తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు? సంజయ్... లేదంటే అర్వింద్..?

తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు ఖాయమంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీకాలం త్వరలో ముగియనుండటంతో... కొత్త అధ్యక్షుడి ఎంపికపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. సీనియర్లంతా లక్ష్మణ్‌ను మరోసారి కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్నా, పార్టీలో రెండు ముఖ్య పదవులు హైదరాబాద్ వారికే కేటాయిస్తే జిల్లాల్లో పార్టీ నష్టపోతుందనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.  హైదరాబాద్ నగరానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా, లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. దాంతో, హైదరాబాదేతర నాయకునికి పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తుందట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడినందున... కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, లేదా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్ల అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలకంటే, ఎంపీలే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటంలో ముందుండటంతో, వారితోనే టీఆర్ఎస్‌ను ఢీకొట్టించడానికి జాతీయ పార్టీ సైతం ఆలోచిస్తోందని అంటున్నారు. భైంసా ఘటనలో బండి సంజయ్, ఇళ్ల కేటాయింపుపై ధర్మపురి అర్వింద్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అంతేకాదు, పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఎదగడానికి అవకాశమున్న తెలంగాణలో, దూకుడుగా ఉండే లీడర్‌కే పగ్గాలు అప్పగిస్తే, క్షేత్రస్థాయిలో, శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని లెక్కలు వేస్తోంది. మరోవైపు కొత్తవారికి, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పగ్గాలు వెళ్లకుండా, సీనియర్లు గట్టిగానే అడ్డుపడుతున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే కొత్త అధ్యక్షుడి ఎంపిక బీజేపీ హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారిందంటున్నారు.

బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ.. కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ నటుడు,  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ అకౌంటెంట్ ఫోర్జరీ చేశారు. బంజారాహిల్స్ లోని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ బ్రాంచ్ లో ఈ పోర్జరీ జరిగింది. అయితే బ్రాంచ్ లో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం వసుంధర సంతకాన్ని అకౌంటెంట్ కొర్రీ శివ ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ బంజారాహిల్స్ బ్రాంచ్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ ఈ నెల13న ఆమె ప్రతినిధి సుబ్బారావుకు ఫోన్ చేసి వసుంధర మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె అకౌంట్ నెంబరు కూడా చెప్పి అకౌంట్ ను యాక్టివేట్ చేయమంటారా? అని ప్రశ్నించారు. తాము మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని.. అసలు దరఖాస్తే చేసుకోలేదని చెబుతూ ఈ విషయాన్ని ఆమె తరఫు వ్యక్తి వసుంధర దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ విషయాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. తాను ఎలాంటి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారులను విచారించగా కొత్తగా వచ్చిన అకౌంటెంట్ కోర్రిశివ ఈ మధ్య వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇచ్చినట్టుగా తేలింది. దీనిపై శివను నిలదీయగా మొబైల్ బ్యాంకింగ్ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తు చేసుకున్నట్లుగా అంగీకరించారు. కాగా కోర్రి శివపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజుగారి మౌనానికి అర్ధమేంటి? ఉంటారా? పార్టీ మారతారా?

సుజయకృష్ట రంగారావు... విజయనగరం జిల్లా బొబ్బిలి రాజవంశీయులు... రాజరికం అంతరించిన తర్వాత కూడా ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ తన నియోజకవర్గపు కోటను పాలించారు. అయితే, ఇప్పుడు, యుద్ధంలో ఓడిన రాజులా డీలాపడిపోయారు. దాంతో, రాజ్యంలో కార్యకర్తలు విలవిల్లాడిపోతున్నారు. రాజుగారి మౌనాన్ని తలచుకుని కుంగిపోతున్నారు. మళ్లీ కత్తి పట్టుకుని రాజ్యాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు. రాజరికపు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన సుజయకృష్ట రంగారావు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందాక, టీడీపీలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. అయితే, మంత్రి అయిన తర్వాత, సుజయకృష్ట రంగారావు నియోజకవర్గ అభివద్దికి పాటుపడలేదని, అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారని అంటారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు సుజయకృష్ట రంగారావు దూరంగా ఉంటున్నారు. అయితే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉండటంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.  కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసి, పార్టీని బలోపేతం చేయాల్సిన రాజుగారు ఇలా, మౌనం దాల్చడమేంటని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. సుజయకృష్ట రంగారావుతోపాటు ఆయన సోదరుడు శ్వేతా చలపతి రంగారావుకు నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. వాళ్లిద్దరూ ప్రజల్లోకి వెళ్తే మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. సుజయకృష్ట రంగారావు సోదరుడు శ్వేతా చలపతి రంగారావు టీడీపీని వీడి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం టీడీపీలో స్తబ్దత నెలకొనడంతో ఇప్పటికే పలువురు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అంటున్నారు.  మొత్తానికి, విజయనగరంలో తెలుగుదేశాన్ని ముందుకు నడిపించే నాయకుడు లేడంటూ కొట్టుమిట్టాడుతున్న టీడీపీ శ్రేణులను, బొబ్బిలి రాజుగారి మౌనం, మరింత కుంగదీసేలా ఉందని అంటున్నారు. మరి, రాజుగారి మనసులో ఏముందో... పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటానికి కారణాలేంటో తెలియాలంటే ఆయన మౌనం వీడాల్సిందే.  

రోజుకో మలుపు తిరుగుతున్న బీజేపీ-వైసీపీ పొత్తు కథ.. పురంధేశ్వరి రియాక్షన్!!

