టీఆర్ఎస్ ఎంపీ నిర్వాకం.. ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం

  న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్ రోడ్ లో గజం నలభై వేల రూపాయల పై మాటనే పలుకుతుంది. పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండేది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో నూట యాభై మందికి పైగా కార్మికులు పని చేసేవారు. ఆ సెంటర్ ను ఇప్పుడు మూసేసి  కార్మికులను పంపేశారు. ఇపుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సొంతచేసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లో ఉండే ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంట్రర్ స్థలానికి టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్ దాన్ని ముప్పై మూడేళ్ళ లీజుకు దక్కించుకున్నారు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు.  హన్మకొండ హంటర్ రోడ్ లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆరు జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రిట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. భూముల ధరలు రానురాను ఆకాశాన్నంటాయి.ఇక్కడ ఎకరం విలువ పంతొమ్మిది కోట్ల రూపాయల పై మాటే, అంటే నాలుగు ఎకరాలు కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్ తో ఎటువంటి ఉపయోగం లేదని దీని కారణంగా ఆర్టీసీకి అపారమైన నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేశారు. ఆ తర్వాత ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశల వారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపి పసునూరి దయాకర్ తెరమీదకొచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్ లు పిలిచారు. సింగిల్ బిడ్ తోనే ఏకంగా ముప్పై మూడేళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకు నెలకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఏడాదికి అరవై లక్షల రూపాయల అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్ సెంటర్ లో భవనం ఇతర యంత్రాలు ఉన్నాయి కదా ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్ పిలిచారు. ఈ టెండర్ కూడా పదిహేను లక్షల రూపాయలకు పసునూరి దయాకర్ దక్కటం విశేషం. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్ లు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దని దాన్ని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతి నిధుల చుట్టూ తిరిగి టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దు అంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ కనుమరుగవుతుందని అంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోయింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే భూదందాలు కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ మాకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసివేత వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ తమకు తమ ఉపాధి కోల్పోనివ్వకుండా తమకు తగిన న్యాయం చేయ్యాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.

కారు ప్రమాదంలో నలుగురు హాకీ ప్లేయర్లు మృతి...

  మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. హైవే నెంబర్ అరవై తొమ్మిది లో వేగంగా వెళుతున్న క్రమం లో వారు ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్టుగా సమాచారం, వారిలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ దగ్గర జరిగింది. అయితే వీరంతా హాకీ క్రీడాకారులని సమాచారం, వీరంతా ఈ రోజు జరిగే ధ్యాన్ చంద్ ట్రోఫీ లో పాల్గొనాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో వారు స్టేడియానికి చేరతారనగా ఈ ప్రమాదం జరిగింది, చనిపోయిన వారంతా జాతీయ స్థాయి ప్లేయర్లు అని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మృతుల వారి కుటుంబాలకు సమాచారమిచ్చామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతివేగం వల్ల కారు అదుపు తప్పడంతో పల్టీలు కొట్టి రోడ్ పక్కకు వెళ్ళి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్లేయర్లు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా జాతీయ స్థాయి క్రీడాకారులు కావడంతో అంతా విషాద చాయలు అములుకున్నాయి. జాతీయ స్థాయి క్రీడాకారులను కోల్పోవడంతో భారతదేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సంఘటన తెలుసుకున్న మృతుల తల్లి తండ్రులు తీవ్ర అవేదనకు గురి అవుతున్నారు. క్రీడా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

రేపే రైతు భరోసా... 5వేల 510 కోట్లు విడుదల... 3 విడతలుగా మార్చే ఆలోచన.!

  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రైతు భరోసా పథకం రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానుంది. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధాని మోడీని... జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించినప్పటికీ, పీఎంవో నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే... రేపు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. నెల్లూరు జిల్లా కాకుటూరులో ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు స్వయంగా రైతు భరోసా చెక్కులు అందజేస్తారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం డబ్బులు జమ చేయడం కోసం 5వేల 500కోట్ల రూపాయలను ఆర్ధికశాఖ విడుదల చేసింది.  రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అగ్రికల్చర్ మిషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాలతో చర్చించారు. అయితే, వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని, దాంతో ఖరీఫ్ స్థాయిలో సాగు లేదని, ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు ... సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును ఒకేసారి ఇచ్చే బదులు... రెండు మూడు విడతలుగా ఇస్తే బాగుంటుందని, మే నెలలో ఒకసారి, కోత సమయంలో మరోసారి, అలాగే రబీ అవసరాల కోసం ఇంకోసారి ఇవ్వాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది.

ఆర్టీసి సమ్మెను విరమించటానికి ప్రభుత్వం ఓ మెట్టు దిగనుందా..?

  పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా, ఉద్యోగాలు లేవని ప్రకటించిన సీఎం కేసీఆర్ కరుణిస్తారా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మహదావకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ఆయన రాసిన అంశం కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, సూసైడ్ ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని తెలిపారు. నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ పదహారు శాతం ఐఆర్ ఇచ్చి ఆర్టీసీ గొప్పగా ఆదుకున్న ఘనత టి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన లేఖ ద్వారా ఆయన గుర్తు చేశారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో తాను ఉన్నా అని, ఎక్కడా కూడా అర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు అని అలా చేయడమంటే పాలసీని మార్చుకోవడమే అన్నారు. ఇదంతా సాదాసీదా కామెంట్స్ అయినా కానీ పరిస్థితి చేజారిపోకముందే కార్మికులు సమ్మె విరమించాలి అని కూడా రాశారు. కార్మికులు ముందుకొస్తే పరిస్థితి అదుపు లోకి వచ్చినట్టే అని తెలుస్తుంది. అద్దె బస్సులు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్ పై సీఎం తీసుకున్న నిర్ణయం సమ్మె నేపథ్యంలోనే అని గుర్తించాలని చెప్పారు కేకే. అయితే అర్టీసి కార్మికుల సమ్మె తీవ్ర తరం అవడంతో ప్రభుత్వం దీనిని ఆపాలనే ఉద్దేశంతో కెకెతో అధికారికంగా కాకపోయినా ఆర్టీసి సంఘాలతో సంప్రదింపులు జరిపి సమ్మెను విరమించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టీఎన్జీవోలు కూడా తాము ఆర్టీసి తరపున ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిధ్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. వారు ముందే సీఎం కె.సి.ఆర్ ను సంప్రదించామని అన్నారు. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగటానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

విజయనగరంలో పైడితల్లి అమ్మ వారి పండుగలో కీలక ఘట్టం ప్రారంభం...

  విజయనగరంలో పైడితల్లి అమ్మ వారి పండుగ వైభవంగా జరుగుతుంది. పైడితల్లి అమ్మ వారి పండుగ నెల రోజుల పాటు ఘనంగా జరుపుతారు. అయితే నెలరోజుల పాటు జరిగే ఈ అమ్మవారి పండుగలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఇవాళ తోలేళ్ల ఉత్సవం ప్రారంభం కాగా రేపు సిరిమాను సంబరం జరగనుంది. పైడితల్లి అమ్మవారు రాజవంశీయులైన పూసపాటి గజపతుల ఆడపడుచు కావడంతో జాతరలో వారి వారసులు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజు అనారోగ్యం కారణంగా పండగకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కుమార్తె ఆదితి గజపతి రాజు రాజవంశీయుల తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలతో ఆలయానికి చేరుకున్న ఆదితి గజపతి రాజుకు వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అదితి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అశోక్ గజపతి రాజు ఆరోగ్యం మెరుగవుతోందని త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఉంటారని అదితి అన్నారు. అదే విధంగా ఈరోజు తోలేళ్ళ ఉత్సవం అని రేపు సిరిమాన్ ఉత్సవం జరగనుందని తెలిపారు. ఈరోజు, రేపు పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరగాలని, విజయనగరం ప్రజలందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ, అందరికీ పైడితల్లి అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

మేఘాలో కొనసాగుతోన్న ఐటీ సోదాలు... కాంట్రాక్టులు దక్కిన తీరుపై అధికారుల ఫోకస్

  మేఘా కంపెనీల్లో వరుసగా నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు మేఘా కంపెనీ యజమానులు ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా, దేశవ్యాప్తంగా మేఘా కంపెనీ కార్యాలయాలు అన్నింటిలోనూ తనిఖీలు జరిపారు. అయితే, ఈరోజు మాత్రం కేవలం హైదరాబాద్ కార్యాలయాలు, అలాగే మేఘా కృష్ణారెడ్డి నివాసంలో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మేఘా లావాదేవీలు, కంపెనీ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, ఫైనాన్షియల్ డీల్స్ పైనే ఐటీ అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, మేఘా ఆర్ధిక గతినే మార్చేసిందని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మేఘా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టిసీమ, ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానం, మేఘా కంపెనీకి కాంట్రాక్టు దక్కిన తీరుపై దృష్టిపెట్టారు.   ఇక, మూడ్రోజుల సోదాల్లో, మేఘా కంపెనీ బ్యాంకు అకౌంట్లు, అలాగే మేఘా కృష్ణారెడ్డి, అతని కుటుంబ సభ్యుల అకౌంట్లు, లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారు. అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా సాగించిన ఇతర ఆర్ధిక లావాదేవీల వివరాలపై కూడా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మేఘా ఫ్యామిలీ బ్యాంకు లాకర్లపైనా ఐటీ ఆఫీసర్లు ఫోకస్ చేశారు. అలాగే, ఎన్నికల సమయంలో జరిపిన లావాదేవీలపైనా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య బంగారం పెడుతున్న చిచ్చు...

