Cold War Between NGOs and GOs in Telangana

నిన్నటివరకు కలిసి ఉన్నవారు ఇప్పుడు తలో దారిన పడుతున్నారా..?

  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్యోగ సంఘాల జేఏసీ లో చిచ్చుపెట్టినట్లు కన్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు కలిసి అడుగులు వేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఇప్పుడు తలో దారిన నడిచేందుకు సిద్ధమవుతున్నారట. టీఎన్జీవో కార్యవర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తీర్మానం చేసిన తర్వాత జేఏసీ లోని కొన్ని సంఘాలు మద్దతుపై పునరాలోచనలో పడ్డాయని సమాచారం.  నిజానికి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడంతో సమ్మెకు మద్దతు తెలపాలంటూ ఇతర ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర సంఘాల నాయకత్వం మీద ఆయా సంఘాల కింది స్థాయి ఉద్యోగులు ఒత్తిడి పెంచారు. ఈ నేపధ్యంలో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతివ్వాలని నేతలంతా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని టీఎన్జీవోలు తప్పు పట్టారు. టీ.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. తాము సైతం ఉద్యమించడానికి ఇదే సరైన సమయమని ఆర్టీసీ సమ్మెను అవసరమైతే సకల ఉద్యోగుల సమ్మెగా మార్చాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇదే విషయాన్ని సమావేశానంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.  ఇంత వరకు బాగానే ఉంది.. అయితే గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం వాయిదా పడుతోంది. ఎవరికి వారుగా ఉద్యోగ సంఘాలు సమావేశాలు పెట్టుకొని తీర్మానాలు చేసుకున్నారు కానీ, జెఎసి సమావేశం మాత్రం పదేపదే వాయిదా పడటంతో అందులో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయట పడుతున్నాయి. ఆర్టీసి ఉద్యోగులకు మద్దతు తెలపడం సకల ఉద్యోగుల సమ్మెకు సిద్ధమంటూ రవీందర్ రెడ్డి ప్రకటించడంతో జేఏసీ లోని మరో సంఘం టీజీవోలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆ సంఘానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌరవాధ్యక్షుడిగా ఉండటం వల్లే వారు ఆలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆ సంఘానికి చెందిన ఓ ముఖ్య నేత గచ్చిబౌలిలో నిబంధలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేస్తున్నారని అది కూడా ఓ కారణమని చెప్తున్నారు. ఈ పరిస్థితుల వల్లే టీజీవోలు గత రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  మరోవైపు టీజీవోల వ్యవహారంపై టీఎన్జీవోలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె తరువాత వ్యవహరించిన తీరుతో ఇప్పటికే కొంత అప్రతిష్ట పాలయ్యామని, ఉద్యోగుల్లో సైతం సంఘం పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే వారికి మద్దతు ఇవ్వాల్సిందేనని టీఎన్జీఓలు నిర్ణయించారు. ఇక తమ సమస్యల మీద పోరాటానికి కూడా ఇదే సరైన సమయమని టీఎన్జీవోలు భావిస్తున్నారు. అందుకే మొదట సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత ఫలితం లేకపోతే సమ్మెకు వెళ్లడానికి సిద్ధం కావాలని కార్యవర్గ సమావేశంలో నేతలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యం లోనే ఆ సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సకల ఉద్యోగుల సమ్మెకు సమాయత్తం అవుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విషయంలో టీజీవో లు గ్రూప్-1 అధికార సంఘం కొంత గందరగోళంలో ఉన్నట్టు ఉద్యోగ జేఏసీలో చర్చ జరుగుతోంది. ఇక టీఎన్జీఓలు మాత్రం ఈ పరిణామాన్ని ముందే అంచనా వేశారట, టీజీవోలు కలిసి రాకపోయినా సమ్మెకు సిధ్ధం కావాలని తమ కేంద్ర నాయకత్వాన్ని టీఎన్జీఓలు గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒక లక్షా ఎనభై వేల సభ్యత్వంతో రాష్ట్రంలో తమదే అతిపెద్ద ఉద్యోగ సంఘంగా ఉందని కేవలం ఐదు వేల మంది ఉన్న టీజీవోల మాట విని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవద్దని టీఎన్జీఓ జిల్లాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారట. ఆ సంఘాలు జేఏసీ నుంచి బయటకు వెళ్లినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారట. ఉపాధ్యాయులు నాలుగో తరగతి ఉద్యోగులు సహా కలిసి వచ్చే అన్ని సంఘాలతో సమ్మెకు వెళ్లాలని గట్టిగా కోరుతున్నారట. అన్ని జిల్లాల నాయకుల నుంచి ఒకే అభిప్రాయం వ్యక్తమవడంతో టీఎన్జీఓ కేంద్ర నాయకత్వం కూడా అందుకు సన్నద్ధం అయినట్లు ఆ సంఘం నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగ జేఏసీ సమావేశానికి అడ్డంకులు సృష్టించిన టీజీఓలు సీఎస్ తో సమావేశానికి హాజరయ్యారు. వివిధ ఉద్యోగ సంఘాలు తమ కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాలతో వినతి పత్రాన్ని తయారు చేసి నేతలంతా కలిసి సిఎస్ కు అందజేశారు. తర్వాత మీడియా సమావేశంలో ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ టీఎన్జీఓ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్దమని ప్రకటించారు. ఇక టీజీఓ అధ్యక్షురాలు మమత మాత్రం ఆ స్థాయిలో మాట్లాడక పోవడం వారి వైఖరిని తెలియజేస్తోందన్న వాదనలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత సీఎం మాట ఇచ్చినట్టుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే టీజీఓలు కలిసొచ్చినా, రాకపోయినా తాము మాత్రం సమ్మెకు వెళ్లాలని టీఎన్జీఓలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.

