కరోనా బాధితులను కలిస్తే…

భారత్ లో కరోనా వైరస్ తో ఇద్దరు మరణించారు. మరో 85 మంది వైరస్ భారీన పడటంతో కేంద్రం అప్రమత్తమైంది..ఒక వైపు కరోనా వ్యాధి గ్రస్తులకు అవసరమైన చికిత్స అందిస్తూనే, మరో వైపు ఈ వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ ఈ స్వీయ నియంత్రణ పద్దతలు పాటించాలని ప్రజలను స్వయంగా మోడీ తన ట్విట్టర్ ద్వారా ప్రజలను కోరారు.. క‌రోనా బాధితుల‌ను క‌లిసి వ్య‌క్తులు ఇవి పాటించాలి. స్వీయ గృహనిర్బంధంలో భాగంగా వ్యక్తులు గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే సింగిల్ రూమ్ లో ఉండాలి. ఆ గదికి అటాచ్డ్ టాయిలెట్ ఉంటే మంచిది. ముఖ్యంగా, ఆ ఇంట్లో ఉన్న వృద్ధులకు గర్భవతులకు ఎడం పాటించాలి. పిల్లలు, ఇతరులతో కలివిడిగా ఉండరాదు. ఇంట్లో తన కదలికలను సదరు వ్యక్తి నియంత్రించుకోవాలి. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకాకపోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలావరకు నియంత్రించినవారవుతారు. ప్రాథమిక శుభ్రత గురించి చెప్పాల్సి వస్తే…. తరచుగా సబ్బుతో, శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వ్యక్తి ఇంట్లోని ఇతర వస్తువులను కడగడం, అంట్లు తోమడం, దుస్తులు ఉతకడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి. అన్నివేళలా మాస్కు ధరించాలి. ప్రతి 6 గంటలకు ఓ సారి మాస్కును మార్చుతుండాలి. ఓసారి వాడిన మాస్కును మరోసారి ధరించరాదు. కరోనా లక్షణాలు బయటపడ్డాయని భావిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించడం కానీ, 011-23978046 నంబరుకు ఫోన్ చేయాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు స్వీయ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని కేవలం ఒక వ్యక్తి మాత్రమే పర్యవేక్షణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తితో కరచాలనం చేయడం, నేరుగా తాకడం చేయరాదు. ఆ వ్యక్తి గదిని శుభ్రపరచాల్సి వచ్చినప్పుడు చేతులకు గ్లోవ్స్ ధరించాలి. గ్లోవ్స్ తీసేసిన తర్వాత విధిగా చేతులు శుభ్రపరుచుకోవాలి. సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. ఒకవేళ ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు వెల్లడైతే, ఆ వ్యక్తి సన్నిహితులను కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం తప్పనిసరి. ఆ వ్యక్తి గదిని 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి. టాయిలెట్లను ఫినాయిల్, బ్లీచింగ్ దావ్రణాలతో పరిశుభ్ర పరచాలి. ఆ వ్యక్తి దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతకాలి.

కంచి లో చేసే దొంగతనానికి కాళహస్తి నుంచే దండాలు పెట్టుకుంటూ వెళ్లినట్టు...

కంచి లో చేసే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్లినట్టు, బీ జె పీ తో  కలిసి 2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం సృష్టించటం కోసం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే అమిత్ షా ను ఆకాశానికెత్తేస్తూ, జగన్ మోహన్ రెడ్డి ని మాత్రం ఓ రేంజ్ లో మాటలతో ఆడుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, హిట్లర్‌లా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లను నిష్పక్షపాతంగా జరిపిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. దాన్ని చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. ఆధునిక హిట్లర్‌కు ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని అన్నారు. రౌడీయిజానికి, గుండాయిజానికి అధికార పార్టీ నాయకులు కేరాఫ్‌గా నిలిచారని చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండబోదని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆధునిక ఉక్కుమనిషిగా అభివర్ణించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నాయకుడిగా కితాబునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అత్యంత శక్తిమంతుడిగా ఎదిగారని, ఇప్పుడు అమిత్ షా ఆ స్థాయికి చేరుకున్నారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హిట్లర్‌తో పోల్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత అంత బలమైన అమిత్ షా కోరిన కోరికను తాను తిరస్కరించానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరారని, తాను కుదరదని కుండబద్దలు కొట్టానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ అవసరం ఉందని, అందుకే బీజేపీలో విలీనం చేయదలచుకోలేదని చెప్పారు. జనసేన అనే ఉనికి కోల్పోతే పవన్ కళ్యాణ్ లేడని అన్నారు. పార్టీ ఉనికిని తాను ఎప్పుడూ కాపాడుతానని, ధికారం వచ్చినా రాకపోయినా ఉనికి మాత్రం కోల్పోబోమని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు వెంపర్లాడాయని, తాము మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. దేశ సమగ్రతను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడటం.. అధికార మదాన్ని చాటి చెబుతోందని విమర్శించారు. అధికారం తమ చేతుల్లో ఉందనే కారణంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన అభ్యర్థులపై ఇష్టారాజ్యంగా దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునే శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని, తమ బలాన్ని నిర్వీర్యం చేయడానికి అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కరోనా దెబ్బకు ఏపీలో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ఆదేశం  పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం కారణం గా ,సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని, ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా, అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల, ఎస్పీలనును విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశించింది. మాచర్ల ఘటనలో సీఐను వెంటనే సస్పెండ్‌ చేయాలని, కొంతమంది పోలీసు అధికారులపై చర్యలకు ఈసి ఆదేశించింది. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, తిరుపతి, పలమనేరు, తాడిపత్రి రాయదుర్గం సిఐలను బదిలీ చేయాలని కూడా ఆదేశించింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరమైతే ఎన్నికలను రద్దుచేసేందుకు పరిశీలించాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.  మహిళా అభ్యర్దులు, బీసీ అభ్యర్దులను ఇబ్బంది పెట్టారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆరు వారాల తర్వాత దీనిపై క చ్చితంగా ఓ నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

తెలంగాణలో క‌రీంన‌గ‌ర్ ఫార్ములా!

