ఐపీఎల్ తో పాటు ఎఫ్ 1 రేస్ కూడా రద్దు!

ఢిల్లీలో ఐపీఎల్ 13వ సీజన్ కు సంబంధించిన మ్యాచ్లను నిర్వహించకూడదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్లతో పాటు మిగతా క్రీడా పోటీలపైన కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా తిలకించే ఎఫ్ 1 రేస్ కూడా నిలిపివేయండంతో క్రీడాభిమానులు నిరాశకు గురవుతున్నారు. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాను పాటించాలని, క్రీడా కార్యక్రమాలలో లార్జ్ గెదరింగ్(పెద్దఎత్తున ప్రజలు ఒకచోట హాజరవడం) నివారించాలని BCCIతో సహా అన్ని జాతీయ సమాఖ్యలను కోరింది. ఇప్పటికే ఐపీఎల్ ను వాయిదా వేయాలని,బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఐపీఎల్ ను వాయిదా వేసుకోవాలని సూచించింది. మద్రాస్‌ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్‌ భయంతో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ''ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్‌ మెరుపులతో అలరించిన ఈ లీగ్‌ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. ఈ నెల 14న జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ.. ఇప్పుడున్న 'కరోనా మహమ్మారి' దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు.

ఏపీ శాంతి భ‌ద్ర‌త‌ల‌పై కేంద్రం ఆరా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిపై నివేదిక‌ను అంద‌జెయ్యాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కేంద్ర హోంశాఖ కోరింది. డీజీపీని హైకోర్టుకు పిలిచి ప్ర‌శ్నించ‌డం, స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల నేప‌థ్యంలో వాస్త‌వ ప‌రిస్థితుల‌పై నివేదిక పంప‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌ను సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను చేజిక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తోందని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై గవర్నర్‌ను రెండు మూడుసార్లు కలిసి ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని యనమల ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఒక వ్యూహం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కవ్వించి తెలుగుదేశం పార్టీ నేత‌లు వీడియోలు తీస్తున్నారు. ఇలా వీడియోలు తీయడం వల్లే గొడవలు జరుగుతున్నాయ‌ని అధికార ప‌క్షం అంటోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో పలుమార్లు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి కొన్ని టిప్స్ ఇచ్చార‌ట‌. వైఎస్సార్‌సీపీ శ్రేణుల కదలికలను మొబైల్‌ ఫోన్లలో వీడియోలు తీయాలని ఆదేశించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వీడియోలు తీయడంతో గొడవలు జరుగుతున్నాయి. చిన్నపాటి వాగ్వాదాలు, గొడవలు జరిగితే చిత్రీకరించి తమకు పంపాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సూచనలు వచ్చాయి. ఆ వీడియోలను ఎన్నికల కమిషనర్‌ ట్విట్టర్‌ ఎకౌంట్లో పెట్టి దాన్నే ఫిర్యాదుగా తీసుకోవాలని కోరాలని టీడీపీ నాయకత్వం పేర్కొంది. వీడియోలను అనుకూలంగా మలచుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయాలని టీడీపీ క్యాడర్‌కు సూచనలు అందినట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ వీడియోలు తీస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలను వీడియోలు తీస్తూ రెచ్చగొట్టడంతో గొడవ జరిగింది. ఈ ఘటనకు కొనసాగింపుగానే అదే నియోజకవర్గంలోని పులిచర్లలోనూ ఘర్షణ రేగింది. వీడియో తీయడం వల్లే పుంగనూరు నియోజకవర్గంలో గొడవ జరగ్గా, చంద్రబాబు ఆ గొడవనే పదేపదే ప్రస్తావించడం గమనార్హం. వీడియోలు తీస్తూ, కామెంట్లు చేస్తూ రెచ్చగొట్టడం, ఆ తర్వాత జరిగే గొడవలను వీడియోలు తీయడమే కొందరు పనిగా పెట్టుకున్నట్లు తెలిసింది. మాచర్లలోనూ టీడీపీ నాయకులు వీడియోలు తీసి హడావుడి చేయడం వల్లే గొడవ పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్ కేంద్రానికి ఎలాంటి నివేదిక పంప‌నున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ధ్రువపత్రాలు అవసరం లేదట‌! ఎన్పీఆర్‌పై అనుమానాలొద్దంటున్న‌ అమిత్ షా

కోవిడ్‌ కన్నా ప్రమాదకరమైన మత వైరస్‌(కమ్యూనల్‌ వైరస్‌)ను బీజేపీ వ్యాప్తి చేస్తోందని, దీని వల్ల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాద‌మంటూ రాజ్య‌స‌భ‌లో చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్‌ సభ్యుడు కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించడం స‌భ‌లో హీట్ పుట్టించింది. అధికార ప్ర‌తిప‌క్ష‌స‌భ్యుల వాదోప‌వాదాల మ‌ధ్య హోం శాఖా మంత్రి అమితాష్ ఎన్పీఆర్‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. జాతీయ జనాభా పట్టిక(నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌-ఎన్పీఆర్‌)పై ఆందోళన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్‌ను అప్‌డేట్‌ చేసే కార్యక్రమంలో ఏ పౌరుడి వివరాలను 'అనుమానాస్పద(డౌట్‌ఫుల్‌- డీ)' కేటగిరీలో చేర్చబోమని తెలిపారు. అలాగే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ఏ ధ్రువ పత్రాలను కూడా పౌరులు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఎన్పీఆర్‌ ప్రశ్నావళిలో తల్లిదండ్రుల నివాసానికి సంబంధించిన ప్రశ్నలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ.. పౌరులు తమ వద్ద లేని సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఏఏపై గానీ, ఎన్పీఆర్‌పై కానీ మైనారిటీలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించిన అనుమానాల నివృత్తికి విపక్ష నేతల బృందం తనను కలవొచ్చని సూచించారు. పౌరసత్వాన్ని రద్దు చేసే ఏ సెక్షన్‌ కూడా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లో లేదని మరోసారి స్పష్టం చేశారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఢిల్లీ అల్లర్ల దోషులను చట్టం ముందు నిలుపుతామని పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత కొందరు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన విద్వేష ప్రసంగాల కారణంగానే ఢిల్లీ హింసాకాండ చోటు చేసుకుందని షా పేర్కొన్నారు. ప్రభుత్వమే హింసాకాండకు పురిగొల్పిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న వేళ ఏ ప్రభుత్వమైనా అలా చేస్తుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ హింసాకాండ వెనుక పెద్ద కుట్ర ఉందని, విదేశీ నిధులను దీనికి ఉపయోగించారని ఆరోపించారు. 'ఢిల్లీ అల్లర్లను మత కలహాలనడం హాస్యాస్పదం. ఇవి ముందే ప్లాన్‌ చేసుకున్న ఊచకోత' అని ఓవైసీ వ్యాఖ్యానించారు. 'ఫైజాన్‌ ముస్లిం అయినంత మాత్రాన ఆయన ప్రాణం విలువ అంకిత్‌ ప్రాణం విలువ కన్నా తక్కువ కాబోదు. మొత్తం హింసాకాండపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి' అని ఆయన కోరారు. ఢిల్లీ హింసాకాండకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపేందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. దేశ ఆత్మని కాపాడాలని ఓవైసీ హిందువులను కోరారు. దాదాపు 1,100 మంది ముస్లింలను అక్రమంగా నిర్బంధించారన్నారు. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసుల తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేయడంలో ఎలాంటి కుట్ర లేదని, ఆ బదిలీ అంతకుముందు, సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల ఆధారంగానే జరిగిందని వివరణ ఇచ్చారు.