ఏపీలో కొంతకాలంగా హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది 3రాజధానుల అంశం. మూడు రాజధానుల ప్రకటన, దానిపై కమిటీలు, శాసన మండలి రద్దు ఇలా రాజకీయమంతా రాజధాని చుట్టూనే తిరుగుతోంది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు పొత్తుల వైపు టర్న్ అయ్యాయి. సీఎం జగన్ హస్తిన పర్యటనలో కేంద్ర పెద్దలతో భేటీల నేపథ్యంలో ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజెపికి అధికార పార్టీ వైసిపి దగ్గరవుతుందా అన్న వార్తలు ఏపీలో హీట్ పెంచుతున్నాయి.  ఎన్డీయేతో వైసీపీ కలుస్తుందా? బీజేపీతో కలిసి నడుస్తుందా? ఇప్పుడివే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.  ఎన్డీయేలో చేరాలని ప్రతిపాదన వస్తే వైసీపీ పరిశీలిస్తుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అలాగే.. అసలు తాము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బొత్స ఖండించినప్పటికీ.. పొత్తులపై చర్చ మాత్రం ఆగడం లేదు. అయితే దర్యాప్తు సంస్థల్లో ప్రభావితం చేసేందుకు వైసిపి బిజెపికి దగ్గరవుతోందని ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆరోపిస్తోంది. అదేవిధంగా అలాంటి పొత్తు ఏమి ఉండదని జనసేన బల్లగుద్ది చెప్తోంది. ఒకవేళ బీజేపీతో వైసీపీ కలిస్తే తాను కమలానికి దూరమవుతానని ఇప్పటికే జనసేనాని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇటు ప్రతి పక్షాలు ఏం మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతున్నా వైసిపి నేతలు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. తమకు బిజెపితో ఎలాంటి శత్రుత్వం లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. అంతేకాకుండా పార్టీల పొత్తు విషయం, ఎన్డీయే ప్రభుత్వంలో కలిసే విషయాలను సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆయా నేతలు వెల్లడిస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి సఖ్యతతో పనిచేయాల్సిన అవసరముందని అన్నారు అవంతి.  రాష్ట్రంలో అధికార వైసిపితో గానీ ప్రతిపక్షం టిడిపితో గానీ తమకు ఎలాంటి పొత్తులు లేవని బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ దేవదర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేత కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి చెప్పారు. వైసీపీతో పొత్తు ఉండదని జనసేన పార్టీతో కలిసి పని చేస్తామని ఆమె చెప్పారు. రాజధాని మార్పు తొందరపాటు నిర్ణయమని మండిపడ్డారు. ప్రతిపక్షంగా టిడిపి సరైన పాత్ర పోషించడం లేదని విమర్శించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మొత్తానికి సీఎం జగన్ హస్తిన పర్యటనకు వెళ్ళినప్పటి నుంచి వైసిపి త్వరలోనే ఎన్డీయే సర్కారులో చేరుతుందని ప్రచారం మొదలైంది. మరి మున్ముందుకి పొత్తు కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఏపీలో నిధుల కొరత..ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురు చూపులు!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా పాలన సాగిస్తుందని సర్వత్రా టాక్ నడుస్తోంది. అయితే అది మాటలకు మాత్రమే పరిమితమని కూడా కొన్ని ఘటనలను బట్టి తేటతెల్లమౌతుంది. అదెలాగంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్నదాతలకు అండగా ఉంటామని, ధాన్యమంతా కొంటామని, ప్రతి గింజ సేకరిస్తామని, డబ్బులు వెంటనే జమ చేస్తామని, ధాన్యం కొనుగోళ్లకు ముందు అమాత్యులు చేసిన ప్రకటన ఇది. ఇపుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ సేకరణ కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతులు డబ్బు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అక్షరాలా 2040 కోట్ల 12లక్షల రూపాయలను ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్ ధాన్యంలో పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా 30శాతం సొమ్ము రైతులకు చెల్లించాల్సి వుంది. ధాన్యం ఇచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా సొమ్ము కోసం ఎదురు చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులుకు అమ్ముకుంటే ఇన్నాళ్లు ఆగాల్సిన పరిస్థితి ఉండేది కాదని రైతులు వెల్లడిస్తున్నారు. డబ్బు చేతికొస్తే రెండో పంటకు పెట్టుబడులకు ఉపయోగపడతాయని రైతులు ఆశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ లో 1710 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగింది. గత మూడు నెలల్లో 3 లక్షల 97 వేల 189మంది రైతుల నుంచి 40 లక్షల 80వేల 579 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఈ మొత్తానికి 7,421.32 కోట్లు చెల్లించాల్సి ఉండగా 5,381.20 కోట్లు జమ చేసింది. ఇంకా 2040.12 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా రైతులకు అత్యధికంగా 573 కోట్లు చెల్లించాల్సి ఉంది. విజయనగరం జిల్లా రైతులకు 433 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉంది. శ్రీకాకుళం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరగాల్సి ఉండగా... అందుకు నిధుల కొరత వల్లే చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు.

విశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మాఫియా.. స్టీల్ ప్లాంట్ లో కొలువుల పేరుతో ఘరానా మోసాలు...

విశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మాఫియా చెలరేగిపోతుంది. స్టీల్ ప్లాంట్ లో కొలువులు ఎరవేసి లక్షలకు లక్షలు నొక్కేస్తోంది. నిరుద్యోగుల ఆశలతో ఆటలాడుతున్న ఈ దందాలపై సీబీఐ కన్నేసింది. మరోవైపు ఉద్యోగం కోసం ఆస్తులమ్మి బ్రోకర్ల చేతుల్లో డబ్బులు పోసిన బాధితులు కక్కలేక మింగలేక విలవిల్లాడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దళారుల రాజ్యం నడుస్తోంది. తాత్కాలిక ఉద్యోగాల పేరుతో యువకుల నుంచి ఈ ముఠాలు లక్షలు గుంజేస్తున్నాయి. ఇటీవల ఓ నిరుద్యోగి దగ్గర నుంచి పది వేలు అడ్వాన్స్ రూపంలో తీసుకుంటూ కార్మిక సంఘం నాయకుడు మంత్రి సత్యనారాయణమూర్తి సీబీఐకి చిక్కాడు. పక్కా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా మూర్తిని పట్టుకున్న సిబిఐ కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. మూర్తిని సస్పెండ్ చేసిన ఉక్కు యాజమాన్యం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. కార్మిక నాయకుడు మూర్తి వ్యవహారం స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది, తీగ లాగితే ఏకంగా డొంకలు కదులుతున్నాయి. రెండు దశాబ్ధాలుగా ఓపెన్ నోటిఫికేషన్ లేకుండా అడ్డగోలు నియామకాలు జరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలన్నీ కాంట్రాక్టర్ లు కొంతమంది కార్మిక సంఘాల నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు, దళారుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు గత ఏడాది చిన్న చిన్న కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ను రాజస్థాన్ కు చెందిన కంపెనీకి అప్పగించారు. సంస్కరణలలో భాగంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కొన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. పరిశ్రమను దశల వారీగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పుడు బయటపడిన కాంట్రాక్టు ఉద్యోగాల అమ్మకాల వ్యవహారం చూస్తే ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం కాంట్రాక్ట్ ఉద్యోగాల దందాను గమనించి చర్యలు ప్రారంభించిందని అర్థమవుతోంది. మరోవైపు ఆస్తులు అమ్ముకొని లక్షలాది రుపాయలు దళారుల చేతుల్లో పోసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. బ్యాక్ డోర్ వ్యవహారం బయటకు వస్తే కట్టిన డబ్బులతో పాటు పరువు పోతుందన్న భయంతో ముందుకు రావడం లేదు. బ్యాక్ డోర్ వ్యవహారాలకు చెక్ పడాలంటే ఉక్కు యాజమాన్యం, నిఘా విభాగం, కేంద్ర కార్మిక విభాగం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. సీబీఐ కూడా రంగంలోకి దిగినందున స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలి, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్న భరోసా ఇస్తే మోసపోయిన వందలాది మంది బయటకు వచ్చే అవకాశముంది.  

వారణాసిలో 50 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ...

జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యంపై తీసుకున్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎవరెన్ని రకాలుగా ఒత్తడి చేసినా ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు, దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేశామని ఆలయ నిర్మాణం దిశగా ఈ ట్రస్టు వేగంగా పని చేస్తోందని పేర్కొన్నారు. అరవై ఏడు ఎకరాల భూమిని ట్రస్ట్ కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ నిన్న (ఆదివారం) ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత నియోజక వర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పన్నెండు వందల యాభై నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టనున్న యాభై ప్రాజెక్ట్ లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఐ ఆర్ సీ టీ సీ కి చెందిన మహాగాల్ ప్రైవేట్ ఎక్స్ ప్రెస్ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ రైలు దేశంలోని మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలైన వారణాసి, ఓంకారేశ్వర్ లను కలుపుతూ నడవనుంది. ఇక వారణాసిలో నాలుగు వందల ముప్పై పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రిని ప్రధాని ప్రారంభించారు. నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రధాని వారణాసిలో అడుగుపెడుతూనే శ్రీ జగద్గురు విశ్వరాజ్ గురుకుల శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతొమ్మిది భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్దాంత శిఖామణి గ్రంథాన్ని మొబైల్ అప్లికేషన్ ను ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని డిజిటలైజేషన్ చేయటం ద్వారా యువతకు అందుబాటులోకి తీసుకురావటం, వారిలో ప్రేరణ కలిగించడం శుభపరిణామం అన్నారు.  ఇక పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ను దేశం నలుదిశలా వ్యాపింపచేసేందుకు కృషి చేస్తున్న వారిని ప్రధాని అభినందించారు. దేశ ప్రజలు భారత్ లో తయారయ్యే వస్తువులనే ఉపయోగించాలని పిలుపునిచ్చారు. గంగానది ప్రక్షాళనకు చేపట్టిన నమామీ గంగా ప్రాజెక్టు ప్రజల భాగస్వామ్యం వల్లే విజయవంతమైందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు ఏడు వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్టు మరో ఇరవై ఒక్క వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ హస్తకళా సంకుల్లో కాశీ ఏక్ రూప్ అనేక్ పేరుతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక హస్తకళల ప్రదర్శనను ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఉత్తర ప్రదేశ్ నలుమూలల నుంచి పది వేల మందికి పైగా కళాకారులు రూపొందించిన వస్తువులను ప్రదర్శించారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆధిత్యనాథ్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప పాల్గొన్నారు. వారణాసిలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని అరవై మూడు అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. స్మారక కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ దయాల్ ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తోందని ఆయన మనకు అంత్యోదయ మార్గాన్ని చూపించారని మోదీ అన్నారు. సమాజంలో చిట్ట చివర ఉన్న వారి అభివృద్ధే అంత్యోదయ అని దీనిని ఆచరణలో చూపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

అంతర్జాతీయంగా ఏపీ పరువు గంగపాలు!!