  చెన్నై లోని లలితా జ్యువెలరీ చోరీ కేసులో కొత్త మలుపు వెలుగు చూసింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తిరువారూరు మురుగన్ అనూహ్యంగా  కోర్ట్ లో  లొంగిపోయాడు. మురుగన్ నుంచి పది కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారం తమదంటే తమదంటూ కర్ణాటక, తమిళనాడు పోలీసులు కుస్తీపడుతున్నారు. చెన్నై లలిత జ్యువెలరీలో చోరికి సూత్రధారి మురుగన్ నుంచి స్వాధీనం చేసుకున్నబంగారం లలితా జ్యువెలరీ కేసుకు సంబంధించిదేనని తమిళనాడు పోలీసులు చెబుతుండగా కర్ణాటక పోలీసులు మాత్రం కాదంటూ వాదిస్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య గోల్డ్ వార్ నెలకొంది. మరోవైపు మురుగన్ రూపురేఖలే మార్చేశాడు. ప్లాస్టిక్ సర్జరీ తో స్మార్ట్ గా తయారయ్యాడు. తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్ లోని మురికి నీటిలో నుంచి స్వాధీనం చేసుకున్న ఫోటో ఆధారంగా పోలీసులు స్థానికులను విచారించారు. అయితే అతని తామెప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. దీంతో ఖంగుతిన్న పోలీసులు తొలినాళ్లలో అనారోగ్యంతో ఉన్న మురుగన్ ఫొటోను ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఫోటోను పరిశీలించగా సర్జరీ చేయించుకున్నట్లు తేల్చారు. సర్జరీ కారణం గానే మురుగన్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. మురుగన్ తన బినామీ పేర్ల తో పది ఏళ్ళల్లో సుమారు వంద కోట్ల వరకు కూడబెట్టినట్లు అనుమనిస్తున్నారు. అందులో అధిక మొత్తాన్ని సినిమాల నిర్మాణాల కోసమే ఖర్చు పెట్టినట్టు గుర్తించారు. లలిత జూలరీలో చోరీ చేశాక ఆ నగలను మధురై వ్యాపారికి  ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో అక్కడి నుంచి అయిదు కిలోల నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగితావి మురుగన్ సురేష్ ల వద్ద ఉన్నాయని అనుమనిస్తున్నారు. ఈ నేపథ్యం లో వారిని కస్టడీ లోకి తీసుకుంటే  కేసులో అన్ని నిజాలు ఒక కోలిక్కి వస్తాయన్న ఆలోచన లో ఉన్నారు చెన్నై పోలీసులు.మరి ఈ కేసు ఇంకెన్ని కోనాలు తిరగబోతుందో వేచి చూడాలి.  

జగన్ తో చిరంజీవి మీటింగ్... సినీ-రాజకీయ వర్గాల్లో ఆసక్తి... 

  తన డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి... సినిమా ప్రమోషన్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తూనే, సినీ రాజకీయ ప్రముఖులను కలుస్తూ సైరా సినిమాను చూడాలని కోరుతున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ ని కలిసి... సైరా సినిమాను వీక్షించాలని కోరిన చిరంజీవి...  తమిళిసై ఫ్యామిలీ కోసం ప్రత్యేక షో వేసి చూపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కోసం సైరా సినిమా ప్రత్యేక షో వేయాలని మెగాస్టార్ భావిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనున్న చిరంజీవి... సైరా సినిమాను వీక్షించాలని కోరనున్నారు. అలాగే, సైరా సినిమా ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్... జగన్ కు రాజకీయ ప్రత్యర్ధిగా ఉండటం, అలాగే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో... వీరిద్దరి భేటీ ఆసక్తిరేపుతోంది. అయితే, జగన్ అండ్ చిరు మధ్య పెద్దగా సత్సంధాలైతే లేవని అంటారు. ఎందుకంటే, వైఎస్ మరణం తర్వాత... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్.... అప్పట్లో 18మంది ఎమ్మెల్యేలున్న చిరంజీవి మద్దతు కోరారని, అందుకు మెగాస్టార్ ఒప్పుకోలేదని, పైగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారని అంటారు. దాంతో అప్పట్నుంచి చిరంజీవితో జగన్ దూరం మెయింటైన్ చేస్తూ వచ్చారని చెబుతారు. మరోవైపు, జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి వైపు నుంచి కూడా పెద్దగా సత్సంధాలు లేకపోయినప్పటికీ, కేవలం సైరా సినిమా ప్రమోషన్, అలాగే జగన్ ఫ్యామిలీకి సినిమాను చూపించాలనే ఉద్దేశంతోనే కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్-చిరంజీవి భేటీ అటు రాజకీయ వర్గాల్లో... ఇటు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో రాష్ట్రపతి పాలన..! కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు..!

