లాటరీలో 12 కోట్లు గెలుచుకున్న రోజువారీ కూలీ...

అతడు రోజువారీ కూలీ, ఇంట్లో అతను పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. అయితే అతని కష్టాలను గట్టెక్కించేందుకు అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. కేరళకు చెందిన ఓ రోజూ కూలి లాటరీలో 12 కోట్లు గెలుచుకున్నాడు. కేరళ లోని కన్నూరు జిల్లా మురళి మాల కుర్చియా కాలనీకి చెందిన యాభై ఐదేళ్ల పోరునన్ రాజన్ దినసరి కూలీ. రెక్కాడితే గాని డొక్కాడదు, అవసరం కోసం అప్పులు తప్పలేదు.  మూడు వారాల క్రితం ఓ రోజు రాజన్ రుణం కోసం వెళుతుండగా మార్గమధ్యలో లాటరీ టికెట్ సేల్ ఆకర్షించింది. అదృష్టంపై నమ్మకం లేకపోయినా ఎక్కడో ఓ చిన్న ఆశ టికెట్ కొనాలని ప్రేరేపించింది. అలా మూడు వందల రూపాయలు పెట్టి క్రిస్మస్, న్యూయర్ బంపర్ లాటరీ టికెట్ కొన్నాడు. అంత ఖరీదు పెట్టి లాటరీ టికెట్ కొన్నానని చెబితే ఇంట్లో వారు ఏమంటారో అని ఎవరికీ చెప్పలేదు. లాటరీ విజేతలను సదరు ఏజెన్సీ సంస్థ ప్రకటించగా అందులో రాజన్ కొన్న టికెట్ కు బంపర్ ఆఫర్ తగిలింది. ఆ లాటరీలో అతడు ఏకంగా పన్నెండు కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

150 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. మొబైల్ నిండా అశ్లీల వీడియోలే!

సైబర్ నిందితుడు కందగట్ల భాస్కర్ అరెస్ట్ లో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. రుణాల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని మొబైల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల వీడియోలను చూసి ఖంగుతిన్నారు ఖాకీలు. కామాంధుడైన కందగట్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కందగట్ల భాస్కర్ అరెస్టులో సరికొత్త ట్విస్ట్ ఎదురైంది. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపిస్తూ సుమారు నూట యాభై మందికి పైగా మహిళలను భాస్కర్ వేధించినట్లు తేలింది. భాస్కర్ సెల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలను టార్గెట్ చేసి అశ్లీల వీడియోలు, న్యూడ్ వీడియో కాల్స్ తో వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.  జనగామ జిల్లా నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్ గతంలో ఆరోగ్య శ్రీ విభాగంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేశారు. ప్రస్తుతం సొంతూరిలో వ్యవసాయం చేస్తున్నాడు, తెలంగాణ స్టేట్ ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ అండ్ మోనిటరింగ్ సిస్టం పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించేవాడు. అలా మహిళల వివరాలను సేకరించి దుర్వినియోగం చేశాడు భాస్కర్. ఎన్జీవోలో పనిచేస్తున్నానంటూ కలరింగ్ ఇచ్చి, రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికే వాడు. మహిళలతో పరిచయం పెంచుకొని అశ్లీల వీడియోలు పంపేవాడు, సిమ్ కార్డులు మారుస్తూ వాట్సాప్ లో న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడు. ఇలా ఇప్పటివరకు 150 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. భాస్కర్ వేధింపుల బారిన పడిన వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ పై 2007లో లింగాల ఘణపురం లోనే ఇలాంటి కేసు నమోదవడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయినా భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు, ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్న అతడిని మరోసారి విచారణ జరుపుతున్నారు పోలీసులు.

ఇళ్ల పట్టాలపై జగన్ సర్కార్ కొత్త వ్యూహం.. మమా అనిపిస్తున్నారు!!

ఉగాది రోజున పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ సర్కార్.. విశాఖపట్నంలో భారీగా భూసమీకరణ జరుపుతోంది. ప్రభుత్వం జరిపే ఈ ప్రయత్నాలకు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అయితే ఎక్కడైనా భూములను సమీకరించినా వాటిని పేదలకు పంపిణీ చేయాలంటే ముందుగా ఆ భూముల్లో లేఔట్ లు వేయాలి. భూమిని చదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఆ తర్వాత ఆయా స్థలాలను ఫ్లాట్టుగా విభజించి పంపిణీ చేయాలి. ఈ పనులను పూర్తి చేయటానికి సగటున ఎకరాకు 40 లక్షల రూపాయల అవుతుందని విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఉన్నతాధికారులకు వెల్లడిస్తున్నారు. ఈ మధ్య పెరిగిన వ్యయాలు ఈ సేవలకు జీఎస్టీని కూడా కలుపుకుంటే ఎకరాకు 52 లక్షలు అవుతుందని లెక్కకట్టి తేల్చేశారు. సమీకరించ దలచిన 6,000 ల పైచిలుకు ఎకరాలలో ఈ విధంగా లేఔట్ లు వేయాలి అంటే సుమారు 3,000 ల కోట్లు అవసరమని లెక్కకట్టారు.  అయితే అంత మొత్తంలో తాము సమీకరించలేమని వీఎంఆర్డీఏ అధికారులు చేతులెత్తేశారు. దీంతో వారికి ఆ విషయంపై బోధపడేలా మార్గదర్శకాలిచ్చారు. ఇతర వ్యాపార లేఔట్ ఉన్న అంత వ్యయం పెట్టనక్కర్లేదని నామమాత్రపు లేఔట్ వేస్తే చాలని సూచించారు. దాంతో అధికారులూ కిందా మీదా పడి ఆ వ్యయాన్ని 52 లక్షల నుంచి ఏకంగా 2.5 లక్షల రూపాయలకు తగ్గించారు. అదేవిధంగా వీఎంఆర్డీఏ పై పడే భారం 150 కోట్లన్నమాట. ఎకరా స్థలంలో 2.5 లక్షల రూపాయలతో మౌలిక వసతులు ఎలా సమకూరుతాయని ప్రశ్నిస్తే భూమిని చదును చేసి ట్రెంచ్ లు కొట్టి మార్కింగ్ వేస్తే చాలని అంతకు మించి ఏమీ అవసరం లేదని కూడా అంటున్నారు. మరి రోడ్లు వేయిస్తామని.. కాలువల కోసం చిన్న గోతులు తవ్వుతామని కూడా చెప్తున్నారు. ఇతర లేఅవుట్ ఉన్న తారు రోడ్లు, విద్యుత్ సదుపాయం వంటివి ప్రస్తుతానికి ఉండవని పరోక్షంగా వెల్లడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆ సంస్థలో అన్ని నిధులు ఉన్నాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.