తాము అందించిన సేవలకు డబ్బులు చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం ముఖం చాటేస్తోందంటూ విదేశీ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. తమ బకాయిలు రాబట్టాలి అంటూ జర్మనీకి చెందిన రెండు ప్రతిష్టాత్మక కంపెనీలు ఆ దేశ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించాయి. ఢిల్లీలో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యాలయానికి వెళ్లిన జర్మనీ రాయబారి ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన అత్యంత సాంకేతిక నైపుణ్యంతో కూడిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు దక్కే గౌరవం ఇదేనా అని కేంద్రాన్ని నిలదీశారు. దీంతో ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్రం మండిపడింది. అంతర్జాతీయ కంపెనీల సేవలు వినియోగించుకుంటున్నప్పుడు దేశ పరువు, ప్రతిష్టలకు విఘాతం కలగకుండా చూడాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తే ఎలాగంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కంపెనీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తూ లేఖలు రాసింది.  పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా దాదాపు 150 మీటర్ల లోతులో డయాఫ్రం వాల్ నిర్మించటానికి ప్రపంచంలో మూడు కంపెనీలకే సామర్థ్యం ఉందని జల వనరుల శాఖ ఇంజనీర్ లు గుర్తించారు. వాటిలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ముందంజలో ఉందని తేల్చారు. ఇదే విషయాన్ని అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు వెల్లడించి, ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో బావర్ కంపెనీ ఎల్ అండ్ టీ తో ఒప్పందం చేసుకున్నారు. డయాఫ్రం వాల్ ను నిర్మించేందుకు అవి  ట్రాన్స్‌స్ట్రాయ్‌ తో సబ్ కాంట్రాక్టు చేసుకున్నాయి. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు బిల్లుల చెల్లిస్తుంటే అవి సకాలంలో బావర్ కు చేరడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పనులు నిలిపి వేస్తామని ఆ కంపెనీ హెచ్చరించింది. దీంతో జల వనరుల శాఖ ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ లు తెరిచి నేరుగా సబ్ కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిపేలా ఒప్పందం చేసుకున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి 422 కోట్ల అంచనా వ్యయంతో ఒప్పందం చేసుకున్నారు. బావర్ సంస్థ సకాలంలోనే పనులు పూర్తి చేసినా ఇంకా 91.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు.  దీనిపై కంపెనీ ప్రతి నిధులు పలుమార్లు జలవనరుల శాఖకు వినతిపత్రాలిచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి చెల్లింపులపై వారికి ఎలాంటి హామీ లభించలేదు, పైగా పాత కాంట్రాక్టు సంస్థలు అధిక మొత్తాలకు పనులు చేపట్టాయని, అందులో అవినీతి జరిగిందంటూ దర్యాప్తు కోసం కమిటీలు వేయడంతో ఆందోళనకు గురైన బావర్ యాజమాన్యం ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదంటూ జర్మనీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. పోలవరం ప్రాజెక్టులో బావర్ కంపెనీ చేపట్టిన పనులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ గతేడాది అక్టోబర్ లో డీపీఐఐటి సంయుక్త కార్యదర్శి రాజేంద్ర రత్నకు జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డిపిఐఐటి బావర్ కంపెనీకి బకాయి పడిన 91.10 కోట్లు వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ లోని ఏపీ భవన్ ప్రత్యేక రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ కు లేఖలు రాసింది. దీనిపై స్పందన లేకపోవటంతో ఈ నెల 7న గత అంశాలను గుర్తు చేస్తూ బావర్ కంపెనీకి తక్షణమే బిల్లుల చెల్లించాలంటూ మళ్లీ లేఖ రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధుల కొరతను సాకుగా చూపుతోంది, బావర్ కంపెనీకి  ట్రాన్స్‌స్ట్రాయ్‌ ఎందుకు చెల్లించలేదో తమకు తెలియదంటోంది. బావర్ ట్రాన్స్ ట్రాయ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగి ఎస్క్రో అకౌంట్ ఏర్పడిన విషయంపై మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు రీయింబర్స్ చేస్తే  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు చెల్లించాల్సిన మొత్తం నుంచి 91.10 కోట్లు ఇస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. రీయంబర్స్ చేసిన పదిహేడు వందల ఎనభై కోట్ల నుంచి ఎందుకు చెల్లించలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు.  

ప్రియాంకను రాజ్యసభకు పంపాలనే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్

  ప్రియాంక గాంధీ చట్ట సభల్లో అడుగు పెట్టబోతున్నారా, పార్టీ పదవులకే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు పార్లమెంట్ లో తన వాణి వినిపించనున్నారా, ప్రియాంకను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే వారిలో ప్రియాంక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చట్ట సభలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మోతీలాల్ వోరా, మధుసూదన్ మిస్త్రీ, కుమార్ సెల్జా దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్, ఎంబి రాజుగూడ వంటి సీనియర్ నేతల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్, జూన్ లో పూర్తి కానుంది. ఇందులో వోరా, సెల్జా, దిగ్విజయ్ మళ్లీ రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశముంది. అయితే ఈసారి ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, రణదీప్ సూర్జెవాలాలను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏదో ఒకచోట నుంచి ప్రియాంకను రాజ్యసభకు పంపొచ్చని భావిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ వాణిని బలంగా వినిపించే నాయకులను ఈసారి ప్రమోట్ చేయాలని సోనియగాంధీ భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రియాంకాగాంధీని రాజ్యసభ బరిలోకి దింప బోతున్నారనే టాక్ నడుస్తోంది. పెద్దల సభలో మొత్తం రెండు వందల నలభై ఐదు స్థానాలు ఉండగా మరికొన్ని నెలలు అరవై ఎనిమిది సీట్లు ఖాళీ అవుతాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లు కోల్పోనుంది. అయితే మిత్ర పక్షాల సాయంతో వాటిలో పదింటిని కాంగ్రెస్ మళ్లీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. లోక్ సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలన్నది పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది.

రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా

రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టే ధర్నాకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈరోజు మధ్యాహ్నం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. అధిష్ఠానం ఇచ్చిన కార్యాచరణ కావడంతో పార్టీ అగ్రనేతలంతా సీరియస్గా తీసుకున్నారు. రిజర్వేషన్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ తప్పుబడుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణా కాంగ్రెస్ ఇందిరాపార్కులో ధర్నా చేపట్టింది. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్నాకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో ఉదయం పది గంటల కల్లా పార్టీ నాయకులంతా ఇందిరా పార్కుకు చేరుకోవాలని పిసిసి ఆదేశించింది. పన్నెండు గంటల నుంచి ధర్నా ప్రారంభం కానుంది, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియా పార్టీ ముఖ్య నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటారు. రిజర్వేషన్ లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఇటీవల చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వాదన మేరకే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలకనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్ లు కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఉద్యోగాలు కల్పించడంలోనే కాదు ప్రమోషన్ లలో కూడా రిజర్వేషన్ లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ విధానమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. ఏఐసీసీ ఇచ్చిన కార్యాచరణ కావడంతో ఈ ధర్నాను విజయవంతం చేయాలని టీ ఆర్ ఎస్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలి రానున్నాయి. సుప్రీంకోర్టులో కేంద్రం తిరిగి అప్పీల్ చేయడానికంటే ముందే రిజర్వేషన్ ల వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ భావిస్తోంది.