Rohit Sharma breaks world record

టెస్టుల్లోనూ మొదలైన రికార్డుల వేట.. రోహిత్ ఖాతాలో అద్భుతమైన రికార్డు

  టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ టాలెంట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిగతా స్టార్ బ్యాట్స్ మెన్ వన్డేల్లో సెంచరీలు చేసినంత ఈజీగా రోహిత్ డబుల్ సెంచరీలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే ఇప్పుడు రోహిత్ టెస్టుల్లో కూడా అదరగొడుతున్నాడు. మొన్నటి వరకు టెస్ట్ టీంలో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. ఇప్పుడు టెస్టుల్లో ఓపెనర్ గా తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా.. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి.. సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన.. శనివారం మొదలైన మూడో టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది. అయితే ఈ సిరీస్ కి అనూహ్యంగా ఓపెనర్ గా ఎంపికైన రోహిత్.. వన్డేల్లో లాగానే అదరగొడుతున్నాడు. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్న రోహిత్.. మూడో మ్యాచ్ లో కూడా సెంచరీ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ కిది మూడో సెంచరీ కాగా.. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ కిది 6వది. ఈ క్రమంలో ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా.. రోహిత్ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు. ఇక, దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ తన కెరీర్‌లో ఒక సిరీస్‌లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాల్లో సాధించాడు. గవాస్కర్‌ తర్వాత ఒకే సిరీస్ లో మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. అదేవిధంగా సిక్సుల్లోనూ రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ సిరీస్ లో రోహిత్ 17 సిక్సులు కొట్టాడు. దీంతో గతంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన సిరీస్ లో కొట్టిన 15సిక్సుల రికార్డును బద్దలు కొట్టేసాడు. దీన్నిబట్టి చూస్తుంటే వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ రోహిత్ రికార్డుల వేట మొదలైందని చెప్పాలి.

Road Accident in Suryapet Dist

కచ్చులూరు ప్రమాదాన్ని తలపిస్తున్న కారు ప్రమాదం.......

  సూర్యాపేట జిల్లాలోని చాకిరాల దగ్గర కాల్వలో పడిన కారు ప్రమాదం కూడా అచ్చం కచ్చులూరు బోటు పరిస్థితిని తలపిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సికింద్రాబాద్ కు చెందిన అబ్దుల్ రాజేష్, జాన్సెన్, సంతోష్ కుమార్, నరేష్, పవన్ కుమార్ లు ఉన్నారు. వీరంతా అంకుర ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. చాకిరాలలో స్నేహితుడు విమలకొండ మహేష్ పెళ్లి వేడుకలకు హాజరై తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే స్నేహితులంతా రెండు కార్లలో సూర్యాపేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూడా రెండు కార్లల్లో తిరుగు ప్రయాణమైయ్యారు. మరొక కారు రావడం లేదన్న విషయాన్ని గమనించి వెతికిన వాళ్లకి కాలువలో కొట్టుకు పోయిన కారు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కాల్వలో పడిన కారును ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాటర్ కెమెరాలతో కారు ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. కచ్చులూరు వద్ద గజ ఈతగాళ్లు కిందకు వెళ్లి రోప్ ను బోటుకు కడితే కానీ వెలికి తీసే పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఇక్కడ కారును వెలికి తీసేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. గజ ఈతగాళ్లు కిందకు వెళ్లి రోప్ ని కారుకు కట్టాలి,అప్పుడే కారును బయటకు తీయగలుగుతారు . దీంతో అధికారులకు గజ ఈతగాళ్లను రప్పించి వారి సహాయం కోసం కారును వెలికి తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో చాకిరాల వద్ద పడిపోయినటువంటి కారుని వెలికితీత ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఆరు గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్ ను వెలికి తీసేందుకు ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తున్నారు. కానీ వారు ప్రయత్నాలైతే విఫలమవుతున్నట్టు కనిపిస్తుంది.దీంతో స్థానిక గజ ఈతగాళ్లు కూడా తమ ప్రయత్నాన్ని కొనసాగించేందుకు పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ముగ్గురు యువకులు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సాయంగా వారితో పాటూ దిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కారును గుర్తించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ రోప్ ని కారుకు కట్టే ప్రయత్నంలో అనేకసార్లు విఫలం అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.ముఖ్యంగా నీటి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతోటి కారుకి రోప్ ని కట్టే సమయంలో లాక్ కి కొక్కెం వేయటంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి ఐదు వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ ఘటన తర్వాత రెండు వేల ఐదు వందల క్యూసెక్ ల నీటి ప్రవాహం తగ్గించినప్పటి కూడా ఇంకా వరద ఉధృతి అలానే ఉంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఈ రిస్క్యూ ఆపరేషన్ మాత్రం కొంత కష్టదాయకంగా కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మ్మీద ఈ రిస్క్యూ ఆపరేషన్ చూసేందుకు పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది వస్తున్నారు. సాగర్ ఎడమ కాలువ చుట్టూ ఉండే జనం కూడా ఇక్కడకు వచ్చి చేరుకుంటున్న పరిస్థితి చోటు చేసుకుంది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరొక రెండు గంటల్లో ఈ కారును వెలికి తీసి ఆ మృతదేహాలను మాత్రం బంధువులకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఎండీఆర్ఎఫ్ బృందం ప్రయత్నం చేస్తున్న ఈ రిస్క్యూ ఆపరేషన్ మొత్తం మీద మరొక అర్ధగంట, గంట సేపు  పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది అది సఫలమవుతుందో లేదో వేచి చూడాలి.  