క‌రీంన‌గ‌ర్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొన్ని టిఆర్ ఎస్ పార్టీని చిత్తు చేసిన బండి సంజ‌య్ అవే ఎత్తుగ‌డ‌ల‌తో తెలంగాణా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెస్తార‌ట‌. తెలంగాణా బిజెపి అధ్య‌క్షుడిగా ఎం.పీ బండి సంజయ్ నియామ‌కం ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఆశ‌లు రేపింది. చతికిలపడిపోయిన పార్టీకి నూత‌న ఉత్తేజం క‌ల్పించి పార్టీ శ్రేణులలో ఆత్మస్థైర్యం పెంచుతార‌నే ఆకాంక్ష వ్య‌క్తమ‌వుతోంది. యువ‌కుడైన బండి యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జెండా మోస్తున్న బిజెపి కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. బిజెపి అధిష్టానం కూడా యువకులకు అవకాశం ఇస్తోందన్న సంకేతాలిచ్చింది. ప్రజాసమస్యల పరిష్కారంపై పోరాటం, సర్కారుపై విమర్శలలో దూకుడుగా వెళ్లే సంజయ్‌కు, పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా, దశాబ్దాల తరబడి జిల్లా పార్టీ శ్రేణులలో గూడుకట్టుకున్న నిరాశను, నాయకత్వం తొలగించింది. సమర్ధులు, యువతకు అవకాశాలు ఉంటాయన్న సంకేతం ఇచ్చింది. బండి నాయ‌క‌త్వంలో ఇక బిజెపి యూత్‌కు ప్ర‌ధాన్య‌త పెర‌గ‌నుంది. రాష్ట్ర బీజేపీలో నిర్ణయాలన్నీ కేవ‌లం ఆ నలుగురైదుగురికే పరిమితం. ఈ నేప‌థ్యంలో సంజయ్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ఆస‌క్తికరంగా మారింది. సీనియర్ల స్ధానంలో యువతను ప్రోత్సహించడం, సీనియర్లతో సమన్వయం వంటి అంశాల్లో బండి సంజ‌య్ నిర్ణ‌యాలే తెలంగాణాలో బిజెపి భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించ‌నున్నాయి. యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం, సీనియ‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం, కొత్త వారిని పార్టీలో చేర్చుకోవ‌డం అనే ల‌క్ష్యాల‌తో బండి సంజ‌య్ ప‌నిచేయ‌బోతున్నార‌ట‌. అయితే పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నికైన బండికి మొద‌టి ప‌రీక్ష గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బండి మార్క చూపించ‌డానికి పాతనగరంలో పార్టీని విస్తరించే దిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందింస్తున్నార‌ట‌. పార్టీతో విబేధించి దూరమైన సీనియర్లకు, పార్టీలోనే ఉన్నా, అప్పటి చురుకుదనంతో పనిచేయడం మానేశారు. వారికి పార్టీలో స్థానం, గుర్తింపు లేదు. వారి సేవలను వాడుకోవడంలేదు. జిల్లాల వారీగా, అలాంటి వారిని గుర్తించి పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటారా? కొత్త‌గా పార్టీలో చేరిన వారికి బిజెపిలో అంత‌గా ప్రాధాన్యం, గుర్తింపు వుండ‌వు. అలాంటి వారి ప‌ట్ల బండి ఎలా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు? తెలంగాణాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ ఫార్మ‌లాని అప్లాయిచేస్తార‌ట‌!

రైలు ప్ర‌యాణంలో ఎవరి బెడ్‌షీట్లు వారే తెచ్చుకోవాలట..!

క‌రోనా దెబ్బ‌కు సెంట్రల్ రైల్వే సంచలన నిర్ణయం. ఏసీ బోగీల్లో దిండ్లు, బెడ్ షీట్లు ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నార‌ట‌. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకునే సెంట్రల్ అండ్ వెస్టర్న్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏసీ బోగీల్లో ప్రయాణించే వారు.. ఎవరి బెడ్ షీట్లు వారే తెచ్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏసీ బోగీల్లోని కర్టెన్లను మొత్తం తొలగించేశారు. దిండ్లు, బెడ్ షీట్లు ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నట్లు వెస్టర్న్ రైల్వే పీఆర్వో తెలిపారు. ఎవరైనా కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ట్రైన్ ఎక్కితే.. అప్పుడు కర్టెన్లు, దిండ్లు, బెడ్‌షీట్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపించే ప్ర‌మాదం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వెస్టర్న్ రైల్వేతో పాటుగా.. సెంట్రల్ రైల్వే ఏసీ బోగీల్లోని కర్టెన్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక త్వరలో మిగతా రైల్వే జోన్స్ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రయాణికులు ఎవరి దుప్పట్లను వాళ్లే తెచ్చుకోవచ్చని ఈ సందర్భంగా రైల్వేశాఖ సూచనలు చేసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా మృతిచెందగా.. లక్షన్నరకు పైగా ఈ మహమ్మారి సోకి చికిత్స పొందుతున్నారు.

కరోనా.. రెండునెలలకు సరిపడా షాపింగ్ ‘కరో’నా...

