ప్రకాశం జిల్లాలో క్వారీలు ఉన్న టీడీపీ లీడర్స్ కు వైసిపి ప్రభుత్వం షాక్...

  ప్రకాశం జిల్లాలో టీడీపీ లీడర్స్ కు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దేశం నేతలకు చెందిన గ్రానైట్ క్వారీలకు భారీ జరిమానాలు విధించింది. వీరిలో బిజెపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ మండలాల్లో గ్రానైట్ తవ్వకాలు అధికంగా జరుగుతాయి. పలువురు టిడిపి నేతలకు ఇక్కడ క్వారీలున్నాయి, అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అధికారుల దాడులు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండునెలలుపాటు గ్రానైట్ క్వారీల్లో తనిఖీ చేశారు. కడప, అనంతపురం నుంచి ప్రత్యేకంగా సర్వేయర్ లను తీసుకువచ్చి క్వారీలో జరిగిన తవ్వకాలపై కొలతలు వేశారు. పలు అక్రమాలు జరిగినట్లు అధికారుల దాడుల్లో తేలింది. దీంతో వారికి భారీగా జరిమానా విధించారు అధికారులు, బల్లికురవలో బిజెపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు కుటుంబ సభ్యులకు చెందిన గ్రానైట్ క్వారీలో అధికారులు సోదాలు జరిగాయి. క్వారీలో అక్రమాలు జరిగాయంటూ 285 కోట్ల 32 లక్షల రూపాయల భారీ జరిమాన విధించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీలపైన 250 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించారు అధికారులు. మాజీ మంత్రి టీడీపీ నేత శిద్దా రాఘవరావు ఆయన కుటుంబ సభ్యుల గ్రానైట్ క్వారీలపై త్వరలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేందుకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి విడతలో మొత్తం 56 గ్రానైట్ కంపెనీలకు 1914 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ప్రభుత్వం తమను ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేసిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. క్వారీల్లో తవ్వకాల విషయంలో అన్ని నిబంధనలు పాటిస్తున్నప్పటికీ జరిమానాల రూపంలో వేధిస్తున్నారని తప్పుబట్టారు. కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల క్వారీలపైనే భారీ మొత్తంలో జరిమానాలు విధించటంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలయ్యింది. వందల కోట్ల రూపాయల జరిమానాలు విధించటంతో ఆ నేతలు హడలెత్తిపోతున్నారు. మరోవైపు అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ శాఖ కూడా నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో సమాధానం చెప్పాలంటూ వివరణ కోరింది.

ప్రజల ముందుకు జగన్ నిర్వాకం.. జే ట్యాక్స్ తో వైసీపీకి రూ.20 వేల కోట్ల ఆదాయం!

తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రజా చైతన్య యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ప్రకాశం జిల్లాలో ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు జరుగనున్న ఈ  ప్రజా చైతన్య యాత్రకి సంబంధించిన కరపత్రాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ యాత్ర ద్వారా 9 నెలల్లో జగన్ చేసిన నిర్వహకాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. వైసీపీ తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకుని రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కళా వెంకట్రావ్ విమర్శించారు.  ఎన్నికలముందొకటి చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కులాలు, మతాలవారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని, ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచారని, అర్హుల పింఛన్లు తొలగించారని, మరిన్ని పింఛన్లు తొలగించే ప్రయత్నంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.  అధికార పార్టీ నేతలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని ఆరోపించారు. సారా దుకాణాల్లో ఎక్సైజ్ స్టాఫ్‌తో పాటు వైసీపీ కార్యకర్తలను పెట్టారని, పోలీసులను చేతిలో పెట్టుకుని ఎన్నాళ్లు పాలన సాగిస్తారని కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితుల్లో.. ప్రజల ముందుకు వెళ్తున్నామని, ప్రజల తరఫున పోరాటం చేస్తామని కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు.

కంబళ పోటీల్లో మరో ఉసేన్ బోల్ట్‌.. శ్రీనివాస గౌడ రికార్డ్ బ్రేక్

కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తితే దేశం మొత్తం ఆశ్చర్యపడింది. ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల వరల్డ్ రికార్డుతో పోల్చుతూ అతన్ని ఆకాశానికెత్తింది. అయితే, కంబళ వీరుడు శ్రీనివాస గౌడ ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలు కొట్టాడన్న వార్త వెలుగుచూసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే మరో సంచలన రికార్డు నమోదైంది. కంబళ టోర్నీలో భాగంగా తాజాగా జరిగిన పోరులో శ్రీనివాస గౌడ రికార్డు బద్దలైంది. నిశాంత్ శెట్టి అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే అధిగమించి ఔరా అనిపించాడు. నిశాంత్ శెట్టి కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు. ఈ పోటీల్లో నిశాంత్ శెట్టి మొత్తం 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేశాడు.

వైజాగ్ లోని వందల కోట్లు విలువచేసే ఆశ్రమంపై కన్నేసిన నేతలు!!

ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరం వెంకోజీపాలెంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జ్ఞానానంద-రామానంద ఆశ్రమం ఎన్నో ఏళ్లుగా నడుస్తుంది. దీనిపై కొందరు పెద్దల కన్ను పడింది. దీంతో ఈ ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలి అంటూ కొందరు ప్రజా ప్రతినిధులు ఏకంగా దేవాదాయ శాఖకు లేఖలు రాశారు. ఆశ్రమ నిర్వాహకులు స్వామి పూర్ణానంద సరస్వతికి కొందరు ఫోన్ చేసి ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. రిటైర్డ్ పోలీస్ అధికారిని రంగంలోకి దింపి అతనితో బెదిరించారు. ఆశ్రమాన్ని అప్పజెప్పకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. చివరకు రెవిన్యూ అధికారులు కూడా ఆశ్రమానికి వచ్చి స్వామితో రాయబారాలు నడిపారు. దీంతో స్వామి నగరంలో పలువురు ప్రముఖులను కలిసి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నారు. వెంకోజీపాలెంలో జాతీయ రహదారికి అతి సమీపంలో కొండవాలున 1955లో జ్ఞానానంద సరస్వతి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అందులో శివాలయం కూడా నిర్మించారు. శివాలయంలో దూపదీప నైవేద్యానికి స్థానికులు పీలా అప్పారావు, కోడి సన్యాసి ఆరు ఎకరాల భూమిని 1958 జులై 12న దానం చేస్తూ గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. అదే ప్రాంగణంలో పాఠశాల నిర్వహణ కోసం ఆశ్రమానికి ఆనుకొని ఉన్న 3.31 ఎకరాల కొండ పోరంబోకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో గజం రిజిస్ర్టేషన్ విలువ ప్రకారం 50,000 ఉంది. కానీ మార్కెట్ ధర మాత్రం గజం లక్ష వరకు ఉంది. ఆ విధంగా ఆశ్రమ స్థలం విలువ అక్షరాలా 300 కోట్లు. జ్ఞానానంద సరస్వతి కాలం చేసిన తర్వాత ఆయన శిష్యుడు స్వామి పరిపూర్ణానంద సరస్వతి 1980లో ఆశ్రమ బాధ్యతలు స్వీకరించారు. కాగా తానిచ్చిన గిఫ్టు డీడ్ లను రద్దు చేయాలి అంటూ దాత పీల అప్పారావు చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టేయడం విశేషం.

ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లి ఫ్యామిలీ మృతి!

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మిస్టరీ జరిగింది. గత ఆదివారం రాత్రి దంపతుల బైక్ పై వెళ్తున్నారు. సడెన్ గా కళ్ళలో పురుగు పడటంతో దంపతులు బైక్ తో సహా కాకతీయ కాలువలో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని రక్షించటానికి చేసిన ప్రయత్నంలో ఒక్కరినే కాపాడ గలిగారు. ఆ ప్రమాదంలో భార్య చనిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బైక్ కోసం వెతుకుతున్న సమయంలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో స్థానికులు అధికారులకు సమాచారమిచ్చి లోయర్ మానేరు నుంచి నీటి విడుదలను ఆపేశారు. అయితే నీటి మట్టం తగ్గడంతో అనూహ్యంగా కాకతీయ కాలువలో ఓ మునిగి పోయిన కారు బయటపడింది. కారును వెలికితీసిన స్ధానికులు కారు నెంబర్ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లి.. బావ వాళ్ళ కూతురు అని గుర్తించారు. కారులో వెనక సీట్లో సత్యనారాయణరెడ్డి ఆయన భార్య రాధిక కూతురు వినయశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. స్వయాన ఎమ్మెల్యే బంధువులు అవడంతో అంతా ఎలెర్ట్ అయ్యారు.  అసలు విషయంలోకి వెళ్తే.. జనవరి 27 మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మొబైల్ స్విచాఫ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం ఏమైందో ఎక్కడికి వెళ్లిందో? ఆరా తీసిన వారే లేరు. ఇంట్లోంచి బయలుదేరినవాళ్లు గమ్యానికి చేరుకోలేదు. అలాగని ఇంటికి రాలేదు. ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇది ప్రమాదమేనా? ప్రమాదంలా సృష్టిస్తున్నారా? అనే డౌట్స్ పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా ముందు సీట్లో ఎవ్వరూ లేరు అదెలా సాధ్యం? మొదటి అనుమానం. కారు ప్రమాదాన్ని ఎవరూ గుర్తించ లేదా? అన్నది రెండవ అనుమానం. పైగా కుటుంబం లోని ముగ్గురు 20 రోజులుగా కనిపించకుండా పోయినా ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇది మూడో అనుమానం. జనవరి 29వ తేదీన సత్యనారాయణరెడ్డి ఇంటి తాళాలు పగుల గొట్టి వెతికారని చెబుతున్నారు. తాళం పగలగొట్టి దేనికోసం వెతికారు? అన్నది నాలుగవ అనుమానం. వారం క్రితం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణరెడ్డి నంబర్ టవర్ లోకేషన్ తెలుసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులను అడిగాడు. కంప్లైంట్ ఇవ్వండి వెతికిపెడతాం? అన్నారు పోలీసులు. అంతే అడిగి వస్తానని చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి మళ్లీ రాలేదు ఇది అయిదవ అనుమానం. సోదరి.. బావ మృతి చెందడం తమ కుటుంబానికి తీరని లోటన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. గత నెలలో వారంతా బయటకు వెళ్ళారని.. తన బావ వ్యాపారం చేసుకుంటాడనీ.. చెల్లెలు టీచర్ అని చెప్పారు. ఆర్థికంగా వారికి ఎలాంటి సమస్యా లేదని అసలు ఎలా జరిగిందో తెలియదని ఎమ్మెల్యే తెలిపారు.