తెలంగాణకు త్వరలో తొమ్మిది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!!

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఎడ్యుకేషన్, ఇండస్ట్రీయల్, మెడికల్ హబ్ లుగా మారి వినూత్నంగా దూసుకుపోతుంది. అయితే కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రానున్నట్లు తెలుస్తోంది. రాబోవు విద్యా సంవత్సరం నుంచే వాటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కీలక అడుగు పడినట్లు తెలుస్తోంది. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై సీఎం కేసీఆర్ సంతకాలు చేసినట్టు సమాచారం అందుతుంది. సుమారు తొమ్మిది వర్సిటీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. అయితే వర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేరు వేరు యూనివర్సిటీలకు వేరు వేరు చట్టాలు కాకుండా ప్రైవేటు వర్సిటీల అన్నింటికీ కలిపి ఒకే చట్టం చెయ్యాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆ కసరత్తును తుది దశకు చేరినట్లు కూడా సమాచారం అందుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు బిల్లును ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల హడావిడి మొదలు కానుంది. నిజానికి ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి 2018 మార్చిలో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దాంతో అప్పటికే రాష్ట్రంలో వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్న పలు సంస్థలకు మార్గం సుగమమైంది. అప్పట్లోనే ప్రైవేటు వర్సిటీలు ప్రారంభమవుతాయని భావించిన పలు కారణాలతో సాధ్యం కాలేదు. గత ఏడాది కూడా సాధ్యం కాలేదు. ఈ యేడాది ఖచ్చితంగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఒకేసారి భారీగా ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఇప్పటికే సుమారు 15 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఆసక్తి చూపాయి. వీటిలో మల్లారెడ్డి, శ్రీనిధి, అనురాగ్, ఎస్ఆర్, గురునానక్ ఉన్నాయి. ప్రస్తుతానికి తొమ్మిది యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో టెక్ మహీంద్రా, ఎస్ఆర్, మల్లారెడ్డి, గురునానక్, శ్రీనిధి, నిప్ మర్, అనురాగ్, ఎంఎన్ఆర్ వాక్సిన్ వర్సిటీలు ఉన్నాయి. వీటి దరఖాస్తులను పరిశీలించిన ప్రత్యేక కమిటీ వర్సిటీలు ఏర్పాటు చేసే భవనాలు ప్రాంతాలను కూడా తనిఖీ చేసింది. సంబంధిత నివేదికను రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి పంపింది. ఆ వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్ తాజాగా సంతకం కూడా చేశారని తెలుస్తోంది. మరో రెండు ప్రముఖ విద్యా సంస్థలు రాడ్ క్లిఫ్, అమిటీ కూడా రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటు కానున్న తొమ్మిది ప్రైవేటు వర్సిటీల్లో ఒకటి మెడికల్, మరొకటి మహిళా వర్సిటీ అని తెలుస్తుంది. వీటిలో ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు మెడికల్ ప్రైవేటు వర్సిటీని, మల్లారెడ్డి విద్యాసంస్థలు మహిళా వర్సిటీని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి దీన్నిబట్టి తెలంగాణలో భారీ స్థాయిలో ప్రైవేలు వర్సిటీలు రానున్నట్లు తెలుస్తోంది.

మచిలీపట్నంలో మిస్టరీగా మారిన ఆరేళ్ళ బాలుడు మిస్సింగ్!!

ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసులు ఈ మధ్య భారీగా నమోదౌతున్నాయి. తాజాగా మచిలీపట్నంలో ఒక బాలుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. తొమ్మిది రోజుల క్రితం ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలుడు నందు ఆచూకీ ఇంత వరకు లభించలేదు. ఆ బాలుడు కోసం తలిదండ్రులు ఊరంతా గాలించినా ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా మచిలీపట్నం మొత్తం జల్లెడ పట్టినా పోలీసులకి బాలుడి ఆచూకీ దొరకలేదు. నందుని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదంటే ఆడుకుంటూ నందు ఏదైనా ప్రమాదానికి గురయ్యాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  కాగా ఈ నెల 4 వ తేదీన పెదకరగ్రహారంలో ఆరేళ్ల బాలుడు నందు అపహరణకు గురైయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. కాలువలు, చెరువులు, బావులు, ముళ్ళపొదల్లోనూ వెతుకుతున్నారు. నందును కిడ్నాప్ చేశారనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా ముమ్మర గాలింపు చేపట్టారు. అంతేకాకుండా బాలుడి తండ్రి ప్రియురాలిపై కూడా అనుమానం వ్యక్తమౌతుంది. అలాంటి అనుమానాన్నే వ్యక్తం చేస్తూ తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతిని కూడా విచారించారు. ఆమె నుంచి కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా తొమ్మిది రోజులైనా పిల్లాడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

ఏపీలో ప్రైవేట్ స్కూళ్లపై దాడులు... అధిక ఫీజులపై యాక్షన్...