  తెలంగాణలో ఎలాగైనా పాగా వేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తోన్న బీజేపీ... ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయుధంగా మలుచుకోవాలనుకుంటోంది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు, డిపోల దగ్గర పెద్దఎత్తున బలగాల మోహరింపు, ఎక్కడికక్కడ ఉద్యమం అణచివేత, ఆర్టీసీ కార్మికులపై పోలీస్ దాడులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలతో శాంతిభద్రతలు అదుపు తప్పుతుండటంతో పరిస్థితిని తమకు అనుకూలంగా కమలదళం మార్చుకుంటోంది. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల ఆందోళనలకు మద్దతిస్తూనే, మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా శాంతిభద్రతలను సాకుగా చూపించి, తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రంగంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇలాగే కొనసాగుతూ, ఆత్మహత్యలు, ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పితే మాత్రం రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న కేంద్ర ప్రభుత్వం... సరైన సమయం, అదును కోసం చూస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, తెలంగాణలో శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు టీబీజేపీ లీడర్ల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్న కేంద్రం... రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల మద్దతుగా ఆందోళన చేపట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పై పోలీసుల బలప్రయోగంపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో... పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇలాగే కొనసాగుతూ, ఆత్మహత్యలు, ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పితే మాత్రం రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

నిందల పాలైన పూజారి ఆత్మహత్య...

  నిత్యం దేవుడికి దీప ధూప నైవేధ్యాలు పెట్టే పూజారిని దొంగను చేశారు, ఆలయం నుంచి తొలగించి నవ్వులపాలు చేశారు. తనపై దొంగతనం నేరం మోపడంతో ఆ పూజారి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లిలోని శివాలయంలో ధనుంజయచార్యులు పూజారి గా పని చేస్తున్నాడు. అయిదు నెలల క్రితం హుండీ లోని ముప్పై వేల రూపాయలు చోరీకి గురయ్యాయి, ఆ డబ్బును ధనుంజయ్ చార్యులే కాజేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది, ఆలయ పూజారిగా ధనుంజయ్ చార్యులను తొలగించారు. అప్పట్నుంచీ శివాలయాన్ని నిర్మించిన కాశయ్య అనే వైద్యుడు ధనుంజయ్ చార్యులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ధనుంజయచార్యులు తాగుబోతని, పౌరోహిత్యం రాదని కాశయ్య అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో ధనుంజయచార్యులను పూజలకు పిలవడం మానేశారు, అప్పట్నుంచీ ధనుంజయచార్యులకు కుటుంబ పోషణ కష్టంగా మారింది. తనపై దొంగతనం నేరం మోపడంతో పాటు తప్పుడు ప్రచారం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ధనుంజయచార్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీశాడు, హుండీ చోరీ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణాలేంటో సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ధనుంజయ్ చార్యులకు భార్య, ఆరు నెలల కొడుకు ఉన్నారు, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటంటూ మృతుడి భార్య కన్నీరు మున్నీరవుతోంది. మృతుని బంధువులు వైద్యుడు కాశయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ధనంజయ్ చార్యుల ఆత్మహత్యకు కారణమైన కాశయ్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి...

  దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఢిల్లీ లో మళ్లీ కాలుష్యం పెరిగిపోయింది, ప్రస్తుతం ఢిల్లీలో ఎలాంటి వర్షాలూ లేవు. తూర్పు భారతదేశంలో చూసుకుంటే సిక్కిం, అసోం, త్రిపురలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్ ఘడ్, ఒడిశా లో సాధారణ వర్షాలు పడుతున్నాయి, మధ్యప్రదేశ్ లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మధ్య మహారాష్ట్ర లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో ముంబై, పూణెలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కర్ణాటకలో సాధారణ నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి, గడిచిన 24 గంటల కాలంలో రాజన్న సిరిసిల్లలో ఆరు సెంటీమీటర్ లు, రంగారెడ్డిలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం ఐతే చాలు వాతావరణం చల్లగా మారిపోతోంది. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా గడిచిన 24 గంటల కాలంలో శ్రీకాకుళం లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి, అత్యధికంగా గడిచిన ఇరవై నాలుగ్గంటల్లో కర్నూలు లో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చర్చనీయాంశంగా మారిన చిరంజీవి జగన్ ల భేటీ...