ఇదీ..కాదు కాదు ఇదే ప్రస్తుత హైదరాబాద్ వాసుల పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి హై లెవల్ కమిటీ సమావేశం తర్వాత మార్చ్ 31 వరకూ మాల్స్, స్కూల్స్ లాంటి జన సమూహ ప్రాంతాలన్నీ మూసి వేయాలని నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి హైదరాబాద్ వాసులు నిత్యావసరాల దగ్గర్నుంచి కనీసం ఓ రెండు నెలల వరకూ సరిపడా తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం కోసం షాపింగ్ సెంటర్ల ముందు క్యూలు కట్టారు.  నిన్నటి వరకూ మనకు రాదులే..నిశ్చింతగా ఉన్నాం..కానీ వచ్చేసింది. ఇప్పుడేంటి చెయ్యడం? ఒక వైపు మన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ఇంట్లోనే చిన్న, చిన్న చిట్కాలు పాటిస్తే చాలు కరోనా మనదగ్గరకు వచ్చే సాహసం చెయ్యదు అనే ప్రచారాల హోరు..మరో వైపు దేశంలో రెండో స్థాయికి చేరిన కరోనా అని వార్తల జోరు..మధ్యలో సామాన్యుల బేజారు..చివరికి అందరి బతుకూ బజారు. అచ్చం ఇలానే ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని, విశ్వనగారంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ లోని ప్రజల పరిస్థితి. వివిధ మీడియాలలో వచ్చే వార్తలను నమ్మాలో..ప్రభుత్వ ప్రకటనలను నమ్మాలో తెలీని ఒక విచిత్ర పరిస్థితుల్లోంచి..అదో రకమైన అయోమయ స్థితిలోకి చేరుకున్నారు.  మళ్ళీ ఎన్నటికి సాధారణ స్థితులు నెలకొంటాయో అని, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు రావాలని అందరూ తమ ఇష్ట దైవాలను మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నారు. తెలుగు వన్ ఒకటే చెప్తోంది. ప్రజలెవ్వరూ కంగారు పడకండి..వదంతులు నమ్మొద్దు..మనందరం సరైన నివారణ చర్యలు పాటిద్దాం..కరోనా మహమ్మారిని మన దరికి చేరకుండా చూసుకుందాం. ప్రతిఒక్కరం వ్యక్తిగతంగా, సమాజం పట్ల బాధ్యతగా మెలుగుదాం..కరోనా రక్కసిమీద గెలుద్దాం.

లెక్కల మాస్టారు దెబ్బకి విలవిల్లాడుతున్న ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎప్పుడో మరిచిపోయిన రాచరికాన్ని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తున్నారని,విజయసాయిరెడ్డి పట్ల అసంతృప్తిలో కూరుకుపోయారు ఉత్తరాంధ్ర బీసీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సాయి రెడ్డి పెత్తనమేనా అంటూ పెదవి విరుస్తున్నారు. సాయి రెడ్డి దెబ్బకి విశాఖ జిల్లాలో మంత్రి ఆ అవంతి  జీరో అవుతున్నారని ఆయన అనుచరులు  వేదన పసుతున్నారు.  ఉత్తరాంధ్ర ప్రజలకు రాచరికం కొత్త కాదు కానీ అది చరిత్ర.కానీ ఇప్పుడు మళ్ళీ ఉత్తరాంధ్ర లో రాచరికం అనే పదం వినపడుతుంది.అది కూడా వైకాపా నాయకుల నోటిలో ఈ పదం ఎక్కువుగా నానుతొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర  రాజకీయాల్లో 30 ఏళ్ళు చక్రం తిప్పిన బీసీ నాయకులు సైతం వామ్మో సాయి రెడ్డి అనే పరిస్థితి వచ్చింది.రాజధాని వస్తే మన హవా పెరిగిపోతుంది అని భావించిన ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు అంతా స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలతో డైలమాలో పడ్డారు.  ఉత్తరాంధ్ర బీసీ నాయకులకు సాయి రెడ్డి ఇస్తున్న షాక్ లు అన్ని,ఇన్ని కావు. తమ వర్గానికి స్థానిక ఎన్నికల్లో న్యాయం చెయ్యాలి అని భావించిన ఉత్తరాంధ్ర బీసీ నాయకులకు సాయి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.ఆఖరికి స్థానిక ఎన్నికల్లో కూడా తన కనుసన్నల్లో ఉండే నాయకత్వానికే సీట్లు ఇప్పించుకొని విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ లో తిరుగులేని శక్తిగా చలామణి కావడం స్థానిక నేతలకు మింగుడుపడటం లేదు.అసలు ఉత్తరాంధ్ర లో మంత్రులు ఉన్నారా?వారికి అక్కడ కనీస గౌరవం కూడా లేదు.ఏ చిన్న పని అయినా మంత్రి దగ్గరకి వెళ్లే వాడే లేడు అందరూ సాయి రెడ్డి కోటరీ తలుపులే  కొడుతున్నారు. దింతో ఉత్తరాంధ్ర వైకాపా నాయకత్వం ఏకతాటి పైకి వస్తుంది.స్థానికేతరుడి పెత్తనం పై తిరగబడాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మంత్రి అవంతి స్థితి అయితే  తనలో అగ్ని పర్వతం పేలిపోయే పరిస్థితికి చేరిపోయింది అని సొంత పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో చక్రం తిప్పాలని అవంతి స్కెచ్ గీసినా అందుకు సాయి రెడ్డి బ్రేకులు వేసారు.విశాఖ మేయర్ పదవి నీకే అని గతంలో జగన్ బీసీ నేత వంశి కృష్ణ యాదవ్ కి హామీ ఇచ్చారు.కానీ ఇప్పుడు సీన్ మారింది సడెన్ గా ఎమ్మెల్యే సీటు దక్కక పార్టీ కి గుడ్ బై చెప్పిన విజయ్ కుమార్ ఇప్పుడు మేయర్ అభ్యర్థి గా దాదాపు ఖాయం అయ్యింది అని చర్చ జరుగుతుంది.దింతో అసలు విశాఖ వైకాపా పయనమెటు అంటూ నాయకుల్లో చర్చ మొదలయ్యింది.రాజధాని ఏర్పాటు లో ఎలాగో మాకు వాటా దక్కడం లేదు.స్థానిక ఎన్నికల్లో కూడా స్థానికేతరుడు అయినా సాయి రెడ్డి పెత్తనమేనా అంటూ నాయకుల్లో చర్చ తారాస్థాయికి చేరుకుంది.అసలు విశాఖ జిల్లా లో వైకాపా నాయకులకు విలువ లేదు,ఏ పని కావాలన్నా సాయి రెడ్డి అంటే ఇక మేము రాజకీయాల్లో ఉండటం ఎందుకు అంటూ ఒకరి భాద మరొకరితో చెప్పుకుంటూన్నారట.