తన ప్రాధాన్యతా రంగాల్లో విద్యాశాఖ ఒకటని మొదట్నుంచీ చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...  ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ ప్రక్షాళన చేపట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతోపాటు నాడు-నేడు పేరుతో పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. డ్రాపౌట్లను తగ్గించేందుకు అమ్మఒడి పథకంతో ప్రతి పిల్లాడికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కూడా జగన్మోహన్ రెడ్డి నడుంబిగించారు. విద్య వ్యాపారంగా మారకూడదంటూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం చట్టం తీసుకొచ్చారు. విద్యా హక్కు చట్టాన్ని నూరు శాతం అమలు చేయడమే కాకుండా, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేదలకు 25శాతం సీట్లు కేటాయించేలా చర్యలు చేపడతామని చెప్పారు. విద్య అనేది సేవే కానీ... డబ్బు ఆర్జించే వ్యాపార రంగం కాదన్న జగన్మోహన్ రెడ్డి.... ప్రైవేట్ పాఠశాలల్లో కనీస ప్రమాణాలు, ఉపాధ్యాయులు ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు పెట్టారు. పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రమాణాలు, ఫీజులను పరిశీలిస్తున్నారు. ఒకవేళ అధిక ఫీజులు వసూలు చేస్తున్నా... కనీస మౌలిక వసతులు లేకపోయినా చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 130 ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు జరగగా, మిగతా స్కూళ్లలోనూ ఈ సోదాలు కొనసాగనున్నాయి.

వైసీపీ రాజ్యసభ రేసులో మెగాస్టార్, మాజీ న్యాయమూర్తి?

వైసీపీలో రాజ్యసభ రేస్ మొదలైంది. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. అసెంబ్లీలో పార్టీల బలాబలాల ప్రకారం ఆ నాలుగు సీట్లూ అధికార వైసీపీకే దక్కనున్నాయి. దాంతో, రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. అయితే, ఖాళీ అవుతోన్న ఆ నాలుగు స్థానాల్లో మూడింటికి ఆల్రెడీ అభ్యర్ధులు ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగో అభ్యర్ధి ఎంపికపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయంటున్నారు. అయితే, మొదట్లో వినబడిన పేర్లు ఇఫ్పుడు సైడైపోయాయి. ఎందుకంటే, ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్ రావు, అలాగే గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజుకి రాజ్యసభ సభ్యత్వాలు దాదాపు ఖరారైనట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అలాగే, మూడో అభ్యర్ధిగా అయోధ్యరామిరెడ్డి పేరు ఫైనలైజ్ చేశారని అన్నారు. ఇక, నాలుగో సీటును ఎస్సీలకు కేటాయిస్తారని లీకులిచ్చారు. అయితే, ఇఫ్పుడు పాధాన్యతాక్రమం మారిపోయింది. వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో.... ఒకటికి రెడ్డికి... మరొకటి కాపుకి... అలాగే, మూడోది కమ్మకి... నాలుగోది దళితులు లేదా వెలమ లేదంటే ముస్లింలకు ఇవ్వాలనే జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ముఖ్యంగా, కాపు కోటాలో మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తున్న చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టొచ్చన్నది వైసీపీ ఆలోచనగా తెలుస్తోది. ఇక, కమ్మ కోటాలో... సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కొచ్చని అంటున్నారు. ఇటీవల తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జాస్తి చలమేశ్వర్ కలవడంతో అతనికి రాజ్యసభ సభ్యత్వం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక, రెడ్డి కోటాలో బడా పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి పేరు మొదట వినిపించినా, ఇఫ్పుడు సడన్ గా మెగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇక, నాలుగవది ఎవరో తేల్చాల్సి ఉంది.  అయితే, అవగాహనలో భాగంగా బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లను కేటాయిస్తే మాత్రం ఈ లెక్కల్లో తేడాలు వచ్చే అవకాశముంది. ఒకవేళ, ఎన్డీఏలో వైసీపీ చేరితే రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని, ఒకటి రెడ్డికి... రెండోది ఎస్సీకి కేటాయిస్తారని అంటున్నారు. అదే జరిగితే, వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

కటింగ్ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది... మూడో భర్త ఆవేదన...