zp chairman vs collector issue in adilabad district

జెడ్పీ ఛైర్మన్‌ వర్సెస్ కలెక్టర్... టీఆర్ఎస్ లో కలకలం రేపుతోన్న కొత్త వివాదం 

  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ‌ఎలాంటి పనులూ కావడం లేదని, దీనికి‌ కలెక్టర్ దివ్యదేవరాజన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై తిరుగుబాటు చేయాలని జెడ్పీటీసీలకు ఛైర్మన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలూ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్. జిల్లా పాలన మొత్తం, కలెక్టర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. కనీసం పట్టా పాస్ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు. పనులు చేయలేని పదవులు మాకెందుకన్న జనార్ధన్, ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనమేంటని మండిపడ్డారు. కనీసం, విరాసత్, పట్టాపాస్ ఇవ్వడాన్నీ కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాగ్భాణాలు సంధించారు. కలెక్టర్‌పై తిరుగుబాటు చేయాలని జెడ్పీ ఛైర్మన్‌ ఏకంగా పిలుపునిచ్చారు. అయితే భయపడేది లేదంటోన్న కలెక్టరమ్మ దేనికైరా రెడీ అంటున్నారు. దాంతో ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ వర్సెస్ జడ్పీ చైర్మన్‌ కోల్డ్‌ వార్, రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏజెన్సీ చట్టాలను‌ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇది జెడ్పీ ఛైర్మన్ కు నచ్చడం‌ లేదట. అదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందట. ఆదివాసీల భూములను, ఒక సామాజికవర్గ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ ఆదివాసీల పేరిట ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఒక సామాజికవర్గానికి‌ పట్టాలు కట్టబెట్టడానికి ప్రయత్నించారని, విపక్షాల నుంచీ విమర్శలున్నాయి. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే జెడ్పీ ఛైర్మన్‌కు నచ్చక, ఎదురుదాడికి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్నది జడ్పీ ఛైర్మన్‌ అభ్యంతరం. ఇటీవల నియమాకాలు జరిగిన ఫారెస్ట్ అండ్ జూనియర్‌ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలను అర్హులైనవారికి వచ్చేలా ‌కలెక్టర్  చర్యలు తీసుకున్నారు. దాంతో భోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. చట్టాలు అమలు చేయడం, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో నిబంధనలు పాటించడమే కలెక్టర్‌ తప్పయినట్టుగా వీరంతా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందట. అయితే ఎవరికి ఉద్యోగాలు, ఏజెన్సీ సర్టిపికెట్లు దక్కలేదో వారి కోసం కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ అట్టుడికిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కదిద్దారని మంచి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్‌పై, అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కలెక్టర్‌పై... జడ్పీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఈసడించుకుంటున్నారు. రహస్య అజెండాతోనే ఛైర్మన్, ఆయన బృందం బహిరంగ వ్యాఖ్యలు చేస్తోందని, విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న కలెక్టర్‌ను అభినందించాల్సిందిపోయి, తమకు అనుకూలంగా నడుచుకోవడం లేదన్న అక్కసుతో నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఫైరవుతున్నారు. అవినీతి, అక్రమాలకు మడుగులొత్తాలని భావించడం సరికాదంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా, కలెక్టర్‌ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, ఎవరికీ బెదరాల్సిన అవసరంలేదని ప్రజాస్వామ్యవాదులంటున్నారు.

pm modi about kartarpur corridor

కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంతో సిక్కుల డెబ్భై ఏళ్ల కల నిజమవుతుంది: మోదీ

  హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కీలక సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. సిర్సా, రేవరీ తదితర సభల్లో ప్రసంగించారు, విపక్షాలు ఇప్పటికే ఓటమిని అంగీకరించాయని అన్నారు. కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంతో సిక్కుల డెబ్భై ఏళ్ల కల నిజమవుతుందని అన్నారు మోదీ. సిక్కుల ముఖంలో ఆనందం కనిపిస్తోందన్నారు. గురునానక్ దేవ్, కర్తార్ పూర్ సాహెబ్ ల మధ్య దూరం తగ్గిపోయిందన్నారు. ఈ జాతీయ రహదారికి గురునానక్ దేవ్ జీ మార్గంగా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్థాన్ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్లు తెలిపారు మోదీ. ఉగ్రవాదంతో పాటు భారత యువతలకు డ్రగ్స్ కు బానిసలు చేసేందుకు పాక్ కుట్ర చేస్తోందని కానీ, ఆ కుట్రను తిప్పికొట్టినట్టు చెప్పారు ప్రధాని. పుల్వామా  దాడుల తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తొలి సారిగా చర్చలు జరిగాయి, అయితే ఆ చర్చలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించినది కాదు, భారత్-పాక్ మధ్య శాంతికి నాంది పలుకుతుందని భావిస్తున్న కర్తార్ పూర్ కారిడార్ గురించి. భారతీయ సిక్కులు ఎన్నో దశాబ్దాల కల ఈ కర్తార్ పూర్ కారిడార్. దీని నిర్మాణం పూర్తయితే నేరుగా పాకిస్థాన్ కు వెళ్లి తమ గురుద్వార్ ను దర్శించుకోవచ్చని భారతీయ సిక్కులు భావిస్తున్నారు. సిక్కు మతస్థుల అత్యంత పవిత్రంగా భావించే స్థలాల్లో కర్తార్ పూర్ దర్బార్ సాహెబ్ గురుద్వార్ ఒకటి. ఇది పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ గ్రామంలో ఉంది, దీన్ని 500 ఏళ్ల క్రితం గురునానక్ హయాంలోనే నిర్మించారని సిక్కులు చెబుతారు. వారి విశ్వాసాల ప్రకారం సిక్కు మతానికి ఆధ్యుడైన గురునానక్ ఇక్కడే మొదటి మత సమావేశం నిర్వహించారు. పధ్ధెనిమిది ఏళ్లకు పైగా ఇక్కడే ఉన్న గురునానక్ చివరికి ఈ ప్రాంతంలోనే కన్నుమూశారు. అప్పట్నుంచీ ఇది సిక్కులకు అత్యంత పవిత్ర స్థలంగా మారింది కానీ, పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయాక ఈ కర్తార్ పూర్ పాకిస్థాన్ భూభాగంలో కలిసిపోయింది. కర్తార్ పూర్ గురుద్వార్ భారత సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో రావి నది ఒడ్డున ఉంది. అదే నదికి ఇవతలి వైపున భారతీయ భూభాగంలో మరో ప్రసిద్ధ డేరా బాబా నానక్ గురుద్వారా కూడా ఉంది. దేశ విభజన తరువాత భారతీయ సిక్కులు ఆ రావి నది పైన ఉన్న వంతెన పై నుంచే అనధికారికంగా వెళ్లి కర్తార్ పూర్ గురుద్వారను దర్శించుకునే వారని చెబుతారు. కాని పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ యుద్ధం తరువాత ఆ వంతెన ధ్వంసమైంది. దాంతో సిక్కుల రాకపోకలు నిలిచిపోయాయి, అప్పట్నుంచీ రెండు గురుద్వారాలను అనుసంధానం చేస్తూ మార్గం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ లు పెరిగాయి. భారత భూభాగం నుంచే కర్తార్ పూర్ గురుద్వారా కనిపిస్తుంది, అది మరింత స్పష్టంగా కనిపించేందుకు పాక్ అధికారులు తరచూ మధ్యలో దట్టంగా పెరిగిపోయే గడ్డిని కత్తిరిస్తుంటారు. అయితే ఈ ఇబ్బందులేవీ లేకుండా నేరుగా రెండు గురుద్వారాల మద్య మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న అధికారిక ప్రతిపాదన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముందుకు కదిలింది. తొలిసారి ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఆ బస్సులో నాటి ప్రధాని వాజ్ పై ప్రయాణించారు. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందుకు ఆయనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, ఆ తరువాత పాకిస్తాన్ కూడా గురుద్వారాను పునరుద్ధరించి భారత్ నుంచే దాన్ని చూసేందుకు అనువైన ఏర్పాట్లు చేసింది. ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ ఆ కారిడార్ నిర్మాణం ముందుకు కదిలింది, ఇటీవలే ఇటు భారత్ లో అటు పాకిస్తాన్ లో కూడా కారిడర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రతిపాదనల ప్రకారం డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి సరిహద్దు వరకు మార్గాన్ని భారత్ నిర్మిస్తే, అటు కర్తార్ పూర్ నుంచి సరిహద్దు వరకు మార్గాన్ని పాకిస్థాన్ నిర్మిస్తుంది. ఇది పూర్తయితే ఎలాంటి వీసా, పాస్ పోర్టు అవసరం లేకుండా భక్తులు ఒకే రోజులో భారత్ నుంచి కర్తార్ పూర్ గురుద్వారాకు వెళ్లి వచ్చేలా ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. గురునానక్ ఐదు వందల యాభైవ జయంతి నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ కల్లా ఈ కారిడార్ ను పూర్తి చేయాలని ఇటు భారత్ తో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భావించింది. ఈ నిర్మాణం పూర్తయిన తరువాత భారత్-పాక్ ల మధ్య బంధం ఎలా కొనసాగుతుందో చూడాలి.