టీటీడీ సంచలన నిర్ణయం.. కంపార్ట్‌మెంట్లులో భక్తులు వేచి ఉండే పద్దతికి స్వస్తి

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ ని‍ర్ణయం ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.  అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరాలను వెల్లడించారు. ‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదు. దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది. తిరుమలని సెక్టార్ లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపట్టాము. గదులు కాళీ చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నాము. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు. సీతారాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. భక్తులు కూడా సహకరించాలి’అని తెలిపారు.

డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్‌లైన్ సేవ‌లు బంద్

ఇప్పటి వ‌ర‌కు ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీ జరపని కార్డులు, కాంటాక్ట్‌ లెస్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డులతో సోమవారం నుంచి ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేసేందుకు వీలుండదు. వీటితో కేవలం డొమెస్టిక్ లావాదేవీలు చేసేందుకే అనుమతి ఉంటుంది. అంటే ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు పాయింట్ ఆఫ్ సేల్స్‌ (పీఓఎస్‌) టెర్మినల్స్‌లో మాత్రమే కార్డులను వాడుకోవచ్చు. కొన్ని రకాల కార్డుల ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఈ నెల 16 నుంచి ఆంక్షలు విధించింది. ఖాతాదారుల డెబిట్‌, క్రెడిట్ కార్డులను మరింత సుక్షితంగా మార్చే చర్యల్లో భాగంగా ఆర్‌‌బీఐఈ నిర్ణయం తీసుకుంది. మునుపటి మాదిరిగా ఆన్‌లైన్‌ బ్యాటింగ్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకుంటే మాత్రం ఖాతాదారులు తమ బ్యాంకుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. ఈ సమాచారాన్ని అన్ని బ్యాంకులు ఇప్పటికే సంక్షిప్త సందేశాల రూపంలో తమ ఖాతాదారులకు చేరవేశాయి. ఎస్ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌లతో పాటు ఇంటర్నెంట్ ద్వారా అనుమతి తీసుకునేందుకు బ్యాంకులు అనుమతి ఇచ్చాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగడంతో క్రైం కూడా బాగా పెరిగింది. ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించే సమయంలో కార్డుల నంబర్లు దుర్వినియోగం అవుతున్న సమయంలో.. వినియోగదారులు మోసపోతున్నారు. ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్, అంతర్జాతీయ లావాదేవీలు చేయకుండా అడ్డుకట్ట వేసింది.

విశాఖలో నలుగురు క‌రోనా బారిన ప‌డ్డారా?

  కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకి ఈ కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కంగారు పుట్టిస్తోంది. ఇప్పటికే నెల్లూరు ఒక అనుమానితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరులో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ జిల్లా యంత్రాంగమంతా ప్రత్యేక వార్డులో అతడికి వైద్యం అందిస్తున్నారు. అయితే అతడికి సంబంధించిన 150 మందిని కరోనా వ్యాపించి ఉండవచ్చనే అనుమానంతో వైద్య శాఖ అధికారులు వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐసోలేషన్ వార్డులో 9 మందికి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరులో స్విమ్మింగ్ పూల్స్ మూసి వేయాలని నిర్ణయించారు. సముద్ర తీర ప్రాంతం కృష్ణపట్నం పోర్ట్ శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేశారు. తాజాగా ఇప్పుడు విశాఖపట్టణంలో కూడా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో నలుగురు ఆస్పత్రిలో చేరారు. మొత్తం 16 కేసులు నమోదు కాగా 13 నెగెటివ్ గా తేలింది. వీరిలో ఇటలీకి చెందిన వ్యక్తికి నెగటివ్ నమోదు కాగా మిగతా ముగ్గురి రిపోర్టు రావాల్సి ఉంది. ఈ వార్త సోష‌ల్ మీడియాలో గుప్ప‌మ‌న‌డంతో విశాఖవాసుల్లో భయాందోళన మొదలైంది. కరోనా వైరస్ వ్యాపించందనే పుకార్లతో ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు కరోనా భయంతో విశాఖపట్టణం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖపట్టణం- కౌలాలంపూర్ మధ్య ఎయిర్ ఏషియా విమానాలు రద్దు చేశారు. విశాఖపట్టణం-సింగపూర్ మద్య కూడా విమాన సర్వీసు రద్దు అయింది. దీంతో విమానాయానంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రజలు కూడా ప్రయాణాలు విరమించుకుంటున్నారు. ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖపట్టణంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానితులకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భం గా విశాఖపట్టణం రైల్వే స్టేషన్ లో కరోనా హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు. మాస్కులు ధరించాలని ఆటో డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. అంతే కాదు దేవాలయాల్లో కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సింహాచలం దేవాలయంలో భక్తులకు మాస్కులు పంపిణీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 18వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