జగిత్యాలలో ఓ వింత ఫ్యామిలీ హల్చల్ చేసింది. బైక్ పైనుంచి తనను తోసేశాడంటూ భార్య హాస్పిటల్లో చేరితే... ఫోన్లు చేస్తూ తనను టార్చర్ పెడుతోందంటూ భర్త బోరుమంటున్నాడు. జగిగ్యాలకు చెందిన రాణి, భరత్ భార్యాభర్తలు... ఇద్దరూ కలిసి టూవీలర్ పై వస్తుండగా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది... బైక్ పై వెళ్తూనే వాదులాడుకున్నారు... మాటామాటా పెరిగింది... ఇంతలో ఏమైందో బైక్ పైనుంచి రాణి కిందపడిపోయింది... దాంతో, రాణికి తీవ్ర గాయాలు అయ్యాయి... జగిత్యాల బైపాస్ రోడ్డులో పడిపోయి ఉండటంతో... 108లో ప్రైవేట్ ఆస్పత్రికి రాణికి తీసుకెళ్లారు.... తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న రాణికి ప్రాథమిక చికిత్స చేశారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించగా... తన భర్తే బైక్ పైనుంచి తోసేశాడంటూ చెప్పింది. దాంతో, అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అయితే, అసలేం జరిగిందని భర్తను పశ్నిస్తే... ఆమె తనతో గొడవ పడుతూ బైక్ పైనుంచి దూకేసిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఇద్దరి మాటలు విన్న ఆస్పత్రి సిబ్బంది... భార్యాభర్తల మధ్య రోజూ ఉండే గొడవలే కదా అనుకున్నారు. అయితే, అసలు సంగతి చెబుతూ భోరుమన్నాడు రాణి భర్త భరత్. అది విన్న ఆస్పత్రి సిబ్బంది, అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. అతడి పరిస్థితిని తలుచుకుని అయ్యో పాపం అనుకున్నారు. రాణి తనను మూడో పెళ్లి చేసుకుందని, ఆమె తన కంటే పదేళ్లు పెద్దదని ఏడుస్తూ చెప్పాడు భరత్. ఇంట్లో పేషెంట్ ఉన్నాడు... కటింగ్ చేయాలంటూ పిలిచి... తనను ట్రాప్ చేసి మూడో పెళ్లి చేసుకుందని ఏడుపు లంకించుకున్నాడు. అంతేకాదు, మా అమ్మానాన్న దగ్గరకి వెళ్తే ఎక్కడున్నావ్ అంటూ ఫోన్లు చేస్తూ విసిగిస్తూ టార్చర్ పెడుతోందని, ఆ విషయంలోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అలా, బైక్ పై గొడవ పడుతూనే కిందకి దూకేసిందని చెప్పాడు. భరత్ మాటలు విన్నాక అక్కడున్నవారికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అసలు భార్యాభర్తల్లో ఎవరిని ఓదార్చాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇదేం వింత ఫ్యామిలీరా బాబూ అంటూ అక్కడ్నుంచి జారుకున్నారు.

రాజకీయ పార్టీలపై సుప్రీం సీరియస్.. అభ్యర్థుల నేర చరిత్రను వెబ్‌సైట్లో పెట్టండి!

నేర చరిత్ర ఉన్న వాళ్లను ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టడంపై.. అన్ని రాజకీయ పక్షాలకు సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 'రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల నేర చరిత్రను సమగ్ర సమాచారంతో పార్టీల అధికారిక వెబ్‌సైట్లతో పాటు, మీడియా ద్వారా దేశ ప్రజలకు అందుబాటులో ఉంచాలి' అని గురువారం ఆదేశాలు జారీ చేసింది. 48 గంట‌ల్లోనే వారి వివ‌రాల‌ను వెబ్‌సైట్ల‌లో పెట్టాల‌ని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ రోహిన్‌టన్ ఎఫ్. నారిమన్ సారథ్యంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. అంతేకాకుండా అభ్యర్థుల కేసుల సంఖ్య, చేసిన నేరాలతో పాటు, అవి ఏయే దశల్లో విచారణలో ఉన్నవి కూడా.. న్యూస్ పేపర్లు, సోషల్ మీడియా, అధికారిక వెబ్‌సైట్లలో పెట్టాలని ఆదేశించింది. ప్రజలు అభ్యర్థులను సులువుగా ఎన్నుకోవడం కోసం, ఈ ప్రక్రియ దోహదపడుతుందని సుప్రీం పేర్కొంది. అసలు నేర చరిత్ర ఉన్న వారికి టిక్కెట్లు ఎందుకివ్వాల్సి వచ్చిందో అన్న విషయాన్ని కూడా వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. అభ్యర్థి ఎన్నికైన మూడు రోజుల్లోనే ఈ వివరాలను ఎన్నికల సంఘానికి కూడా సమర్పించాలని నిబంధన విధించింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించకపోయినా, లేదా వెబ్‌సైట్లో పెట్టకపోయినా కోర్టు ధిక్కరణ కింద అభ్యర్థిపై ఈసీ చర్యలు సైతం తీసుకోవచ్చని సుప్రీం సూచించింది. తాజా గణాంకాల ప్రకారం.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 539 మందిలో 233 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2009లో ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసుల కంటే, ఇవి 44 శాతం ఎక్కువ. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఏడాదికేడాది నేర చరిత్ర ఉన్న వారి సంఖ్య తగ్గాల్సింది పోయి, మరింత ఎక్కువ మంది అలాంటి వాళ్లనే అభ్యర్థులుగా ఎందుకు పెడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఇలా నేర చరిత్ర ఉన్నవారికి కాకుండా, ప్రజలకు మంచి చేసేవారిని అభ్యుర్థులుగా ఎంపిక చేస్తారేమో చూడాలి.