Party Symbols Tension For TRS In Huzurnagar By Election

హుజూర్ బైపోరులో టీఆర్ఎస్ కి కొత్త భయం... టెన్షన్ పెడుతోన్న రోడ్ రోలర్, ట్రాక్టర్

  ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, టెన్షన్‌ పట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు తెగ టెన్షన్‌ పెడుతున్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే అయినప్పటికీ... ఓట్ల చీలికతో బీజేపీ, టీడీపీ కూడా ఎంతోకొంత టెన్షన్ పెడుతున్నాయి. అయితే, ప్రధాన పార్టీలే కాకుండా, ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గుండెల్లో గుబులురేపుతున్నారు. అసలు, వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్... ఈ రెండు గుర్తులూ దాదాపు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను తెగ టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికారపక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయామని, నిరక్షరాస్యులు, వృద్ధులు పొరపడి ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో... పదివేల ఓట్లు పడ్డాయని, అందువల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని  అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌ బైపోరులోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట. హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ కి... ట్రాక్టర్‌ నడిపే రైతు సింబల్‌ను... అలాగే ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున పోటీ చేస్తున్న నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా, లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది. ఇక గతంలోనూ టీడీపీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు..నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయితే, గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి  వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతీ ఓటూ అత్యంత కీలకంగా మారిన హుజూర్ నగర్ ఉపపోరులో... మరి, రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు... టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలి.

8 year old girl dies after stuck in lift in hyderabad

లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదేళ్ల చిన్నారి...

  హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. చలాకీగా తిరుగుతూ సందడి చేసే చిన్నారి ప్రాణాలు అమాంతంగా గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే  లిఫ్ట్ లో ఇరుక్కొని ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఎల్బీనగర్ హస్తినాపురం పరిధిలో పిండి పుల్లారెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలో చంద్రశేఖర దంపతులు ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ కూతురు ఎనిమిదేళ్ల లాస్య స్కూలుకు సెలవులు కావటంతో శుక్రవారం సాయంత్రం ఆ చిన్నారి పొరుగింటి పిల్లలతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. పిల్లలతో కలిసి ఆడుకుంటున్న లాస్య లిఫ్ట్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్ తలుపులు మూసుకు పోవటంతో అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది.లిఫ్ట్ పై ఫ్లోర్ లో చిన్నారి తల కింద కాళ్ళు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించింది. తోటిపిల్లలు గట్టిగా అరవటంతో లాస్య తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్నారి మృతి తో స్థానికంగా విషాదం ఛాయలు అలుముకున్నాయి.  లిఫ్టులో పడి ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోవడం పట్ల బాలల హక్కుల సంఘం తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. కొందరు భవన నిర్మాణదారులు నాసిరకం లిఫ్టులు పెట్టడంతో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతరావు ఆరోపించారు.అపార్టుమెంట్ ల్లో నాణ్యమైన లిఫ్టులు సమకూర్చుకోవాలంటూ సూచించారు. లిఫ్ట్ నాణ్యతపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి ఆమోదించిన తర్వాతే బిగించేలా చర్యలు చేపట్టాలంటూ ఆయన సూచించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.  హైదరాబాద్ లో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో ఎక్కువ మంది చిన్నారులే ప్రాణాలు తమ ప్రాణాలు కోల్పొతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో చిన్నారులు ప్రాణాలతో బయటపడుతున్నారు. దిల్ సుఖ్ నగర్ సార్ కిడ్స్ ప్రైవేటు పాఠశాలలో జహాన అనే చిన్నారి లిప్టు గ్యాప్ లో ఇరుక్కు పోవటంతో ప్రాణాలు విడిచింది. ముసారంబాగ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జైనబ్ అనే నాలుగేళ్ల పాప లిఫ్టులో ఇరుక్కుని ప్రాణాలు వదిలింది. దీంతో పాటు రాజేంద్ర నగర్, చందా నగర్ లోనూ ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి.రోజువారీ జీవితంలో లిఫ్టు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు ఎక్కటం తప్పనిసరైపోయింది. అపార్ట్ మెంట్లు, ఆఫీస్లు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ లో ఇలా ఎక్కడికి వెళ్లినా లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. అసలు లిఫ్టు ప్రమాదాలూ ఎందుకు జరుగుతున్నాయి, అపార్ట్ మెంట్ నిర్మాణ సమయంలో నాణ్యమైన లిఫ్టు బిల్డర్లు వాడకపోవటమే కారణమా, లిఫ్టు నాణ్యతపై మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించిన తరువాతే వాటిని బిగిస్తున్నారా లేదా అనే అంశాలపై అధికారులు పరిశోదించాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాల పై విచారణ జరపాలని బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తప్పు ఎవరిదైనా ఒక నిండు ప్రాణం మాత్రం బలైపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Telangana Bandh LIVE Updates

కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారుతున్న తెలంగాణ బంద్... 

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు డిపో ఎదుట ధర్నాలకు దిగారు. మరో వైపు ప్రభుత్వం కూడా పోలీసుల బందోబస్తుతో బస్సుల్ని నడుపుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎస్కార్టుతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటోంది. డిపోలు, బస్టాండ్ దగ్గర భారీగా పోలీసులను మొహరించారు.  ఖమ్మం, కొత్తగూడెంలోనూ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. తెల్లవారు జామునే అఖిల పక్షం, ఆర్టీసీ జెఎసి కార్మికులు డిపోల దగ్గరకు చేరుకొని బంద్ లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ముందుగానే జాగ్రత్తగా అఖిల పక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు.  ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో డిపో ఎదుట ఆందోళనకు దిగిన అఖిల పక్షం, కార్మిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బందోబస్తు మధ్య కొన్ని బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యయి. ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుటనే ఆందోళన నిర్వహిస్తూ బయటకు రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఈ బంద్ లో పాల్గొన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, మందరి, గోదావరిఖని డిపోలో బస్సుల రాకపోకలను అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆర్టీసి బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా డిపోల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మంచిర్యాల డిపో నుండి ఆర్టీసీ బస్సులను బస్టాండ్ కు తరలించే క్రమంలో పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మరొపక్క ఆర్టీసీ కార్మికులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసి బంద్ కొనసాగుతోంది. డిపోలు బస్టాండ్ ల వద్ద విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మికులు, ప్రజా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బోధన్ మండలం ఆచన్ పల్లి, మాక్లూర్ మండలం ముబారక్ నగర్ వద్ద కూడా నిరసనకారులు బస్సుల పైకి రాళ్లు రువ్వారు. రెండు బస్సుల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యయి. వామపక్ష, ప్రజా సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులనూ పోలీసులు అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్ పూర్తిగా కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హై కోర్ట్ ఆదేశాలిచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక బంద్ మరింత ఉధృక్తి  కాకముందే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.

AP Govt Releases 263 Crore Compensate to Agri Gold Victims

అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త...

  ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఇచ్చిన హామీలలో మరో ముందడుగు పడింది. అగ్రి గోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరపాలని,మొదటగా పదివేల లోపు డిపాజిటర్ లకు పేమెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఈ మేరకు మూడు లక్షల అరవై తొమ్మిది వేల మందికి రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. హై కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా లీగల్ సెల్ ద్వారా నగదు అందజేయనుంది. మరోవైపు ఇరవై వేల రూపాయల లోపు డిపాజిటర్లకి కూడా చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్టు సూచనల మేరకు చెల్లించబోతోంది నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.  అగ్రి గోల్డ్ బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తం నుంచి బాధితులకు డబ్బులు ఇవ్వబోతోంది ప్రభుత్వం. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో అగ్రి గోల్డ్ బాధితులు సీఎం జగన్ ను కలిసినప్పుడు వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే వారు సహా వేలాది మంది మధ్య తరగతి జనం అగ్రి గోల్డ్ లో తమ డబ్బు డిపాజిట్ చేశారు.మోసపోయిన బాధితులు తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని పాదయాత్రలో జగన్ ను కోరారు.  పది వేల రూపాయల లోపు డిపాజిటర్ లకు కలెక్టర్ల ద్వారా నగదు అందించబోతోంది ప్రభుత్వం. జిల్లాల వారీగా బాధితులు వారికి అందే మొత్తాన్ని పరిశీలిస్తే.. గుంటూరు జిల్లాలో పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క మందికి పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు, చిత్తూరు జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు మందికి ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు మందికి పదకొండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇరవై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు, విజయనగరం జిల్లాలో యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి ముప్పై ఆరు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం జిల్లాలో నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు, కర్నూలు జిల్లాలో పదిహేను వేల ఏడు వందల ఐదు మందికీ పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మందికి పదహారు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి పదిహేను కోట్ల నాలుగు లక్షల రూపాయలు, అనంతపురం జిల్లాలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి ఇరవై కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు, కడప జిల్లాలో పధ్ధెనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మందికి పదమూడు కోట్ల పధ్ధెనిమిది లక్షల రూపాయలు, ప్రకాశం జిల్లాలో ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు మందికి పంతొమ్మిది కోట్ల పదకొండు లక్షల రూపాయలు, విశాఖపట్నంలో యాభై రెండు వేల ఐదు మందికీ నలభై ఐదు కోట్ల పది లక్షల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇవి నిజంగా ప్రజలకు చేరి వారికి తగిన న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.  

animal exchange programme in visakha zoo

విశాఖ జూలో వస్తుమార్పిడి విధానం అమలు చేస్తున్న అధికారులు...