పట్టుబడింది గోరంతైతే కొండంత దొరికిందని వైసిపి ఆరోపిస్తోంది: టిడిపి

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రైడ్స్ రచ్చ కంటిన్యూ అవుతోంది. అయితే అధికారులిచ్చిన పంచనామా రిపోర్టు టిడిపి బయటపెట్టటంతో ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశమైంది. పట్టుబడింది గోరంతైతే కొండంత దొరికిందని వైసిపి ఆరోపిస్తోందని టిడిపి ఫైరైంది. అయితే అది ఒక రోజు పంచనామా రిపోర్టు మాత్రమేనంటూ వైసిపి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. మరోవైపు ఈ అంశంపై పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలపై రగడ కొనసాగుతోంది. శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించిన అంశాలు బయటపడ్డాయంటూ వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ఇచ్చిన పంచనామా రిపోర్టును టిడిపి నేతలు బయటపెట్టారు. అందులో ఓ రశీదులో రెండు లక్షల అరవై మూడు వేలు, మరో రసీదులో యాభై రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు గుర్తించినట్లు ఐటి శాఖ పేర్కొంది. దీనిపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని టిడిపి నేతలు ప్రశ్నించారు. అయితే వైసీపీ మాత్రం టిడిపి ఆరోపణలను ఖండించింది. డిజిటల్ లావాదేవీల పైనా, లాకర్ లలో బయటపడిన దానిపైనా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ రసీదులు రెండూ ఒకరోజు సోదాలకు సంబంధించినవి మాత్రమేనని చెబుతోంది. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటి శాఖే లిఖిత పూర్వకంగా చెప్పిందన్నారు వైసిపి నేత అంబటి రాంబాబు. మరోవైపు ఐటీ సోదాలపై బిజెపి కూడా స్పందించింది. వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదన్నారు ఆ పార్టీ నేత సోము వీర్రాజు. చంద్రబాబు హయాంలో అక్రమాలు జరుగుతున్నాయని తాము మొదట్నుంచీ చెబుతున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఐటీ రైడ్స్ పై రియాక్టయ్యారు. జనసేన ఎప్పుడూ అవినీతిని ప్రోత్సహించబోదని స్పష్టం చేశారు, డబ్బుతో రాజకీయం చెయ్యట్లేదు కాబట్టే జనసేనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఐటీ రైడ్స్ పై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు స్పందించడం లేదంటూ వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది.

కేసీఆర్ పుట్టినరోజుకు ఆశ్చర్యకరమైన ప్లాన్ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పండుగరోజు. అందుకే కేసీఆర్ కు మొక్కల పండగతో శుభాకాంక్షలు చెప్పేందుకు గులాబీదళం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ చాలెంజ్ ఊపందుకుంది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రముఖుల్ని భాగస్వామ్యం చేసింది. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరు పాల్గొనడంతో అది విశ్వవ్యాప్తమైంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని జల విహార్ లు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటుతారు. కేసీఆర్ జీవితక్రమాన్ని వివరించి ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రారంభిస్తారు. ప్రభుత్వ పథకాల ఎల్ఈడి ప్రదర్శనశాలను హోం మంత్రి మహముద్ అలీ ప్రారంభిస్తారు. ఎంపీ సంతోష్ కుమార్ వికలాంగులకు వీల్ చైర్స్ పంపీణీ చేస్తారు. సీఎం పుట్టినరోజు పురస్కరించుకొని ఎంపీ కేశవరావు భారీ కేక్ కట్ చేయనున్నారు. అటు ఏపీలో టీ ఆర్ ఎస్ నాయకులు ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. విజయవాడ దుర్గగుడిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంధ్రా టీ ఆర్ ఎస్ భవన్ లో కేక్ కటింగ్ చేస్తారు. కేసీఆర్ పుట్టినరోజుకి హైదరాబాద్ లో ఈసారి అంతా సందడిగా మారనుంది. మెట్రో పిల్లర్లపైన ఎటు చూసినా కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగరమంతటా హోర్డింగులు కనిపిస్తున్నాయి. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. వి లవ్ కేసీఆర్ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తుండగా, పెయింటింగ్స్ చిత్రకళా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. జంటనగరాల్లోని కవలలందరినీ ఒకే చోటుకు చెరిచింది మరో సంస్థ. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈసారి కేసీఆర్ పుట్టినరోజుకు రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. గజ్వేల్ లో రెండు వేల ఆరు వందల మంది మొక్కలు పట్టుకొని అరవై ఆరు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేసీఆర్ రూపంలో నిలబడ్డారు. ఇక విదేశాల్లో కూడా టీ ఆర్ ఎస్ ఎన్నారై శాఖలు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నాయి.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సీఏఏ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం!!

దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ క్యాబినెట్ కేంద్రాన్ని కోరింది. పౌరసత్వ విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని కేంద్రానికి సూచించింది. దీనివల్ల లౌకికత్వం ప్రమాదములో పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్ తరహాలోని సీఏఏ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.  పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాల ఖరారు చేసేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో రాష్ట్రస్థాయి మునిసిపల్ సదస్సు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ సాగడానికి పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ నెల 24న అన్ని పట్టణాలు, నగరాల్లో పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వార్డు యూనిట్ గా పట్టణ ప్రగతి నిర్వహిస్తారు, ప్రతి వార్డుకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ప్రతి మునిసిపాలిటీ కార్పొరేషన్ లు, వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాలు ఏర్పాటు చేసే ప్రక్రియను అయిదురోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జీ హెచ్ ఎం సీ కి వెంటనే డెబ్బై ఎనిమిది కోట్లు ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లకు డెబ్బై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున నిధులు సమకూరుతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండకుండా చూడాలని నిర్ణయించారు. పట్టణ ప్రగతిలో పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.  రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం వంటి పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్ర రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవింద్ కుమార్ లు సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. తెలంగాణలో లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

స్పాట్ లోనే ప్రాణాలు తీసేస్తున్న కొత్త గేమ్.. ట్రెండ్ అవుతోన్న స్కల్ బ్రేకింగ్...