ముందు నీ రెండో భార్యకు న్యాయం చెయ్.! పవన్ పై వైసీపీ నిప్పులు

అత్యాచారం, హత్యకు గురైన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోతే, ఇక న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించడం నిష్‌ ప్రయోజనమన్నారు పవన్. అయితే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి రేప్ అండ్ మర్డర్ పై ఆనాడు గళమెత్తని పవన్ కల్యాణ్... ఇప్పుడు సడన్ గా ఆందోళన చేయడమేంటనే అనుమానాలు కలుగుతున్నాయి. సుగాలి ప్రీతి ఇష్యూను ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వెనుక జనసేనాని వ్యూహం ఉందంటున్నారు. ఎందుకంటే, అమరావతిలోనే రాజధాని కొనసాగాలని, మూడు రాజధానులను వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ కు రాయలసీమ వాసులు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తించే సుగాలి ప్రీతి ఇష్యూను ఎత్తుకున్నారని అంటున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకించడమంటే, కర్నూలులో న్యాయ రాజధానిని కూడా వ్యతిరేకించినట్లే... అందుకే, పవన్ కు వ్యతిరేకంగా కర్నూలులో కొన్ని సంఘాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి.  రాయలసీమ ద్రోహి పవన్‌ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ఒకప్పుడు కర్నూలే రాజధానిగా ఉండాలన్న పవన్, ఇఫ్పుడు మాట మార్చారంటూ నిలదీశారు. ఇది కర్నూలు ప్రజలను మోసగించడమేనంటూ ప్రశ్నించారు. అందుకే, పవన్ తెలివిగా సుగాలి ప్రీతి ఇష్యూను ఎత్తుకుని, రాయలసీమలో ఎంటరవడమే కాకుండా... ఒక షెడ్యూల్‌ తెగకు చెందిన యువతి కుటుంబానికి న్యాయం చెయ్యని జగన్‌ ప్రభుత్వం, ఇక జ్యూడిషియరీ రాజధానిగా, కర్నూలును ప్రకటించడం నిష్‌ ప్రయోజనమంటూ జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. అలా, ఏదోఒక ప్రజాసమస్యను ఎత్తుకుని రాయలసీమలో పార్టీని బలోపేతం చేయాలన్నదే పవన్ వ్యూహమని జనసైనికులు చెబుతున్నారు. అందుకే సెంటిమెంట్‌ రగిలించే సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ, కర్నూల్లో పెద్దఎత్తున పవన్‌ ర్యాలీ, సభ నిర్వహించారని విశ్లేషకులంటున్నారు.  అయితే, సుగాలి ప్రీతి హత్యాచారం ఘటనపై ఉద్యమిస్తానంటున్న పవన్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు వైసీపీ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. 2017లో ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని, నాడు టీడీపీ ప్రభుత్వముందని, మరి నాడెందుకు పవన్ ప్రశ్నించలేదని అంటున్నారు వైసీపీ లీడర్లు. ఇక, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అయితే పవన్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. 2017లో కర్నూలు విద్యార్థినిపై హత్యాచారం జరిగిందని, అప్పటి సీఎం చంద్రబాబును పవన్ ఎందుకు నిలదీయలేదని హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. నాడు జరిగిన నేరంపై నేడు పవన్ గగ్గోలు పెట్టడం అర్ధం లేదన్నారు. ఆడబిడ్డల భద్రత గురించి మాట్లాడుతున్న పవన్ తో అతడి రెండో భార్య రేణు దేశాయ్ ఎన్ని కష్టాలు పడిందో అందరీకి తెలుసు అన్నారు. మొత్తానికి మూడు రాజధానుల ఇష్యూ నేపథ్యంలో, రాయలసీమలో అడుగుపెట్టడం కష్టమని భావించిన పవన్, ఇతర అంశాలతో ఎంటర్‌కావాలన్న వ్యూహంలో భాగంగా, ప్రీతి ఘటనతో ర్యాలీ చేశారని, కొందరు విశ్లేషకులంటున్నారు. మరి, ఈ వ్యూహాలు జనసేనకు ఊపునిస్తాయయో? లేదో? కాలమే సమాధానం చెప్పాలి.

తెలంగాణలో మహిళను చంపిన కోతులు... ఏపీలో తేనెటీగల దాడితో ఐదుగురికి సీరియస్

అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని ఆహారం, నీళ్ల కోసం... జనారణ్యంలోకి వస్తుండగా... మరికొన్ని దారితప్పి గ్రామాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. చిరుతలు భయపెడుతుంటే... ఏనుగులు వెంటబడుతున్నాయి... కొండ ముచ్చులు వణికిస్తుంటే... తేనెటీగలు తరుముతున్నాయి... ఎలుగుబంట్లు, అడవి పందులైతే జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి... ఇక, కోతులైతే ఏకంగా ఇళ్లల్లోకి వచ్చి దాడులు చేస్తుండటంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కరోజే ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు, తేనెటీగలు జనంపై దాడి చేసి హడలెత్తించాయి. చిరుతలు పదేపదే జనారణ్యంలోకి వస్తూ జనాన్ని భయపెడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లోనే కాదు... కాంక్రీట్ జంగిలైన హైదరాబాద్‌‌లోకి సైతం ప్రవేశిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు చిరుతల దాడిలో ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగపోయినా పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. ఇక, హైదరాబాద్ నగర శివార్లలో అటవీ ప్రాంతాలు ఉండటంతో అక్కడ కూడా జనాల్లోకి వస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇక, ఏనుగులదీ అదే పరిస్థితి. ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లో నిత్యం అలజడి సృష్టిస్తుంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటివరకు ఏనుగుల దాడిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాల్లోకి వస్తూ జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా పొలాలపై పడటంతో రైతులు భయంతో వణికిపోయారు. మరోవైపు, అనంతపురం జిల్లా మడకశిరలో జనారణ్యంలోకి ప్రవేశించి... జనాన్ని హడలెత్తించిన ఎలుగుబంటిని అతికష్టంమీద బంధించి తరలించారు. ఇక, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట్లలో తేనెటీగలు దాడి చేయడంతో 50మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో ఓ ఇంట్లోకి ప్రవేశించిన కోతుల గుంపు మూకుమ్మడిగా దాడి చేయడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మొత్తానికి, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, కోతులు, అడవి పందులు, కొండముచ్చులు... జనారణ్యంలోకి వస్తూ దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో జనం వణికిపోతున్నారు.