జగన్ పార్టీ కూడా మాతో పొత్తుకు ప్రయత్నించింది:  నాదెండ్ల మనోహర్

ప్రతి కాలానికి జ్ఞానం ప్రబోధించటానికి బ్రహ్మం గారి లాంటి వారు ఒకరు పుడుతుంటారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తే నాదెండ్ల మనోహర్. తండ్రి భాస్కర రావు గారి చల్లని నీడలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈయన, మేధావుల కోటాలో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికై, చాలా బరువైన బాధ్యతలు నిర్వర్తించారు . తర్వాతి కాలం లో లింగమనేని రమేష్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ కు దగ్గరై జన సేన లో నెంబర్ 2 గా ఎదిగారు. చంద్రబాబు నాయుడు తో వైరుధ్యం ఉన్నపటికీ, దాన్ని శత్రుత్వం గా మలుచుకోవాలనే కోరిక ఈయనకు లేదు కాబట్టి, తెలుగు దేశానికి కూడా కావలసిన వ్యక్తిగా ఈయన జన సేన ను టీ డీ పీ -2 గా మలచటం లో కీలక భూమిక పోషించారు, సరిగ్గా, ఈ సమయం లోనే, పవన్ కళ్యాణ్ కు ఉన్న కన్ఫ్యూషన్ కి మరింత వాల్యూ ఎడిషన్ చేసిన మంచి టైమింగ్ ఉన్న నాయకుడు గా నాదెండ్ల మనోహర్ ఎదిగారు. ఆయన పుణ్యమా అని జన సేన ఆరంభం నుంచి ఉన్న కీలక నేతలందరూ , ఇతర పార్టీలకు సర్దుకున్నప్పటికీ .....పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన హవా మాత్రం 'కరోనా వైరస్ ' అంత  వేగం గా వ్యాపిస్తోంది. రాజమండ్రి లో ఆయన జన సేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆయన చేసిన అనుగ్రహభాషణం లో దొర్లిన ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాం. 'గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడానికి కారణాలున్నాయి. ఈ విషయాన్ని మూడు నెలల నుంచి బహిరంగంగానే మాట్లాడుతున్నాం' అని చెప్పారు నాదెండ్ల మనోహర్. 'చాలా పార్టీలు వచ్చి మాతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశాయి. ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కూడా ప్రయత్నించింది. కానీ, ఆ రోజు మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. కచ్చితంగా యువత కోసం, ఒక తరానికి ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలి తప్పా ఒక ఎన్నికల కోసం రాజకీయాలు చేయకూడదని కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు' అని నాదెండ్ల తెలిపారు.'ప్రత్యేకంగా కొందరు యువకులను ఎంపిక చేసి పోటీ చేయించారు. అటువంటి రాజకీయాలు చేస్తున్నాం. వేరే పార్టీల్లో ఏముంది చెప్పండి? మొదట 10 కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయమని అభ్యర్థులకు చెబుతున్నారు. అటువంటి వారు సమాజానికి ఉపయోగపడతారా?' అని ప్రశ్నించారు. 'ఏపీకి విభజన తర్వాత జరుగుతోన్న అన్యాయంపై పోరాడే వారు ఎక్కడున్నారు ఈ రాజకీయాల్లో? ఎక్కువ ప్రాధాన్యత యువతకే ఇద్దామని పవన్‌ కల్యాణ్ పదే పదే చెబుతారు. స్వార్థ  రాజకీయాలు చేయొద్దనే సిద్ధాంతంలో ముందుకు వెళ్తున్నాం' అని చెప్పారు.

అమెరికా వీసా ప్రాసెస్ బంద్‌!

అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా వైరస్ ధాటికి వణికిపోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇండియాలోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్ అన్ని వీసా అప్పాయింట్ మెంట్లను ఈ నెల 16 వరకు రద్దు చేసింది. ఈ మేరకు యు.ఎస్ .ఎంబసీ ప్రకటన చేసింది. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కరోనాను నిలువరించ‌డానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పుడా దేశం నడుం బిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని నిలువరించటం.. వారిపై వీసా ఆంక్షలు విధించటం చేస్తున్నారు. అంతేకాదు.. అమెరికాకు ప్రయాణాలు పెట్టుకున్న వారు తమ జర్నీని పోస్టుపోన్ చేసుకోవాలన్న సూచన చేస్తున్నారు. అంతే కాదు తమ దేశంలోకి విదేశీయుల్ని అడుగు పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ లో సోమవారం నుంచి వీసాల జారీ కార్యక్రమాన్ని నిలుప వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇమ్మిగ్రెంట్.. నాన్ ఇమ్మింగ్రెండ్ వీసా అపాయింట్ మెంట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి డేట్ వచ్చే వరకు వీసాల జారీ కార్యక్రమాల్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పై ఎలాంటి వీసా సర్వీసులు ఉండవని చెబుతున్నారు. ఈ నేపథ్యం లో వీసా అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవాలన్న సూచన వినిపిస్తోంది. భారత్ లోని అన్ని అమెరికన్ కాన్సులేట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ వీసాల మీద ఆశలు పెట్టుకున్న వారికి కరోనా భారీ షాకిచ్చినట్లే. ఈ నేప‌థ్యంలో అమెరికాలోని ఇండియన్ స్టూడెంట్స్ త‌మ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ విజ్ఞ‌ప్తి చేసింది. అమెరికాలోని పలు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో 2 లక్షలకు పైగా భారత విద్యార్ధులున్నారు. వైరస్ నివారణ, నియంత్రణల గురించి ఎంబసీ వెబ్ సైట్ ను చూడాలని కోరింది.

సీఏఏను వ్యతిరేకించేవారిని అణ‌చ‌డానికే ఢిల్లీ దంగా! మైనారిటీస్ కమిషన్ నివేదిక‌

పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే దిల్లీలో అల్లర్లను చేయించారని దిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడేందుకు కొన్ని వారాలుగా ఏర్పాట్లు జరిగాయని, ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ వరకూ దిల్లీలో జరిగిందంతా 'ఏక పక్ష దాడి' అని జఫారుల్ ఇస్లామ్ ఖాన్ బిబిసికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. 50 ఇళ్లు ఉన్న వరుసలో కేవ‌లం మార్కింగ్ చేసి ఐదు ఇళ్లను తగులబెట్టడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. ''30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు ముఖాలు దాచుకునేందుకు హెల్మెట్లు ధరించి ఈశాన్య దిల్లీపై పడ్డారు. అక్కడే 24 గంటలపాటు ఉండి, విధ్వంసానికి పాల్పడ్డారు. మనుషుల్ని చంపారు. ఇళ్లను, దుకాణాలను లూఠీ చేశారని మైనారిటీస్ క‌మిష‌న్ తెలిపారు. త‌మ బృంధం ఈశాన్య దిల్లీని సందర్శించిన తర్వాత మార్చి 2న మైనార్టీస్ కమిషన్ ఓ నివేదిక విడుదల చేసిందని, అలర్లకు పాల్పడేందుకు దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారని అందులో పేర్కొన్నారు.. పార్లమెంటులో ప్రతిపక్షానికి బదులిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా 300 మంది బయటి వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చి, దిల్లీ అల్లర్లలో పాల్గొన్నారని అన్నారు. ఈ అల్లర్ల వెనుక సీఏఏ వ్యతిరేక నిరసనకారుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలను దిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ కొట్టిపారేశారు. దిల్లీ జనాభాలో 12-13 శాతం ఉన్న ముస్లింలు, అల్లర్లలో నష్టపోయినవారిలో మాత్రం 90 శాతం ఎందుకు ఉన్నారో అమిత్ షా ఆలోచించుకోవాలని జఫారుల్ అన్నారు.

అందుకే ఐపీఎల్‌ వాయిదా!

కరోనా వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ను వాయిదా వేశార‌ట‌. ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యమని, అందుకే ఏప్రిల్ 15 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. ప్రస్తుతానికి ఐపీఎల్‌ వాయిదా వరకే ఆలోచిద్దాం. భద్రతే అందరికీ తొలి ప్రాధాన్యం. అందుకే ఐపీఎల్‌ మ్యాచులను వాయిదా వేశాం. ఆ తర్వాత ఏం జరగనుందో చూద్దాం. పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలసు. ఇప్పుడే కరొనపై సమాధానం చెప్పడం తొందరపాటు అవుతుంది' అని సౌరవ్‌ గంగూలీ అన్నారు. ఏప్రిల్‌ 15 నుంచి ఐపీఎల్ మొదలైతే డబుల్‌ హెడర్స్‌ (రోజుకు రెండు మ్యాచులు) ఎక్కువ అవుతాయని ప్రశ్నించగా.. ఇప్పుడే దాని గురించి ఏమీ చెప్పలేం అని దాదా సమాధానం ఇచ్చారు. ఐపీఎల్‌ వాయిదా వేసినందుకు ఫ్రాంచైజీలు సంతోషంగా ఉన్నాయా అని అడగ్గా.. 'ఎవరి చేతుల్లో ఏం లేదుగా' అని గంగూలీ చెప్పారు. ఏ విషయమైనా ఏప్రిల్ 15 తర్వాతే చెపుతాం అని దాదా స్పష్టం చేసారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌నూ సైతం బీసీసీఐ రద్దు చేసింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ.. కరోనా పంజా విసురుతుండంతో చివరికి రద్దు వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేయడంతో ఐపీఎల్, వన్డే సిరీస్ వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా అభిమానులు మరికొన్ని రోజులు భారత్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కోల్పోయారు.

కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

కోవిడ్  - 19(కరోనా వైరస్‌)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరస్‌పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు కరోనా వైరస్‌పై సమీక్షలు జరుపుతున్నామని.. దేశంలో 65 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన 17 మందికి కరోనా ఉందని.. కరోనా వైరస్‌ వచ్చాక 10 మంది కోలుకున్నారన్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరు మృతి చెందారని.. చరిత్రలో కరోనాలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నారు. ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు ప్రపంచాన్ని వణికిస్తాయన్నారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని సీఎం తెలిపారు. మరో ఇద్దరి శాంపిళ్లను పుణె పంపించారని చెప్పారు. బయటిదేశం నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వస్తోందన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగిందని.. ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్‌ విమానాలు లేవన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు ఎవరొచ్చినా.. వాళ్లను 14 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారన్నారు. ఎయిర్‌పోర్టులో 200 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నారని కేసీఆర్ తెలిపారు. కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వ్యాధి ప్రబలితే ప్రజలకు మాస్క్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు. సాయంత్రం 6గంటలకు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని... కేబినెట్‌ భేటీకి వైద్యాధికారులను పిలిచామని సీఎం తెలిపారు. అవసరమైతే రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామని చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామన్నారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని సభలో కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు.