మీరిప్పటివరకు ఆన్ లైన్ గేమ్స్‌... పబ్‌జీ, బ్లూ వేల్, మోమో చాలెంజ్... బర్త్‌డే బంప్స్‌....లాంటి గేమ్స్ మాత్రమే చూసుంటారు. లేదా, సరదా సరదాగానే కాళ్లతో తన్నడం.... విపరీతంగా కొట్టడం లాంటి ఆటలు చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు స్కూళ్లూ, కాలేజీల్లో కొత్త గేమ్ ట్రెండింగ్ అవుతోంది. ఇది అలాంటిలాంటి గేమ్ కాదు. ఒక్కసారి ఆడారో చచ్చినట్లే. అంత మోస్ట్ డేంజరస్ గేమ్ ఇది. సరదా కోసం... కాలక్షేపం కోసం... కోసం ఆడే ఆట ఎంత భయంకరమైనదంటే... కనీసం ట్రై చేసినా ప్రాణాలు మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే, అంత ప్రమాదకరం ఈ గేమ్. స్కల్ బ్రేకింగ్ గేమ్ గా జాతీయ మీడియా పిలుస్తున్న ఈ ఆటలో... ముగ్గురూ కలిసి వరుసగా నిలబడతారు... ముందు, ఆ చివర... ఈ చివర ఉన్నవాళ్లు... పైకి కిందకి ఎరుతారు... ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఎగురుదామని అంటారు... ఇక్కడే గేమ్‌‌లో అసలు ట్విస్ట్‌ ఉంటుంది... మధ్యలో ఉన్న వ్యక్తి పైకి ఎగిరిన వెంటనే... ఇరువైపుల ఉన్న ఇద్దరూ కలిసి... అతని కాళ్లపై తన్నుతారు... అంతే, ఎగురుతున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి పడిపోతాడు. ఇది, వినడానికి, చూడ్డానికి సరదాగానూ... సింపుల్‌గానూ కనిపిస్తున్నా.... వెనక్కిపడినోడి పరిస్థితి మాత్రం అంతే సంగతులు. పబ్‌జీ లేదా ఆన్ లైన్ గేమ్స్ లో ఆటకు బానిసలై మానసిక స్థిమితం కోల్పోయి మృత్యుబాట పడతారు. బర్త్‌ డే బంప్స్‌‌లాంటి గేమ్స్‌లో సున్నితమైన భాగాల్లో దెబ్బలు తగిలి మరణిస్తారు. అయితే, ఈ గేమ్‌లో అలా కాదు. తల వెనుక భాగం పగిలి స్పాట్‌ డెత్‌ అవుతున్నారు. లేదా, మెదడు, మెడ భాగాలు దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. మరికొందరికి రక్త నాళాలు, మెడ నరాలు తెగిపోయి కాళ్లూ చేతులు చచ్చుబడిపోతున్నాయి.  స్కూళ్లూ కాలేజీలు హాస్టల్స్‌లో ట్రెండింగ్‌ అవుతున్న ఈ ఆట మోస్ట్ డేంజరస్ గేమ్‌ అంటున్నారు వైద్యులు. వెనక్కి పడిపోవడం కారణంగా తలలో మెదడు దెబ్బతింటుందని... లేదంటే రక్త నాళాలు పగిలిపోతాయని అంటున్నారు. దాంతో, ఆ వ్యక్తి స్పాట్‌లోనే మరణించే అవకాశముంటుందని చెబుతున్నారు. లేదంటే, మెడ నరాలు పగిలిపోయి మొత్తం నాడీ వ్యవస్థే దెబ్బతింటుందని, దాంతో శరీరం మొత్తం చచ్చుబడిపోతుందని అంటున్నారు. అయితే, ఇలాంటి డేంజర్ గేమ్స్ ఆడకుండా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాదకర ఆటల విషయంలో ముందే పిల్లలను అప్రమత్తం చేయాలని చెబుతున్నారు. ఇక, స్కూళ్లూ కాలేజీల్లోనూ డేంజర్ గేమ్స్ విషయంలో స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించాల్సిన అవసరముందంటున్నారు. లేదంటే, సరదా సరదాగా ఆడుకునే ఆటలే పిల్లలు ప్రాణాలు తీసేస్తాయని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో పవన్ ని రంగంలోకి దింపుతున్న బీజేపీ!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రాజకీయాలలో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవ లేకపోయినా ఆయన సభలకు వేలాదిమందిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్ వాడుకోవాలని.. దాంతో బిజెపి విధానాలనూ జనంలోకి బలంగా తీసుకెళ్లాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్. ఇదే విషయం ఇరు తెలుగు రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు సూచించారట బీజేపీ జాతీయ నేతలు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాజధాని అంశంపై జనసేనతో కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది బిజెపి. తెలంగాణలో కూడా  పవన్ తో కలిసి పని చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. దీంతో జనసేనాని సేవలను వినియోగించుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పవన్ తో కలిసి పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ బీజేపీకి దీర్ఘకాలంలో నష్టం ఉంటుందంటున్నారు కొంత మంది నేతలు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సెంటిమెంట్ ఇంకా జనంలో ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర లీడర్ వచ్చి టిఆర్ఎస్ ను గానీ.. కేసీఆర్ నుగానీ విమర్శిస్తే మొదటికే మోసం వస్తుంది అనేది కొంత మంది నేతల వాదన. ప్రస్తుతం బిజెపి రెండు కార్యక్రమాల్ని చేపట్టింది. సీఏఏను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం తెలంగాణ ప్రభుత్వ పని తీరు, పథకాలను నిశితంగా పరిశీలిస్తూ లోపాలను ఎండగట్టడం ఈ రెండు కార్యక్రమాల్లో పవన్ ను పాల్గొనేలా చేస్తే కొత్త ఇబ్బందులు తప్పవని బీజేపీలో కొందరు చెప్తున్నారు. అంతేకాకుండా పవన్ ను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావటం వల్ల జాతీయస్థాయి నేతలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్య దర్శి మురళీధర్ రావుల ప్రభావాన్ని తగ్గించిన వారౌతామని కూడా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచితేనే మంచిదని సలహాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ కారణాలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో పొత్తు వల్లనే కాంగ్రెస్ నష్ట పోయిందని ఇప్పుడు పవన్ తో కలిసి వెళ్తే.. అదే పరిస్థితి బిజెపికి ఎదురౌతోందని గుర్తు చేస్తున్నారు. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ సేవలను తెలంగాణ బీజేపీ వినియోగించుకుంటుందా? లేకా కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