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. మధ్య తరగతిపై భారం

మధ్య తరగతిపై మరో భారం పడింది, గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. గత ఆరేళ్ళలో ఇదే భారీ పెంపు, దీంతో మధ్యతరగతిపై ఖర్చులు మరింత పెరగనున్నాయి. వంట గ్యాస్ ధర ఒకే సారి రూ. 144 పెరిగింది. దీంతో 714 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర 858 రూపాయలకు చేరింది. అయితే కేంద్రం ఇచ్చే రాయితీని కూడా పెంచింది, రాయితీ గతంలో 153.86 కాగా ఇప్పుడది 291 రూపాయలకు పెరిగింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు రాయితీని 174.86 నుంచి 312.48 పెంచింది.  2014 జనవరి తర్వాత వంట గ్యాస్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల మార్పే తాజా ధరల పెంపుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున ఎల్పీజీ ధరలను సమీక్షిస్తూ ఉంటారు కానీ, ఈసారి దాదాపు రెండు వారాలు ఆలస్యం అయ్యింది. రాయితీని భారీగా పెంచుతున్న కారణంగా అనుమతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు.  అయితే ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ధరల పెంపును వాయిదా వేశారన్న ఆరోపణలు వినిపించాయి. తాజా పెంపుతో ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన ఇండియన్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 144 రూపాయలు పెరగ్గా ముంబైలో 145 రూపాయలు, కోల్ కతాలో 149 రూపాయలు పెరిగింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడంతోనే ధరలు పెరిగినట్టు కంపెనీలు చెబుతున్నాయి. ప్రతి యేడాది ప్రభుత్వం పన్నెండు సిలిండర్ లకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీని డైరెక్ట్ గా ఎకౌంట్ లలో పడనుంది, అటు రాయితీలు పెంచడంతో పాటు ధరలు కూడా పెరిగాయి. బడ్జెట్ లో దీనికి ప్రభుత్వం నిధులు కేటాయించింది, అయితే నాన్ సబ్సిడీ సిలిండర్ లకు మాత్రం పెను భారం తప్పదు. ఓ వైపు ధరలు ఇటు రాయితీ పెంచినా, ప్రభుత్వ రాయితీని మించితే సగటు కుటుంబం పైన అధికంగా భారం పడనుంది. ఇలాగే పెంచుకుంటూ పోతే త్వరలో సిలిండర్ ధరలు వెయ్యి రూపాయలను అందుకుంటాయని అంటున్నారు. మొత్తంగా పెంపు నిర్ణయం పై పలు వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పోలీసులమంటూ రేప్ చేశారు... పారిపోతూ పైకి పోయారు...

చేసింది క్షమించరాని తప్పు... పైగా పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు... కానీ, విధి వదల్లేదు... చివరికి, కారు బోల్తాపడి మరణించాడు... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రేప్‌ కేసులో నిందితుడు... పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ మృత్యువాత పడ్డాడు. మహిళపై అత్యాచారం కేసులో నిందితులను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఒక నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని కారులో పారిపోతూ ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతివేగంతో కారును నడపడటంతో... రాయికోడ్ మండలం సిరూర్ సమీపంలో కారు బోల్తాపడి నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మహిళలే లక్ష్యంగా ఐదుగురు సభ్యుల ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని నిందితులే... పోలీసుల పేరుతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పస్తాపూర్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. నీ లగేజీలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నాయంటూ మహిళను బస్సులో నుంచి కిందకి దించిన నిందితులు... ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జహీరాబాద్‌ పోలీసులు.... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. అయితే, నిందితుల్లో ఒకడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ కారు బోల్తాపడి మరణించాడు. అయితే, బాధితురాలి తీరుపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులమని చెప్పగానే బస్సు దిగిపోవడం, రమ్మన్న చోటకి వెళ్లడంతో బాధిత మహిళ నేపథ్యాన్ని కూడా సేకరిస్తున్నారు. గుట్కాను అక్రమ రవాణా చేస్తున్న మహిళకు... నిందితులతో ఇంతకుముందే సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గెలిచిన తరువాత ఆ ఇద్దరికి షాకిచ్చిన కేజ్రీవాల్...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బంపర్ విక్టరీకి దోహదపడిన ఇద్దరు కీలక వ్యక్తులకు కేజ్రీవాల్ షాకిచ్చారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్ పాత మంత్రి వర్గాన్నే కొనసాగించాలని డిసైడయ్యారు. తద్వారా కేబినెట్ లో చోటు ఖాయమనుకున్న అతిషి మర్లేనా, రాఘవ్ చద్దాలకు మొండిచేయి చూపారు. ఆప్ హ్యాట్రిక్ విజయంలో కీలక భాగస్వాములు అతిషి మర్లేనా, రాఘవ్ చద్దాలు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది అతిషి, స్కూళ్లను బాగు చేసింది ఆమెనే. ఆప్ నేతలలో కేజ్రీవాల్, సిసోడియా తర్వాత దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన వ్యక్తుల్లో అతిషి మర్లేనా ఒకరు. గత లోక్ సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసి క్రికెటర్ గౌతం గంభీర్ పై ఓడిపోయిన ఆమె, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజక వర్గం నుంచి 11,393 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అతిషి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సలహాదారుగా ఉంటూ ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. సలహాదారుల నియామకం చట్ట విరుద్ధమని కేంద్రం అభ్యంతరం చెప్పడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అతిషికి ఢిల్లీ విద్యా మంత్రి పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, సీఎం సానుకూలంగా స్పందించలేదు.  ఢిల్లీ లో ఆప్ కు తిరుగులేని మెజారిటీ అందించిన ఉచిత పథకాల రూపకర్త రాఘవ్ చద్దాను కూడా క్యాబినెట్ లోకి తీసుకోరాదని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన చద్దా ఢిల్లీ ఆర్ధిక శాఖకు ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. కేంద్రం అభ్యంతరంతో ఆ పదవిని వదులుకున్నారు. తాజా ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ఇరవై వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆప్ అధికార ప్రతినిధి లీగల్ వ్యవహారాల ఇన్ చార్జి గానూ కొనసాగుతున్న చద్దాకు కొత్త క్యాబినెట్ లో చోటు ఖాయమని అందరూ భావించినా చివరికి అలా జరగలేదు. క్యాబినెట్ లో మార్పులు చెయ్యకూడదని కేజ్రీవాల్ నిర్ణయించటంతో ఆదివారం ఆయనతో పాటు మరో ఆరుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనీష్ సిసోడియా మళ్లీ డిప్యూటీ సీఎం గా కొనసాగనున్నారు. సత్యేంద్ర కుమార్ జైన్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతమ్, కైలాష్ గెహ్లాట్ లు యథావిధిగా మంత్రి పదవుల్లో కొనసాగనున్నారు. ప్రఖ్యాత రాంలీలా మైదాన్ లో జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