పేదల ఇళ్ల స్థలాల కోసం అమరావతి భూములు.. రైతులకి మరింత కష్టం!!

ఉగాది పండుగ నాటికి ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ రెవిన్యూశాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాల కోసం సుమారు 14,000 ఎకరాలు సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రమంతా భూసేకరణ చేయడం ఒక ఎత్తయితే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చేయటం మరొక ఎత్తు. ఇక్కడ భూసమీకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. విజయవాడ, గుంటూరు నగరాలు వాటి చుట్టు పక్కల ఉన్న పేదలకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో భూమి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అమరావతి లోని భూమినే పేదలకు పంపిణీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన కొందరు లబ్ధిదారులకు రాజధాని పరిధిలో అందుబాటులో ఉన్న భూమిలో పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రాలను తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పేదల ఇళ్ల స్థలాల కోసం అమరావతిలోని శాఖమూరు, పెనుమాక, కృష్ణాయపాలెం సమీపంలోని మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ గుర్తించినట్టు తెలుస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియాలోని గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత సమాచారం ప్రకారం అనంతపురం, ఐనవోలు, మందడం, కురగల్లు, నెక్కల్లు, నేలపాడు, నిడమర్రు, నవులూరు, పిచ్చుకలపాలెం వంటి గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పేదల ఇళ్ల పట్టాల కోసం గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే కొండమరాజుపాలెం, లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాల్లో కూడా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది.  రాజధాని ప్రాంత రైతులు అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలంటూ 60 రోజులకు పైగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భారీ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు ఇదే ప్రాంతం లోని భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజధాని రైతులు ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. తాము రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చామని, ఇంటి స్థలాల కోసం కాదని రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశమున్నట్లు సమాచారం అందుతుంది.

ఎన్సీపీ- శివసేన మధ్య చిచ్చు పెడుతోన్న ఎల్గార్ పరిషత్!

మహారాష్ట్రలో బీజేపీతో దశాబ్దాల మైత్రికి స్వస్తి చెప్పి మరీ కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేసింది శివసేన. మంత్రి పదవుల పంపకంలో విభేదాలు తప్పవని అందరూ ఊహించినా.. ఆ విషయంలో మిత్రపక్షాలు ఒక తాటిపైకి రావడంతో సమస్య రాలేదు. కానీ, రీసెంట్ గా ఎల్గార్ పరిషత్ కేసు ఎన్ఐఏకు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం దానికి ఉద్ధవ్ మద్దతు తెలపడంపై ఎన్సీపీ అసంతృప్తిగా ఉంది. అధికారంలోకి రాగానే ఎల్గార్ పరిషత్ కేసులు ఎత్తివేస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. కానీ శివసేన అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి మింగుడు పడలేదు. అదేవిధంగా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎన్సీపీ నిరసన తెలుపుతున్న తరుణంలో మే నుంచి మహారాష్ట్రలో ఎన్పీఆర్ షురూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పవార్ కు ఆగ్రహం తెప్పించింది. సీఏఏ, ఎన్పీఆర్ అమలు చేయకుండా ఉండేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు చూస్తున్నామని ఎన్సీపీ మంత్రి ఒకరు చెప్పినప్పటికీ.. శివసేన మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ప్రభుత్వంలో ఈ మేరకు ప్రిపరేషన్ కూడా జరిగి పోతున్నాయి. మహారాష్ట్ర కేబినెట్ లో ఉన్న 16 మంది ఎన్సిపి మంత్రులతో శరద్ పవార్ సమావేశమయ్యారు. అంతేకాకుండా ఎన్పీఆర్ మీద గంటపాటు చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అటు ఎల్గార్ పరిషత్ విషయంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. మీటింగ్ ముగిసిన కాసేపటికే ఎల్గార్ పరిషత్ కేసును సిట్ తో దర్యాప్తు చేస్తామని ఎన్సీపీ మంత్రి ఆధీనంలో ఉన్న హోంశాఖ ప్రకటించింది. అయితే సిట్ ఎంక్వైరీకి సీఎం పర్మిషన్ ఉందా? ఆయన అనుమతి లేకుండానే విచారణ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

