టీసీ సమ్మె మరోవైపు దీంతో సామాన్యులకే కాదు మధ్య తరగతి వారిని సైతం బెంబేలెత్తిస్తున్నాయి కూరగాయల ధరలు. ఏం కొనాలి, ఏం తినాలి అనే ఆలోచనలో సగటు మనిషి ఉన్నాడు. గత పదకొండు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు ఉల్లి మాత్రమే కంట తడి పెట్టిస్తే తాజాగా అన్ని కూరగాయలు సగటు మనిషికి గాయాలు చేస్తున్నాయి.  కొండెక్కి కూర్చున్నాయి. ఎంతలా అంటే సామాన్యునికి అందనంత ఎత్తున పైపైకి ఎగబాకుతున్నాయి. చిక్కుడుకాయ పోయి ఎక్కడో ఉంటే టమాటా మోత మోగిస్తోంది. ఇక మామూలు రోజుల్లో పది రూపాయలకు కిలో దొరికే వంకాయలు సైతం నేడు అరవై రూపాయల దాటింది. పెరిగిన ధరలతో వినియోగదారులతో పాటు కూరగాయల వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆకుకూర ధర మాత్రం కిలోకు వంద రూపాయలకి వెళ్లిన నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తుతున్నారు.  ఆర్టీసీ సమ్మె కారణంగా ఆటోలు కూడా ప్యాసింజర్ ఫీజు నేపథ్యంలో కొంతవరకు రవాణాపైనే ప్రభావం చూపి కూరగాయల ధరల పై ప్రభావం పడి ఎనభై, వందకు అమ్ముతున్నారు.సామాన్య ప్రజలు కూరగాయలు కొనేట్టు లేవని వాపోతున్నారు. ఆర్టీసి సమ్మె కారణంగా కూరగాయలను తరలించేందుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైన సమ్మె జరిగితే నిత్యావసరాల ధరలకూ రెక్కలొస్తాయి.ఎప్పుడు ఇలాంటి సమ్మేలకు సామాన్యులే బలవుతారు. సాధారణంగా ఇప్పుడు కూరగాయలకు కూడా క్రాప్ అంతా చేతికి వచ్చి పరిస్థితి కనిపిస్తుంది కానీ రవాణా సక్రమంగా లేకపోవడం చేత రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు బాధితులు.

బీజేపీ విషయంలో బాబుపై మండిపడ్డ కన్నా...

తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్రంగా ఎదగాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని టీడీపీకి డోర్లు మూసివేశామని అమిత్ షా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించేందుకు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ కర్నూల్ వచ్చారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి విషయానికొస్తే ,తమకు రాష్ట్ర అభివృద్ది చేస్తారన్న ఆశ అయితే కలగట్లేదని , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో ముందుకెళ్తాయన్న భావన కనిపించటం లేదుని కన్నా తెలియజేశారు.అభివృద్ధి అనేది కలలాగే మిగిలిపోయేటువంటి పరిస్థితి కనపడుతుందని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవకాశవాది అని, ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు. టీడీపీ నేత చంద్రబాబు తొంభై తొమ్మిదిలో వాజపేయి గారి ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కాళ్లు గడ్డాలు పట్టుకుని భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకుని,ఆ పార్టీని సమాధి చేసారని కన్నా తెలియజేశారు.అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మోదీగారి ప్రతిభని దృష్టిలో పెట్టుకొని, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని శాశ్వతంగా పార్టీని దూరం చేయాలని చూశారని, ఆ పార్టీ బలపడకూడదు అనేటువంటిది తన ప్రధాన లక్ష్యంగా బాబు పెట్టుకున్నారని కన్నా వెల్లడించారు.ఇవాళ మళ్లీ భారతీయ జనతా పార్టీ చిగురిస్తున్న సమయంలో మళ్లీ  కొత్త ఎత్తుగడ వేసి భారతీయ జనతా పార్టీని  ఎదగనీయకుండా చేయాలనే లక్షంతో బాబు వైఖరి ఉందని కన్నా పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ రెండు సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకుని తీవ్రంగా నష్టపోయిందన్నారు.అమిత్ షా  నరసరావుపేట విచ్చేసినప్పుడు  భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా చంద్రబాబు నాయుడికి తలుపులు మూసేసింది అని షా స్పష్టంగా తెలియజేశారని కన్నా వెల్లడించారు.ప్రతిసారి మోసపోవటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదని కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.