  చిరంజీవి జగన్ భేటీ ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా, సినిమాలకు దగ్గరగా ఉంటున్నారు. పాలిటిక్స్ అనే పదం వినబడనంత దూరంగా చిరంజీవి వెళ్లి పోయారు.  తానిప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు, అలాంటి సమయంలో ఆయన ఉన్నట్టుండి ఏపీ సీఎం వైయస్ జగన్ తో భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. అసలిప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను కలవాల్సిన అవసరం చిరంజీవికి ఏం వచ్చింది, ఎందుకు ఇప్పుడు చిరంజీవి జగన్ తో భేటీ అవుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో మెగాస్టార్ సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. సమయం దొరికిన ప్రతిసారీ ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరు జగన్ భేటీ ఏంటి అని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి యొక్క భేటీ రాజకీయాల కోసమా లేక మర్యాదపూర్వక భేటీనా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం జగన్ ను కలిసేందుకు చిరంజీవి, రాంచరణ్, మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తాడేపల్లిగూడెం లోని జగన్ నివాసంలో భేటీ అవుతారు. సమావేశం తర్వాత అక్కడే ఇద్దరూ కలిసి లంఛ్ చేయనున్నట్టుగా సమాచారం. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే గంటా వస్తున్నట్టుగా సమాచారం, తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా గంటా పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ తో భేటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు గంటా శ్రీనివాసరావు పార్టీ మారే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగా సమాచారం. ఇరువర్గాలు కూడా చిరంజీవి జగన్ ల మధ్య మర్యాదపూర్వక సమావేశమే అంటున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ జోరుగా జరుగుతోంది. జగన్ సీఎం అయిన తరువాత టాలీవుడ్ నుంచి పెద్ద స్టార్స్ ఎవరూ ఆయనను మర్యాద పూర్వకంగా కలవలేదని విమర్శలు కూడా వచ్చాయి. టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని నటుడు ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీ కూడా అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి జగన్ ను కలవనుండటంతో అటు టాలీవుడ్ తో పాటు ఇటు రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.  

బంగారు తెలంగాణ ఏమో కానీ... మేఘా కంపెనీ మాత్రం బంగారమవుతోంది..!

  కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా ప్రాజెక్టు... ఇప్పటికే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేశారు... ఇంకా వేల కోట్ల రూపాయల పని మిగిలే ఉంది. అయితే, ప్రాజెక్టును మాత్రం ప్రారంభించేశారు. అయితే, లక్షల కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ బీడు భూములను పారింది లేదు. ప్రాజెక్టు ట్రయల్ రన్స్ మినహా తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదు. కానీ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టరును మాత్రం అపర కుబేరుడిని చేసింది.  ఈ ఒకే ఒక్క ప్రాజెక్టుతో మేఘా కంపెనీ తలరాతే మారిపోయింది. అవును... కాళేశ్వరం ప్రాజెక్టు... మేఘా కంపెనీకి కాసుల పంట పండించింది. కాళేశ్వరంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తామన్న కేసీఆర్....  తెలంగాణను బంగారంగా మార్చారో లేదో తెలియదు కానీ... మేఘా కంపెనీ తలరాతను మాత్రం బంగారంగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత మేఘా కంపెనీ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అమాంతం దూసుకొచ్చింది. ఫోర్బ్స్ జాబితాలో మొన్నటివరకు 47వ స్థానంలో ఉన్న మేఘా కంపెనీ యజమానులు... కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 39వ ప్లేస్ కి చేరుకున్నారు. అయితే, మేఘా కంపెనీ ఒక్కసారిగా పుంజుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని ఫోర్బ్స్ విశ్లేషించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా నెట్ ప్రాఫిట్ 3వేల కోట్లు దాటిందని, అలాగే రెవెన్యూ 23శాతం వృద్ధి చెందిందని, దాంతో మేఘా ఫ్యామిలీ ఆస్తుల విలువ 6శాతం పెరిగాయని ఫోర్బ్స్ విశ్లేషించింది. ఇక, మేఘా కంపెనీ అంటే టక్కున గుర్తొచ్చేది మేఘా కృష్ణారెడ్డే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎండీగా ఉన్న కృష్ణారెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కలిసి దాదాపు 40వేల కోట్ల రూపాయలు పంచుకుని తిన్నారని ఆరోపిస్తున్నాయి. ఇరిగేషన్ నిపుణుల సైతం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని విమర్శిస్తున్నారు. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. ఇక, ఫోర్బ్స్ లిస్ట్ తర్వాతే మేఘా కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల బాగోతం బయటపడాల్సిందేనని విపక్షాలూ ఆశిస్తున్నాయి. అయితే, ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా టాప్ 40కి వచ్చేస్తే, ఇక ఏపీ, తెలంగాణలో దక్కించుకుంటున్న, దక్కించుకోబోతున్న ప్రాజెక్టులతో వచ్చే ఏడాడే టాప్ టెన్ లోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.