కలకలం రేపుతోన్న జగన్ ఢిల్లీ టూర్ డిటైల్స్

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్.... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంపై పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో చేరబోందన్న ప్రచారంతో... అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో, ఢిల్లీ పరిణామాలపై ఏపీ బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ...నిజంగా ఎన్డీఏలో చేరుతుందో లేదో తెలియదు గానీ, వార్తలు మాత్రం రాజకీయంగా మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ... ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్‌లో చేరుతుందంటూ విస్తృత ప్రచారం జరుగుతుండటంతో తెలుగుదేశం తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సీబీఐ అండ్ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆరోపిస్తోంది. ఇక, సెక్యులరిజం పేరుతో ముస్లిం మైనారిటీ దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి.... ఇకనైనా ముసుగు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం విమర్శలతో డిఫెన్స్‌లో పడిన వైసీపీ.... ఎన్డీఏలో చేరతామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మొదట్నుంచీ జగన్‌కు బీజేపీ రంగు పులిమి, ముస్లిం మైనార్టీ దళితులను వైసీపీకి దూరంగా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడుతున్నారు. బీజేపీతో వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జగకట్టబోదని డిప్యూటీ సీఎం అంజద్ బాషా చెప్పుకొచ్చారు. అయితే, తమకున్న సమాచారం ప్రకారం వైసీపీతో ఎలాంటి మైత్రి ఉండబోదని ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవదర్... అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఏపీ బీజేపీ సారధుల మాట ఇలాగుంటే, ఆ పార్టీ టీజీ వెంకటే‌శ్ మాత్రం... ఏమో ఏమైనా సాధ్యమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇదిలా ఉంటే, వైసీపీ.... ఎన్డీఏలో చేరొచ్చంటూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, టీడీపీ అనుకూల మీడియా కావాలనే తన మాటలను వక్రీకరించిందని మంత్రి బొత్స మండిపడుతున్నారు. అయితే, బొత్స మాట మార్చారని, డ్యామేజ్ జరగడంతోనే ఇప్పుడు వైసీపీ నేతలంతా ఖండిస్తున్నారని సీపీఐ రామకృష్ణ మండిపడుతున్నారు. మొత్తానికి, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్‌ అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంతో ఆంధ్రా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

హైదరాబాద్‌ మెట్రోలో... ఆశ నీరుగారిపోతోంది

హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట పొందుతున్న నగర వాసులకు చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రోజుకి నాలుగు లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. చిన్నచిన్న అవాంతరాలతో వేగంగా గమ్యాన్ని చేరుకోవాలన్న ప్రయాణికుల ఆశ నీరుగారిపోతోంది. ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి హైదరాబాద్ వాసులకు ఊరట కలిగిస్తూ రెండేళ్ల క్రితం అందుబాటులో వచ్చిన మెట్రో రైల్‌ మంచి సత్ఫలితాలను ఇస్తోంది. అయితే, కొత్తగా ప్రారంభించిన జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ రూట్లో మాత్రం మెట్రో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా రైళ్లలో డిస్‌ప్లే బోర్డులు లేకపోవడంతో తమ గమ్యాన్ని తెలుసుకోలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు, టికెట్ల కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు క్యూఆర్‌కోడ్ అమల్లోకి తెచ్చినా, చాలా మెట్రో స్టేషన్లలో స్కానర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండుమూడుసార్లకు పైగా స్కాన్ చేసిన తర్వాతే గేట్లు ఓపెన్ అవుతుండటంతో క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న సమస్యలతో మెట్రో జర్నీ ఆలస్యమవుతోందని, వాటిని పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

వైసీపీ, బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత!

ఎన్డీయేలో వైసీపీ కలుస్తుందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ సునీల్ దేవోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండదని ఎలాంటి అవగాహన కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పటికే జనసేనతో కలిసి పని ప్రారంభించామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. ఇరు పార్టీలు తమకు విరుద్ధమేనని తమకు టీడీపీతో కానీ వైసీపీతో గానీ ఎలాంటి పొత్తు పెట్టుకునే ఉద్దేశాలు లేవని ఆయన వెల్లడించారు. అదేవిధంగా తమకు ఎలాంటి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని కేవలం జనసేనతో మాత్రమే మద్దతుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు సునీల్ తెలిపారు. ఏపీలోని మరో రెండు పార్టీలతో మాకు ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన తెలివారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వైఫల్యాలతో తప్పుడు విధానాలను అవలంభిస్తొందని ఆయన స్పష్టం చేశారు. తాము ఇండిపెండెంట్ పార్టీగానే ఎదగడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి.. వైసీపీ.. బీజేపీకి మధ్య ఉన్న సంబంధాలను.. ఈ మధ్య నెలకొన్న ఊహాగానాలను సునీల్ దేవోధర్ స్పష్టం చేసినట్లే.

రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ!!

తనపై రాసిన తప్పుడు వార్తను ఈనాడు దినపత్రిక వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ నేత, పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావుకు లేఖ రాశారు.  "రామోజీరావు గారికి.. ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించాలని కోరుతున్నాను.  చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితులమీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు వెలుగు చూసిందంటున్న నేపథ్యంలో చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారించాలన్న డిమాండ్‌తో నేను విశాఖ పత్రికా సమావేశంలో మాట్లాడాను. ప్రధానమైన ఈ విషయం మీ పత్రికకు ప్రధాన వార్త కాలేదు. మీకు ఇలాంటి మాటలు రుచించవు. చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు మింగేసినా మీకు ఆయన అంటే ఉన్న దిక్కుమాలిన ప్రేమ గత మూడు దశాబ్దాలుగా మీ పత్రికలో నిత్యం కనిపిస్తూనే ఉంది. అది మీ ఇష్టం– తెలుగు ప్రజల దౌర్భాగ్యం.  అలాగే డాక్టర్‌ వైయస్సార్‌గారిమీద, వైయస్‌ జగన్‌గారిమీద మీ వ్యతిరేకత, శత్రుత్వం ఏనాడూ మీరు దాచుకున్నది లేదు. అలాగని మేం అనని మాటల్ని మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించే స్థాయికి దిగజారి, చంద్రబాబు పార్టీని బతికించి రక్షించుకోవాలనుకుంటున్న మీ మానసిక స్థితిని ప్రశ్నించేందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను.  ‘‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’’అని నేను అన్నట్టుగా మీరు హెడింగ్‌ పెట్టారు. నేను ఆ మాటలు ఎక్కడ అన్నానో చూపించండి. ఈ హెడింగ్‌ పెట్టటం ద్వారా రెండు వైపులా పదునున్న కత్తిని మాకు వ్యతిరేకంగా వాడాం అని మీరు మురిసిపోతున్నట్టున్నారు. మొదటిది– నేను అనని ఈ మాటల్ని అన్నానని చెప్పటం ద్వారా, పూర్తిగా మా మీద నమ్మకంతో ఉన్న మైనార్టీలను రెచ్చగొట్టాలన్నది మీ దురాలోచన. రెండోది– ఈ వ్యాఖ్యలు మేం చేయలేదని ఖండిస్తే...  కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ కొట్టవచ్చన్నది మీ రెండో దురాలోచన. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి మీ మొదటి పేజీలో ప్రచురించిన తీరును చూస్తే  ఈ విషయం అర్థమవుతోంది.  రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధానంగా ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలు పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం మాది. కేంద్రానికి–రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తెచ్చుకునేలా సంబంధాలు ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానిని, హోం మంత్రిని, కేంద్రంలోని పెద్దలను ముఖ్యమంత్రిగారు కలుస్తారన్నది కనీస జ్ఞానం ఉన్నవారికి అర్థం అవుతుంది.  అదే సమయంలో రాజకీయ పార్టీలుగా ఎవరి భావాలు వారికి ఉంటాయి. మా నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రత్యేక హోదా కోసం 2014నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వైయస్సార్‌ కాంగ్రెస్‌గా మా విధానాలు మావి. బీజేపీ విధానాలు వారివి. ఏ సిద్ధాంతాలూ లేని, ఎప్పుడు ఎవరితో అయినా కలిసి, విడిపోయి, మళ్ళీ కలిసిపోయే విధానం మీరు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీది. మేం రాజకీయంగా మా స్వతంత్రాన్ని ఎప్పుడూ కాపాడుకుంటున్నా, వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రోజుకో ప్రచారం చేయటం మీ విధానం. ప్రజలకు మంచి చేయటం చేతగాని చంద్రబాబును ఎలాగూ ప్రజల్లో పెంచలేరు కాబట్టి మమ్మల్ని చిన్నగీత చేయటానికి మీరు ఎంతగా దిగజారుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి.  ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాలు, మీ అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం అబద్ధాలు, కట్టుకథలతో ఇంకెంత కాలం మీ పత్రిక నడుపుతారు? చంద్రబాబు పర్సనల్‌ సెక్రెటరీ తీగ లాగుతుంటే కదులుతున్న వేల కోట్ల రూపాయల అవినీతి  డొంకను మీరెందుకు చూపించటం లేదు? ఇలాంటి వార్తల్ని దాచటం కూడా పత్రికా విలువల్లో భాగమేనా? ఇందులో జాతీయ ప్రయోజనాలు ఏమన్నా ఇమిడి ఉన్నాయా?  చంద్రబాబుకు 70. మీకు 84.  ఇంత పండు వయసు వచ్చినా రాష్ట్రం గురించి కంటే మీ స్వప్రయోజనాల కోసమే రగిలిపోతున్న మీ వైఖరి వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మీ పాజిటివ్‌ కంట్రిబ్యూషన్‌ ఏమిటంటే చెప్పుకునేందుకు ఏమీ లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పేరు చెపితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమూ లేదు... ఈనాడు పత్రిక వల్ల తెలుగు ప్రజలకు జరిగిన మేలు ఫలానా అంటే చెప్పేందుకూ ఏమీ మిగల్లేదు. ఎందుకీ పరిస్థితి వచ్చిందో మీరే ఆలోచించుకోండి.  చివరిగా... మీ వార్త తప్పు, మీ ఆలోచన తప్పు. మీ పాలసీ తప్పు. చంద్రబాబును బతికించటం కోసం మీరు ఎంతటి అసత్యాలయినా పత్రికలో ప్రచురించటం తప్పు మాత్రమే కాదు... నేరం కూడా. మీ స్పందనను బట్టి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది.  – బొత్స సత్యనారాయణ"