కర్ణాటక కంబల హీరో శ్రీనివాస గౌడకు సీఎం అభినందనలు

కర్ణాటకలోని ఉడిపి మంగళూరులో నిర్వహించిన సాంప్రదాయ క్రీడ కంబళ పోటీలలో బోల్టును మరిపించాడు శ్రీనివాసగౌడ. 28 ఏళ్ల అతనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే SAAI నిర్వహించే ట్రైల్స్ లో ఇప్పుడే పాల్గొన లేనని చెప్పిన శ్రీనివాసగౌడ.. దానికి కొంత సమయం కావాలని కోరాడు. ప్రస్తుతం కర్ణాటకలో కంబళ టోర్నమెంట్ సాగుతోంది. అందులో తను మరిన్నీ ఘనతలు సాధించాలని అనుకుంటున్నట్టు తెలిపారు కంబాళ పోటీదారుడు. అందుకే SAAIని ఒక నెల గడువు కావాలని కోరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు శ్రీనివాస గౌడ.  కంబాళ, అథ్లెట్స్ పాల్గొనే ట్రాక్స్ రెండూ వేరువేరుగా ఉంటాయని ట్రాక్స్ లో వేళ్ల మీద పరిగెత్తితే కంబాలలో మడమల మీద పరిగెత్తుతాము అంటున్నాడు శ్రీనివాసగౌడ. తాను ఇంతగా ప్రఖ్యాతి పొందుతానని ఎప్పుడూ అనుకోలేదు అన్నారు కంబాళ హీరో. ఇటువంటి కీర్తిని సాధించటంలో దున్నపోతులదే కీలక పాత్ర అని వెల్లడించారు. అంతేకాకుండా తనను ఉసేన్ బోల్ట్ తో పోలుస్తున్నారని ఆయన ప్రపంచ చాంపియన్.. తాను కేవలం బురద, వరిపొలాల్లో పరుగెత్తేవాడిని అని వినయంగా వెల్లడించారు.  ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప అభినందించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించి గౌడను శాలువాతో సత్కరించి మూడు లక్షల రూపాయల నగదు బహుమతిని అందించారు. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన న్యూస్ ఛానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు శ్రీనివాసగౌడ. కాగా తన కోసం వచ్చిన న్యూస్ ఛానెల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు శ్రీనివాస గౌడ.

భూసమీకరణపై విశాఖలో అగ్గి రాజుకుంది...

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నాటికి ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు అందజేయాలని వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ విశాఖలో అగ్గి రాజేస్తోంది. భూములను స్వాధీనం చేసుకొనేందుకు వెళుతున్న.. రెవెన్యూ యంత్రాంగంపై ప్రజలు తిరగబడుతున్నారు. తాజాగా పెందుర్తి మండల పరిధిలోని పెనగడపలో భూ సమీకరణకు అధికారులు చేసిన ప్రయత్నం అరెస్టులకు దారి తీసింది.  స్మార్ట్ సిటీ విశాఖ నగరంలో లక్ష అరవై వేల మంది అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులుగా గుర్తించిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నగర పరిసరాల్లోని 10 మండలాల పరిధిలో 55 గ్రామాల్లో 6,116 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. 1.6 లక్షల మందికి 50 గజాల చొప్పున 3,200 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఎకరాకు యాభై గజాల వంతున యాభై ప్లాట్ లు ఇళ్ల స్థలాలు కేటాయించి మిగిలిన భూమిని డెవలప్ చేయాలనేది అధికారుల ఆలోచన. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ నీటి నిబంధనల మేరకు 30 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.  ఇదిలా వుంటే డెవలప్ మెంట్ చేసిన భూమిలో 15 శాతం చొప్పున సుమారు 900 నుంచి వెయ్యి ఎకరాలు వీఎంఆర్డీఏ పరిధిలోకి వెళ్లిపోనుంది. ఇక మిగిలిన భూముల్లో లేఅవుట్ల అభివృద్ధి చేసి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు స్థలాల రూపంలో ఇవ్వనున్నారు. ఇక 10 మండలాల్లో పూలింగ్ ద్వారా సేకరించిన భూములను 59 బ్లాక్ లుగా విభజించనున్నారు. కొన్ని బ్లాకులు పూర్తిగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించి మిగిలిన బ్లాకుల్లో రైతులు, వీఎంఆర్డీఏ కు ఇవ్వనున్నారు. ఇదిలా వుంటే భూసేకరణ కింద గుర్తించిన భూముల్లో ఒక్క సెంటు ప్లాట్ ల కోసం అవసరమైన స్థలాల సమీకరణ ఇప్పటికే పూర్తయ్యింది.

ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ తో వైఎస్ జగన్ ప్లాన్!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టులపై పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకే అప్పుల కోసం నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సాగు నీటి ప్రాజెక్టుల కోసం అదే బాట పడుతోంది. తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే వారి కోసం వేట మొదలు పెట్టింది. దానికి ప్రపంచ బ్యాంకే ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తుంది. సాగు నీటి పథకాలను కొత్తగా చేపట్టేందుకు రుణాలివ్వటానికి ప్రపంచ బ్యాంకు నియమ నిబంధనలు అంగీకరించవు కానీ పూర్తైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు మాత్రం అప్పులు ఇస్తుంది. అయితే రాష్ట్ర అవసరాలను ప్రపంచ బ్యాంక్ కు తెలియచేసి కొత్తగా నిర్మించబోయే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కోసం రుణాలు ఇవ్వాల్సిందిగా ప్రపంచ బ్యాంకును అర్థించాలి అని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. సీమ దుర్భిక్ష నివారణ పథకానికి 33,869 కోట్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 15,488 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా నదులు కాలువల అభివృద్ధికి రుణమివ్వాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా  పై రెండు కొత్త పథకాలకు అప్పులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను కూడా ప్రపంచ బ్యాంకు ప్రతి నిధుల ముందు ఉంచుతారని అంటున్నారు. కానీ తన నియమ నిబంధనలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులకు బ్యాంకు సహకరిస్తుందా? అని ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే పరిమితిని రాష్ట్రం ఎప్పుడో దాటేసింది. దీంతో ప్రపంచ బ్యాంకుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. మరి ప్రపంచ బ్యాంక్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  

