pawan kalyan

కాపులకు న్యాయం చేయాలి : పవన్

  కొద్ది రోజుల క్రితం కాపుగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలకు, షూటింగ్ ఆపి హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టారు పవన్. ఆయన ప్రెస్ మీట్ లో కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడిన తీరును చాలామంది విమర్శించారు. దాంతో ఈ సారి పవన్ తన ట్విట్టర్లో స్పందించారు. కాపు రిజర్వేషన్ ఇష్యూ రోజురోజుకూ పెద్దదిగా మారుతుండటంతో, ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని ఆయన టీడీపీని కోరారు. కాపు నాయకులతో, టీడీపి ప్రభుత్వం చర్చలు జరిపి, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని, లేనిపక్షంలో పరిస్థితులు చేయదాటిపోతే, ఇక ఎవరూ చేయగలిగిందేమీ లేదని ఆయన ట్వీట్ చేశారు. సమన్వయంగా వ్యవహరించే పెద్దల సమక్షంలో, సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన పేర్కొనడం విశేషం..తాజాగా దాసరి నారాయణరావుతో, మెగా స్టార్ చిరంజీవి కిర్లంపూడి వెళ్లి ముద్రగడను కలుస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ ట్వీట్ ప్రాథాన్యం సంతరించుకుంది.

ipl auction

కోటీశ్వరుడిగా మారిన కూలీ కొడుకు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక విచిత్రమైన టోర్నీ. ఇక్కడ ఏ ప్లేయర్ ఎందుకు రేట్ పలుకుతారో, ఏ ఫ్రాంఛైజీ ఎవర్ని ఎందుకు కొనుగోలు చేస్తుందో తెలియదు.తాజాగా జరిగిన ఐపిఎల్ వేలంలో, ఒక అనామక క్రికెటర్ కోటీశ్వరుడుగా మారాడు. జైపూర్లో ఒక వైర్ల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే భరత్ సింగ్ కొడుకు నాథూసింగ్. కేవలం 11 టి-ట్వంటీలు మాత్రమే ఆడిన నాథూ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ నోట నానుతున్నాడు. వేలంలో 3.2 కోట్లు పెట్టి మరీ, ముంబై అతన్ని దక్కించుకోవడం విశేషం.. నాథూకి ఉన్న ప్రత్యేకత అతని వేగం. ఇప్పుడు భారత్ ఉన్న యువ బౌలర్లలో, నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసే వారిలో నాథూ కూడా ఒకడు. ఒకానొక సమయంలో, ఇక క్రికెట్ వదిలేసి, తాను కూడా ఫ్యాక్టరీలో చేరిపోదామనుకున్న నాథూ జాతకాన్ని ఐపిఎల్ వేలం మార్చేసింది. టాలెంట్ ఉన్న వారి జీవితంలో ఐపిఎల్ ఒక ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తోంది. నేడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న ఎంతో మంది ప్లేయర్లు, ఐపిఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వారే. ప్రతీ సీజన్లోనూ స్టార్ ప్లేయర్లు మాత్రమే వేలంలో సంచలనాలు నమోదు చేస్తుండగా, ఈ సారి మాత్రం దేశవాళీ ఆటగాళ్ల పంట పండింది. నాథూరాంతో పాటు పవన్ నేగి, దీపక్ హుడా, ఎమ్.అశ్విన్, రిషభ్ పంత్,కరుణ్ నాయర్, అంకిత్ రాజ్ పుత్, ఆదిత్య తారే లాంటి దేశవాళీ ప్లేయర్లందరూ కోటీశ్వరులుగా మారిపోయారు. మరి వీరిలో ఎంతమంది తమకు పలికిన రేటుకు న్యాయం చేస్తారో చూడాలి.

north korea

ఉత్తర కొరియా ప్రపంచయుద్ధానికి దారి తీయబోతోందా..?

  ప్రపంచమంతటిదీ ఒక దారి అయితే, ఉత్తర కొరియాది మరో దారి. అమెరికాను ప్రపంచపటం నుంచి తొలగించడమే ఈ దేశపు లక్ష్యం. అందుకోసం ఎంతవరకైనా వెళ్లడానికి వెనుకాడమని పబ్లిగ్గానే చాలా సార్లు ప్రకటించింది కూడా. దానికి తగ్గట్టుగానే, గత కొన్నేళ్లుగా, తన మిలిటరీని బలోపేతం చేసే ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. గత నెలలో ఆటంబాంబ్ కంటే ఎన్నో రెట్లు బలమైన హైడ్రోజన్ బాంబ్ ను భూగర్భంలో టెస్ట్ చేసిన నార్త్ కొరియా, ఈ రోజు ఉదయం సమాచార వ్యవస్థకు సంబంధించిన రాకెట్ ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఐక్యరాజ్యసమితి అనుమతి లేని ఈ ప్రయోగం గురించి కనీసం తన మిత్ర దేశాలకు కూడా సమాచారం ఇవ్వకుండా, ఈ రోదసి ప్రయోగాన్ని నిర్వహించింది నార్త్ కొరియా. దీంతో సౌత్ కొరియా అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ రెండు దేశాలూ బద్ధ శత్రువులన్న సంగతి తెలిసిందే.. కొరియా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.30 గంటలకు, టాంగ్ చాంగ్ రీలాంఛ్ స్టేషన్ నుంచి రాకెట్ ను భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది ఉత్తర కొరియా. ప్రస్తుతం ఈ విషయమై ప్రపంచదేశాలన్నీ నార్త్ కొరియా పై ఆగ్రహంతో ఉన్నాయి. అన్ని దేశాలూ, ముక్త కంఠంతో ఆ దేశపు ప్రయోగాల్ని ఖండించాయి. ఈ ప్రయోగం కేవలం తమ ఇన్ఫర్ మేషన్ సిస్టమ్ ను డెవలప్ చేసుకోవడానికి మాత్రమే అని నార్త్ కొరియా చెబుతున్నా, దీని వెనుక మిలిటరీ ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమవుతోందంటోంది అమెరికా. ఇప్పటికే అగ్రదేశం చాలా సార్లు నార్త్ ను హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మరో ప్రపంచయుద్ధం మొదలవడానికి ఎంతో కాలం పట్టదు. అదే జరిగితే, తప్పు ఎవరిదైనా మూల్యం మాత్రం యావత్ప్రపంచం చెల్లించాల్సి వస్తుంది.