ఈ కార్యదర్శి మాకొద్దు.. గవర్నర్ కోర్టుకు మండలి పంచాయతీ...

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి వ్యవహారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెంతకు చేరింది. తన రాజ్యాంగ అధికారాలను కార్యదర్శి ప్రశ్నిస్తున్నారని, కార్యదర్శిని  తప్పించాలని, కొత్త కార్యదర్శిని నియమించాలని మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ కు వినతిపత్రం అందించారు.  అసెంబ్లీ కార్యదర్శి తన ఆదేశాలను ధిక్కరించడంపై  శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఆగ్రహంతో వున్న సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొంది.  రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను కార్యదర్శి పాటించడం లేదన్నారు.  మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని.. తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి... మండలికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో అసెంబ్లీ కార్యదర్శి తీరుని గవర్నర్ కు వివరించారు. రాష్ట్రచరిత్రలో మండలి కార్యదర్శిపై మండలి ఛైర్మన్ ఫిర్యాదుచేయడం ఇదే తొలిసారి అంటున్నారు. తన ఆదేశాలను పాటించడానికి రెండుసార్లు మండలి కార్యదర్శి నిరాకరించడంపై గవర్నర్ జోక్యం కోరారు. అసెంబ్లీ కార్యదర్శి నియామకంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉండడంతో షరీఫ్‌ నేరుగా ఆయన్నే కలిసి పరిస్థితిని నివేదించారు. అసెంబ్లీకి ప్రస్తుతం ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులు శాసనమండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సభలకు వేర్వేరుగా కార్యదర్శులు ఉండేవారు. మండలి కార్యదర్శి రిటైరైన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికే ఆ విధులు కూడా అప్పగించారు. విజయరాజు గతంలో టీడీపీ హయాంలో అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేశారు. వైసీపీ ప్రభు త్వం వచ్చాక ఆయన్ను మార్చి బాలకృష్ణమాచార్యులను నియమించారు. మండలి సమావేశాల్లో రాజధాని బిల్లులు చర్చకు వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఛైర్మన్‌ నాలుగు పేజీల వినతిపత్రం గవర్నర్‌కు అందజేశారు. తాను కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రతులు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నోట్‌ ఫైల్‌ను కూడా ఇచ్చారు.  చట్టసభల నిర్వహణలో రాజ్యాంగ సంప్రదాయాలకు సంబంధించి ప్రమాణంగా పాటించే కౌల్‌ అండ్‌ షక్దర్‌ పుస్తకంలో తన అధికారాల గురించి ఇచ్చిన వివరణను కూడా చైర్మన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ తానిచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ మండలిలో సభా నాయకుడిగా ఉన్న రెవెన్యూ మంత్రి పంపిన లేఖ.. చైర్మన్‌ అధికారాలను ధిక్కరించడమేనన్నారు.  శాసనమండలిలో జరిగిన పరిణామాలను షరీఫ్ గవర్నర్ కు వివరించారు. సభకు వచ్చిన రాజధాని బిల్లులు సభామోదం పొందలేదని, సభలో ఏకాభిప్రాయం సాధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తనకు సంక్రమించిన అధికారాల కింద ఆ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించానని చైర్మన్‌ పేర్కొన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో కార్యదర్శి తీరును గవర్నర్‌కు వివరించానన్నారు. చైర్మన్‌ ఆదేశాలను కాదన్న సందర్భం గతంలో లేదని, నిబంధనలకనుగుణంగానే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. నా రూలింగ్‌ను కార్యదర్శి అమలు చేయడం లేదన్న విషయం ఆయనకు చెప్పి తగు చర్యలు తీసుకోవాలని కోరానన్నారు.  ఈ వ్యవహారంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు శాసన మండలిలో అనూహ్యంగా వీగి పోయాయి. అందుకు మండలిలో తెలుగుదేశం తెరపైకి తెచ్చిన రూల్స్ అధికారపక్షం ఊహించను కూడా లేదు. సభా వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు వంటి వ్యక్తుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో, ఏంజరగబోతోందో ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ప్రాణాలు కోల్పోతున్న యువత... మిడ్-నైట్ ఎంజాయ్ మెంట్ తో పెడద్రోవ...

తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం... విచ్చలవిడితనం... క్రమశిక్షణ కరువవడంతో... యువత పెడద్రోవ పడుతోంది. విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. స్పీడ్‌ థ్రిల్స్‌... బట్ కిల్స్‌... అంటూ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... యువత మాత్రం... ప్రాణం కన్నా... వేగమే ముఖ్యమంటూ గాల్లో కలిసిపోతున్నారు. అర్ధరాత్రి ఎంజాయ్‌మెంట్‌ పేరుతో మితిమీరిన వేగంతో కార్లను నడుపుతూ గాల్లో కలిసిపోతున్నారు. ఎన్నో ప్రమాదాలు గుణపాఠాలుగా ముందు కనిపిస్తున్నా... మితిమీరిన వేగం... విచ్చలవిడి ప్రవర్తనతో ప్రాణాలు కోల్పోతున్నారు. సేమ్ టు సేమ్‌.... గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ యాక్సిడెంట్‌ స్టైల్లో... జరిగిన మరో ప్రమాదం హైదరాబాద్‌లో కలకలం రేపింది. అతివేగం కారణంగా భరత్‌నగర్‌ బ్రిడ్జిపై కారు గాల్లోకి ఎగిరిపడగా.... ఒకరి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. హైదరాబాద్‌ భరత్‌నగర్‌ బ్రిడ్జిపై జరిగిన కారు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కు చెందిన ఐదుగురు యువకులు అర్ధరాత్రి కారులో షికారు చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. బాలానగర్‌ నుంచి ఎర్రగడ్డకు వస్తుండగా భరత్‌నగర్ బ్రిడ్జి పైనుంచి కారు కిందపడిపోయింది. అయితే, మితిమీరిన వేగం కారణంగా కారు గాల్లో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సోహైల్ అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ కింద ...రోడ్డుపై ఉన్నవాళ్లు తృటిలో తప్పించుకున్నారు. కూరగాయల మార్కెట్లో లోడింగ్ జరుగుతుండగా, భారీ శబ్ధంతో కారు కిందకి వస్తుండటాన్ని గమనించినవాళ్లు పక్కకు తప్పుకున్నారు. దాంతో, భారీ ప్రాణనష్టం తప్పింది.  భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదానికి అతివేగమే కారణమని తేలింది. అయితే, ఈవిధంగా కార్లను నడిపేవాళ్ల కారణంగా, వాళ్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఎలాంటి సంబంధం లేదని అమాయకులు కూడా మరణిస్తున్నారని, గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్ యాక్సిడెంట్‌లో అదే జరిగిందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. అయితే, గంటకు 40 కిలోమీటర్ల వేగం మించకుండా కార్లలో నియంత్రణ చేపడితేనే ప్రమాదాలకు అడ్డుకట్టవేయగలమని అంటున్నారు. మరి, ఇది సాధ్యమేనా? అనేది ప్రశ్నార్ధకమే?

ఏపీలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. జగన్ ఉద్దేశం అదేనా?

ఏపీ పోలీసు శాఖలో చేపడుతున్న సంస్కరణలకు కొత్త ఊపు తెచ్చే క్రమంలో జగన్ సర్కారు మంగళవారం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో కీలక విభాగాల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. తాజా బదిలీల్లో భాగంగా వెయిటింగ్ లో ఉన్న నలుగురు ఐపీఎస్ లకు పోస్టింగ్ దక్కింది. దిశ చట్టం అమలుతో పాటు అవినీతి నిర్మూలన, ఎక్సైజ్, పాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వం గతేడాది నవంబర్ లో పలువురు కీలక ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆ తర్వాత మంగళవారం మరోసారి 8 మంది ఐపీఎస్ అధికారులకు స్ధానభ్రంశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి కిశోర్ కుమార్ తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ లు ఉన్నారు. కిశోర్ కుమార్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వం ఆయన్ను ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ గా బదిలీ చేసింది. ఆయన స్ధానంలో పోస్టింగ్ కోసం ఎధురుచూస్తున్న మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ కుమార్ విశ్వజిత్ కు హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా అవకాశం కల్పించింది. వెయిటింగ్ లో ఉన్న మరో సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యాన్ని రైల్వే అదనపు డీజీగా నియమించింది. వీరిద్దరితో పాటు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కుమార్ నాయక్ కు సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. వెయిటింగ్ లో ఉన్న మరో ఐపీఎస్ అభిషేక్ మహంతిని గ్రేహౌండ్స్ అడ్మిన్ విభాగంలో గ్రూప్ కమాండర్ గా నియమించింది. అమరావతి భూముల వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగాన్ని బలోపేతం చేసే క్రమంలో సునీల్ కుమార్ నాయక్ కు డీఐజీగా బాధ్యతలు అప్పగించింది. గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా ఉన్న కృపానంద్ త్రిపాఠీ ఉజేలాతో పాటు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికుమార్ కు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజాగా చోటు వెలుగుచూస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడంలో చురుగ్గా వ్యవహరించలేదనే కారణంతో త్రిపాఠిని డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలే హరికుమార్ బదిలీకి కారణమైనట్లు సమాచారం. గతేడాది ఏపీలో వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక పలుమార్లు ఆలిండియా సర్వీసు అధికారుల బదిలీలను చేపట్టింది. తొలిసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ పాలనపై పట్టు పెంచుకునే క్రమంలో తరచూ బదిలీలు చేపడుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను క్షేత్రస్ధాయికి తీసుకెళ్ళడంలో చురుగ్గా వ్యవహరించకపోవడం, పలు ఆరోపణలతో కొందరు అధికారులను తరచూ బదిలీలు చేస్తున్నారు. అవినీతి నిర్మూలనపై పట్టుదలగా ఉన్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇందులో ఎంతటి స్ధాయి అధికారులైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలు ఇవ్వడం తాజా బదిలీల వెనుక మరో ఉద్దేశంగా కనిపిస్తోంది.

రాజ్ భవన్‌కు చేరిన ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీల వివాదం

  ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీ పంచాయితీ రాజ్ భవన్ కు చేరింది. కమిటీల ఏర్పాటులో అసెంబ్లీ సెక్రెటరీ తీరుపై గవర్నర్ కు  మండలి ఛైర్మన్ షరీఫ్ ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆరంభం నుంచి వివాదాలతో కొనసాగుతున్న సెలెక్ట్ కమిటీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ అంశం గవర్నర్ వరకు చేరింది. తన ఆదేశాలను అసెంబ్లీ సెక్రటరీ అమలు చేయడం లేదంటూ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు మండలి చైర్మన్. గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ ను కలిసిన మండలి చైర్మన్ షరీఫ్ మండలిలో జరిగిన పరిణామాల్ని వివరించారు. నాలుగు పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. నిబంధనల ప్రకారమే సెలక్ట్ కమిటీ ఏర్పాటైందని, సెక్రెటరీ రెండుసార్లు ఫైల్ తిప్పి పంపారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. గతంలో ఛైర్మన్ ఆదేశాల్ని కాదన్న సందర్భం ఒక్కటి కూడా లేదని గవర్నర్ కు గుర్తు చేశారు మండలి చైర్మన్ షరీఫ్. చైర్మన్ గా తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేశానని నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న వాదనలో నిజం లేదని చైర్మన్ గవర్నర్ కు వివరించారు. మండలి రద్దు తీర్మానానికి దారి తీసిన పరిణామాలతో పాటు మండలిలో అధికార పక్షం వైఖరి గురించి కూడా చైర్మన్ గవర్నర్ కు వివరించారని సమాచారం. రాజధాని వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ బిల్లు రద్దు అంశాలపై సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ జనవరి ఇరవై రెండవ (జనవరి 22) తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఆ తరవాత సెలక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలంటూ పార్టీలను ఆదేశించారు. వైసిపి మినహా మిగిలిన పార్టీలన్నీ కమిటీలకు తమ పేర్లను అందజేశాయి. దీంతో ఆ పేర్లతోనే సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటెన్ జారీ చెయ్యాలని కార్యదర్శిని మండలి చైర్మన్ ఆదేశించారు. అయితే సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అధికారం తనకు లేదన్నారు అసెంబ్లీ సెక్రెటరీ. ఇందుకు సెక్షన్ 154 ను తెరపైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కార్యదర్శి ఆ ఫైల్ ను మండలి చైర్మన్ కు తిప్పి పంపారు. దీనిపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం, అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై బులిటెన్ జారీ చేయాలంటూ రెండవసారి సెక్రటరీని ఆదేశించారు. దీన్ని కూడా అసెంబ్లీ కార్యదర్శి తిప్పి పంపారు, దీంతో సెక్రెటరీ తీరును గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. తన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ గవర్నర్ కు వివరించారు. మరోవైపు కార్యదర్శి తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ సెక్రెటరీ సభా హక్కుల ఉల్లంఘనపై న్యాయపరమైన పోరాటం చెయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ అంశంపై వైసీపీ మరో వాదన తెరపైకి తీసుకొచ్చింది, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి పద్నాలుగు రోజులు దాటడంతో ఇక సెలక్ట్ కమిటీ ప్రస్తావనే ఉండదని చెబుతోంది. బిల్లులు కూడా ఆమోదం పొందినట్టేనని అంటోంది, మరిప్పుడు ఈ వివాదం కాస్త గవర్నర్ దగ్గరికి వెళ్లడంతో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