ఉద్యమంగా మారుతున్న తెలంగాణా ఆర్టీసి సమ్మె...

  ఆర్టీసి సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది,వరుస ఆత్మహత్యలతో ఉద్యమ రూపం దాల్చుతోంది. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేంద్ర గౌడ్ లు ప్రాణాలు తీసుకోవటం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఆత్మ బలి దానాలు వద్దంటూనే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయటానికి ఆర్టీసీ,జెఏసీ కొత్త కార్యాచరణకు సిధ్ధమయ్యింది. శ్రీనివాస్ రెడ్డి  ఆత్మహత్య నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతుంది. ఆర్టీసి కార్మికులు రాత్రి డిపోల ముందు కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. ఈరోజు అన్ని డిపోల ముందు బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. అర్టీసి, జేఎసి నాయకులు గవర్నర్ తమిళసాయిని కలవబోతున్నారు. ఆర్టీసి సమ్మె ఎందుకు చేపట్టారో దాని తరువాత పరిణామాలేంటి అన్న విషయాలను గవర్నర్ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. దీంతో సమ్మె ఎటువైపు తిరుగుతోంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.  ఆర్టీసీ,జెఏసీ కి ఇప్పటికే విపక్షాలు మద్దతు పలికాయి, ఆర్టిసి కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసి కార్మికులు చేపడుతున్న ఆంధోళన కార్యక్రమాలకు భేషరతుగా మద్దతుని ప్రకటిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని నిర్ణయించాయి. కొన్ని ప్రజా సంఘాలు, రెవెన్యూ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతును ప్రకటించాయి. దీంతో సమ్మె కాస్తా ఉద్యమంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్టీసి కార్మికులను రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. ఆర్టీసి కార్మికులను తమ గుప్పెట్లోకి తీసుకుని సర్కార్ పై కుట్ర చేస్తున్నాయని మంత్రులు ఆగ్రాహాన్ని వ్యక్తం చేశారు.  ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించింది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత పెంచాలని నిర్ణయించింది. కార్మికుల ఆత్మహత్యలకు రాజకీయ శక్తులే కారణమని సర్కార్ చెప్తుంది. ఆర్టీసి కార్మికులు రాజకీయ పార్టీల ట్రాప్ లో పడ్డారంటూ తెలంగాణా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. తమను సంప్రదించకుండానే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళారని ఆరోపించారు, సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిస్తే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా ఉద్యమం తరువాత ఆర్టీసీ సంఘాలు తమతో ఎప్పుడూ కలవలేదని ప్రకటించారు. ఆర్టీసీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటే తాము కూడా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్టీసీ సమ్మెకు తెలంగాణా ఎన్జీవోలు, టిఎన్జీవోలు ప్రస్తుతానికి దూరంగా ఉంటారని అర్ధమౌతుంది. ఇదిలా ఉండగా తెలంగాణా ఆర్టీసీ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి కార్మిక సంఘాలు మద్దతుని ప్రకటించాయి, తెలంగాణా ఆర్టీసి కార్మికుల డిమాండ్ లు న్యాయమని చెప్తున్నాయి.

మనస్థాపానికి గురై ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం, పరిస్థితి విషమం

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పెద్ద చర్చనీయంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఏం జరగబోతోంది అని అందరిలోనూ ఒక ఆందోళన మొదలైయ్యింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆయన శరీరం తొంభై శాతం వరకు కాలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేస్తున్నారు. టీఎంయూ నేతగా కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన కొద్ది సేపటికే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారని తోటి కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు ఏకంగా యాభై వేల ఉద్యోగులను కేసీఆర్ ఒక్కసారిగా డిస్స్మిస్ చేయడం పట్ల తీవ్రంగా మండి పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గత ఇరవై సంవత్సరాలు ఖమ్మం డిపో లోని డ్రైవర్ గా పని చేస్తున్నారు. అదే విధంగా టీఎంయూలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ సమ్మె పై కేసీఆర్ ప్రసంగించిన తరువాత ప్రెస్ నోట్ ని విడుదల చేసిన వెంటనే తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా తొంభై శాతం శరీరం మొత్తం కాలిపోయింది. ప్రస్తుతానికి అతనిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించినట్లు తెలియజేశారు. దాదాపుగా అన్ని యూనియన్ సంఘాలు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగాను, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుండటమే కాక ఇటువంటి పాలనతో ఎవరిని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరిని కూడా ప్రభుత్వం అణిచివేస్తున్న తీరుకు నిరసనగా ఆందోళన తీవ్రతరం చేస్తామని దీనిని జిల్లా పరంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉదృక్తం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వామపక్ష పార్టీలు, యూనియన్ నేతలు చేరుకున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి వద్ద చేరుకోవడమే కాక అదనపు బలగాలను కూడా తీసుకొచ్చెందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

మావోయిస్టుల ప్రభావం విద్యార్ధుల పై ప్రభావం చూపనుందా?