విశాఖలో దారుణం... కూతుర్ని చంపి... తల్లి ఆత్మహత్యాయత్నం..!

విశాఖలో అదృశ‌్యమైన చిన్నారి జ్ఞానస కథ విషాదంగా ముగిసింది. తల్లి ఆవేశమో లేక అమాయకత్వమో తెలియదు గానీ, జరగరాని దారుణం జరిగిపోయింది. ఓ కంటి పాప తీరని లోకాలకు వెళ్లిపోయింది. అందమైన ఆ ఇంటి కల చెదిరిపోయింది. అనుకోని అపార్ధాలు కుటుంబం మొత్తానికి తీరని ఆవేదన మిగిల్చింది.  విశాఖ పులగవానిపాలెంలో బంగారం అత్తాకోడళ్ల మధ్య చిచ్చుపెట్టింది. తన బంగారాన్ని ఆడపడుచుకు ఇచ్చేశారంటూ అత్తతో కోడలు గొడవ పడింది. చివరికి అత్త సూటిపోటి మాటలను తట్టుకోలేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా తనకున్న ఏడాదిన్నర పాపతో తీసుకుని తన ఇంటి వెనుకున్న ఎత్తయిన కొండ ఎక్కింది.... మూడ్రోజులపాటు కొండ దగ్గరే తిరుగుతూ గడిపింది... అయితే, అన్నం నీళ్లూ లేకపోవడంతో సొమ్మసిల్లిపడిపోయింది... చివరికి గొర్రెల కాపరులు ఆమెను గమనించి... పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... మూడ్రోజుల క్రితం అదృశ్యమైన సుమలతగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, పాప కనిపించకపోవడంతో... తల్లి సుమలత ఇచ్చిన సమాచారం మేరకు పెందుర్తి ఎర్రకొండ అడవుల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో కొండను... కొండ కిందనున్న పరిసరాలను జల్లెడ పట్టారు. అయితే, సుమలత చెప్పినట్లుగా ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా, రెండు మూడుసార్లు ఎర్రకొండ పరిసరాలను జల్లెడ పట్టినా... పాప ఆచూకీ దొరకకపోవడంతో... అసలు చిన్నారి ఏమైందనేది పోలీసులను కంగారుపెట్టింది. అయితే, అన్నంనీళ్లూ లేక ఏడ్చిఏడ్చి ఆకలితో చిన్నారి చనిపోతే తానే కొండ కింద పాతిపెట్టానని తల్లి సుమలత చెప్పడంతో మరోసారి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే, డాగ్ స్క్వాడ్‌తో రెండ్రోజులపాటు చిట్టడవిలో గాలించినా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మూడ్రోజులపాటు వెదికినా చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో... చివరికి తల్లిని కూడా స్పాట్‌కి తీసుకొచ్చారు. తల్లి కూడా స్పాట్‌ని ఐడెంటిఫై చేయలేకపోవడంతో... 20మంది పోలీసులు, 30మంది కుటుంబ సభ్యులతో కలిసి అడవి జల్లెడపట్టి చివరికి చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. మట్టిలో కప్పిన చిన్నారి మృతదేహాన్ని చూసిన జ్ఞానస తండ్రి తట్టుకోలేకపోయాడు. చిన్నారి మృతదేహం దగ్గర కూర్చొని గుండెలు పగిలేలా విలపించాడు. చిన్నారి తల్లి సుమలత... ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు... తన వయస్సున్న మహిళ ఆహారం నీళ్లూ లేకుండా ఎన్ని రోజులు జీవించవచ్చనే విషయాన్ని  తన ఫోన్ ద్వారా గూగుల్ వెదికినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, చిన్నారిని తీసుకుని కొండెక్కి చిట్టడవిలోకి వెళ్లిన సుమలత.... తన గొంతు, చేతిపై గాయాలు చేసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నంలో సొమ్మసిల్లిపడిపోవడంతో మూడ్రోజుల తర్వాత గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అలా, సుమలత ఆచూకీ దొరికినా... చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. అయితే, చిన్నారిని తల్లే చంపిందా? లేక సుమలత చెబుతున్నట్లుగా అన్నంనీళ్లూ లేక ఏడ్చిఏడ్చి చనిపోయిందా? అనేది సస్పెన్స్‌గా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత క్లారిటీ రానుంది. అయితే, సుమలత పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో... ఆమె మానసిక స్థితిపైనా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