మరో బీహార్‌గా ఆంధ్రప్రదేశ్... జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలన టెర్రరిజాన్ని తలపిస్తోందన్న చంద్రబాబు... దాడులు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ గా మార్చేశారని మండిపడ్డారు. జగన్ ప్రకటించినవి నవరత్నాలు కాదని... నవ గ్రహాలంటూ బాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వ విధానాలు అరాచకానికి పరాకాష్టగా మారాయన్న చంద్రబాబు... రివర్స్ టెండరింగ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసలు పోలవరం ప్రాజెక్టు పనులను 5 నెలలపాటు ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వి మూర్కపు ఆలోచనలన్న చంద్రబాబు... అందుకే ప్రజావేదికను కూల్చి అరాచక పాలన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అయినా, ప్రత్యేక హోదా గురించి జగన్‌ ఎందుకు మాట్లాడరని బాబు ప్రశ్నించారు. ఏపీ ఖజానా దివాళా తీసే పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని బాబు విమర్శించారు. నరేగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వ డబ్బును వైసీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇక, వైసీపీ నేతలు... ఇసుక స్మగ్లింగ్‌ చేస్తూ సామాన్యుల్ని రోడ్లపైకి తెస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో కసి కక్షగా మారుతుందని అన్నారు.

టీటీడీలో మరోసారి లోపించిన భద్రత

కలియుగ దైవం శ్రీనివాసుడ్ని దర్శంచుకోవాలంటే అనేక తనికీలు నిర్వహిస్తారు భద్రత సిబ్బంది. కానీ తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఓ భక్తుడు ఏకంగా శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా, విధుల్లో ఉన్న టిటిడి సిబ్బంది అడ్డుకుని విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. తాను విదేశీ భక్తున్నని విజిలెన్స్ సిబ్బందికి చెప్పడంతో భద్రతాధికారులు ప్రశ్నించి వదిలేశారు. ఆలయంలోని సివిల్ ఏఆర్, టిటిడి విజిలెన్స్, ప్రైవేట్ సెక్యూరిటీ హోమ్ గార్డులతో పాటు ఆక్టోపస్ బలగాలు తిరుమల భక్తులను పర్యవేక్షిస్తున్న కూడా భద్రతా వైఫల్యాలు తరచూ బయటపడుతున్నాయి. శ్రీ వారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే ముందు మూడు సార్లు భద్రతా సిబ్బంది భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. అయినా కొంత మంది భక్తులు మాత్రం నిషేధిత వస్తువులను శ్రీ వారి ఆలయంలోకి తీసుకువెళ్లడం పరిపాటిగా మారింది. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో ఓ విదేశీ భక్తుడు భద్రతా సిబ్బంది తనిఖీలను తప్పించుకుని సెల్ ఫోన్ లో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. సెల్ ఫోన్తో ఆలయంలో కి ప్రవేశించిన భక్తుడు ఆలయంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా అక్కడే విధుల్లో ఉన్న టీటీడీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే భక్తుని పట్టుకొని విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. భక్తుని ప్రశ్నించగా విజిలెన్స్ అధికారులు తాను విదేశీ భక్తున్నని ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకురావడం నిషిద్ధమని తనకు తెలియదని చెప్పడంతో విజిలెన్స్ సిబ్బంది భక్తుడి వద్ద వివరణ తీసుకుని వదిలేశారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో టిటిడి సిబ్బంది పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు .ఇక పై అయినా టీటీడీ బృందం ఇలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా ఉండేలా చూసుకోవాలని టీటీడీ ఉన్నత అధికారులు అదేశాలు జారీ చేశారు.

18,500 ఇవ్వాలి...లేదంటే రైతులను మోసం చేసినట్లే... జగన్ పై జనసేనాని ఫైర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ చెప్పే జగన్... ఇచ్చిన మాట తప్పారంటూ మండిపడ్డారు. రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్ యోజన స్కీమ్ తో ముడిపెట్టి అమలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12వేల 500 ఇస్తామంటూ నవరత్నాల్లోనూ, వైసీపీ మేనిఫెస్టోలోనూ, ఎన్నికల సభల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడెందుకు కేంద్రం ఇస్తున్న 6వేలతో కలిపి ఇస్తున్నారని నిలదీశారు. ఇచ్చిన మాట మేరకు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండానే, వెయ్యి రూపాయలు పెంచామంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పీఎం కిసాన్ యోజన పథకంతో రైతు భరోసాను ముడిపెట్టడంతో జగన్ తన ఎన్నిక వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేకపోయారని పవన్ విమర్శించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు... కేంద్రం సాయంతో కలిపి రైతు భరోసా అమలు చేస్తామని జగన్ ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగానే తన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఉంటే, కేంద్రం ఇస్తున్న 6వేలతోపాటు తాను ప్రకటించిన 12వేల 500 కలిపి... మొత్తం 18వేల 500 రూపాయలు ఇవ్వాలన్నారు. ఒకవేళ ఎన్నికల హామీని జగన్ నెరవేర్చలేకపోతే, అందుకు కారణాలు వివరించి, రైతులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో అసలేం జరుగుతోంది? గవర్నర్‌ను ఆరా తీసిన మోడీ-అమిత్ షా.!

గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా, పోలీసుల దమనకాండపైనా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేసిన తర్వాతి రోజే... గవర్నర్ ఢిల్లీ వెళ్లడం... ఒకేరోజు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం... టీఆర్ఎస్ లో కూడా అలజడి సృష్టించింది. అయితే, ఆర్టీసీ సమ్మె... కార్మికుల ఆత్మహత్యలు... రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతున్న టైమ్ లో... కేంద్ర ప్రభుత్వాధినేతలను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీతో దాదాపు అరగంటపాటు సమావేశమైన తమిళిసై... తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన గవర్నర్.... ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, శాంతిభద్రతలపై చర్చించారు. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నివేదిక అందజేశారు. అయితే, ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణలో అసలేం జరుగుతోందంటూ అమిత్ షా అడిగినట్లు తెలుస్తోంది. దాంతో ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ తీరుతో.... తెలంగాణలో పరిస్థితి చేయి దాటిపోతోందని గవర్నర్ వివరించినట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీసుల దమనకాండపై ఆర్టీసీ కార్మికులు ఫిర్యాదుచేసిన తర్వాతి రోజే.... గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లి... కేంద్ర పెద్దలను కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అంతేకాదు షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న గవర్నర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటికీ, ముందుగానే తమిళిసైని ఢిల్లీకి రప్పించుకుని తెలంగాణలో పరిస్థితుల గురించి మోడీ-అమిత్ షా చర్చించడం సంచలనంగా మారింది.

ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో మద్దతు... విలీనం చేయాల్సిందేనంటూ అల్టిమేటం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించగా, టీఎన్జీవో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వకపోతే ప్రజల్లో చులకనవుతామంటూ టీఎన్జీవో జిల్లా యూనియన్ల నుంచి రాష్ట్ర కార్యవర్గంపై ఒత్తిడి పెరగడంతో... ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమైన కార్యవర్గం... మొత్తం నాలుగు తీర్మానాలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడంతోపాటు కార్మికుల తరపున చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ దగ్గరకు పంపాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతోపాటు రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తమను తీవ్రంగా బాధించాయన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... కిందిస్థాయి ఉద్యోగుల ఒత్తిడి మేరకు సమ్మెకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించామన్న రవీందర్ రెడ్డి... అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిచి... సీఎస్‌ను కలుస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... ప్రభుత్వం దిగిరాకపోతే.... మరో సకల జనుల సమ్మెకు సిద్ధంకావాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించడంపై అశ్వద్ధామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు అత్యంత కీలక పాత్ర పోషించారన్న అశ్వద్ధామరెడ్డి... తమకు మద్దతిచ్చిన టీజీవోలు, టీఎన్జీవోలకు రుణపడి ఉంటామన్నారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. ప్రజల సమస్యలు పట్టవా మీకు?

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అటు ఆర్టీసీ జేఏసీకి, ఇటు ప్రభుత్వానికి హైకోర్టు చురకలు వేసింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు నలుగిపోతున్నారని, నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం కావొచ్చు.. కానీ పండుగ సమయంలో రవాణా నిలిపేస్తే ఎలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఇబ్బందులను కార్మిక సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. వెంటనే చర్చలు ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ప్రజలపై సమ్మె ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యా సంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని కోర్టు ప్రశ్నించింది. దాదాపు 4 వేల బస్సులు నడవడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వానికి ముందు చూపు లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీని విలీనం చేయలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్లు.. ముందుకు వస్తాయన్నారు. అయితే ప్రజల ఇబ్బందులను మాత్రమే తమ దృష్టికి తేవాలన్న హైకోర్టు సూచించింది. ప్రస్తుతం 75 శాతం బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల్లో మిగతావాటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. ఈ సందర్భంగా 4000 బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఎలా తెస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆరోపించాయి. చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లినట్లు కోర్టుకి వివరణ ఇచ్చాయి. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ లేరని, ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని, చాలా కాలంగా సమస్యలు అలానే ఉన్నాయని కార్మిక సంఘాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. సమస్య ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదని.. ఆది ప్రజల సమస్యగా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, యూనియన్ల పట్టుదలతో మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవా అని కోర్టు ప్రశ్నించింది. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదో తెలిపాలని ప్రశ్నించింది. కార్మికుల్లో విశ్వాసం పెంచేందుకు తక్షణం ఆర్టీసీ ఎండీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.