  నేటి విద్యార్ధులే రేపటి భావి భారత పౌరులు అన్నారు పెద్దలు. కానీ ఇప్పటి పరిస్థితులకు మాత్రం విద్యార్ధులనే లక్షంగా చేసుకుంటున్నారు కొందరు. వివరాళ్లోకి వెళ్తే విద్యార్థి నేతల పై నిఘా పెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలిక మళ్లీ మొదలైంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులని మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో విద్యార్ధులను రెచ్చగొడుతోన్న వివిధ నిషేధిత సంస్థల పై నిఘా పెట్టారు పోలీసు అధికారులు. అంతేకాదు కొందరు అనుమానితులను అదుపులోకి  కూడా తీసుకున్నారు.  మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ విద్యార్ధి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటితో పాటు జగన్, సాయన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు. మరో వైపు విద్యార్ధి నేతలు అనుదీప్, నాగరాజు, రమేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సందీప్, గోపి, ఖాసిమ్ ల పై పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేశారు. మావోయిస్టులకు పలు విద్యార్థి సంఘాలు సహకరిస్తున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో ముప్పై విద్యార్థి సంఘాలను నిషేధించినట్టు తెలిపారు. గత కొంత కాలంగా జగన్ మావోయిస్టులతో టచ్ లో ఉన్నాడనీ మావోయిస్టులకు ఫండ్ ఇవ్వాలనీ కొన్ని కంపెనీల బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో జగన్, మద్దిలేటి ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మావోయిస్ట్ నేత హరిభూషణ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. జగన్, మద్దిలేటిపై పూణే కర్ణాటకల్లో కేసులున్నట్లు గుర్తించారు. కొన్ని నిషేధిత మావోయిస్టు సంస్థలు విద్యార్ధులను రెచ్చగొట్టి వారిని నక్సలిజం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తుపాకీ పట్టి వయోలెన్స్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. అయితే భారతదేశంలో ఇలాంటి వాటికి స్థానం లేదన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సిపి అంజనీ కుమార్. ప్రభుత్వం ఇటువంటి చర్యల పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

భలే మంచి చౌక బేరం.. విజయవాడ నడిబొడ్డున రూపాయికే ఐదెకరాల స్థలం!!

  'భలే మంచి చౌక బేరము' అనే సాంగ్ వినే ఉంటారు. ఇప్పుడు ఈ న్యూస్ వింటే అదే సాంగ్ పాడుకుంటారు. విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న ఖరీదైన ఐదెకరాల స్థలాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ దక్కించుకున్న సంస్థకి రూపాయికే లీజుకిస్తారట. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయడం.. ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సంచలనం అవుతోంది. ఏపీఎస్ఆర్టీసీ 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రిబిడ్డింగ్ సమావేశానికి ముందే.. ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేశారు. అప్పుడే.. పోలవరం రివర్స్ టెండర్లను తక్కువకు వేసిన సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి డబుల్ రేట్లకు.. టెండర్ కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగింది. అదే సంస్థ తెలంగాణలో కి.మీ రూ. 36కి ఎలక్ట్రిక్ బస్సులను ఆపరేట్ చేస్తోంది. ఏపీలో మాత్రం రూ. 60 అడిగినట్లుగా తెలుస్తోంది. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారం అని చర్చ జరుగుతోంది.  అయితే.. బస్సుల కాంట్రాక్ట్ మాత్రమే కాదు.. ఆ కంపెనీ అత్యంత విలువైన ఆర్టీసీ భూముల్ని కూడా కట్టబెట్టబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విజయవాడలో విద్యాధరపురం, గన్నవరంలలో ఆర్టీసీకి విలువైన స్థలాలు ఉన్నాయి. మార్కెట్‌ రేటు ప్రకారం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుంది. సిటీ డివిజన్‌ పరిధిలో ఎలక్ర్టిక్‌ బస్సుల నిర్వహణ కోసం మెయింట్‌నెన్స్‌ డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆర్టీసీ అధికారులే ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. అయితే మెయింట్‌నెన్స్‌ డిపోకు కేటాయించే స్థలాలను సంవత్సరానికి రూపాయికి అద్దెకు ఇస్తున్నట్టు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) లో సూచించటం ఇప్పుడు దుమారాన్నే రేపుతోంది. కి.మీ లెక్కల ఖర్చులు ఆర్టీసీ చెల్లిస్తున్నప్పుడు.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ మొత్తం సదరు కంపెనీనే పెట్టుకోవాలి. కానీ.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ భారం ఆర్టీసీపై పడేలా.. స్థలాన్ని ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆర్టీసీలో సాధారణ బస్సులను అనేకం అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. అద్దెకు బస్సు ఇచ్చేవాళ్లే బస్సును సొంతంగా నిర్వహించుకుంటారు. డ్రైవర్‌ యజమానికి చెందిన వారు ఉంటే.. కండక్టర్‌ మాత్రం ఆర్టీసీకి చెందిన వారు ఉంటారు. వ్యాపారం అతనే చేస్తున్నాడు కాబట్టి.. మెయింట్‌నెన్స్‌ కూడా అతనే చేసుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం.. ఆ భారం మొత్తం ఆర్టీసీపై వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్దె ప్రాతిపదికన తీసుకునే బస్సుల కోసం సంస్థ ఆస్థులను అప్పనంగా కట్టబెట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా కార్పొరేట్‌ స్థాయి కలిగిన బల్క్‌ సప్లయిర్‌కు ఈ విధంగా అప్పనంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను అప్పగించాలను కోవటం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తీసుకునే సాధారణ బస్సుల విషయంలో ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో.. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కూడా ఆర్టీసీ అధికారులు అదే వైఖరిని అవలంభించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదు: మంత్రి అజయ్