జగన్ సర్కార్ ఎఫెక్ట్.. కర్ణాటకలో బంద్.. ఏపీ బస్సుపై రాళ్లు

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ఓ రూల్ తీసుకురావాలని ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అనాలోచిత నిర్ణయమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏపీని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ఇదే రూల్ పెడితే.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న.. ఆంధ్రుల పరిస్థితి ఏంటని విపక్షాలు ప్రశ్నించాయి. విపక్షాల అనుమానాలే నిజమయ్యాయి.  మిగతా రాష్ట్రాల్లో కూడా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్ సర్కార్ ఎఫెక్ట్ కర్ణాటక పై పడింది. 75శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌‌కు పలు సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. స్థానికులకే 75శాతం ఉద్యోగాలు కల్పించాలని దాదాపుగా గత 100 రోజుల నుంచి అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో కర్ణాటక రక్షణ వేదిక బంద్ కి పిలుపునిచ్చింది. అయితే ఏపీ బస్సులను టార్గెట్ చేసి రాళ్ల దాడి చేయడం బంద్‌ను ఉద్రిక్తంగా మార్చింది. మంగళూరులో ఫరంగిపేట వద్ద ఓ బ‌స్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తిరుప‌తి నుంచి మంగుళూరు వెళ్తున్న బ‌స్సును ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రాళ్ల దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళూరుతో పాటూ బెంగళూరు మరికొన్ని ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. మొత్తానికి జగన్ సర్కార్ ఎఫెక్ట్ కర్ణాటకపై గట్టిగానే పడింది.

నిర్భయ దోషుల డెత్ వారెంట్ పిటిషన్లపై ఈరోజు కోర్టులో విచారణ...

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు విషయంలో జరుగుతున్న జాప్యం పై నిర్భయ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దోషులని వెంటనే ఉరి తీయాలని కోరుతూ మరోసారి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డెత్ వారెంట్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. తమ కూతురికి న్యాయం చేయాలని, దోషులను తక్షణమే ఉరి తీయాలని కోరుతూ కోర్టు మెట్లెక్కారు నిర్భయ తల్లితండ్రులు. ఏడేళ్లయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థపై తమకు నమ్మకం పోతోందని, శిక్ష అమలుపై జాప్యం జరుగుతుండటంతో కోర్టు ఆవరణలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. నిజానికి ఆ నలుగురినీ జనవరి 22 నే ఉరి తీయాలని తొలుత డెత్ వారెంట్ లు జారీ కాగా, వారికి చట్ట పరంగా అన్ని హక్కులూ కల్పించాలంటూ దోషుల తరఫు లాయర్ వాదించడంతో ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఢిల్లీ పాటియాలా కోర్టు మరోసారి వారెంట్ లు జారీ చేసింది. వారం రోజుల్లోగా అన్ని అవకాశాలు వినియోగించాలంటూ కోర్టు డెడ్ లైన్ విధించింది. టైం దగ్గర పడిన సమయంలో లాయర్ లేడంటూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కోర్టుకు విన్నవించారు. దీంతో మరోసారి శిక్ష అమలులో జాప్యం నెలకొంది, పవన్ గుప్తా అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం తక్షణ సాయం అందించింది. ఎంప్యానెల్ న్యాయవాదుల జాబితానిచ్చి లాయర్ ను ఎంచుకోవాలని సూచించింది. ఇక డెత్ వారెంట్ పిటిషన్లపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టనుంది.

ప్రేమికుల రోజుకు ముందు విషాదాన్ని నింపిన ప్రేమ జంట...

ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందు విశాఖలో ప్రేమ జంట జీవితం విషాదంగా ముగిసింది. కొన్ని గంటల వ్యవధి లోనే యువతీ, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో ఇరు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. నగరంలోని గోపాలపట్నం, కంచరపాలెం పీఎస్ ల పరిధిలో జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేసింది. ఎలమంచిలికి చెందిన శిరీష కుటుంబం కొంత కాలం క్రితం విశాఖకు మకాం మార్చింది. గోపాల్ పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకొని జీవనం సాగిస్తోంది. అదే ఊరికి చెందిన వెంకట్ కుటుంబం కంచరపాలెంలో ఉంటుంది.  వెంకట్, శిరీష ల మధ్య 2013 నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రతి రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. మంగళవారం సాయంత్రం వెంకట్ తో ఫోన్ లో గొడవపడింది శిరీష. చనిపోతానని హెచ్చరించి ఫోన్ కట్ చేసింది. దీంతో శిరీష సోదరుడికి వెంకట్ సమాచారమిచ్చాడు. అప్పటికే ఇంటి పై అంతస్తులోకి వెళ్లి ఆత్మహత్యా యత్నం చేసింది శిరీష. కొన ఊపిరితో ఉన్న ఆమెను కేజీహెచ్ కు తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయింది. శిరీష మరణాన్ని జీర్ణించుకోలేని వెంకట్ తాను చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. కంచరపాలెంలో బాలాజీ నగర్ లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఊరికి చెందిన వెంకట్, శిరీషలు ఆత్మహత్యలకు పాల్పడటం అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు ఎలమంచిలి వాసుల్లోనూ విషాదాన్ని నింపింది.