రాజధాని పరిరక్షణ సమితికి ఎకరం పొలం రాసిచ్చిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్!!
posted on Jan 8, 2020 @ 11:08AM
రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలకు కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి ఎకరం భూమి విరాళంగా ఇచ్చింది. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో ఎకరం భూమి పత్రాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అందించింది. గతంలో రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందించిన వైష్ణవిని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతి అంబాసిడర్ గా ప్రకటించారు. తరువాత కాలంలో సుమారు నాలుగు లక్షల వ్యయంతో తాను చదువుకునే పాఠశాల అభివృద్ధి చేయటమే కాకుండా 400 మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆమె కృషి చేసింది. ప్రస్తుతం రాజధాని అమరావతి తరలింపు పై ప్రజల్లో గందరగోళం, మూడు రాజధానుల ప్రకటన ద్వారా అయోమయం నెలకొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ భవన్ కు వచ్చి.. అమరావతి పరిరక్షణ కోసం ముదినేపల్లిలో ఈ నెల 12 న దుర్గా మహాచండీయాగం నిర్వహిస్తున్నామని దానికి హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైష్ణవి లానే అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రుల పై ఉందని ఆయన పేర్కొన్నారు.