127 దేశాల్లో కరోనా విలయం తాండ‌వం 4,973 మంది మృతి

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 972కి చేరింది. 1 లక్షా, 34 వేల 558 మంది కరోనా బాధితులు ఉన్నారు. 5 వేల 994 మందికి సీరియస్ గా ఉంది. భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్ లోని అని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటకకు చెందిన 76ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. తొలి మరణం. భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి. ముంబైకి చెందిన 26ఏళ్ల యువకుడు బెంగళూరులోని గూగుల్ ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు. గత ఫిబ్రవరి 23న తన భార్యతో కలిసి గ్రీస్ దేశానికి హనీమూన్‌కు వెళ్లాడు. హనీమూన్ నుంచి మార్చి 6న ముంబైకి తిరిగొచ్చారు. మార్చి 8న ముంబై నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ క్రమంలో అతడికి టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటీవ్‌గా తేలినట్లు గూగుల్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. హనీమూన్ నుంచి తిరిగొచ్చిన ఆ టెకీ మార్చి 9న తిరిగి బెంగళూరు ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ టెకీకి కరోనా వైరస్ లక్షాలున్నట్లు గుర్తించామని, దీంతో ఇతర ఉద్యోగులపై దీని ప్రభావం పడకుండా ఆయనను జయనగర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్‌పై సమాచారం అందించేందుకు తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్ - 104 ఆంధ్రప్రదేశ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ - 0866 2410978. 1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి. 2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. 3. జిఎంసి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ ఈ ఆసుపత్రులు కరోనా వైరస్ పరీక్ష అందుబాటులో వున్నాయి.

టీడీపీకి మరో దెబ్బ.. కేఈ ప్రభాకర్ రాజీనామా

స్థానిక ఎన్నికల్లో అనుచరులకు అన్యాయం టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి తెలుగుదేశం పార్టీని వీడిన కేఈ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్, పార్టీకి రాజీనామా చేశారు. నేడు తన అనుచరులతో సమావేశమైన ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న ఆయన, తెలుగుదేశం పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని, అందుకే రాజీనామా చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యంగా తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆగ్రహం ఆయనలో నెలకొనివుందని అంటున్నారు. కాగా, కేఈ ప్రభాకర్ ఏ పార్టీలో చేరనున్నారన్న విషయమై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కొందరు వైసీపీలో చేరుతారని, మరికొందరు బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు చేస్తున్నారు.

కల్వకుంట్ల కవిత భవిష్యత్ ఏమిటి?

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటి వరకూ కవితను రాజ్యసభకు పంపించనున్నారని, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారని పలు కథనాలు వచ్చాయి. రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి కవితకు ఖాయమని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడించారు. దీంతో త్వరలోనే కవిత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నట్లు అందరూ ఊహించారు. కానీ కేసీఆర్ నిర్ణయంతో పార్టీ కేడర్ ఒక్కసారి ఉలిక్కిపడింది. రాజ్యసభ రెండుస్థానాలు ఇతరులకు ఇవ్వడంపై కవితను కేసీఆర్ ఏం చేయాలనుకున్నారనేది సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. కవితకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? లేదా ఉద్దేశపూరకంగానే ఖాళీగా ఉంచుతున్నారా? టిఆర్ ఎస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఓడిపోయినప్పటి నుంచి కవిత పార్టీలోగానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోగానీ కీలకంగా వ్యవహరించడం లేదు. దూరంగా ఉంటున్నారు. ఓటమి నుంచి కవిత తేరుకోవడం లేదని అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు పూర్తయి 10 నెలలు గడుస్తున్నప్పటికీ కవిత మౌనం వీడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు కవిత అమెరికాకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తమ అనుచరులకు టిక్కెట్లు దక్కలేదని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అమెరికా వెళ్లారని అప్పట్లో పలు కథనాలు వచ్చాయి. కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జాగృతి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెడుతారా అనే కొత్త ప్రచారం ప్రారంభ‌మైంది. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 90శాతం స్థానిక సంస్థలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది కాబ‌ట్టి దీంతో నిజామాబాద్ స్థానాన్ని ఈజీగా గెలిచే అవకాశాలున్నాయి. ఆ స్థానం కూడా కేసీఆర్ డిక్లేర్ చేయకుండా పెండింగులో ఉంచారు. ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవి కట్టబెట్టనున్నారా? అనే విషయంలో కూడా స్పష్టత లేదని పార్టీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారు. ఇక‌ ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే కవిత భవిష్యత్ ప్రశ్నార్థక‌మే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ కూడా సమర్థవంతంగా పనిచేసింది. జాగృతి తరపున కవిత, బతుకమ్మ వంటి కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ సంస్కృతిని చాటారు. ప్ర‌స్తుతం జాగృతి కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదట‌. కవిత సైన్యాన్ని లెక్కచేయపోతే.. ఇక మామూలు నాయకుల పరిస్థితి ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తున్నదని, తనయుడు కేటీఆర్ ను అందలం ఎక్కిస్తూ కవితను పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా లేకపోలేవు. దీంతో తన తండ్రితో తనకు ప్రాధాన్యత ఉన్న పోస్టు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కేసీఆర్ ఇష్టం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ, ప్రభుత్వంలోగానీ కవితకు ఎలాంటి పోస్టు ఇవ్వనున్నారో ప్రశ్నార్థకంగా మారింది.

సంపదలో 'అయోధ్య' ను దాటని 'పరిమళం'...

రాజ్యసభ అఫిడవిట్లలో ఉట్టిపడిన వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థుల 'లక్ష్మీ కళ'  ఇచ్చుకున్నోడు ఈగ....పుచ్చుకున్నోడు పులి అని సామెత. ఇక్కడ ఇచ్చుకున్నది జగన్ మోహన్ రెడ్డి అయితే, పుచ్చుకున్న ఆ ఇద్దరూ కూడా నిజంగా పులులేనండోయ్.. కాకపోతే నిజం పులులు కాదు.. సంపదలో పులులు. జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ కు పంపుతున్న పరిమళ్ నత్వానీ , అయోధ్య రామిరెడ్డి ఇద్దరూ కూడా ... తమ అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలు చూసినా, చదివినా ఎవరికైనా కళ్ళు తిరిగిపోతాయి. కాపోతే, ఆ ఇద్దరిలో అయోధ్యరామి రెడ్డి సంపదే, పరిమళ్ నత్వాని సంపద కన్నా ఎక్కువ.  ఈ అఫిడవిట్ల ప్రకారం పరిమళ్‌ నత్వాని కన్నా అయోధ్యరామిరెడ్డి అత్యధిక ఆస్తులున్నాయి. ఆయన స్థిర, చరాస్తులన్నీ కలిపి 2,377 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తనకు మొత్తం 2,376 కోట్ల రూపాయలు చరాస్తి ఉందని,55 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ భూమి ఉందని, నివాస గృహాల విలువ 17.55 కోట్లని ఆయన పేర్కొన్నారు. అప్పులు 61 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అయోధ్య రామిరెడ్డి భార్య పేరిట చరాస్తి 128.72 కోట్లు, స్థిరాస్తి 13 కోట్లు, వ్యవసాయేతర భూమి విలువ 26 కోట్లు, నివాస గృహాల ద్వారా ఆస్తి 41 కోట్లు ఉన్నాయని, అప్పులు 93 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కుమార్తె పేరున మరో 13 కోట్ల రూపాయల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రెండవ స్థానంలో నిలిచిన పరిమళ్ నత్వాని తన ఆస్తుల విలువను నాలుగు వందల కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన చరాస్తి 180 కోట్లు, స్థిరాస్తి 179 కోట్లు, బరగారం, రంగురాళ్ల విలువ 1.35 కోట్లు, ఇతర భూమి 6.50 కోట్ల రూపాయలు, 1.65 కోట్ల రూపాయల విలువైన భవనాలు ఉన్నట్లు ప్రకటిరచారు. 203 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య పేరిట చరాస్తి 21.25 కోట్లు, స్థిరాస్తి 15 కోట్లు, బంగారం, రంగురాళ్లు కలిపి 5.71 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆమె పేరిట అప్పులు ఆరు కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా, తెలుగు దేశం పార్టీ లోగడ రాజ్య సభ కు పంపిన ధనికుల స్థాయికి తగ్గకుండా, తన పార్టీ నుంచి కూడా జగన్ సారు ఓ మోస్తరు ధనికులనే ప్రస్తుతం రాజ్యసభ కు పంపుతున్నారు. దీని ద్వారా ....పైసలున్న వారికి ఏ గవర్నమెంట్ లో అయినా పదవులు దొరుకుతాయనే భరోసా అయితే లభించింది.