  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని విలీనం చేస్తామని కానీ.. ప్రైవేటీకరిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని పండగ సమయంలో సమ్మెకు వెళ్లారని విమర్శించారు. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రజల కోణంలో ఆలోచించకుండా రాజకీయం చేస్తున్నాయని.. ప్రతిపక్షాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని అజయ్ పేర్కొన్నారు. టెంట్‌ వేసిన చోటల్లా విపక్షాలు వాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కర్రు కాల్చి వాత పెట్టినా ప్రతిపక్షాలు మారడం లేదని అజయ్ అన్నారు. ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం సరికాదని, 2014బ్యాలెన్స్ షీట్‌లో ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4,416 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో ఆర్టీసీకి నష్టాలే వచ్చాయన్నారు. కేసీఆర్‌ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీకి 14 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,303 కోట్లు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని అజయ్ ప్రశ్నించారు. 5 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని, బస్సు సర్వీసులను పెంచుతామని తెలిపారు. అన్ని రకాల బస్సు పాస్‌లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అజయ్ హెచ్చరించారు.

పల్నాడులో దాడులు, హత్యలు నిజమే.. కానీ?

  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భౌతిక దాడులు, హత్యలు జరిగాయని.. అనేక మంది టీడీపీ సానుభూతి పరులు గ్రామాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పల్నాడులో పరిస్థితులపై విచారణ చేయాలంటూ.. ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో డీజీపీ ఓ కమిటీని నియమించారు. నెల రోజుల పాటు విచారణ జరిపిన రవిశంకర్ కమిటీ.. గొడవలు, ఘర్షణలు నిజమే కానీ.. టీడీపీ ఆరోపిస్తున్నట్టు వాటికి రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. తాజాగా ఏడీజీ రవిశంకర్‌ అయ్యనార్ మీడియా మాట్లాడుతూ.. అవన్నీ రాజకీయ హత్యలు కాదని.. రౌడీగ్రూపు హత్యలేనన్నారు. రాజకీయ గొడవల్లో ఒక్కరు మాత్రమే చనిపోయారన్నారు. 110 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయనడంలో వాస్తవం లేదన్నారు. అన్ని కేసులు రాజకీయ ఘర్షణల కేసులు కావని ఏడీజీ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు నమోదైన 10 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. 70 మంది వైసీపీ, 41 మంది టీడీపీ వారిపై కేసులు నమోదు చేశామని ఏడీజీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పిన ఏడీజీ రవిశంకర్‌.. మరోవైపు ఎన్నికల తర్వాత పల్నాడులో అనేక ఘటనలు జరిగాయన్న విషయాన్ని అంగీకరించారు. ఎనిమిది హత్యలు జరిగింది నిజమేనని కూడా అంగీకరించారు. కానీ అవి రాజకీయ ఘర్షణలు కాదని గ్రామాల్లో గ్రూపుల మధ్య జరిగే గొడవలను రాజకీయ ఘర్షణలుగా చెబుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అంటే ఘటనలు జరిగాయన్న విషయాన్ని మాత్రం అంగీకరించారు. మరి అలాంటప్పుడు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎలా చెప్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.