చంద్రబాబు భద్రతపై టీడీపీ ఆందోళన.. అలాంటిదేమీ లేదన్న ఏపీ సర్కార్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రత తగ్గింపు వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2019లో అధికారం కోల్పోయిన నాటి నుంచి చంద్రబాబు భద్రతపై పదేపదే జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు మరోసారి ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. తమ నేతకు గతంలో ఉన్న 147 మందితో కల్పిస్తున్న భద్రతను తాజాగా 67కు తగ్గించారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తన తాజా ప్రెస్ నోట్ లో ఆరోపించారు. దీన్ని డీజీపీ కార్యాలయం ఖండించింది. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. 2003లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడి కాన్వాయ్ లక్ష్యంగా తిరుపతి అలిపిరి గేటు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఇందులో బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన సెక్యూరిటీని భారీగా పెంచింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడంతో పాటు ఎన్.ఎస్.జి కమాండోలతో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అదికారం కోల్పోయినా ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం దాన్ని యథాతథంగా కొనసాగించాయి. అప్పట్లో చంద్రబాబు కానీ ఆయన పార్టీ నేతలు కానీ వైఎస్ ప్రభుత్వాన్ని మిగతా విషయాల్లో ఇరుకునపెట్టినా భద్రత విషయంలో మాత్రం ఏనాడూ విమర్శలకు దిగలేదు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అధికారం చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో ఆయన కుమారుడు జగన్ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. అక్రమాస్తుల కేసులో జగన్ ను కోర్టుకు తరలించే వాహనాన్ని సైతం సాధారణ ఖైధీలను తరలించే వాహనాన్ని కేటాయించారు. దీనిపై వైసీపీ కోర్టు దృష్టికి తీసుకురావడంతో అప్పటి కిరణ్ సర్కారు ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అప్పట్లో ప్రతిపక్షంలో చంద్రబాబు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి తన భద్రతను గాలికొదిలేశారని జగన్ విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలిచాక కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2019లో వైసీపీ అదికారంలోకి వచ్చాక చంద్రబాబు విషయంలోనూ అదే తీరుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష నేతగా జగన్ కు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకూ అదే ట్రీట్ మెంట్ తప్పదని మంత్రులు సైతం వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఆందోళనలో పడిన టీడీపీ.. చంద్రబాబు భద్రతపై హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ప్రభుత్వ వాదనను హైకోర్టు పూర్తిగా అంగీకరించలేదు. దీంతో చంద్రబాబుకు 97 మందితో భద్రత కల్పించాలని హైకోర్టు గతేడాది ఆదేశాలు ఇచ్చింది. ఇందులో జడ్ ప్లస్ కేటగిరీతో పాటు ఎన్ఎస్జీ కమెండోలు కూడా ఉంటారు. హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం చంద్రబాబు భద్రతను కొనసాగించడంతో టీడీపీ కూడా ఆ విషయాన్ని వదిలేసింది. తాజాగా నిన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చంద్రబాబు భద్రతను 67కు తగ్గించారని ఆరోపిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం టీడీపీ ఆరోపణలను కొట్టి పారేస్తోంది. చంద్రబాబు భద్రతలో తామెలాంటి మార్పులు చేయలేదని డీజీపీ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామని, ప్రస్తుతం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతోనే ఉన్నారని తెలిపింది. సెక్యూరిటీ కమిటీ సమీక్ష మేరకే నిర్ణయాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. అంతటితో ఆగకుండా ప్రస్తుతం చంద్రబాబుకు 183 మందితో భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. ఇందులో విజయవాడ నివాసం వద్దనున్న 135 మందితో పాటు హైదరాబాద్ లోని 48 మంది కూడా ఉన్నారని వెల్లడించింది.

ఏపీలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న వైసీపి ప్రభుత్వం...

ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏసీబీ దాడులతో ఉలిక్కిపడ్డాయి. మొత్తం పదమూడు జిల్లాల్లో ఉన్న పద్నాలుగు కార్యాలయాల్లో ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇవి కొనసాగాయి, 100 మంది అధికారులు 14 బృందాలుగా మెరుపు దాడులు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న రకరకాల అక్రమాలు ఈ దాడుల్లో వెలుగు చూశాయి, ఈరోజు కూడా దాడులు కొనసాగే అవకాశం ఉంది. అవినీతిపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది, వరుస తనిఖీలు, సోదాలతో ఏసీబీ అవినీతిపై యుద్ధం ప్రకటించింది. తాజా మునిసిపల్ కార్యాలయాలను అవినీతి నిరోధక శాఖ టార్గెట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. పదమూడు జిల్లాల్లో ఉన్న పద్నాలుగు కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు 2,87,000 నగదును పట్టుకున్నారు. గుంటూరులో అత్యధికంగా లక్ష రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఏదో ఒక కార్యాలయంలో దాడులు చేయగా విశాఖలో మాత్రం గాజువాక, మధురవాడ రెండు కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీల్లో లక్ష నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నారని గుర్తించారు. ఆఫీసులో పలు అక్రమాలు ఏసిబి అధికారుల దృష్టికి వచ్చింది, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీల్లో 8940 రూపాయల నగదు గుర్తించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పదిహేను వేలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తిని గుర్తించారు. పదమూడు లక్షల రూపాయల అడ్వటైజింగ్ ట్యాక్స్ వసూల్లో ఏడాదిగా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేల్చారు. అనధికార కట్టడాల పట్ల చర్యలు తీసుకోకపోవటం సిటిజన్ చార్ట్ ను పాటించకపోవడాన్ని ఏసిబి అధికారులు గుర్తించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీల్లో ఇరవై నాలుగు బిల్డింగ్స్ కు బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ లోనే ఉంచినట్లు గుర్తించారు. తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ, మధురవాడ, గాజువాక లోనూ లెక్కల్లో చూపని నగదును అధికారులు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులు పని చేస్తున్నట్లు గుర్తించారు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,87,263 రూపాయల నగదును ఏసిబి అధికారులు సీజ్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు కావాలనే అనుమతులను పెండింగ్ లో ఉంచటం నిర్ణీత సమయం ముగిసినా అనుమతులు మంజూరు చేయటం వంటి అక్రమాలు గుర్తించామని అధికారులు తెలిపారు.

ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు..కారణం అదేనా...

  టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటనకు ముహూర్తం కుదరడం లేదు. మండలి రద్దుపై కౌంటర్ యాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రపతి మొదలుకుని కేంద్ర మంత్రులను కలవాలనుకున్న ఎమ్మెల్సీలకు అపాయింట్ మెంట్ లు దొరకటం లేదు. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి శాసన మండలి రద్దుపైన చర్చించారు. రాజకీయ కారణాలతో మండలిని సీఎం జగన్ రద్దు చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రం పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాలని టిడిపి ఎమ్మెల్సీలు నిర్ణయించారు. ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులను వివరించాలని నిర్ణయించారు. టిడిపి నేతలు ఢిల్లీ వెళ్లాలనుకుని వారం గడుస్తున్నా ఇప్పటికీ టూర్ మాత్రం షెడ్యూల్ కాలేదు. ఢిల్లీ పెద్దలను కలవాలని పెద్ద లిస్టునే టిడిపి ఎమ్మెల్సీలు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు అపాయింట్ మెంట్ లు ఖరారు కాలేదు. ఉప రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు అయినప్పటికీ ఇతర నేతల టైమ్ దొరకలేదు. దీనికోసం ఢిల్లీలో ఎంపీలు ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికీ ముఖ్య నేతల అప్పాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో కేవలం ఉపరాష్ట్రపతిని కలిసి వస్తే సమంజసం కాదని భావిస్తున్న టిడిపి ఎమ్మెల్సీలు ఇతర నేతల టైమ్ కూడా దొరికిన తరువాతే హస్తిన బాట పట్టాలని చూస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టూర్ దెబ్బకు కూడా ఎమ్మెల్సీలకు మంత్రుల అపాయింట్ మెంట్ లు దొరకటం లేదని తెలుస్తోంది. కేంద్రం పెద్దలు అంతా ఇప్పుడు ట్రంప్ టూర్ హడావుడిలో ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో ట్రంప్ టూర్ ఉంది కాబట్టి అది పూర్తయిన తర్వాతే ఢిల్లీ వెళితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. కేంద్ర మంత్రులను రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రతినిధులను కలవడం పెద్ద కష్టం కాదు. ఢిల్లీలోని ఎంపీలు ఆ మేరకు వారి టైమ్ తీసుకోవచ్చు, అయితే ప్రధాని టైమ్ దొరకడం మాత్రం అంత సులభం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ప్రధాని టైమ్ కాదు గదా కేంద్ర మంత్రులను కలవడం కూడా కుదరదని టిడిపి నేతలే చెబుతున్నారు. హడావుడిగా టూరు ముగించుకు వచ్చినట్లుగా కాకుండా అందరినీ కలిసి తమ వాణిని గట్టిగా వినిపించాలని అనుకుంటున్నారు నేతలు. అందుకే కొంత ఆలస్యమైనా పర్లేదని ఢిల్లీ ప్రయాణాన్ని ఎమ్మెల్సీలు వాయిదా వేసుకున్నారని సమాచారం.

ప్రకాశం జిల్లాలో క్వారీలు ఉన్న టీడీపీ లీడర్స్ కు వైసిపి ప్రభుత్వం షాక్...