  వస్తుమార్పిడి విధానం గురించి వినే ఉంటారు. పూర్వకాలంలో డబ్బులు లేని రోజుల్లో మన దగ్గరున్న వస్తువులిచ్చి వాళ్ళ నుండి మనకు కావలసిన వస్తువులు తీసుకునే వాళ్లం. అయితే ఇప్పుడు ఈ విధానం జంతువులకు అమలు చేస్తున్నారు విశాఖ జూ అధికారులు. సరికొత్తగా జంతు మార్పిడి విధానం తీసుకొచ్చారు, దేశంలో అతిపెద్ద జూలలో విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్ ఒకటి. ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల్లో కొండల నడుమ సహజసిద్ధంగా ఉండే ఈ జూ ని సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ జూలో ఉండే జంతువులు, పక్షులకు ఏడాదికి ఆహారం ఖర్చు చాలా ఎక్కువ. వీటిలో టైగర్స్, లెపర్డ్, జాగ్వర్, ఏనుగు, హిప్పోపొటమస్ జంతువులకు మరింత ఖర్చవుతుంది. వచ్చే ఆదాయంతో పోల్చితే వీటికి వెచ్చించే ఖర్చు ఎక్కువగా ఉండటంతో జంతు ప్రేమికులకు ఒక అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జంతువులు, పక్షులను దత్తత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రేటు ఉంది. రోజుల నుంచి ఏళ్ల వరకూ ఎన్నాళ్లు దత్తత తీసుకుంటే అన్నాళ్లూ వాటి ఆహారం ఖర్చు భరించాలి. ఇలా దత్తత తీసుకున్న వారి కుటుంబాలకు మూడు సార్లు జూలో ఎంట్రీ ఉచితం. ఆన్ లైన్ లోనూ దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జూ క్యూరేటర్ యశోదబాయి. ఇప్పటికీ విశాఖ జూలో ఉన్న కొన్ని జంతువులను వివిధ ప్రాంతాల నుంచి జంతు మార్పిడి ద్వారా తీసుకువచ్చారు. వైల్డ్ డాగ్స్, వైట్ టైగర్స్ సంతతి పెరగడంతో వాటిని ఇతర జూలకు ఇచ్చి అక్కడి నుంచి వేరే జంతువులను తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే మలేషియా జూ నుంచి జిరాఫీ, ఇజ్రాయిల్ నుంచి చింపాంజీ తీసుకువచ్చారు, కలకత్తా నుంచి జీబ్రా తీసుకురానున్నారు. జూ సహజసిద్ధంగా ఉందని జంతువులు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు ఉందంటున్నారు పర్యాటకులు. అయితే జూ విస్తీర్ణానికి తగిన జంతువులు ఉండి ఉంటే బాగుండేదంటున్నారు మరికొందరు, సౌకర్యాలు కూడా పెంచాలని కోరుతున్నారు. జూని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని నైట్ సఫారీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తానికి వస్తు మార్పిడిలా జంతు మార్పిడి విధానం బాగుందంటున్నారు పర్యాటకులు.

Telangana bandh affects normal life

ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు సకలం బంద్ గా మారిందా..?

ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు సకలం బంద్ గా మారింది. ఆర్టీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ తో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభావితం చేస్తోంది. ఈ బంద్ కు ఓలా, ఉబర్ లాంటి ప్రైవేటు టాక్సీ యూనియన్లు కూడా సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడికక్కడ బస్సులు బయటకు రాకుండా ఆర్టీసీ యూనియన్ లు అడ్డుకుంటున్నాయి. హై కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ కార్మిక సంఘాలు అనుకూలంగా తీసుకుని సమ్మెను ఉధృతం చేసేందుకు సిద్ధమైతే, మరోవైపు ప్రభుత్వం బంద్ ఎఫెక్ట్ లేకుండా చర్యలు తీసుకుంటోంది. అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ విధించింది, భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరు అడ్డుకున్నా ప్రజా రవాణా ముఖ్యమని ఖచ్చితంగా బస్సులు నడిపి తీరాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. సమ్మెపై సమీక్షించిన ఆయన విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని సూచించారు. కఠిన చర్యలతో అయినా సరే బస్సులు నడపాలన్నారు, ఇక ఆర్టీసీ జేఏసీ తో చర్చలు జరుగుతాయా అన్న సందిగ్ధానికి మరోసారి ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం. ఆయన జరిపిన సమీక్షలో అసలు చర్చల ఊసే లేకుండా ఆసాంతం ప్రత్యామ్నాయాల పైనే ఫోకస్ పెట్టారు. బంద్ నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశంతో కొన్ని చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది, హైదరాబాద్ లోని జేబీఎస్ దగ్గర అఖిల పక్షం నేతలు కోదండ రామ్, ఎల్ రమణ, రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంజీబీఎస్ దగ్గర ధర్నాలకు దిగిన సీపీఐ ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. సీపీఐ పార్టీ నేత కూనంనేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఓయూ విద్యార్థులు సంఘీభావం తెలపడంతో అక్కడ కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు బస్ భవన్ ముట్టడి చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసు పహారా కొనసాగుతోంది.