దాన వీర శూర కరోనా

కిక్కిరిసిన క్రియేటివిటీ తో సోషల్ మీడియా లో కరోనా కు...దాన వీర శూర కర్ణ సినిమాలో నటరత్న ఎం టీ ఆర్ డైలాగ్ కు సామ్యం చూపుతూ ఔత్సాహిక నెటిజెనుడు రాసిన ఒక స్క్రిప్ట్ సోషల్ మీడియా లో ప్రస్తుతం హల చల్ చేస్తోంది. అదేదో మీరూ చదవండి... "ఆగాగు.. క‌రోనాచార్యదేవా! అహ్హ‌హ్హా.. ఏమంటివి? ఏమంటివి ? వైర‌స్‌ నెపమున మ‌నిషి మ‌నుగ‌డ‌కింత నిలువ‌నీడ లేదందువా? ఎంత మాట? ఎంత మాట? ఇది ఉత్త ప‌రీక్ష‌యేగానీ ఉప‌యోగ‌ప‌డే పరీక్ష కాదే ? కాదు.. కాకూడదు. ఇది మ‌ర‌ణ‌ ప‌రీక్ష అందువా? ఎబోలా వైర‌స్ జ‌న‌న‌మెట్టిది? అతి జుగుప్సాకరమైన నిఫా వైర‌స్ సంభ‌వ‌మెట్టిది? మట్టిలో క‌లిసెను క‌దా? అహ్హ‌హ్హా.. అదికాదా నీ నీతి? ఇంతయేల.. ప్ర‌పంచ‌మంతా వ్యాపించి.. వ‌ణికించి.. క‌బ‌ళించి.. క‌కావిక‌లం చేస్తున్న మ‌హ‌మ్మారిల‌ను మేం త‌రిమేయ‌లేదా? వాటిదే ప‌రీక్ష‌?   మాన‌వాళి భ‌విష్య‌త్‌ను అంధ‌కారం చేసి.. స‌క‌ల ఖండాల‌ను చుట్ట‌బెట్టి.. కోట్లాది ప్రాణాల‌ను హ‌రించి మేం పున‌ర్ జ‌నించ‌లేదా? వాటిదే ప‌రీక్ష‌? నాతో చెప్పింతువేమయ్యా.. మా వంశమునకు మూలపురుషులైన ఆదిమాన‌వులు మ‌హ‌మ్మారిని త‌ట్టుకోలేదా? అంత‌కంత‌కూ వ్యాపిస్తూ ఆందోళ‌న క‌లిగించిన అంటువ్యాధిని.. ఆ వ్యాధిని అంటిపెట్టుకొని తిరిగిన క‌ల‌రాను.. దానిని దాటేసుకుంటూ వ‌చ్చిన మ‌శూచిని.. ఆ వ్యాధికి తోడుగా వ‌చ్చిన ప్లేగును.. ఆ త‌ర్వాత వ‌చ్చిన హెచ్ఐవీని.. దానికంటే డేంజ‌రైన క్యాన్స‌ర్‌ను.. ఆ పిద‌ప వ‌చ్చిన సార్స్‌ను.. అంత‌టితో ఆగ‌కుండా దూసుకొచ్చిన స్వైన్‌ఫ్లూను..   ఆవుల నుంచి వ‌చ్చిన క్ష‌య‌ను.. బాతుల నుంచి వ‌చ్చిన ఫ్లూను.. మా ఇండ్ల‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి పిల‌గాండ్ల‌ను ప‌ల‌క‌రించే ఆట‌ల‌మ్మ‌ను.. అంత‌కంత‌కూ త‌ట్ట‌కుని బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేదా? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన ఈ వైర‌స్ వంశ‌ము ఏ నాడో మా చేతుల కుక్క చావు చ‌చ్చిన‌ది. కాగా నేడు క‌రోనా.. క‌రోనా అను వ్య‌ర్థ వాద‌ములెందుకు.. ??" అంటూ ఆ నెటిజెనుడు రాసిన స్క్రిప్ట్ చదువరులను అలరిస్తోంది.

భీమిలి సమీపంలో నా భూమిని కూడా కొట్టేయాలని ప్రయత్నించారు: కన్నా

తుపాకీ ఎక్కుపెట్టి సెటిల్ మెంట్లు చేస్తున్నారన్న బీ జె పీ అధ్యక్షుడు  తన భూమిపైనా కబ్జాసురుల కన్ను పడిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమిలి సమీపంలో ఉన్న తన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. 1993లో చేపలుప్పాడలో స్థలం కొన్నానని, తన స్థలం పక్కనే ఓ పోలీసు అధికారం స్థలం కూడా ఉందని, ఆ రెండు స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యానని కన్నా వివరించారు. ఇదేంటని కబ్జాదారులను ప్రశ్నిస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అనుకోలేదని చెప్పారని వెల్లడించారు. "విశాఖలో మన భూములను ఎవరో ఆక్రమించుకుంటున్నారండీ అని పోలీసు అధికారి ఫోన్ చేశారు. మా మనిషిని పంపిస్తున్నాను, మీరు కూడా మీ మనిషిని అక్కడికి పంపించండి అని చెప్పారు. వెళ్లిచూస్తే అప్పటికే అక్కడ ఫెన్సింగ్ వేసేశారు. గట్టిగా అడిగితే, ఇది సార్ స్థలం అనుకోలేదని అన్నారు" అంటూ వివరించారు. విశాఖలో భూమాఫియాకు వందలాది మంది బలయ్యారని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు చూసి, విశాఖలోని భూ యజమానులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తుపాకీ ఎక్కుపెట్టి సెటిల్ మెంట్లు చేస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలోనే కాదు విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు.

ఏంటి సవాంగ్ సాబ్.. మరీ సినిమా డాక్టర్ లాగా!! 