నేను కిషన్ రెడ్డికి ఫోన్ చేశా.. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు: తలసాని

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి మణిహారం మెట్రో రైల్. తాజాగా మెట్రో రైల్లో కీలకమైన జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషనరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సరిగ్గా ఇక్కడే వివాదం రాజుకుంది. స్థానిక ఎంపీగా ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఓ వైపు పార్లమెంట్ జరుగుతుంటే ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభోత్సవం అధికార పార్టీ కార్యక్రమాల వలె చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.  అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి తలసాని స్వయంగా కేంద్ర మంత్రికి తానే ఫోన్ చేశానని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను రాలేనని కిషనరెడ్డి చెప్పారని ఇప్పుడు ఇలా విమర్శలు చేయడం సరికాదంటూ తలసాని వెల్లడించారు. అదేవిధంగా ప్రొటోకాల్ విషయంలో కేంద్ర మంత్రికి ఇప్పటి వరకు ఎక్కడా లోటు రానీయలేదని తెలిపారు. ఇలా ఇద్దరు మంత్రుల విమర్శలకు ప్రతి విమర్శ చేసుకోగా అంతా వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు. ఇంతలోనే ప్రొటోకాల్ పై రాష్ట్ర మంత్రి తలసాని మరో వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.  ఈ నెల 18వతేదీన దక్షిణ మధ్య రైల్వేలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోయిగూడ వైపు జరగనుంది. అయితే బోయిగూడ పరిధి తన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే ఉందని తనకెందుకు ఆహ్వానం పంపలేదు అంటూ ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిని తలసాని ప్రశ్నించారు. ఇటీవల మెట్రో రైలు ప్రారంభోత్సవానికి పిలవలేదని కిషనరెడ్డి రాద్దంతం చేశారని తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి కనీసం సమాచారం ఇవ్వలేదని ట్విట్టర్ లో కిషన్ రెడ్డి పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తాము కిషన్ రెడ్డిలా చీప్ పాలిటిక్స్ చేయమని హుందాతనంగా ఉంటామని కిషన్ రెడ్డికి చురకలు అంటించారు. ఇక తనను పిలవక పోవడంపై కిషనరెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి మధ్య నెలకొన్న మెట్రో వివాదం ఎక్కడికి దారి తీస్తోందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది.

ఏపీలో భూముల రీసర్వే నేటి నుంచే.. కృష్ణా జిల్లాలో స్టార్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. నేటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పైలెట్ ప్రాతిపదికన కృష్ణాజిల్లా జగ్గయ్య పేట నుంచి మొదలు పెట్టనున్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా వినియోగించే బేస్ స్టేషన్ ను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన భూముల సర్వే ప్రస్తుతం తప్పుల తడకగా మారడంతో రీసర్వే చేపట్టాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆధునిక సాంకేతికతను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. విదేశాలతో పాటు పరిమితంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల వినియోగిస్తున్న కార్స్ అనే టెక్నాలజీ ద్వారా భూముల రీసర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 65 బేస్ స్టేషన్ లు ఏర్పాటు చేసి రీసర్వే ప్రక్రియను చేపట్టనుంది ప్రభుత్వం. సర్వే అండ్ బౌండరీస్ చట్టం 1923 ప్రకారం చేసిన సర్వే ఆధారంగానే ప్రస్తుతం కార్యాకలాపాలు జరుగుతున్నాయి. జమాబంది పేరుతో 1990 వరకు గ్రామీణ ప్రాంతాల భూముల వివరాలను నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత భూరికార్డులు అన్నీ తప్పుల తడకగా మారడంతో రీసర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పుడు క్రాస్ సాంకేతిక సాయంతో ఉపగ్రహ ఛాయా చిత్రాల జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా సర్వే ప్రక్రియను చేపట్టనున్నారు. రీసర్వే ప్రక్రియ తర్వాత రీసర్వే రిజిస్టర్ ను రూపొందించనుంది ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే రీసర్వే ప్రక్రియ కోసం మొత్తం 2000  కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎప్పటికప్పుడు భూ రికార్డులను సవరించడం ద్వారా వివాదాలు కూడా లేకుండా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. కార్స్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు భూకమతాల వైశాల్యాన్ని నిర్దేశించి నమోదు చేయ వచ్చనేది ప్రభుత్వ ఆలోచన. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2022 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రెవెన్యూ రికార్డుల ద్వారా ఉత్పన్నమయ్యే విధానాలను తగ్గించే ప్రయత్నం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతుంది.

తెలంగాణ సర్కార్ కి హైకోర్టు అక్షింతలు.. ఆ జీవోలు వెబ్ సైట్ లో పెట్టండి!

తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షంతలు వేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గతేడాది సెప్టెంబర్ లోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంత వరకు కౌంటర్ ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో ఫిబ్రవరి 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.  ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లలో పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగటం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి నుండి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం ఒక లక్షా నాలుగు వేల నూట డెబ్బై యొక్క జీవోలు జారీ చేసిందని వివరించారు. 42,462 జీవోలను రహస్యంగా ఉంచిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చాలా జీవోలను వెబ్ సైట్ లో పెట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచిన జీవోలను వెంటనే వెబ్ సైట్ లో పెట్టేలా ఆదేశించాలని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేందుకు ఒక అధికారిని బాధ్యుడిగా నియమించాలని కోరారు.

పోలీసు ఒంటికి యోగా మంచిదేగా.. ఉపాసన యోగా పాఠాలు!

పక్షులు, జంతువుల మీద అత్యంత ప్రేమను కనబరిచే ఉపాసన కొణిదెల దృష్టి మనుషుల వైపు మళ్ళినట్లుంది. మనుషుల్లో ప్రేమ, ఆరోగ్య చైతన్యం కలిగించడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ‘నిన్ను నువ్వు ప్రేమించుకో’మంటూ ఆమె తాజాగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘ముందు నిన్ను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. అప్పుడే ఇతరులు కూడా నిన్ను ప్రేమిస్తారు. మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అంటూ నిన్నగాక మొన్న ట్వీట్‌ చేసిన ఆమె తాజాగా పోలీసులకు యోగా పాఠాలు బోధిస్తూ కనిపించారు.   ఆరోగ్యమే మహాభాగ్యం అందుకు యోగా కావాలంటూ ఆమె యోగా గురువు ఎడ్డీ స్టెర్న్‌తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగాలో ఎడ్డీకి మంచి చరిత్రే ఉంది. ఆయన న్యూయార్క్‌ వాసి. మైసూర్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగాలో అష్టాంగమార్గాన్ని అభ్యసించారు. వేదాలను చక్కగా అధ్యయనం చేశారు.ఆయన ఉపాన్యాసాలు, రాసిన పుస్తకాలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. నిరంతరం విధుల్లో అలుపెరుగకుండా ఉండే పోలీసులకు యోగా అవసరమని భావించిన ఉపాసన అపోలో ఫౌండేషన్‌ తో కలిసి ఈ యోగా సదస్సు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారి అంజని కుమార్‌ ఈ కార్యక్రమానికి తనవంతు సహకారాన్ని అందించారు.

కేజ్రీవాల్ బాటలో కోదండరాం.. అధికారం మాదేనంటున్న ప్రొఫెసర్!!

దేశం మొత్తంలో హాట్ టాపిక్ గా మారుమ్రోగుతున్న పేరు  అరవింద్ కేజ్రివాల్. అందరి నోళ్లలో ఇప్పుడు కేజ్రీవాల్ పేరు నానుతుంది. వరుసగా మూడోసారి ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకున్న ఆప్ పార్టీ దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు రోల్ మోడల్ గా నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో జేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాం ఇప్పుడు కేజ్రీవాల్ తమకు ఆదర్శమంటున్నారు. ఓటములు ఎన్ని వచ్చినా నిరాశ చెందాల్సిన పని లేదని భవిష్యత్తు తమదేనని చెబుతున్నారు.  కేంద్రం చేతుల్లో అనేక అవమానాలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ ప్రజల్లో తన కార్యదక్షతను నిరూపించుకున్నారు. అలాగే.. కేంద్రం తన అధికారంతో పెత్తనం చేసినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఎదురొడ్డి నిలబడ్డారు. అదే తమకు ఆదర్శమని కోదండరాం గారు అంటున్నారు. తెలంగాణలో కూడా మౌలిక అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మ గౌరవం, ఉద్యమ ఆకాంక్షల సాధన కేంద్రంగానే రాజకీయాలుండాలి. కుల, మతపరమైన భావోద్వేగాలు అర్థబలం, అంగబలం విసిరే మాయాజాలానికి తెరపడే రోజులొస్తాయి. అప్పటి వరకూ కాస్త ఓపిక పట్టాలని ప్రొఫెసర్ గారు క్లాసులు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో ఆప్ అధికారం లోకి వచ్చాక చేసిన పని కాదు. అసలు ఆ పార్టీ నిర్మాణానికి ముందు చేసిన కార్యాచరణ గురించి బోధిస్తే బావుంటుందని కోదండరాం గారు పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీని ఎలా నిర్మించాలనే విషయాన్ని పక్కన బెట్టి ఇవన్నీ ఎందుకు అంటున్నారు. పార్టీ స్థాపించే కంటే ముందే కేజ్రీవాల్ తన సన్నిహితులతో కలిసి సిద్ధం చేసుకున్న ప్రణాళికల గురించి కోదండరాం పార్టీ వాళ్లతో చర్చిస్తే బెటర్ అని చెవులు కొరుక్కుంటున్నారు. అంతేగానీ పార్టీ పెట్టగానే రాజ్యాధికారమే లక్ష్యం పవర్ లోకి రావాలంటే ఎలా అని ప్లాన్ వేసుకొని ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్ ఆదర్శమని క్లాసులు చెప్తే వర్కవుట్ అవ్వదని కార్యకర్తలు ఎవరికీ వినిపించకుండా మాట్లాడేసుకుంటున్నారు. ఒక్కసారి అధికారం లోకి వచ్చిన పార్టీలు ఆ తర్వాత ఏం చేసినా ఆదర్శంగానే కనిపిస్తాయిని అక్కడకు వెళ్లాలంటే ముందు పార్టీ నిర్మాణం సరిగా జరగాలనీ చర్చోపచర్చలు సాగుతున్నాయి. అసలు క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పట్టుకొనే నాధుడే లేనపుడు ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదని సెటైర్ లు వేస్తున్నారు. మరి ఇవన్నీ కోదండం గారికి ఎవరు చెప్తారో చూడాలి.