cpiml leader rangarao toe was severed

బందులో హింస.. పోలీసుల తీరుతో సీపీఐఎంఎల్ నేత బొటనవేలు తెగిపోయింది

  తెలంగాణలో రెండు వారాలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు(అక్టోబర్ 19) బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బంద్‌కి విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. మరోవైపు బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను మోహరించింది. కీలక నేతలను అరెస్ట్ చేయించింది. బంద్ నేపథ్యంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. చాలాచోట్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలాచోట్ల కార్మికులు ఆందోళనలు,నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద ఓ ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ బస్ డిపో వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎంజీబీఎస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు అడ్డగించే అవకాశం ఉండటంతో తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లు కూడా డిపోలకు రాలేదు. మరోవైపు పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అరెస్ట్ ల పేరుతో కార్మికులు, నేతలపై దాడి చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసనకు దిగిన సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావును అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఆయన బొటనవేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తన బొటన వేలును తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కేశారని ఆరోపిస్తూ.. రంగారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ తనను చంపమన్నారా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడినందుకు ఇదేనా తనకిచ్చే బహుమానం అంటూ ప్రశ్నించారు. రంగారావు బొటనవేలు తెగిపోవడంతో వామపక్ష నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

CM YS Jagan decision on Aarogyasri scheme

ఏపీ బయటా ఆరోగ్యశ్రీ... ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు జగన్ సూత్రాలు

వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ బయటా... ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ ఒకటి నుంచి ఏపీలోనే కాకుండా... హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. అలాగే, పశ్చిమగోదావరిలో 2వేల వ్యాధులకు... మిగతా జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక, డెంగ్యూ, సీజనల్ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కిడ్నీ రోగులకు ఇస్తున్నట్లే.... తలసేమియా, హీమోఫీలియో, ఎనీమియా పేషెంట్స్‌కు కూడా నెలకు 10వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, తీవ్ర వ్యాధులుంటే ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఆపరేషన్స్ తర్వాత కోలుకునేంతవరకు ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. వీళ్లందరికీ నెలకు 5వేలు లేదా రోజుకి 225 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. అదేవిధంగా 5వేల రూపాయల పెన్షన్ కేటగిరిలోకి పక్షవాతం, కండరాల క్షీణతలాంటి మరో నాలుగు వ్యాధులను చేర్చారు. వైద్యారోగ్యశాఖలో మొత్తం ఖాళీలను భర్తీ చేస్తామన్న సీఎం జగన్‌.... హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది జీతాలను 16వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రం ఏర్పాటు.... కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 21నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని తెలిపిన వైఎస్ జగన్‌.... కంటి వెలుగు మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనూ బైక్స్ ద్వారా వైద్యసేవలు అందిచేందుకు చర్యలు చేపడతామన్నారు. మొత్తంగా ఆరు సూత్రాల అజెండాతో రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ‎ఆదేశించారు.

cab drivers to go on indefinite strike

కేసీఆర్ సర్కారుకు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్లు... దాదాపు స్తంభించిన హైదరాబాద్ రవాణా...

  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

huzur nagar election campaign

క్లైమాక్స్‌కి హుజూర్‌నగర్‌ క్యాంపైన్... ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

హుజూర్‌నగర్‌ బైపోల్‌ క్యాంపైన్ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్ధులంతా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నువ్వానేనా అంటూ తలపడుతోన్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హుజూర్‌నగర్‌ ఉపపోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనాసరే హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తుండగా... మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, నియోజవర్గమంతా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి... తనకు ఒక్క అవకాశం ఇస్తే.... హుజూర్‌ నగర్‌ ను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. అక్టోబర్ 21న జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఎక్కడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్‌ టీమ్‌ డేగకన్నుతో కాపలా కాస్తోంది. అయితే... అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దాంతో హుజూర్‌నగర్‌ ఫలితం కోసం యావత్‌ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి... కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో ప్రక్రియను ముగించాలని సూచించింది. అలాగే, చర్చల సారాంశాన్ని ఈనెల 28న కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ సమస్య... ఆర్టీసీ కార్మికులది, ప్రభుత్వానిది కాదని... ప్రజలదంటూ కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.... సమ్మె విరమించాలని సూచించింది. ప్రజాసామ్యంలో ప్రజలే శక్తివంతులన్న హైకోర్టు.... ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని, అందుకు ఫిలిప్పీన్స్‌ రాజుపై ప్రజల తిరుగుబాటే ఒక ఉదాహరణ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ గొప్పవారు కాదన్న సంగతి ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని సూచించింది. ఇక, ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, ఆర్టీసీకి సమర్ధవంతుడైన ఇన్‌ఛార్జ్ ఉన్నారని ప్రభుత్వం తెలపడంతో.... న్యాయస్థానం మండిపడింది. సమర్ధుడైన ఇన్‌ఛార్జ్ ఉంటే.... మరి ఆర్టీసీ సమ్మెను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించింది. అయితే, కొత్త ఎండీ నియామకానికి... ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సంబంధం లేదని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో 50శాతం న్యాయబద్ధమైనవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 20 డిమాండ్లు ఆర్ధికభారం కానివేనని, మరి వాటిని నెరవేర్చడంలో అభ్యంతరమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించామని, కానీ చర్చలు జరుపుతుండగానే, సమ్మెకు వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటేనే కార్మికులు చర్చలకు వస్తామంటున్నారని సర్కారు వివరణ ఇచ్చుకుంది. ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉందన్న ప్రభుత్వం... ప్రతి ఏటా 4వేల 882కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.... ఖర్చు మాత్రం 5వేల 811కోట్లగా ఉందని, దాంతో ఏటా సుమారు 12వందల కోట్లు నష్టం వస్తోందని తెలిపింది. అయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత... ఆర్టీసీ కార్మికుల జీతాలను 67శాతం పెంచామని, అలాగే ప్రభుత్వం తరపున నిధులను కేటాయించామని వివరించింది. ఆర్టీసీ ఆదాయ వ్యయాల్లో అంతులేని వ్యత్యాసం ఉండటంతో... సంస్థను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే.... కార్మికులు అడుగడుగునా అడ్డుతగులుతున్నారంటూ ప్రభుత్వం వాదనలు వినిపించింది. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం... తండ్రి పాత్రను పోషించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక, స్కూల్స్ ఓపెనింగ్‌తోపాటు రాష్ట్ర బంద్‌ పై మీ స్పందన ఏమిటంటూ ప్రభుత్వాన్ని అడగగా, శాంతియుతంగా బంద్ చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది... హైకోర్టుకు తెలిపారు.