ప్రజల నడ్డి విరిచే అంకెల గారడీ బ‌డ్జెట్‌!

బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.

స్థానిక ఎన్నిక‌లు శైలజానాథ్ కు ప‌రీక్షే!

క‌నీసం పోటీ చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కరవు అయిపోయార‌ట‌. ఈ నేప‌థ్యంల్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం పీసీసీ చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌ శైల‌జ‌నాథ్‌కు పెద్ద పరీక్షగా మారింది. ఈ ఎన్నికల్లో అస‌లు మార్కులు పడతాయా? కనీసం పాసవుతారా? అనేదీ కష్టంగానే వుంది. గ్రామ, మండల, పట్టణాల్లో కేడర్‌ పూర్తిగా బలహీన పడటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌లోని అన్ని సీట్లలో పోటీకి దిగడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ స్థానాలకు నాయకత్వం ఒత్తిడితో మొక్కుబడిగానే అభ్యర్థులు బరిలోకి దిగారు. అన్ని స్థానాలకూ అభ్యర్థులు కరవయ్యారు. జెడ్పీటీసీ, మున్సిపల్‌ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయనేదీ నేతలు గట్టిగా చెప్పలేక పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమరంలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే కొనసాగుతోంది. ఈ ప్రధాన పార్టీలకు కాంగ్రెస్‌ పోటీ ఇచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా కన్పించడం లేదు. జనరల్‌తోపాటు రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు కరవయ్యారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీటును సైతం సాధించలేక పోయింది. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి పునరావృతం కానుంది. పీసీసీ చీఫ్‌లు మారినా పార్టీ శ్రేణుల్ని ఆకర్షించే స్థాయిలో కాంగ్రెస్‌ నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కేంద్రంలోను, రాష్ట్రంలోను వరుస వారీగా కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్‌ కేడర్‌ నిరుత్సాహంగా ఉంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు దీటుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. కేవలం నామినేషన్లు వేసి ప్రచారానికే వారంతా పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ, టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నిల‌దీస్తోంది.రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదాయే ఇవ్వాల్సిందే. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం జగన్‌లు ప్రధాన సమస్యలు వదిలేసి ఎంటర్‌టైన్‌మెంట్‌ చూపిస్తున్నారట‌. ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి, మాయమాటలతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు పోరాడాలన్నారు. పార్లమెంటులో పెద్ద సంఖ్యలో ఎంపీలను కలిగి ఉండి వైసీపీ ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదంటూ పీసీసీ చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌.శైలజనాథ్ ఓట్లు అడుక్కుంటున్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాలైనా గెలిచి పట్టు సాధించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఆశ‌గా వుంది.

కరణం తనయుడు, డొక్కా కుమార్తెలకు జెడ్ పీ పీఠాలు...

  సభ్య సమాజానికి క్లియర్ మెసేజ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ అయిపొయింది... ఇంకా ప్రమాణ స్వీకారాలె తరువాయి.. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా కరణం బలరామ కృష్ణ మూర్తి తనయుడు కరణం వెంకటేష్, అలాగే పక్కనే ఉన్న గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా డొక్కా మాణిక్య వర ప్రసాద్ కుమార్తె ల పేర్లు దాదాపుగా ఖరారు అయిపోయాయి. అంటే, ఇదంతా క్విడ్ ప్రో కో నేనా అని ఎవరికైనా సందేహాలు కలిగితే, అలాంటి వాటికి జవాబులు ఉండవు. పార్టీ విధానాలు నచ్చి వెళ్లిన కరణం కుటుంబం, అలాగే డొక్కా కుటుంబాల తక్షణ రాజకీయ అవసరాలు తీర్చే కల్పతరువుగా వై ఎస్ ఆర్ సి పి అధినేత జగన్ మోహన్ రెడ్డి వారికి కనిపించి ఉండవచ్చు. అంచేత, ఇందులో మనం కరణం, డొక్కా ఫ్యామిలీ ల రాజకీయ అవసరాలు, ప్రాధమ్యాల గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తే, వారు హర్ట్ అవ్వొచ్చు. అంచేత, అందరూ కూడా ఈ ఎపిసోడ్ ను కేవలం ఒక పాజిటివ్ దృక్పథం తోనే చదవాలనేది , చూడాలనేది ఆ రెండు రాజకీయ కుటుంబాల ఆకాంక్ష. అయితే, ఈ విషయం లో డొక్కా మాణిక్ వర ప్రసాద్ అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.   ఆయన కుమార్తె సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న కారణంగా ప్రస్తుతానికైతే అటువంటి ఉద్దేశం లేదని, ఒక వేళ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పని సరిగా తన కుమార్తె బరి లో నిలబడుతుందని ఆయన తన సన్నిహితుల దగ్గర చెపుతూ వస్తున్నారు. బీ టెక్ తో పాటు, తండ్రి మాదిరే న్యాయ శాస్త్రం అభ్యసించిన -డొక్కా మాణిక్ వర ప్రసాద్ కుమార్తె ఒక వేళ బరిలో నిలబడితే, నిజం గా డొక్కా ఫ్యామిలీకి పునరావాసం దొరికినట్టే. తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు కూడా -డొక్కా సాత్వికంగా నే వ్యవహరించేవారు. అదే సామాజిక వర్గానికి చెందిన వార్ల రామయ్య ప్రదర్శించే దూకుడు -డొక్కా ఎప్పుడూ ప్రదర్శించ లేదు.   ఈ విషయాలు పక్కన పెడితే, విలువల తో కూడిన రాజకీయాలు చేస్తామని నినదిస్తూ కొత్త తరం ఓటర్లను ఆకట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫార్ములా నే అనుసరిస్తూ రావటం అందరినీ విస్మయపరుస్తోంది. అప్పట్లో వై ఎస్ ఆర్ సి పి కి చెందిన ఎం ఎల్ ఏ లు, వారి కుటుంబ సభ్యులను టోకున తెలుగు దేశం లోకి తరలించిన చంద్రబాబు వైఖరినే, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అవలంబిస్తున్నారు. అటువంటి చర్యల కారణం గా చంద్రబాబు తర్వాతి రోజుల్లో ఏ రకంగా నష్ట పోయారో..ఇటీవలి వరుస వలసలు చుస్తే మనకి విషయం ఇట్టే బోధపడుతుంది. కడప జిల్లా ఖాళీ అయిపోయి దిగాలుగా ఉన్న తెలుగుదేశం పరిస్థితి, రాబోయే రోజుల్లో వై ఎస్ ఆర్ సి పి కి వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ‘మేం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఎవరైనా సరే వైసీపీలోకి రావాలంటే ఖచ్చితంగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ’ ఇదీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ప్రకటన. అప్పట్లో జగన్ ప్రకటనను చూసిన వారంతా శభాష్ అన్నారు. కానీ ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే రాజకీయం మారిపోయింది.     గురువారం నాడు తాడేపల్లిలో కరణం బలరామ్ దగ్గర ఉండి తన కొడుకు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్చారు. ఆయన కూడా ఎక్కడా మొహమాటపడకుండా తాను ఎందుకు వైసీపీకి దగ్గర అవుతున్నదీ మీడియా సాక్షిగా చెప్పారు. అందరూ చెప్పినట్లే చీరాల అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి టీడీపీలో కరణం బలరామ్ కు అన్యాయం జరిగిందని..కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇఛ్చి కరణం లాంటి వాళ్ళను పక్కన పెట్టారని వాపోయారు. అధికారికంగా కరణం బాలరామ్ కు కండువా కప్పితే ఎమ్మెల్యే పదవి పోతుందనే కారణంగానే ‘ఈ విలువలతో కూడిన రాజకీయ మార్గాన్ని’ ఎంచుకున్నట్లు కన్పిస్తోందనే విషయం స్పష్టం అవుతోంది.   వైసీపీ నేతలు జగన్ కండువా కప్పలేదు కాబట్టి కరణం బలరామ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వాదించవచ్చు. ఓకే. కానీ కళ్ల ముందు ఏమి జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేకు నేరుగా పసుపు కండువాలు కప్పే పార్టీలో చేర్చుకున్నారు. ఇలా ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదులు చేస్తే స్పీకర్ తో వాటిని సంవత్సరాల తరబడి పక్కన పెట్టించారు. ఈ ఫిరాయింపులతో చంద్రబాబు ఎంత అప్రతిష్ట తెచ్చుకున్నదీ అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఫార్ములా ని యాజ్ ఇటీజ్ గా అమలు చేస్తే, సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు అనుకోవాలి.