  ప్రకాశం జిల్లాలో టీడీపీ లీడర్స్ కు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దేశం నేతలకు చెందిన గ్రానైట్ క్వారీలకు భారీ జరిమానాలు విధించింది. వీరిలో బిజెపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ మండలాల్లో గ్రానైట్ తవ్వకాలు అధికంగా జరుగుతాయి. పలువురు టిడిపి నేతలకు ఇక్కడ క్వారీలున్నాయి, అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అధికారుల దాడులు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండునెలలుపాటు గ్రానైట్ క్వారీల్లో తనిఖీ చేశారు. కడప, అనంతపురం నుంచి ప్రత్యేకంగా సర్వేయర్ లను తీసుకువచ్చి క్వారీలో జరిగిన తవ్వకాలపై కొలతలు వేశారు. పలు అక్రమాలు జరిగినట్లు అధికారుల దాడుల్లో తేలింది. దీంతో వారికి భారీగా జరిమానా విధించారు అధికారులు, బల్లికురవలో బిజెపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు కుటుంబ సభ్యులకు చెందిన గ్రానైట్ క్వారీలో అధికారులు సోదాలు జరిగాయి. క్వారీలో అక్రమాలు జరిగాయంటూ 285 కోట్ల 32 లక్షల రూపాయల భారీ జరిమాన విధించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీలపైన 250 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించారు అధికారులు. మాజీ మంత్రి టీడీపీ నేత శిద్దా రాఘవరావు ఆయన కుటుంబ సభ్యుల గ్రానైట్ క్వారీలపై త్వరలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేందుకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి విడతలో మొత్తం 56 గ్రానైట్ కంపెనీలకు 1914 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ప్రభుత్వం తమను ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేసిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. క్వారీల్లో తవ్వకాల విషయంలో అన్ని నిబంధనలు పాటిస్తున్నప్పటికీ జరిమానాల రూపంలో వేధిస్తున్నారని తప్పుబట్టారు. కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల క్వారీలపైనే భారీ మొత్తంలో జరిమానాలు విధించటంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలయ్యింది. వందల కోట్ల రూపాయల జరిమానాలు విధించటంతో ఆ నేతలు హడలెత్తిపోతున్నారు. మరోవైపు అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ శాఖ కూడా నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో సమాధానం చెప్పాలంటూ వివరణ కోరింది.

ప్రజల ముందుకు జగన్ నిర్వాకం.. జే ట్యాక్స్ తో వైసీపీకి రూ.20 వేల కోట్ల ఆదాయం!

తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రజా చైతన్య యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ప్రకాశం జిల్లాలో ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు జరుగనున్న ఈ  ప్రజా చైతన్య యాత్రకి సంబంధించిన కరపత్రాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ యాత్ర ద్వారా 9 నెలల్లో జగన్ చేసిన నిర్వహకాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. వైసీపీ తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకుని రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కళా వెంకట్రావ్ విమర్శించారు.  ఎన్నికలముందొకటి చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కులాలు, మతాలవారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని, ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచారని, అర్హుల పింఛన్లు తొలగించారని, మరిన్ని పింఛన్లు తొలగించే ప్రయత్నంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.  అధికార పార్టీ నేతలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని ఆరోపించారు. సారా దుకాణాల్లో ఎక్సైజ్ స్టాఫ్‌తో పాటు వైసీపీ కార్యకర్తలను పెట్టారని, పోలీసులను చేతిలో పెట్టుకుని ఎన్నాళ్లు పాలన సాగిస్తారని కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితుల్లో.. ప్రజల ముందుకు వెళ్తున్నామని, ప్రజల తరఫున పోరాటం చేస్తామని కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు.

కంబళ పోటీల్లో మరో ఉసేన్ బోల్ట్‌.. శ్రీనివాస గౌడ రికార్డ్ బ్రేక్

కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తితే దేశం మొత్తం ఆశ్చర్యపడింది. ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల వరల్డ్ రికార్డుతో పోల్చుతూ అతన్ని ఆకాశానికెత్తింది. అయితే, కంబళ వీరుడు శ్రీనివాస గౌడ ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలు కొట్టాడన్న వార్త వెలుగుచూసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే మరో సంచలన రికార్డు నమోదైంది. కంబళ టోర్నీలో భాగంగా తాజాగా జరిగిన పోరులో శ్రీనివాస గౌడ రికార్డు బద్దలైంది. నిశాంత్ శెట్టి అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే అధిగమించి ఔరా అనిపించాడు. నిశాంత్ శెట్టి కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు. ఈ పోటీల్లో నిశాంత్ శెట్టి మొత్తం 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేశాడు.

వైజాగ్ లోని వందల కోట్లు విలువచేసే ఆశ్రమంపై కన్నేసిన నేతలు!!

ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరం వెంకోజీపాలెంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జ్ఞానానంద-రామానంద ఆశ్రమం ఎన్నో ఏళ్లుగా నడుస్తుంది. దీనిపై కొందరు పెద్దల కన్ను పడింది. దీంతో ఈ ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలి అంటూ కొందరు ప్రజా ప్రతినిధులు ఏకంగా దేవాదాయ శాఖకు లేఖలు రాశారు. ఆశ్రమ నిర్వాహకులు స్వామి పూర్ణానంద సరస్వతికి కొందరు ఫోన్ చేసి ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. రిటైర్డ్ పోలీస్ అధికారిని రంగంలోకి దింపి అతనితో బెదిరించారు. ఆశ్రమాన్ని అప్పజెప్పకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. చివరకు రెవిన్యూ అధికారులు కూడా ఆశ్రమానికి వచ్చి స్వామితో రాయబారాలు నడిపారు. దీంతో స్వామి నగరంలో పలువురు ప్రముఖులను కలిసి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నారు. వెంకోజీపాలెంలో జాతీయ రహదారికి అతి సమీపంలో కొండవాలున 1955లో జ్ఞానానంద సరస్వతి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అందులో శివాలయం కూడా నిర్మించారు. శివాలయంలో దూపదీప నైవేద్యానికి స్థానికులు పీలా అప్పారావు, కోడి సన్యాసి ఆరు ఎకరాల భూమిని 1958 జులై 12న దానం చేస్తూ గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. అదే ప్రాంగణంలో పాఠశాల నిర్వహణ కోసం ఆశ్రమానికి ఆనుకొని ఉన్న 3.31 ఎకరాల కొండ పోరంబోకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో గజం రిజిస్ర్టేషన్ విలువ ప్రకారం 50,000 ఉంది. కానీ మార్కెట్ ధర మాత్రం గజం లక్ష వరకు ఉంది. ఆ విధంగా ఆశ్రమ స్థలం విలువ అక్షరాలా 300 కోట్లు. జ్ఞానానంద సరస్వతి కాలం చేసిన తర్వాత ఆయన శిష్యుడు స్వామి పరిపూర్ణానంద సరస్వతి 1980లో ఆశ్రమ బాధ్యతలు స్వీకరించారు. కాగా తానిచ్చిన గిఫ్టు డీడ్ లను రద్దు చేయాలి అంటూ దాత పీల అప్పారావు చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టేయడం విశేషం.

ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లి ఫ్యామిలీ మృతి!