చంద్రబాబుని లైట్ తీసుకున్న తిరుపతి తమ్ముళ్లు.. ఇక కష్టమేనా!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. సిట్టింగ్ స్థానంగా ఉన్న తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. రెండవసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగిన సుగుణమ్మకు ఈ దఫా పరాజయం తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ అకాల మరణంతో జరిగిన తిరుపతి ఉప పోరులో ఆయన సతీమణి సుగుణమ్మ అనూహ్య విజయం సాధించారు. లక్ష ఓట్లకు పైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. నాటి పోటీకి వైసీపీ దూరంగా ఉండటంతో సుగుణమ్మ ఈ ఘనత సాధించారు. అయితే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పలేదు. సుగుణమ్మపై వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కుప్పం తప్ప మిగిలిన 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 12 చోట్ల వైసిపి అభ్యర్ధులు 25 వేలకు పైగా మెజారిటీ సాధించగా తిరుపతి విషయానికి వస్తే కేవలం 800 ఓట్ల ఆధిక్యంతో భూమన గెలిచారు. భూమనకు సుగుణమ్మ గట్టి పోటీనిచ్చారని వైసిపి గాలిలో ఆమెకు గౌరవప్రదమైన ఓటమి దక్కిందని అంతా అనుకున్నారు. టిడిపి క్యాడర్ అంతా కలిసి సుగుణమ్మ కోసం బలంగా పోరాడారని భావించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా సీన్ మారిపోయింది. తిరుపతి టిడిపిలో గ్రూపుల గోల ముదురుతోంది. ఎవరికి వారు బడా లీడర్ లుగా భావించుకుంటూ ముందుకు వెళ్తూ.. ఉండడంతో సమస్య మొదలైంది. గత ఎన్నికల్లో తిరుపతి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ టిడిపి నేత మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఇప్పుడు మారిపోయారు. ఎన్నికలకు ముందు సుగుణమ్మ విజయం కోసం బాగానే కష్టపడ్డ ఆయన ఇప్పుడు పార్టీకీ అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. సుగుణమ్మ ఆధ్వర్యంలో  ఈమధ్య జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలకు ఆయన మొక్కు బడిగా వచ్చి వెళ్లారే తప్ప అంతగా ఆసక్తి కనబరచలేదనే టాక్ నడుస్తోంది. చాలా మంది స్థానిక టిడిపి నాయకులది ఇదే పరిస్థితి. సుగుణమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలకు నిరసనలకు స్థానిక క్యాడర్ అంతంత మాత్రంగానే సహకరిస్తోంది. మొత్తం బాధ్యతంతా సుగుణమ్మపైనే పడుతోందని ఆమె అనుచరులు అంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్య తిరుపతి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నగర వీధుల్లో అమరావతి కోసం భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇక్కడే తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న వ్యవహారం మరింత బట్టబయలైందని చెప్తున్నారు. స్వయంగా అధినేత తిరుపతికి వస్తున్నా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఎవ్వరు అంత సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. జన సమీకరణపై ఎవ్వరూ దృష్టి సారించకపోవడంతో చంద్రబాబు భిక్షాటన కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగిందని అంటున్నారు. వాహనాల హడావుడి తప్ప ఈ ర్యాలీలో పెద్దగా జనాలు కనిపించలేదు. పోలీసులు ఆంక్షలు కూడా ఈ పరిస్థితికి కారణం. అయినప్పటికీ.. తెలుగు తమ్ముళ్లు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం వల్లే మొక్కుబడిగా ఈ వ్యవహారం ముగిసింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు పర్యటన ముగిసిన రెండు రోజులకే వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా నగర వీధుల గుండా భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొని సూపర్ సక్సెస్ చేశారు. చూశావా చంద్రబాబు ఇది నా సత్తా అంటూ ఇదే ర్యాలీ నుంచి బాబుపై విరుచుకుపడ్డారు భూమన. ఈ మొత్తం వ్యవహారం టిడిపి అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనకు పార్టీ క్యాడర్ పూర్తిస్థాయిలో పనిచెయ్యలేదని అధిష్ఠానం భావిస్తోందని చెబుతున్నారు. స్థానిక నేతల మధ్య గ్రూపుల గొడవే ఇందుకు కారణంగా అధిష్ఠానం భావిస్తోంది.

మునిసిపాలిటీల్లో గజ్వేల్ తరహా ప్లాన్.. నెలకు 70 కోట్లు!!