టీ కాంగ్రెస్‌లో ప్ర‌కంప‌న‌లు.. రేవంత్ వ్య‌వ‌హారం తేల్చాల్సిందేన‌ని హైక‌మాండ్‌పై ఒత్తిడి

  తనకు పీసీసీ పీఠం ఖాయమని పార్టీలో బిల్డప్‌ ఇచ్చుకున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ షాక్‌ ఇవ్వబోతోంద‌ట‌. భూ కబ్జా వ్యవహారాలన్నింటినీ దాచిపెట్టి సొంత ఎజెండాతో ప‌ని చేస్తున్న రేవంత్ పై స్వంత పార్టీలోనే సీనిర‌య‌ర్లంతా ముక్కుమ్మ‌డిగా దాడి చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది అనే విషయంపై సీనియర్‌ నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం చేరవేస్తున్నారు. వి. హన్మంతరావు, జగ్గారెడ్డిలాంటి నేతలు రేవంత్‌ తీరును తప్పుబడుతున్నారు. తనమీద వచ్చిన నిందలను చెరిపేసుకోకుండా ఇతరులపై బురద జల్లడం ఎంతవరకు కరెక్ట్‌ అని వారు కడిగిపారేస్తున్నారు. సొంత ఎజెండాతో ముందుకెళ్తున్న రేవంత్‌కు ఆజాద్‌ ఎలా మద్దతిస్తారని హన్మంతరావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పార్టీ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అవుతున్నారు. సమస్యలపై ఎవరైనా పద్దతి ప్రకారం పోరాడాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే తీస్‌మార్ ఖాన్ కాదని, ఆయన తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. నింద అయితే నిరూపించుకో.. తప్పయితే సరిదిద్దుకో అని పదేపదే చెబుతున్నా.. పట్టించుకోని రేవంత్‌ సీన్‌ని ఇప్పుడు పార్టీ పెద్దలే ర‌చ్చ చేస్తున్నారు. రేవంత్ వ్యవహారంపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పార్టీలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంమీద - రేవంత్‌ పాపాల పుట్ట పగిలిందని, భూకబ్జాల వ్యవహారం… ఆయన రాజకీయ భవిష్యత్‌ను అంధకారం చేసిందన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. టీడీపీలో ఉన్నప్పుడూ సేనియర్లందరిని సైడ్ చేసేసిన రేవంత్.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా అదే వ్యవహారశైలిని కొనసాగించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపిన ఆయన ఆ కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుపాలయ్యారు. దీనితో తెలంగాణలో టీడీపీ ఖతం అయిపొయింది. ఇక పార్టీ పరిస్థితి దిగజారాక.. తట్టాబుట్టా సర్దుకుని కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోయి.. టీడీపీని నిండా ముంచేశారు. ఇప్పుడే ఇదే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టించేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు జరుపుతున్నారు. పీసీసీ పదవిపై ఎప్పటినుంచో కన్నేసిన రేవంత్.. ఇప్పటికే ఢిల్లీలో మేనేజ్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పొందారు. ఇక నెక్స్ట్ టార్గెట్ పీసీసీ పోస్ట్.. దీని కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సమయంలోనే గోపన్‌పల్లి భూదందాలో అడ్డంగా దొరికిపోయారు. దీంతో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు పండ‌గ చేసుకుంటూ టీవీ టిబేట్‌ల‌లో వేడిపుట్టిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో ఉండి పర్సనల్‌ అజెండానే వర్క్‌గా మార్చుకున్నారంటూ సీనియర్లు ఈసడించుకుంటున్నారు. అస‌లే తెలంగాణలో కాంగ్రెస్ కష్టాల్లో ఉంది. ఎన్నికలు ఏవైనా గెలుపు పాచిక.. ఒక్కటీ పారడంలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీని ధీటుగా ముందుకెలా తీసుకెళ్లాడానికి కొత్త వ్యూహాలు అమలు చేయాలి. కానీ, అందుకు భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీనియర్లు అంటున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటే.. విభిన్నరకాల ఆలోచనలు, వాటిని వ్యక్తం చేసే పార్టీ పరమైన స్వేచ్ఛ అంటుంది. కానీ.. సొంత అజెండాను పార్టీ జెండాకు అంటించి, అదే సిద్ధాంతం, అదే నినాదం అని రెచ్చిపోతే.. అసలుకే ఎసరొస్తుందన్నది సీనియర్ల మాట. రేవంత్‌ తీరుతో పార్టీకి కోలుకోలేని నష్టమన్న రియలైజేషన్‌లోకి కాంగ్రెస్ సీనియర్లు వచ్చినట్లు తెలుస్తోంది.

కన్నా గారూ.. ఏంటి సార్.. ఈ ట్విట్టర్ పోస్టులు?

భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ.. కానీ ఆ పార్టీ అధికార ట్విట్టర్ ఎకౌంట్ లో చేస్తున్న చవకబారు వ్యంగ్య వ్యాఖ్యానాలు  మాత్రం ఆ పార్టీ పరువుని  పడేస్తున్నాయి. కరోనా సమయం లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటె, ఆయన ఏ రకం గా హడావుడి చేస్తారు అనే దాని మీద చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ బీ జె పీ ని ఇరుకున పడేసింది. " ఒక బాధ్యతాయుతమైన పార్టీ తరపున ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక ట్వీట్ చేసేటప్పుడు కనీస సంస్కారం ఉండాలనే స్పృహ కూడా లేకుండా, వైసీపీ కంటే సంస్కారహీనమైన దిగజారుడు స్టేట్మెంట్లు ట్వీట్లు చేస్తుంటే మిమ్మల్ని (బీజేపీని) మెమెందుకు గౌరవించాలి? అంటూ ప్రస్తుతం బీ జె పీ మీద నెటిజెన్లు దాడుల వర్షం కురిపిస్తున్నారు," అంటూ నెటిజెన్లు  విమర్శిస్తున్నారు.     ఒక జాతీయపార్టీ పేరుతో ఇటువంటి చిల్లర లేకి పనులు చిల్లర వేషాలు దిగజారుడు ట్వీట్లు చేస్తున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో కనీస గుర్తింపు గౌరవం మర్యాదలేకుండా అనాధలకంటే హీనంగా దయనీయంగా తయారయ్యింది బీజేపీ పరిస్థితి.! " అసలు ఆయన ఉండి  ఉంటె, కరోనా పై కత్తి యుద్ధం చేసి, దాన్ని  ముందే తరిమి కొట్టే వాడు ... కరోనా వైరస్ మందును యిట్టె కనిపెట్టేసి ప్రపంచాన్ని కాపాడే వాడు ..అసలు ఆ రివ్యూ మీట్లు..ఆభజనలు.. ఆ డాక్టర్లను మందలిస్తున్నట్టు వీకెండ్ కథనాలు... అబ్బబ్బబ్బా ....", అంటూ ఆంధ్ర ప్రదేశ్ బీ జె పి చేసిన పోస్టు  సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. రాజకీయ పార్టీలు విధాన పరమైన నిర్ణయాలపైనో, రోజూ వారీ సంఘటనలు, అంశాలపైనా సోషల్ మీడియా పోస్టింగులు పెట్టుకుంటే, పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ, అదే పనిగా  ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. పెట్టె పోస్టులు మాత్రం కచ్చితం గా ఇబ్బంది పెట్టె అంశాలే. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ బీ జె పి ఏ రకంగా స్పందిస్తుంది వేచి చూడాలి మరి.

చట్టాల అమలుపై డీజీపీయే కోర్టుతో చెప్పించుకుంటే ఎలా?

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో హైకోర్టు డీజీపీని కోర్టుకి పిలిచి మ‌రీ చివాట్లు పెట్టింది. ఇదేం పద్ధతి అంటూ డీజీపిని హైకోర్టు సూటి ప్రశ్నలతో క్లాస్ పీకింది. మీరు రాష్ట్రానికి డీజీపీ అన్న సంగ‌తిని గుర్తుచేసింది. ఉదయం 10.25 గంటల నుంచి 4 గంటల వరకు కోర్టులోనే డీజీపీ పిలుపు కోసం నిరీక్షించారు. ఆయనతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా కోర్టులోనే రోజంగా గ‌డిపారు. ఈ నెల‌లో డీజీపీ కోర్టుకు హాజ‌రు కావ‌డం ఇది రెండోసారి. CRPC 151 కింద నోటీసులు ఎలా ఇస్తారో వివరించాలని డీజీపీని హైకోర్టు ప్ర‌శ్నించింది. దీనిపై డీజీపీ నీళ్లు న‌మ‌ల‌గా CRPC 151 సెక్షన్ ఆర్డర్ చదవాల‌ని జ‌డ్జి ఆదేశించారు. ఆయన చదివి వినిపించారు. ఆ తర్వాత... ఆ సెక్షన్‌ కింద విశాఖ డీసీపీ ఇచ్చిన నోటీసును కూడా డీజీపీతో చదివించారు. అనంతరం, విచారణ ప్రారంభం అయింది. చట్టాల అమలుపై సాక్షాత్తు డీజీపీయే కోర్టుతో చెప్పించుకుంటే ఎలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మున్ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ జోక్యం తప్పదని, ఈ వ్యవహారాలపై తగు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని జ‌డ్జి అడ‌గ‌గా, కోర్ట్ ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ వివ‌రించారు. త‌ప్పుచేసిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కోర్టు ఆర్డ‌ర్ అవ‌స‌రంలేద‌ని, మీరు ముందు చర్యలు తీసుకోండి మా నిర్ణ‌యం మేము వెల్ల‌డిస్తామ‌ని కోర్టు పేర్కొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఎందుకు రూల్ ఆఫ్ లాని పాటించ‌లేద‌ని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో CRPC 151 కింద నోటీసులు ఇచ్చారా అని నిల‌దీసింది. దీనిపై డీజీపీ మౌన‌మే స‌మాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి పోలీస్, న్యాయ వ్యవస్థలు చట్టాన్ని న్యాయాన్ని మాత్రమే అమలుపరచాలన్న ధర్మాసనం పేర్కొంది. రూల్ ఆఫ్ లాని ఎందుకు అమ‌లు చేయ‌డంలేదంటూ ప్ర‌శ్నించ‌గా, డీజీపీ ఏదో చెప్ప‌బోయారు. జ‌డ్జి జోక్యం చేసుకొని రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 పేరుతో వందలాది మంది పోలీస్ ల మోహరింపును ప్రస్తావించింది. రాజ‌ధానిలో కూడా మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక‌పై రూల్ ఆఫ్ లా త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. రూల్ ఆఫ్ లా పాటిస్తాన‌ని కోర్టుకు డీజీపీ తెలిపారు. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ త‌న వాద‌న వినిపించేందుకు ప్ర‌య‌త్నించ‌గా కోర్టు సున్నితంగా తిర‌స్క‌రించింది. విశాఖలో ఏ అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను సీజే వాయిదా వేశారు. విశాఖ ఉదంతం అనంతరం... చంద్రబాబుకు తగిన భద్రత కల్పించాలని, ఆయన పర్యటనలు, శాంతియుత నిరసనలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేలా పోలీసుల్ని ఆదేశించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే టి.శ్రావణ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌ గురువారం త్రిసభ్య ధర్మాసనం ముందు హాజరయ్యారు. డీజీపీ వ్య‌వ‌హార‌శైలిపై, కొంత‌మంది పోలీసు అధికారులు సైతం గుర్రుగా వున్నారు. డీజీపి నిర్ణ‌యాల‌కు తాము న్యాయ‌స్థానం ముందు దోషులుగా నిల‌బ‌డాల్సి వ‌స్తోంద‌ని అస‌హ‌నంతో వున్నారు.

నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా...