చాలా సినిమాల్లో కామన్  గా కనిపించే హాస్పిటల్ సన్నివేశాల్లో డైలాగ్స్ ఎలా ఉంటాయి? హీరో తలకు బలమైన గాయం తగిలి హాస్పిటల్ ఐ సి యూ లో ఉంటాడు. బయట ఎర్ర లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇంతలో హీరో గారి మదర్ డబ్బాడు కుంకుమ జయంతి గారు, నోట్లో గుడ్డలు కుక్కుకుంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఆమె వెంబడే హీరో గారి భార్య జయసుధ గారో, లేక మరొక హీరొయినో ఒగరుస్తూ అక్కడకు చేరుకుంటారు... ఆ వెంటనే ఐ సి యు లో నుంచి డాక్టర్ బయటకు వచ్చి..ఆ గాయపడిన వ్యక్తి తాలూకు బంధువులెవరైనా ఉన్నారా అని కంగారుగా అడుగుతారు ( ఆయనకు లోపల ఉన్నది హీరో అని తెలియదు  గదా..ఎవరో సాధార వ్యక్తి అనుకుని అలాప్రశ్నిస్తారు) . జయంతి గారు, జయసుధ గారు వెంటనే ...ఏమయింది డాక్టర్ అంటూ..ఆయన్ను చుట్టు ముట్టేస్తారు.. " ఆయన మాత్రం ఏ విషయం 24 గంటల దాకా చెప్పలేము... మీరేమీ కంగారు పడనక్కర్లేదు ..అంటూ అక్కడ నుంచి హడావుడిగా వెళ్లిపోతారు... ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన డి జి పీ గౌతమ్ సవాంగ్ గారు ఆ పాత  సినిమాల్లో డాక్టర్ లాగా.. ఏ ప్రశ్న అడిగినా.. పరిస్థితి అదుపులో ఉందనో... లేక, పోలీసులు తగు విధం గా రెస్పాండ్ అవుతున్నారనే మాత్రమే చెప్పి, అప్పటికి అలా కానించేస్తున్నారు. వాస్తవానికి తలా పగిలిన న్యాయవాది, అలాగే ఎండ ముఖమెరుగని బుద్ధ వెంకన్న, బోండా ఉమా మహేశ్వర రావు లకు మాచర్లలో ఎదురైన భయానక స్థితి గురించి మాత్రం గౌతమ్ సవాంగ్ మాట్లాడరు . ఇదే కాదు రాష్ట్రంలో అదుపు తప్పిన లా ఎండ్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడరు.... కోర్టు లో ఉన్నందు వల్ల, మాట్లాడలేనంటూ ముఖం తిప్పేస్తారు. యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో మీదైన శైలి తో గుర్తింపు తెచ్చుకున్న సవాంగ్ గారూ.....ఆంధ్ర ప్రజలు మీ నుంచి ఈ స్థాయి పోలీసింగ్ అయితే ఆశించటం లేదు.  ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీనితో టీడీపీ వైసీపీ నేతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న బోండా ఉమాలపై దాడి ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది . నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారని నామినేషన్ పత్రాలు చించి వేశారని దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక ఈ ఘటన నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు గవర్నగర్ బిస్వభూషణ్ హరిచందన్ కు అలాగే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు .రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇక ఈ ఘటనపై హై కోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు సైతం డీజీపీని కోర్టుకు పిలిచి మరీ విచారణ జరిపింది. ఇకపోతే ఈ ఘటన తరువాత డీజీపీ గౌతమ్ సవాంగ్ అసలు సంఘటనపై నివేదిక కావాలని సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ సవాంగ్ గుంటూరు ఐజీని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ ఈ ఘటన పై పూర్తి నివేదిక ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి పక్ష పార్టీ సహా అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని వచ్చిన అన్ని ఫిర్యాదులపైన తక్షణమే విచారణ జరిపిస్తున్నామని చెప్పిన ఆయన అంతే కాక ఘటన వివరాలు దర్యాప్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందిస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్ల ఘటన పైన సెక్షన్ 307 కింద నమోదు చేయలేదని ప్రతిపక్ష పార్టీల వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. మాచర్ల ఘటనపై సెక్షన్ 307 కింద నిందితులను అరెస్టు చేశామని ప్రస్తుతము గురజాల సబ్-జైల్లో ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు నిందితులు ఉన్నారని పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాతే వెళ్లామని టిడిపి నేతలు బోండా ఉమా బుద్దా వెంకన్న చెప్పారని దాని మీద కూడా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఏన్నికల దృష్టా పోలీసులు అన్నివేళల అప్రమత్తంగా ఉన్నారని ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చిత్తూర్ జిల్లాలోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ! ఏక‌గ్రీవాల విష‌యంలో చంద్ర‌గిరి టాప్

స్థానిక సంస్థల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఫ్యాన్ గాలికి ప్ర‌తిప‌క్షాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాభ‌వం చ‌విచూడాల్సి వ‌స్తోంది. టిడిపి మిన‌హా ఇత‌ర ప్ర‌తిపక్షాలను పెద్ద పోటీగా వైఎస్సార్సీపీ భావించడం లేదు. దీంతో ప్రధానంగా టీడీపీపై ఫోకస్ పెట్టి ఆ పార్టీని భారీగా దెబ్బతీస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ టీడీపీకి భారీగా ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే ఏకగ్రీవ జెడ్పీటీసీ -ఎంపీటీసీ స్థానాలు ఎన్నికయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి విశేష ప్రాధాన్యం ఇస్తారు. ఎన్ని ఏకగ్రీవాలు సాధిస్తే ఆ నియోజకవర్గంలో నాయకుడికి ఆ పార్టీకి అంత బలం ఉందని నిరూపించుకుంటుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 24 జెడ్పీటీసీ స్థానాలు ఏక గ్రీవ ఎన్నికలు జరిగాయి. ఈ ఏకగ్రీవమైన 24 స్థానాల్లో 9 జెడ్పీటీసీ స్థానాలు చిత్తూరు జిల్లావే ఉన్నాయి. ఏక‌గ్రీవాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం టాప్ పొజిష‌న్లో ఉంటూ వ‌చ్చింది. అక్క‌డ 65 ఎంపీటీసీ సీట్లు ఏక‌గ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యాయి. 71కి గానూ 65 సీట్లలో ఒకే నామినేష‌న్ దాఖ‌లు కావ‌డంతో.. అవ‌న్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యాయి. అయితే మాచ‌ర్ల ను మించింది చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం. చంద్ర‌బాబు నాయుడు సొంత ఊరు ఉండేది ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే. అయితే అక్క‌డ ఏకంగా 76 ఎంపీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి. మొత్తం 95 ఎంపీటీసీలున్నాయ‌ట ఈ నియోజ‌క‌వ‌ర్గంలో. వీటిల్లో 76 సీట్లకు సంబంధించి ఒకే ఒక నామినేష‌న్ మిగిలాయ‌ట‌. ఈ నేప‌థ్యంలో అత్య‌ధిక ఏక‌గ్రీవాల విష‌యంలో చంద్ర‌గిరి టాప్ పొజిష‌న్లో నిలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఏ స్ధాయిలో గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఇపుడు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని స్ధానికులు నిజంగా భయపడ్డారు. అయితే ఎవరూ ఊహించని విధంగా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ విధమైన గొడవ జరగలేదు. ఏక‌గ్రీవం అయిన 76 ఎంపిటిసి స్ధానాల్లో కూడా గొడవలు జరిగిన దాఖలాలు లేవు. తెలుగుదేశంపార్టీ నుండి ఎటువంటి పోటి లేకపోవటంతోనే ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. చంద్రబాబు సొంత ఊరైన నారావారిపల్లెలో కూడా ఎన్నిక వైసిపికి అనుకూలంగా ఏకగ్రీవమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉండడంతో టీడీపీ పార్టీ నాయకులంతా పోటీకి జంకుతున్నారట‌.