తెలంగాణలో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పట్టణాలు, నగరాల డెవలప్ మెంట్ కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 24 న మొదలయ్యే ఈ కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచి ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినా ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల పూర్తి అయ్యాయి. కొత్త పాలక మండళ్లు కొలువుదీరడంతో ఇక పట్టణాల్లో అభివృద్ధిని ప్రణాళికా బద్ధంగా చేపట్టేందుకు రెడీ అయ్యింది. కొత్త మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అధికారులు ప్రజాప్రతినిధులు పట్టణాల్లో తమ బాధ్యతలు నిర్వహించాల్సి వుంటుంది. అదేవిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమం విధి విధానాల రూపకల్పన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈరోజు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. పట్టణ ప్రగతి ఉద్దేశాన్ని నేరుగా కొత్త నేతలకు సీఎం వివరించనున్నారు. కార్యక్రమం అమలుపై దిశా నిర్దేశం చేయనున్నారు. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కించేలా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయనుంది. వార్డు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వామ్యం చేయనుంది. మున్సిపాలిటీల అభివృద్ధికి నెలకు 70 కోట్ల రూపాయలను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశానంతరం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. గజ్వేల్ లో చేపట్టిన అభివృద్ధి పనులను మోడల్ గా చూపించనున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో గజ్వేల్ తరహా ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అప్పుడు టికెట్ కోసం పోటీపడ్డారు.. ఇప్పుడు పట్టించుకోరు.. ఇదీ టీడీపీ నేతల తీరు!

రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం అని అందరికీ తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో టిడిపికి మంచి పట్టుంది. అధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలు ఆది నుంచి టిడిపికి మద్దతుగా వుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమితో నాయకులు ఢీలా పడ్డారు. దీంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడమే.. ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణమని కార్యకర్తలు భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు టిడిపిలో నాయకత్వం కోసం నాయకులు తీవ్రంగా పోటీ పడ్డారు. మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ వైకుంఠ శ్రీరాములు కుటుంబానికి అక్కడ మంచి పట్టుంది. శ్రీరాములు మరణం తర్వాత ఆయన తనయుడు మల్లికార్జునకు నియోజక వర్గం టిడిపి బాధ్యతలు అప్పజెప్పారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున వీరభద్రగౌడ్ బరిలో దిగి ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన వీరభద్రగౌడ్ నియోజక వర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కోసం వైకుంఠం మల్లికార్జున, వీరభద్రగౌడ్ పోటిపడ్డారు. అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరి మధ్యా ఐదేళ్లుగా పోటీ సాగింది. ఇంతలో మూడో నాయకత్వం తెరమీదకు రావడంతో ఇద్దరి ఆశలు అడియాసలయ్యాయి. ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని వీరభద్రగౌడ్ ఆశపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో కోట్ల కుటుంబం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వీరభద్రగౌడ్ కు నిరాశ ఎదురైంది. ఇక్కడే ఉంది ట్విస్ట్. కోట్ల సుజాతమ్మను పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ బరిలోకి దించడంతో వీరభద్రగౌడ్ పార్టీ గెలుపు కోసం పని చేయాల్సి వచ్చింది. పార్టీ ఇన్ చార్జిగా అయిదేళ్లు కష్టపడినప్పటికీ.. హైకమాండ్ గుర్తించలేదని కన్నీటి పర్యంతమైన వీరభద్రగౌడ్ నిరుత్సాహంగానే పార్టీలో కొనసాగుతున్నారు. ఆలూరుకు అనుకోని అతిథిగా వచ్చిన కోట్ల సుజాతమ్మ ఎన్నికల సమయంలో పార్టీ క్యాడర్ కు ఎంతో భరోసా నిచ్చారు. వారానికి నాలుగు రోజులు ఆలూరులోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం సుజాతమ్మ అస్సలు నియోజక వర్గం వైపు తొంగి చూడడం లేదని టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఆలూరుకు దూరంగా వుండటమే చర్చనీయాంశమైంది. అయిదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను కాబట్టి టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ వీరభద్రగౌడ్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న తమ కుటుంబానికి న్యాయం చేస్తారని భావించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో పక్క కోట్ల సుజాతమ్మ కూడా ఆలూరుకు రాకుండా పోవడంతో పార్టీ కార్యకర్తలు నిరాశగా ఉన్నారు. తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తుండటం అసలైన ట్విస్ట్.

మార్చి 6నుంచి తెలంగాణ అసెంబ్లీ.. 8న బడ్జెట్...

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 8వతేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే రెండు రోజుల ముందు అంటే 6వ తేదీ నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి గవర్నర్ కార్యాలయానికి కూడా సమాచారం అందించారని తెలిసింది.  బడ్జెట్ సమావేశాలు కావటంతో తొలి రోజు 6 న శాసన సభ, శాసన మండలి, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. 6 న ఆమె ప్రసంగం మినహా సభ కార్యక్రమాలు ఏమీ ఉండవు. మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. 7 న తిరిగి ఇటు అసెంబ్లీ అటు శాసన మండలి సమావేశాలు విడివిడిగా జరగనున్నాయి. 8 న తొలుత శాసన సభలో తర్వాత మండలిలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతోంది. 6 న సభ వాయిదా పడ్డాక అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశాలు వేరు వేరుగా జరగనున్నాయి.