పూజల్లేక బూజు పట్టి ఉన్నా కానీ, నైవేద్యం పెట్టు నా  మహిమ చూపిస్తా అన్నాట్ట వెనుకటికో పాడుబడ్డ గుడి లో ఉన్న దేవుడు.!! సరిగ్గా ఇప్పుడు ఏ.బీ. వెంకటేశ్వర రావుది అదే  పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎప్పుడైతే పూజలు చేయటం మానేసిందో, తర్వాత ఆయన్ను పట్టించుకున్న నాధుడు లేడంటే అతిశయోక్తి కాదేమో... తానొక పోలీస్ ఆఫీసర్ని అనీ, తనకొక యూనిఫామ్ ఉంటుందనీ, ఇంకా తాను ప్రభుత్వానికే తప్పించి పార్టీ కి లేదా ఒక పార్టీ ప్రయోజనాల కోసం పని చేయకూడదనీ తెలిసి కూడా, ఒళ్ళు హూనం చేసుకుని మరీ తెలుగు దేశానికి, ఆ పార్టీ అధినేత కు 24X 7 సేవలందించిన ఏ.బీ.వెంకటేశ్వర రావు ను ఈ రోజు 'ఏమండీ ఏ.బీ. గారూ ఎలా ఉన్నారు,' అని పలకరించే దిక్కే లేకుండా పోయింది. తూచా తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడిచిన అప్పటి డి.జి. పి . ఆర్. పి. ఠాకూర్ మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయిపోయి, ఎదో సింగిల్ రూమ్ ఉన్న ఆఫీసు లో డి.జి. (స్టాంప్స్, స్టేషనరీ) లాంటి పోస్ట్ వెలగబెడుతున్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు భక్తుడే కానీ, మరీ ఏ.బి. మాదిరి ఒళ్ళంతా వీర తాడులు, చెర్నా కోలా దెబ్బల వాతలు తగిలించుకుంటా అయితే ఉద్యోగం చేయలేదు. వ్యవహార జ్ఞానం ఉన్నవాడు  కావటం చేత కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయటం తో వై ఎస్ ఆర్ సి పి  అధినేత దృష్టి లో అంతగా చెడ్డ కాకుండా, ఎదో 'అహ నా పెళ్ళంట' సినిమా లో బ్రహ్మానందం రోల్ లాంటి ఒక పోస్టు లో ఇమిడిపోయి, కాలం వెళ్ళాం దీస్తున్నారు. ఎటొచ్చీ రెంటికీ చెడ్డ రేవడి లా మిగిలిపోయింది ఏ.బీ. వెంకటేశ్వర రావు గారే. ఇంట లావు కేసులు పెట్టి అధికార వై ఎస్ ఆర్ సి ఫై ఆయన్ను ఇబ్బంది పెడుతుంటే, కనీసం పరామర్శ కు కూడా రాని  తన మాజీ బాస్ నాయుడి గారి వైఖరిపై ఏ.బీ. గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిజానికి ఏ.బీ కూడా తన మానాన తాను తెలంగాణాలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే, ఈ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం లాంటి కేసులు పెట్టడం, దానికి తోడు లంక రాజ్యం లో విభీషణుడిలా -విజయవాడ ఎం.పి కేశినేని నాని తన-శత్రు శిబిరం లో వాడి మాదిరి వ్యవహరించటం ఏ.బి. ని కలవరపెడుతున్న అంశాలు. విదేశాలకు  నిఘా రహస్యాలను చేరవేయడం, నిఘా పరికరాల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టకాలం దాపురించినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో ఏబీని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖతో పాటు క్యాట్ కూడా సమర్ధించడంతో ఇక ఏబీకి దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న ఏబీపై ఛార్జిషీట్ కూడా దాఖలైతే ఆయన కెరీర్ ఇక ముగినట్లేనని చెప్పవచ్చు. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక అదనపు డీజీ హోదాలో విజయవాడ పోలీసు కమిషనర్ గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. కృష్ణాజిల్లాకే చెందిన ఏబీని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏరికోరి ఆ పోస్టులో నియమించింది. దీంతో విజయవాడ నగరంలో టీడీపీ నేతలతో ఆయన సాన్నిహిత్యం పెరిగింది. అప్పుడే అమరావతి రాజధాని కావడం, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేయడం, ఇదంతా ఇంటిలిజెన్స్ వైఫల్యంగా పరిగణించి అప్పటి ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న అనురాధపై చంద్రబాబు వేటు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా అనతికాలంలోనే బాధ్యతలు చేపట్టారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఛీఫ్ అయ్యాక అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఆయన ఇచ్చే నివేదికపై ఆధారపడటం మొదలుపెట్టింది. దీంతో నిఘా వ్యవస్ధను మరింత పటిష్ట పరిచే క్రమంలో ఏబీ ఇజ్రాయెల్ కు చెందిన ఓ ప్రైవేటు సంస్ద నుంచి అత్యాధునిక నిఘా పరికరాలను తన కుమారుడికి చెందిన సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించి మరీ తెప్పించారు. కొనుగోలుకు అనుసరించిన ప్రక్రియపై ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు ఏబీ. ఆ తర్వాత సదరు నిఘా పరికరాలతో టీడీపీ మంత్రుల కదలికలపైనా ఏబీ నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఆయన్ను నిఘా ఛీఫ్ గా కొనసాగించారు. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఏబీ పూర్తి నమ్మకస్తుడిగా మారిపోయారు. దీంతో చంద్రబాబు ఆయనకు టీడీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యతల్లో అనధికారికంగా వాడుకున్నారు. ఇందులో అప్పటి నిఘా నివేదికల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేసిన ఏబీ.. పలుచోట్ల అభ్యర్ధుల ఎంపికలో వివాదాలు తలెత్తినా వాటిని చొరవతో పరిష్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర్రంలో మరోసారి టీడీపీ గెలవబోతోందని ఏబీ ఇచ్చిన నివేదికలు చంద్రబాబులో సంతోషం నింపగా... పార్టీ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాష్ట్రంలో టీడీపీ గెలవబోతోందనని చెప్పిన ఏబీ... విజయవాడ ఎంపీ స్ధానంలో మాత్రం పార్టీ అభ్యర్ధి కేశినేని నాని ఓడిపోతున్నట్లు నివేదిక ఇచ్చారు. దీనిపై ఇప్పటికీ నాని ఆగ్రహంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలవబోతోందని ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఏబీ ఇచ్చిన నివేదికలు దారుణంగా విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో చంద్రబాబు దగ్గర ఆయన పలుకుబడి సైతం అంతే వేగంగా ఆవిరైపోయింది. దీంతో చంద్రబాబుకు ఆయన దూరమైపోయారు. అదే సమయంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు సహకరించే క్రమంలో తమను టార్గెట్ చేశారనే నెపంతో వైసీపీ నేతలు ఆయనపై పగబట్టారు. ఇలా కొండవీటి చేంతాడు అంతున్న ఏ.బీ. వీర గాధను వినే వారు లేక, పఠించే వారు లేక ...ఆయన ప్రస్తుతం పూజల్లేకుండా పోయి బూజు పట్టిన దేవుడు చందాన మిగిలిపోయారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి, తెలుగు దేశాధినేత చంద్రబాబు నాయుడు , ఏ.బీ. ని రక్షించేందుకు ముందుకు రారని ఏ.బీ. కి, ఆయన సన్నిహితులకు పూర్తిగా అర్ధమైపోయింది.

నేను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని కాను.. ఆ అభ్య‌ర్థిని త‌యారుచేస్తాను: ర‌జ‌నీకాంత్‌

ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై త‌న‌కు ఏనాడూ వ్యామోహం లేద‌ని త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ స్ప‌ష్టం చేశారు. వ్య‌వ‌స్థ‌లో మార్పు కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. గురువారం చెన్నైలో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న తాను పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటానే కానీ, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఉండ‌న‌ని, ప్ర‌జ‌ల‌కు 'అన్న‌' లాగా ప‌నిచేసే అభ్య‌ర్థిని త‌యారుచేస్తాన‌నీ ప్ర‌క‌టించారు. సీఎం ప‌ద‌విపై త‌న‌కు వ్యామోహం ఉంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. త‌న ప్ర‌సంగంలో ఏక‌వ్య‌క్తి పాల‌న‌ను ర‌జ‌నీకాంత్ గ‌ట్టిగా వ్య‌తిరేకించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీల‌న్నీ ఏక వ్య‌క్తి కేంద్రంగా ప‌నిచేస్తున్నాయ‌నీ, ప్ర‌భుత్వాన్ని న‌డిపే వ్య‌క్తే పార్టీ అధ్య‌క్షుడిగా కూడా ఉంటున్నాడ‌ని ఆయ‌న అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అంత‌ర్గ‌తం ప్ర‌జాస్వామ్యం ఉండ‌టం లేద‌న్నారు. సీఈఓ త‌ర‌హాలో ఒక వ్య‌క్తి ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తుంటే, ఇంకో వ్య‌క్తి పార్టీని న‌డిపించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ర‌జ‌నీకాంత్ అన్నారు. రాజ‌కీయాల్లోకి విద్యావంతులు, నిజాయితీప‌రులు రావాల‌ని ఆకాంక్షించారు. తను ప్రారంభించ‌బోయే పార్టీలోకి వ‌చ్చేవారికి విద్యాప్ర‌మాణాలు, వ‌య‌సు కీల‌కంగా ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 60 నుంచి 65 శాతం యువ‌త‌కే అవ‌కాశం ఇస్తామ‌న్నారు. ఎక్కువ‌గా 50 ఏళ్ల లోపు ఉన్న‌వాళ్ల‌నే పార్టీ అభ్య‌ర్థులుగా నిల‌బెడ‌తామ‌న్నారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో విప్ల‌వం తీసుకురావ‌డంలో తానొక చిన్న భాగ‌మ‌వుతాన‌ని ఆయ‌న చెప్పారు. జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి వంటి ఉద్ధండ రాజ‌కీయ‌నేత‌ల మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడులో రాజ‌కీయ శూన్యం ఏర్పడింద‌నీ, వాళ్ల స్థానాల్ని పూరించే పెద్ద నాయ‌కులెవ‌రూ ఇప్పుడు లేర‌నీ ర‌జ‌నీకాంత్ అన్నారు.

చిన్నాన్న అలక తీర్చిన చిన్నోడు...

ఏంటి బాబాయి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు.. నువ్వు రాజ్యసభ సీటు ఇవ్వలేదు కదా, నీ పార్టీ మీద అలుగుదామనుకుంటున్నాను.... ఇందులో అలిగేదేముంది బాబాయ్... వచ్చే ఏడాది కొత్త ఖాళీలు వస్తాయి గదా అప్పుడు చూద్దాంలే .... అంటూ టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ని, జగన్ మోహన్ రెడ్డి సముదాయించారట. అయినా బాబాయ్ గారి అలక తీరలేదట.  పార్టీ నుంచి రాజ్యసభకు తనకు పంపకుండా వేరే వారిని పంపించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల‌ సమయంలో ఒంగోలు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న తనకు సీటు ఇవ్వకుండా ‘మాగుంట శ్రీనివాసరెడ్డి’కి సీటు ఇస్తున్నప్పుడు తనకు ‘రాజ్యసభ’ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని, దాంతో తాను సిట్టింగ్‌ సీటు వదులుకుని త్యాగం చేస్తే...ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వలేదని ఆయన చిరాకుపడుతున్నారట. వాస్తవానికి ఈ సారి పార్టీ నుంచి నలుగురికి రాజ్యసభ సీట్లు ల‌భిస్తాయని, తనకు తప్పకుండా సీటు వస్తుందని ‘వై.వి’ ఆఖరు నిమిషం వరకు భరోసా పెట్టుకున్నారు. ఈ మేరకు మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ‘అయోధ్యరామిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి’ల‌కు ఖచ్చితంగా ఇస్తారని, మిగతా రెండు అప్పటి పరిస్థితును బట్టి నిర్ణయం తీసుకుంటారని పలు ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. దీంతో తనకు ఖాయమనే భావనతో అభ్యర్థుల‌ లిస్టు ప్రకటించే రోజు ఉదయమే తన అనుచరుల‌తో ‘వై.వి’ సమావేశమయ్యారు.  ‘వై.వి’ కూడా అదే భరోసాతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అభ్యర్థల‌ పేర్లు మీడియాకు ఇచ్చిన తరువాత...ఆయన ఎవరినీ కల‌వకుండా నేరుగా తన ఇంటికి వచ్చేశారు. అక్కడ గుమికూడిన కార్యకర్తల‌ను కానీ, అభిమానుల‌ను కానీ ఆయన పల‌కరించకుండా ఇంట్లోకి వెళ్లి తన రూమ్‌లోకి వెళ్లిపోయారట. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు తమ నాయకుడికి సీటు రాలేదని, ఆ బాధతో ఆయన ఉన్నారని తెలుసుకుని ఒక్కొక్కొరే అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఇది ఇలా ఉంటే తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చిన ‘వై.వి’ టీటీడీ అధికార వాహనం ఎక్కకుండా ప్రైవేట్‌ వాహనంలో బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆయన అలిగారని అక్కడే ఉన్న కార్యకర్తలు, అభిమానులు చర్చించుకున్నారు. మరోవైపు ‘స్థానిక’ సంస్థల ఎన్నికల‌కు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాకు ఇన్‌ఛార్జిగా ఉన్న ‘వై.వి’ ఈ ఎన్నికల‌ను పట్టించుకోవడం లేదనే మాట ఆ జిల్లా నాయకుల‌ నుంచి వినిపిస్తోంది. తనకు రాజ్యసభ ఇస్తానని ఇవ్వకపోవడంపై ఆయన అల‌కపాన్పు ఎక్కారని కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్నారు. మరో వైపు రాజ్యసభ అభ్యర్థుల‌ ఎంపిక తరువాత.‘వై.వి’ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదట. రాజ్యసభ అభ్యర్థుల‌ ప్రకటన సమయంలో కానీ, వారు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసే సందర్భంలోనూ ‘వై.వి’ వారితో కలిసి లేరట. అయితేనేమి చిన్నాన్న అలిగితే, ఆయన్ను సముదాయించటానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే రంగం లోకి దిగారంటే మామూలు సంగతి కాదు కదా...! బహుశా రెండు, మూడు రోజుల్లో వై వి సుబ్బారెడ్డి మాములు మనిషి అయిపోతారని, ఈ చిరు అలకలను  తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి చాలా సునాయాసంగా అడ్రెస్ చేయగలరని పార్టీ లీడర్లు, క్యాడర్లు చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నారు.

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన కన్నా, పవన్ కళ్యాణ్ 

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గ్రామ స్వరాజ్యం కావాలంటే ఈ స్థానిక ఎన్నికలు ఎంతో కీలకమనే, తెదేపా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిందని ఆయన దుయ్యబట్టారు.  " ఇవాళ వైకాపా దౌర్జన్యం చేస్తోంది. ప్రజా స్వామ్యం పట్ల ఏమాత్రం వైకాపాకు గౌరవం లేదు. ఏ జిల్లాలోనూ విపక్షాల సభ్యులు నామినేషన్ వేసే పరిస్థితులు లేవు. 151 మంది సభ్యులు ఉంటే ఇంత భయం ఎందుకు," అని జనసేనాధిపతి ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకోకపోవడం దారుణం. మీరు ఏ చర్య తీసుకోకపోతే మీరు ఫ్యాక్షన్ ని సమర్ధించినట్లేననీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. " పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఇలాంటి నేర పూరిత రాజకీయాలు ఎక్కువకాలం సాగవు. జనసేన, భాజపా అభ్యర్థులు ధైర్యంగా నిలబడండి," అంటూ పవన్ అభ్యర్థుల వెన్ను తట్టారు. ప్రజలు అందరు తెలుసుకోవాలినామినేషన్ వేయడానికి ఇంత చేస్తే... ఓట్లేయడానికి ముందుకు ఎవరొస్తారు. రాష్ట్రంలో పరిస్థితులకు ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలి అంటూ ఎన్నికల సంఘానికి సూచించారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు నడుపుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ ధోరణి సరిగా లేదు, ప్రజలు ఆలోచించాలి, ఈ అరాచకాలకు ముగింపు పలకాలంటే.... స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే భాజపా, జనసేన అభ్యర్థులను గెలిపించండంటూ కన్నా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, మీ నాయకులు డబ్బు, మద్యం పంచరని మీరు హామీ ఇవ్వగలరా, అని కూడా కన్నా వై ఎస్ ఆర్ సి పి నాయకత్వాన్ని ప్రశ్నిచారు. " మీ ఆర్డినెన్స్ తప్పి మీ పార్టీ నేతలే డబ్బు, మద్యం పంచితే మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతారా.," అంటూ జగన్ మోహన్ రెడ్డి ని కన్నా నిలదీశారు.  భాజపా, జనసేన కలిసి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నామని చెప్పిన కన్నా, ప్రజలు అధికార వై ఎస్ ఆర్ సి పి ఆగడాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జంక్షన్ లో జనసేన!