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మిస్టరీ జరిగింది. గత ఆదివారం రాత్రి దంపతుల బైక్ పై వెళ్తున్నారు. సడెన్ గా కళ్ళలో పురుగు పడటంతో దంపతులు బైక్ తో సహా కాకతీయ కాలువలో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని రక్షించటానికి చేసిన ప్రయత్నంలో ఒక్కరినే కాపాడ గలిగారు. ఆ ప్రమాదంలో భార్య చనిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బైక్ కోసం వెతుకుతున్న సమయంలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో స్థానికులు అధికారులకు సమాచారమిచ్చి లోయర్ మానేరు నుంచి నీటి విడుదలను ఆపేశారు. అయితే నీటి మట్టం తగ్గడంతో అనూహ్యంగా కాకతీయ కాలువలో ఓ మునిగి పోయిన కారు బయటపడింది. కారును వెలికితీసిన స్ధానికులు కారు నెంబర్ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లి.. బావ వాళ్ళ కూతురు అని గుర్తించారు. కారులో వెనక సీట్లో సత్యనారాయణరెడ్డి ఆయన భార్య రాధిక కూతురు వినయశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. స్వయాన ఎమ్మెల్యే బంధువులు అవడంతో అంతా ఎలెర్ట్ అయ్యారు.  అసలు విషయంలోకి వెళ్తే.. జనవరి 27 మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మొబైల్ స్విచాఫ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం ఏమైందో ఎక్కడికి వెళ్లిందో? ఆరా తీసిన వారే లేరు. ఇంట్లోంచి బయలుదేరినవాళ్లు గమ్యానికి చేరుకోలేదు. అలాగని ఇంటికి రాలేదు. ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇది ప్రమాదమేనా? ప్రమాదంలా సృష్టిస్తున్నారా? అనే డౌట్స్ పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా ముందు సీట్లో ఎవ్వరూ లేరు అదెలా సాధ్యం? మొదటి అనుమానం. కారు ప్రమాదాన్ని ఎవరూ గుర్తించ లేదా? అన్నది రెండవ అనుమానం. పైగా కుటుంబం లోని ముగ్గురు 20 రోజులుగా కనిపించకుండా పోయినా ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇది మూడో అనుమానం. జనవరి 29వ తేదీన సత్యనారాయణరెడ్డి ఇంటి తాళాలు పగుల గొట్టి వెతికారని చెబుతున్నారు. తాళం పగలగొట్టి దేనికోసం వెతికారు? అన్నది నాలుగవ అనుమానం. వారం క్రితం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణరెడ్డి నంబర్ టవర్ లోకేషన్ తెలుసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులను అడిగాడు. కంప్లైంట్ ఇవ్వండి వెతికిపెడతాం? అన్నారు పోలీసులు. అంతే అడిగి వస్తానని చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి మళ్లీ రాలేదు ఇది అయిదవ అనుమానం. సోదరి.. బావ మృతి చెందడం తమ కుటుంబానికి తీరని లోటన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. గత నెలలో వారంతా బయటకు వెళ్ళారని.. తన బావ వ్యాపారం చేసుకుంటాడనీ.. చెల్లెలు టీచర్ అని చెప్పారు. ఆర్థికంగా వారికి ఎలాంటి సమస్యా లేదని అసలు ఎలా జరిగిందో తెలియదని ఎమ్మెల్యే తెలిపారు.

పేదల ఇళ్ల స్థలాల కోసం అమరావతి భూములు.. రైతులకి మరింత కష్టం!!

ఉగాది పండుగ నాటికి ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ రెవిన్యూశాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాల కోసం సుమారు 14,000 ఎకరాలు సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రమంతా భూసేకరణ చేయడం ఒక ఎత్తయితే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చేయటం మరొక ఎత్తు. ఇక్కడ భూసమీకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. విజయవాడ, గుంటూరు నగరాలు వాటి చుట్టు పక్కల ఉన్న పేదలకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో భూమి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అమరావతి లోని భూమినే పేదలకు పంపిణీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన కొందరు లబ్ధిదారులకు రాజధాని పరిధిలో అందుబాటులో ఉన్న భూమిలో పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రాలను తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పేదల ఇళ్ల స్థలాల కోసం అమరావతిలోని శాఖమూరు, పెనుమాక, కృష్ణాయపాలెం సమీపంలోని మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ గుర్తించినట్టు తెలుస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియాలోని గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత సమాచారం ప్రకారం అనంతపురం, ఐనవోలు, మందడం, కురగల్లు, నెక్కల్లు, నేలపాడు, నిడమర్రు, నవులూరు, పిచ్చుకలపాలెం వంటి గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పేదల ఇళ్ల పట్టాల కోసం గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే కొండమరాజుపాలెం, లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాల్లో కూడా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది.  రాజధాని ప్రాంత రైతులు అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలంటూ 60 రోజులకు పైగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భారీ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు ఇదే ప్రాంతం లోని భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజధాని రైతులు ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. తాము రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చామని, ఇంటి స్థలాల కోసం కాదని రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశమున్నట్లు సమాచారం అందుతుంది.

ఎన్సీపీ- శివసేన మధ్య చిచ్చు పెడుతోన్న ఎల్గార్ పరిషత్!