దీపావళికి ఉగ్రముప్పు... ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరిక

  దేశ రాజధానికి ఉగ్రముప్పు ఉన్నట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీపావళి సంబరాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. దీనితో ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసారు. ఐదుగురు ఉగ్రవాదులు గోరఖ్ పూర్ సమీపంలోని ఇండో నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నంలో ఉన్నారంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీపావళి పండగ రోజున భారీ దాడులు చేయాలనే ప్రణాళికతో వారు ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత్ లో ప్రవేశించిన తరువాత ఉగ్రవాదులకు కాశ్మీర్ లో కొందరు వ్యక్తులు అవసరమైన సహాయం అందించాటానికి కూడా సిద్ధమయ్యారు. ఈ విషయాలు వారి ఫోన్ సంభాషణను బట్టి తెలుస్తోంది అని అధికారులు చెబుతున్నారు.  ఉగ్రవాదుల ఫోన్లను ట్రాప్ చేసిన నిఘా విభాగం లొకేషన్ ఆధారంగా చివరి సారిగా నేపాల్ సరిహద్దులో వారిని గుర్తించినట్లు తెలిపింది. ఈ నేపధ్యంలో దేశంలో హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది.మరోవైపు పంజాబ్ లోని రక్షణ స్థావరాలపై దాడి జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వాయుసేన పంజాబ్ లోని పఠాన్ కోట్ స్థావరంతో పాటు ఇతర ఎయిర్ బేస్ లో ఆరెంజ్ నోటీస్ జారీ చేసింది. మరోవైపు జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకూ దాదాపు అరవై మంది ఉగ్రవాదులు ఎల్వోసీ అంతర్జాతీయ సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించారని నిఘా విభాగం తెలిపింది. ఈ రెండు నెలల్లో అరవై మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్, జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. అలాగే దేశ రాజధానికి కూడా ఉగ్రముప్పు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీపావళి సంబరాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే ఐదుగురు ఉగ్రవాదులు గోరఖ్ పూర్ సమీపంలో ఇండో నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నంలో ఉన్నారంటూ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.దీపావళి సంబరాల్లో జాగ్రత్తగా ఉండాలని నిఘా వర్గాల అధికారులు వెల్లడిస్తున్నారు.

చర్చల కోసం వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ అర్మీ కాల్పులు...

  బంగ్లాదేశ్ ఆర్మీ కర్కశంగా ప్రవర్తించింది. చర్చల కోసం వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపింది. మత్స్యకారులను విడిపించడానికి వెళ్ళిన వారిలో ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. మరో కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన భారత్, బంగ్లా సరిహద్దు లో హీట్ ని పెంచింది. బంగ్లా సరిహద్దులో ఉన్న పద్మా నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులను బంగ్లా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. తరువాత వారిలో ఇద్దరిని విడిచిపెట్టారు. మిగిలిన ఒకర్ని విడిపించడానికి బిఎస్ఎఫ్ అధికారులు బంగ్లా సైనికాధికారులతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బంగ్లా సైనికులు భారత జవాన్ లతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వెనుదిరిగిన బీఎస్ఎఫ్ జవాన్లపై వెనుక నుంచి బంగ్లా సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ ఇక్బాల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోగా మరొక బుల్లెట్ట్ కానిస్టేబుల్ కుడిచేయి నుంచి వెళ్ళింది. వీరిద్దరినీ తోటి జవాన్ లు హాస్పిటల్ కు తరలించగా హెడ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన పరిణామాలపై చర్చించేందుకు బంగ్లా సైనిక ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు. బంగ్లా సైనికులు ఇలా ఎందుకు చేశారో భారత జవాన్ లకు అర్ధం కాలేదు. చర్చలలో ఏం జరగనుందో వేచి చూడాలి.   

ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు...

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కడం లేదు. గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సాధారణ రోజుల్లో గ్రేటర్ ఆర్టీసీ బస్సుల్లో రోజుకు ముప్పై మూడు లక్షల మంది ప్రయాణించే వారు. సమ్మె కారణంగా అరకొర బస్సులు మాత్రమే నడుస్తూండడంతో మెజారిటీ నగర వాసులు సొంత వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఒకేసారి పెద్ద ఎత్తున కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా నగర నలుమూలల నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే రహదారులు ఎక్కువ భాగం కార్లే కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా మాదాపూర్ వెళ్తున్న మార్గంలో కార్ల రద్దీ విపరీతంగా ఉంటోంది. సుమారు డెబ్బై శాతం కార్లు కనిపిస్తే ముప్పై శాతం మిగిలిన వాహనాలు ఉంటున్నాయి.  ఇక అమీర్ పేట్ నుంచి యూసుఫ్ గూడ, కృష్ణా నగర్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, కెపిహెచ్బి, హైటెక్ సిటీ, మియాపూర్, కొండాపూర్, ఓఆరార్, గచ్చిబౌలి, బేగంపేట్ ఇలా ఏ మార్గంలో చూసినా కార్లే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా గ్రేటర్ పరిధిలో సుమారు నలభై లక్షల మంది ప్రజా రవాణా వ్యవస్థల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీలో ముప్పై మూడు లక్షలు, మెట్రోలో మూడు లక్షలు, ఎంఎంటీఎస్ లో లక్షా అరవై వేల మంది వరకు ప్రయాణం చేస్తుండగా మిగతా వారు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణిం చేస్తున్నారు. సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మెట్రో సేవలు యాభై ఆరు కిలోమీటర్ల మేర ఉండటంతో కిక్కిరిసిన జనాభాకి ఆ రైళ్లు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత వాహనాల్నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్నాయి.ఇక ఈ సమ్మె ముగిసి మళ్ళీ బస్సులు యధావిధిగా ఎప్పుడు తిరుగుతాయా అని ప్రజలు వేచి చూస్తున్నారు.