అవును...వారి ముగ్గురు పేర్లు ఖరారయ్యాయి....ఇక జంక్షన్ లోనే జనసేన ..... వారి ముగ్గురి పేర్లూ ఖరారయ్యాయట. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి అందుతున్న సమాచారం ఇది. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే నందిగం సురేష్ లకు కేంద్ర క్యాబినెట్ లో బెర్తులు ఖాయమని, రాజ్య సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే, తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏ క్షణమైనా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చునని, ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కు, ప్రధాని అధికార నివాసం 7, రేస్ కోర్సు రోడ్డు నుంచి సమాచారం కూడా వెళ్లిందని భోగట్టా. ఇదే జరిగితే, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి అని జన సేన లో బెంగ మొదలైంది. పవన్ ఆటలో అరటి పండేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎన్నికల సమరం ముగిసే వరకూ క్యాబినెట్ లో వై ఎస్ ఆర్ సి పి చేరికపై ఎలాంటి ప్రకటన చేయవద్దని బీ జీ పి పెద్దలు ఇప్పటికీ జగన్ హెడ్ క్వార్ట్రర్స్ కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత, పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎలా ఉంటుందనేది ఆయనే  చెపుతారని, అలాంటప్పుడు తొందరపడి ప్రకటనలు చేయకుండా ఉండటమే సబబని వై ఎస్ ఆర్ సి పి సీనియర్లు చెపుతున్నారు. నిజానికి, ఇప్పటికే  ఏపీ అధికార పార్టీ వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం ఖాయంగా కనిపిస్తోంది.పార్టీ నుండి రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో బీజేపీలోని కొందరు ముఖ్యులు ఈ అంశాన్ని చర్చించారనే సమాచారం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రిని కలిసిన సమయంలోనే ఈ నిర్ణయం ఖరారైందని తెలుస్తోంది. అయితే, ఏపీలో జనసేన తో మైత్రి కొనసాగిస్తున్న బీజేపీ.. ఇప్పుడు తమ వైసీపీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే సమాచారం పవన్‌కు షాక్ గా భావిస్తున్నారు. అదే జరిగితే పవన్ బీజేపీతో సైతం దూరం అవ్వటం ఖాయమని తెలుస్తోంది. అసలు ఇంతకీ..ఈ మొత్తం వ్యవహారంపైన ఢిల్లీలో ఏం జరుగుతోంది...వైసీపీ నుండి ఎవరికి అవకాశం దక్కనుంది.. 2014 ఎన్నికల తరువాత టీడీపీ..బీజేపీతో పొత్తు..తరువాతి పరిణామాలతో రాజకీయంగా టీడీపీ నష్టపోయిన విధానంతో తాము జాగ్రత్తగా ఉండాలని తొలుత వైసీపీ భావించింది. అయితే, స్వయంగా బీజేపీ పెద్దల నుండే కేంద్ర కేబినెట్ లో చేరాలని ఆహ్వానం వచ్చినా..ముఖ్యమంత్రి జగన్ సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఇక, ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో..ఇటు ఏపీలో మారుతున్న సమీకరణాలతో కేంద్ర కేబినెట్ లో చేరాలనే ప్రతిపాదన స్వయంగా కేంద్రంలో రెండో స్థానంలో ఉన్న నేత నుండి ముఖ్యమంత్రికి అందినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఎన్‌ఆర్‌సీ..ఎన్‌పీఆర్ వంటి అంశాల్లో తొలుత పార్లమెంట్‌లో సమర్ధించినా..ఇప్పుడు ఏపీలో అమలు చేయమని జగన్ స్పష్టం చేశారు. ఇక, ఇదే సమయంలో ఏపీలో పవన్ తో బీజేపీ జత కట్టటంతో వైసీపీలో ఆలోచన మారినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఆర్దిక పరిస్థితులు..అనివార్యంగా మారిన కేంద్ర సాయం..ఇతరత్రా సమస్యలతో కేంద్ర కేబినెట్ లో చేరటం వలనే నష్టం లేదనే అభిప్రాయంతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల పవన్ కళ్యాణ్ క్యాంప్ లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. బీ జె పి తో స్నేహం మొదలెట్టి రెండు నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఉత్పాతమేమిటని జన సైనికులు గొణుక్కుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ఆంధ్ర ప్రదేశ్ లో జత కట్టడానికి జన సేన కు మిగిలి ఉన్నది తెలుగు దేశం లేదా కాంగ్రెస్ పార్టీలు..అది కూడా ఆ రెండు పార్టీలు ఆంద్ర చేగువేరా ని స్వాగతిస్తేనే ...... వారెవ్వా...పాతికేళ్ల రాజకీయం ప్రామిస్ ఒకే దగ్గర పట్టుమని రెండు నెలలు కూడా ఉండలేకపోవడమేమిటి? చిత్రం కాకపోతేనూ.....

తొడ కొట్టి మరీ వైసీపీ నేతలకు సవాల్ విసిరిన తాత!!

ఏపీలో స్థానిక సంస్థల పోరు హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాలలో అధికార పార్టీ శ్రేణులు.. ఇతర పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. నామినేషన్ పేపర్లు చించివేయడం, మారణాయుధాలతో దాడులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విపక్ష పార్టీలకు చెందిన వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడ్డారు. పలువురు నామినేషన్ టైం కి వెనకడుగు కూడా వేశారు. అయితే ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు చూపించిన తెగువ మాత్రం అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీకి చెందిన అంజిరెడ్డి అనే తాత చూపిన తెగువ.. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, ధైర్యం నింపేలా ఉందని టీడీపీ నేతలు ప్రశంసిస్తున్నారు. టీడీపీ తరపున ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు చేసేందుకు అంజిరెడ్డి మండల కార్యాలయానికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు అంజిరెడ్డిని చుట్టుముట్టి నామినేషన్ పత్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. అయినా ఏ మాత్రం భయపడని అంజిరెడ్డి.. తొడ కొట్టి సవాల్ విసిరారు. చేతనైతే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కానీ, ఇలా రౌడీయిజం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ హెచ్చరికతో రెచ్చిపోయిన అధికార పార్టీ కార్యకర్త.. పక్కనే రాడ్ తీసుకొని దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన మీద దాడి చేయడానికి వచ్చినా అంజిరెడ్డి ఏ మాత్రం భయపడకుండా అలాగే ధైర్యంగా నిలబడ్డారు. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాత చూపిన తెగువకి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.