మహారాష్ట్రలో బీజేపీతో దశాబ్దాల మైత్రికి స్వస్తి చెప్పి మరీ కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేసింది శివసేన. మంత్రి పదవుల పంపకంలో విభేదాలు తప్పవని అందరూ ఊహించినా.. ఆ విషయంలో మిత్రపక్షాలు ఒక తాటిపైకి రావడంతో సమస్య రాలేదు. కానీ, రీసెంట్ గా ఎల్గార్ పరిషత్ కేసు ఎన్ఐఏకు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం దానికి ఉద్ధవ్ మద్దతు తెలపడంపై ఎన్సీపీ అసంతృప్తిగా ఉంది. అధికారంలోకి రాగానే ఎల్గార్ పరిషత్ కేసులు ఎత్తివేస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. కానీ శివసేన అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి మింగుడు పడలేదు. అదేవిధంగా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎన్సీపీ నిరసన తెలుపుతున్న తరుణంలో మే నుంచి మహారాష్ట్రలో ఎన్పీఆర్ షురూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పవార్ కు ఆగ్రహం తెప్పించింది. సీఏఏ, ఎన్పీఆర్ అమలు చేయకుండా ఉండేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు చూస్తున్నామని ఎన్సీపీ మంత్రి ఒకరు చెప్పినప్పటికీ.. శివసేన మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ప్రభుత్వంలో ఈ మేరకు ప్రిపరేషన్ కూడా జరిగి పోతున్నాయి. మహారాష్ట్ర కేబినెట్ లో ఉన్న 16 మంది ఎన్సిపి మంత్రులతో శరద్ పవార్ సమావేశమయ్యారు. అంతేకాకుండా ఎన్పీఆర్ మీద గంటపాటు చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అటు ఎల్గార్ పరిషత్ విషయంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. మీటింగ్ ముగిసిన కాసేపటికే ఎల్గార్ పరిషత్ కేసును సిట్ తో దర్యాప్తు చేస్తామని ఎన్సీపీ మంత్రి ఆధీనంలో ఉన్న హోంశాఖ ప్రకటించింది. అయితే సిట్ ఎంక్వైరీకి సీఎం పర్మిషన్ ఉందా? ఆయన అనుమతి లేకుండానే విచారణ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

కర్ణాటక కంబల హీరో శ్రీనివాస గౌడకు సీఎం అభినందనలు

కర్ణాటకలోని ఉడిపి మంగళూరులో నిర్వహించిన సాంప్రదాయ క్రీడ కంబళ పోటీలలో బోల్టును మరిపించాడు శ్రీనివాసగౌడ. 28 ఏళ్ల అతనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే SAAI నిర్వహించే ట్రైల్స్ లో ఇప్పుడే పాల్గొన లేనని చెప్పిన శ్రీనివాసగౌడ.. దానికి కొంత సమయం కావాలని కోరాడు. ప్రస్తుతం కర్ణాటకలో కంబళ టోర్నమెంట్ సాగుతోంది. అందులో తను మరిన్నీ ఘనతలు సాధించాలని అనుకుంటున్నట్టు తెలిపారు కంబాళ పోటీదారుడు. అందుకే SAAIని ఒక నెల గడువు కావాలని కోరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు శ్రీనివాస గౌడ.  కంబాళ, అథ్లెట్స్ పాల్గొనే ట్రాక్స్ రెండూ వేరువేరుగా ఉంటాయని ట్రాక్స్ లో వేళ్ల మీద పరిగెత్తితే కంబాలలో మడమల మీద పరిగెత్తుతాము అంటున్నాడు శ్రీనివాసగౌడ. తాను ఇంతగా ప్రఖ్యాతి పొందుతానని ఎప్పుడూ అనుకోలేదు అన్నారు కంబాళ హీరో. ఇటువంటి కీర్తిని సాధించటంలో దున్నపోతులదే కీలక పాత్ర అని వెల్లడించారు. అంతేకాకుండా తనను ఉసేన్ బోల్ట్ తో పోలుస్తున్నారని ఆయన ప్రపంచ చాంపియన్.. తాను కేవలం బురద, వరిపొలాల్లో పరుగెత్తేవాడిని అని వినయంగా వెల్లడించారు.  ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప అభినందించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించి గౌడను శాలువాతో సత్కరించి మూడు లక్షల రూపాయల నగదు బహుమతిని అందించారు. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన న్యూస్ ఛానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు శ్రీనివాసగౌడ. కాగా తన కోసం వచ్చిన న్యూస్ ఛానెల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు శ్రీనివాస గౌడ.

భూసమీకరణపై విశాఖలో అగ్గి రాజుకుంది...

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నాటికి ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు అందజేయాలని వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ విశాఖలో అగ్గి రాజేస్తోంది. భూములను స్వాధీనం చేసుకొనేందుకు వెళుతున్న.. రెవెన్యూ యంత్రాంగంపై ప్రజలు తిరగబడుతున్నారు. తాజాగా పెందుర్తి మండల పరిధిలోని పెనగడపలో భూ సమీకరణకు అధికారులు చేసిన ప్రయత్నం అరెస్టులకు దారి తీసింది.  స్మార్ట్ సిటీ విశాఖ నగరంలో లక్ష అరవై వేల మంది అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులుగా గుర్తించిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నగర పరిసరాల్లోని 10 మండలాల పరిధిలో 55 గ్రామాల్లో 6,116 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. 1.6 లక్షల మందికి 50 గజాల చొప్పున 3,200 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఎకరాకు యాభై గజాల వంతున యాభై ప్లాట్ లు ఇళ్ల స్థలాలు కేటాయించి మిగిలిన భూమిని డెవలప్ చేయాలనేది అధికారుల ఆలోచన. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ నీటి నిబంధనల మేరకు 30 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.  ఇదిలా వుంటే డెవలప్ మెంట్ చేసిన భూమిలో 15 శాతం చొప్పున సుమారు 900 నుంచి వెయ్యి ఎకరాలు వీఎంఆర్డీఏ పరిధిలోకి వెళ్లిపోనుంది. ఇక మిగిలిన భూముల్లో లేఅవుట్ల అభివృద్ధి చేసి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు స్థలాల రూపంలో ఇవ్వనున్నారు. ఇక 10 మండలాల్లో పూలింగ్ ద్వారా సేకరించిన భూములను 59 బ్లాక్ లుగా విభజించనున్నారు. కొన్ని బ్లాకులు పూర్తిగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించి మిగిలిన బ్లాకుల్లో రైతులు, వీఎంఆర్డీఏ కు ఇవ్వనున్నారు. ఇదిలా వుంటే భూసేకరణ కింద గుర్తించిన భూముల్లో ఒక్క సెంటు ప్లాట్ ల కోసం అవసరమైన స్థలాల సమీకరణ ఇప్పటికే పూర్తయ్యింది.

ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ తో వైఎస్ జగన్ ప్లాన్!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టులపై పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకే అప్పుల కోసం నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సాగు నీటి ప్రాజెక్టుల కోసం అదే బాట పడుతోంది. తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే వారి కోసం వేట మొదలు పెట్టింది. దానికి ప్రపంచ బ్యాంకే ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తుంది. సాగు నీటి పథకాలను కొత్తగా చేపట్టేందుకు రుణాలివ్వటానికి ప్రపంచ బ్యాంకు నియమ నిబంధనలు అంగీకరించవు కానీ పూర్తైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు మాత్రం అప్పులు ఇస్తుంది. అయితే రాష్ట్ర అవసరాలను ప్రపంచ బ్యాంక్ కు తెలియచేసి కొత్తగా నిర్మించబోయే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కోసం రుణాలు ఇవ్వాల్సిందిగా ప్రపంచ బ్యాంకును అర్థించాలి అని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. సీమ దుర్భిక్ష నివారణ పథకానికి 33,869 కోట్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 15,488 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా నదులు కాలువల అభివృద్ధికి రుణమివ్వాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా  పై రెండు కొత్త పథకాలకు అప్పులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను కూడా ప్రపంచ బ్యాంకు ప్రతి నిధుల ముందు ఉంచుతారని అంటున్నారు. కానీ తన నియమ నిబంధనలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులకు బ్యాంకు సహకరిస్తుందా? అని ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే పరిమితిని రాష్ట్రం ఎప్పుడో దాటేసింది. దీంతో ప్రపంచ బ్యాంకుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. మరి ప్రపంచ బ్యాంక్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  

నేను కిషన్ రెడ్డికి ఫోన్ చేశా.. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు: తలసాని

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి మణిహారం మెట్రో రైల్. తాజాగా మెట్రో రైల్లో కీలకమైన జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషనరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సరిగ్గా ఇక్కడే వివాదం రాజుకుంది. స్థానిక ఎంపీగా ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఓ వైపు పార్లమెంట్ జరుగుతుంటే ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభోత్సవం అధికార పార్టీ కార్యక్రమాల వలె చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.  అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి తలసాని స్వయంగా కేంద్ర మంత్రికి తానే ఫోన్ చేశానని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను రాలేనని కిషనరెడ్డి చెప్పారని ఇప్పుడు ఇలా విమర్శలు చేయడం సరికాదంటూ తలసాని వెల్లడించారు. అదేవిధంగా ప్రొటోకాల్ విషయంలో కేంద్ర మంత్రికి ఇప్పటి వరకు ఎక్కడా లోటు రానీయలేదని తెలిపారు. ఇలా ఇద్దరు మంత్రుల విమర్శలకు ప్రతి విమర్శ చేసుకోగా అంతా వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు. ఇంతలోనే ప్రొటోకాల్ పై రాష్ట్ర మంత్రి తలసాని మరో వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.  ఈ నెల 18వతేదీన దక్షిణ మధ్య రైల్వేలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోయిగూడ వైపు జరగనుంది. అయితే బోయిగూడ పరిధి తన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే ఉందని తనకెందుకు ఆహ్వానం పంపలేదు అంటూ ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిని తలసాని ప్రశ్నించారు. ఇటీవల మెట్రో రైలు ప్రారంభోత్సవానికి పిలవలేదని కిషనరెడ్డి రాద్దంతం చేశారని తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి కనీసం సమాచారం ఇవ్వలేదని ట్విట్టర్ లో కిషన్ రెడ్డి పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తాము కిషన్ రెడ్డిలా చీప్ పాలిటిక్స్ చేయమని హుందాతనంగా ఉంటామని కిషన్ రెడ్డికి చురకలు అంటించారు. ఇక తనను పిలవక పోవడంపై కిషనరెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి మధ్య నెలకొన్న మెట్రో వివాదం ఎక్కడికి దారి తీస్తోందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది.

ఏపీలో భూముల రీసర్వే నేటి నుంచే.. కృష్ణా జిల్లాలో స్టార్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. నేటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పైలెట్ ప్రాతిపదికన కృష్ణాజిల్లా జగ్గయ్య పేట నుంచి మొదలు పెట్టనున్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా వినియోగించే బేస్ స్టేషన్ ను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన భూముల సర్వే ప్రస్తుతం తప్పుల తడకగా మారడంతో రీసర్వే చేపట్టాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆధునిక సాంకేతికతను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. విదేశాలతో పాటు పరిమితంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల వినియోగిస్తున్న కార్స్ అనే టెక్నాలజీ ద్వారా భూముల రీసర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 65 బేస్ స్టేషన్ లు ఏర్పాటు చేసి రీసర్వే ప్రక్రియను చేపట్టనుంది ప్రభుత్వం. సర్వే అండ్ బౌండరీస్ చట్టం 1923 ప్రకారం చేసిన సర్వే ఆధారంగానే ప్రస్తుతం కార్యాకలాపాలు జరుగుతున్నాయి. జమాబంది పేరుతో 1990 వరకు గ్రామీణ ప్రాంతాల భూముల వివరాలను నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత భూరికార్డులు అన్నీ తప్పుల తడకగా మారడంతో రీసర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పుడు క్రాస్ సాంకేతిక సాయంతో ఉపగ్రహ ఛాయా చిత్రాల జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా సర్వే ప్రక్రియను చేపట్టనున్నారు. రీసర్వే ప్రక్రియ తర్వాత రీసర్వే రిజిస్టర్ ను రూపొందించనుంది ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే రీసర్వే ప్రక్రియ కోసం మొత్తం 2000  కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎప్పటికప్పుడు భూ రికార్డులను సవరించడం ద్వారా వివాదాలు కూడా లేకుండా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. కార్స్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు భూకమతాల వైశాల్యాన్ని నిర్దేశించి నమోదు చేయ వచ్చనేది ప్రభుత్వ ఆలోచన. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2022 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రెవెన్యూ రికార్డుల ద్వారా ఉత్పన్నమయ్యే విధానాలను తగ్గించే ప్రయత్నం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతుంది.